రావణుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లంకాధీశుడు, రావణుని చిత్రణ

రావణుడు హిందూ ఇతిహాసమైన రామాయణములో ప్రధాన ప్రతినాయకుడు. రామాయణం ప్రకారం రావణుడు లంకకు అధిపతి. పౌలస్త్య బ్రహ్మ వారసుడు శివుని అవతారం .రావణుడు శివుని అంశచే పుట్టాడు, ఒక గొప్ప రాజనీతి కలవాడు. ఒక రాజుకు ఉండాల్సిన లక్షణాలు కలవాడు కనుకనే ఇప్పటికీ శ్రీలంక దేశంలో అతనిని పూజిస్తున్నారు. మహా శివ భక్తుడు. ఎంత గొప్ప మేధావి అయినా ధర్మాన్ని పాటించక పోతే అన్ని వ్యర్థమే అనేదానికి రావణుడు ఒక ఉదాహరణ అని చెప్పవచ్చు.

రావణ జన్మ వృత్తాంతం

[మార్చు]

భాగవత పురాణం ప్రకారం, ఒక పర్యాయం శ్రీమహావిష్ణువు దర్శనార్థం బ్రహ్మ కుమారులు వైకుంఠం చేరుకొనగా వైకుంఠ ద్వారపాలకులైన జయ విజయులు బ్రహ్మ కుమారులను చూసి చిన్న బాలురు అనుకొని అడ్డగిస్తారు. దీని వల్ల బ్రహ్మ కుమారులకు ఆగ్రహం వచ్చి జయవిజయులను భూలోకంలో జన్మించమని శపిస్తారు. ద్వారపాలకులు విషయాన్ని గ్రహించి శాప విమోచనాన్ని అర్థించగా హరి భక్తులుగా ఏడు జన్మలు గానీ, లేదా హరి విరోధులుగా మూడు జన్మలు గానీ భూలోకంలో గడిపితే, శాప విమోచనం కలిగి తిరిగి తనను చేరుకుంటారని విష్ణుమూర్తి సూచిస్తాడు. ఏడు జన్మల పాటు విష్ణుమూర్తికి దూరంగా జీవించలేమని భావించిన జయ విజయులు మూడు జన్మల పాటు హరికి శత్రువులుగా జన్మించడానికి సిద్ధపడతారు. ఈ విధంగా జయవిజయులు కింది జన్మలెత్తుతారు.

కలి , కలి యుగంలో ఈ విధంగా త్రేతాయుగంలో జన్మించిన వారే రావణ, కుంభకర్ణులనే అన్నదమ్ములు. రావణాసురుడి జన్మవృత్తాంతం స్కాంద పురాణము, బ్రహ్మఖండంలో రామేశ్వర సేతు మహాత్మ్యంలో చెప్పబడింది.

బ్రహ్మ మానస పుత్రుడైన పులస్త్యుని కుమారుడు విశ్వ వసు బ్రహ్మనికి, దైత్య రాకుమారియైన కైకసికి రావణాసురుడు జన్మిస్తాడు. కైకైయి తండ్రి సుమాలి. సుమాలి తనకు అత్యంత పరాక్రమవంతుడైన మనుమడు కావాలన్న కోరికతో అందరు రాకుమారులను అంగీకరించకుండా మహా తపస్వి అయిన విశ్వ వసు బ్రహ్మకి కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తాడు. కైకసి, తండ్రి ఆజ్ఞపై అసుర సంధ్యాకాలంలో విశ్వ వసు బ్రహ్మ మహర్షి తపస్సు చేసుకొంటుండగా ఆయన వద్దకు వెళ్లి, తపోశక్తితో తన కోరిక తెలుసుకొనమని అంటుంది.విశ్వ వసు బ్రహ్మ విషయం తెలుసుకొని అసుర సంధ్యాకాలం చేత క్రూరులైన పుత్రులు జన్మిస్తారని చెబుతాడు. కాని ఒక ధార్మికుడైన కుమారుడు కూడా జన్మిస్తాడని చెబుతాడు. ఆ ధార్మిక పుత్రుడే విభీషణుడు. ఈ విధంగా పుట్టినవాడు రావణాసురుడు. అందువల్ల రావణాసురుడు దైత్యుడు, బ్రాహ్మణుడు.
రావణాసురుడి అన్నదమ్ములు,అక్కచెల్లెళ్ళు

రావణాసురుడు చిన్నతనం నుండి సాత్విక స్వభావం లేకుండా తామస స్వభావం కలిగి ఉండేవాడు. ఏకసంథాగ్రాహిగా ఉండేవాడు. వేదవిద్యలు తన తండ్రి విశ్వ వసు బ్రహ్మ నుండి నేర్చుకొని గొప్ప విద్వాంసుడౌతాడు. తన తాత సుమాలి వద్ద నుండి రాజ్యపాలనా విషయాలు, దైత్యకృత్యాలు నేర్చుకుంటాడు.

క్లుప్త చరిత్ర

[మార్చు]

రాక్షసుల రాజు. ఇతని రాజధాని లంక. తండ్రి పులస్త్యుని కొడుకు అగు విశ్రవసుడు. తల్లి సుమాలి కూతురు అగు కైకసి. భార్య మయుని కూఁతురు అగు మందోదరి. సోదరులు కుంభకర్ణ విభీషణులు. కొడుకులు ఇంద్రజిత్తు మొదలగువారు. ఇతనికి పదితలలు ఉండుటచే దశకంఠుఁడు, దశగ్రీవుఁడు అను నామధేయములు కలిగెను. ఇతఁడు మహత్తరము అగు తపము సలిపి బ్రహ్మవలన తనకు మనుష్యులు తక్క తక్కినవారిచే చావు లేకుండా వరము పొంది ఆ వరప్రభావముచే మిగుల గర్వితుఁడు అయి త్రిలోకములయందు ఉండు సాధువులను, ఎల్లవారిని మిగుల హింస పెట్టుచు ఉండెను. ఆ హింసలకు ఓర్వఁజాలక మునులును దేవతలును బ్రహ్మచెంతకు పోయి మొఱలిడిరి. అప్పుడు బ్రహ్మ వారిని పిలుచుకొని పాలసముద్రమున ఉండు విష్ణువు దగ్గఱకు పోయి ప్రార్థింపఁగ అతఁడు మనుష్యరూపమున శ్రీరాముఁడు అనుపేర భూమిని అవతరించి ఈరావణుని చంపెను. చూ|| జయవిజయులు.

ఈ రావణుఁడు దిగ్విజయముచేయ బయలుదేఱినపుడు తొలుత కుబేరునితో తలపడి యుద్ధమునందు జయము పొంది అతని విమానము అగు పుష్పకమును అపహరించుకొని దానిపై ఎక్కి సంచరించు తఱిని అది కైలాసగిరి సమీపమున నిలుపఁబడఁగా అందులకు కారణము విచారించి శివుని మహిమ అని నంది వలన ఎఱిఁగి నావిమానమును అడ్డగించిన శివుని కొండతోడ ఎత్తిపాఱవైతును కాక అని కైలాసమును పెల్లగించి చెండాడినట్టు ఎగరవైవ ఆరంభించెను. అప్పుడు ఆకొండపై ఉన్న శివుఁడు తన కాలి పెనువ్రేలితో ఆకొండను అదుమఁగా వీనిచేతులు దానిక్రింద చిక్కుకొని ఊడతీసికొన కూడక పోయెను. ఆ బాధచే వీఁడు చిరకాలము గొంతెత్తి ఏడ్చి ఏడ్చి కడపట శివుని పలుదెఱుఁగుల నుతించెను. అంత అతఁడు కరుణార్ద్రచిత్తుఁడు అయి తన కాలివ్రేలిని ఎత్తఁగా వీఁడు తన చేతులను ఊడ తీసికొనెను. ఇట్లు ఆ కొండక్రింద చేతులు తగులుకోఁగా వీఁడు గొప్పధ్వనితో రోదనముచేసి నందున వీనికి రావణుఁడు అనుపేరు కలిగెను.

ఇది కాక ఈరావణుఁడు ఒకానొకప్పుడు వాలితో యుద్ధము చేయ కోరి కిష్కింధకు పోయి అచట వాలిని కానక అతఁడు దక్షిణ సముద్రమునకు స్నానార్థము పోయి ఉన్నాఁడు అని విని అచటికి పోయి చూచి సంధ్యవార్చుచు ఉన్న అతని వెనుక ప్రక్కచేరి మెల్లమెల్లఁగా పట్టుకొన యత్నింపఁగా, అతఁడు అది తెలిసికొని రావణుని చేతులు తన సందిట చొప్పింపఁబడునంతవఱకు కదలక మెదలక ఉండి సందిట అదిమి పట్టుకొని నాలుగు సముద్రములయందు ముంచి అలయించి పిమ్మట ఏమి ఎఱుఁగని వానివలె దిగవిడిచి దశగ్రీవా ఎక్కడనుండి వచ్చితివి అని పరిహసించెను. అంతట రావణుఁడు లజ్జితుఁడు అయి అతనితో స్నేహముచేసి ఆవలపోయెను.

మఱియొక సమయమున కార్తవీర్యార్జునునితో పోరాడవలెనని పోయి అతనిచేత చెఱసాలలో ఉంచఁబడెను. చూ|| కార్తవీర్యార్జునుఁడు.

మఱియు ఈరావణుఁడు స్వర్గముమీఁద దండెత్తిపోవుచు మేరుపర్వతపు నెత్తమునందు దండుతోడ విడిసి ఆదారిని నలకూబరుని ఒద్దకు పోవుచు ఉన్న రంభను బలాత్కారముగా పట్టి రమించి విడిచెను. ఆ వృత్తాంతము నలకూబరుఁడు తెలిసికొని రోషాయత్తచిత్తుఁడై రావణుఁడు రంభను పట్టినట్టు ఇఁకమీఁద బలాత్కారముగా ఏయాఁడుదానినైన పట్టెనేని వానితలలు అప్పుడే వేయి వ్రక్కలు అయి చచ్చును గాక అని శపించెను.

ఇంతేకాక ఈరావణుఁడు దేవేంద్రునితో యుద్ధముచేయునపుడు ఇంద్రుని ఏనుఁగు అగు ఐరావతము తన కొమ్ములతో వీనిఱొమ్మున క్రుమ్మఁగా ఆకొమ్ములు తునిఁగి పోయెను. కనుక వీఁడు మిగుల దృఢమైన దేహము కలవాఁడు అని ఊహింప వలయును. వెండియు ఇతనికి బ్రహ్మవరప్రభావముచేత కడుపున అమృతకలశము ఒకటి కలిగి ఉండుటచే వీనితలలు ఎన్నిమాఱులు నఱికినను మరల మరల మొలచుచు ఉండును. ఆసంగతి విభీషణునికి తెలియును కనుక అతఁడు చెప్పఁగా రాముఁడు ఆయమృతకలశమును భేదించి తలలు నఱకఁగా వీఁడు చచ్చెను.

రావణాసురుడి వంశపరంపర

[మార్చు]

రావణాసురుడి వంశము రామాయణంలో మాత్రమే స్పృశింపబడింది. వేరే పురాణాలలో అంత వివరంగా చెప్పబడలేదు. రావణాసురుడి భార్య మండోదరి. ఈమె పతివ్రత, మయుడి కూతురు. రావణాసురుడికి ఏడుగురు కొడుకులు.

  1. ఇంద్రజిత్తు
  2. ప్రహస్థుడు
  3. అతికాయుడు
  4. అక్షయకుమారుడు
  5. దేవాంతకుడు
  6. నరాంతకుడు
  7. త్రిశిరుడు

రావణాసురుడి తండ్రి వైపు నుండి తాత పులస్త్యుడు, అతని తండ్రి బ్రహ్మ. రావణాసురుని తల్లి వైపు నుండి తాత మల్యవుడు, అమ్మమ్మ తాటకి. రావణాసురుడి మామ మారీచుడు. రావణాసురుడికి ఆరుగురు సోదరులు, ఇద్దరు సోదరీమణులు. వారు:

  1. కుబేరుడు - ఉత్తర దిశకు రాజు. స్వర్గ సంపదకు రక్షకుడు. రావణుని పెద్ద తమ్ముడు. వారిద్దరు ఒకే తండ్రికి, వేర్వేరు తల్లులకు జన్మించినవారు.
  2. విభీషణుడు - రామచంద్రమూర్తిని శరణాగతి కోరినవాడు. సీతను రామచంద్రుడికి తిరిగి ఇచ్చి శరణాగతిని కోరుకొనమని హితవచనాలు పలికిన కారణాన, రావణుడు విభీషణుడిని రాజ్యబహిష్కారం చేశాడు. విశ్వవసు బ్రహ్మ కుమారుడు, కైకసికి వరప్రసాదంగా జన్మించాడు. యుద్ధకాండ ప్రారంభంలో తన సహచరులతో, లంకనుండి ఆకాశమార్గాన వచ్చి రామచంద్రమూర్తి శరణాగతి కోరగా రాముడు యద్ధానికి పూర్వమే, రావణాసురుడు నిహతుడు కావడానికి ముందే లంకకు పట్టాభిషిక్తుణ్ణి చేస్తాడు.
  3. కుంభకర్ణుడు - హిందూ పురాణాలలో అశ్చర్యము కలిగించే రాక్షసులలో కుంభకర్ణుడు ఒకడు. కనిపించిన జీవరాసులన్నింటినీ భక్షిస్తుంటే, ఇంద్రుడి విజ్ఞప్తిపై కుంభకర్ణుడు ఎల్లకాలము నిద్రించేట్లుగా బ్రహ్మ శపిస్తాడు. (మూలము లేదు-బ్రహ్మ వరమిచ్చినప్పుడు తికమకకు గురై నిరంతర నిద్రలోకి వెళ్లేట్టు వరమును పొందాడు) ఈ విషయము విన్న రావణుడు దిగ్భ్రాంతికి గురై, సోదర వాత్సల్యముతో బ్రహ్మను వేడుకొని శాపాన్ని సడలించేట్లు చేస్తాడు. ఆ సడలింపు ప్రకారము కుంభకర్ణుడు సంవత్సరములో ఆరు నెలలు నిద్రావస్థలోను, ఒకరోజు మెలకువగాను ఉంటాడు. ఆ రోజు ఆరు నెలలకు సరిపడ ఆహారాన్ని భక్షిస్తాడు. రామునితో యుద్ధం జరిగే సందర్భములో అతి కష్టముతో కుంభకర్ణుని నిద్రనుండి లేవదీస్తారు. ఈయన రావణుని, ధర్మమార్గము అవలంబించి, సీతను తిరిగి పంపి రాముని శరణు వేడమని నచ్చజెప్పటానికి ప్రయత్నిస్తాడు. రావణుని మార్చలేక సోదరుని తరఫున యుద్ధం చేసి యుద్ధరంగంలో మరణిస్తాడు. మరణించే ముందు విభీషణుని కలిసి ధర్మమార్గమున నడుస్తున్నందుకు దీవిస్తాడు.
  4. ఖరుడు - జనస్థానములో సత్కార్యాలను నిరోధించడానికి రావణాసురుడు ఖరుడిని నియమిస్తాడు. జనస్థానము యొక్క సరిహద్దులు దక్షిణమున లంకా పట్టణం, ఉత్తరమున కోసలరాజ్యము. శూర్పణఖ తనకు లక్ష్మణుడు జరిపిన పరాభవాన్ని వివరించగా, రామలక్ష్మణుల మీదకు యుద్ధానికి వెళ్ళి, అద్వితీయమైన యుద్ధము జరిపి రాముని బాణముచేత నిహతుడౌతాడు.
  5. దూషణుడు - జనస్థానములో ఖరుడి మంత్రి
  6. అహిరావణుడు - రావణుడు, మాయాసురుడు వంటి రాక్షసులు పాలించే అథోలోకానికి చక్రవర్తి. ఇతనిని మైరావణుడుగా కూడా పిలుస్తారు.
  7. కుంభిని - రావణుని సోదరి, దస్యుడు, మధుర చక్రవర్తి మధు భార్య. లవణాసురుని తల్లి. ఈమె అందగత్తెగా ప్రసిద్ధి చెందింది. ఆ తరువాత కాలములో తపస్సు చేసికొనుటకు సముద్రానికి ఉపక్రమించింది.
  8. శూర్పణఖ - ఈమె రావణుని దుష్ట సోదరి. సీతాపహరణానికి ప్రధాన కారణం ఈమె. తన సోదరుడైన రావణుని రామునిపై ఉసిగొల్పినది.

రావణాసురుని ఇతర పేర్లు

[మార్చు]
యుద్ధంలో రావణుడు కొయ్య రథం ఫలకం పై చెక్కబడిన శిల్పం. 19వ శతాబ్దానికి చెందినది. ప్రకాశం జిల్లా కొత్తపట్నం గ్రామంలోని శ్రీ రాజగోపాల స్వామి ఆలయం వారిచే బహూకరింపబడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురావస్తు సంగ్రహాలయం, హైదరాబాదులో భద్రపరచబడింది. (మ్యూజియం వారి సౌజన్యంతో ఫొటో తీయబడినది)
  • దశకంఠుడు - పది మంది జ్ఞానులతో సమానమైన జ్ఞానం కలవాడు.
  • రావణాసురుడు- కైలాస పర్వతాన్ని తన రెండు చేతులతో పెకలిస్తున్నప్పుడు పరమశివుడు అతని చేతివ్రేళ్ళని కాలితో త్రొక్కినప్పుడు దశకంఠుడు అతి బిగ్గరగా అరిచాడు. ఆ అరుపు (అరుపు=రావణ) వల్ల రావణుడనే పేరు వచ్చింది.
  • దశముఖుడు
  • దశగ్రీవుడు

బ్రహ్మ గురించి తపస్సు

[మార్చు]

సర్వలోకాలను జయించాలని కోరికతో రావణాసురుడు బ్రహ్మ గురించి అకుంఠిత తపస్సు ప్రారంభిస్తాడు. వేలసంవత్సరాల తపస్సు తరువాత బ్రహ్మ సాక్షాత్కరించినపుడు అమరత్వం కోరుకొనగా బ్రహ్మ నిరాకరిస్తాడు. బదులుగా తనను ఏ దేవతలు, రాక్షసులు, సర్పాలు, పిశాచాల ద్వారా మరణం ఉండకూడదనే వరాన్ని కోరుకొంటాడు. బ్రహ్మ దానికి అంగీకరించి ఈ వరంతో పాటు అద్వితీయమైన అస్త్రాలు ఇస్తాడు.

కాంచన లంక

[మార్చు]
వాట్ ఫ్రా క్యూ, థాయిలాండ్లో ద్వారపాలకుడిగా దశకంఠుడి (రావణుడు) విగ్రహం

ఈ వరాలు పొందిన తరువాత, రావణుడు తన తాత అయిన సుమాలిని తొలగించి ఆ సేనలకు రాజైనాడు. ఆ పిమ్మట అతని దృష్టి లంకా నగరంపై పడినది. లంకా నగరం కుబేరుని కొరకు, దేవ శిల్పి విశ్వకర్మ ద్వారా నిర్మితమైన సుందర నగరం.విశ్రవసుని కుమారుడైన కుబేరుడు, ఎంతో దాతృత్వముతో కైకసి బిడ్డలతో తన వైభవమును పంచుకొను చుండెను. రావణుడు అందుకు అంగీకరింపక లంకా నగరాన్ని పూర్తిగా తన వశం చేయవలెనని కుబేరుని బెదిరించెను. రావణుని యుధ్ధములో వోడించుట సాధ్యము కాదని తెలిసి, విశ్రవసుడు లంకా నగరాన్ని ఇచ్చి వైదొలగవలసినదిగా కుబేరుని కోరెను. ఈ విధముగా రావణుడు లంకాధిపతి అయినప్పటికీ, రాజుగా ఎంతో ఉదారశీలిగా, సమర్థవంతమైన పాలకుడిగా కీర్తి ప్రతిష్ఠలను ఆర్జించెను. అతని పాలనలో లంకా రాజ్యముతో, సకల ఐశ్వర్యములతో తులతూగుచుండెను. ఆ రాజ్యమున అత్యంత పేదవారు సైతము బంగారు పాత్రలలో అన్నపానాదులు భుజిస్తూ, ఆకలి అన్నది ఎరుగక ఉండెడివారు.

రావణాసురుని శివభక్తి

[మార్చు]
కైలాసగిరిని ఎత్తుతున్న రావణుడు - ఎల్లోరా గుహలలో శిల్పం, మహారాష్ట్ర

లంకను జయించిన పిమ్మట రావణుడు మనోహరమైన కైలాసపర్వతాన్ని చూశాడు. తన బలనిరూపణకై దాన్ని పెకలించి ఎత్త ప్రయత్నించాడు. దశకంథని గర్వానికి కోపించిన శివుడు తన కాలి చిటికెన వేలితో కైలాస పర్వతాన్ని నొక్కి, దాని కింద రావణున్ని అణగదొక్కాడు. అప్పుడు రావణుడు అతి బిగ్గరగా చేసిన ఆర్తనాదం వల్లనే అతనికి ఆ పేరు వచ్చింది - రావణుడు:భయంకరమైన 'రవం' (శబ్దం) చేయువాడు. అతని అరుపుకి భూమి కంపించినట్లుగా వర్ణించబడింది. శివునితో తలపడ్డ తన తప్పుని ప్రమథగణాలు తెలియచెప్పగా రావణుడు మిక్కిలి పశ్ఛాత్తాపానికి లోనయ్యాడు. అప్పుడు శివుని మెప్పించుటకు ఎన్నో విధాలుగా, పలు సంవత్సరాల పాటు స్తుతించగా, అతని శౌర్యానికీ భక్తికీ మెచ్చిన ముక్కంటి ఎన్నో వరాలతో పాటుగా'చంద్రహాస' ఖడ్గాన్ని కూడా ప్రసాదించాడు.

ప్రపంచాన్ని జయించడం

[మార్చు]

అనితర సాధ్యమైన శక్తులు సాధించిన రావణుడు నరులు, దేవతలు, ఇతర రాక్షసులపై వరుసగా యుద్ధాలు చేశాడు. పాతాళ లోకాన్ని పూర్తిగా జయించి తన కొడుకైన అతిరావణున్ని రాజుగా నియమించాడు. ముల్లోకాలలోని రాక్షసులనూ జయించి, అజేయులయిన నివాతకవచులతోనూ, కాలకేయులతోనూ రాజీ కుదుర్చుకున్నాడు. భూలోకంలోని ఎన్నో సామ్రాజ్యాలను జయించటం ద్వారా చక్రవర్తిగా పట్టాభిషిక్తుడయ్యాడు. కుబేరుడు ఒకసారి రావణుని క్రూరత్వాన్నీ, దురాశనీ నిందించగా కోపించిన రావణుడు స్వర్గంపై దండెత్తి (కుబేరుని తప్ప) అందరు దేవతలనూ ఓడించి కుబేరుని కించపరిచాడు. తన బలాధిక్యతతో దేవతలనూ, సర్పజాతులనూ తన పాలనలోకి తెచ్చుకున్నాడు. కొన్ని వందల ఏళ్ళ తరువాత జరిగిన రామాయణకాలం నాటికి రావణుడు సర్వ మానవ, దేవతా జాతులను జయించి, చివరికి సూర్యుని గతిని మార్చగలిగే శక్తి కలవానిగా రామాయణకావ్యంలో చెప్పబడింది.

స్త్రీ ల మీద ఉన్మాదం

[మార్చు]
సీతను ఎత్తుకెళుతూ జటాయువుని చంపిన రావణుడు - రాజా రవి వర్మ

రావణుడు రసికతకు, స్త్రీల కొరకై ఎంతకైనా తెగించేవాడుగా పేరు గాంచాడు. ఇతనికి ఎంతోమంది భార్యలు. వారిలో ముఖ్యమైనది మయసురుడి కూతురు, అప్సరస అయినటువంటి మండోదరి. మండోదరి తెలివితేటలకు, అందానికి పెట్టింది పేరు. ఉన్న భార్యలు చాలక రావణుడు తను గెలిచిన దేశాలనుండి ఎంతోమంది మహిళలను తెచ్చి తన అంతఃపురంలో ఉంచాడు. తనను నిరసించిన యువతిని కైవసం చేసుకోవటానికి రావణుడు ఎంతకైనా తెగించేవాడు. ఇలాంటి రెండు ఘటనల కారణంగానే రామాయణ మహాకావ్యం ఉద్భవించిందని చెప్పవచ్చు. మొదటిది సన్యాసినియైన వేదవతిని బలాత్కరించ బూనడం. వేదవతి విష్ణువును చేపట్టడానికి కఠోరమైన తపస్సు చేయసాగింది. సాధుజీవనం ఆమె అందాన్ని మరింత పెంచింది. కుటీరానికి వచ్చిన రావణుడు ఆమెను కామించాడు. కాని ఆమె అతన్ని ఎదిరించింది. కాని రావణుడు బలాత్కారంగా ఆమెను చెరపట్టడానికి ఉద్యుక్తుడయ్యాడు. అప్పుడామె అతని చావుకి తానే కారణమౌతానని ప్రవచించి, మంటలను ప్రజ్వరిల్లజేసి అందులో బూడిదై పోయింది. తర్వాత ఆమే సీతగా పుట్టి, విష్ణువుకి (రాముడి రూపంలో) భార్యగా మారి, రావణుడి చావుకి కారణమైంది.రెండోది అప్సరస రంభతో రావణుడి వ్యవహారం. రావణుడు రంభను మోహించి బలవంతం చేయబోతాడు. అప్పుడు రంభ తనకు కుబేరుడి కొడుకుతో వివాహం నిశ్చయమైనందున తాను రావణుడికి కుమార్తె సమానురాలనని, కామకలాపాలకు సరికాదని చెపుతుంది. కానీ రావణుడు వినకుండా బలవంతం చేయబోతాడు. దాంతో కోపించిన కుబేరుడి కొడుకు, ఇకముందు ఏ స్త్రీనైనా బలవంతపెడితే అతని పది తలలు రాలిపోతాయని శపిస్తాడు. ఈ శాపమే రావణుడి చెరలో ఉన్న కాలంలో సీతను కాపాడిందని చెప్పబడుతుంది.

రామాయణంలో రావణాసురుడు

[మార్చు]

అరణ్యకాండలో

[మార్చు]

రావణాసురుని దుర్మార్గత్వాన్ని, గొప్పతనాన్ని, శౌర్యాన్ని, దానగుణాన్ని వాల్మీకి మహర్షి అరణ్యకాండ 32వ సర్గలో వర్ణిస్తాడు. రావణాసురుడు కొలువు తీరిఉంటే రెండవ ఇంద్రుడు వలే ఉన్నాడు. నోరు తెరుచుకొని ఉన్న ఈ రావణాసురుని చూస్తే రెండో యముడు వలె ఉన్నాడు. తెల్లని పట్టు పుట్టం కట్టుకొని ఉన్న ఈ రావణాసురుడికి ఇరవై బాహువులతో, పది తలలతో, విశాల వక్షం కలిగి, వాని ఛాతీపై వజ్రాయుధపు వాతలు, ఐరావతం దంతాలతో కుమ్మిన గుర్తులు, సుదర్శన చక్రపు గాటులు ఉన్నాయి.

  • వాసుకి పాలిస్తున్న పాతాళ లోకానికి వెళ్ళి తక్షకుని భార్యను అపహరించి తన భార్యగా చేసుకొంటాడు.
  • కైలాసపర్వతం వైపు వెళ్ళి తన సోదరుడైన కుబేరుని యుద్ధంలో జయించి పుష్పకవిమానాన్ని కాంచనలంకకు తెచ్చుకొన్నాడు.
  • ఉత్తరభారతంలో ఉన్న చైత్రవనాన్ని ధ్వంసం చేశాడు. స్వర్గానికి వెళ్ళి నందనవనాన్ని ధ్వంసం చేశాడు.
  • సూర్యచంద్రులను రెండు చేతులతో గట్టిగా పట్టుకొని వారి గమనాన్ని నిరోధిస్తాడు.
  • పూర్తి కావస్తున్న యజ్ఞయాగాదులను ధ్వంసం చేయడం అంటే అత్యంత ప్రీతి. యజ్ఞాలలో ఇచ్చే సోమరసాన్ని ఇంద్రుడు సంగ్రహించకుండా తానే స్వీకరించి, యజ్ఞఫలాన్ని నాశనం చేస్తాడు.

సుందరకాండ లో

[మార్చు]

సుందర కాండలో రావణాసురుని ప్రవేశం అతను సీతను తన వశం కమ్మని ఆదేశించే ఘట్టంతో మొదలవుతుంది. అదే మొదటిసారి హనుమంతుడు (దూరం నుండి) రావణుని చూడడం. తరువాత హనుమంతుని పట్టి తెమ్మని రావణుడు తన సేనను, అనంతరం కుమారుడు ఇంద్రజిత్తునూ పంపుతాడు. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రానికి వశుడైనట్లు నటించి హనుమంతుడు రావణుని సభాభవనంలో ప్రవేశించి రావణుని చూశాడు. రావణా సురుని మొదటి వర్ణన వాల్మీకి ఇక్కడే వ్రాశాడు.

రావణుని కిరీటం, ఆభరణాలు, వస్త్రాలు, అనులేపనాదులు అత్యద్భుతంగా ఉన్నాయి. మహా తేజశ్శాలియు, వీరుడును ఐన రావణుడు పది శిరస్సులతో ఒప్పుచు, అనేక కౄర మృగములతో నిండిన శిఖరములు గల మందరగిరి వలె ప్రకాశిస్తున్నాడు. మణిమయాలంకృతమైన ఉన్నతాసనంపై కూర్చొని ఉన్నాడు. మంత్రాంగ నిపుణులైన నలుగురు మంత్రులచే పరివేష్టితుడై ఉన్నాడు. అప్పుడు హనుమంతుడు ఇలా అనుకొన్నాడు.

ఆహా! ఈ రావణుని రూపం అత్యద్భుతం. ధైర్యం నిరుపమానం. సత్వం ప్రశంసార్హం. తేజస్సు అసదృశం. నిజముగా ఈ రాక్షస రాజు సర్వ లక్షణ శోభితుడు. ఈ అధర్మానికి ఒడి గట్టకపోతే సురలోకానికి సైతం ప్రభువయ్యేవాడు. లోకాలన్నీ ఇతనికి భయపడుతున్నాయి. ఇతడు కృద్ధుడైనచో సమస్త జగత్తునూ సముద్రమున ముంచి ప్రళయం సృష్టించగల సమర్ధుడు గదా!

యుద్ధకాండ లో

[మార్చు]

సీతాపహరణానంతరం రాముడు సముద్రంపై వారధిని నిర్మించి లంకను ముట్టడించడానికి వానరభల్లూక సేనా సమేతుడై వచ్చాడు. అక్కడ లంకలో రావణుడు యుద్ధము విషయమై తనవారితో మంత్రాంగం నెరప సాగాడు. పుర భద్రత కట్టుదిట్టంగా ఉండాలని ఆనతిచ్చాడు. రాక్షస వీరులు రావణుని ప్రతాపాన్ని, తమ శక్తి సామర్ధ్యాలను కీర్తించుకొని, నిర్భయంగా ఉండమన్నారు. ఒక్కొక్కరు తానే రామలక్ష్మణులను కడతేర్చగలమన్నారు. కాని రావణుని తమ్ముడైన విభీషణుడు రావణునితో విభేదించాడు. తనకు ఆప్తులైన నలుగురు రాక్షసులతోకలిసి విభీషణుడు అన్నగారి సెలవు తీసికొని ఆకాశానికి ఎగిరి, సాగరముదాటి, రాముని శరణు జొచ్చాడు.

తమ మధ్య వైరం ఏమీ లేదు గనుక రామునికి సాయం చేయవద్దని రావణుడు సుగ్రీవునికి శుకుడనే దూత ద్వారా దౌత్యం పంపాడు. అందుకు సుగ్రీవుడు - "రావణా! నాకు నువ్వు చేసిన సాయం లేదుగనుక నాకు ప్రియుడవు కావు. రామునికి విరోధివి గనుక నాకు కూడా విరోధివే. రాముని కోపానికి గురైనందున నిన్ను రక్షించే శక్తి ముల్లోకాలలోనూ లేదు" అని సమాధానం పంపాడు. నలుని పర్యవేక్షణలో అయిదు దినములలో 100 యోజనముల పొడవు, 10 యోజనముల వెడల్పు గల వారధి నిర్మించారు. వానర భల్లూకసేనల, రామలక్ష్మణులు వారధి దాటి లంకను చేరారు. నీలుని నాయకత్వంలో ఆ సేన మరో సాగరంలా ఉండి, రామకార్యానికి సన్నద్ధమై ఉంది. త్రికూటపర్వతం పైన లంకా పట్టణం సంకల్పమాత్రాన విశ్వకర్మ నిర్మించినట్లు వైభనంగా ఉంది. ఆ శోభను గమనించి రాముడు ఆశ్చర్య పోయాడు. భూమి రక్తంతో తడిసిపోయేంత యుద్ధం నిశ్చయమని రామునికి శకునాలు తోచాయి.

రావణుడు విద్యుజ్జిహ్వుడనే మాయలమారి రాక్షసుని పిలిపించి రాముని శిరస్సును పోలిన ఒక మాయా శిరస్సును, ధనుర్బాణాలను చేయించాడు. యుద్ధంలో రామలక్ష్మణులు, వానర సైన్యం నశించారని సీతతో చెప్పి ఆ మాయా శిరస్సును, ధనుర్బాణాలను చూపాడు. సీత కన్నీరు మున్నీరుగా విలపించింది కాని అది మాయ అని తరువాత తెలుసుకొంది. రావణుని తల్లికి పినతండ్రి అయిన మాల్యవంతుడనే వృద్ధుడు రావణునికి యుద్ధం మానమని హితవు పలుకబోయాడు. అతనిని రావణుడు కఠినంగా దూషించాడు. వానర సేనా, రామలక్ష్మణులూ అజేయులు, అసమానులు అని రావణుడు విన్నాడు కాని కాని ప్రహస్తుని నాయకత్వములోని రావణ సేనాబలం కూడా పరాజయం ఎరుగనిది. ముఖ్యంగా ప్రహస్తుడూ, ఇంద్రజిత్తూ, నికుంభుడూ - వీరిలో ఎవరైనా తప్పక రామలక్ష్మణులను కడతేర్చగలరనీ, కనుక ఇక ఇంద్రుని వజ్రాయుధాన్ని గడ్డిపోచలా తలిచే కుంభకర్ణుడూ, తనూ యుద్ధానికి రావలసిన అవుసరమే రాదనీ రావణుడి విశ్వాసం.

సైన్యాన్ని సమాయత్తపరచి అన్ని యెడలా రక్షణకు పటిష్ఠమైన ఏర్పాట్లు చేయించాడు రావణుడు. తూర్ప ద్వారంలో ప్రహస్తుడు, దక్షిణాన మహాపార్శ్వ మహోదరులు, పశ్చిమాన ఇంద్రజిత్తు, ఉత్తరాన శుక సారణులు అప్రమత్తులై యున్నారు. విరూపాక్షుడు లంకానగరం మధ్యనున్నాడు. రావణుడు స్వయంగా ఇతర స్థలాలతో పాటు ఉత్తర ద్వారాన్ని పర్యవేక్షిస్తానని చెప్పాడు. రాముని పంపున అంగదుడు దూతగా వెళ్ళి చివరిసారిగా రావణునికి రాముని సందేశాన్ని వినిపించాడు. సీతనిచ్చి శరణు కోరితే రాముడు క్షమించి వదిలి వేస్తాడని చెప్పాడు. అంగదుని రావణుడు తృణీకరించాడు.

యుద్ధంలో ధూమ్రాక్షుడు, వజ్రదంష్ట్రుడు, నరాంతకుడు, కుంభహనువు, మహానాధుడు, సమున్నతుడు, ప్రహస్తుడు వంటి రాక్షస మహావీరులు హతులయ్యారు. ఇక లాభం లేదనుకొని రావణుడు స్వయంగా మహావీరులైన రాక్షసగణాలను వెంటబెట్టుకొని దివ్యరథంపై యుద్ధానికి వెడలాడు. అతనివెంట రాక్షససేన కదలి వచ్చే కాటుక కొండలలాగా ఉంది. వారి మధ్య శ్వేతఛత్ర ధారియై రావణుడు ప్రచండ భానునిలా మెరిసిపోతున్నాడు. రావణుని తేజస్సును చూసి రాముడు ఆశ్చర్యపోయాడు. సీతను అపహరించిన పాపానికి రావణునికి అంత్యకాలం సమీపించిందని చెబుతూ రాముడు ధనుస్సు ఎక్కుపెట్టాడు. లంకా నగర రక్షణార్ధమై తక్కిన రాక్షస నాయకులను రావణుడు వెనుకకు పంపేశాడు. కాలనాగులవంటి తన బాణాలతో వానర సైన్యాన్ని చిందరవందర చేయసాగాడు. సుగ్రీవుడు మూర్ఛపోయాడు. గవాక్షుడు, ఋషభుడు, గవయుడు, జ్యోతిర్ముఖుడు, నలుడు వేసిన పర్వత శిఖరాలను రావణుడు పిండి పిండి చేసేశాడు. హనుమంతుని అరచేతి చరుపుకు రావణుడు, రావణుని పిడికిలి పోటుకు హనుమంతుడు కంపించిపోయారు. నీలుడు అంగుష్ఠమాతృడై రావణుని చికాకు పరచాడు. నీలుడు అగ్ని పుత్రుడు గనుక రావణుని ఆగ్నేయాస్త్రం నీలుని సంహరించలేకపోయింది. లక్ష్మణుడి బాణాలతో రావణుడి ధనుసు విరిగిపోయింది. రావణుడి శక్తితో లక్ష్మణుడు తెలివి తప్పాడు. అతనిని రావణుడు ఎత్తలేకపోయడు. హనుమంతుడు లక్ష్మణుని ఎత్తి రామునివద్ద పడుకోబెట్టాడు. హనుమంతుని గుద్దుకు రావణుడు నెత్తురు కక్కి మూర్ఛిల్లాడు. తెలివి తెచ్చుకొని మళ్ళీ శరాఘాతం ప్రాంభించాడు.

రామ రావణ యుద్ధము

హనుమంతుని భుజాలపై అధిరోహించి రాముడు రావణునిపై పోరు సాగించాడు. రావణుని వాడి బాణాలకు ఆంజనేయుడు జంకలేదు. అప్పుడు జరిగిన భీకరసంగ్రామంలో రావణుని రథం, గుర్రాలు, ఛత్రం, ధ్వజం ధ్వంసమయ్యాయి. కిరీటము నేలబడింది. ధనుసు చేజారింది. విశ్రాంతి తీసికొని మరునాడు యుద్ధానికి రమ్మని రాముడు రావణునికి చెప్పాడు. సిగ్గుతో రావణుడు లంకలోకి వెళ్ళిపోయాడు. అవమాన భారంతో క్రుంగిపోయిన రావణుడు కుంభకర్ణుని లేపి యుద్ధానికి పంపాడు. కుంభకర్ణుడు కూలిపోయిన తరువాత కుంభ నికుంబాధి వీరులు, దేవాంతక, నరాంతక, అతికాయ, త్రిశిరులనే రావణ నందనులు, మత్తుడు ఉన్మత్తుడు అనే రావణ సోదరులు - అంతా యుద్ధానికి వెళ్ళి వారుకూడా మరణించారు. పిదప యూపాక్షుడు, శోణితాక్షుడు, ప్రజంఘుడు, కంపనుడు, ఇంద్రజిత్తు కూడాయుద్ధంలో రామలక్ష్మణుల చేత, వానర భల్లూక సైన్యం చేత మరణించారు. ఇంద్రజిత్తు మరణంతో రావణుడు తెలివితప్పి పడిపోయాడు. లేచి, కోపంతో సీతను చంప బోయాడు. సుపార్శ్వుడు అనే బుద్ధిమంతుడైన అమాత్యుడు అతనిని వారించి, వీరోచితంగా యుద్ధంచేసి విజయుడవు కమ్మని చెప్పాడు. ఇక రావణుడు అన్నింటికీ తెగించి మహోదరుడు, మహాపార్శ్వుడు, విరూపాక్షుడు వంటి మహావీరులతోను, సైన్యంతోను ఉత్తర ద్వారంగుండా యుద్ధరంగంలో అడుగుపెట్టాడు. రామ లక్ష్మణ సుగ్రీవాదుల పేర్లమీద జయజయ ధ్వానాలు చేస్తూ, ఉత్సాహంతో పరవళ్ళు తొక్కుతూ వానర వీరులు రాక్షసులనెదుర్కోవడానికి ముందుకు దూకారు. రావణుని మహోగ్ర శర ధాటికి వానర సైన్యము ఛిన్నాభిన్నమైంది. అతనికితోడు విరూపాక్షుడు కూడా విజృంభించాడు. రావణుడు రామునిపైకి ఉరికాడు. విరూపాక్షుడు, మహోదరుడు, మహాపార్శ్వుడు గొప్ప యుద్ధం చేసి మరణించారు. రావణుడు తన వాడి బాణాలతో రామలక్ష్మణాదులను వేధించ సాగాడు. లక్ష్మణుడు రావణుని సారథి తల యెగురగొట్టాడు. ధనస్సు విరిచేశాడు. మనుష్య శీర్షం చిత్రించి ఉన్న రావణ పతాకాన్ని ముక్కలు చేశాడు. విభీషణుడు రావణుని గుర్రాలను చావగొట్టాడు. విభీషణునిపై రావణుడు వేసిన అస్త్రాలను, శక్తిని లక్ష్మణుడు నిర్వీర్యం చేసేశాడు. వానరులు జయజయధ్వానాలు చేశారు. రావణుడు విసిరేసిన శక్తి వక్షస్థలానికి తగిలి లక్ష్మణుడు మూర్ఛపోయాడు. సోదరుని అవస్థకు పరితపిస్తూనే ప్రళయాగ్నిలా రాముడు రావణునిపై బాణవర్షం కరిపించసాగాడు. రాముడు తనవారిని ఉద్దేశించి - "మీరు సౌమిత్రిని రక్షిస్తూ, యుద్ధం చూస్తూ ఉండండి. నేను రాముడంటే ఏమిటో చూపిస్తాను. జగత్తు అరావణం కానాలి" అన్నాడు. రామ రావణ సంగ్రామం చెలరేగింది. ఎంతో సమయం యుద్ధం చేసిన రావణుడు గాలిలోకి ఎగిరి మేఘంలోకి దూరిపోయి లంకలోకి వెళ్ళిపోయాడు. హనుమంతుడు గరుడగమనంతో వెళ్ళి మూలికలతో సహా పర్వతాన్నే పెకలించుకొని వచ్చి లక్ష్మణుని ప్రాణం రక్షించాడు. లక్ష్మణుడు లేచి నిలబడి, "అన్నా! ముందు నువ్వు ప్రతిజ్ఞ చెల్లించుకో. నీ కంట పడ్డాక శత్రువు బతికి ఉండగలడా? ఈ సాయంసంధ్యలో సూర్యుడు అస్తమించకుండానే రావణుడు కడతేరాలి" అన్నాడు. అదే సమయంలో ఇంద్రుడు పంపగా మాతలి దివ్యమైన రథంతో సారథిగా వచ్చాడు. రాముడు సంతోషించి ప్రదక్షిణం చేసి రథం యెక్కాడు. రావణుడు వజ్రసదృశమైన శూలాన్ని చేతబట్టి మళ్ళీ యుద్ధానికి వచ్చాడు. రావణుడు విసిరేసిన శూలం ఎదురుపడి రాముని బాణాలు కాలిపోయాయి. అప్పుడు రాముడు మాతలి తెచ్చిన ఇంద్రశక్తిని విసిరేశాడు. అది రావణుని శూలాన్ని నిర్మూలించింది. రావణుడు కూడా శరపరంపరతో రాముని ముంచెత్తాడు. రాముడు విడచిన తీవ్ర బాణాలతో రావణుడి శరీరం రక్తసిక్తమయ్యింది. చివరకు అస్త్రవిహీనుడైన రావణుని పరిస్థితి గమనించి అతని సారథి రథాన్ని దూరంగా తీసుకుపోయాడు. అగస్త్యుడు అక్కడికి వచ్చి యుద్ధ పరిశ్రాంతుడై యున్న రామునకు సనాతనము, పరమ రహస్యము అయిన "ఆదిత్య హృదయము"ను ఉపదేశించాడు. రాముడు ఆచమించి ఆ మంత్రరాజాన్ని మూడు మార్లు జపించాడు. జ్యోతిర్గణాధిపతి, దినకరుడు, జయభద్రుడు, సహస్రాంశుడు, తమోఘ్నుడు, శత్రుఘ్నుడు అయిన ఆదిత్యునకు నమస్కరించాడు. ధనుస్సు ధరించి రావణ సంహారానికి దీక్ష పూనాడు. రావణుని సారధి మళ్ళీ రధాన్ని రాముని ముందుకు తెచ్చాడు. సకలాయుధ సంపన్నమై, ఒక గంధర్వ నగరంలా ఉన్న ఆ రథం అప్రదక్షిణంగా వచ్చింది. ఇక రావణుని మరణం తప్పదని గ్రహించిన రాముడు తమ రధాన్ని ప్రదక్షిణ మార్గంలో పోనిమ్మని మాతలికి చెప్పాడు. సర్వ శక్తులనూ ఒడ్డి రాముడు, రావణుడు శరవర్షాన్ని కురిపింప సాగారు. వారి బాణాలు ఆకాశాన్ని కప్పేశాయి. "రామరావణ యుద్ధం రామరావణ యోరివ" - వారి యుద్ధానికి మరొకటి పోలిక లేదు - అని దేవగణాలు ఘోషిస్తున్నాయి. వారి రథాలు యుద్ధరంగమంతా కలియదిరిగాయి. రాముని బాణాలకు రావణుని పతాకం కూలింది. గుర్రాలు తొలగిపోయాయి. మహా సర్పాలవంటి రాముని బాణాలకు రావణుని తల తెగిపడింది. కాని వెంటనే మరొకటి మొలిచి ఉంది. ఇలా నూటొక్కసార్లు రావణుని తలలు తెగగొట్టినా మరల మరల మొలుస్తూనే ఉన్నాయి. "రామా! ఇలా కాదు. బ్రహ్మాస్త్రాన్ని సంధించు" అని మాతలి అన్నాడు. అప్పుడు రాముడు తనకు అగస్త్యుడిచ్చిన బ్రహ్మాస్త్రాన్ని తీశాడు. రాముడు ఆ దివ్యాస్త్రాన్ని వేదోక్తంగా అభిమంత్రించి, ధనుస్సును బాగుగా లాగి సావధాన చిత్తుడై విడచాడు. వజ్రసమానమైన బ్రహ్మాస్త్రం నిప్పులు చిమ్ముతూ రావణుని గుండెను చీల్చి, అతని రక్తంతో పూయబడినదై, ఉపశమనం కోసం భూమిలో ప్రవేశించి, సావధావంగా తిరిగి వచ్చి రాముని అమ్ముల పొదిలో చేరింది. సకలదేవతలు రామునకు అంజలి ఘటించారు. సుగ్రీవ విభీషణ అంగదాదులు, లక్ష్మణుడు, ఇతర సహమిత్రులు విజయోత్సాహంతో రణాభిరాముడైన రాముని యధావిధిగా పూజించారు. ఇంతటితో రావణుని కథ అంతమయ్యింది.

ఇతర పురాణాలలో రావణాసురుడు

[మార్చు]

భాగవతంలో

[మార్చు]

పాత్ర చిత్రణ

[మార్చు]

రామాయణంలో రావణుడిని సంపూర్ణ ప్రతినాయకుడిగా చిత్రీకరించినప్పటికీ ఎన్నో సద్గుణాలు కలవాడిగా చెప్పటం జరిగింది. అందులో ముఖ్యమైనవి అపార శాస్త్రపరిజ్ఞానం, వైద్య విజ్ఞానం, మంత్ర విద్య. తన పాలనలో కులవ్యవస్థను రూపుమాపి ఒక సంస్కర్తగా, అభ్యుదయవాదిగా, మంచి పాలకుడిగా పేరుగాంచాడనీ, తన అసమాన శివభక్తితో 'శివ తాండవ స్తోత్రం' రచించాడని కూడా చెప్పబడింది.

ఇతర పురాణాలలో పాత్ర

[మార్చు]

రావణాసురుని దుష్టునిగా చిత్రించిన కావ్యము రామాయణమొక్కటే కాదు. భాగవత పురాణంలో రావణుడు, ఆయన తమ్ముడు కుంభకర్ణుడు తమ దురుసు ప్రవర్తనకు శపించబడి, భూలోకములో జన్మించిన వైకుంఠ ద్వారపాలకులు జయ విజయుల అవతారములేనని ప్రస్తావన ఉంది. ఈ ద్వారపాలకులు యోగశక్తులచే చిన్నపిల్లలుగా కనిపించిన సనత్కుమారాది మునులకు వైకుంఠ ప్రవేశమును తిరస్కరించారు. అందుకు ఆ మునులు కోపగించి జయ విజయులను భూలోకమున పుట్టునట్లు శపించారు. కృపాకరుడైన విష్ణువు వీరికి శిక్ష తప్పదని చెప్పి, శిక్షను కొంత ఉపశమించడానికి అంగీకరించాడు. భూలోకములో విష్ణు భక్తులుగా ఏడు జన్మలు ఎత్తవలెనని, లేదా విష్ణు శత్రువులుగా మూడు జన్మలు ఎత్తవలెనని పలికాడు. వీలైనంత త్వరగా వైకుంఠానికి తిరిగి చేరుకోవాలన్న కోరికతో వీరు విష్ణు శత్రువులుగా మూడు జన్మలెత్తుటకు నిర్ణయించుకున్నారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]


వెలుపలి లంకెలు

[మార్చు]
  • సుందర కాండం - గీతా ప్రెస్, గోరఖ్‌పూర్ వారి ప్రచురణ
"https://te.wikipedia.org/w/index.php?title=రావణుడు&oldid=4350306" నుండి వెలికితీశారు