ఆకులో ఆకునై పూవులో పూవునై (పాట)
"ఆకులో ఆకునై పూవులో పూవునై" | |
---|---|
రచయిత | దేవులపల్లి కృష్ణశాస్త్రి |
సంగీతం | రమేష్ నాయుడు |
సాహిత్యం | దేవులపల్లి కృష్ణశాస్త్రి |
ప్రచురణ | 1982 |
రచింపబడిన ప్రాంతం | ఆంధ్ర ప్రదేశ్ |
భాష | తెలుగు |
రూపం | భావగీతం |
గాయకుడు/గాయని | పి.సుశీల |
రికార్డు చేసినవారు (స్టుడియో) | శ్రీ మురళీకృష్ణ ఆర్ట్ క్రియెషన్స్ |
చిత్రంలో ప్రదర్శించినవారు | జయసుధ |
ఆకులో ఆకునై పూవులో పూవునై 1982లో విడుదలైన మేఘసందేశం చిత్రంలోని సుప్రసిద్ధమైన పాట. ఈ పాట పాడినందుకు పి.సుశీలకు రాష్ట్రస్థాయిలో ఉత్తమ గాయనిగా నంది బహుమతి వచ్చింది. ఈ పాటకు సాహిత్యం అందించింది దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఈ పాట దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన కృష్ణ పక్షము లోనిది. సంగీతం అందించింది రమేష్ నాయుడు.
పాట-వివరణ
[మార్చు]పల్లవి :
ఆకులో ఆకునై పూవులో పూవునై
కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై
ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా
వివరణ : కవి అడవి సౌందర్యానికి ముగ్ధుడై అక్కడి ఆకులు, పువ్వులు, కొమ్మలు, రెమ్మలతో తానూ ఒకడిగా కలసిపోయి అక్కడే ఉండిపోవాలని కోరుకుంటున్నాడు.
చరణం 1 :
గలగలనీ వీచు చిరుగాలిలో కెరటమై
జలజలనీ పారు సెలపాటలో తేటనై
పగడాల చిగురాకు తెరచాటు తేటినై
పరువంపు విరి చేడే చిన్నరి సిగ్గునై
ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా
వివరణ : తన మనసులోని భావాల్ని మరింత లోతుగా తరుస్తూ చిరుగాలిలో కెరటం లాగా, సెలయేరులో తేటగా, పూలమొగ్గలోని సిగ్గుగా వాటన్నితో కలసిపోవాలని కోరుకుంటాడు.
చరణం 2 :
తరులెక్కి ఎలనీలి గిరినెక్కి మెలమెల్ల
చదలెక్కి జలదంపు నీలంపు నిగ్గునై
ఆకలా దాహమా చింతలా వంతలా
ఈ కరణి వెర్రినై ఏకతమా తిరుగాడ
ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా
వివరణ : అక్కడ అడవిలోని చెట్లు, ఆ చెట్ల పైనుంచి నీలి కొండలు ఎక్కుతూ మెలమెల్లగా ఆకాశాన్ని చేరుకొని నీలి మబ్బులోకి చేరి దాని నీలిరంగులో కలిసి ప్రకాశిస్తూ ఆకలి - దాహం చీకులు, చింతలూ లేకుండా ఏకాంతంగా విహరిస్తూ వెర్రివాడిలా తిరుగుతూ ఆ అడవిలోనే కలిసిపోయి ఉండిపోనా అంటూ కవి ప్రకృతిలో తానూ మమేకమయిపోవాలని కోరుకుంటున్నాడు.
విశేషాలు
[మార్చు]ఈ పాటను పి.సుశీల నటి జయసుధ కొరకు పాడారు. దర్శకుడు దాసరి నారాయణరావు ఈ పాటను జయసుధ, అక్కినేని నాగేశ్వరరావు మీద చిత్రీకరించారు. ఈ పాట దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసిన అనేక కవితలలో ఒకటి, ఆయన మరణాంతరం ఆయన రాసిన కొన్ని కవితలను ఈ చిత్రంలో పాటలుగా ఉపయోగించారు, వాటిలో ఈ పాట కూడా ఒకటి. రమేష్ నాయుడు సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఆయనకి ఈ చిత్రం వలన జాతీయస్థాయిలో ఉత్తమ సంగీతదర్శకునిగా బహుమతి లభించింది.
ఈ పాటను కృష్ణశాస్త్రి గారు ఒకసారి విజయవాడ (ఒకప్పటి బెజవాడ) నుండి బళ్ళారికి రైలులో వెళ్లునప్పుడు గిద్దలూరు-నంద్యాల మధ్యనున్న నల్లమల ఆడవి గుండ వెళ్లునప్పుడు, అచ్చటి ఆడవి అందం చూసినప్పుడు ఆయన గుండెలోతుల నుండి అశువుగా గంగా ప్రవహంలా పుట్టిన అందమయిన గేయం అది. కలకాలం సాహిత్య ప్రియుల గుండెలో నిలిచే పాట.
అవార్డులు
[మార్చు]- పి.సుశీలకు ఈ పాట వలన 1982 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ నేపథ్య గాయనిగా నంది బహుమతి లభించింది.
మూలాలు
[మార్చు]- ఆకులో ఆకునై, గోరింట - చిత్రాలు, పాటలు, వెండితెర పాటలు, కృష్ణశాస్త్రి సాహిత్యం, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 2008, పేజీ: 161.