అక్షాంశ రేఖాంశాలు: 18°30′53″N 78°51′43″E / 18.514772°N 78.861809°E / 18.514772; 78.861809

శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం (వేములవాడ)

వికీపీడియా నుండి
(శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం, వేములవాడ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం
శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం is located in Telangana
శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం
శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం
తెలంగాణ లో ప్రాంతం
భౌగోళికాంశాలు :18°30′53″N 78°51′43″E / 18.514772°N 78.861809°E / 18.514772; 78.861809
పేరు
ఇతర పేర్లు:లేంబాల వాటిక
భాస్కర క్షేత్రం
హరిహర క్షేత్రంగా
ప్రధాన పేరు :శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం
ప్రదేశం
దేశం:భారత దేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:రాజన్న సిరిసిల్ల జిల్లా
ప్రదేశం:వేములవాడ
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:శ్రీ రాజరాజేశ్వర స్వామి (శివుడు)
ప్రధాన దేవత:శ్రీ పార్వతీ రాజరాజేశ్వరీదేవి
ఇతిహాసం
నిర్మాణ తేదీ:సా.శ. ఎనిమిదో శతాబ్దం

వేములవాడ దక్షిణ కాశీగా పిలువబడుతున్న తెలంగాణ రాష్ట్రం, రాజన్న జిల్లా లోని ఒక పుణ్యక్షేత్రం. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు 162 కిలోమీటర్లు, జిల్లా కేంద్రమైన కరీంనగర్‌కు 36 కిలోమీటర్ల దూరంలో వున్న వేములవాడ రాజరాజేశ్వరస్వామి క్షేత్రం పౌరాణికంగా, చారిత్రాత్మకంగా పలు విశిష్టతలను సంతరించుకుంది.

స్థల విశిష్టత

[మార్చు]

ఈ దేవాలయంలో శ్రీ రాజరాజేశ్వరీదేవి సమేతుడై రాజరాజేశ్వరుడు లింగరూపంలో వెలసి నిత్యం పూజలందుకుంటున్నాడు. భాస్కర క్షేత్రంగా, హరిహర క్షేత్రంగా పిలవబడే ఈ క్షేత్రం గురించి భవిష్యోత్తర పురాణంలోని రాజేశ్వరఖండంలో చెప్పబడింది. అర్జునుడి మునిమనవడైన నరేంద్రుడు ఒక ఋషిని చంపటం వల్ల కలిగిన బ్రహ్మహత్యాపాతకాన్ని వదిలించుకోడానికి దేశాటన చేస్తూ ఇక్కడికి చేరుకున్నాడట. ఇక్కడి ధర్మగుండంలో స్నానం చేసి, జపం చేస్తున్న నరేంద్రుడికి కొలనులో శివలింగం దొరికిందట. కొలను సమీపంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించిన నరేంద్రుడికి శివుడు ప్రత్యక్షమై బ్రహ్మహత్యాపాతకం నుంచి విముక్తి కలిగించాడట. ఆ శివలింగమే ఇప్పుడున్న మూలవిరాట్టని స్థలపురాణం.

చరిత్ర

[మార్చు]

ఈ పురాతన గ్రామం పశ్చిమ చాళుక్యుల కాలం నుండి ఉన్నదని ఇక్కడ లభించిన పురాతత్వ ఆధారాలను బట్టి తెలుస్తోంది. పశ్చిమ చాళుక్యులు నిర్మించిన రాజరాజేశ్వర స్వామి దేవాయమునకు వేములవాడ ప్రసిద్ధి చెందింది. చారిత్రక ప్రసిద్ధి కలిగిన ఈ దేవాలయానికి సుదూర ప్రాంతాల నుండి యాత్రికులు వస్తూ ఉంటారు. ఈ ప్రాంతాన్ని పాలించిన మొదటి నరసింహుడుకు రాజాదిత్య అనే బిరుదు ఉండేది. ఆ బిరుదు పేరిట గాని, అతడు కట్టించినందువలన గాని ఈ దేవాలయానికి ఈ పేరు వచ్చిందని భావిస్తున్నారు. రాజాదిత్య మొదటి వినయాదిత్య యుద్ధమల్లుని మనుమడు. దేవాలయానికి ఉత్తరాన ధర్మగుండం అనే కోనేరు ఉంది. గ్రామాన్ని ఆనుకుని ప్రవహించే వాగు ఈ కోనేటికి నీటి వనరు. వద్దేగేశ్వర స్వామి దేవాలయము కూడా ఇక్కడ ఉంది.

1830లో కాశీయాత్రలో భాగంగా నాటి నిజాం ప్రాంతాలలో మజిలీ చేస్తూ వెళ్ళిన ఏనుగుల వీరాస్వామయ్య ఈ పుణ్యక్షేత్రాన్ని గురించి తన కాశీయాత్ర చరిత్రలో ప్రస్తావించారు. తన యాత్రామార్గంలోని మజిలీల్లో ఇక్కడికి సమీపమైన మజిలీ జగనంపల్లి (డిచ్‌పల్లి సమీపంలోని గ్రామం) గురించి వ్రాస్తూ అక్కడికి 4 మజిలీల దూరంలో వేములవాడ ఉన్నదని వ్రాశారు. అది మహాక్షేత్రమని, భీమేశ్వర రాజేశ్వర క్షేత్రమని పేర్కొన్నారు. అప్పట్లో ఈ ప్రాంతానికి పులుల భయం తీవ్రంగా ఉండేదని, కోడెలను పులులు బాధించేవని పేర్కొన్నారు.[1]

శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం

[మార్చు]

శివరాత్రి రోజున మూడు లక్షలకు పైగా భక్తులు రాజరాజేశ్వర స్వామిని సేవించుకుంటారు. ఆ రోజున ప్రత్యేక పూజలు జరుపుతారు. సుమారు వంద మంది అర్చకులతో మహాలింగార్చన జరుపుతారు. అర్ధరాత్రి వేళ శివునికి ఏకాదశ రుద్రాభిషేకం చేస్తారు. రాత్రివేళ దీపాలంకరణలతో దేవాలయం దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది. భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. విద్యార్థులకు ఉచిత వసతి, భోజన ఏర్పాట్లు చేస్తారు. ఇంకా, ఈ దేవాలయం ఇతర చిన్న ఆలయాలకు దానధర్మాలు చేస్తుంది.

రాష్ట్రంలో అత్యధిక ఆదాయం గల దేవాలయాల్లో ఇది ఒకటి. గ్రామాభివృద్ధి నిమిత్తం సంవత్సరానికి రూ. 8 లక్షలు ఖర్చు పెడితుంది దేవస్థానం.కాశీ, చిదంబరం, శ్రీశైలం, కేదారేశ్వరంలను పావనం చేసిన తరువాత శివుడు వేములవాడ వేంచేసాడని పురాణ కథనం.

ఇక్కడ కొలువై ఉన్న స్వామిని శ్రీ రాజ రాజేశ్వర స్వామి అని, రాజన్న అనీ అంటారు. మూలవిరాట్టుకు కుడి పక్కన శ్రీ రాజ రాజేశ్వరీ దేవి, ఎడమ పక్కన శ్రీ లక్ష్మీ సహిత సిద్ధి వినాయక విగ్రహాలు ఉంటాయి. ధర్మగుండం కోనేటిపై మూడు మండపాలు నిర్మించబడ్డాయి. మధ్య దానిపై ఈశ్వరుని విగ్రహం ప్రతిష్ఠించబడింది. ధ్యాన ముద్రలో ఉన్న శివుని విగ్రహం చుట్టూ ఐదు శివలింగాలు ఉంటాయి.భక్తులు చేసే రకరకాల పూజల్లో ప్రముఖమైంది కోడె మొక్కు. భక్తులు గిత్తను తీసుకువచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయించి ప్రాంగణంలో ఒకచోట కట్టివేస్తారు. దీనివలన భక్తుల పాపాలు తొలగిపోయి సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వసిస్తారు. పవిత్రమైన గండ దీపాన్ని వెలిగించడం కూడా ఎంతో పుణ్యకరమని భక్తులు భావిస్తారు

ఆలయప్రత్యేకతలు

[మార్చు]
  • శివరాత్రి రోజున వంద మంది అర్చకులతో మహాలింగార్చన జరుగుతుంది. అమావాస్య దాటి ఏకాదశి మొదలైన అర్ధరాత్రివేళ శివునికి ఏకాదశ రుద్రాభిషేకం చేస్తారు.
  • ఇక్కడ భక్తులు చేసే పూజల్లో ప్రముఖమైనది కోడె మొక్కు . భక్తులు గిత్తను తీసుకొచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణ చేయించి ప్రాంగణంలో కట్టేసి, ఆ గిత్తను దేవాలయానికిదక్షిణగా ఇచ్చేస్తారు. దీనివల్ల సంతానప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు. పవిత్రమైన గండ దీపాన్ని వెలిగించడం కూడా ఎంతో పుణ్యకరమని భక్తులు భావిస్తారు.
  • శైవులు, వైష్ణవులు, జైనులు, బౌద్ధులు అందరూ ఈ దేవాలయాన్ని దర్శిస్తారు. దేవాలయంపై ఉన్న శిల్పాలు కూడా జైన, బౌద్ధ సంస్కృతులను ప్రతిబింబిస్తూ ఉంటాయి.
  • దేవాలయ ప్రాంగణంలో 99 ఏళ్ళ నాటి మసీదు ఉంది. ఇస్లాం మతానికి ఏమండీ చెందిన ఒక శివభక్తుడు ఈ గుళ్ళో ఉంటూ, స్వామిని సేవిస్తూ ఇక్కడే మరణించాడట. అతని స్మృత్యర్ధం ఈ మసీదు నిర్మించారట. గుందెల్లి పర్షరం గరు గౌథం
  • దేవాలయ ప్రాంగణంలో కోటి శివలింగాలు ఉంటాయి అని విశ్వసిస్తారు.

వేద పాఠశాల

[మార్చు]

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ ప్రభుత్వం, దేవాలయానికి అనుబంధంగా ఒక వేద పాఠశాలను మంజూరు చేసింది. భీమేశ్వరాలయం ఎదుట ఉన్న భవనంలో వేదపాఠశాల ప్రారంభం కాగా, ప్రస్తుతం 25 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు.[2]

వివిధ మతావలంబికుల దర్శన స్థలం

[మార్చు]

శైవులు, వైష్ణవులు, జైనులు, బౌద్ధులు అందరూ ఈ దేవాలయాన్ని దర్శిస్తారు. దేవాలయంపై ఉన్న శిల్పాలు కూడా జైన, బౌద్ధ సంస్కృతులను ప్రతిబింబిస్తూ ఉంటాయి.

రవాణా సౌకర్యాలు

[మార్చు]

తెలంగాణలోని అన్ని ప్రధాన పట్టణాల నుండి హైదరాబాద్ జూబ్లీ బస్ స్టాండ్, ఎంజిబిఎస్ బస్టాండ్, నుండి వేములవాడకు నేరుగా ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది. కరీంనగర్ నుండి ప్రతి గంటకు బస్సు సౌకర్యం ఉంది. సుదూర ప్రాంతాలనుండి రైల్లో వచ్చే భక్తులు హనుమకొండ బస్టాండ్, వరంగల్ స్టేషనులో దిగి బస్సులో కరీంనగర్ చేరుకొని అక్కడి నుండి వేములవాడ చేరుకోవచ్చు.

దేవాలయ విస్తరణ పనులు

[మార్చు]

ముఖ్యమంత్రి పర్యటన

[మార్చు]

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి హొదాలో కేసీఆర్ 2015 జూన్‌ 18న మొదటిసారి దేవాలయాన్ని దర్శించుకున్నాడు. 7 గంటలపాటు వేములవాడలో గడిపి, గుడి చెరువు, ఆలయ పరిసరాలు, పట్టణ పరిసరాలు పరిశీలించి, గుడిచెరువు శిఖం భూములను తీసుకొని 37 ఎకరాలకు ఆలయాన్ని విస్తరించాలని అధికారులను ఆదేశించాడు. 2015, డిసెంబరు 28న ఎర్రవెల్లిలో అయుత చండీయాగం చేసిన తరువాత రాజరాజేశ్వరస్వామిని రెండోసారి దర్శించుకున్నాడు. 2019 డిసెంబర్ఉ 30న మూడోసారి వేములవాడకు వెళ్ళి, దేవాలయ విస్తరణ కోసం సేకరించిన గుడిచెరువులో భూమిని పరిశీలించి, అభివృద్ధి పనులపై అధికారులకు దిశానిర్దేశం చేశాడు.[2][3]

వీటీడీఏ ఏర్పాటు

[మార్చు]

వేములవాడ పట్టణం, రాజన్న ఆలయాన్ని సమగ్రాభివృద్ధి చేసేలా వేములవాడ దేవాలయ ఏరియా అభివృద్ధి ప్రాధికార సంస్థ (వీటీడీఏ) ను ఏర్పాటుచేయబడింది. ఈ సంస్థ చైర్మన్‌గా సీఎం కేసీఆర్‌, వైస్‌ చైర్మన్‌గా రిటైర్డ్‌ ఐఏఎస్‌ ముద్దసాని పురుషోత్తంరెడ్డి నియమించబడ్డారు. వీటీడీఏ ద్వారా భూసేకరణ, రహదారుల విస్తరణ, అభివృద్ధి ప్రణాళికలు రూపొందించబడ్డాయి. దేవాలయ విస్తరణ కోసం శృంగేరి పీఠాధిపతి వద్దకు వెళ్ళి అభివృద్ధి నమునాలను సేకరించారు.[4]

విస్తరణ, అభివృద్ధి ప్రణాళిక

[మార్చు]

16 గుంటలున్న రాజరాజేశ్వరస్వామివారి ప్రధాన అంతర్గత దేవాలయాన్ని 40 గుంటలకు పెంచేలా నివేదికలు తయారు చేయడంతోపాటు, 20 కోట్లతో రెండో ప్రాకారం నిర్మాణాలను చేపట్టేందుకు అంచనాలు రూపొందించబడ్డాయి. తూర్పున కళాభవనం వద్ద రెండో రాజగోపురం నిర్మాణం, ఉత్తరం వైపున కల్యాణకట్ట, ప్రసాదాల కౌంటర్‌లు, ఓపెన్‌స్లాబ్‌తో పడమటి ద్వారం వరకు దేవాలయంలోని అంతర్భాగాన్ని పెంచనున్నారు. అలాగే 90.36 కోట్లతో గుడిచెరువు ఈశాన్య భాగాన్ని విస్తరించనున్నారు.[2][3]

వేగంగా భూసేకరణ

[మార్చు]

దేవాలయ విస్తరణకోసం, గుడిచెరువు ప్రాంతాలను ఆహ్లాదకరంగా మార్చేందుకు 65 ఎకరాలు సేకరించాలని నిర్ణయించగా, 2022 మార్చి వరకు 30 కోట్లు వెచ్చించి 37 ఎకరాల భూమిని సేకరించారు. బండ్‌ చుట్టూ రింగ్‌రోడ్డు వేసేందుకు 22 కోట్లతో మరో 28.29 ఎకరాలను సేకరించనున్నారు. భక్తులపై భారం పడకుండా బస్టాండ్‌ను కూడా రాజన్న దేవాలయం వద్దకే మార్చడంకోసం, జగిత్యాల బస్టాండ్‌ సమీపంలో 22 ఎకరాల స్థలాన్ని కూడా సేకరించనున్నారు.[2][3]

ఆలయ అభివృద్ధి

[మార్చు]
2019 శివరాత్రి పండగ సందర్భంగా వేములవాడ రాజ రాజేశ్వర దేవాలయంలో, శివార్చన కార్యక్రమంలో పాల్గొన్న కోలాటం బృందం

యాదాద్రి తరహాలోనే శైవ ఆలయాల్లో అత్యంత ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని పునర్నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధమైంది. ఇందులో భాగంగా స్థపతి ఆనంద్ సాయి 2022 ఏప్రిల్ 4న ఈ ఆలయాన్ని సందర్శించి అక్కడి అధికారులతో చర్చలు జరిపారు.[5] ఈ ప్రాంతాన్ని ఏలిన చాళుక్యులతోపాటు కాకతీయ వైభవం ఉట్టిపడేలా రాజన్న ఆలయ అభివృద్ధి నమునాలను రూపొందిస్తామన్నారు.[6]

బడ్జెట్ వివరాలు

[మార్చు]

దేవాలయ అభివృద్ధికి 2018 తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో 100 కోట్ల రూపాయలు కేటాయించారు.[7][8]

మూలాలు

[మార్చు]
  1. వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.
  2. 2.0 2.1 2.2 2.3 telugu, NT News (2022-03-30). "ముక్కంటి వద్దకు ముమ్మారు!". Namasthe Telangana. Archived from the original on 2022-03-30. Retrieved 2022-03-30.
  3. 3.0 3.1 3.2 "Vemulawada: రాజన్నపై సీఎం కేసీఆర్‌కు అమితప్రేమ". Prabha News. 2022-03-30. Archived from the original on 2022-03-30. Retrieved 2022-03-30.
  4. "వేములవాడ చైర్మన్ గా కేసీఆర్". Sakshi. 2016-02-11. Archived from the original on 2016-02-11. Retrieved 2022-03-30.
  5. "యాదాద్రి తరహాలో రాజన్న ఆలయ పునర్నిర్మాణం.. రెండు వారాల్లో ఎములాడకు కేసీఆర్‌". Prabha News. 2022-04-04. Retrieved 2022-04-04.
  6. telugu, NT News (2022-04-05). "చాళుక్య వైభవం చాటేలా వేములవాడ". Namasthe Telangana. Retrieved 2022-04-04.
  7. "తెలంగాణ బడ్జెట్ 2018: ఈటల ప్రసంగం". Samayam Telugu. 2018-03-15. Archived from the original on 2022-10-12. Retrieved 2022-10-12.
  8. Mar 15, TIMESOFINDIA COM / Updated:; 2018; Ist, 13:23 (2018-03-15). "Telangana Budget 2018: Highlights of Telangana budget 2018-19 | Hyderabad News - Times of India". The Times of India. Archived from the original on 2018-04-17. Retrieved 2022-10-12. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)

ఇతర లింకులు

[మార్చు]