Jump to content

వేంగి

వికీపీడియా నుండి
(వేంగి సామ్రాజ్యం నుండి దారిమార్పు చెందింది)

సా.శ.300 నుండి 1100 మధ్యకాలంలో తీరాంధ్రప్రాంతలో నెలకొన్న రాజ్యాన్ని 'వేంగి రాజ్యం అని, ఆ రాజ్యం రాజధాని లేదా ప్రధాన నగరాన్ని 'వేంగి నగరం లేదా విజయవేంగి అని చరిత్ర కారులు నిర్ణయిస్తున్నారు. అప్పుడు వేంగి అనబడే స్థలం ప్రస్తుతం పెదవేగి అనే చిన్న గ్రామం. ఇది పశ్చిమగోదావరి జిల్లాలో ఏలూరు పట్టణానికి 12 కి.మీ. దూరంలో ఉంది.

వేంగి రాజ్యం ఉత్తరాన గోదావరి నది, ఆగ్నేయాన మహేంద్రగిరి, దక్షిణాన కృష్ణానది మధ్య ప్రాంతంలో విస్తరించింది. వేంగి రాజ్యం ఆంధ్రుల చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం. పల్లవులు, శాలంకాయనులు, బృహత్పలాయనులు, తూర్పు చాళుక్యులు వివిధ కాలాలలో వేంగి రాజ్యాన్ని ఏలారు. వేంగి రాజ్యం ద్వితీయార్ధంలో, అనగా తూర్పు చాళుక్యుల కాలంలో (వీరినే "వేంగి చాళుక్యులు" అని కూడా అంటారు.) తెలుగు భాష రాజ భాషగా గైకొనబడి, పామర భాష (దేశి) స్థాయి నుండి సాహిత్య భాష స్థాయికి ఎదిగింది.

పెదవేగి త్రవ్వకాలలో బయల్పడిన శిల్పాలు. అక్కడి శివాలయంలో భద్రపరచబడినవి

"వేంగి" పేరు

[మార్చు]

"వేంగి" అనే పేరు పురాతనమైనదిగా కనిపించడం లేదు. కంచి వద్ద 'వెంగో' లేక 'వేంగి' అనే పేరు ఉన్నదని, ఆంధ్ర దేశం మధ్యలో ఈ పేరు గల నగరం ఏర్పడడానికి కారణాన్ని ఆంధ్ర దేశపు చరిత్ర అధ్యయనం చేసినవారిలో ఆద్యుడయిన చిలుకూరి వీరభద్రరావు ఈ విధంగా ఊహించాడు. ("ఆంధ్రుల చరిత్రము - ప్రధమ భాగము") [1] -

ఈ దేశము పూర్వము నాగులచే పరిపాలింపబడెడిది. దక్షిణ దేశమందలి నాగులలో "అఱవలార్" ఒక తెగ. కాంచీ పురమునకు దక్షిణదేశమున ఉండే వారు గనుక ఆ ప్రదేశం "ఆఱవనాడు" అనబడింది. కనుకనే టాలెమీ వంటి విదేశీ చరిత్రకారులు మైసోలియా (కృష్ణానది) దక్షిణ ప్రాంతాన్ని "ఆశార్‌నోరి" (అర్ వార్ నాయ్) అని పేర్కొన్నారు. మొట్టమొదట కృష్ణా గోదావరి మధ్య దేశం "కూడూహార విషయం" అనబడేది. దానికి రాజధాని "కూడూరా" (గూడూరు లేక గుడివాడ?). ఏ కారణము చేతనో రాజధాని మార్చుకొనవలసి వచ్చినది. సాలంకాయన గోత్రుడైన పల్లవరాజులలో నొకరు ఒక నూతన నగరమును నిర్మింపజేసి దానికి "బెబ్బులి" అనే అర్ధం వచ్చే "వేంగి" అనే పేరు పెట్టాడు. అక్కడినుండి పాలించే రాజులు వేంగిరాజులని, వారిచే జయింపబడిన దేశాన్ని వేంగి దేశమని అనడం మొదలుపెట్టారు. ... సా.శ. 4 శతాబ్దంలో అలహాబాదు శాసనంలో వేంగిని ప్రస్తావించారు గనుక అంతకు పూర్వమే అనగా సా.శ. 2వ లేదా 3వ శతాబ్దంలో వేంగి నగరం ఏర్పడి ఉండవచ్చును.

అసలు ఈ చిన్న గ్రామమే ఒకనాటి వేంగి మహానగరమా? అనే ప్రశ్నకు చిలుకూరి వీరభద్రరావు ఇలా వివరణ ఇచ్చాడు.

వేంగీ దేశమునకు ముఖ్య పట్టణముగా నుండిన వేంగి నగరం కృష్ణా మండలంలోని యేలూరుకు ఉత్తరాన 8 మైళ్ళ దూరములోనున్నది. ఆ స్థానమున నిపుడు పెదవేగి, చినవేగి అను పల్లెలు మాత్రమున్నవి. వీనికి దక్షిణముగా 5 మైళ్ళ దూరమున దెందులూరను గ్రామం కలదు. ఈ గ్రామంనకు గంగన్నగూడెము, సేనగూడెము అను శివారు పాలెములు చుట్టునునున్నవి. ఇవియన్నియుంగలిసి ఒక మహా పట్ణముగనుండి వేంగీపురమని పిలువంబడుచుండెను. ఈ ప్రదేశమునందు శిధిలమైపోయిన శివాలయములు పెక్కులు గలవు. జ్ఞానేశ్వరుని యొక్క విగ్రహములు నాలుగు దెందులూరుకు దక్షిణముగానున్న చెఱువు సమీపముననుండినవి. వానిలో నొకటి మిక్కిలి పెద్దదిగానున్నది. ఈ గ్రామంనకు తూర్పు ప్రక్కను భీమలింగము దిబ్బయను పేరుగల యెత్తైన యొక పాటి దిబ్బ గలదు. దానికుత్తరముగా నూకమ్మ చెఱువును, దాని నడుమనొక మట్టి దిబ్బయు, దానిపై రెండు రాతి నందులును గలవు. దానిని నారికేళవారి చెఱువని చెప్పుదురు. వాని గట్లపైని రెండు శిలా శాసనములు నిలువుగానుండియు, మరిరెండు సాగిలబడియు నుండినవి. పెదవేగికిని, చినవేగికిని నడుమ మఱియొక మంటిదిబ్బ గలదు. వీనిన్నింటిని పరిశోధించి చూడగా వేంగీపురము మిక్కిలియున్నత స్థితి యందుండిన మహానగరముగానుండెననుటకు సందియము లేదు. .... వేంగీపురమనియెడి మహానగరమొకటి యిక్కడుండెనా యని కొందఱు సంశయించుచుండిరి గాని విజయదేవవర్మ యొక్కయు, విజయనందివర్మ యొక్కయు శాసనములా సంశయమును నివారించినవి. దండియను మహాకవి కొల్లేరును వర్ణించుచు దానికి ననతి దూరముగానుండిన యీ వేంగీపురమునే యాంధ్ర నగరియని పిలిచియున్నాడు. విజయదేవవర్మ, విజయనందివర్మ శాసనములలో నుదాహరింపబడిన చిత్రరధస్వామి దేవాలయమిప్పటికిని నిలిచియుండి యఅ పేరుతోనే పిలువంబడుచున్నది. (ఈ రచన 1910లో ప్రచురితమయ్యింది)

అయితే వేంగి అన్న పేరు పూర్వచారిత్రిక దశకు చెందిన అత్యంత పురాతనమైన గ్రామాల పేర్లలో ఒకటిగా డాక్టర్ పి.వి.పరబ్రహ్మశాస్త్రి వర్గీకరించారు.[2]

చరిత్రలో వివిధ దశలు

[మార్చు]

పూర్వ కాలంలో కాలి నడక మార్గాలు, ఓడ రేవులు జనుల ప్రయాణాలకు, వివిధ సంస్కృతుల మేళనానికి ముఖ్యమైన వేదికలు. యాత్రికులు, పండితులు, వ్యాపారులు, కళాకారులు ఈ మార్గాలలో ప్రయాణిస్తూ భిన్న సంప్రదాయాల ఏకీకరణకు కారకులయ్యారు. వీటివల్లనే చరిత్రలో అధిక భాగం అనేక రాజ్యాలుగా ఉన్నా గాని భారతదేశం అనే బలమైన భావన అంకురించడం సాధ్యమయ్యింది. ఆంధ్ర తీరంలో (శాతవాహనుల కాలం నుండి) ఎన్నో ఓడ రేవులు ఉండేవి. వీటి ద్వారా దేశ, విదేశ వాణిజ్యం జరిగేది. ఈ మార్గాలలో ఆంధ్ర దేశం ముఖ్యమైన కూడలిగా ఉండేది. ఐదు ప్రధాన మార్గాలు "వేంగి" అనే చోట కలిసేవి. అందువల్లనే ఆంధ్ర రాజ్యమంటే వేంగి రాజ్యమని కూడా ఒకోమారు ప్రస్తావించబడేది. వీటిలో పూర్వోత్తర మార్గం కళింగ రాజ్యాలకు వెళ్ళేది. దక్షిణ మార్గం ద్రవిడ ప్రాంతాలకు, నైఋతి మార్గం కర్ణాటక దిశలోను, ఉత్తర మార్గం కోసల దేశానికి, పశ్చిమోత్తర మార్గం మహారాష్ట్ర ప్రాంతానికి దారి తీసేది. ఇవి ప్రధానంగా బౌద్ధ భిక్షువులు ప్రయాణించి బుద్ధుడు ఉపదేశించిన సందేశాన్ని వినిపించిన మార్గాలు. ఇప్పుడు బయల్పడిన ప్రధాన బౌద్ధారామ శిథిలాలు దాదాపు అన్నీ ఈ మార్గాలలో ఉన్నాయి. (నాగార్జున కొండ, అమరావతి లేదా ధరణికోట, ఘంటసాల వంటివి). వీటిలో కొన్ని అశోకుని కంటే ముందు కాలానివి.[3][4]

చిలుకూరి వీరభద్రరావు, కొమర్రాజు వేంకటలక్ష్మణరావు, డి.సి.సర్కార్, Dr.Hultzsch, Dr.Fleet, Col.Todd, మల్లంపల్లి సోమశేఖర శర్మ, డా.గోపాలాచారి వంటి ప్రముఖ చరిత్రకారులు వేంగి రాజ్యం చరిత్రను అధ్యయనం చేశారు. కొల్లేరు, దెందులూరు, ఏలూరు శాసనాలు వేంగి చరిత్ర ప్రాంభ దశను అధ్యయనం చేయడానికి ప్రధాన ఆధారాలు. అయితే వీటిలో ప్రస్తావించిన "వేంగి" అనేది రాజ్యం పేరో, లేక నగరం పేరో స్పష్టంగా తెలియడంలేదు.[5].

పెదవేగి సమీపంలో గుంటుపల్లె, జీలకర్రగూడెం, కంఠమనేనివారిగూడెం వంటి ప్రాంతాలలో క్రీ.పూ. 200 నాటి బౌద్ధారామ అవశేషాలు బయల్పడినందువలన శాతవాహనుల, ఇక్ష్వాకుల, కాలం నాటికే ఇది ఒక ముఖ్యమైన నగరం అయి ఉండే అవకాశం ఉంది. 4వ శతాబ్దంలో ఇక్ష్వాకుల సామ్రాజ్యం (విజయ పురి శ్రీపర్వత సామ్రాజ్యం) పతనమయ్యేనాటికి విజయవేంగిపురం ఒక పెద్ద నగరం. విష్ణుకుండినుల కాలంలోను, తూర్పు చాళుక్యుల ఆరంభ కాలంలోను ఆంధ్ర దేశానికి రాజకీయంగాను, సాంస్కృతికంగాను వేంగిపురం ఒక ప్రధానకేంద్రంగా ముఖ్యమైన స్థానం కలిగి ఉంది.[6]

  • పల్లవులు - సా.శ. 440 - 616 - వీరి రాజధాని వినుకొండ. వీరి రాజ్యంలో వేంగి కూడా ఒక ముఖ్య నగరం.
  • తూర్పు చాళుక్యులు - సా.శ. 616 నుండి 1160 వరకు. పల్లవులనుండి వేంగి నగరాన్ని జయించి కుబ్జవిష్ణువర్ధనుడు (బాదామిలోని తన అన్న అనుమతితో స్వతంత్ర రాజ్యంగా) రాజ్యాన్ని స్థాపించాడు. తూర్పు చాళుక్యుల కాలం తెలుగు భాష పరిణామంలో ముఖ్య సమయం. వీరు తెలుగును అధికార భాషగా స్వీకరించి దాని ప్రగతికి పునాదులు వేశారు. వేంగి రాజ్యంలో రాజమహేంద్రవరం ఒక మణిగా వర్ణించబడింది. క్రమంగా (కొన్ని యుద్ధాలలో వేంగి ప్రాంతాన్ని కోల్పోవడం వలన) తూర్పు చాళుక్యుల చివరి రాజులు తమ రాజధానిని రాజమహేంద్రవరానికి మార్చారు.

శిధిలావశేషాలు

[మార్చు]

పెదవేగిలోని శిథిలాలు చారిత్రికమైన, పరిరక్షింపబడ వలసిన పురాతన అవశేషాలుగా భారత పురావస్తు శాఖ నిర్ణయించింది.[7]

దస్త్రం:APvillage Pedavegi 1.JPG
పెదవేగి గ్రామంలో పురావస్తు పరిశోధన త్రవ్వకాలలో బయల్పడిన శిథిలాలు (ధనమ్మదిబ్బ?)

పెదవేగిలోని ధనమ్మ దిబ్బ వద్ద జరిపిన త్రవ్వకాలలో దిబ్బ మధ్యన పెద్ద రాతి కట్టడము బయల్పడినది. దీనిని ఒక బౌద్ధ స్థూపముగా గుర్తించారు. ఆ ప్రదేశములో దొరికిన వస్తువులలో మట్టి పాత్రలు, ఒక రాతి బద్దలో చెక్కబడిన నంది, పూసలు, కర్ణాభరణాలు, పాచికలు కూడా ఉన్నాయి. ఇంకో ప్రత్యేక కనుగోలు పారదర్శకమైన కార్నేలియన్ రాయితో తయారు చేసిన ఒక అండాకార భరిణె. 2x2x6 సె.మీల పరిమాణము కలిగిన ఈ భరిణపై ఒక దేవతామూర్తి చెక్కబడిఉన్నది. ఇది నగరాన్ని పర్యవేక్షించే నగర దేవత అయ్యుండవచ్చని పురావస్తు శాఖ భావిస్తున్నది.[8] చాలా శిల్పాలను శివాలయంలోని వరండాలో ఉంచారు.

వేంగి రాజులు, ముఖ్యంగా శాలంకాయనులు "చిత్రరధస్వామి"ని పూజించినట్లు తెలుస్తున్నది (భగవత్ చిత్రరధస్వామి పాదానుధ్యాతః). ఈ చిత్ర రథ స్వామి శివుని రూపమో, విష్ణువు రూపమో, లేక సూర్యుని రూపమో తెలియడం లేదు.[9]

మౌర్యుల, శాతవాహనుల కాలం

[మార్చు]

మౌర్య సామ్రాజ్యం క్రీ.పూ.322 నుండి క్రీ.పూ.185 మధ్యకాలంలో వర్ధిల్లింది. మౌర్యుల కాలంలో ఈ ప్రాంతం కళింగ రాజుల అధీనంలో ఉండేది. మౌర్యుల కాలంలో వేంగి రాజ్యం గురించి గాని, నగరం గురించి కాని ఏమీ ఆధారాలు లేవు. కాని సమీపంలో ఉన్న గుంటుపల్లెలోని బౌద్ధారామాలు క్రీ.పూ. 200 నుండి సా.శ. 300 వరకు (అనగా బౌద్ధ మతం ఆరంభ కాలంనుండి) విలసిల్లాయి గనుక, బౌద్ధాన్ని మౌర్యులు ఆదరించారు గనుక, అప్పుడే ఈ ప్రాంతానికి కొంత ప్రాముఖ్యత ఉండేదని గ్రహించవచ్చును.

శాతవాహనులు క్రీ.పూ. 230 నుండి సా.శ. 250 వరకు దక్కన్ ప్రాంత రాజ్యాన్ని ఏలారు. మౌర్య సామ్రాజ్య పతనానంతరం అధికారంలోకి వచ్చిన శాతవాహనులు బౌద్ధాన్ని, వైదిక ధర్మాన్ని కూడా ఆదరించారు. కనుక వారి కాలంలో కూడా ఈ ప్రాంతానికి కొంత ప్రాముఖ్యత ఉండి ఉండవచ్చును. అంతే కాక వారి కాలంలో విలసిల్లిన అనేక బౌద్ధ క్షేత్రాలు ఈ సమీపంలో ఉన్నాయి.

ఇక్ష్వాకులు

[మార్చు]

శాతవాహనుల అనంతరం ఇక్ష్వాకులు సా.శ.225 నుండి 300 వరకు, కృష్ణానది ముఖద్వారానికి ఇరువైపుల ఉన్న ప్రాంతాన్ని ఆక్రమించి రాజ్యమేలారు. వీరి రాజధాని అయిన నాగార్జునకొండ శ్రీపర్వత ప్రాంతం యొక్క పశ్చిమపాదంలో ఉన్నదని చెప్పబడింది. వీరిలో శ్రీఛాంతమూలుడు (225-245) పెద్ద రాజ్యాన్ని ఏర్పరచాడు. నేటి ప్రకాశం, గుంటూరు, కడప, కర్నూలు, నల్లగొండ, గోదావరి జిల్లాలు అతని రాజ్యంలో ఉండేవి. కనుక వేంగి వారి రాజ్యంలో ఒక నగరమై ఉండాలి. ఇక్ష్వాకుల చివరిరాజు రుద్రపురుషదత్తుడు. ఇక్ష్వాకులను జయంచి పల్లవ రాజు సింహవర్మ విజ్యపురిని నాశనం చేసి, గుంటూరు ప్రాంతంలో పల్లవరాజ్యాన్ని సా.శ.300లో స్థాపించాడు.ఇక్ష్వాకుల సామ్రాజ్యం పతనమయ్యేనాటికి విజయవేంగిపురం ఒక పెద్ద నగరం. కాని అప్పటికి పల్లవుల రాజ్యం కృష్ణానదీ దక్షీణ తీరంలోనే ఉండడం వలన వేంగి రాజ్యం వారి క్రిందికి రాలేదు.

బృహత్పలాయనులు

[మార్చు]

పల్లవుల అధికారం కృష్ణానదీ తీరం దక్షిణ భాగానికే పరిమితమైన కాలంలో కృష్ణానది ఉత్తర తీరంలో కొద్దికాలం మాత్రమే బృహత్పలాయనుల అధికారం సాగింది. కనుక వేంగి ప్రాంతం వారి అధీనంలో ఉండి ఉండాలి. కాని వీరి గురించిన ఆధారాలు చాలా తక్కువ. ఒకే ఒక కొండముది తామ్రశాసనం ఆధారంగా వీరు 300 ముండి 325 వరకు రాజ్యం చేసినట్లు భావిస్తున్నారు. వీరి రాజధాని కోడూరు కావచ్చును.

ఇక్ష్వాకుల సామంతులైన బృహత్పలాయనులు కృష్ణానది ఉత్తర తీరంలో స్వాతంత్య్రం ప్రకటించుకున్నారు. వీరి వంశచరిత్రను తెలిపే ఒకే ఒక శాసనం కొండముది తామ్ర (రాగి) శాసనం. గుంటూరు జిల్లాలోని తెనాలి దగ్గరలో ఉన్న గ్రామమే ‘కొండముది’. ఈ శాసనాన్ని బృహత్పలాయన రాజు జయవర్మ వేయించాడు. ఇందులో జయవర్మ పూర్వీకుల గురించి ప్రస్తావన లేదు. ఐతే ఇతడు బృహత్పలాయన గోత్రీకుడని ఈ శాసనం తెలియజేస్తోంది.

జయవర్మ తన పదో రాజ్య పాలనా కాలంలో కూదూర హారంలోని ‘పాంతూర గ్రామాన్ని’ 8 మంది బ్రాహ్మణులకు బ్రహ్మధేయంగా దానమిచ్చాడు. ఇతని ఇష్టదైవం మహేశ్వరుడు. కొండముది శాసనం ప్రకారం ‘కూదూరు’ (గూడూరు) రాజధానిగా కృష్ణానది ఉత్తర తీరాన్ని పాలించినట్లు తెలుస్తోంది. జయవర్మ పల్లవుల చేతిలో ఓడిపోయాడు. పల్లవ శివస్కంధవర్మ దక్షిణదేశ రాజకీయాల్లో తీరికలేకుండా ఉన్న సమయంలో జయవర్మ నాటి ‘కర్మరాష్ర్టం’ (కమ్మ రాష్ర్టం) లోని కొంత భాగాన్ని ఆక్రమించి ఉండొచ్చని బి.ఎస్.ఎల్. హనుమంతరావు అభిప్రాయం.[10]

శాలంకాయనులు

[మార్చు]

వేంగి రాజధానిగా పరిపాలించినట్లుగా స్పష్టమైన ఆధారాలతో (ఏలూరు శాసనం ద్వారా) తెలియవస్తున్న మొదటి రాజులు శాలంకాయనులు. "శాలంకాయన" అనేది గోత్రనామమని, వంశం పేరు కాదని తెలుస్తున్నందువలన చరిత్రకారులు వీరిని వర్ణించడానికి "వైంగేయికులు" అనే పదాన్ని వాడుతున్నారు. సముద్రగుప్తుని అలహాబాదు ప్రశస్తిలో కూడా "వైంగేయక" అనే చెప్పబడింది.[5]

"మైసోలియా" (కృష్ణా తీర ప్రాంతం) లో "బెన్‌గొరా" (వేంగీపురం) చెంత "సాలెంకీనాయ్" (శాలంకాయనులు) ఉన్నట్లు గ్రీకు చరిత్ర కారుడు టాలెమీ సా.శ.130లో వ్రాశాడు.[11] అయితే ఆ బెన్‌గొరా (Bengaouron) అనేది వేంగీపురం కాదని కొందరు చారిత్రికుల అభిప్రాయం.[12] ఏలూరు, పెదవేగి, గుంటుపల్లె, కానుకొల్లు, కొల్లేరు, కంతేరు, పెనుగొండ వంటి వివిధ శాసనాల ద్వారా శాలంకాయనుల గురించి కొన్ని వివరాలు తెలుస్తున్నాయి.

శాలంకాయనుల స్వతంత్రాధికారాన్ని హస్తివర్మ సా.శ.320లో స్థాపించి ఉండవచ్చును. వివిధ శాసనాలలో ఇతనిని "నానాప్రకార విజయస్య" (గుంటుపల్లి), "అనేక సమరావాప్త విజయ" (పెదవేగి), "సమరముఖ నిర్మాత కర్మ" (కానుకొల్లు), "ధర్మమహారాజ" (గుంటుపల్లి) అనే బిరుదులతో వర్ణించారు.[13] ఈ వర్ణనలను బట్టి ఇతడు వేంగి ప్రాంతంలో సామంతులను జయించి రాజ్యాన్ని స్థిరపరచాడని భావించవచ్చును. ఇతడు సముద్ర గుప్తుని సమకాలీనుడు.

హస్తివర్మ కుమారుడు నందివర్మ (350-385). ఇతడు తిరుగుబాటుదారులను అణచివేసి కృష్ణానది దక్షిణానికి కూడా వేంగి రాజ్యాన్ని విస్తరింపజేశాడు. ఇతడు ధార్మిక చింతనపరుడు. "వివిధధర్మ ప్రధానస్య" అని పెదవేగి శాసనంలోను (కనుక వారు బౌద్ధ, వైదిక ధర్మాలను రెంటినీ ఆదరించినట్లు తెలుస్తున్నది), "ఆర్జిత ధర్మ ప్రదానస్య, గీసహస్రదాయి" అని గుంటుపల్లి శాసనంలోను వర్ణింపబడ్డాడు. ఇతని తరువాత ఇతని తమ్ముడు దేవవర్మ, కొడుకు అచండవర్మల మధ్య అధికారం కోసం అంతర్యుద్ధం జరగడం వలన శాలంకాయనుల ప్రతిష్ఠ దిగజారింది. అంతే గాకుండా ఉత్తరాన పిష్ఠపురం (పిఠాపురం) లో మాఠరులు, దక్షిణాన కర్మరాష్ట్రంలో బలవంతులై శాలంకాయనులతో పోరాడసాగారు. సా.శ.5వ శతాబ్ది ప్రాంతంలో శాలంకాయనుల రాజ్యం అస్తమించింది. వారిలో చివరిరాజు విజయనందివర్మ గుంటుపల్లిలోని బౌద్ధ క్షేత్రానికి దానధర్మాలు చేశాడు.

శాలంకాయనులకు ఇంచుమించు సమకాలికులుగా కృష్ణానది దక్షిణాన కర్మరాష్ట్రాన్ని ఆనందగోత్రిజులు పాలించారు. కళింగాంధ్ర (ఉత్తరాంధ్ర) ప్రాంతం 'సింహపురి' (శ్రీకాకుళం వద్దనున్న సింగపురం) రాజధానిగా కళింగులు, తరువాత మాఠరులు పాళించారు. ఉత్తరాన పిష్ఠపురం ప్రాంతాన్ని కొంతకాలం కళింగులు, తరువాత మాఠరులు, తరువాత వాసిష్ఠులు పాలించారు.

విష్ణుకుండినులు

[మార్చు]

శాతవాహనులు, చాళుక్యులు మధ్యకాలంలో ఆంధ్ర దేశాన్ని పాలించిన వారిలో విష్ణుకుండులు ప్రసిద్ధులు. ఒక శతాబ్దం కాలం కృష్ణా, నర్మదా నదుల మధ్య అధికారం వెరపి అనేక రాజకీయ, సాంస్కృతిక సంప్రదాయాలను నెలకొల్పారు.[13]. వారు శ్రీపర్వత స్వామి భక్తులమని, వారి రాజ్యం శ్రీ పర్వత ఉభయ పార్శ్వాలలో విస్తరించి ఉన్నదని చెప్పుకొన్నారు. వారి వంశం గురించి, రాజధాని గురించి, రాజ్యం ఎల్లలగురించి చరిత్రకారులలో భిన్నాభిప్రాయాలున్నాయి. సుమారుగా 375-570 మధ్యకాలంలో వీరి రాజ్యం సాగింది. వీరి ముఖ్యుడైన గోవిందవర్మ (425-465) ఉత్తరాన వేంగి శాలంకాయనులనూ, దక్షిణాన కర్మరాష్ట్రంలోని పల్లవులనూ ఓడించి రాజ్యాన్ని పిఠాపురం నుండి గుండ్లకమ్మవరకూ విస్తరించాడు.

విష్ణుకుండి రాజులందరిలో మాధవవర్మ (465-515) ప్రసిద్ధుడు. జైత్రయాత్రలు సాగించి రాజ్యాన్ని విస్తరించాడు. వాకాటకులతో వివాహసంబంధం కలుపుకొని నర్మదానది వరకూ రాజ్యాన్ని విస్తరించాడు. ఉత్తరాన కళింగాన్ని జయించాడు. అదను చూసుకొని మరలా కృష్ణాతీరం వరకు ఆక్రమించిన పల్లవులనోడించి కర్మరాష్ట్రాన్ని తిరిగి స్వాధీనం చేసుకొన్నాడు. కళింగ దండయాత్ర తరువాత మాధవవర్మ వేంగి సమీపంలోని దెందులూరు పురానికి తన రాజధానిని మార్చాడు.[13].

తరువాతి రాజులలో క్రమంగా అంతఃకలహాలు, పశ్చిమాన చాళుక్యుల విజృంభణ, పల్లవులతో కొనసాగుతున్న వైరం - ఇవి క్రమంగా విష్ణుకుండినుల అధికార పతనానికి దారి తీశాయి. 566లో పల్లవరాజు పృథ్వీమహారాజుతో జరిగిన యుద్ధంలో అప్పటి విష్ణుకుండి రాజు విక్రమేంద్రుడు మరణించడంతో విష్ణుకుండి వంశం పాలన అంతమయ్యింది.

పల్లవులు, రణ దుర్జయులు

[మార్చు]
దస్త్రం:Garuda Vishnu Pedavegi.JPG
గరుడారూఢుడైన విష్ణువు, సా.శ.6-7 శతాబ్దికి చెందిన ఇసుక రాయి శిల్పం. లలాట తోరణం పై చెక్కినది. పెదవేగి గ్రామం త్రవ్వకాలలో బయల్పడింది. శివాలయంలో ఉంచబడింది.

ఏ ఎర్ర సంజెలో నెలమి పల్లవరాజకాంతలు కాళ్ళ పారాణులిడిరొ? - అని కవి సామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ తన "ఆంధ్రప్రశస్తి" ఖండ కావ్యంలో "వేంగి క్షేత్రము" అనే కవితలో వ్రాశాడు. శాతవాహనుల తరువాత పల్లవులు విజృంభించి కృష్ణానదికి దక్షిణ ప్రాంతాన్ని, తమిళ ప్రాంతాన్ని కూడా పాలించారు. సా.శ. 280 నుండి 630 వరకు పల్లవుల పాళన సాగింది. వారు కర్మ రాష్ట్రంపై అధిపత్యం కోసం ఆనంద గోత్ర, శాలంకాయన, విష్ణుకుండి వంశాల రాజులతో తెరిపిలేని పోరాటాలు సాగించారు. మహేంద్రవర్మ, నందివర్మ, విజయస్కందవర్మ, సింహవర్మ, శివస్కందవర్మ వీరిలో ముఖ్యులైన రాజులు. వీరిలో పాలక్కడ ప్రాంతాన్ని పాలించిన సింహవర్మ 'వెంగో'రాష్ట్రంలో దాన ధర్మాలు చేసినట్లు మంగడూరు శాసనం ద్వారా తెలియవస్తుంది. అయితే ఈ వెంగో అంటే వేంగి అవునా కాదా అన్న విషయంపై విభేదాలున్నాయి. ఎందుకంటే అప్పటికి వేంగిలో విష్ణుకుండులు బలవంతులైయున్నారు.

విజయస్కందవర్మ కృష్ణానది తీరాన కర్మ రాష్ట్రాన్ని విష్ణుకుండుల నుండి స్వాధీనం చేసుకొని పల్లవుల అధికారన్ని బలపరచాడు. కాని వేంగి ప్రాంతంలో వారి అధికారానికి ఆధారాలు లేవు. విష్ణుకుండులలో చివరి రాజైన విక్రమేంద్రుని మరణానంతరం పృథ్వీమూలుడనే 'రణదుర్జయ'రాజు వేంగి ప్రాంతాన్ని పాలించాడు.

బాదామి చాళుక్య రాజైన రెండవ పులకేశి దండయాత్రలలోని వేరు వేరు యద్ధాలలో రణదుర్జయ పృథ్వీమహారాజు, పల్లవుల మహేంద్ర వర్మ మరణించారు. పృథ్వీమహారాజు నుండి వేంగి చాళుక్యుల వశమైంది. దక్షిణాంధ్రప్రాంతంలో పల్లవుల అధికారం అంతమై, వారి పాలన తమిళ దేశానికే పరిమితమైంది.

వేంగి చాళుక్యులు

[మార్చు]
పెదవేగి త్రవ్వకాలలో లభించిన ఒక శాసనం

వేంగిలో చాళుక్య రాజ్య స్థాపన ఆంధ్రచరిత్రలో ఒక నూతన అధ్యాయానికి నాంది. తూర్పు చాళుక్యులనబడే వీరు తీరాంధ్రాన్ని మాత్రమే పాలించారు. ఆంధ్ర దేశ ఐక్యతను సాధించలేకపోయారు (శాతవాహనుల తరువాత కాకతీయులు మాత్రమే ఈ పని చేశారు.) ఇతర ప్రాంతాలలో పల్లవ సామంతులు, బాణ వైదుంబులు, రాష్ట్రకూటులు, కళ్యాణి చాళుక్యులు పాలన సాగించారు. అంతే గాకుండా వేంగి చాళుక్యులు పశ్చిమ (కన్నడ) ప్రాంతంనుండి దండెత్తి వచ్చినవారు అయినా కాని వీరు ఆంధ్రులకొక వ్యక్తిత్వాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని సాధించగలిగారు. "జన్మభూమిశ్చాళుక్యానాం దేశో వేంగితి పశ్రుతః" అని చాటి ప్రజా క్షేమాన్ని కాంక్షించి పాలించారు. నాటివరకు రాజాస్థానాలలో ఆదరణ లేని తెలుగు భాషను ఆదరించి విశేష ప్రచారం తెచ్చిపెట్టారు.అందు చేత తూర్పు చాళుక్యుల చరిత్రయే ఈ యుగంలో ఆంధ్రుల చరిత్ర అనడంలో సందేహానికి తావుండరాదు[13]. శాతవాహనుల కాలంలో సంస్కృతం పండిత భాష, ప్రాకృతం రాజభాష, తెలుగు పామరుల భాష[14]. వేంగి చాళుక్యుల కాలంలోనే తెలుగు పండిత భాషగాను, ప్రజల భాషగాను, రాజభాష గాను మూడు వన్నెల ఔన్నత్యాన్ని సమకూర్చుకొంది. మార్గకవితను సేవించుచుండిన ఆంధ్రులకు తెలుగు కవితను పుట్టించి, తెలుగు నిలిపిన యశము చేకూర్చిన ఘనత (నన్నయకు కాదు) చాళుక్య రాజులకు దక్కింది[15].

సా.శ. 624లో (ఈ సంవత్సరం పై విభిన్నాభిప్రాయాలున్నాయి) బాదామి చాళుక్య రాజు రెండవ పులకేశి వేంగి రాజ్యాన్ని (ఏలూరు దగ్గర జరిగిన యుద్ధంలో) జయించాడు. అతని తమ్ముడు కుబ్జ విష్ణువర్ధనుడు (624-641) అన్న ఆశీస్సులతో వేంగిని స్వతంత్రరాజ్యంగా పాలించనారంభించాడు. ఇతడు మహావీరుడు. పరిపాలనా దక్షుడు. ఇతని భార్య అయ్యణమహాదేవి జైన మతాభిమాని.

క్రమంగా తూర్పు చాళుక్యుల రాజ్యం దక్షిణాన నెల్లూరు నుండి ఉత్తరాన శ్రీకాకుళం వరకు విస్తరించింది. తరువాతి మూడు శతాబ్దాలలో వారికి రాష్ట్రకూటులతోను, దక్షిణాన పల్లవులతోను, బోయ నాయకులతోను, చోళులతోను, పరామారులతోను ఎడతెరగని పోరులు జరిగాయి. ఒక దశలో పశ్చిమ చాళుక్య రాజు సత్యాశ్రయుడు తిరిగి చాళుక్య దేశాన్ని ఒక పాలన క్రిందికి తీసికొనిరావాలని ప్రయత్నించాడు కాని అది సాధ్యం కాలేదు.

కుబ్జ విష్ణువర్ధనుని తరువాత గుణగ విజయాదిత్యుడు, వాళుక్యభీముడు, జటాచోడ భీముడు, రాజరాజ నరేంద్రుడు ముఖ్యమైన వేంగి చాళుక్య రాజులు. అయితే అంతఃకలహాలు, రాష్ట్రకూటులతో యుద్ధాలు వేంగిని విపరీతమైన నష్టాలకు గురిచేశాయి. 772లో రాష్ట్రకూట ధ్రువుడు పంపిన సేనలు వేంగిపై దండెత్తి అప్పటి విష్ణువర్ధనుని ఓడించి సామంతునిగా చేసుకొన్నాడు. దీనితో వేంగి ప్రతిష్ఠ తీవ్రంగా దెబ్బ తింది. తరువాత 12 సంవత్సరాలు వారి మధ్య ఎడతెరిపి లేకుండా పొరులు జరుగుతూనే ఉన్నాయి. 813లో చాళుక్య రాజు రెండవ విజయాదిత్యుడు రాష్ట్రకూటులనోడించి తిరిగి వేంగి సింహాసనాన్ని అధిష్టించాడు. వేంగి ప్రాభవాన్ని పునరుద్ధరించాడు. ఇతడు 108 యుద్ధాలు చేసి రాష్ట్రకూటులను పారద్రోలినట్లు శాసనాలు చెబుతున్నాయి. ఇతడు గొప్ప కళా పండిత పోషకుడు.

తరువాతి రాజులలో గుణగ విజయాదిత్యుడు (848-891) తూర్పు చాళుక్యులలో అగ్రగణ్యుడు. ఒక యుద్ధంలో రాష్ట్రకూట రాజు (రట్టేశుని) చేత ఓడిపోయాడు. తరువాతి యుద్ధంలో వారిని ఓడించి, వారి రాజ్యాలలో వీరవిహారం చేసి తూర్పు చాళుక్యులు పొందిన పరాభవాలకు ప్రతీకారం చేయడమే కాక దక్షిణాపథంపై అధిపత్యం సాధించాడు. ఇతని తరువాత అంతఃకలహాలవల్ల వేంగి రాష్ట్రకూటుల దండయాత్రలకు తట్టుకొనే శక్తి కోల్పోయింది. కొన్ని యుద్ధాలలో జయం, కొన్నింట పరాజయం సంభవిస్తూ ఉండేవి. రెండవ అమ్మరాజు వేంగి సింహాసనాన్ని 25 సంవత్సరాలు పాలించాడు. తరువాత జటాచోడభీముడు వేంగి, కళింగ రాజ్యాలలో ఎదురు లేకుండా పాలించాడు.

చాళుక్య చోళులు

[మార్చు]

ఆ సమయంలో దక్షిణాన రాజరాజు నాయకత్వంలో చోళ వంశం బలపడుతున్నది. కనుక వేంగిని తమ అధీనంలో ఉంచుకొంటే దక్షిణాపధంలో చోళసామ్రాజ్యానికి మార్గం సుగమం అవుతుందని, చాళుక్యులతో తలపడే అవసరం ఉండదని రాజరాజు భావించాడు. కనుక వేంగి దాయాదులైన శక్తివర్మ, విమలాదిత్యులకు ఆశ్రయం ఇచ్చి సంబంధం కలుపుకొన్నాడు. చోళ సైన్యాల సాయంతో శక్తివర్మ (909-1011) చోడ భీముని జయించి వేంగి రాజ్యాన్ని ఆక్రమించుకొన్నాడు. తరువాత కొంతకాలం సత్యాశ్రయుని నాయకత్వంలో పశ్చిమ చాళుక్యులకు, చోళులకు యుద్ధాలు జరిగాయి. దాక్షిణాత్య సార్వభౌమత్వం ఆశించిన పశ్చిమ చాళుక్యులకు, చోళులకు వేంగి యుద్ధరంగమయ్యింది.[13]

1019లో రాజరాజ నరేంద్రుడు రాజయ్యాడు. అతని పట్టాభిషేకాన్ని ప్రతిఘటించి, విజయాదిత్యుడు కళింగ కుంతల రాజుల సాయంతో వేంగిని ఆక్రమించినాడని, రాజేంద్రచోళుడు వేంగి వరకు నడచి తన కుమార్తె అమ్మంగదేవిని రాజరాజ నరేంద్రునికిచ్చి పెళ్ళి చేసి పట్టాబిషేకాన్ని చేయించాడని చరిత్రకారుడు నేలటూరి వెంకటరమణయ్య అభిప్రాయపడ్డాడు. పట్టాభిషేకం అయిన 9 సంవత్సరాల తరువాత విజయాదిత్యుడు, చాళుక్య జయసింహుడు కలసి వేంగిలో అధిక భాగాన్ని (కృష్ణా, గోదావరి మధ్య ప్రాంతాన్ని) ఆక్రమించారు. 1034లో విజయాదిత్యుడు వేంగి నగరం రాజధానిగా పట్టాభిషేకం జరుపుకొన్నాడు. మిగిలిన భాగాన్ని రాజమహేంద్రవరం రాజధానిగా పాలిస్తూ రాజరాజ నరేంద్రుడు తిరిగి వేంగి రాజ్యం ఐక్యత కోసం చోళుల సాయం అర్ధించి ఉంటాడు. వేంగి సమీపంలోని కలిదిండి వద్ద జరిగిన భీకరమైన యుద్ధంలో (విజయాదిత్యుని) చాళుక్యసైన్యం పరాజయం పొందింది. వేంగి రాజ్యం తిరిగి ఒకటయ్యింది. పశ్చాత్తాపం ప్రకటించిన విజయాదత్యుని రాజరాజ నరేంద్రుడు క్షమించాడు.

వేంగి ప్రాభవం క్షీణత

[మార్చు]

తిరిగి 1042 నుండి రాజరాజ నరేంద్రుని అధికారానికి ప్రమాదం వాటిల్లింది. ఈ కాళంలో చాళుక్య చోళ సంఘర్షణలు తారస్థాయికి చేరడంతో వేంగి రాజ్యం అల్లకల్లోలమయ్యింది. సోమేశ్వరుడనే రాజు 1045 ప్రాంతంలో వేంగి, కళింగ రాజ్యాలను జయించి "వేంగి పురవరేశ్వర" అనే బిరుదు ధరించాడు. చోళ రాజులు ధరణికోట వద్ద జరిగిన పెద్ద యుద్ధంలో చాళుక్యులను జయించారు గాని వేంగిపై మాత్రం పశ్చిమ చాళుక్యుల పెత్తనం కొనసాగింది. రాజరాజ నరేంద్రుడు ఆహవమల్ల సోమేశ్వరునితో సమాధానపడి అతని సార్వభౌమత్వాన్ని అంగీకరించి వేంగిని పాలించాడు. తరువాత 1061 వరకు రాజరాజనరేంద్రుని పాళన ప్రశాంతంగా సాగింది. అతడు పండిత గోష్ఠిలో ఆసక్తి కలిగిన పరమ ధార్మికుడు. ఈ కాలంలోనే భారతాంధ్రీకరణ జరిగి ఉండవచ్చును. అది తెలుగు సాహిత్య చరిత్రలో ఒక సువర్ణ ఘట్టం.

రాజరాజ నరేంద్రుని మరణానంతరం జరిగిన సంఘటనలలో చరిత్రకారులకు ఏకాభిప్రాయం లేదు. కాని అప్పటికి వేంగి రాజ్యానికి పూర్తిగా వ్యక్తిత్వం నశించి చోళ, చాళుక్య సార్వభౌములలో విజేతలైనవారి పక్షమో, లేక వేంగిపై దండెత్తి వచ్చినవారి పక్షమో వహించవలసిన దయనీయ స్థితికి దిగజారిపోయింది [13]. అనేక యుద్ధాలు, రాజుల మధ్యలో పంపకాలలో వేంగి నలిగిపోయింది. అవకాశం చిక్కినపుడల్లా ఇతరులు వేంగిని కొల్లగొట్టసాగారు. 1073లో దాహళ ప్రభువు చేది యశఃకర్ణదేవుడు, తరువాత కొద్దికాలానికి గంగరాజ దేవేంద్రవర్మ పెద్ద దండ్లను పంపి వేంగిని దోచుకొన్నారు. 1075లో సప్తమ విజయాదిత్యుడు మరణించడంతో తూర్పుచాళుక్య వంశం అంతరించింది.

ఇతరాలు

[మార్చు]
  • పైన చెప్పినట్లుగా వేంగి రాజ్యం, తూర్పు చాళుక్యుల పాలన తెలుగువారి చరిత్రలో సాంస్కృతికంగా ఎంతో ప్రాధాన్యత కలిగి ఉన్న కాలం. నన్నయ భట్టు, నారాయణ భట్టు మహాభారత ఆంధ్రీకరణను ప్రారంభించారు. ఈ కాలంలోనే శాసనాలలో తెలుగు కనిపించ సాగింది. కుబ్జవిష్ణువర్ధనుని చేజెర్ల శాసనంలో సగం పైగా తెలుగు. అతని కుమారుడు జయసింహ వల్లభుని విప్పర్ల, మాచెర్ల శాసనాలు తెలుగు. వేంగి రాజ్యానికి సమాంతరంగా నడచిన రేనాటి చోడులు కూడా తమ శాసనాలు తెలుగులో వేయించారు. వానిలో ధనంజయుని కలమళ్ళ శాసనం (సా.శ.575) మనకు లభించిన మొట్టమొదటి తెలుగు శాసనం.
  • చరిత్రలో చాలా సార్లు జరిగినట్లుగానే రాజవంశాలలోని అంతఃకలహాలు, పొరుగు రాజ్యాల సామ్రాజ్య విస్తరణాకాంక్ష దేశాన్ని బలపడకుండా చేశాయి. వేంగి, ధరణికోట, యనమదల, కంభం, నెల్లూరు వంటి వగరాలు పలుమార్లు ధ్వంసం చేయబడ్డాయి.
  • ఈ కాలంలో రాయలసీమ, తెలంగాణ ప్రాంతం ఎక్కువ భాగం ఇతర రాజుల సామంతరాజుల పాలనలో ఉంది.
  • వేంగి రాజుల సైన్యాధిపతులలో అనేక బ్రాహ్మణ వీరులుండేవారు. బౌద్ధమతం క్షీణించినా అప్పటికి కులవ్యవస్థ ఇంకా బాగా బలపడలేదు.
  • స్థానిక ప్రాంతాలలోని అధికారులు సామంతరాజులవంటివారిగా వ్యవహరించేవారు. కేంద్రం బలహీనపడడానికి, అంతఃకలహాలకు, పొరుగురాజుల యుద్ధవ్యూహాలకు వీరు చాలావరకు కారకులయ్యారు.
  • రాజ్యం "విషయాలు" (రాష్ట్రాల వంటివి) గా విభజింపబడింది. వేంగి రాజ్యంలో 30 విషయాలుండేవి. కమ్మ రాష్ట్ర విషయము, అత్తిలినాడు విషయము వంటి పేర్లుండేవి.
  • అనేక విధాలైన పన్నులండేవి - డేగరచ పన్ను, పడెవాలుపన్ను, పడియేరి పన్ను, సంధి విగ్రహం పన్ను నంటివి.
  • బౌద్ధం క్షీణించిన అనంతరం జైనమతం వ్యాపించి మరల క్షీణించింది. వైదిక మతం క్రమంగా బలపడింది. కుల వ్యవస్థ వేళ్ళూనుకోసాగింది. జాతరలు, ఆచారాలు, మూఢ విశ్వాసాలు వ్యాప్తి పొందాయి.
  • వైశ్యులు జైన మతాన్ని విశేషంగా ఆదరించారు. వైశ్యుల కులదేవత కన్యకా పరమేశ్వరి ఆరాధనకు పెనుగొండ మూల స్థానం. వాసవీ కన్యకను విష్ణువర్ధనుడనే చాళుక్యరాజు బలాత్కరించగా ఆమె అగ్నిలో ఆహుతి అయ్యిందనే కథలో చారిత్రిక సత్యం లేదు. అయితే అగ్నిలో దూకి మరణించడం జైన ఆచారాలలో ఒకటి. వాసవి కూడా ఆ వ్రతం ఆచరించి వైశ్యులకు ఆరాధ్య దేవత అయ్యింది. తరువాత శైవం ప్రబలినప్పుడు "పరమేశ్వరి"గా పిలవబడి ఉంటుంది.[13]
  • గవరలు మొదట తూర్పు చాళుక్యుల పురాతన రాజధాని అయిన వేంగిలో నివసించారు. రాజు వారి స్త్రీలలో ఒకరిని చూడాలని కోరుకున్నాడు, వారు గోశాలలో (ప్రత్యేకంగా) ఉన్నారు.రాజు ఆదేశాల మేరకు వారి ఇళ్లకు నిప్పు పెట్టారు.కొందరు తమను తాము లోపలికి లాక్కొని ధైర్యంగా చనిపోయారు.మరికొందరు తమ స్త్రీలను పెద్ద పెట్టెల్లో లాక్కెళ్లి వారితో పాటు తీరప్రాంతానికి పారిపోయారు. వారు వెంటనే ఓడ బయలుదేరి అనకాపల్లి తాలూకాలోని పూడిమడక దగ్గర దిగారు. అందుకే కొండకర్ల వరకు కవాతు చేసి వాడ్రాపల్లి గ్రామాన్ని స్థాపించారు( పడవలలో వచ్చే ప్రజల).గవరాలు కోమటిలలో ముఖ్యమైన ఉపవిభాగం , వాటిని గవర కోమటిలు అంటారు.[16]
  • సా.శ. 636 లోచైనా యాత్రికుడు హ్యూన్ త్సాంగ్ (యువాన్ చువాంగ్) ఆంధ్ర దేశంలో పర్యటించాడు. వేంగి, ధరణికోట, శ్రీశైలం అతని వర్ణనలలో ఉన్నాయి. వేంగిని అతడు "పింగ్-కీ-లో" అని వ్రాశాడు. పింగ్-కీ-లో సమీపంలోనే అచల అర్హతుడు ఇరవై సంఘారామాలు నిర్మించాడని, వానిలో మూడువేల మంది బౌద్ధ భిక్షువులు నివసించేవారని వ్రాశాడు. ఈ ఆరామాలకు సమీపంలోనే ఒక చైత్య గృహంలో నివసిస్తూ జన బోధిసత్వుడు తర్కశాస్త్రం రచించాడట. ఈ జన బోధిసత్వుడే ప్రసిద్ధ మహాయానాచార్యుడు అయిన దిజ్ఞాగుడు అని చరిత్రకారుల అభిప్రాయం.[17] ఇక్కడి సంఘారామంలో పెక్కు అంతస్తులు గల హర్మ్యములును, సొగసుగ చెక్కబడిన స్తంభములచే కూడిన ఇతర గృహములును ఉండినట్లు, ఈ ఆరామం ఎదురుగా నూరడుగుల యెత్తు కలిగిన స్తూపమొకటి యుండినట్లు వ్రాశాడు. ఇక్కడి బుద్ధ విగ్రహమును శిల్పి తన నేర్పంతయు చూపి చెక్కినట్లు తెలియుచున్నదట.[18]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. [1]ఆంధ్రుల చరిత్రము - చిలుకూరి వీరభద్రరావు ప్రచురణ: విజ్ఞాన చంద్రికా గ్రంధమండలి - 1910లో చెన్నపురి ఆనంద ముద్రణాశాల యందు ముద్రింపబడియెను. వెల 1-4-0. రాజపోషకులు: బొబ్బిలి రాజా, పిఠాపురం రాజా, మునగాల రాజా
  2. ప్రాచీనాంధ్ర దేశ చరిత్ర - గ్రామీణజీవనం:పి.వి.పరబ్రహ్మశాస్త్రి:ఎమెస్కో బుక్స్:2013 ప్రచురణ:పేజీ.23
  3. http://www.indiaprofile.com/religion-culture/buddhisminandhra.htm ఇది ఒక టూరిజమ్ వెబ్ సైటులో ఉన్నది. వారు ఈ విషయానికి ఆధారాలు తెలుపలేదు.
  4. http://www.lakehouse.lk/mihintalava/gaya02.htm Archived 2008-06-25 at the Wayback Machine శ్రీలంక బౌద్ధం సైటులోని సమాచారం
  5. 5.0 5.1 Early_History_Of_The_Andhra_Country by K. Gopalachari, published by University_Of_Madras, (Research work in 1941)
  6. The Ancient City of Vengipura : Archaeological Excavations at Peddavegi/I.K. Sarma. Delhi, Book India Publishing Co., 2002, ISBN 81-85638-15-2. https://www.vedamsbooks.com/ (Vijaya Vengipura was a flourishing city in ancient Andhra after the decline of Sriparvata Vijayapuri of the Ikshvaku dynasty by about 4 century A.D. During the Vishnukundi and early Eastern Chalukyan rule Vengipura played a crucial role as a political centre as well as a great cultural capital of Andhradesa)
  7. http://asi.nic.in/asi_monu_alphalist_andhra.asp Archived 2014-06-25 at the Wayback Machine The complete list from West Godavari District is
    132. Mounds containing Buddhist remains - Arugolanu
    133. Mounds locally known as Bhimalingadibba - Denduluru
    134. Buddhist monuments - 1) Rock-cut temple 2) Large Monastery 3) Small Monastery 4) Brick Chaitya 5) Ruined Mandapa 6) Stone built Stupa and Large group of stupas. - Guntupalle
    135. The caves and structural stupa of Archaeological interest on Dharmalingesvarasvami hill- Jilakarragudem (Hamlet of Guntupalle)
    136. The mounds of Pedavegi : Dibba No.1 Dibba No.2, Dibba No. 3, Dibba No. 4, Dibba No. 5. - Pedavegi
    137. Ancient Mounds - Pedavegi
  8. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-02-24. Retrieved 2008-03-30.
  9. Excerpts from Dr.Gopalachari Thesis: The tutelary deity of the Vaingeyakas was Citrarathasvami ("bhagavat Citraraihasvami padanudhyatah"). Sanskrit Lexicons give Citraratha as the name of the sun, the vahana of Agni and some princes. K. V. Lakshmana Rao thinks that Citrarathasvamin is the Sun-God. While editing the Ellore plates of Devavarman, Dr. Hultzsch referred to the existence of a mound "which, on a visit to Pedda-Vegi in 1902, was shown to me by the villagers as the site of the ancient temple of Citrarathasvamin, the family deity of the Salankayana Maharajas." .... It is, therefore, possible that the Vaingeyikas, some of whom had Saivan and others Vaishnava leanings were at the same time worshippers of the Sun- God also. ... Sriparvatasvami (i.e., the god worshipped in Sriparvata in the Visnukundin inscriptions), cannot Citmrathasvdmi mean the god worshipped in Citraratha ? We do not know of any place called Citraratha. Nor do the Pallava records throw any light on this question.
  10. ఎ.పి.పి.యస్.సి.గ్రూప్స్ బ్లాగు నుండి[permanent dead link]
  11. The Ancient City of Vengipura : Archaeological Excavations at Peddavegi/I.K. Sarma. Delhi, Book India Publishing Co., 2002, ISBN 81-85638-15-2. https://www.vedamsbooks.com/cgi-bin/main.cgi?no31025.htm[permanent dead link] - Infact Ptolemy (140 A.D.), refers to Vengi as the capital city of the Salankayanas.
  12. Excerpt from Gopalachari's thesis: The attempts of some scholars to see in Salankayana the name of a people, becoming subsequently the name of a dynasty also, is wasted effort . Dr . Rayachaudhuri has identified the ' Salakenoi ' of Ptolemy with the 'Salankayanas ' of Vengl.14 D. C. Sircar accepts this identification15 and adds : "It has been noticed that the terms Salankayana and Salankayanaka (country of the Salankayanas) are mentioned in the Ganapatha of Panini. It is certain that the Salankayanas (Greek Salakenoi) ruled over the Vengl region as early as the time of Ptolemy (c, 140 A.D.)." He would further consider Benagouron as a mistake for Bengaouron which would represent Vengipura. Having regard to the fact that in Ptolemy's Book the n sound is not suppressed e.g. Gangaridai (Book VII, Chapter 1, Section 81) and Peririgkarei (Section 89), Salakenoi can be rendered Salakana and not Salahkayana. The Salakenoi are placed north of the river Manadas which is almost certainly the Mahanadi, the great river of Orissa, far north of the Andhradesa of literature. Kings of the Salarikayana gotra ruled over the heart of the Andhradesa and the suggestion of some scholars that they ruled over Kalihga and Magadha (!) lacks proof; and Ptolemy's description of the eastern part of the peninsula is not as much vitiated by errors as that of the western and southern parts. The Sdlankdyanaka of Panini does not mean ' the Country of the Salankayanas '; it is the adjectival form of Salatikayana which belongs to the Rdjanyddi class. Names like Athenogouron make it highly improbable that Benagouron is a mistake for Bengaouron. Benagouron would correspond to Benanagara ; and as several Benas are known, and the Benagouron of Ptolemy is on the banks of a river, a Benanagara is not impossible. The Benagouron of Ptolemy is not called a metropolis, while Vengipura was certainly the capital of the kings of the Salankayana gotra.
  13. 13.0 13.1 13.2 13.3 13.4 13.5 13.6 ఆంధ్రుల చరిత్ర - డా.బి.ఎస్.ఎల్. హనుమంతరావు (విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్)
  14. పింగళి లక్ష్మీకాంతం - ఆంధ్ర సాహిత్య చరిత్ర
  15. మును మార్గ కవిత లోకంబున వెలయగ దేశి కవిత పుట్టించి తెనుంగును నిలిపిరంద్ర విషయంబున జన చాళుక్య రాజు మొదలుగ పలువుల్ - నన్నెచోడుడు
  16. Thurston, Edgar, "Gavara", Castes and Tribes of Southern India, retrieved 2023-10-01
  17. బౌద్ధము, ఆంధ్రము - డా.బి.ఎస్.ఎల్. హనుమంతరావు (తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ)
  18. మల్లంపల్లి సోమశేఖర శర్మ - అమరావతి స్తూపము, ఇతర వ్యాసములు

వనరులు

[మార్చు]
  • K.A. Nilakanta Sastri, A History of South India (Madras, 1976).
  • Early_History_Of_The_Andhra_Country - Thesis paper of Dr.Gopalachari (work done in 1941), Published by Madras University.
  • డా.బి.ఎస్.ఎల్.హనుమంతరావు - ఆంధ్రుల చరిత్ర

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=వేంగి&oldid=4076818" నుండి వెలికితీశారు