ఆంధ్ర నాయక శతకము
ఆంధ్ర నాయక శతకము ఆంధ్ర శతకాలలో అనర్ఘరత్నం. కాసుల పురుషోత్తమ కవి శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు మీద నిందాస్తుతిగా ఈ శతకం రచించారు. తెలుగు భాషలో భక్తి శతకాలు, నీతి శతకాలు ఎక్కువగా ఉన్నాయి, కానీ ఈలాంటి వ్యాజస్తుతి శతకాలు అరుదు. నిందలో స్తుతిని, స్తుతిలో నిందను నిబంధించి భక్తితత్త్వాన్ని ప్రబోధించిన శతకరాజమిది. కాసులకవి నవ్యమైన భవ్యమైన వినూత్న పదాలతో ఎన్నెన్నో భావతరంగాలను వెలార్చే 108 సీస పద్యాలతో ఈ శతకాన్ని ఆంధ్రులకు ఉపాయనంగా అందించి ధన్యుడయ్యాడు.
శతక కర్త
[మార్చు]కాసుల పురుషోత్తమ కవి అసలు పేరు పల్లంరాజు. ఈయన కృష్ణా జిల్లా లోని పెదప్రోలు గ్రామ నివాసి. సుమారు సా.శ.1800 ప్రాంతానికి చెందినవాడు. ఈయన తల్లిదండ్రులు - రమణమాంబ, అప్పలరాజులు. అద్దంకి తిరుమలాచార్యులు వీరి గురువులు. వీరు భట్టుమూర్తిగా ప్రసిద్ధుడైన అష్టదిగ్గజాలలో ఒకరైన రామరాజభూషణుడి వర్ణమైన భట్టరాజ కులంలో జన్మించారు. దేవరకొండ సంస్థానాధీశుడైన రాజా అంకినీడు బహద్దూర్ గారి ఆస్థానకవిగా ప్రసిద్ధుడు.
వీరు ఇది కాక మరో మూడు శతకాలు కూడా రచించారు. వాటిలో 'మనసా హరి పాదములాశ్రయించవే', 'పరాకు భద్రశైల రామ శక్త కల్ప ద్రుమా' అనే మకుటాలతో సాగిన రెండు శతకాలు కాగా హంసలదీవి వేణుగోపాల శతకం మూడవది.
మకుటము
[మార్చు]ఈ శతకానికి "చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!" అనే మకుటం ఉంది.
ఉదాహరణలు
[మార్చు]ఈ శతకంలోని పద్యాలు మచ్చుకు:
సీ. ఆడించెదవు బొమ్మలాటవాఁడును బోలె
సర్వచరాచరజంతుchayamu
కనుకట్టు గట్టెదు గారడీఁడును బోలె
మిథ్యాప్రపంచంబు తథ్యముగను
వేర్వేఱఁ దోఁతువు వేషధారియుఁ బోలెఁ
బహువిధదేవతాభద్రకళలఁ
దెలివి మాన్పుదువు జక్కులవాని చందానఁ
బ్రజల సంపద్రంగవల్లిఁ జేర్చి
తే.యిట్టివే కద నీవిద్య లెన్ని యైన-
నింక నేమిట ఘనుఁడవో యెఱుఁగరాదు
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ
హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
సీ.పరపురుషాకృత గురుతుగాఁ జూడక
త్రిపుర పతివ్రతాతిలకములను
విటపయుక్తి భ్రమించి విఫలభ్రమతఁజేసి
తత్సతీపతుల దుర్దాంతబలుల
హతము సేయించితి వల మహానటునిచే
రథారధాంగాశ్వసారథిశరాన
గుణనిషంగాస్త్రము ల్కోరినట్లుండు నే
సమకూర్చి యసురుల సంహరించి
తే. సాహసుఁడ వైతిని న్నుంచి శంకరుండు
త్రిపురసంహరుఁ డను నాఖ్యఁ దెచ్చుకొనియె
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ
హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
మూలాలు
[మార్చు]- ఆంధ్రనాయక శతకము, కాసుల పురుషోత్తమ కవి, టీకా తాత్పర్యం డా.కె.ఏ.సింగరాచార్యులు, నవోదయ బుక్ హౌస్, హైదరాబాదు, 2007 (ISBN - 81-903530-4-7)