Jump to content

వామనభట్టబాణుడు

వికీపీడియా నుండి

బాణభట్ట బిరుదముగల ఈ వామనభట్టబాణుడు, వామనభట్టు లేక భట్ట వామనుడు 15వ శతాబ్దము ఆరంభమున ప్రసిద్ధి గాంచిన కవిపండితుడు. ఇతడు కొండవీటి పెదకోమటి వేమారెడ్డి (1404-1420) ఆస్థానమున పండితుడుగా నుండెను.[1] శ్రీనాథుడుకి ఇతడు సమకాలికుడు.

ఇతని కృతులు

[మార్చు]
  • పార్వతీ పరిణయము[1]
  • వేమ భూపాల చరితము

బాణకవి తన హర్ష చరితము నందువలె వామనభట్టు వేమభూపాల చరితములో తన ప్రభువగు వేమభూపలుని గూరించి రచించెను.

  • హంస సందేశము.

ఈ గ్రంథమందు పూర్వసందేశమున 61 శ్లోకములును, ఉత్తర సందేశమున 260 శ్లోకములును ఉన్నాయి. కథయు, శైలియు కేవలము కాళిదాసు రచించిన మేఘ సందేశముకు ప్రతిగా యున్నవి. శ్లోకములు మందా క్రాంతా వృత్తములే. కాళిదాసు పదములు, సమాసములు తరచు ఇందులో వచ్చుచుండును.

ఉదా:

'ఆ కైలాసా దవిదితచరాణ్
'ఆశామాత్ర గ్రధితమబలాజీవితం'
'ఇత్సౌత్సుక్యా చ్చబరయువతే
ప్రీతివిస్తార్యమాణైః
సభ్రాభంగై రకృతలలితై
రక్షిభిర్వాం పిబేయుః'

నైషధము నుండి శృంగార వర్ణనములలో పెక్కు పద్యాలు కూడా ఇందులో ఉన్నాయి.

కుపితుడైన యక్షరాజుచే శాపగ్రస్తుడై దక్షుడను యక్షుడొక సంవత్సరము మలయ పర్వతమున వసింపవలసినవాడై స్వవిరహప్తయై కుబేర పురమునున్న తన కాంతకు- కందర్పరేఖకు హంస ద్వారా సందేశమంపును. హంస వెళ్ళ వలసిన మార్గమును వర్ణించుట బట్టి కవి దాక్షిణాత్యుడై యుండవచ్చును. వేమభూపాల చరితమున, పెదకోమటి వేమారెడ్డి దిగ్విజయ యాత్రను వర్ణించుటలో నెట్లు భూగోళ శాస్త్రము ధ్వస్తమైయున్నదో అట్లే ఇందును దేశక్రమము ధ్వస్తమైయున్నది. ఇందులో హంస ముందు మలయ సమీపమునున్న దక్షిణ సముద్ర వాయువుల జవికొని తాంరపర్ణి దాటి పాండ్య నగరం జేరును. పిమ్మట కావేరి నదిని జూచి ఆనందించి శ్రీరంగము, కాంచి, పుండరీకము మొదలగు క్షేత్రములను సేవించి ఆంధ్ర దేసమున ప్రవేశించును. ఆంధ్ర దేశమున కృష్ణానది, తుంగభద్ర, గోదావరి, పంచవటి వర్ణింపబడినవే గాని పట్టణం లేవియు వర్ణింపబడలేదు. అటు తరువాత వింధ్య పర్వతము, నర్మదా నది వర్ణితములు. ఆమీద యమున, గంగను వర్ణించి చుట్టు తిరిగి కాశిని వర్ణించి కవి అయోధ్య మీదుగా హిమాలయము నకు హంసను జేర్చాడు. హిమాలయ వర్ణనము, కైలాస వర్ణనము కాళిదాసు మార్గము ననుసరించి కూర్చెను గాని ఆమాధుర్య మిందు రాలేదందురు. ఆంధ్ర ప్రశంస గల శ్లోకము నుదాహరించి, ఆంధ్ర పండిత కవియగు వామనభట్ట బాణుని ఈకృతిని ముగించెను.

'ఆంధ్రోద్దేశా నజిగమిషో రగ్రత స్తే భవిత్రీ
వేణీ భూమే రివ కువలయో మోదినీ కృష్ణవేణీ
ఆశ్లిష్యంతీ తరలలహరీ (బాహయా యాం)... సుఖీవ
ప్రోతో మధ్య వ్యవహితజలా శోభతే తుంగభధ్ర.'


మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 ముదిగొండ, గోపాలరెడ్డి; ముదిగొండ, సుజాతారెడ్డి (1986). సంస్కృత సాహిత్య చరిత్ర. హైదరాబాద్: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం.