అశ్వత్థామ (సంగీత దర్శకుడు)
గుడిమెట్ల అశ్వత్థామ | |
---|---|
జననం | గుడిమెట్ల అశ్వత్థామ 1927 ఆగస్టు 21 నరసాపురం పట్టణం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం |
మరణం | 1975 మే 21 మద్రాసు |
మరణ కారణం | అనారోగ్యము |
వృత్తి | సంగీత దర్శకుడు |
మతం | హిందూ |
భార్య / భర్త | కమల |
పిల్లలు | విజయ రాఘవన్, గాయత్రి, శ్యామల |
తండ్రి | వరదాచారి |
తల్లి | రుక్మిణి |
అశ్వత్థామ సంగీత దర్శకుడు. ఇతడు 50కిపైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు. ఇతడు బి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో వచ్చిన దేవత చిత్రంలో బాలనటుడిగా చిత్రరంగ ప్రవేశం చేశాడు. భాగ్యలక్ష్మి, త్యాగయ్య సినిమాలలో చిన్న పాత్రలను ధరించాడు. తరువాత సంగీత దర్శకత్వ శాఖలో సహాయకుడిగా పనిచేసి సంగీత దర్శకుడిగా ఎదిగాడు.[1]
జీవిత విశేషాలు
[మార్చు]ఇతడు 1927లో నరసాపురం జన్మించాడు. ఇతని తండ్రి వరదాచారి జలియన్‌వాలాబాగ్ సమరంలో మిలటరీ కమాండర్‌గా పనిచేశాడు. ఇతని తండ్రి సైన్యం వదిలి సన్యాసులలో కలిసి పోవడంతో ఇతని తల్లి తన పిల్లలను తీసుకుని మద్రాసులోని ఆమె తమ్ముని ఇంట చేరింది. ఇతని బాల్య జీవితం చాలా కష్టంగా గడిచింది. కుటుంబ పోషణ కోసం ఏవేవో చిన్నచిన్న పనులు చేసి డబ్బులు సంపాదించేవాడు. ఇతనికి చిన్నతనం నుండే సంగీతంపట్ల మక్కువ ఉండేది. ఇతడు దెందులూరి శివరామయ్య, మహావాది వెంకటప్పయ్య, టైగర్ వరదాచారి, ద్వారం వేంకటస్వామినాయుడుల వద్ద సంగీతం క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. ఇతడిని మల్లాది రామకృష్ణశాస్త్రి, సముద్రాల రాఘవాచార్య మొదలైనవారు ఆదరించారు. ఇతడు 1951లో కమలను వివాహం చేసుకున్నాడు. ఈమె వీణావాదనలో డిప్లొమా చేసింది. ఈమె కొంతకాలం మద్రాసు ఆకాశవాణి కేంద్రంలో కళాకారిణిగా పనిచేసింది. వీరికి విజయరాఘవన్ అనే ఒక కొడుకు, గాయత్రి, శ్యామల అనే ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు.[2] ఇతని కుమార్తెలు ఇరువురు కూడా ప్రముఖ వీణా విద్వాంసురాళ్ళు. గాయత్రి తమిళనాడు సంగీత, లలిత కళల యూనివర్శిటీ ఉపకులపతిగా పనిచేస్తున్నది.[3]
సినిమాల జాబితా
[మార్చు]ఇతడు తెలుగుతో పాటుగా తమిళ, కన్నడ, మలయాళ భాషా చిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేశాడు. ఇతడు సంగీత దర్శకత్వం వహించిన కొన్ని తెలుగు సినిమాలు:
- బీదలపాట్లు (1950)
- ఆదర్శం (1952)
- చిన్న కోడలు (1952)
- సంక్రాంతి (1952)
- పక్కయింటి అమ్మాయి (1953)
- అర్ధాంగి (1955)
- రేచుక్క (1955)
- ఉమాసుందరి (1956)
- అన్న తమ్ముడు (1958)
- కార్తవరాయని కథ (1958)
- దైవబలం (1959)
- మా ఇంటి మహాలక్ష్మి (1959)
- చివరకు మిగిలేది (1960)
- జగన్నాటకం (1960)
- దేవాంతకుడు (1960)
- ధర్మమే జయం (1960)
- శ్రీకృష్ణ రాయబారం (1960)
- సమాజం (1960)
- యోధాన యోధులు (1961)
- కలిమిలేములు (1962)
- పీటలమీద పెళ్ళి (1964)
- భక్త రామదాసు (1964)
- చదువుకున్న భార్య (1965)
- వీలునామా (1965)
- పాదుకా పట్టాభిషేకం (1966)
- మా వదిన (1967)
- సతీ అరుంధతి (1968)
- పసిడి మనసులు (1970)
- మాయని మమత (1970)
- విచిత్ర దాంపత్యం (1971)
- మానవుడు - దానవుడు (1972)
- పద్మవ్యూహం (1973)
- ప్రేమ పక్షులు (1973)
- మనువు - మనసు (1973)
మరణం
[మార్చు]ఇతడు తన 48 యేళ్ల వయసులో 1975, మే 20వ తేదీన మద్రాసులో మరణించాడు.[1]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 సంపాదకుడు (1 June 1975). "సమావేశాలు, సన్మానాలు, విశేషాలు, వార్తలు". విజయచిత్ర. 9 (12): 16.
- ↑ పులగం, చిన్నారాయణ (2011). స్వర్ణయుగ సంగీత దర్శకులు (1 ed.). కాలిఫోర్నియా: చిమట మ్యూజిక్.కామ్.
- ↑ తమిళగడ్డ పై తెలుగింటి వీణా నాదం[permanent dead link]
బయటిలింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో అశ్వత్థామ పేజీ