సినిమా పోస్టర్ (పుస్తకం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సినిమా పోస్టర్
"సినిమా పోస్టర్" పుస్తక ముఖచిత్రం
కృతికర్త: కాసాని ఈశ్వరరావు
దేశం: భారత దేశము
భాష: తెలుగు
ప్రక్రియ: డ్రాయింగ్ లో రక రకాల పద్ధతులు , రీతుల గురించి
ప్రచురణ: విజయా పబ్లికేషన్స్
విడుదల: 2011 జులై, అక్టోబరు
పేజీలు: 408

సినిమా పోస్టర్ దాదాపు పలు భాషల్లో 2000కు పైగా చిత్రాలకు కుంచెపట్టి పోస్టర్‌ కళాకారుడిగా పేరుపొందిన ఈశ్వర్‌, తన గురించీ, నాటి సినిమా పరిస్థితులు విశేషాలను తెలియజేస్తూ వ్రాసిన పుస్తకం. దీనిని సెప్టెంబరు 18 2011 న ఫిలింఛాంబర్‌లో డా.దాసరి నారాయణరావు ఆవిష్కరించి, తొలి ప్రతిని డా.డి. రామానాయుడుకు అందజేశారు. మలిప్రతిని సీనియర్‌ జర్నలిస్టు బి.ఎ. రాజు 2వేలకు కొనుగోలు చేశారు.[1] ఈ పుస్తకంలో ఆయన సాక్షి నుండి దేవుళ్ళు వరకూ తన జీవిత సినిమా అనుభవాలను వివరించారు. ఇదో రకంగా పోస్టర్ డిసైనింగ్ విజ్ఞాన సర్వస్వం. ఈ పుస్తకానికి 2012 నంది అవార్డు లభించింది.[2]

పుస్తక విశేషాలు[మార్చు]

నాలుగు దశాబ్దాలపాటు సినిమాపోస్టర్లని డిజైన్ చేసిన ఈశ్వర్ ఇప్పుడు తన జీవితం గురించీ, సినిమా పోస్టర్ల గురించి, సినిమా ప్రచారకళ గురించి, చిత్రకళ గురించి ఒక విపులమైన, ఆకర్షణీయమైన పుస్తకం వ్రాశారు. విజయవాడలో పుస్తక విక్రేత మిత్రులు చెప్పినదానిబట్టి ఈ పుస్తకం మూడో ఎడిషన్‌కూడా వచ్చి, దాదాపు అమ్ముడైపోయిందట. తెలుగు పుస్తకాలకు మార్కెటింగ్ లోపమే కాని మార్కెట్ లోపం లేదని మళ్ళీ నిరూపించింది ఈ పుస్తకం. పుస్తకంలో మొదటి భాగం ఈశ్వర్ జీవితం గురించి ఉంది.[3]

డ్రాయింగ్ లో రక రకాల పద్ధతులు, రీతుల గురించి, (క్రోక్విల్ పెయింటింగ్, చార్ కోల్ స్కెచ్,వాష్ డ్రాయింగ్,పాచ్ వర్క్ పైంటింగ్స్), అలాగే పాత్రల రూపకల్పన కోసం వేసిన స్కెచ్ లు (ఉదాహరణకు విగ్గుల తయారీ కోసం ఒక కథానాయుకుడిని రక రకాల హెయిర్ స్టైల్స్ లో ఊహిస్తూ చిత్రాలు వేయడం) ఫైనల్ గా నాలుగైదు స్కెచ్ లు వేసి నిర్మాత, దర్శకులతో ఒకటి నిర్థారించడం ఇవన్నీ ఈశ్వర్ చాలా శ్రద్ధగా వివరిస్తారు. మనకూ బాలీవుడ్ కీ, హాలీ వుడ్ కీ పబ్లిసిటీ పద్ధతుల్లో తేడాలు, సినిమా థీమ్ నిబట్టి పోస్టర్ ప్రిపేర్ చేయడం,టెక్నాలజీకి అనుగుణంగా పోస్టర్ల తయారీలో వచ్చిన మార్పులు ఇవన్నీ చదువుతుంటే చాలా ఆసక్తిగా అనిపిస్తుంది.[4] ఈ పుస్తకంలో ఆయన డిజైనర్‌గా పనిచేసిన 1888 చిత్రాల పట్టిక ఇస్తూ, ఇవి కాక ఆయన పనిచేసిన మలయాళం, తుళు, బెంగాలీ, ఒరియా వంటి ఇతర భాషల్లో 500 పైన చిత్రాల వివరాలు ఇందులో చేర్చలేదు. తన పదవయేట, గాంధీజీ మరణించిన తర్వాత ఆయన వేసిన చిత్రం ఈ పుస్తకంలో ముద్రించారు. ఆ వయసులోనే అతను మంచి నైపుణ్యం ఉన్న చిత్రకారుడు. అంతకన్నా అబ్బురపరిచేది ఆ బొమ్మ వెనుక ఉన్న ఊహాశక్తి.

పుస్తక ప్రత్యేకత[మార్చు]

ఈశ్వర్ కేవలం తన జీవితకథే వ్రాసి ఊరుకోలేదు. 255 పేజీలు (మరి 128 రంగుల బొమ్మల పేజీలు) ఉన్న ఈ పుస్తకంలో ఆత్మకథ 90 పేజీలకు మాత్రమే పరిమితం. మిగతా పుస్తకంలో ప్రచార కళ గురించి, తెలుగు ప్రచారరంగంలో వివిధ శాఖలలో (పబ్లిసిటీ ఆర్టిస్టులు, డిజైనింగ్ సంస్థలు, ముద్రాపకులు, చిత్రనిర్మాణ సంస్థలు, పి.ఆర్.ఓలు, అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు) ప్రముఖుల గురించి, ఆయనతో మంచి సంబంధాలు ఉన్న నిర్మాతలు, దర్శకులు, నటుల గురించి, ప్రముఖ తెలుగు, భారతీయ చిత్రకారులగురించి చిన్న చిన్న వ్యాసాలున్నాయి. పోస్టర్లు, హోర్డింగుల తయారీ గురించి, కాలక్రమేణా వచ్చిన మార్పుల గురించి వివరణలు ఉన్నాయి. ఈ పుస్తకంలో తెలిసిన ఇంకో ఆశ్చర్యకరమైన విషయం. ఇప్పుడు మనం కంప్యూటర్లలో వాడుతున్న తెలుగుఫాంట్లలో చాలాభాగం ఈశ్వర్ తమ్ముడు బ్రహ్మం (కాసాని బ్రహ్మానందరావు) డిజైన్ చేసినవేనట. ఈశ్వర్ స్టూడియోలో పోస్టర్లు, టైటిల్స్‌కు లెటరింగ్ చేయడంలో స్పెషలిస్ట్ ఐన బ్రహ్మంతో అనూ గ్రాఫిక్స్ మురళీకృష్ణ తెలుగులో వివిధ రకాల ఫాంట్లు డిజైన్ చేయించారట. ఆ తర్వాత తమిళ, కన్నడ, మలయాళ భాషలకూ ఈ అక్షరబ్రహ్మే ఫాంట్లు డిజైన్ చేశారట. ఈ పుస్తకంలో 128 రంగులపేజీల్లో ఈశ్వర్ గీసిన సినీ నటీనటుల వర్ణచిత్రాలు, వివిధభాషల్లో చేసిన పోస్టర్లు, లోగోలు, రేఖాచిత్రాలు, అందంగా ఆకర్షణీయంగా ఉండటమే కాక చాలా జ్ఙాపకాలను వెలికితీస్తాయి. పుస్తకం ప్రతిపేజీలోనూ ఉన్న ఫొటొలు, చిత్రాలు పుస్తకాన్ని సమగ్రంగానూ, ఆకర్షణీయంగా చేశాయి.

అధ్యాయాలు[మార్చు]

వ్యక్తిగా ఈశ్వర్‌ జీవితం, ఆయన ఎదుర్కొన్న ఒడిదుడుకులూ ఈ పుస్తకంలో మొదటి అధ్యాయం అని అనుకుంటే, చిత్రసీమలో ఆయన ప్రస్థానం రెండో అధ్యాయం. తెలుగు సినిమా చరిత్రలో పబ్లిసిటీ తీరుతెన్నుల గురించి ఆయన వివరణ మూడో అధ్యాయం అవుతుంది. చివరలో వున్న అందర్నీ ఆకట్టుకునే విధంగా ఈశ్వర్‌ వేసిన వర్ణ చిత్రాలు నాలుగో అధ్యాయం. అందుకే ఈ పుస్తకం ఈశ్వర్‌ ఆత్మకథంగా ఆరంభం అయి ఆయన వర్ణ (విశ్వ)రూప ప్రదర్శనతో అభిమానులందరూ తమ తమ అభిమాన నటీనటుల వర్ణచిత్రాలను ఫోటోలు కట్టుకుని దాచుకునేంత అద్భుతంగా ముగుస్తుంది.[5]

రచయిత సందేశం[మార్చు]

ఈ పుస్తకం గురించి రచయిత ఈశ్వర్ ఈ క్రింది విధంగా తెలియజేసారు.

సాంకేతికపరంగా సినీ దిగ్గజాల దృష్టిలో సినీ 'పబ్లిసిటీ డిజైనింగ్‌' అనే ఈ శాఖ చిట్ట చివరిదీ, కట్ట కపటిదీ, విలువ లేనిదే కావచ్చు.
కానీ, సినిమా కంటే ముందుగా థియేటర్లకు చేరేది ఈ శాఖ నుంచి వచ్చిన పోస్టరే. ప్రేక్షకునికి సినిమామీద ఒక అవగాహన తెచ్చి
థియేటర్‌దాకా తీసుకువచ్చేదీ ఈ పోస్టరే. ఎవరైనా... ఎంచుకున్న శాఖ ఏదైనా అందులో శిఖరాగ్రాన్ని చేరుకోవడం అంటే విజయాన్ని
అందిపుచ్చుకోవడమే అవుతుంది. అలాంటి విజయం కోసం చేసిన నా జీవన పోరాటంలో అడుగుగునా ఎదురైన కొన్ని మధుర క్షణాలకు,
మరెన్నో చేదు అనుభవాలకు అక్షర రూపమే... ఈ పుస్తకం....
చిత్రకళకు, ప్రచారకళకు, వాటి అనుబంధ విభాగాలకు ఈ పుస్తకం ఒక ప్రతిరూపం కాలగదని ఆశిస్తున్నాను..
                                                  – ఈశ్వర్

మూలాలు[మార్చు]

  1. ఈశ్వర్‌ 'సినిమా పోస్టర్‌' ఆవిష్కరణ[permanent dead link]
  2. నంది విజేతలు వీరే[permanent dead link]
  3. "అందంగా, ఆకర్షణీయంగా, ఆసక్తికరంగా – ఈశ్వర్ సినిమా పోస్టర్". Archived from the original on 2016-03-05. Retrieved 2015-12-30.
  4. "సినిమా పోస్టర్". Archived from the original on 2015-12-30. Retrieved 2015-12-30.
  5. "కినిగె లో పుస్తక వివరాలు". Archived from the original on 2015-12-31. Retrieved 2015-12-30.

ఇతర లింకులు[మార్చు]