గుండు సుదర్శన్
గుండు సుదర్శన్ డాక్టర్ | |
---|---|
జననం | సూరంపూడి సుదర్శన్ 1964 జూలై 1 |
జాతీయత | భారతీయుడు |
విద్య | ఇంజనీరింగ్ |
వృత్తి | నటుడు, రచయిత |
జీవిత భాగస్వామి | విజయలక్ష్మి |
పిల్లలు | శివశరత్, హేమశ్రీలత |
తల్లిదండ్రులు | సుబ్బారావు, కనకలత |
గుండు సుదర్శన్ (సూరంపూడి సుదర్శన్) ఒక ప్రముఖ హాస్య నటుడు, రచయిత. సుమారు 350 పైగా సినిమాలలో నటించాడు.[1][2] పది సంవత్సరాల వయసు నుండే నాటకాలలో నటించిన అనుభవం ఉంది. 1993 లో బాపు దర్శకత్వంలో వచ్చిన మిష్టర్ పెళ్ళాం చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశాడు. ఆయన సివిల్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ డిగ్రీ, హైదరాబాదులోని జె.ఎన్.టి విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్.డీ చేశాడు.[3] మనస్తత్వ శాస్త్రంలో కూడా పట్టా సంపాదించాడు. సినిమాలలో పూర్తి స్థాయి నటుడు కాక మునుపు తన స్వస్థలమైన భీమవరం లోని ఎస్.ఆర్.కె.ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో సుమారు 17 ఏళ్ళ పాటు అధ్యాపకుడిగా పనిచేశాడు. నటన పై మక్కువతో తెలుగు సినిమాలలో హాస్యనటుడిగా రాణిస్తున్నాడు. ఖాళీ సమయాలలో విద్యార్థులకు, ఉద్యోగులకు స్ఫూర్తి దాయక ఉపన్యాసాలు ఇస్తుంటాడు.[4]
నేపథ్యం
[మార్చు]ఆయన పుట్టి పెరిగింది అంతా భీమవరంలోనే. తల్లిదండ్రులు సుబ్బారావు, కనకలత. తండ్రి సుబ్బారావు న్యాయవాదిగా పనిచేసేవాడు. ఆయనకు చిన్నప్పటి నుంచి ఊర్లో జరిగే పౌరాణిక నాటకాలు అన్నీ చూసే అలవాటు ఉండేది. ఏడో తరగతి దాకా తాతగారి ఊరైన మంచిలిలో చదివాడు. పదేళ్ళ వయసు నుంచి నాటకాల్లో నటించడం ప్రారంభించాడు. ఏడో తరగతి చదువుతున్నపుడు మొండి గురువు బండ శిష్యుడు అనే నాటికలో శిష్యుడిగా నటించాడు. పాఠశాలలో జరిగే సాంస్కృతిక పోటీలలో బాగా పాల్గొనేవాడు. ఉన్నత పాఠశాల, ఇంటర్మీడియట్ విద్య భీమవరంలో పూర్తి చేశాడు.
అప్పుడప్పుడూ నాటకాల్లో పాల్గొంటున్నా చదువు మీద ఎక్కువ శ్రద్ధ చూపేవాడు. ఉత్తర ప్రదేశ్ లోని అలహాబాద్ నుంచి సివిల్ ఇంజనీరింగ్ లో బీటెక్ పూర్తి చేశాడు. కర్ణాటకలోని సూరత్కల్ రీజినల్ ఇంజనీరింగ్ కళాశాల నుంచి ఎంటెక్ పూర్తి చేశాడు. తరువాత భీమవరం లోని ఎస్.ఆర్.కె.ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో అధ్యాపకుడిగా చేరాడు. ఒక్కోసారి ఆయనను చూసిన వాళ్లు అందరూ తెలుగు లెక్చరర్ అనుకునేవారు. ఆయన భాష తీరు, సాహిత్యం మీద ఉన్న అవగాహన వల్ల అలా అనుకుంటూ ఉంటారు. భీమవరంలో కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసేటపుడే మిస్టర్ పెళ్లాం సినిమా ద్వారా సినీ ప్రస్థానం ప్రారంభించాడు. మొదట చేసిన సినిమా ఎన్టీఆర్‌తో అయినా, విడుదలైంది మాత్రం మిస్టర్ పెళ్లాం. అంతా విష్ణు మాయ డైలాగ్ చాలా ప్రజాదరణ పొంది ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది.[5]
సినీరంగ ప్రవేశం
[మార్చు]మిథునం చిత్రానికి మూల కథనందించిన నవలా రచయిత శ్రీరమణ సుదర్శన్ కు 25 సంవత్సరాలుగా మిత్రుడు. ఆయనను కలవడానికి హైదరాబాద్ నుండి భీమవరం వచ్చాడు. అప్పుడు ప్రసిద్ధ దర్శకుడు బాపు నవ్వితే నవ్వండి అనే హాస్య కార్యక్రమం చేస్తున్నారు. ఈయనను చూడగానే ఆహార్యం నచ్చి ఆ కార్యక్రమంలో అవకాశం కల్పించారు. మరో ప్రముఖ నటుడు ఏవీఎస్ కూడా ఇదే కార్యక్రమం ద్వారా నటుడిగా పరిచయం అయ్యాడు. ఆ ధారావాహికలో ఆయన పిన్నిగారి మొగుడు పాత్రను పోషించాడు. తరువాత బాపు దర్శకత్వంలో ఈటీవీలో ప్రసారమైన భాగవతం అనే కార్యక్రమంలో ప్రహ్లాదుడికి గురువైన చండామార్కుడి వేషం వేశాడు.
వెండితెరపై ఆయన ప్రస్థానం రామారావు కథానాయకుడిగా నటించగా బాపు దర్శకత్వంలో వచ్చిన శ్రీనాథ కవిసార్వభౌముడు (1993) తో ప్రారంభమైంది. ఆ సినిమాలో ఆయన పాత్ర శ్రీనాథుడి వంట మనిషి గణపతి పాత్ర. ఎన్.టీ.ఆర్ తో పాటు సుదీర్ఘమైన పాత్ర అది. ఆ సినిమా విడుదల కాకముందే మిస్టర్ పెళ్ళాం విడుదలైంది. ఆ సినిమాలో ఆయన నారదుడిగానూ, రాజేంద్ర ప్రసాద్ పక్కింటి వ్యక్తి నరసయ్య గానూ రెండు పాత్రలు పోషించాడు. అంతా విష్ణుమాయ అనే డైలాగు మంచి ఆదరణ పొందింది. తరువాత రాంబంటు, చిత్రం, రామసక్కనోడు లాంటి 200 సినిమాలలో నటించాడు. మధ్యలో కుటుంబ బాధ్యతల వలన తిరిగి భీమవరం వెళ్ళిపోయాడు. బాపు తన సినిమాలలో అవకాశం ఇచ్చినప్పుడల్లా హైదరాబాదుకు వచ్చి నటించి వెళుతుండేవాడు.
ఐదు సంవత్సరాల తర్వాత పీ.హెచ్.డీ కోసం మళ్లీ హైదరాబాదుకు తిరిగి వచ్చాడు. అప్పుడు సినిమాలలో నటించడానికి మరింత వీలు కలిగింది. ఆయన రెండో ఇన్నింగ్స్ తేజ దర్శకత్వంలో వచ్చిన చిత్రం సినిమాతో మొదలైంది. అతడు సినిమాలో ఆయన ఎం.ఆర్.ఓగా నటించాడు. ఆయనది ఒకటే సీన్ అయినా మంచి ప్రజాదరణ పొందింది. తర్వాత కబడ్డీ కబడ్డీ, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం లాంటి సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. కబడ్డీ కబడ్డీ తర్వాత చలా సినిమాల్లో పురోహితుడి పాత్రలు వేశాడు. గుంటూర్ టాకీస్ చిత్రంలో మంచి నిడివి ఉన్న పాత్ర పోషించాడు.[6] జీ తెలుగులో ప్రసారమైన చిత్తం చిత్తం ప్రాయశ్చిత్తం అనే కార్యక్రమానికి రూపకర్తగా వ్యవహరించాడు. అందులో చిత్రగుప్తుడిగా నటించాడు. నలభై ఎపిసోడ్ల పాటు ఆ కార్యక్రమానికి స్క్రిప్టు రాశాడు. మాటీవీలో ప్రసారమైన భలే ఛాన్సులే అనే కార్యక్రమానికి, ఉదయభాను వ్యాఖ్యాతగా వ్యవహరించిన నువ్వు నేను అనే కార్యక్రమానికి అతిథిగా పాల్గొన్నాడు.
విదేశీ పర్యటనలు
[మార్చు]సుదర్శన్ మరో ప్రముఖ నటుడు తనికెళ్ళ భరణితో, బృందం కలిసి దుబాయ్, కువైట్ లాంటి అరేబియా దేశాలలో అనేక హాస్య ప్రదర్శనలిచ్చారు. షూటింగ్ లలో భాగంగా బ్యాంకాక్, మలేషియా లాంటి దేశాలలో పర్యటించాడు.
రచయిత, ఉపన్యాసకుడు
[మార్చు]సుదర్శన్ కొన్ని వార్తా పత్రికలకు, సాహిత్య పత్రికలకు ఫ్రీలాన్సర్ గా రచనలు చేస్తుంటాడు. పత్రికల్లో హాస్యానందం పేరుతో ప్రేక్షకుల ప్రశ్నలకు హాస్య సమాధానాలు ఇస్తుంటాడు. ప్రముఖులు కూడా ఈయన సమాధానాల కోసం ప్రశ్నలు పంపుతుంటారు. సినిమాలలో నటించనపుడు కళాశాలలకు, సంస్థలకు వెళ్ళి తనదైన హాస్య శైలిలో స్ఫూర్తిదాయక ఉపన్యాసాలు ఇస్తుంటాడు.
కుటుంబం
[మార్చు]ఆయన భార్య విజయ లక్ష్మి. ఆమె సోషియాలజీలో ఎం.ఏ చేసింది. శివశరత్, హేమశ్రీలత ఆయన సంతానం. వారిద్దరూ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లే.
నటించిన చిత్రాలు
[మార్చు]ఆయన దాదాపు 350 సినిమాలలో నటించాడు.
- మిస్టర్ పెళ్ళాం (తొలి చిత్రం)
- రాంబంటు
- రామసక్కనోడు
- 9 నెలలు (2001)
- అందాల ఓ చిలకా (2001)
- స్టూడెంట్ నంబర్ 1
- ఎలా చెప్పను
- చంటిగాడు (2003)
- ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం
- కబడ్డీ కబడ్డీ
- దేశముదురు
- అతడు
- ఖలేజా
- చిరునవ్వుతో
- ఆలస్యం అమృతం
- నచ్చావ్ అల్లుడు
- జీనియస్
- సోలో
- భీమవరం బుల్లోడు
- మనం
- లౌక్యం
- సౌఖ్యం
- చందమామ కథలు
- డిక్టేటర్
- గుంటూర్ టాకీస్
- సోగ్గాడే చిన్ని నాయనా
- పదహారేళ్ళ వయసు (2009)
- వేట (2009)
- బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం (2010)
- రేస్ (2013)
- కొరియర్ బాయ్ కళ్యాణ్ (2015)
- సౌఖ్యం (2015)[7]
- సుప్రీమ్ (2016)
- బాబు బంగారం (2016)
- శమంతకమణి (2017)
- వైశాఖం (2017)
- విజేత (2018 సినిమా) (2018)
- జంబలకిడిపంబ (2018)
- మత్తు వదలరా (2019)
- 90ఎంల్ (2019)
- హ్యాపీ బర్త్డే (2022)
- జిలేబి (2023)
- నోట్బుక్
- మత్తు వదలరా 2 (2024)
చిత్రమాలిక
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ MAA, Stars. "Sudarshan". maastars. Movie Artists Association. Retrieved 6 July 2016.
- ↑ http://www.imdb.com/name/nm4646325/
- ↑ "కామెడీయే కాదు విలనీ కూడా చేస్తా". www.tupaki.com. 16 July 2014. Retrieved 2015-03-22.
- ↑ Sakshi (7 April 2016). "నాటకాల్లోనే కష్టం." Retrieved 15 October 2024.
- ↑ "అర గుండుకే అంత పేరు వస్తే..." Sakshi.com. 21 March 2015. Retrieved 2015-03-21.
- ↑ "Gundu Sudarshan: 'ఆవిడని కూర్చోపెట్టండి.. ఎంతసేపు నిలబెడతారు' అని అరిచాడు..." EENADU. Retrieved 2023-03-27.
- ↑ మన తెలంగాణ, వార్తలు (25 October 2015). "అనుబంధాలు, ఆప్యాయతల సౌఖ్యం". Archived from the original on 2020-06-12. Retrieved 12 June 2020.
బయటి లంకెలు
[మార్చు]- Pages using infobox person with unknown parameters
- Pages using Infobox person with deprecated parameter home town
- Infobox person using religion
- Infobox person using residence
- Infobox person using home town
- తెలుగు సినిమా హాస్యనటులు
- 1964 జననాలు
- పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యాయులు
- పశ్చిమ గోదావరి జిల్లా సినిమా నటులు