శ్రీలాల్ శుక్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీలాల్ శుక్లా
జననండిసెంబరు 31 1925
మరణంఅక్టోబరు 28 2011
వృత్తిప్రముఖ హిందీ రచయిత.
ప్రసిద్ధిప్రముఖ హిందీ రచయిత.
మతంహిందు.

శ్రీలాల్ శుక్లా (డిసెంబరు 31 1925 - అక్టోబరు 28 2011[1]) ప్రముఖ హిందీ రచయిత. ఈయన హిందీ భాషలో వ్యంగ్య రచయితగా ప్రసిద్ధి పొందారు. ఉత్తరప్రదేశ్ ప్రావిన్స్ (బ్రిటీష్ ఇండియాలో) ప్రొవిన్షియల్ సివిల్ సర్వీసెస్ (పి.సి.ఎస్.) అధికారిగా పనిచేశారు. స్వాతంత్ర్యానంతరం ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ లో భాగమయ్యారు. ఆయన 25 పైగా పుస్తకాలు [2] రచించారు. ఆయన రచనలలో మకాన్ (ఆవాసం / ఇల్లు), సూనీ ఘాట్ కా సూరజ్ (సూనీ ఘాట్ సూర్యుడు), పెహ్లా పడావ్ (తొలి మజిలీ లేదా మొదటి అడుగు), బిస్రాంపూర్ కా సంత్ (బిస్రాంపూర్ సాధువు) ముఖ్యమైన నవలలు.

స్వాతంత్ర్యానంతర భారతదేశంలో దిగజారుతున్న నైతిక విలువలకు సంబంధించిన కథాంశాలను నవలలుగా మలిచారు. ఆయన రచనలు భారతీయ గ్రామీణ, పట్టణ జీవితాల్లోని లోటుపాట్లను వ్యంగ్యంగా ఎత్తిచూపారు. ఆయన అత్యుత్తమ రచన రాగ్ దర్బారీ నవల ఆంగ్లం, తెలుగు భాషలతో సహా 15 భారతీయ భాషల్లోకి అనువాదమైంది. ఆ నవలను ఆధారంగా చేసుకున్న టీవీ ధారావాహిక 1980ల్లో దూరదర్శన్ కొన్ని నెలల పాటు ప్రదర్శించింది. ఈయన ఆద్మీ కా జహర్ (మనిషి యొక్క విషం) అనే డిటెక్టివ్ నవల వ్రాసారని, అది హిందుస్తాన్ వారపత్రికలో ధారావాహికగా ప్రచురించబడిందన్న విషయం చాలా కొద్దిమందికే తెలుసు.

వ్యక్తిగత ప్రస్థానం[మార్చు]

శ్రీలాల్ శుక్లా 1925లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో జిల్లా అత్రౌలిలో జన్మించాడు. 1947లో అలహాబాదు విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడై, 1949లో ప్రొవిన్సియల్ సివిల్ సర్వీసెస్ లో చేరి ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. సివిల్ సర్వీసు ఉద్యోగిగా ఈయనకు ప్రభుత్వం యొక్క పనిరీతు, సామాన్య ప్రజల జీవితాలపై చక్కని అవగాహన ఏర్పడింది. ఈ అనుభవాలే తన వ్యంగ్య రచనలకు ఎంతగానో తోడ్పడ్డాయి.[3] శుక్లా సాహితీ వ్యాసాంగం 1954లో ప్ర్రారంభమై హిందీ సాహిత్య ప్రపంచంలో ఒక గొప్ప సాహిత్య కృషికి బీజం వేసింది. ఈయన తొలి నవల సూనీ ఘాటీ కా సూరజ్ 1957లో ప్రచురించబడింది. తొలి వ్యంగ్య రచన అంగద్ కా పావ్ 1958లో ప్రచురితమైంది. స్వాతంత్ర్యానంతర భారతదేశపు గ్రామీణ జీవితంలో దిగజారుతున్న నైతిక విలువలను పొరలు పొరలుగా ఎత్తి చూపుతూ ఈయన వ్రాసిన నవల రాగ్ దర్బారీ (1968) కి గాను 1970లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు. ఈ నవల ఆధారంగా దూరదర్శన్‌లో ఒక ధారావాహిక కూడా ప్రదర్శించబడింది. 1983లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ నుంచి పదవీ విరమణ పొంది, పూర్తి సమయాన్ని సాహిత్యసేవకే కేటాయించాడు.

 • 1979-80 - భారతేందు నాట్య అకాడమీ (ఉత్తర ప్రదేశ్) కు డైరెక్టర్ గా పనిచేశారు
 • 1981 - బెల్ గ్రేడ్లో జరిగిన అంతర్జాతీయ రచయితల సమావేశానికి భారతీయ ప్రతినిధిగా వెళ్ళారు
 • 1982 నుండి 86 వరకు సాహిత్య అకాడమీ సలహా సంఘం సభ్యునిగా పనిచేశారు

పురస్కారాలు[మార్చు]

 • 1969లో రాగ్ దర్బారీ నవలా రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
 • 1978 - మకాన్ నవలకు మధ్యప్రదేశ్ హిందీ సాహిత్య పరిషద్ పురస్కారం పొందారు
 • 1987-90 - ఐ.సి.సి.ఆర్., భారత ప్రభుత్వం ద్వారా ఎమెరిటస్ ఫెలోషిప్ పొందారు
 • 1988 - ఉత్తర ప్రదేశ్ హిందీ సంస్థాన్ నుంచి సాహిత్య భూషణ్ పురస్కారం పొందారు
 • 1991 - కురుక్షేత్ర విశ్వవిద్యాలయం ద్వారా గోయెల్ సాహిత్య పురస్కారం పొందారు
 • 1994 - ఉత్తర ప్రదేశ్ హిందీ సంస్థాన్ నుంచి లోహియా సమ్మాన్ పొందారు
 • 1996 - మధ్యప్రదేశ్ ప్రభుత్వంచే శారద్ జోషి సమ్మాన్ పొందారు
 • 1997 - మధ్యప్రదేశ్ ప్రభుత్వంచే మైథిలీ శరణ్ గుప్త సమ్మాన్ పొందారు
 • 1999 - బిర్లా పౌండేషన్ వారిచే వ్యాస సమ్మానం పొందారు
 • 1999లో బిశ్రాంపూర్ కా సంత్ నవల రచనకు వ్యాస్ సమ్మాన్[2][4]
 • 2005 - ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంచే యష్ భారతీ సమ్మాన్ పొందారు
 • 2008 - భారత ప్రభుత్వంచే పద్మ భూషన్ పురస్కారం పొందారు.
 • 2011 - 2009వ సంవత్సరానికి గానూ జ్ఞానపీఠ పురస్కారం పొందారు.
 • 2008లో సాహిత్యరంగంలో చేసిన కృషికి గాను భారత రాష్ట్రపతి చేతులమీదుగా పద్మభూషణ్ పురస్కారం[5]
 • 2009లో ఆయన సాహిత్య కృషికి జ్ఞానపీఠ్ పురస్కారం[6]

ఇవే కాక ఈయన అనేక సాహితీ సదస్సులలో పాల్గొనటానికి, అవార్డులను అందుకోవటానికి యుగోస్లావియా, జర్మనీ, ఇంగ్లాండు, పోలాండు, సూరీనాం తదితర దేశాలు పర్యటించారు. భారత ప్రభుత్వం చైనా పర్యటనకు పంపిన రచయితల బృందానికి శ్రీలాల్ శుక్లా అధ్యక్షత వహించాడు.

రచనలు[మార్చు]

నవలలు[మార్చు]

 • సూనీ ఘాట్ కా సూరజ్ - 1957
 • అగ్యాత్‌వాస్ (అజ్ఞాతవాసం) - 1962
 • రాగ్ దర్బారీ - 1968 - హిందీ మూలం; 1993లో అదేపేరుతో ఒక ఆంగ్ల అనువాదాన్ని పెంగ్విన్ బుక్స్ వారు ప్రచురించారు. నేషనల్ బుక్ ట్రస్టు వారు 15 భారతీయ భాషలలోకి అనువదించి ప్రచురించారు.
 • ఆద్మీ కా జహర్ (మనిషి యొక్క విషం) - 1972
 • సీమాయేఁ టూట్‌తీ హై (కట్టలు తెంచుకుంటున్నాయి) - 1973
 • మకాన్ (ఇల్లు) - 1976 - హిందీ మూలం. దీని యొక్క బెంగాళీ అనువాదం 1970వ దశకపు చివర్లో ప్రచురితమైంది.
 • పెహ్లా పడావ్ (తొలి మజిలీ లేదా మొదటి అడుగు) - 1987 - హిందీ మూలం; 1993లో పెంగ్విన్ ఇంటర్నేషనల్ వారు ఓపెనింగ్ మూవ్స్ అన్న పేరుతో ఆంగ్లానువాదం ప్రచురించారు.
 • బ్రిస్రంపూర్ కా సంత్ (బిస్రంపూరు యోగి) - 1998
 • బబ్బర్ సింగ ఔర్ ఉస్కే సాథీ (బబ్బర్ సింగ్ మరియు ఆయన సావాసగాళ్ళు) - 1999 - హిందీ మూలం. దీన్ని గబ్బర్ సింగ్ అండ్ హిజ్ ఫ్రెండ్స్ గా అనువదించి న్యూయార్క్ కు చెందిన స్కొలాస్టిక్ ప్రచురణల వారు 2000లో ముద్రించారు.
 • రాగ్ విరాగ్ - 2001

వ్యంగ్య రచనలు[మార్చు]

 • అంగద్ కా పాఁవ్ (అంగదుని పాదం) - 1958
 • యహాఁ సే వహా (ఇక్కడినుండి అక్కడికి) - 1970
 • మేరా శ్రేష్ఠ్ వ్యంగ్య్ రచనాయే (నా శ్రేష్టమైన వ్యంగ్య రచనలు) - 1979
 • ఉమ్రావ్‌నగర్ మే కుఛ్ దిన్ (ఉమ్రావునగర్లో కొన్నిరోజులు) - 1986
 • కుఛ్ జమీన్ మే కుఛ్ హవా మే (కొంత భూమ్మీద కొంత గాలిలో) - 1990
 • ఆవో బైఠ్ లే కుఛ్ దేర్ (రా కొంచెం సేపు కూర్చో) - 1995
 • అగ్లీ శతాబ్దీ కా నగర్ (వచ్చే శతాబ్దపు నగరం) - 1996
 • జహాలత్ కే పచాస్ సాల్ (అజ్ఞానంలో యాభై ఏళ్లు) - 2003
 • ఖబ్రోంకి కి జుగలీ - (కబుర్ల నెమరువేత) 2005

లఘుకథా సంపుటాలు[మార్చు]

 • యే ఘర్ మేరా నహీ (ఈ ఇల్లు నాది కాదు) - 1979
 • సురక్ష తథా అన్య కహానియా (సురక్ష మరియు ఇతర కథలు) - 1991
 • ఇస్ ఉమ్ర్ మే (ఈ వయసులో) - 2003
 • దస్ ప్రతినిథి కహానియా (పది నిదర్శనాత్మక కథలు) - 2003

జ్ఞాపకాలు[మార్చు]

 • మేరే సాక్షాత్కార్ (నా దర్శనాలు) - 2002
 • కుఛ్ సాహిత్య్ చర్చాభీ (కొంచెం సాహిత్యచర్చ కూడా) - 2008

సాహితీవిమర్శనా గ్రంథాలు[మార్చు]

 • భాగవతీ చరణ్ వర్మ - 1989
 • అమృత్‌లాల్ నాగర్ - 1994
 • ఆగ్యేయ: కుఛ్ రంగ్ కుఛ్ రాగ్ (ఆగ్యేయ: కొన్ని రంగులు, కొన్ని రాగాలు) - 1999

సంపాదకుడిగా వెలువరించిన గ్రంథాలు[మార్చు]

 • హిందీ హాస్య, వ్యంగ్య సంకలన్ - 2000

మరణము[మార్చు]

అతను అనారోగ్యంతో చుట్టూ 11.45 గంటలకు 2011 అక్టోబరు 28 న లక్నోలో మరణించాడు. మరణించే ముందు భారతీయ న్యాయ వ్యవస్థపై ఒక నవల వ్రాద్దామనే ఉద్దేశంతో బోలెడంత పరిశోధన చేశాడని ఈయన సోదరుని కుమారుడు, చరిత్రకారుడైన రాజన్ శుక్లా ధ్రువపరచాడు. కానీ క్షీణిస్తున్న ఆరోగ్యం పరిస్థితి కారణంగా ఆ కార్యం పూర్తి కాలేదు.

మూలాలు[మార్చు]

 1. "Noted Hindi Novelist and Satirist Shrilal Shukla Passed Away". Jagranjosh.com. Retrieved 2011-11-28. Cite web requires |website= (help)
 2. 2.0 2.1 "Vyas Samman 1999". మూలం నుండి 2007-03-10 న ఆర్కైవు చేసారు. Retrieved 2014-02-20. Cite web requires |website= (help)
 3. University of Delhi (2005). Indian Literature: An Introduction. Pearson Education India. p. 194. ISBN 9788131705209. Retrieved 12 February 2015.
 4. Vyas Samman 1999 In brief - The Tribune, December 15, 1999.
 5. Padma Bhushan Official listings Govt. of India website.
 6. [1] In brief - The Times Of India, October 19, 2011

బయటి లింకులు[మార్చు]