చార్లెస్ ఫిలిప్ బ్రౌన్
చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ | |
---|---|
![]() తండ్రి, డేవిడ్ బ్రౌన్ పోలికలను బట్టి మైనంపాటి వేంకటసుబ్రహ్మణ్యము చిత్రించిన చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ఊహాచిత్రం[1] | |
జననం | 10 నవంబర్ 1798 కోల్‌కతా |
మరణం | 12 డిసెంబర్ , 1884 వెస్ట్‌బార్న్ గ్రోవ్, లండన్,యునైటెడ్ కింగ్డమ్ |
ఇతర పేర్లు | కాటన్ దొర |
పిల్లలు | లేరు |
తల్లిదండ్రులు |
|
చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ (ఆంగ్లం:Charles Phillip Brown) (నవంబర్ 10, 1798 - డిసెంబర్ 12, 1884) తెలుగు సాహిత్యమునకు విశేష సేవ చేసిన ఆంగ్లేయుడు. తొలి తెలుగు శబ్దకోశమును ఈయనే పరిష్కరించి ప్రచురించాడు. బ్రౌన్ డిక్షనరీని ఇప్పటికి తెలుగులో ప్రామాణికంగా ఉపయోగిస్తారు. తెలుగు జాతికి సేవ చేసిన నలుగురు ఆంగ్లేయులలో ఒకరిగా బ్రౌన్ ను పరిగణిస్తారు. మిగతా ముగ్గురి పేర్లు ఆర్థర్ కాటన్, కాలిన్ మెకెంజి, థామస్ మన్రోలు. ఆంధ్ర భాషోద్ధారకుడు అని గౌరవించబడిన మహానుభావుడు.
వేమన పద్యాలను సేకరించి, ప్రచురించి, ఆంగ్లంలో అనువదించి ఖండాంతర వ్యాప్తి చేశాడు.
విషయ సూచిక
జీవిత విశేషాలు[మార్చు]
సి. పి. బ్రౌన్ 1798 నవంబర్ 10న కలకత్తాలో జన్మించాడు.[2] [3] ఈయన తండ్రి డేవిడ్ బ్రౌన్ పేరొందిన క్రైస్తవ విద్వాంసుడు. తండ్రి మరణించిన తరువాత బ్రౌను కుటుంబం ఇంగ్లండు వెళ్ళిపోయింది. తండ్రి ఇచ్చిన స్ఫూర్తితో సీపీ బ్రౌన్ గ్రీక్, లాటిన్, పారశీ, సంస్కృత భాషల్లో ఆరితేరాడు, బ్రౌను అక్కడే హిందూస్థానీ భాష నేర్చుకున్నాడు. తరువాత 1817 ఆగష్టు 4 న మద్రాసులో ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా మద్రాసులో కోదండరామ పంతులు వద్ద తెలుగులో ప్రాథమిక జ్ఞానాన్ని సంపాదించాడు. వేమన, సుమతి శతకాలతోపాటుగా పల్నాటి యుద్ధం లాంటి చారిత్రిక కావ్యాలను నన్నయ్య, తిక్కన, గౌరన, శ్రీనాథుడు, పోతన, పెద్దన, రామరాజ భూషణుల కృతుల పరిష్కరణ - ప్రచురణల ముద్రింపచేసాడు.
1820 ఆగస్టులో కడపలో డిప్యూటీ కలెక్టరుగా చేరాడు. ఉద్యోగరీత్యా అనేక ప్రాంతాల్లో పనిచేసినపుడు తెలుగులో మాట్లాడడం తప్పనిసరి అయ్యింది. అయితే తెలుగు నేర్చుకోడానికి సులభమైన, శాస్త్రీయమైన విధానం లేకపోవడం వలన, పండితులు తమ తమ స్వంత పద్ధతులలో బోధిస్తూ ఉండేవారు. తెలుగేతరులకు ఈ విధంగా తెలుగు నేర్చుకోవడం ఇబ్బందిగా ఉండేది. భాష నేర్చుకోవడం లోని ఈ ఇబ్బంది, బ్రౌనును తెలుగు భాషా పరిశోధనకై పురికొల్పింది. ప్రాచీన తెలుగు కావ్యాలను వెలికితీసి, ప్రజలందరికీ అర్ధమయ్యేలా పరిష్కరించి, ప్రచురించడం, భాషకు ఓ వ్యాకరణం, ఓ నిఘంటువు, ఏర్పడడానికి దారితీసింది. మచిలీపట్నం, గుంటూరు, చిత్తూరు, తిరునెల్వేలి మొదలైనచోట్ల పనిచేసి, 1826లో మళ్ళీ కడపకు తిరిగి వచ్చి అక్కడే స్థిర నివాసమేర్పరచుకొన్నాడు. అక్కడ ఒక బంగళా కొని, సొంత డబ్బుతో పండితులను నియమించి, అందులో తన సాహితీ వ్యాసంగాన్ని కొనసాగించాడు. అయోధ్యాపురం కృష్ణారెడ్డి అనే ఆయన ఈ వ్యవహారాలను పర్యవేక్షిస్తూ ఉండేవాడు.
కడపలోను, మచిలీపట్నంలోను కూడా పాఠశాలలు పెట్టి ఉచితంగా చదువు చెప్పించాడు. విద్యార్థులకు ఉచితంగా భోజనవసతి కూడా కల్పించాడు. దానధర్మాలు విరివిగా చేసేవాడు. వికలాంగులకు సాయం చేసేవాడు. నెలనెలా పండితులకిచ్చే జీతాలు, దానధర్మాలు, పుస్తక ప్రచురణ ఖర్చుల కారణంగా బ్రౌను ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాడు. అప్పులు కూడా చేసాడు. 1834లో ఉద్యోగం నుండి తొలగించడంతో ఇంగ్లండు వెళ్ళిపోయి, తిరిగి 1837లో కంపెనీలో పర్షియను అనువాదకుడిగా ఇండియా వచ్చాడు. బ్రౌను మానవతావాది. 1832-33లో వచ్చిన గుంటూరు కరువు లేదా డొక్కల కరువు లేదా నందన కరువు సమయంలో ప్రజలకు బ్రౌను చేసిన సేవలు ప్రశంసలందుకున్నాయి. ఆ సమయంలో కరువును కరువుగా కాక కొరతగా రాయాలని అధికారులు చెప్పినా, అలానే పేర్కొనడంతో వారి అసంతృప్తిని ఎదుర్కొన్నాడు. పందొమ్మిదో శతాబ్ది తొలిపాదం చివర్లో తాను తెలుగు సాహిత్యంలో కృషి మొదలుపెట్టేనాటికి నెలకొని వుండిన స్థితిగతులను గురించి బ్రౌన్ స్ఫుటమయిన మాటల్లో అభివర్ణించాడు. ‘అప్పటికి తెలుగు సాహిత్యం కొనప్రాణంతో కొట్టుకులాడుతోంది. 1825 నాటికి ప్రమిదలో దీపం కొడిగట్టిపోతోంది. తెలుగు సాహిత్యం దాదాపు అంతరించిపోతూ ఉండడం నా కళ్లబడింది. నేను 30 ఏళ్లు కృషి చేసి, దాన్ని పునఃప్రతిష్ట చేశాన’న్నాడు బ్రౌన్. నిరలంకారంగా మాట్లాడ్డం బ్రౌన్ శైలి. ఈ మాటల్లో కూడా అందుకే అతిశయోక్తులు కనిపించవు. 1827 నాటికే, బ్రౌన్ ‘ఆంధ్ర గీర్వాణ ఛందము’ అనే పుస్తకం రాసినప్పటికీ, ఆయనకి మంచి గుర్తింపు తెచ్చిన పుస్తకం 1829 నాటి ‘వేమన శతకం’. అప్పటికి బ్రౌన్ అయిదేళ్లుగా వేమన సాహిత్యాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నారు. ఇందులో దాదాపు ఏడొందల పద్యాలకి ఆంగ్లానువాదాలతోపాటు విస్తృతమయిన పదకోశం కూడా సమకూర్చారు. మరో పదేళ్ల తర్వాత, 1164 పద్యాల మేరకి విస్తరింపచేసి, తిరిగి ‘వేమన శతకం’ అచ్చువేశారు.[4] పదవీ విరమణ తరువాత 1854లో లండన్‌లో స్థిరపడి, 1865లో లండన్ యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసరుగా నియమితుడైనాడు. బ్రౌన్ 1884 డిసెంబర్ 12 న తన స్వగృహము 22 కిల్డారే గార్డెన్స్, వెస్ట్‌బార్న్ గ్రోవ్, లండన్[5]లో అవివాహితునిగానే మరణించాడు. ఈయనను కెన్సెల్ గ్రీన్ శ్మశానంలో సమాధి చేశారు.[6]
పండితుల సాన్నిహిత్యం[మార్చు]
తాతాచారి[మార్చు]
బ్రౌన్ కొలువులో తొలి తెలుగు కథకుడు తాతాచారి అనే పేరుతో ప్రాచుర్యం పొందిన నేలటూరు వేంకటాచలం. తాతాచారి చెప్పిన కథలను విన్న సి. పి. బ్రౌన్ అందులోంచి 24 కథలను, దానితోపాటు శ్రీకృష్ణమాచారి చెప్పిన రెండు కథలను కలిపి 1855లో పుస్తకంగా ముద్రించారు. అదే సంవత్సరం వీటి ఆంగ్లానువాదాన్ని 'పాపులర్ తెలుగు టేల్స్' అనే పేరుతో ప్రచురించారు. 1916లో 'తాతాచారి కథలు ' గిడుగు వేంకట అప్పారావు సంపాదకత్వంలో ద్వితీయ ముద్రణ పొందాయి. 1951లో వావిళ్ల వారి తృతీయ ముద్రణ, 1974లో బంగోరె సంపాదకుడిగా చతుర్థ ముద్రణ పొందాయి. నెల్లూరు జిల్లా గూడూరు తాలూకా గునుపాడు గ్రామవాసి. తిరుపతి బాలబాలికలకు వీధి బడుల్లో చదువు చెబుతూ జీవితం సాగించారు. 1848లో చెన్నపట్నం వెళ్లి బ్రౌను కొలువులో ఏడేళ్లు తాను బ్రతికి వుండిన పరియంతరమున్నాడు. పల్నాటి వీర చరితం, వసు చరిత్ర మొదలైన గ్రంథా ల పరిష్కార కృషిలో ఆయనకు సాయపడ్డారు. తాతాచార్యులు కావ్య తర్క వ్యాకరణముల యందు ప్రవీణత గలవాడు. తాతాచారి కథలు నీతి బోధకాలే కాక, ఆనాటి సామాజిక స్థితికి దర్పణంగాను ఉన్నాయి. అందులోని శైలి శుద్ధ వ్యావహారికమైనందు వల్ల పండిత శైలికి దూరంగా ఉందనే బ్రౌన్ ప్రశంసకు యోగ్యమైంది. తాతాచారి కథల్లో- గ్రామశక్తికి పొంగలి పెట్టిన కథ, దేవరమాకుల కథ, వెట్టి వాండ్ల పట్టీ కథ, వాలాజీపేట రాయాజీ మసీదు కథ, హాలింఖాన్ మోసపోయిన కథ, మనిషి సద్గతి దుర్గతి తెలిపే కథ, పొగచుట్ట కథ- లాంటివి ఉన్నాయి.[7]
ఏనుగుల వీరస్వామయ్య[మార్చు]
సి.పి.బ్రౌన్‌కు తెలుగులో తొలి యాత్రాచరిత్రకారుడు, పండితుడు ఏనుగుల వీరాస్వామయ్యతో సాన్నిహిత్యం ఉండేది. వీరాస్వామయ్యకు, బ్రౌన్‌కు నడుమ తరచు ఉత్తరప్రత్యుత్తరాల్లో వారి అభిరుచియైన సారస్వత సంరక్షణలో జరిగిన ప్రగతి, చేసిన పనులు వంటివి పంచుకుంటూండేవారు. వీరాస్వామయ్య బ్రౌన్‌కు రాసిన లేఖలో తాను సంపాదించిన అరుదైన స్కాందం అనే గ్రంథమూ, దానికి గల తెలుగు అనువాదం గురించిన వివరాలు తెలిపి, వీటిని ప్రచురించగలరేమో పరిశీలించమన్నారు. తాను వ్రాసిన అపురూపమైన యాత్రాచరిత్ర కాశీయాత్ర చరిత్రను ప్రచురించగలరేమో పరిశీలించవలసిందిగా బ్రౌన్‌ను కోరారు.[8]
తెలుగు భాషకు చేసిన సేవ[మార్చు]
- వేమన పద్యాలను వెలికితీసి ప్రచురించాడు. 1829లో 693 పద్యాలు, 1839లో 1164 పద్యాలు ప్రచురించాడు.
- 1841లో "నలచరిత్ర"ను ప్రచురించాడు.
- "ఆంధ్రమహాభారతము", "శ్రీమద్భాగవతము" లను ప్రచురించాడు.
- తెలుగు నేర్చుకునే ఆంగ్లేయుల కొరకు వాచకాలు, వ్యాకరణ గ్రంథాలు రాసాడు. 1840లో వ్యాకరణాన్ని ప్రచురించాడు.
- లండన్‌లోని "ఇండియాహౌస్ లైబ్రరీ"లో పడి ఉన్న 2106 దక్షిణభారత భాషల గ్రంథాలను మద్రాసు తెప్పించాడు.
- "హరిశ్చంద్రుని కష్టాలు" గౌరన మంత్రిచే వ్యాఖ్యానం వ్రాయించి 1842లో ప్రచురించాడు.
- 1844లో "వసుచరిత్"', 1851లో "మనుచరిత్ర" ప్రచురించాడు. జూలూరి అప్పయ్య శాస్త్రి చేత వీటికి వ్యాఖ్యానాలు రాయించాడు.
- 1852లో "పలనాటి వీరచరిత్ర" ప్రచురించాడు.
రచనలు[మార్చు]
- ఆంధ్ర గీర్వాణ చందము కాలేజి ప్రెస్సు, మద్రాసు -1827.
- లోకం చేత వ్రాయబడిన శుభ వర్తమానము, బైబిల్ కథల తెలుగు అనువాదం
- రాజుల యుద్దములు, అనంతపురం ప్రాంత చరిత్ర.
- తెలుగు-ఇంగ్లీషు (1852), ఇంగ్లీషు-తెలుగు (1854), మిశ్రభాషా నిఘంటువు, జిల్లా నిఘంటువు, లిటిల్ లెక్సికన్ (తెలుగు వాచకాలకు అనుబంధమైన నిఘంటువు)
- తెలుగు వ్యాకరణము - 1840లో ప్రచురణ
- వేమన పద్యాలకు ఆంగ్ల అనువాదం
ఇతరుల ప్రశంసలు[మార్చు]
- నాటి పండితుడు, అద్వైతబ్రహ్మ శాస్త్రి: "సరస్వతికి ప్రస్తుతమందు తమరు ఒకరే నివాస స్థానంగా కనపడుతున్నారు. ఎక్కడ ఏ యే విద్యలు దాచబడి ఉన్నవో అవి అన్నీ తమంతట తామే తమ సన్నిధికి వస్తూ ఉన్నవి... తమరు పుచ్చుకున్న ప్రయాసల వల్ల తేలిన పరిష్కార గ్రంథములు ఆకల్పాంతమున్నూ తమయొక్క కీర్తిని విస్తరిస్తూ ఉంటవి"
- ప్రముఖ పరిశోధకుడు బంగోరె (బండి గోపాల రెడ్డి) : "నిలువ నీడ లేకుండా పోయిన తెలుగు సరస్వతిని ఆహ్వానించి, తన బంగళాలో ఒక సాహిత్య పర్ణశాల ఏర్పరచి, ఆ వాగ్దేవిని నిండు ముత్తైదువ లాగా నడయాడేటట్లు చేయగలిగాడు బ్రౌన్"
- బంగోరె: "ప్రపంచంలోని తెలుగు ప్రొఫెసర్లు, పరిశోధకులు, విద్యావేత్తలు, సాహితీ సంస్థలు అన్నీ కలిసి తెలుగు భాషకు చేసిన సేవ, బ్రౌను ఒక్కడే చేసిన సేవలో ఓ చిన్న భాగం కూడా కాదు"
- "సి.పి.బ్రౌను అను నాతడు ఆంధ్రభాషామతల్లి సేవకే జన్మమెత్తినట్లు కానవచ్చుచున్నది. ఇతడు ఆంధ్ర వాజ్మయాభివ్రుద్దికి చేసినంతటి పని ఇటీవలి వారెవ్వరూ చేయలేదని చెప్పిన అతిశయోక్తి కానేరదు" - కొమర్రాజు లక్ష్మణరావు
- "ఆంధ్రభాషోద్దారకులలో కలకాలము స్మరింపదగిన మహనీయుడు, మహావిద్వాంసుడు సి.పి.బ్రౌను" – వేటూరి ప్రభాకరశాస్త్రి
స్మృతి చిహ్నం[మార్చు]
- బ్రౌను స్మృతి చిహ్నంగా, కడపలో ఆయన నివసించిన బంగళా స్థలంలో బ్రౌన్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వము మరియు ప్రజల నిధులు మరియు సహకారంతో బ్రౌన్ గ్రంథాలయాన్ని నిర్మించింది. వివిధ సంస్థలు, వ్యక్తులు గ్రంథాలను విరాళంగా ఇచ్చారు.2006 నవంబర్ 10 న భాషాపరిశోధనా కేంద్రంగా యోగి వేమన విశ్వవిద్యాలయంలో భాగమైంది.
ఇటీవలి వార్తలు[మార్చు]
150-175 ఏళ్ళనాటి బ్రౌను ఫోటో అంటూ 2007 జనవరి 20 న తితిదే శ్వేత ప్రాజెక్టు డైరెక్టర్ భూమన్ ఒక ఫోటోను పత్రికలకు విడుదల చేసాడు. చిత్తూరు జిల్లా గుర్రంకొండ మండలం ఎల్లుట్ల గ్రామానికి చెందిన సంజీవిగారి సుబ్బారావు ఇంట్లో ఆయన అసలైన ఫొటో లభ్యమైనట్లు ఆయన చెప్పాడు.[9]. అయితే ఈ ఫోటో బ్రౌనుది కాదంటూ వార్తలు వచ్చాయి. [10]
బయటి లింకులు, వనరులు[మార్చు]
![]() |
వికీసోర్స్ లో: |
![]() |
విక్షనరీ, స్వేచ్చా నిఘంటువు లో వర్గం:బ్రౌను_నిఘంటువు_పదాలు లేక బ్రౌన్ ఆంగ్ల-తెలుగు నిఘంటువు చూడండి. |
- సి.పి.బ్రౌన్ ఆంగ్ల వ్యాసము సీతారామయ్య అరి మరియు శ్రీనివాస్ పరుచూరి
- ఆంధ్రభారతిలో బ్రౌన్ ఆన్లైన్ నిఘంటువులు వెతకవచ్చు
- బ్రౌన్ ప్రచురించిన వేమన పద్యాలు
- బ్రౌన్ గురించి కడప జిల్లా జాలస్థలి లో ఆంగ్ల వ్యాసం
- బ్రౌన్ పై వ్యాసంఈనాడు జాలస్థలి2007 జనవరి 21
- బ్రౌను ఫోటో వివాదముపై హిందూపత్రికలో వివరణాత్మక వార్త
- బ్రౌన్ లేఖలు - బంగోరె పరిశోధన - శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రచురణ
- సి.పి బ్రౌన్ అకాడమి
మూలాలు[మార్చు]
- ↑ C.P.Brown by V.Subbarayudu Mahati Publications, 2000
- ↑ తెలుగు భాషా సాహిత్యాల సముద్ధారకుడు సి.పి.బ్రౌన్ - జానమద్ది హనుమచ్ఛాస్త్రి, తెలుగు తేజం, డిసెంబర్ 2013, పేజి44-46
- ↑ మండలి బుద్ధ ప్రసాద్ (2010). "
తెలుగు భాషా భానుడు సి. పి. బ్రౌన్".
లండన్‍లో తెలుగు వైభవ స్మృతులు. వికీసోర్స్.
- ↑ జానమద్ది హనుమచ్ఛాస్త్రి. "
సి.పి.బ్రౌన్".
సుప్రసిద్ధుల జీవిత విశేషాలు. వికీసోర్స్.
- ↑ గూగుల్ మాప్స్‌లో బ్రౌన్ నివసించిన ఇల్లు
- ↑ "Brown, Charles Philip(1798–1884)". Oxford dictionary of national biograpgy. Cite web requires
|website=
(help) (subscription required) - ↑ ఆంధ్రజ్యోతి జాలస్థలి, 31 ఆగష్టు 2009 వివిధ
- ↑ వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ సంపాదకులు.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.
- ↑ "ఈయనే మన సిపిబ్రౌన్ ఇన్నాళ్లకు ఫొటోదొరికింది". ఈనాడు. 2007-01-20. మూలం నుండి 2007-03-11 న ఆర్కైవు చేసారు. Cite uses deprecated parameter
|deadurl=
(help); Cite web requires|website=
(help) - ↑ . ఆంధ్రజ్యోతి. 2007-01-22 http://www.andhrajyothy.com/archives/archive-2007-1-22/mainshow.asp?qry=/2007/jan/21main3. Cite web requires
|website=
(help); Missing or empty|title=
(help)[dead link]
- CS1 errors: missing periodical
- Pages containing links to subscription-only content
- CS1 errors: deprecated parameters
- All articles with dead external links
- Articles with dead external links from 2019-09-03
- విశేషవ్యాసాలు
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with SNAC-ID identifiers
- తెలుగునాట విదేశీయులు
- 1798 జననాలు
- 1884 మరణాలు
- నిఘంటుకారులు