Jump to content

కవి ప్రభునామ గుంభిత విచిత్ర పద్యగర్భిత కందపద్య సకలేశ్వర శతకము

వికీపీడియా నుండి
కవి ప్రభునామ గుంభిత విచిత్ర పద్యగర్భిత కందపద్య సకలేశ్వర శతకము
కవి పేరుదేవులపల్లి తమ్మన్నశాస్త్రి
వ్రాయబడిన సంవత్సరం1874
మొదటి ప్రచురణ తేదీ1923
దేశంభారతదేశం
భాషతెలుగు
మకుటంశ్రీ సకలేశా!
విషయము(లు)భక్తి, నీతిబోధ
పద్యం/గద్యంపద్యం
ఛందస్సుకందపద్యాలు
ప్రచురణ కర్తచెలికాని లచ్చారావు
ప్రచురణ తేదీ1923
మొత్తం పద్యముల సంఖ్య107+9
అంకితంరావు ధర్మారావు
ముద్రాపకుని పేరుచెలికాని లచ్చారావు
ముద్రణా శాలశ్రీరామవిలాస ముద్రాక్షరశాల, చిత్రాడ

ఈ శతకాన్ని[1] దేవులపల్లి సోదరకవులలో ఒకరైన దేవులపల్లి తమ్మన్నశాస్త్రి రచించాడు. ఈ సోదరకవులు పిఠాపురం మహారాజా రావు గంగాధరరామారావు ఆశ్రితులు. గంగాధరరామారావు పినతండ్రి కుమారుడు రావు ధర్మారావు కొలువు తీర్చి గీర్వాణాంధ్ర, శుద్ధాంధ్ర భాషలలో ఎవరైనా ఒక శతకాన్ని చెప్పమని కోరగా తమ్మన్నశాస్త్రి దీనిని రచించాడు.

ఈ శతకము చెలికాని లచ్చారావుచేత సమకూర్చబడి 1923లో చిత్రాడలోని శ్రీరామవిలాస ముద్రాక్షరశాలలో ముద్రించబడిన శతకముల ద్వితీయసంపుటములో స్థానం కల్పించుకుంది.

విశేషాలు

[మార్చు]

మొత్తము 8 విభాగాలుగా ఈ శతకాన్ని విభజించి కవి తన భావాన్ని చెప్పాడు. ఈ శతకంలో 107 పద్యాలున్నాయి. ఇవికాక ఆయా పద్యాలలో నిక్షిప్తమైన అంశాన్ని తెలుసుకోవడానికి సూచనగా ఆయాచోట్ల 9 పద్యాలు ఉన్నాయి.

  • మొదటి నాలుగు పద్యాలలో పండ్రెండవ అక్షరాలను కలిపితే "కవి వయసు పదునెనిమిది వత్సరములు" అని కవివయస్సు తెలుస్తుంది.
  • తరువాతి 25 పద్యాలలో సమపాద పంచమవర్ణములను కలిపితే "సూర్యారావుగారిని సకలేశు డాశీర్వదించుగాక" అనే ఆశీస్సులు కనిపిస్తాయి.
  • తరువాతి 8 పద్యాలలో ధర్మారావును సంబోధించుట కనిపిస్తుంది.
  • తరువాతి 25 పద్యాల అసమపాద చతుర్థవర్ణాలను కలిపితే ధర్మారావును ఆశీర్వదిస్తూ శుద్ధాంధ్రపదముల పద్యం కనిపిస్తుంది.
  • ఆ పై 12 పద్యాలలో ప్రతిచరణములోని ఆరవ వర్ణములను కలిపితే "ప్రకటరావు కులాబ్ధి సుధాకరో, విజయాతే భువి ధర్మరజాధిపో" అని ధర్మారావును కీర్తించడం కనిపిస్తుంది.
  • తరువాతి 12 పద్యాలలో ప్రతిపాద చతుర్థవర్ణగర్భితాక్షర సమ్మేళము సంస్కృతసమాసభూయిష్టమైన ధర్మారావు వర్ణన అని తెలుస్తుంది.
  • తరువాత 8 పద్యముల సమచరణ అష్టమ వర్ణముల కలయిక "దేవరవారి యనుగ్రహమును గోరియున్నాను" అనే భావాన్ని తెలుపుతుంది.
  • తరువాతి పది పద్యాలలో ప్రతిపాద పంచమాక్షరముల కలయిక కవి నామమును తెలుపుతుంది.
  • చివరి 8 పద్యాలలో ఆరవ అక్షరాలను కలిపి చదివితే "దిగ్బ్రహ్మద్రీందు సంఖ్యాక నవరాత్రిషు ధాత్రబ్దే శాలివాహన శకే కృతం" అని శతకరచనాకాలము (సా.శ.1874) తెలుసుకోవచ్చు.
  • దీనిలోని పద్యాలు చక్కని శబ్దాలంకారాలతో లయాన్వితమై, జటిలపద సంకలితమై దేవులపల్లి తమ్మన్నశాస్త్రి యొక్క పాండితీ గరిమ, చిత్ర బంధ కవిత్వాలలో అతనికున్న అనర్గళతను చాటుతున్నాయి.

మూలాలు

[మార్చు]
  1. పిఠాపుర సంస్థానము - కవిపండితపోషణ -పి.హెచ్.డి.సిద్ధాంత గ్రంథము - సి.కమలా అనార్కలి-1973