Jump to content

పొనుగుపాడు (ఫిరంగిపురం)

అక్షాంశ రేఖాంశాలు: 16°16′47.62″N 80°8′41.83″E / 16.2798944°N 80.1449528°E / 16.2798944; 80.1449528
వికీపీడియా నుండి
పొనుగుపాడు (ఫిరంగిపురం)
శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి దేవస్థానం, పొనుగుపాడు
శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి దేవస్థానం, పొనుగుపాడు
పటం
పొనుగుపాడు (ఫిరంగిపురం) is located in ఆంధ్రప్రదేశ్
పొనుగుపాడు (ఫిరంగిపురం)
పొనుగుపాడు (ఫిరంగిపురం)
అక్షాంశ రేఖాంశాలు: 16°16′47.62″N 80°8′41.83″E / 16.2798944°N 80.1449528°E / 16.2798944; 80.1449528
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాగుంటూరు
మండలంఫిరంగిపురం
విస్తీర్ణం
18.24 కి.మీ2 (7.04 చ. మై)
జనాభా
 (2011)
4,356
 • జనసాంద్రత240/కి.మీ2 (620/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు2,213
 • స్త్రీలు2,143
 • లింగ నిష్పత్తి968
 • నివాసాలు1,217
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్522549
2011 జనగణన కోడ్590217


పొనుగుపాడు, ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, ఫిరంగిపురం మండలానికి చెందిన గ్రామం.ఇది మండల కేంద్రమైన ఫిరంగిపురం నుండి 17 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన నరసరావుపేట నుండి 12 కి. మీ. దూరంలో ఉంది.

గణాంకాలు

[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1217 ఇళ్లతో, 4356 జనాభాతో 1824 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2213, ఆడవారి సంఖ్య 2143. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1678 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 116. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 590217.

గ్రామ చరిత్ర

[మార్చు]

పొనుగుపాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడుటకు ముందు కిష్ణా జిల్లా పరిధి క్రింద ఉండి ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి చెందినది.ఈ గ్రామం ఇదమిత్ధముగా ఎప్పడు ఏర్పడింది ఎటువంటి ఆధారం లేదు. కాకపోతే కుళోత్తుంగ చోళ మహారాజు ఈ ప్రాంతాన్ని పరిపాలించే కాలంలో శాలివాహన శకం ౧0౩౯ (1117 AD) లో గ్రామం (పడమర బజారు) లో ఆలయం కట్టించి రామేశ్వరుడనే నామంతో శివలింగాన్ని ప్రతిష్ఠ చేసినట్లు కైపియత్తుల ద్వారా తెలుస్తుంది. దాని ఆధారంగా 1000 సంవత్సరాల పూర్వం క్రిందటే ఈ గ్రామం నిర్మితమై ఉండవచ్చు.

విజయనగర పాలకుల నుండి గోల్కొండ కుతుబ్ షాహి నవాబులు కోస్తాంధ్ర ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న తరువాత (1687) కొండపల్లి కోట ప్రాంతానికి వారు 'ముస్తఫానగర్ ఖిల్లా' గా నామకరణం చేసారు. అదే విధంగా కొండవీటి కోట ప్రాంతాన్ని 'ముర్తజా నగర్ ఖిల్లా' గా పేరు మార్చారు. దీని ప్రకారం ప్రస్తుత కృష్ణాజిల్లా ప్రాంతాన్ని ముస్తఫానగర్ సర్కార్ అని, ప్రస్తుత గుంటూరు జిల్లా ప్రాంతాన్ని ముర్తజా నగర్ సర్కార్ అని పిలిచేవారు. అప్పటి నుంచి పేరుకు గోల్కొండ (ఆ తర్వాత నిజాం) నవాబుల పాలనలో ఈ ప్రాంతం ఉన్నా, పరిపాలన పెత్తనం మాత్రం మరాఠీ, దేశస్థ బ్రాహ్మణుల, జమీల చేతిలో ఉండేది. చేబ్రోలు /అమరావతి ప్రాంతం జమీందారు వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు ఏలుబడి  క్రింద ఉండేదని చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఆ కాలంలోఈ గ్రామం వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు ఒకప్పటి రాజధాని చింతపల్లి (అచ్చంపేట మండలం) తాలూకాలో ఒక భాగమైన నాదెండ్ల గ్రామ ఫరిధిలో కొంతకాలం, తరువాత తాళ్ళూరు పరిధిలో కొంత కాలం చిన్నపల్లె (శివారు గ్రామం/Suburbs) గా ఉండేదని కైఫియ్యత్తుల ద్వారా తెలుస్తుంది.

ఈ గ్రామం 1904లో గుంటూరు జిల్లా ఏర్పడక ముందు కృష్ణా జిల్లా, క్రోసూరు తాలూకా పరిధిలో ఉంది. ఆ తరువాత సత్తెనపల్లి తాలూకా పరిధిలో చేరింది.

సీ.ఆర్‌.డీ.ఏ. (అమరావతి) పరిధిలో చేరిక

[మార్చు]

ఈ గ్రామం గ్రామ పంచాయితీ పరిధిగా ఉంది. నూతనంగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) ఈ గ్రామ పరిధిలోని పూర్తి విస్తీర్ణం (1824 హెక్టార్లు) ను ఆంధ్రప్రదేశ్ రాజధాని నగర (అమరావతి) ప్రాంత పరిధిలోకి 2014 డిసెంబరు 30న చేరినట్లుగా అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది[1] . 

గ్రామం పేరు వెనుక చరిత్ర

[మార్చు]

పూర్వం ఈ గ్రామంనకు మొదటగా వొణుకుబాడు అనే పేరు వాడిక నున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్కైన్స్ వారు ప్రచురించిన గుంటూరు జిల్లా గ్రామ కైపియ్యత్తులు (సంగతులు/విషయంలు) మూడవ భాగం పేజి నెం.204, 205 ల  ద్వారా తెలుస్తోంది. అప్పుడు ఈ గ్రామం మూర్తజానగరు సర్కారు (గుంటూరుకు ముస్లిం పాలకులు పెట్టిన పేరు) క్రింద చింతపల్లి తాలూకాలో (వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు పరిపాలనలో ఒకప్పటి రాజధాని, ప్రస్తుతం అచ్చంపేట మండలానికి చెందిన గ్రామం.) ఒక భాగమైన నాదెండ్ల గ్రామ ఫరిధిలో చేరిన చిన్న పల్లెగా ఉండేది. ఆ తరువాత పిలుచుటలో, పలుకుటలో తేడాల వలన పొణుకుపాడు అనే పేరుతో పిలచినట్లుగా గుంటూరు జిల్లా గ్రామ కైపియ్యత్తులు నాలుగవ భాగం పేజి నెం.192, 193 ల ద్వారా తెలుస్తోంది.

తరువాత కొంత కాలానికి ఈ గ్రామం మూర్తజానగరు సర్కారు క్రింద చింతపల్లి తాలూకాలో, ఒక భాగమైన తాళ్ళూరు హవేలీ (నగరు) ఫరిధిలో చేరిన చిన్న పల్లెగా ఉండేది. ఈ పేరు ఇదమిత్థంగా ఎలా వచ్చిందో ఎటువంటి ఆధారం లేదు. కాకపోతే పెద్దలు, విజ్ఞులు తెలిపిన ప్రకారం పూర్వం ఈ ప్రదేశం అరణ్య ప్రాంతంగా ఉండి, ఎటువంటి జన సంచారం లోని కాలంలో బహు కొద్ది మంది వలస వచ్చి అడవిలో దొరికే కట్టెలు, ఆకులుతో చిన్న చిన్న ఆవాసాలు ఏర్పరచుకుని జీవనం సాగించే సమయంలో రాత్రుళ్ళు జంతువులు, దోపిడి దొంగల వలన ఒక రకమైన భయం చేత ప్రతి ఒక్కరూ వొణుకు/వణుకు తూ జీవనం సాగిస్తూ, ఆ పేరుతోనే పిలుస్తూ అదే వాడుక బడినట్లుగా, ఆకాలంలో పరిసరాలు పరిశుభ్రంగా లేనందున కలరా, మశూచి, టైఫాయిడ్ ఇతర అంటువ్యాధులు వ్యాపించి గ్రామాలకు గ్రామాలు తుడిచి పెట్టుకుని పోయేయి అని, అలా జరిగినప్పడు మూడ నమ్మకాలతో దెయ్యం, భూతం పారిపోతేనే  ఈ వ్యాధులు తగ్గుతాయి అనే నమ్మకంతో దీనికి మార్గం గ్రామాన్నితగల బెట్టడమే పరిష్కారం అని నిర్ణయించుకుని పూర్తిగా తగలపెట్టే వారని, అలా తగలబెట్టిన తరువాత కొద్ది సమీపంలో తిరిగి ఆవాసాలు నిర్మించుకుని, కొంతకాలం తరువాత అక్కడ వదిలేసి తగలబట్టిన ప్రదేశంలో అంకమ్మ, పోలేరమ్మ, నాంచారమ్మ, మాచమ్మ మొదలగు పేర్లతో  గ్రామ దేవతలను గ్రామానికి నాలుగు వైపుల., గ్రామం మధ్యలో బొడ్డురాయిని స్థాపించి, కొన్నాళ్లు ఆ ప్రదేశాన్ని పాడు పెట్టినందున అంతకు ముందు వాడుకలో నున్న పేరుకు పాడు లేదా బాడు అని తగిలించి వొణుకుబాడుగా పిలచుకుంటూ, ఆ తరువాత పిలుచుటలో, పలుకుబడులలో తేడాల వలన అది కాలాంతరంలో  పొణుకుబాడు, అని పొనుగుపాడు అని వాడుక బడినట్లుగా తెలుస్తుంది. కానీ దీనికి సరియైన ఎటువంటి ఆధారం మాత్రం లేదు.

కాకపోతే గ్రామానికి తూర్పుభాగం అర మైలు సమీపంలో లోగడ కొరిటాల, ఆ తరువాత కామినేని వారికి చెందిన “పాటిచేను”లో 1960 ప్రాంతంలోవరవకట్ట వేస్తుండగా చిన్న మట్టి పిడతలో నాణేలు బయల్పడినట్లు దానినిబట్టి అక్కడ కొన్ని కుటుంబాలు నివసించిన గ్రామం ఉన్నట్లు,అప్పడు బయల్పడిన నాణేలును బట్టి గణపతి దేవుని కాలం (1299-1323) కాలంలోనివని భావించవలసి వస్తుందని పొనుగుపాడు గ్రామానికే చెందిన తూము వెంకటేశ్వర్లు రాసిన పొనుగుపాడు చరిత్రలోని మొదటి పేజిలో ఈవిషయం ఉటంకించారు.అలాగే వారు రాసిన అదే గ్రంధం పేజి నెం: 4 రు లో “శ్రీకృష్ణదేవరాయలు 1509లో సింహాసనం అధిష్టించి దిగ్విజయ యాత్ర చేపట్టిన తరువాత ఖండ్రిక రేగులగడ్డ దగ్గర పొనుగుపాటి అగ్రహారీకులనబడే బ్రాహ్మణులు తమకు ఇచ్చిన అగ్రహారం సారవంతమైనది కానందున పరిసర గ్రామాలలోని వారిని కలుపుకొని పాటి (మెరక ప్రదేశం) మీద గ్రామస్తులతో కలిసి ఇప్పుడు పొనుగుపాడు ఉన్న చోట పొనుగుపాటి వంశీయులైన నియోగి బ్రాహ్మణుల చేత గడ్డయెత్తించి గడ్డనెత్తిన వారి వంశం పేరుతోనే పొనుగుపాడు అని నామకరణం చేసారు” అని వివరించారు. కానీ దీనికి ఎటువంటి ఆధారం లేదు.

కాకపోతే పొనుగుపాడు గ్రామం ఉన్న ఫిరంగిపురం మండలంలో వేమవరం కండ్రిక పొనుగుపాడు అనే పేరుతో జనాభా నివసించని గ్రామంగా రెవెన్యూ రికార్డునందు నమోదు అయినట్లు తెలుస్తుంది.సుమారు 100 సం.ముల క్రితం ప్రభుత్వ రికార్డులలో పొణుకుపాడుగా వ్యహరించ బడిన దాఖలాలు ఉన్నాయి. ప్రతి గ్రామానికి పాడు అనే పదం ఇలానే సంక్రమించి ఉండవచ్చు అని పెద్దల అభిప్రాయం.ఏదైనా ఒక ప్రదేశానికి మొదట ఆ పేరు ఎలా వస్తుంది అనే దానిపై ముప్పాళ్ల  హనుమంతరావు రచించిన కమ్మవారి చరిత్ర గ్రంథం పేజి నెం, 27 లో మూడు విధాలుగా జరుగుతుందని తెలిపాడు.

1.మొదట చూసినవారు వారికి ఇష్టమైన పేరు పెడతారు. అది వ్యక్తి పేరు కావచ్చు మరేదైనా కావచ్చు. ఆపెట్టేపేరు అంతకు ముందే ప్రఖ్యాతి వహించి ఉంటుంది. ఉదా. భరతుడు పరిపాలించాడు కనుక భరతఖండం/భారతదేశం.

2.అచట వుండే పరిస్థితిని బట్టి వాటి ఉనికిని బట్టి .ఉదా.వరంగల్ కోటలో ఒకే ఒక్క శిల వున్నందున ఏకశిలానగరం.

3.ఆ ప్రదేశంలో నివసించిన జాతిని బట్టి వస్తుందని తెలిపారు.ఉదా.కళింగ జాతి నివసించి నందున కళింగదేశం.

ఇంకొక వాదన: గతంలో గ్రామం గడ్డ ఎత్తిన ఆ రోజుల్లో బహుశా గ్రామం చుట్టూ అడవిలో పొనుకు/పొనికి చెట్లు ఎక్కువగా ఉండి ఉండవచ్చు. ఈ చెట్టుకు శాస్త్రీయ నామం 'gyrocarpus jacquini' లేదా 'gyrocarpus asiaticus'. ఈ చెట్టు యొక్క చెక్క మృదువైనది.ఈ చెట్ల కలపను ప్రసిద్ధ 'కొండపల్లి బొమ్మలు' తయారీకి ఉపయోగిస్తారు. ‘ఆ చెట్లు ఎక్కువగా ఉన్న ప్రదేశం అయినందున ‘పొణుకు’ నకు ముందు చెప్పినట్లు ‘పాడు/బాడు’ అనే పదం తగిలించి పొణుకుపాడు/పొనుకుపాడుగా వ్యవహరించి ఉండవచ్చు అనే బలమైన అభిప్రాయం కొందరిది.ప్రతి గ్రామానికి అక్కడ ఎక్కువగా ఉన్నమొక్క/వృక్షముల జాతి పేర్లు ఇలానే వచ్చినట్లుగా విజ్ఞల అభిప్రాయం.

మరి కొంతమంది ఈ ప్రాంతంలో లోగడ పునుగు జాతికి చెందిన పిల్లులు ఎక్కువగా ఉండుటచే ఆ పేరు ఏర్పడి ఉండ వచ్చు అనే అభిప్రాయం కొందరిది. పొనుగు అనే పదం సుమారు వంద సం.ముల లోపు నుండి మాత్రమే ఉన్నట్లుగా ప్రభుత్వ రికార్డులను బట్టి తెలుస్తుంది. అంతకు ముందు పొణుకుపాడుగా పిలవబడింది. పైకారణం ఏదైనా కావచ్చు.

గ్రామ రెవెన్యూ సమాచారం

[మార్చు]
  1. గ్రామకంఠం సర్వే నెంబరు 514. గ్రామ విస్తీర్ణం య.31-30 సెంట్లు.తరువాత గ్రామంలో దొడ్లు, కొష్టంల క్రింద సర్వే నెంబరు 514/1-1 య.0-09, సెంట్లు, 514/1-2 లోయ. 0-52 సెంట్లు గ్రామ కంఠంలో చేరినది.గ్రామ కుడికట్టు  య.4548-04 సెంట్లు.
  2. 27 ఆర్ మేజరు మేరిగపూడి క్రింద మాగాణి ఆయకట్టు య 1300-00 సెంట్లు, మెట్ట య 2295-00 సెంట్లు.అలాగే పెదనందిపాడు బ్రాంచి కాల్వ క్రింద మాగాణి ఆయకట్టు య.810-80 సెంట్లు,మెట్ట య.190-00 సెంట్లు. పోరంబోకులు క్రింద య.352-21 సెంట్లు. పోరంబోకులును వర్గీకరించగా డొంకలు, రోడ్లు క్రింద య.233-00 సెంట్లు, పి.డబ్ల్యు.డి కాలువుల క్రింద య.101-00 సెంట్లు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రింద య. 5-00 సెంట్లు, యిండ్ల స్ధలంల క్రింద య.13- 21 సెంట్లు కలిగిఉంది.
  3. గ్రామ పరిదిలో యల్ 1 భూమి వివరంలు:అనగా ఇతర మండలాలలోని గ్రామాలకు చెందినటువంటి భూమి లంకెలకూరపాడు య.247-00 సెంట్లు, దొండపాడు య.348-00 సెంట్లు, నార్నెపాడు య 122-00 సెంట్లు.అలాగే యల్ 2 భూమి అనగా స్వంత మండలం లోని గ్రామాలకు చెందిన భూమి గుండాలపాడు య.428-00 సెంట్లు, మునగపాడు య.96-00 సెంట్లు, మేరిగపూడి య.163-00 సెంట్లు.
  4. మత సంస్థల భూముల వివరాలు: (ఎ) శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంనకు సర్వే నెం.464 య.22.00 సెంట్లు. (బి) పీర్లు మాన్యం క్రింద సర్వే నెం.136 య.13.40 సెంట్లు.
  5. బావులు క్రింద: సర్వే నెం.130 లో య. 0.08 సెంట్లు,సర్వే నెం.517 లో య.0.16 సెంట్లు, సర్వెేనెం.817 లో య.0.25 సెంట్లు వెరసి మొత్తం య.0.49 సెంట్లు.
  6. చెఱువులు క్రింద:సర్వే నెం.151 లో య.4.32 సెంట్లు, సర్వే నెం.172 లో య.2.03 సెంట్లు, సర్వెేనెం.202 లోయ.3.80 సెంట్లు, సర్వే నెం.745 లో య.5.20 సెంట్లు, సర్వే నెం.746 లో య.0.74 సెంట్లు, సర్వెేనెం. 790 రులో య. 1.12 సెంట్లు, సర్వే నెం.818 లో య.14.85 సెంట్లు, వెరసి మొత్తం య.32.06 సెంట్లు.
  7. కుంటలు క్రింద:స ర్వే నెం. 151 లో య.0.63 సెంట్లు,సర్వే నెం.372 లో య.1.25 సెంట్లు వెరసి మొత్తం య.1.88 సెంట్లు.
  8. శ్మశానములు క్రింద: సర్వే నెం.95 లో య.7.66 సెంట్లు, సర్వే నెం.131 లో య.0.65 సెంట్లు,సర్వెేనెం.516/బిలో య.3.06 సెంట్లు వెరసి మొత్తం య.11.37 సెంట్లు.

సమీప గ్రామాలు

[మార్చు]

మెరికపూడి 3 కి.మీ, చందవరం 3 కి.మీ, నార్నెపాడు 4 కి.మీ, గుండాలపాడు 4 కి.మీ, గొరిజవోలు 5 కి.మీ.సాతులూరు 3 కి.మీ, దొండపాడు 3.కీ.మీ,

గ్రామ పంచాయతీ

[మార్చు]

లభించిన ఆధారాల ప్రకారం లోగడ 1934 సంవత్సరం ముందు నుండి పంచాయితీ అధ్యక్షులుగా పని చేయుచున్నవంకాయలపాటి పెద్దయ్యగారు పదవీ కాలపరిమితి ముగిసినందున వైస్ ప్రెసిడెంటు తూము శేషయ్య గార్కి ది.21.04.1934న గ్రామ పంచాయతీ రికార్డు, చిట్టా దాఖలా రు.10-1-9 (పది రుపాయల ఒక అణా తొమ్మిది పయిసాలు) నగదు అప్పగించారు. తరువాత జరిగిన ఎన్నికలలో శేషయ్య గారు ప్రెసిడెంటుగా ఏకగ్రీవంగా ఎన్నికై అప్పటినుండి ది.17.04.1956 వరకు అధ్యక్షులుగా 22 సం.ముల పరిపాలన సాగించారు. ఇప్పటి వరకు పంచాయితీ అధ్యక్షులుగా పనిచేసిన వారిలో తూము శేషయ్య గారు ఎక్కువ కాలం పనిచేసిన వ్యక్తి కావటం విశేషం.

  • వంకాయలపాటి మాధవరావు 2013 జూలైలో జరిగిన ఎన్నికలలో గెలుపొంది సర్పంచిగా పనిచేసాడు.

మౌళిక వసతులు

[మార్చు]

గ్రామంలో సిమెంటు రోడ్లు, తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.ఆంధ్రా బ్యాంకు గ్రామంలో కలిగి ఉంది.

గ్రామానికి సమాచార, రవాణా సౌకర్యం.

[మార్చు]

పొనుగుపాడులో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సమీప గ్రామమైన సాతులూరు గ్రామంలో 5 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, మొబైల్ ఫోన్ సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలోని నరసరావుపేట పట్టణంలో ఉన్నాయి.సమీపంలోని రైల్వే స్టేషన్ (సాతులూరు) మొదలైనవి గ్రామం నుండి 5 కి.మీ. పైబడిన దూరంలో ఉంది. నరసరావుపేట నుండి నుండి ఆటో రిక్షా, ఎ.పి.యస్.ఆర్.టి.సి.బస్ సర్వీస్ ద్వారా ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉంది. గుంటూరు-నర్సరావుపేట రహదారిపై గుంటూరు వైపు నుండి ప్రయాణిస్తున్నప్పుడు, మెరికపుడి, సాతులూరు గ్రామాల మధ్య ఉన్న నాగార్జునసాగర్ పెదనందిపాడు బ్రాంచి మేజరు కాలువ బ్రిడ్జి వద్ద కుడివైపు మలుపు తీసుకొని కొద్ది దూరం వెళ్లిన తరువాత తిరిగి కుడివైపు అప్రోచ్ రోడ్డులో 1.5 కి.మీ. దూరం ప్రయాణం చేయాలి. నరసరావుపేట నుండి వచ్చే ఆటో రిక్షా, ఎ.పి.యస్.ఆర్.టి.సి. బస్ సర్వీస్ ద్వారా వెళ్లవచ్చు. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

ప్రాథమిక పాఠశాలలు:నాలుగు, జిల్లా పరిషత్ పాఠశాల:ఒకటి ఉంది. సమీప బాలబడి ఫిరంగిపురంలో ఉంది.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల నరసరావుపేటలోను, ఇంజనీరింగ్ కళాశాల సాతులూరులోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు నరసరావుపేటలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల నరసరావుపేటలోను, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల‌లు ఫిరంగిపురంలోనూ ఉన్నాయి.

ప్రాధమిక పాఠశాలలు.

[మార్చు]
  • మండల ప్రజా పరిషత్ పాఠశాల. (లూధరన్ ప్రాథమిక): ప్రారంభించిన తేది.03.03.1939. జిల్లా విద్యాశాఖాధికారి, గుంటూరు వారి ఆర్.సి.సంఖ్య.6/1939, తేది: 03.03.1939 లో ఈ పాఠశాల ప్రారంభించుటకు గుర్తింపు ఉత్తర్వులు జారీ చేయబడినవి.
  • మండల ప్రజా పరిషత్ పాఠశాల. (బాలికల ప్రాథమిక): ఈ పాఠశాల 1921 సంవత్సరంలో ప్రారంభించబడింది. ప్రారంభించిన తేది, మంజూరు ఉత్తర్వులు వివరాలు అందుబాటులో లేవు.
  • మండల ప్రజా పరిషత్ పాఠశాల. (ఉర్దూ ప్రాథమిక): ప్రారంభించిన తేది:19.08.1944. జిల్లా విద్యాశాఖాధికారి,గుంటూరు వారి ఆర్.సి.డిస్. సంఖ్య.519/1944 తేది: 19.08.1944న ఈ పాఠశాల ప్రారంభించుటకు గుర్తింపు ఉత్తర్వులు జారీ చేయబడినవి.
  • మండల ప్రజా పరిషత్ పాఠశాల. (హిందూ ప్రాథమిక): ప్రారంభించిన తేది.28.09.1923. జిల్లా విద్యాశాఖాధికారి,గుంటూరు వారి ఆర్.సి.సంఖ్య:4/డి1 తేది: 28.09.1923న ఈ పాఠశాల ప్రారంభించుటకు గుర్తింపు ఉత్తర్వులు జారీ చేయబడినవి.
  • పొనుగుపాడు గ్రామంలోని ప్రాధమిక పాఠశాలల గ్యాలరీ
  • ప్రాథమిక పాఠశాల. (HE)
    ప్రాథమిక పాఠశాల. (HE)
  • ప్రాథమిక పాఠశాల. (LE)
    ప్రాథమిక పాఠశాల. (LE)
  • ప్రాథమిక పాఠశాల. (Urdu)
    ప్రాథమిక పాఠశాల. (Urdu)

గమనిక:పై వాటిలో బాలికల పాఠశాలను ప్రభుత్వం కొద్దికాలం క్రిందట హిందూ బాలుర పాఠశాలలో విలీనం చేసింది.

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల

[మార్చు]

ఉన్నత పాఠశాల మంజూరు ఉత్తర్వులు సంఖ్య: అర్.ఒ.సి.2030-జి2-1951, తేది.29.06.1951./ డి.పి.ఐ./ ఉమ్మడి మద్రాసు రాష్టం. ప్రారంభించిన తేది: 06.07.1951.జ్ఞానోదయ బోర్డు సెకండరీ పాఠశాలగా ఒకే పర్యాయం 1వ ఫారం నుండి 4వ ఫారం వరకు మంజూరు చేయబడింది.మొదటగా హైయ్యర్ ఎలిమెంటరీ పాఠశాల నడపబడుచున్న శివాలయంనకు చెందిన సత్రంలో (రాయంకుల వెంకయ్య పంతులు గారి బడి అంటారు) ఆనాటి సత్తెనపల్లి శాసనసభ్యులైన మేడూరి నాగేశ్వరరావు గారిచే ది.06.07.1951న ప్రారంభించబడింది. మొదటి ప్రధానోపాధ్యాయులు: వై.కిష్ణమూర్తి. మొదట పనిచేసిన మీనియల్ సిబ్బంది. 1. సుంకుల నారాయణ (అటెండర్) 2. జొన్నలగడ్డ రామస్వామి. (నైట్ వాచ్ మన్).  

ఉన్నత పాఠశాల నిర్మాణం సర్వే నెం, 512-1. య.2-17 సెంట్లు, 513-1. య.2.83 సెంట్లు. మొత్తం య.5-00.ల విస్తీర్ణంలో నిర్మించబడింది.పాఠశాల నిర్మాణంనకు ఉచితంగా స్తలం ఇచ్చిన దాతలు: 1. రాయంకుల వెంకయ్య 2. మర్రి విశ్వేశ్వరరావు, గోపాలకృష్ణయ్య, 3. యామాని కోటయ్య, 4. కట్టా ఆదినారాయణ, రామకోటయ్య, వెంకయ్య, 5. గరికపాటి రామస్వామి, విశ్వనాధం, 6. కాకర్ల అచ్చమ్మ. పాఠశాల భవన నిర్మాణంనకు వంకాయలపాటి రత్తయ్య గారిచే భూమి పూజ నిర్వహించబడి శంకుస్థాపన గావించబడింది.భవన నిర్మాణం రాయంకుల కోటేశ్వరరావు స్పాన్సర్ గా ఉండి చెరుకూరి వెంకయ్య, గద్దె పేరయ్య, కామినేని నరసయ్య,ఇతర గ్రామస్థుల సహకారంతో నిర్మించబడింది.ప్రస్తుత ఉన్నత పాఠశాల భవనం 1958లో అప్పటి స్థానిక స్వపరిపాలన శాఖామాత్యులైన కాసు బ్రహ్మానందరెడ్డిచే ప్రారంభించబడింది. ఉన్నత పాఠశాల ఆవరణలో జన్మభూమి పథకం క్రింద రు.5.00 లక్షలతో కంప్యూటరు ల్యాబ్ జన్మభూమి పధకం క్రింద నిర్మించబడింది. దీనికి "కొరిటాల ఇందిరా శేషగిరిరావు చారిటబుల్ ట్రష్టు" (కిస్) వారు రు.3.50 లక్షలు విరాళం చెల్లించారు.కంప్యూటరు భవన నిర్మాణం వంకాయలపాటి బలరామకృష్ణయ్య ఆధ్వర్యంలో నిర్మించబడింది.స్వర్ణోత్సవాల సందర్భంగా ది.19.05.2002న అప్పటి రాజ్యసభ సభ్యులు యఢ్లపాటి వెంకటరావు కంప్యూటరు భవనాన్ని, అప్పటి శాసనసభ్యులు వై.వి.ఆంజనేయులు కంప్యూటరు ల్యాబ్ ను ప్రారంభించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్వర్ణోత్సవం ది.19.05.2002న  అప్పటి ప్రధానోపాధ్యాయులైన ఎ.ఢి.ప్రభుదాస్ బి.ఎ.బి.ఇడి ఆధ్వర్యంలో జరిగింది. స్వర్ణోత్సవ కమిటీ అధ్యక్షులుగా పాఠశాల పూర్వ విద్యార్థి అల్లం జగపతిబాబు వ్యవహరించాడు.   ఈ ఉన్నత పాఠశాల యస్.యస్.యల్.సి మొదటి బ్యాచ్ ఉత్తీర్ణులలో కొరిటాల శేషగిరిరావు (కిస్ చారిటబుల్ ట్రష్టు వ్యవస్థాపకుడు) ప్రథమ స్థానం సాధించిన మొదటి పూర్వ విద్యార్థి.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో స్వయం సహాయక బృందాలు, పౌర సరఫరాల కేంద్రాలు ఉన్నాయి. ఆంధ్రా బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామంలో ఉన్నాయి. ఏటీఎమ్, సహకార బ్యాంకు,వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్న నరసరావుపేట పట్టణం నందు, మండల కేంద్రమైన ఫిరంగిపురంలో ఉన్నాయి.

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

పొనుగుపాడులో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.సంచార వైద్య శాల, సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి. వైద్యశాల, అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. పైబడి దూరంలో ఉన్ననరసరావుపేట పట్టణం నందు, మండల కేంద్రమైన ఫిరంగిపురంలో ఉన్నాయి.పశు వైద్యశాల గ్రామంలో ఉంది.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

గ్రామంలో4 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు నలుగురు ఉన్నారు. ఒక మందుల దుకాణం ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో అంగన్ వాడి పాఠశాలలు: ఆరు ఉన్నాయి. 1.హరిజనవాడ (పాత యస్.సి.ప్రాంతం),అంగన్ వాడి టీచరు:పుల్లగూర విజయ కుమారి..2.హరిజనవాడ (కొత్త యస్.సి.ప్రాంతం,ఇందిరా కాలనీ), అంగన్ వాడి టీచరు:కొప్పల కోటమ్మ, 3.యస్.టి.ప్రాంతం,అంగన్ వాడి టీచరు:యడ్లపల్లి నవరాణి, 4.ఒ.సి (ముస్లిం ప్రాంతం),అంగన్ వాడి టీచరు:షేక్ మీరాబి, (యల్.కె.జి.) 5. ఒ.సి. (పంచాయితీ ప్రాంతం), అంగన్ వాడి టీచరు:యర్రం ఉదయలక్ష్మి, (యు.కె.జి). 6.బి.సి.ప్రాంతం, అంగన్ వాడి టీచరు: గుర్రం లక్ష్మి ప్రసన్న. (నర్సరీ).

గమనిక: దక్షిణం బజారులో లోగడ నిర్వహించుచున్న మండల పరిషత్ బాలికల ప్రాథమిక పాఠశాలను జిల్లా పరిషత్ ఆవరణలో కలిగియున్న మండల పరిషత్ హిందూ బాలుర ప్రాథమిక పాఠశాలలో విలీనమైనందున ఖాళీగా ఉన్న ఆపాఠశాల భవనంలో చివరి మూడు అంగన్ వాడి కేంద్రాలు విలీనం చేసి ఒకే చోట నడపబడుచున్నవి.గ్రామంలో ఆశా కార్యకర్త ఉంది. వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. శాసనసభ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం, గ్రంథాలయం ఉన్నాయి.సమీకృత బాలల అభివృద్ధి పథకం, ఆటల మైదానం సినిమా హాలు గ్రామం నుండి 10 కి.మీ. పైబడి దూరంలో ఉన్న నరసరావుపేట పట్టణంలో అన్నాయి.

తాగు నీరు

[మార్చు]

వాటరు ప్లాంటులు ఉన్నాయి. సాధారణ వాడకంనకు బావుల, చేతిపంపుల ద్వారా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.

పారిశుధ్యం

[మార్చు]

గ్రామంలో మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు. గ్రామం సంపూర్ణ పారిశుధ్య పథకం కిందకు రాలేదు. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 6 గంటల పాటు వ్యవసాయానికి, 8 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

గ్రామంలోని దేవాలయాలు/వాటి చరిత్రలు

[మార్చు]

శ్రీ ఆంజనేయస్వామి దేవాలయ సముదాయం

[మార్చు]

ఈ ఆలయం ప్రధానంగా 1799-1800 సం.లో శ్రీ ఆంజనేయస్వామిని ప్రతిష్ఠించి నిర్మించబడింది.ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త పాపరాజు.ఇతను పొనుగుపాటి ఇంటిపేరుగల బ్రాహ్మణ వంశీయుల మూలపురుషుడు వెంకంరాజు ప్రథమ కుమారుడు.పాపరాజు శ్రీ ఆంజనేయస్వామి వార్కి ఆలయం కట్టించి, స్వామివారిని ప్రతిష్ఠించి పూజించటానికి కౌండిన్యస గోత్రికులైన పెరంబదూరు కేశవాచార్యులనే పాంచరాత్రుని (ఆగమ శాస్రం తెలిసిన వ్యక్తి) నియమించి, నిత్యనైవేద్యం, దీపారాధన జరుగగలందులకు రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడుకు చెప్పి,అరకుచ్చల ఇనాం భూమి ఇప్పించాడు.ఇనాం భూమి య.22.00లు ఇప్పటికీ శ్రీఅంజనేయస్వామి దేవస్థానం అధీనంలోఉంది.ఈ ఆలయం జీర్ణోద్దరణ గావించబడి తిరిగి నూతనంగా నిర్మించబడింది.ఈ ఆలయంలో శ్రీ శ్రీదేవీ భూ నీళా సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి, శ్రీ సీతారామలక్ష్మణస్వామి ఉపాలయాలు ఉన్నాయి.దేవస్థానంలో పాంచరాత్ర ఆగమ విధానం ప్రకారం పూజలు జరుగుచున్నవి.  ప్రధాన వ్యాసం:శ్రీ అంజనేయస్వామి దేవాలయం.

శ్రీ రామేశ్వరుని దేవాలయం. (చోళేశ్వరాలయం)  

[మార్చు]
1967 లో జీర్ణోద్ధరణ గావించిన దేవాలయం

మనకు ప్రక్క ఫొటోలో కనిపించే ఆలయంనకు ముందు పూర్వం కలిగియున్న దేవాలయం చాలా పురాతన కాలానికి చెందినది.ఇప్పటికి (2017 సంవత్సరం నాటికి) 900 సంవత్సరంల క్రిందట నిర్మించబడింది. పురాతనమైన ఈ అలయాన్ని చోళ మహారాజు నిర్మించినందున వాడుకలో చోళేశ్వర దేవాలయం అని వ్యవహరిస్తారు. పురాతన ఆలయమైనందున పాత శివాలయం అని కూడా వ్యవహరిస్తారు.కుళోత్తంగ చోళ మహారాజు 12వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన కాలంలో గ్రామానికి పశ్చిమ దిక్కున ఆలయం కట్టించి, రామేశ్వరుడు అనే నామధేయంతో శాలివాహనశకం ౧0౩౯ (1117) లో లింగాన్ని ప్రతిష్ఠించినట్లుగా గుంటూరు జిల్లా గ్రామ కైఫియ్యత్తుల 3వ భాగం పేజి నెం.204 రులో వివరించిన ప్రకారం తెలుస్తుంది. కాలాంతరంలో అలయం శిథిలమై శివలింగం,నంది మాత్ర1967 మే సంవత్సరం వరకు ఉండేవి.

తరువాతి కాలంలో పడమర బజారుకు చెందిన కీ.శే.కట్టా సుబ్బయ్య, కీ.శే.వంకాయలపాటి రామయ్య, కీ.శే.బొడ్డు రోశయ్య, కీ.శే.మానుకొండ వెంకటేశ్వర్లు, కీ.శే.యర్రం వెంటేశ్వర్లు, ముఖ్యంగా పడమర బజారుకు చెందిన వ్యక్తి కాకపోయినప్పటికి కీ.శే.గద్దే పేరయ్య, శ్రీగంగా అన్నపూర్ణ సమేత శ్రీకాశీవిశ్వేశ్వర స్వామి ఆలయ పూజారి కీ.శే.కాకుమాను శేషయ్య తదితరుల పట్టుదలతో, గ్రామస్థుల అందరి సహకారంతో ఆలయ జీర్ణోద్ధరణ గావించి, పంచాయతన విగ్రహాలు (పంచభూతాలకు ప్రతీకగా భావించే)  నైరుతిన విఘ్నేశ్వరుడు, వాయవ్యం పార్వతీదేవి అమ్మవారు, ఈశాన్యం శ్రీరాముడు, సీతాదేవి, ఆగ్నేయం సూర్యుడు, మధ్యలో చోళేశ్వరస్వామి (శ్రీరామలింగేశ్వరుడు) విగ్రహాలతో (సాలగ్రాములు) తో స్వస్తిశ్రీ చాంద్రమానేన శ్రీ ప్లవంగ నామ సంవత్సర వైశాఖ మాస బహుళ షష్ఠి సప్తమి నాడు (18.05.1968)న ధ్వజస్తంభం ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు జరిగినవి. ప్రధాన ఆలయంనకు ఎదురుగా నంది విగ్రహం, ఎడమ వైపు ఆంజనేయ స్వామి, కుడివైపున పార్వతిదేవి ఉపాలయాలు నిర్మితమై ఉన్నాయి.

మొదటి కళ్యాణం, జీర్ణోద్ధరణ, ప్రతిష్ఠ కార్యక్రమాలకు యాగకర్తలుగా పడమర బజారుకు చెందిన కీ.శే. మానుకొండ వెంకటేశ్వర్లు, రాజ్యలక్ష్మమ్మ దంపతులు వ్యవహరించారు.ఆలయం జీర్ణోద్ధరణ జరిగిననాటినుండి స్వామి వారికి నిత్య దీప, ధూప, నైవేద్యం,అర్చకత్వం కార్యక్రమాలు నిరంతరంగా జరుగుటకు పడమర బజారుకు చెందిన కీ.శే.మానుకొండ వెంకటేశ్వర్లు, రాజ్యలక్ష్మమ్మ దంపతులు డి.నెం.892 రులో య.01.65 శెంట్లు భూమిని ఆలయంనకు కైంకర్యం చేసారు. అప్పటి (1968) నుండి కీ.శే.కాకుమాను శేషయ్య ఈ ఆలయానికి మొదటి పూజారిగా 1978 వరకు పనిచేసారు.ఆయనకు వృద్దాప్యదశ చేరువైనందున ఆ తరువాత ఆలయ అర్చకత్వం బాధ్యతలు మనమడు కళాధరశర్మ నేత్రత్వంలో కుమారుడు ఆంజనేయులు ఒక సంవత్సరం, అలాగే  సోమసుందరరావు నేత్రత్వంలో మనవళ్లు కృష్ణచైతన్య శర్మ, సాయికృష్ణ శర్మ  ఇద్దరూ కలసి ఒక సంవత్సరం వంతులు వారీగా దూప, దీప, నైవేద్య, పూజాది కార్యక్రమాలు ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. స్వామి వార్కి ఆలయం జీర్ణోద్ధరణ జరిగిన మొదటి కళ్యాణం నుండి ఇప్పటివరకు నలుబది తొమ్మిది కళ్యాణ వేడుకలు జరిగినవి.యాబైవ కళ్యాణం స్వస్తిశ్రీ చాంద్రమానేన శ్రీ హేవిలంబి నామ సంవత్సర వైశాఖ మాస బహుళ షష్ఠి సప్తమి నాడు (18.05.2017) న జరిగింది.యాబైవ కళ్యాణం యాగ కర్తలుగా కృష్ణ చైతన్య శర్మ, సాయికృష్ణ శర్మ నిర్వహించారు. ప్రస్తుతం పడమర బజారు నివాసులైన వంకాయలపాటి ఆంజనేయులు, సాంబశివరావు, వెంకట్రావు, యర్రం కోటేశ్వరరావు,గుర్రం సత్యనారాయణ, యర్రం శివబాబు, నిడమానూరి జగదీష్ మరికొంత మంది పెద్దలు పర్వేక్షణలో దేవాలయ నిర్వహణ కార్యక్రమాలు జరుగుచున్నవి.

శ్రీ కాశీవిశ్వేశ్వర స్వామి దేవస్థానం.

[మార్చు]
శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి దేవాలయం.

కాశీ (వారణాసి) నుండి శివలింగం (సాలగ్రాం)ను తీసుకు వచ్చి ప్రతిష్ఠించి ఈ ఆలయంనకు "శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం" అని నామకరణం చేసినందున "శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం" అని వ్యవహరిస్తారు.శివలింగాన్ని నేరుగా కాశీ నుండి జంపని వారసులలో ఒకరైన వంకాయలపాటి వెంకయ్య కాలినడకన వ్యయప్రయాసలకోర్చి తీసుకు వచ్చారు. ఆ కార్యక్రమం రాయంకుల తాతయ్య,తదితర జంపని వారసుల నేత్రత్వంలో జరిగింది.1913 సంవత్సరంలో ఒక యకరం విస్తీర్ణం (డి.నెం.516ఎ) నందు దేవస్థానం నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది.శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంనకు ప్రజలందరూ పిలిచే “జంపనోరి గుడి” అనే మరో పేరు ఉంది.జంపని రామలక్ష్మమ్మ ఆస్థులకు వంకాయలపాటి, మర్రి, రాయంకుల కుటుంబాల వారు వారసులుగా వచ్చినందున ఈ మూడు కుటుంబాల వారిని "జంపనివారు" అని పిలుస్తారు.ఈ మూడు కుటుంబాలకు చెందిన వారసులు దేవాలయంనకు శంకుస్థాపన చేసి ఆలయం నిర్మించినందున ఈ గుడిని "జంపనివారి గుడి" అని వాడుకలోకి వచ్చింది. ప్రధాన వ్యాసం: శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి దేవాలయం. (పొనుగుపాడు).

శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవస్థానం.

[మార్చు]

అంకురార్పణ: మొదట పూర్వం వంద సంవత్సరంల క్రిందట ఈ ఆలయం నిర్మించక ముందు ఆలయం నిర్మించిన స్థలం బహిరంగ ప్రదేశంగా ఉండేది. ఆ స్థలంలోనే కొంత భాగంలో దిగుడు బావి ఉండేది. కాలక్రమేణా ఆ బావి గిలకల బావిగా నిర్మించబడింది. ఆ బావి మొన్న మొన్నటి వరకు ఉండేది. ప్రస్తుతం ఆ స్థలం ఆలయ జీర్ణోద్దరణకు చాలనందున దేవాలయ నిర్మాణంనకు తీసుకొనబడింది. ఆ బావికి ఎదురుగా కొంత ప్రదేశం ‘ఖాళీ’గా ఉండేది. ఆ కాలంలో బొప్పూడి సుబ్రమణ్యం అనే వారు ఈ గ్రామంలో నివసించే వారు.ప్రస్తుతం బొప్పూడి వారు గ్రామంలో ఎవ్వరూ లేరు.ఆయన దైవభక్తి పరాయణుడు. ఆ ఖాళీగా ఉన్న ప్రదేశంలో బొప్పూడి సుబ్రమణ్యం, దార్ల శ్రీశైలం, మోడేపల్లి కృష్ణయ్య, వేమూరి దేశయ్య, బొమ్మినేని బిక్షాలు, తూబాటి నాగభూషణం, దమ్మాటి చంద్రయ్య, కుంటి నాగమ్మ (ఇంటి పేరు తెలియదు) అను వారు మొదట చిన్న పందిరి వేసి, విబూదిపండును శివలింగంగా అమర్చి, శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంధ్ర స్వామి చిత్రాన్ని పందిరిలో తగిలించి ఆరాధించేవారు. ప్రతిరోజు బొప్పూడి సుబ్రమణ్యం ఉదయం, సాయంత్రం అక్కడ బావిలో స్నానం చేసి దీపారాధన చేసేవారు. ప్రతి సోమవారం పైన తెలిపిన వారందరూ బ్రహ్మంగారి భజనలో పాల్గొని భజన చేసేవారు.  దేవాలయ నిర్మాణంనకు నాంది:ఇది తెలుసుకోవాలంటే మనం రెండు వందల సంవత్సరాల క్రిందటి కొంగర ఇంటి పేరు వంశీయుల పూర్వీకులు గురించి తెలుసుకోవాలి. పొనుగుపాడు గ్రామంలో కొంగర ఇంటి పేరు వంశీయుల మూల పురుషుడు బసవయ్య. ఈయన 19వ శతాబ్దం ఆరంభంలో పొనుగుపాడు గ్రామంలో నివసించేవారు. బసవయ్య రెండవ ముది మనమడు నరసయ్య. ఈయనకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య సంతానంలో ప్రథమ కుమారుడు రాఘవయ్య. ఆయన భార్య చిన్న అచ్చమ్మ. పూర్వం గ్రామాలలో దాదాపుగా ప్రతి కుటుంబానికి ఆవులు, ఎద్దులు పశుసంపద ఎక్కువగా ఉండేది. రాఘవయ్య, చిన్నఅచ్చమ్మ దంపతులు జీవనం సాగించే కాలంలో (1920 ప్రాంతం) గ్రామంలో పశువులకు వ్యాధులు సోకి విపరీతంగా మృత్యువాత పడే సమయంలో విధిలేక వ్యాధులు పూర్తిగా తగ్గితే వీరబ్రహ్మేంధ్రస్వామివారి ఆలయం నిర్మిస్తామని మ్రొక్కుకున్నారని, ఆ తరువాత కొద్ది రోజులకే గ్రామంలో వ్యాధులు పూర్తిగా తగ్గినందున, దాని పర్వసానంగా “శ్రీవిరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి దేవాలయం” అనే నామధేయంతో మొదట చిన్న బొమ్మరిల్లులాంటి  ఆలయాన్ని ప్రధాన వీధిలో లోగడ మనం పైన చెప్పకున్న ఖాళీ స్థలంలో సుమారు 100 చ.గ.ల విస్తీర్ణంలో నిర్మించారు. దేవాలయంలో ప్రతిష్ఠించిన స్వామి వారి శివలింగం (సాలగ్రాము) ను కాశీ నుండి తీసుకొని వచ్చి,శివలింగంతో పాటు పార్వతీదేవి, నంది, వినాయకుడు విగ్రహాలను 1921వ సంవత్సరం ఆ ప్రాంతంలో ప్రతిష్ఠ చేసినట్లుగా ప్రస్తుత ఆలయ ధర్మకర్తలలో ఒకరైన కామినేని రామారావు, వారి తండ్రి పెద రాఘవయ్యకు ముఖ్య సన్నిహితుడు, గ్రామంలో ప్రస్తుతం ఉన్న పెద్దవారిలో ఒకరైన గుర్రం శేషారాయుడు, మరి కొంతమంది పెద్ద వారి ద్వారా తెలుస్తుంది.కొంగర ఇంటి పేరుగల వంశీయులు నిర్మించినందున పూర్వం నుండి వాడుకలో “కొంగరోరి గుడి” అని వ్యవహరిస్తుంటారు. తరువాత ఆలయ అభివృద్ధి: కొంత కాలానికి ఆ ఆలయాన్ని మోడేపల్లి కిష్టమ్మ, దార్ల శ్రీశైలం, లక్కవరపు రామలింగాచారి, వేమూరి వీరయ్య, దేశయ్య, తూబాటి నాగభూషణం, గుర్రం అప్పయ్య తదితర గ్రామస్తుల సహకారంతో కొంతమేరకు ఆలయం అభివృద్ధి జరిగింది.దేవాలయం ప్రతిష్ఠ  జరిగిన నాటి నుండి ధూప, దీప, నిత్య నైవేధ్య, అర్చకత్వం, ఉరేగింపు,మేళం తదితర కార్యక్రమాలు నిరాటంకముగా జరుగుటకు రాఘవయ్య, చిన్నఅచ్చమ్మ దంపతులు వారి స్వంత భూమి డి.నెం.292/2 య.4.74 శెంట్లు దేవాలయంనకు కైంకర్యం చేసారు.అప్పటి నుండి రాఘవయ్య, చిన్నఅచ్చమ్మ దంపతులు ఆలయ ట్రష్టీలుగా వ్యవహరించారు. మాగులూరి కోటయ్యాచారి (విశ్వబ్రాహ్మణ వంశీయులు) కు మొదటి పూజారిగా ఆలయ అర్చకత్వ బాధ్యతలు ఒప్పగించారు. రాఘవయ్య,చిన్నఅచ్చమ్మ దంపతులుకు మగ సంతానం లేదు.వృద్దాప్యదశకు చేరువైన సమయంలో మగ సంతానం లేనందున బావమరిది కామినేని నానయ్యను తన ఆస్తిపాస్తులకు వారసుడుగా స్వీకరించారు.ఈయన సంతానం ఇద్దరు కుమారులు రామయ్య,పాపయ్య. రాఘవయ్య, చిన్నఅచ్చమ్మ దంపతులు మరణం అనంతరం మేనల్లుళ్ళు కామినేని రామయ్య, పాపయ్య వంశపారంపర్య ధర్మకర్తలుగా వ్యవహరించారు. కామినేని రామయ్య తదనంతరం వారి కుమారులు నరసయ్య, (పెద) రాఘవయ్య, పాపయ్య మరణానంతరం కుమారుడు రాఘవయ్య (చిన) లు వంశపారంపర్య ధర్మకర్తలుగా వ్యవహరించారు.పైవారి మరణాంతరం ప్రస్తుత వంశపారంపర్య ధర్మకర్తలుగా పెదరాఘవయ్య కుమార్లు రామారావు, బ్రహ్మానందం, చినరాఘవయ్య కుమార్టు పాపారావు వంశపారంపర్య ధర్మకర్తలుగా కొనసాగుచున్నారు.ప్రస్తుత ఆలయ పూజారిగా మొదటి పూజారి మాగులూరి కొటయ్యాచారి కుమారుడు నాగభూషణాచారి పర్వేక్షణలో వారి కుమారుడు ఉమా మహేశ్వరరావు కొనసాగుచున్నారు. కాలక్రమేణా దేవాలయ ప్రాంగణం పల్లంగా ఉండి వర్షపు నీరు ఆలయంలోనికి ప్రవేశించి శిథిలావస్ధ స్థితికి చేరువైనందున గ్రామస్ధులు సహకారంతో వంశపారంపర్య ధర్మకర్తలు జీర్ణోద్ధరణ చేయ తలంచి ది.29.08.2013 న శంఖుస్దాపన కార్యక్రమం గావించారు. పూర్వం ఆలయ నిర్మాణం సుమారు 100 చ.గ.ల స్థలంలో జరిగింది.ప్రస్తుత స్థలం జీర్ణోద్దరణ జరిగే దేవాలయంలకు సరిపోదని బావించి రు.2.00 లక్షలు హెచ్చించి అదనంగా మరొక 75 చ.గ.ల స్థలాన్ని విక్రయం ద్వారా సేకరించి ఆలయ నిర్మాణం చేపట్టబడింది. జీర్ణోద్ధరణ దేవాలయ నిర్మాణంనకు సుమారు 60 లక్షలు హెచ్చించ బడినవి.ఆలయ నిర్మాణంనకు గ్రామస్థుల సహకారం,వంశపారంపర్య ధర్మకర్తల కృషి ఎంతో ఉంది.దేవాలయ నిర్మాణం ఆగమశాస్త్ర ప్రకారం అన్నిహంగులతో పూర్తి చేయబడింది.నూతనంగా నిర్మించిన దేవాలయంలో ప్రతిష్ఠించిన విగ్రహాలు మహాబలేశ్వరం నుండి రు.2.50.లక్షలు హెచ్చించి తీసుకు రాబడినవి. జీవద్వజస్తంభం మూలం రు.3.60.లక్షలు హెచ్చించి మహారాష్ఠ్ఱ (బలార్షా) నుండి తీసుకు రాబడింది.లోగడ కాశీ నుండి తీసుకు వచ్చిన శివలింగంతో పాటు నూతనంగా పానువట్టం,శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి,శ్రీ గోవిందమాంబ, గణపతి, నందీశ్వరుడు, శ్రీ ఆంజనేయ స్వామి, విగ్రహాలను, నవగ్రహాలు పున:ప్రతిష్ఠ కార్యక్రమ మహోత్సవం ది.08.05.2017న జరిగింది. దేవాలయం జీర్ణోద్ధరణ కార్యక్రమం చేపట్టినప్పటి నుండి నిర్మాణంలో వంశపారంపర్య ధర్మకర్తలలో ఒకరైన కామినేని రామారావు (విశ్రాంత ఉపాద్యాయుడు) కృషి ఎంతగానో ఉంది. ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి (ఉగాది పర్వదినాన) నాడు ఉత్సవాలు జరుపుట పూర్వం నుండి ఆనవాయితీ.ఆరోజు శ్రీవీరబ్రహ్మేంద్ర స్వామి వారి భజన ఏకాహం, బ్రహ్మంగారి నాటకం మొదలగు కార్యక్రమాలు జరుగుతాయి.ప్రతి సోమవారం భజన కార్యక్రమం జరుగుతుంది.ఈ గ్రామానికి చెందిన వేమూరి వీరయ్య ఈ ఆలయంనకు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జెండా అనే పేరుపై 1960 ఆ ప్రాంతంలో జండాను బహుకరించారు.అప్పటి నుండి ఉగాది పర్వదినాన స్వామి వారి ఊరేగింపుతోపాటు వేమూరి వీరయ్య కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జండా ఊరేగింపు జరిగే కార్యక్రమం ఆచారంలో ఉంది.

ఉత్పత్తి

[మార్చు]

పొనుగుపాడులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ గ్రామానికి వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం ప్రధాన వనరు. వరి ధాన్యం, మిరప, కాటన్ ప్రధాన పంటలు. సాధారణ పంటలు కాకుండా కాలమాను పరిస్థితులను బట్టి మొక్కజొన్న, జొన్న, అపరాల వంటి పంటలు, టొమాటో, వంకాయ, బెండకాయ కొన్ని కూరగాయలు పంటల సేద్యం కొద్ది మంది రైతులు చేస్తుంటారు. 

ప్రధాన పంటలు

[మార్చు]

వరి, ప్రత్తి, మిరప

భూమి వినియోగం

[మార్చు]

పొనుగుపాడులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 154 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 108 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 47 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 1513 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 662 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 851 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

పొనుగుపాడులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 847 హెక్టార్లు
  • బావులు/బోరు బావులు: 4 హెక్టార్లు

గ్రామంలో ప్రధాన వృత్తులు

[మార్చు]

వ్యవసాయం, వాణిజ్య వ్యాపారం,

గ్రామ ప్రముఖులు

[మార్చు]
  • పొనుగుపాటి వేంకట నాగభూషణం: (స్వాతంత్ర్య సమర యోధులు)వీరి తల్లిదండ్రులు ఈశ్వరయ్య పిచ్చమ్మ. భారత స్వాతంత్ర్యోద్యమములో వీరు సత్యాగ్రహంలో పాల్గొనినందుకు బ్రిటీషు ప్రభుత్వం 29.07.1930 న ఒక సంవత్సరం జైలు శిక్ష విధించింది.జైలు శిక్ష పూర్తి అయిన తరువాత విజయవాడలో ఆర్యవైశ్య వారపత్రిక సంపాదకులుగా పనిచేసారు.ఆ తరువాత తిరిగి పొనుగుపాడు గ్రామం వచ్చారు. గ్రామంలో గ్రంథాలయ ఆభివృద్ధికి పాటుపడిన  ముఖ్యలులో వీరు ఒకరు. ప్రభుత్వం వీరిని రాజకీయ బాధితుడుగా గుర్తించింది.ఆయన మరణానంతరం భార్య సుబ్బమ్మకు స్వాతంత్ర్య సమరయోధులు పించను, పొనుగుపాడు గ్రామ సర్వే నెం.రు 818-1 (కోనాయకుంట) లో య.2-99 సెంట్లు, అదే సర్వే నెం.రు 2 లో య.2-50 సెంట్లు భూమికి పట్టా మంజూరు చేసింది. వీరు నిస్సంతు దంపతులు.
  • వంకాయలపాటి పెద్దయ్య: (జననం.1890).తల్లిదండ్రులు నారయ్య, రోశమ్మ ఆకాలంలో బావమరిది రాయంకుల తాతయ్యతో కలసి నీలిమందు వ్యాపారం, గ్రామానికి పడమరవైపు చింతలతోపులో వేరుశనగకాయలు వలిచే ఫ్యాక్టరీ స్థాపించి నడిపారు. అలాగే గుంటూరులో కమిషను వ్యాపారం నిర్వహించారు.1931 నుండి 1934 వరకు గ్రామ పంచాయితీ అధ్యక్షులుగా పనిచేసారు.ది.21.04.1934తో పదవీ కాలపరిమితి ముగిసినందున వైస్ ప్రెసిడెంటు తూము శేషయ్య గార్కి గ్రామ పంచాయతీ రికార్డుతోపాటు చిట్టా దాఖలా రు.10-1-9 (పది రుపాయల ఒక అణా తొమ్మిది పయిసాలు) నగదు అప్పగించారు. సత్తెనపల్లి తాలూకా బోర్డు అధ్యక్షులుగా ఒక పర్యాయం, గుంటూరు జిల్లా బోర్డు సభ్యులుగా రెండు పర్యాయాలు పనిచేసారు.తాలూకా బోర్డు అధ్యక్షులుగా పనిచేసిన కాలంలో 1920 ప్రాంతంలో బాలికల ప్రాథమిక పాఠశాలకు రికగ్నేషన్ పొంది తాలూకా బోర్డు పాఠశాలను స్థాపించారు.1934కు ముందు గ్రామ పంచాయితీ ప్రెసిడెంటుగా పనిచేసారు.
  • రాయంకుల తాతయ్య:వీరి పూర్వీకుల స్వస్థలం గుంటూరు జిల్లా, పూర్వపు మాచర్ల తాలూకా,ప్రస్తుత వెల్దుర్తి మండలం, పట్లవీడు శివారు ఎర్రుపాలెం. ఆ తరువాత రాయంకుల పూర్వీకులు కొందరు ముప్పాళ్ల మండలం పలుదేవర్లపాడు గ్రామం వలసవచ్చారు.వీరి తల్లిదండ్రులు ఆదెమ్మ, బుచ్చయ్య.ఆ గ్రామంలోనే 1869లో జన్మించారు. పొనుగుపాడు జంపని వారసులలో ఒకరైన వంకాయలపాటి వెంకయ్య,మహలక్ష్మమ్మ దంపతుల ఏకైక కుమార్తె బొజ్జమ్మను వివాహమాడి ఈ గ్రామం వచ్చారు.పొనుగుపాడు జంపని వారసులలో ముఖ్యులు. శ్రీకాశీ విశ్వేశ్వరస్వామి ఆలయనిర్మాణ ప్రముఖులు. బావ మరిది వంకాయలపాటి పెద్దయ్యతో కలసి కమిషన్,నీలిమందు ఇతర వ్వాపారాలు చేసారు.గ్రామంలో వచ్చిన చిన్నచిన్న సివిలు.క్రిమినలు తగాదాలు పరిష్కరించేవారు. ఆయన పెద్దగా చదువుకోనప్పటికి విద్య ఆవశ్యకతను గుర్తించి 1922 జూన్ లో “హిందూ ప్రాధమిక పాఠశాల” అనే పేరుతో పాఠశాలను స్ధాపించి, ఆపాఠశాలకు 23.09.1923న ప్రభుత్వ గుర్తింపు పొందారు.నేటికి ఆ పాఠశాల మండల పరిషత్ అజమాయిషీలో అదే పేరుపై కొనసాగుతుంది. ఆ పాఠశాలలో చదివిన విద్యార్థులు నేడు దేశ విదేశాలలో ఉన్నత పదవులనందు ఉన్నారు.
  • తూము శేషయ్య:వీరు గ్రామ పంచాయితీ అధ్యక్షుడుగా సుదీర్ఘకాలం పనిచేసిన మొట్ట మొదటి వ్యక్తి. వంకాయలపాటి పెద్దయ్య గ్రామపంచాయితీ ప్రెసిడెంటుగా పనిచేసిన కాలంలో వైస్ ప్రెసిడెంటుగా పనిచేసారు.ప్రెసిడెంటుగా పనిచేయుచున్న వంకాయలపాటి పెద్దయ్య పదవీ కాలపరిమితి ముగిసినందున ది.21.04.1934న రికార్డుతోపాటు చిట్టా నగదు నిల్వ పది రుపాయల ఒక అణా తొమ్మిది పయిసాలు వీర్కి ఒప్పగించారు.ఆ తరువాత గ్రామ పంచాయితీ ప్రెసిడెంటుగా ఇరువది నాలుగు సంవత్సరాలు (1958-59 వరకు) పనిచేసారు. అంతేగాక ఇప్పటి శ్రీ శారదా గ్రంథాలయం, సొసైటీ అధ్యక్షునిగా, పొనుగుపాడు, చందవరం గ్రామాలకు యాక్టింగ్ మునసబుగా కొంతకాలం పనిచేసారు.గ్రామానికి మొదటసారిగా విద్యుత్ సౌకర్యం కల్పించారు.ఉన్నత పాఠశాల ఏర్పాటుకు,అభివృద్ధికి కృషి చేసారు.
  • రాయంకుల వెంకయ్య. (పంతులుగారు):జననం 1901.తల్లిదండ్రులు తాతయ్య,బొజ్జమ్మ. ప్రాథమికోన్నత పాఠశాల విద్య వరకు చదివారు.ఇతని తండ్రి తాతయ్య స్ధాపించిన హిందూ ప్రాథమిక పాఠశాలలో మేనేజరు కమ్ ప్రధానోపాధ్యాయుడుగా 01.04.1947న చేరారు.గ్రామంలో గ్రంథాలయ ఆవశ్యకతను గుర్తించి స్దాపించుటకు నాంది పలికారు.1922 ఆ ప్రాంతంలో తన సన్నిహితులు పొనుగుపాటి అప్పయ్య (పంతులు) మరి కొంతమందితో కలసి పుస్తకాల సేకరించి “శ్రీవిశ్వేశ్వర పుస్తక భాండాగారం” అనే పేరుతో మొట్టమొదట గ్రామంలో గ్రంథాలయం స్థాపించారు.వెంకయ్య పంతులుగారు పేద విద్యార్థులందరికి విద్య అందజేయాలనే ఉద్దేశంతో బీద విద్యార్థుల శరణాలయాన్ని స్ధాపించి, సమీప గ్రామాల విద్యార్థులను రప్పించి,వారికి ఉచిత భోజన సదుపాయం కల్పించి, వారి స్వంత ప్రాథమిక పాఠశాలలో ఉచితంగా విద్యనభ్యసించుటకు ఉవకాశం కల్పించిన విద్యాభిమాని,విద్యావేత్త.ఆకాలంలో ఉన్నత పాఠశాల విద్య కొరకు నరసరావుపేట,ఇతర దూరప్రాంతాలకు వెళ్లవలసి వచ్చేది.పేద విద్యార్థులకు ఇది సాధ్యపడే విషయంకాదని గ్రహించి గ్రామానికి ఉన్నత పాఠశాల అవసరాన్ని గుర్తించి, గ్రామంలో ఉన్న పెద్దలందరిని సమీకరించి వారిలో అవగాహన కల్పించి,తన స్వంతస్తలం ఉచితంగా ఇచ్చి, విరాళాలు సేకగించి గ్రామస్తుల సహకారంతో ఉన్నత పాఠశాల నిర్మాణానికి నడుంబిగించిన గొప్ప మనిషి.
డాక్టరు నంబూరి దేశయ్య.
  • నంబూరి దేశయ్య:పొనుగుపాడు గ్రామంలో డాక్టరు కోర్సు చదివిన మొదటి వ్యక్తి. 1918 లో జన్మించారు. తల్లిదండ్రులు రామచంద్రయ్య, వెంకటలక్ష్మమ్మ. అప్పట్లో మద్రాసు (చెన్నై) లో డి.యమ్.యస్. (ఇప్పటి యం.బి.బి.యస్.కు సమానమైన వైద్య కోర్సు) లో చేరి పూర్తి చేసారు. ప్రభుత్వ ఆరోగ్య శాఖలో మొదటగా విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో మలేరియా ఆఫీసరుగా “అరకు” ఆరోగ్యకేంద్రంలో చేరారు. అక్కడ నుండి పదోన్నతిపై హెల్తు ఆపీసరుగా నెల్లూరు,తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో పనిచేసారు. చివరగా గుంటూరు జిల్లా రీజనల్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్తుగా  పనిచేసి 1972 లో పదవీ విరమణ పొందారు. వీరి ద్వారా గుర్రం శ్రీరాములు, భార్య సీతామహలక్ష్మి, కొంగర వెంకటనారాయణ,సుంకుల శ్రీరాములు,బత్తుల జగన్నాధం మరి కొంత మంది ఉద్యోగాలు పొందారు. పదవీ విరమణ అనంతరం కొంతకాలం పొనుగుపాడులో నివసించారు. ఆ సమయంలో వీరి కృషితో గ్రామానికి ఆర్.టి.సి. బస్సు ప్రయాణ సౌకర్యం, టెలిఫోను వసతి కల్పించారు.
  • కొరిటాల రామస్వామి:జననం 1910. తల్లిదండ్రులు పేరయ్య, అచ్చమ్మ. రామస్వామి చౌదరి ఇంటి పేరును అందరూ మర్చిపోయారు. ప్రాణ సమానంగా భావించి సాధన చేసిన చిత్రకళ వృత్తి ఆయన ఇంటి పేరును (బొమ్మల రామస్వామి) గా మార్చింది .ఆనవాళ్లు చెబితే చాలు తన చేతులతో సజీవచిత్రాలు గీయగలడు. పేద రైతు కుటుంబంలో జన్మించి పశువులు కాసే స్థితి నుండి ప్రఖ్యాత చిత్రకారుని దశకు చేరుకున్నారు. ఎటువంటి పాఠశాలలో శిక్షణ పొందకుండా చిన్నతనంలోనే చిత్రకళలో నైపుణ్యం సంపాదించి, అదే  తన వృత్తిగా మలచుకున్నారు. గ్రామంలో మొదటగా తన కుమార్తె రేవతి పేరుపై  “రేవతి ఫొటో ష్టూడియో” స్ధాపించారు. సమీప గ్రామమైన సాతులూరులో నివసించే బేతంచర్ల వెంకట్రాయుడు కడప జిల్లా ఒంటిమిట్ట రామాలయం పునరధ్దరణకు పాటుబడిన 'ఆంధ్రా వాల్మీకి' వావికొలను సుబ్బారావు సిమెంటు పోత విగ్రహం తయారు చేయవలసిందిగా ఆయనను కోరారు. కేవలం ఆంధ్రా వాల్మీకి ఆనవాళ్లు మాత్రమే వెంకట్రాయుడు చెప్పారు. అదొక సవాలుగా తీసుకుని వావికొలను విగ్రహం తయారు చేసారు. ఆ తరువాత కొద్ది రోజులకే ఆంధ్ర వాల్మీకి వావికొలను సుబ్బారావు ఆయన శిష్యగణంతో పర్యటనచేస్తూ సాతులూరు గ్రామం వచ్చారు.అది తెలుసుకుని ఆయనను చూడటావికి చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు తిరునాళ్లలా సాతులూరు వచ్చారు. వారంతా వావికొలను వారి మరో రూపంలా కనిపించే విగ్రహ ప్రతిమను చూచి ఆశ్చర్యపోయారు. రామస్వామి చౌదరి చేసారంటే ఎవ్వరూ నమ్మలేదు. మద్రాసులో ప్రత్యేకంగా నిపుణులతో తయారు చేయించి ఉంటారని వాదించారు. చివరకు నిజం తెలుసుకున్నారు.అప్పటికప్పడు బంగారు పతకం, నూతన వస్త్రాలుతో వావికొలను సుబ్బారావు గారి బృందం బొమ్మల రామస్వామిని సత్కరించారు.ఆయన నిరంతర కృషికి గుర్తింపుగా గుంటూరు జిల్లా అసోసియేషన్ వారు 1986 అక్టోబరు 10 న గుంటూరులో ఘనంగా సన్మానించారు. బొమ్మల రామస్వామి చేత మన ఇంట్లో బొమ్మ వేయించకపోతే ఈ సంపద ఎందుకు? నా పెద్దరికం ఎందుకు? అనే స్థితి ఆ రోజుల్లో గ్రామాల్లో ఉండేది..... ఇలాంటి సంఘటనలు ఎన్నో... ఎన్నెన్నో....ఇప్పటికీ ఆయన తీసిన ఫొటోలు గుంటూరు జిల్లాలోని చాలా గ్రామాల్లో చాలా కుటుంబాలలో ఉండుట విశేషం.అంతేగాదు రామస్వామి చౌదరి మంచి హర్మోనిష్ఠు, సంగీత, నాటక కళాకారుడు.  గ్రామంలో కొరిటాల మస్తానురావు చౌదరి, తూము వెంకటేశ్వర్లు, తదితరులు స్ధాపించిన శారదా నాట్య మండలి నాటక సమాజంలో సభ్యులు. పల్నాటియుద్ధం, వివాహవిఛ్చేధం, రంగూన్ రౌడి ఇంకా పలు నాటకాలలో నటించారు.ఆ నాటకాలకు ఆర్టు డైరక్టరుగా పనిచేసారు.ఆయన వృత్తిలో ఎదురైన అనుభవాలు, సంఘటనలు గురించి 07.10.1990 న ఆంధ్రభూమికి స్వయంగా ఆయన తెలిపిన వివరాలు గురించి సుదీర్ఘ వ్యాసం ప్రచురించారు. రామస్వామి చౌదరి 16.08.1992న తన అభిమానులను, పొనుగుపాడు ప్రజలను దుంఖ సముద్రంలో ముంచి ఈ లోకాన్ని శాశ్వతంగా వీడిపోయారు.
  • కొరిటాల మస్తానురావు:పొనుగుపాడు గ్రామంలో 1911 లో జన్మించారు. తల్లిదండ్రులు శేషయ్య, ఆదెమ్మ. మస్తానురావు చౌదరి విద్యను, సమాజాన్ని గౌరవించే వ్యక్తులలో ఒకరు. 1931 ఆ ప్రాంతంలో ప్రజలు అజ్ఞానంలో ఉండటానికి కారణం సరియైన లోకజ్ఞానం లేకపోవటమేనని  గ్రహించి, గ్రామంలో మరుగున పడియున్న శ్రీవిశ్వేశ్వర పుస్తక భాండాగారాన్ని గ్రంథాలయ ఉద్యమంలో భాగంగా, వీరి నేత్రత్వంలో పొనుగుపాటి వెంకట నాగ భూషణం (ప్రీడం ఫైటరు), పొనుగుపాటి జానికి రామయ్య, మరి కొంతమందిని కూడగట్టుకొని మరికొన్ని పుస్తకాలు సేకరించి “శ్రీశారదా గ్రంధాలయం” అనే పేరుతో పున:ప్రారంభించారు. కొంతకాలం గ్రంథాలయంనకు వసతి లేనందున వారి స్వగృహంలో ఉచితంగా వసతి కల్పించి స్యయంగా మస్తానురావు చౌదరి,భార్య నారాయణమ్మ నిర్వహించారు. అంతే కాదు, గ్రంథాలయంనకు అనుబంధంగా శ్రీ శారదా నాట్య మండలిని స్థాపించారు. జనపథంలో సంస్కారభావాల్ని, సామాజిక చైతన్యాన్ని కలుగజేసే ఉత్తమ సాధనాలుగా నాటకాన్ని నమ్మి,  ఆరోజుల్లోనే వితంతు వివాహాలు, కులాంతర, మతాంతర వివాహాల సంస్కరణల నేపథ్యంలో నాటకాలు వ్రాయించి ప్రదర్శించారు. ఆ నాటకాల ప్రదర్శనకు అప్పటి సామాజిక చైతన్యానికి అంకితమైన అయ్యంకి వెంకట రమణయ్య, పాతూరి నాగ భూషణం, గుర్రం జాషువా, ఈడ్పుగంటి వెంకట రత్నమాంబ వంటి ఎందరో ప్రముఖులను రావించారు.ఆయన మిత్ర బృందం స్థాపించిన శారదా నాట్య మండలికి  మస్తానురావు చౌదరి డైరక్టరుగా కొనసాగారు. ఆయన డైరక్షన్ లో సంఘసంస్కరణ, పాదుకా పట్టాబిషేకం, వివాహవిచ్చేదం, కనకతార, రంగూన్ రౌడి, పల్నాటియుద్ధం ఇంకా పలు నాటికలు ప్రదర్శించారు. పల్నాటియద్దంలో నరసింగరాజు పాత్రను పోషించారు. 1930-1940 మధ్య కాలంలో గ్రామఫోను, మోటారు సైకిలు వంటి అప్పటి ఆధునిక పరికరములు గ్రామ ప్రజలకు పరిచయం చేసారు. చాలాకాలం ఎడ్ల పందాలు నిర్వహించారు.
  • మర్రి విశ్వేశ్వరరావు:జననం 18.010.1917.తల్లిదండ్రులు రామలింగం, రత్తమ్మ. వీరి వృత్తి వ్వవసాయం అయినప్పటికి ఇరువది ఐదువ సంవత్సరం నుండే వ్యాపారరంగంలో అడుగుపెట్టారు. ఆ కాలంలో గోదావరి జిల్లాలలోని లంక గ్రామాలలో పుగాకు కొనుగోలు చేసి నేటి చెన్నై రాష్ట్రంలోని పుగాకు వ్యాపారస్తులకు ఎగుమతి చేసేవారు.పుగాకు వ్యాపారం మందగించిన తరువాత మిర్చి కమిషన్ వ్యాపారం, ఆతరువాత ప్రత్తి పంట బాగా పండేరోజులలో ఇదే గ్రామానికి చెందిన వంకాయలపాటి బలరామకృష్ణయ్య తదితరులతో కాటన్ జిన్నిగ్, ఆయిల్ మిల్లును గుంటూరు సమీపంలోని నల్లపాడులో నిర్మించి కొంతకాలం నడిపారు. బ్రిటీషు పరిపాలనలో నరసరావుపేట సబ్ కోర్టులో న్యాయ నిర్ణేతలసంఘం సభ్యులు (Assessor – An Assistant to a judge or magistrate usually selected for special knowledge in a particular area) గా కొంతకాలం పనిచేసారు.
గోపాలకృష్ణయ్య.
  • మర్రి గోపాలకృష్ణయ్య:జననం 1919.తల్లిదండ్రులు రామలింగయ్య, రత్తమ్మ. ఎనిమిదవ తరగతి వరకు చదివారు. విశ్వేశ్వరరావుకు స్వంత (చిన్న) సోదరుడు. అన్నతమ్ములిద్దరు చాలాకాలం  ఉమ్మడి కుటుంబంగా కొనసాగారు. ఉమ్మడి కుటుంబంలో అన్న విశ్వేశ్వరరావు వ్యాపారలావాదేవీలు చూస్తే,వీరు వ్యవసాయ నిర్వహణ చూసేవారు. ఆ కాలంలో వీరి వ్యవసాయ పనుల వలన సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలుకు ఉపాధి లభించింది.గ్రామంలోని వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దుటకు గుంటూరులో వయోజన విద్యా వాలంటీరు ట్రైనింగు పొంది విద్యా వాలంటీరుగా 20/ల వేతనంపై పనిచేసారు.గ్రామ ప్రజలు వివాహాది శుభకార్యలు జరుపుకొనుటకు శ్రీకాశీవిశ్వేశ్వరస్వామి ఆలయంలో స్వంతంగా కళ్యాణ మండపం నిర్మించి 24.11.1999న ఆలయంనకు కైంకర్యం చేసారు.
వెంకటేశ్వరరావు. మాజీ ప్రెసిడెంటు,
  • గుర్రం వెంకటేశ్వరరావు:1926 సంవత్సరంలో జన్మించారు. తల్లిదండ్రులు రామచంద్రయ్య, రత్తమ్మ. ఆకాలంలోనే బి.కామ్.పట్టా పొందారు. వ్యవసాయం మీద ఆపేక్షతో ఆ రోజుల్లో ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగం పొందలేదు. గ్రామంలోని ఇతర పెద్దలతో కలసి ఉన్నత పాఠశాల, గ్రంథాలయం ఏర్పాటుకు కృషి చేసారు. గ్రామ పంచాయితీ అధ్యక్షులుగా 1060-61 నుండి 1964-65 వరకు పనిచేసారు.ఆ రోజుల్లో కొన్ని అగ్ర కులాల చెందిన వారు హరిజనులను హిందూ దేవాలయంలలోనికి, ప్రధాన గ్రామం లోనికి రానిచ్చేవారు కాదు.ఈయన 1970 ఆప్రాంతంలో గ్రామంలోని శ్రీఆంజనేయ స్వామి దేవాలయంలోకి హరిజనులను మొదటసారిగా ప్రవేశించుటకు ప్రోత్సహించారు.అంతేగాదు తన స్వగృహంలో వారిని ప్రవేశింపచేసి తన సేవకులుగా ఇంటిపనికి ఉపయోగించుకొని కొంత మందికి ఉపాధి కల్పించారు. గుంటూరు జిల్లా, ప్రత్తిపాడు మండలం, తుమ్మలపాలెం గ్రామానికి చెందిన చెరుకూరి తిరుపతయ్య, ఆదెమ్మ దంపతులకు జన్మించిన భాగ్యలక్ష్మికి యుక్త వయస్సులోనే భర్త చనిపోయారు. బంధువులతో, తన సన్నిహితులతో త్రీవ్రమైన వ్యతిరేకత ఎదురైనప్పటికి అందరిని కాదని వితంతువును వివాహమాడారు.ఆ వివాహం వలన ఆయన గ్రామంలో సామాజిక సంస్కర్తగా గుర్తింపు పొందారు. వివాహం తరువాత భార్య భాగ్యలక్ష్మిని తన ప్రోద్బలంతో గ్రాడ్యేషన్ పూర్తి చేయించారు.వీరి పెద్ద కుమారుడు పెద్దబాబు,మనవడు రామచంద్రరావు (పెద్దబాబు కుమారుడు) ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అడ్వకేట్లుగా పనిచేస్తున్నారు. వెంకటేశ్వరరావు గారు 1987 లో స్వర్గస్తులయ్యారు.
  • పాతూరి రామస్వామి. (భజన పంతులు):రామస్వామి 1914 లో పొనుగుపాడు గ్రామంలో జన్మించారు. తండ్రి కామయ్య, తల్లి మహాలక్ష్మమ్మ.రామస్వామి యుక్త వయసులోనే భజన పంతులుగా పేరొందారు. ఆ కాలంలో గ్రామంలోని యువకులతో ‘బృందావన భజన సమాజం" నొకదానిని స్థాపించారు. పూర్వము శుభకార్యలకు, పండగలకు, చనిపోయిన పెద్దనారి సంవత్సరీకాలకు భజన కార్యక్రమాలు స్వంతంగా పెట్టించే వారు. తన భజన సమాజంతో దేవుని విగ్రహం కలిగిన నాలుగు అడుగుల ఇత్తడి స్టాండుపై అఖండ దీపం ప్రమిదతో గ్రామంలోని ప్రధాన కూడలి వద్ద నుండి ఊరేగింపుగా బయలుదేరి, కోరినవారు ఇండ్ల వద్ద అఖండ దీపం స్తంభం ఉంచి దాని చుట్టు అందరూ వలయంగా ఏర్పడి భజన కార్యక్రమం నిర్వహించే వారు. రకరకాల భక్తి సంకీర్తనలు పాడుతూ పలువిన్యాసలతో ప్రేక్షకులను పరవశింప చేసేవారు. వృద్దాప్యంలో కూడా ఆయన యువకునిలాగా విన్యాసాలు చేసేవారు.అంతేగాదు రామస్వామి పెద్దగా చదువుకోనప్పటికి రామాయణం, మహాభారతం ఔపాసన పట్టారు. ఈయన చేత పండగలు పర్వదినాల సమయాలలో భక్తులు రామాయణ మహాభారతాలు గురించి చెప్పించుకునేవారు. జీవిత కాలం అంత భజనం కార్యక్రమాలకే అంకితమిచ్చారు. రామస్వామి కేవలం భజన పంతులే కాదు. మంచి ఆర్టిష్టు హార్మోనియం వావించగలరు. నాటకాలంటే మహా ఇష్టం. గ్రామంలో అప్పటి ఆయన సహచరులు బొమ్మల రామస్వామి, కొరిటాల మస్తానురావు చౌదరి, తూము వెంకటేశ్వర్లు (పంతులుగారు), రాయంకుల తాతయ్య, తూమాటి నాగభూషణం మొదలగు వారితో పాదుకా పట్టాభిషేకం, కనకతార, రంగూన్ రౌడి, వివాహవిచ్చేదన, పల్నాటియుద్ధం మొదలగు నాటికలు, నాటకాలలో నటించారు. పాదుకా పట్టాభిషేకంలో ధశరథుడు, భరతుడు పాత్రలు, పల్నాటి యుద్ధంలో బాలచంద్రుడు పాత్ర ఆయనకు మరింత ఇష్టం.గ్రామంలోని శ్రీ వీరబ్రహ్మేంధ్రస్వామి వారి ఆలయంలో 1974 వ సంవత్సరం ఉగాది పండగ సందర్భంగా జరిగిన భజన కార్యక్రమంలో గుండెపోటు వచ్చి ఈ లోకాన్ని శాశ్వతంగా వీడిపోయారు. ఆ రోజున గ్రామంలో దుంఖించనివారు లేరు.
  • కొరిటాల శేషగిరిరావు:

ప్రధాన వ్యాసం:కొరిటాల శేషగిరిరావు:జననం 12.03.1938. తల్లిదండ్రులు మస్తానురావు చౌదరి, నారాయణమ్మ దంపతులు. పూర్వీకుల వృత్తి వ్యవసాయం.గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెం గ్రామానికి చెందిన తేళ్ళ నాయుడమ్మ, శ్యామలమ్మ దంపతుల కుమార్తె ఇందిరాదేవిని 21.06.1957న వివాహమాడారు.శేషగిరిరావు పొనుగుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో యస్.యస్.యల్.సి. మొదటి సంవత్సరం బ్యాచ్ పాఠశాల పష్ట్ సాధించారు. నరసరావుపేట శ్రీ సుబ్బరాయ, నారాయణ కళాశాలలో ఇంటర్ మీడియట్ చదివారు. ఆంధ్ర యూనివర్శటి వాల్తేరులో యం.ఎ. కోర్సు చేసి, యం.యస్.సి చేసారు.

  • గుంటుపల్లి జగన్నాధం:

ప్రధాన వ్యాసం:గుంటుపల్లి జగన్నాధం:జగన్నాథం పొనుగుపాడు  గ్రామంలో 20.08.1946 న వ్యవసాయ కుటుంబానికి చెందిన గుంటుపల్లి వెంకటేశ్వర్లు, వెంకటసుబ్బమ్మ దంపతులకు జన్మించారు. జగన్నాధం గుంటూరు ఎ.సి కాలేజిలో పి.యు.సి.చదివిన తరువాత ఐ.ఐ.టి. బెనారస్, హిందూ విశ్వవిద్యాలయం  నుంచి (వారణాసి, ఉత్తరప్రదేశ్) బి.యస్.సి. (మెటలర్జికల్ ఇంజనీరింగు) పట్టా (1969) పొందారు. 1980 లో ముంబాయి నుంచి యం.ఐ.ఐ.ఐ.ఇ. పట్టాను పొందారు.

  • పాతూరి సీతారామాంజనేయులు:పొనుగుపాడు గ్రామంలో08.05.1947 న జన్మించారు.ప్రాథమిక విద్యాభ్యాసం ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు పొనుగుపాడు  హిందూ ప్రాథమిక పాఠశాలలో, ఉన్నత పాఠశాల విద్య  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివారు. (1953-1964).పెద మేనమామ వంకాయలపాటి (చిన) లింగయ్య, వెంకటలక్ష్మమ్మ దంపతుల ద్వితీయ కుమార్తె మాధవకుమారిని 13.06.1966 న వివాహమాడారు. నరసరావుపేట శ్రీ సుబ్బరాయ, నారాయణ కళాశాలలో పి.యు.సి. ఆతర్వాత బి.యస్.సి. చదివారు. (1964-1969). గుంటూరు పి.జి. సెంటరులో యం.యస్.సి., చేసారు. (1969 -1971). చివరగా ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయంలో పి.యచ్.డి., చేసారు. (1971-1978).అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శారదా ముఖర్జీ చేతుల మీదుగా పి.యచ్.డి. పట్టా పొందారు. గ్రామంలో మొదటి డాక్టరేట్ పట్టా పొందిన కొరిటాల పాండురంగారావు తరువాత  డాక్టరేటు పట్టా పొందిన రెండవ వ్యక్తి.మొదటగా  1978 లో జె.కె.సి కాలేజిలో  డిమానుస్ట్రేటరుగా చేరి 1979 వరకు పనిచేసారు. అటు పిమ్మట ఆక్వా కల్చర్, ప్రభుత్వ శాఖ, కావలిలో ఇ.ఒ. (ఫిషరీస్) గా 1979 లో కొద్ది కాలం ప్రభుత్వ ఉద్యోగం చేసారు. తిరిగి మరలా  తను చదివిన నాగార్జున విశ్వ విద్యాలయంలో అసిస్టెంట్  ప్రొఫెసరుగా 31.10.1979 న చేరారు. పదోన్నతులు పొంది 2002 నవంబరు వరకు రీడరుగా, 31.05.2007 వరకు ప్రొఫెసరుగా పనిచేసి పదవీ విరమణ పొందారు. సీతారామాంజనేయులు పదవీ కాలంలో కొంత కాలం పాఠ్య నిర్ణాయక మండలి అధ్యక్షులుగా పనిచేసా రు. ఆక్వాకల్చర్ హెడ్ఆఫ్ ది డిపార్టుమెంట్ గా వ్యవహరించారు.పదవీ విరమణ కార్యక్రమంలో నాగార్జున విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ బాలమోహన్ దాస్ గారిచే సన్మానం పొందారు, సీతారామాంజనేయులు, మాధవకుమారి దంపతుల సంతానం ముగ్గురు కుమారులు. శ్రీమన్నారాయణ, శ్రీధర్, శ్రీరామ్.శ్రీమన్నారాయణ, శ్రీరామ్ వైద్య వృత్తిలో, శ్రీధర్ ఇంజనీరుగా స్థిరపడ్డారు. శ్రీరామ్ వృత్తి రీత్యా యు.కె.లో ఉంటున్నారు.
  • రాయంకుల శేషతల్పశాయి:

పొనుగుపాడు గ్రామంలో ది.10.11.1956 న రాయంకుల తాతయ్య,లీలావతి దంపతులకు జన్మించారు.ఉన్నత పాఠశాల విద్య పొనుగుపాడులో  తొమ్మిదవ తరగతి వరకు, పదవ తరగతి వారి మేనమామ వంకాయలపాటి సాబశివరావు ప్రధానోపాధ్యాయుడుగా పనిచేసిన ప్రకాశం జిల్లా, దూపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివారు. ఇంటర్మీడియట్ నరసరావుపేట యస్.యస్.యన్.కళాశాలలో చదివారు. వరంగల్ రీజనల్ ఇంజనీరింగు కాలేజిలో బి.టెక్. (ఎలెక్ట్రికల్ ఇంజనీరింగు) పూర్తిచేసి (1973-1977) గ్రాడ్యేయేట్ పట్టా పొందారు.

గ్రామ విశేషాలు.

[మార్చు]
  • ది.06.07.1951ల జ్ఞానోదయ బోర్డు సెకండరీ పాఠశాలగా ఒకే పర్యాయం 1వ ఫారం నుండి 4వ ఫారం వరకు మంజూరు చేయబడింది.మొదటగా హైయ్యర్ ఎలిమెంటరీ పాఠశాల నడపబడుచున్న సత్రంలో ఆనాటి సత్తెనపల్లి శాసనసభ్యులైన మేడూరి నాగేశ్వరరావు గారిచే ప్రారంభించబడింది.
  • పాఠశాల భవన నిర్మాణంనకు వంకాయలపాటి రత్తయ్య గారిచే భూమి పూజ నిర్వహించబడి శంకుస్థాపన గావించబడింది.
  • భవన నిర్మాణ రాయంకుల కోటేశ్వరరావు స్పాన్సర్ గా ఉండి చెరుకూరి వెంకయ్య, గద్దె పేరయ్య, కామినేని నరసయ్య గార్ల సహకారంతో ప్రారంభించబడింది.
  • ప్రస్తుత ఉన్నత పాఠశాల భవనం 1958లో అప్పటి స్థానిక స్వపరిపాలన శాఖామాత్యులైన కాసు బ్రహ్మానందరెడ్డి గారిచే  ప్రారంభించబడింది.
  • జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్వర్ణోత్సవం ది.19.05.2002న  అప్పటి ప్రధానోపాధ్యాయులైన ఎ.ఢి.ప్రభుదాస్ బి.ఎ.బి.ఇడి గారి ఆధ్వర్యంలో జరిగింది.
  • స్వర్ణోత్సవ కమిటీ అధ్యక్షులుగా పాఠశాల పూర్వ విద్యార్థి అల్లం జగపతిబాబు వ్యవహరించారు.
  • కంప్యూటరు భవనాన్ని స్వర్ణోత్సవాల సందర్భంగా ది.19.05.2002న అప్పటి రాజ్యసభ సభ్యులు యఢ్లపాటి వెంకటరావు ప్రాంరంభించారు. కంప్యూటరు ల్యాబ్ ను అప్పటి శాసనసభ్యులు వై.వి.ఆంజనేయులు ప్రారంభించారు.
  • కంప్యూటరు భవన నిర్మాణం వంకాయలపాటి బలరామకృష్ణయ్య ఆధ్వర్యంలో నిర్మించబడింది.
  • ఈ ఉన్నత పాఠశాల యస్.యస్.యల్.సి మొదటి బ్యాచ్ ఉత్తీర్ణులలో కొరిటాల శేషగిరిరావు (కిస్ చారిటబుల్ ట్రష్టు వ్యవస్థాపకుడు) ప్రథమ స్థానం సాధించిన మొదటి పూర్వ విద్యార్థి.
  • 1951లో నూతనంగా మంజూరైన తపాలా కార్యాలయం మొదటి పోష్టుమాష్టరుగా పొనుగుపాటి లక్ష్మీకాంతారావు నెలకు 20/- ల వేతనంపై నియమించబడ్డారు

గణాంకాలు

[మార్చు]

1881 - 1901 వరకు జనాబా

[మార్చు]

గుంటూరు జిల్లా, సత్తెనపల్లి తాలూకా (పూర్వం), నెం.127, పొణుకుపాడు గ్రామ రీ శెటిల్ మెంటు పైసలాతి రిజిష్టరు (1906) పేజి.నెం.2 ప్రకారం 1881 నుండి 1901 వరకు ఈ దిగువ వివరింప బడిన ప్రకారం గణాంక లెక్కలు ఉన్నాయి.

జనాభా లెక్కల సంవత్సరం మొత్తం గృహాలు మొత్తం జనాభా అందులో పురుషులు అందులో స్త్రీలు హిందువులు మహమ్మదీయులు ఇతర కులంలు వ్వయసాయ దారులు వ్యవసాయ కూలీలు వ్యవసాయ కూలీలు  కానివారు వ్యాపా

రస్తులు

కళాకారులు

చేనేత ఇతరులు

ఇతరులు
1881 221 1282 640 642 1039 218 25 - - - - --            - -
1891 274 1535 760 775 1229 231 75 972 102 180 48 111          35 87
1901 287 1615 781 834 1206 226 181 756 149 - - 18            - 692

1961 - 2011 వరకు జనాభా

[మార్చు]

సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం కోరగా డైరక్టరేటు ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్,ఆంధ్రప్రదేశ్, హైదరాబాదు వారు లేఖ సంఖ్య.2216/ఆర్.టి.ఐ-సూపరింటెండెంట్-డేటా/2007,తేది.10.07.2014 ప్రకారం 1961 నుండి 2011 వరకు ఈ దిగువ వివరింపబడిన ప్రకారం గణాంక లెక్కలు ఇలా ఉన్నాయి.

జనాభా లెక్కల సంవత్సరం మొత్తం గృహాలు మొత్తం జనాభా అందులో పురుషులు అందులో స్త్రీలు అక్షరాస్యులు

పు.లు   స్త్రీలు

నిరక్షరాస్యులు

పు.లు   స్త్రీలు

వ్యవసాయదారులు

పు.లు     స్త్రీలు.

వ్యవసాయ కూలీల

పు.లు   స్త్రీలు

షె.కు.

జనాభా

షె.తె.

జనాభా

1961 532 2036 1158 1148 364     161 794    987   366       172      95      104 133 42
1971 645 3088 1591 1497 600     268 991    1229   334       121     475     464 178 81
1981 725 3404 1737 1667 725     300 1012   1367   423       140     452     486 522 96
1991 922 4068 2074 1994 828      443 1246   1551   383       238     716      836 890 74
2001 1214 4209 2145 2064 1258     859 887    1205   328       208     631      730 1471 113
2011 1217 4356 2213 2143 1383   1059 830    1084   300       155     794      956 1678 116

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-01-17. Retrieved 2017-10-06.

వెలుపలి లంకెలు

[మార్చు]