పూరీ జగన్నాథ దేవాలయం
పూరీ జగన్నాథ దేవాలయం | |
---|---|
పేరు | |
స్థానిక పేరు: | జఘాణ్ణాథ మన్దిర, శ్రీమన్దిర, బడదెఉళ |
స్థానం | |
ప్రదేశం: | పూరీ, ఒడిశా, భారతదేశం. |
నిర్మాణశైలి, సంస్కృతి | |
ప్రధానదైవం: | లార్డ్ జగన్నాథ్ |
నిర్మాణ శైలి: | హిందూ దేవాలయ నిర్మాణం |
చరిత్ర | |
కట్టిన తేదీ: (ప్రస్తుత నిర్మాణం) | సా.శ.11వ శతాబ్దం |
పూరీ జగన్నాథ దేవాలయం భారతదేశం లోని ఒడిషా రాష్ట్రంలో బంగాళాఖాతం తీరాన ఉన్న పూరీ పట్టణంలో గల ఒక ప్రాచీన, ప్రముఖమైన హిందూ దేవాలయము[1].
కృష్ణ భక్తులకు లేదా విష్ణు భక్తులకు ఈ దేవాలయం ఎంతో ప్రియమైంది. ఆలయ విగ్రహాలు చెక్కతో తయారు చేసి ఉండటం ఇక్కడి ప్రత్యేకత. ఆలయంలో శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరామ సమేతంగా దర్శనమిస్తాడు. జగన్నాథుడు (విశ్వానికి ప్రభువు) పేరుతో ఆలయ దైవం ఉంటుంది. సంస్కృత భాషలో జగత్ (విశ్వం), నాథ్ (ప్రభువు) అని అర్థం.హిందూ ఆచారాల ప్రకారం, భక్తులకు ముఖ్యంగా విష్ణువు, కృష్ణుడిని ఆరాధించు వాళ్లకు ఈ గుడి ప్రముఖమైన పుణ్యక్షేత్రం. ప్రతి హిందువు తన జీవితకాలంలో తప్పక దర్శించవలసిన "ఛార్ థాం" పుణ్యక్షేత్రాలలో ఈ దేవాలయం కూడా ఉంది.
ఈ దేవాలయం ప్రతి ఏటా నిర్వహించే రథయాత్ర లేక రథ ఉత్సవానికి ప్రసిద్ధి చెందింది. ఇందులో మూడు ప్రధాన విగ్రహాలను ఎంతో గొప్పగా, అందంగా అలంకరించిన రథాలపైన ఊరేగిస్తారు. మధ్య కాలంనుంచి ఈ ఉత్సవం అధిక మత తీవ్రతతో ముడిపడి ఉంది.[2] వైష్ణవ సంప్రదాయాలకు, ఈ ఆలయంతో దగ్గర సంబంధమున్న రామానంద స్వామి వారికి ఈ గుడి ఎంతో పవిత్రమైనది. గౌడియ వైష్ణవ మతస్థులకు కూడా ఈ ఆలయం ప్రాముఖ్యమైంది. ఈ మత వ్యవస్థాపకుడైన చైతన్య మహాప్రభు ఆలయంలోని జగన్నాథ విగ్రహానికి ఆకర్షింపబడి చాన్నాళ్ళు పూరిలోనే నివసించాడు.[3]
దేవాలయ మూలాలు
[మార్చు]ఈ మధ్యనే కనుగొన్నగంగా రాజవంశానికి చెందిన రాగి శాసనాల ప్రకారం, ప్రస్తుతమున్న జగన్నాథ ఆలయ నిర్మాణాన్ని కళింగ పరిపాలకుడైన అనంతవర్మన చోడగంగాదేవ ప్రారంభించాడు.[4] ఈ ఆలయంలోని జగన్మోహన, విమన భాగాలు అతని హయాం (సా.శ.1078 - 1148) లోనే నిర్మింపబడ్డాయి. కాని సా.శ. 1174 లో ఒడిషా పాలకుడైన అనంగ భీమదేవ దీన్ని పునఃనిర్మించి ఈ ఆలయానికి ప్రస్తుతమున్న రూపునిచ్చాడు.[5] 1558లో ఒడిషాపై ఆఫ్ఘన్ సేనాధిపతి కాలాపహాడ్ దాడి చేయక ముందు వరకు ఆలయంలో జగన్నాథున్ని కొలవటం కొనసాగింది. తర్వాత కాలంలో రామ చంద్ర దేవ, ఖుర్దా అనే స్వతంత్ర రాజ్యాన్ని ఒడిషాలో ఏర్పరిచినప్పుడు ఈ ఆలయాన్ని పవిత్రం చేసి, విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాడు.[4]
ఐతిహ్యం
[మార్చు]ప్రస్తుతం ఉన్న ఆలయ నిర్మాణాన్ని పన్నెండో శతాబ్దంలో రాజా అనంతవర్మ చోడగంగదేవ్ మొదలుపెట్టాడు. ఆయన మనుమడు రాజా అనంగభీమదేవ్ పాలనలో పూర్తయింది. అంతకు ముందు అక్కడున్న ఆలయాన్ని ఇంద్రద్యుమ్న మహారాజు కట్టించాడని అంటారు. దీని వెనకో కథ ఉంది. జగన్నాథుడు గిరిజనుల దేవుడనీ, నీలమాధవుడనే పేరుతో పూజలందుకున్నాడనీ స్థలపురాణం. అడవిలోని ఓ రహస్య ప్రదేశంలో ఉన్న జగన్నాథుణ్ని గిరిజనుల రాజైన విశ్వావసుడు పూజించేవాడట. విషయం తెలుసుకున్న ఇంద్రద్యుమ్న మహారాజు, ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుణ్ని అడవికి పంపుతాడు. విశ్వావసుడి కూతురు లలితను విద్యాపతి ప్రేమించి మనువాడతాడు. విగ్రహాన్ని చూపించమని పదేపదే ప్రాధేయపడుతున్న అల్లుడి విన్నపాన్ని కాదనలేని ఆ సవర రాజు, అతని కళ్లకు గంతలు కట్టి గుడి దగ్గరికి తీసుకువెళతాడు. విద్యాపతి తెలివిగా దారిపొడుగునా ఆవాలు జారవిడుస్తాడు. కొన్నాళ్లకు అవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది. దీంతో వెంటనే ఇంద్రద్యుమ్న మహారాజుకు కబురు పెడతాడు. రాజు అడవికి చేరుకునే లోగానే విగ్రహాలు మాయమవుతాయి. దీంతో ఇంద్రద్యుమ్నుడు నిరాశతో నిరాహారదీక్ష మొదలుపెట్టి, అశ్వమేథయాగం చేస్తాడు. నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు. ఒకనాడు ఆయన అక్కడే నిద్రిస్తుండగా, జగన్నాథుడు కలలో కనిపించి సముద్రతీరంలో చాంకీనది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకొస్తాయనీ వాటితో విగ్రహాలు చేయించమనీ ఆదేశిస్తాడు. కొయ్యలైతే కొట్టుకొచ్చాయి కానీ, విగ్రహ నిర్మాణానికి ఎవరూ ముందుకు రాలేదు. ఏం చేయాలా అని రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వస్తాడు. తానొక్కడినే రహస్యంగా ఓ గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తాననీ, ఆ సమయంలో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోననీ, ఆ 21 రోజులూ అటువైపు ఎవరూ రాకూడదనీ, తన పనికి ఆటంకం కలగకూడదనీ షరతు విధిస్తాడు. రాజు అంగీకరిస్తాడు. రోజులు గడుస్తున్నా గదిలోంచి ఎలాంటి శబ్దమూ రాదు. దీంతో రాణి గుండిచాదేవి తొందర పెట్టడంతో గడువు పూర్తికాకుండానే రాజు తలుపులు తెరిపిస్తాడు. శిల్పి కనిపించడు. చేతులూ కాళ్లూ లేని, సగం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిస్తాయి. పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తాడు. చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇకమీదట అదేరూపంలో విగ్రహాలు పూజలందుకుంటాయని ఆనతిస్తాడు. తానే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. పూరీ ఆలయంలోని విగ్రహాలకు అభయహస్తం, వరదహస్తం కనిపించనిదీ అందుకేనంటారు. చతుర్దశ భువనాలనూ వీక్షించడానికా అన్నట్టు ఇంతింత కళ్లు మాత్రం ఉంటాయి.
దేవాలయ మూలాలకు సంభందించిన కథ
[మార్చు]ఈ ఆలయ మూలాలకు సంబంధించిన సంప్రదాయ గాథల ప్రకారం, క్రిత యుగం చివరలో అసలు రూపంలో జగన్నాథుడు (విష్ణువు విగ్రహరూపం), పూరి సముద్రతీర సమీపంలోని మర్రి చెట్టు దగ్గర ఇంద్రనీల లేదా ఒక నీలి ఆభరణంగా అవతరించాడు. అది ఎంత ప్రకాశావంతమైనదంటే దాన్ని చూసినవారికి తక్షణ మోక్షం లభిస్తుంది. కనుక ధర్మదేవుడు లేక యముడు దాన్ని భూమిలో దాచిపెట్టాలనుకున్నాడు. అందులో విజయం కూడా సాధించాడు.ద్వాపర యుగంలో మాల్వాకి చెందిన ఇంద్రద్యుమ్న అనే రాజు అంతుపట్టని ఆ రూపం గురించి తెలుసుకోవాలని సంకల్పించి తన లక్ష్యం కోసం ఘోరమైన తపస్సు చేయసాగాడు. అప్పుడు విష్ణువు ప్రత్యక్షమయ్యి, పూరి సముద్ర తీరానికి వెళ్లి అక్కడ తేలే చెట్టు దుంగను కనుక్కొని దాని కాండంలో నుంచి తనకు కావలసిన రూపును తయారు చేసుకొమ్మని అతన్ని ఆజ్ఞాపించాడు. ఆ రాజు చెక్క దుంగను కనుక్కొన్నాడు.తర్వాత అతను అద్భుతమైన యజ్ఞాన్ని నిర్వహించాడు. దానికి యజ్ఞనరసింహరాజు ప్రత్యక్షమై నారాయణున్ని నాలుగు అక్షలలో విశదీకరించి నిర్మించమని ఆజ్ఞాపించాడు. అవి పరమాత్ముణ్ణి వాసుదేవుని లాగా, వ్యూహని సంకర్షణ వలె, యోగమయని సుభద్ర లాగా, విభవున్ని సుదర్శన వలె నిర్మించామన్నాడు. రాజు ముందు విశ్వకర్మ చిత్రకారుని రూపంలో ప్రత్యక్షమై చెట్టునుంచి జగన్నాథ, బలభద్ర, సుభద్రల రూపాలను తయారు చేశాడు.[6]
పురుషోత్తమ క్షేత్ర నామము , దాని విహిష్టత
[మార్చు]స్కంద పురాణ లిపి ప్రకారం జగన్నాథుడే పురుషోత్తముడు .మానవులకు సాధ్గునాలతో జీవితాన్ని ఎలా గడపాలో తెలియచెప్పడానికి ఆయన దారుబ్రాహ్మణ అవతారం ఎత్తాడు.తన తోబుట్టువులైన బలభద్ర, సుభద్ర దేవిలలో అతనే ఉత్తముడు.శ్రీ దేవికి అతను ఉత్తమ భర్త.అన్నింటికన్నా గుర్తించదగినది మార్గాశిర్శ నెలలో అమావాస్య తర్వాత వెంటవెంటనే వచ్చు మూడు రోజులూ తన తల్లిదండ్రులు (కశ్యపుడు-అదితి, దశరథుడు- కౌశల్య, వాసుదేవుడు-దేవిక, నందుడు-యశోద) లకు ఇంద్రద్యుమ్న, రాణి గుండిచలతో కలిసి శ్రద్ధ నిర్వహిస్తాడు.కాని ఒక పాలకుడు కింద అతను రోజూ అలాగే పండుగలలో దొరికే సుఖాలను అనుభవిస్తూ ఉంటాడు.తన అనుచరులు, తన ముందు లోంగిపోయినవారి పట్ల అమితమైన జాగ్రత్త తీసుకుంటాడు.
బౌద్ధ మూలాలు
[మార్చు]కొంతమంది పురావస్తు శాస్త్రవేత్తల సిద్ధాంతాల ప్రకారం, ప్రస్తుత ఆలయ PURI JAGANNATH TEMPLEస్థలంనందు క్రితంలో బుద్ధుని దంతాల అవశేషాలు కలిగిన ఒక బౌద్ధ స్థూపం ఉండేదని అంటుంటారు. అది తర్వాత కాలంలో శ్రీలంకలోని క్యాండికి తరలింపబడింది.[7] ఆ సమయంలోనే వైష్ణవ మతంలోకి బౌద్ధ మతాన్ని కలగలిపారు. దీంతోటి జగన్నాథున్ని కొలవటం ప్రాముఖ్యమైంది. ఇదంతా పదవ శతాబ్దానికి ముందు అంటే ఒడిషాకి చెందిన సోమవంశి రాజుల హయాంలో జరిగింది.[8]
మహారాజ రంజిత్ సింగ్ అనే ఒక గొప్ప సిక్కు చక్రవర్తి ఈ ఆలయానికి అధిక మొత్తంలో బంగారాన్ని విరాళంగా ఇచ్చాడు. (ఇది అమృత్సర్ లోని బంగారు ఆలయానికి అతనిచ్చిన దాని కన్నా ఎక్కువ). ప్రపంచంలోనే అత్యంత గొప్పదైన, విలువైన వజ్రం కోహినూరును కూడా ఈ ఆలయానికే విరాళంగా ఇవ్వమని అతను తన చివరి కోరికగా ఆజ్ఞాపించాడు. కాని ఆ వజ్రం ఈ ఆలయానికి చేరుకోలేకపోయింది. కారణం అప్పటికే బ్రిటీషు వారు పంజాబ్ రాష్ట్ర సర్వ హక్కులను తెగ తెంపి, దాని జమీందారీ ఆస్తులను జప్తు చేశారు.
సంస్కృతుల మేలుకలయిక
[మార్చు]పూరి జగన్నాథ్ లోని శ్రీక్షేత్రగా పిలవబడే స్థలం భారతీయ సంస్కృతులకు పూర్తిగా అద్దం పడుతుందని నమ్మకంగా చెప్పవచ్చు. ఈ సంస్కృతుల గురించి తెలుసుకోవాలంటే ఎవరైనా దీని స్థల పురాణం గురించి తెలుసుకోవాలి. కాని ఇది ప్రపంచంలోని మిగతా దేశాలకు భిన్నంగా వుంటుంది. భారతీయ చరిత్రలోనే ఆ దేశం ఎక్కడా ఇతర దేశాల మీద దండెత్తడం కాని సరిహద్దు రాగద్వేషాలతో వాటిని ఆక్రమించుకోవటంగాని చేసిన దాఖలాలు లేవు.
చరిత్ర ప్రకారం జగన్నాథున్నే తీసుకుంటే శబరాలు అనే ఆదివాసీలు ఆయన్ను నారాయణుని మారు రూపంగా పూజిస్తారు. ఇంకొక నేపథ్యం ప్రకారం ప్రాచీన కాలంనుంచి అక్కడే నివసిస్తున్న ప్రజలు ఆయన్ను నీలిరాయితో తయారుచేసిన నారాయణుని ప్రతిరూపమైన నీలమాధవగా కొలుస్తారు. ఆయన్ను నీలగిరి (నీల పర్వతం) లేక నీలాచలకి తీసుకువచ్చి బలరామ (బలభద్ర), సుభద్ర సమేతంగా జగన్నాథునిగా నెలకొల్పారు. ఈ చెక్క విగ్రహాలు, ప్రాచీన కాలంనుంచి వస్తున్న చెక్క స్తంభాలను కొలవటం అనే ఆచారంతో ముడిపడివున్నాయి. వీటన్నిటికన్నా ఒడిషాకే చెందిన ఆదివాసీల వంశస్థులుగా చెప్పుకొనే ధైతపతులు ఇప్పటికీ ఆలయంలో జరిగే పూజాకార్యకలాపాలలో అధిక శాతంలో పాల్గొంటూ వుంటారు. వీటన్నిటిబట్టి మొదట్నుంచి శ్రీక్షేత్ర సాంస్కృతిక చరిత్ర హిందూ, ఆదివాసీల సంస్కృతుల కలయికతో ఏర్పడిందని దృఢంగా చెప్పవచ్చు. ఇది గర్వించదగ్గ మన జాతి ఔన్నత్యంలో ఒక భాగమయ్యింది. ఈ మూడు విగ్రహాలు త్రిరథ (జైన ఆచారాలు) గా పిలవబడే సమ్యక్ దర్శన్, సమ్యక్ జ్ఞానంద్, సమ్యక్ చరితలకు ప్రతీకగా ప్రాచుర్యమయ్యాయి.ఇవి మోక్షం లేక శిఖరాగ్రమైన ఆనందానికి మార్గంగా పిలవబడుతున్నాయి.
స్వామి జగన్నాథుడు విష్ణువు లేదా నారాయణ లేదా కృష్ణుడిగా, బలభద్రుడు శేషునిగా పూజలు అందుకుంటున్నారు. అదే సమయంలో ఈ ఆలయంలో నెలకొల్పబడిన విగ్రహాలను భైరవ (శివ, అజేయుడు), విమల (భైరవి, శివుని భార్య) గా కూడా చూస్తుంటారు. కాబట్టి పూరి జగన్నాథ్ లో ఉన్న శ్రీక్షేత్ర సంస్కృతీ సంప్రదాయాలు, హిందూ మతానికి చెందిన శైవతత్వం, శక్తితత్వం, వైష్ణవతత్వం వల్ల, అలాగే జైనమతం, బౌద్ధమతంలోని కొంత భాగాలు మేలుకలయికతో ఏర్పడి, ఎప్పటినుంచో అలాగే కలగలిపి ఉన్నాయని మనం గుర్తించవచ్చు.
ఆచార్యులు , జగన్నాథ పూరి
[మార్చు]మాధవాచార్యులు తప్ప ఈ క్షేత్రాన్ని అందరు ఆచార్యులు దర్శించారు.ఆదిశంకరాచార్యులు ఇక్కడ గోవర్ధన మఠాన్ని స్థాపించారు.దీంతో పాటు రామానుజాచార్య, నింబర్కాచార్య, గుడియ వైష్ణవ మతానికి చెందిన అనేక మఠాలను ఇక్కడ చూడవచ్చు.శ్రీపాద వల్లభాచార్య కూడా పూరి సందర్శించినప్పుడు ఇక్కడ తన భైఠకాన్ని ఏర్పరుచుకున్నారు.గురునానక్, కబీర్, తులసీదాస్ లు కూడా ఈ స్థలాన్ని దర్శించినట్లు ఆధారాలు ఉన్నాయి.[9]
నిర్మాణం
[మార్చు]ఈ భారీ ఆలయ భవనం 400,000 square feet (37,000 మీ2) కన్నా ఎక్కువ వైశాల్యంతో ప్రహరీగా చుట్టూ ఎత్తైన కోటగోడలను కలిగి ఉంది. ఇందులో కనీసం 120 గుళ్ళూ, పూజా స్థలాలు ఉన్నాయి. ఒడిషా శైలి నిర్మాణ గుణాలను, అమోఘమైన శిల్ప సంపదను కలిగిన ఈ ఆలయం, భారత అద్భుత కట్టడాలలో ఒకటి.[10]
ప్రధాన ఆలయం కిందనుంచి పైకి కొంచెం వంపులు తిరిగి ఉండి దానిపైన విష్ణువుకు చెందిన శ్రీచక్ర (ఎనిమిది ఆకుల చక్రం) వుంటుంది. "నీలచక్ర"గా కూడా పిలవబడి, అష్టదాతుతో తయారైన ఈ చక్రం ఎంతో పవిత్రమైనది. ఈ ఆలయ ధ్వజస్తంభం ఎత్తైన ఒక రాతి దిమ్మపై నిర్మింపబడింది. ఇది విగ్రహాలు వున్న గర్భగుడి కన్నా ఎత్తు214 అడుగులు (65 మీ.)లో ఉంది చుట్టు పక్కల పరిసరాలలో పెద్దదిగా కనిపిస్తుంది. చుట్టూ ఉన్న గుళ్ళు, మండపాల న్యూచగస్తూప రూపంలోని గోపురాలు ధ్వజస్తంభం చుట్టూ మెట్లుగా ఉండి పర్వతశ్రేణిని తలపిస్తాయి.[11]
ప్రధాన పూజాస్థలం ఎత్తైన గోడతో చుట్టబడి 20 అడుగులు (6.1 మీ.) ఉంటుంది. ఇంకొక గోడ ప్రధాన ఆలయాన్ని చుట్టి ఉంటుంది.
సింహద్వారం
[మార్చు]సంస్కృతంలో సింగద్వారం గా పిలవబడే సింహ ప్రవేశం ఆలయంలోని నాలుగు ద్వారాలలో ఒకటి, ఆలయం లోపలికి వెళ్ళటానికి ప్రధాన ప్రవేశద్వారం. దీనికి ఆ పేరు రావటానికి కారణం ఆ ద్వారం రెండు ప్రక్కల ఉన్న గాండ్రించే సింహాల పెద్ద రాతి శిలలు. ఈ ద్వారం తూర్పు ముఖంగా ఉండి బడా దందా లేదా పెద్ద రోడ్డుకు దారి చూపుతుంది .బైసీ పహచ లేదా ఇరవై రెండు మెట్ల వరుస ఆలయ భవనంలోకి దారి చూపిస్తుంది. సంస్కృతంలో పతిత పావన గా పిలిచే జగన్నాథుని శిల్పం ప్రవేశంలో కుడివైపున చెక్కివుంటుంది. పతిత పావన అంటే అణగారిన, దిగజారిన వారి బాంధవుడు అని అర్థం. ప్రాచీన కాలంలో ఆలయంలోకి అంటరానివారు కు ప్రవేశం వుండేది కాదు కనుక వాళ్ళు ఈ పతిత పావనున్ని పూజించేవాళ్ళు. జయ, విజయ అనే ఇద్దరు ద్వారపాలకుల ద్వారానికి రెండు వైపులా నుంచుని వుంటారు.[12] రథయాత్ర మొదలయ్యే ముందు జగన్నాథ్, బలభద్ర, సుభద్రల విగ్రహాలను ఈ దారిలోనే తీసుకెళ్తారు.వాటిని గుండీచ మందిరం నుంచి తీసుకు వచ్చేటప్పుడు తనను నిర్లక్ష్యం చేసి తమతో పాటు యాత్రకు తీసుకు వెళ్లనందుకు అలిగిన మహాలక్ష్మిని జాతర రూపంలో శాంత పరుస్తారు. అప్పుడే విగ్రహరూపంలో ఈ ద్వారా తలుపులపైన ఉన్న మహాలక్ష్మి వారిని ఆలయంలోకి రావడానికి అనుమతిని ఇస్తుంది. ప్రధాన ద్వారం ముందు అద్భుతమైన పదహారు ముఖ ఏకశిలా స్తంభామైన అరుణ స్తంభం కూడా ఉంది. దీని పైభాగంలో సూర్య భగవానుడి రథసారథి అయిన అరుణుడి విగ్రహం వుంటుంది.అసలు ఈ స్తంభం కోణార్క్ లోని సూర్య ఆలయంలో ఉంటే, ఖుర్దా రాజు ఇక్కడికి మార్పిడి చేయించాడు.
మిగతా ప్రవేశాలు
[మార్చు]ప్రధాన ప్రవేశమైన సింహ ద్వారం కాకుండా ఉత్తర, దక్షిణ, పడమటి దిక్కుల ముఖాలలో ఇంకా మూడు ప్రవేశాలున్నాయి. వాటిని రక్షించే జంతువుల శిలల ప్రకారం వాటి పేర్లు ఉంటాయి. అవి హాథిద్వార లేదా ఏనుగు ద్వారం వ్యాఘ్రద్వార లేదా పులి ద్వారం, అశ్వద్వార లేదా గుర్రం ద్వారం.
సింహ ద్వారం
[మార్చు]ఆలయానికి మొత్తం నాలుగు ద్వారాలున్నాయి. సింహ ద్వారానికి ఇరు వైపులా రెండు భారీ సింహాల విగ్రహాలు దర్శనమిస్తాయి. ఇది తూర్పు వైపుకు తెరుచుకుని ఉంటుంది.
విగ్రహాలు
[మార్చు]గర్భగుడిలో త్రిమూర్తులుగా పిలిచే జగన్నాథ్, బలభద్ర, సుభద్రల మూల విరాట్టులు రాత్నవేది అనే ఆభరణాలతో అలంకరించిన దిమ్మెపై కొలువు తీరి ఉంటారు. వీటితో పాటే సుదర్శన చక్ర, మదనమోహన, శ్రీదేవి, విశ్వధాత్రిల విగ్రహాలు కూడా రాత్నవేదిపై ఉంటాయి. జగన్నాథ్, బలభద్ర, సుభద్ర, సుదర్శన చక్రాల విగ్రహాలు దారు బ్రహ్మగా పిలిచే పవిత్రమైన వేప కాండాల నుంచి తయారయ్యాయి.కాలాలను బట్టి ప్రతిమల నగలు, దుస్తులను మార్పు చేస్తుంటారు. వీటిని కొలవటం ఆలయ నిర్మాణం ముందు నుంచే అంటే ప్రాచీన ఆదివాసుల కాలం నుంచే ఉండేది.[13]
చిన్న ఆలయాలు
[మార్చు]ఈ ఆలయ భవనంలోనే ఉన్న అనేకమైన చిన్న గుళ్ళు పూజా స్థలాలలో రోజూ పూజలు జరుగుతున్నాయి. మహాలక్ష్మి ఆలయానికి ప్రధాన ఆలయ పూజా కార్యక్రమాలలో ముఖ్య పాత్ర ఉంది.జగన్నాథునికి పెట్టె నైవేద్యాన్ని మహాలక్ష్మి పర్యవేక్షిస్తుందని చెబుతారు. కంచి గణేష్ ఆలయాన్ని విఘ్నేశ్వరుడికి అంకితం చేశారు. సంప్రదాయాల ప్రకారం ప్రాచీన కాలంలో గజపతి పురుషోత్తమదేవ కంచి యువరాణి పద్మావతిని వివాహమాడినప్పుడు కంచీపురం రాజు ఈ గణపతి విగ్రహాన్ని బహుకరించాడట.వీటితో పాటు ముక్తిమండపం, సూర్య, విమల, నరసింహ, రామచంద్ర, హనుమ, ఈశానేశ్వారుల పూజా స్థలాలు కూడా ఉన్నాయి.
మండపాలు
[మార్చు]ఈ ఆలయంలో సాంస్కృతిక ఉత్సవాల కోసం అనేక మండపాలు, ఎత్తైన దిమ్మెలపై ఉన్న స్తంభ కూటములు ఉన్నాయి. వీటిలో ప్రసిద్ధి చెందినది పవిత్ర బ్రాహ్మనులైన సేవాయతుల సమావేశాల కోసం చేయబడిన ముక్తి మండపం . ఇక్కడ రోజూవారీ పూజలు, పండుగలకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఉన్న డోల మండపం లో గుర్తించదగినది రాతితో అందంగా చెక్కిన శిలా తోరణం. ప్రతి ఏటా జరిగే డోల యాత్ర పండుగలో ఈ తోరణాన్ని ఉయ్యాల కట్టడానికి ఉపయోగిస్తారు. ఈ సమయంలో డోలగోవిందుని ప్రతిమ ఈ ఉయ్యాల పై ఉంచుతారు. అలాగే ఇక్కడ ఉన్న స్నాన బేడి అనే దీర్ఘ చతురస్రాకార రాతి దిమ్మేలో జరిగే వార్షిక స్నాన యాత్రా సమయంలో జగన్నాథ్, బలభద్ర, సుభద్రల విగ్రహాలకు వేడుకగా స్నానం చేయిస్తారు.
ఆలయ వంటశాల , మహాప్రసాదం
[మార్చు]జగన్నాథ ఆలయ వంటశాల భారతదేశంలోనే అతి పెద్ద వంటశాల.[10] సంప్రదాయాల ప్రకారం ఇక్కడ వండిన వాటిని శ్రీమందిర రాణి అయిన మహాలక్ష్మి దేవి పర్యవేక్షిస్తుందని అంటారు. ఒకవేళ అక్కడ తయారైన వంటలలో ఏదైనా లోపం వుంటే వంటశాల దగ్గర కుక్క నీడ కనిపిస్తుందని చెబుతుంటారు.మహాసురులుగా పిలిచే వంటవాళ్ళు దీన్ని మహాలక్ష్మిదేవి కలతకు ప్రతీకగా భావించి ఆ వంటను సమాధి చేసి మళ్ళీ కొత్తగా వంట మొదలు పెడతారు. ఇక్కడ మొత్తం వంటంతా హిందూ ఆచారాల ప్రకారం జరుగుతుంది. వంటకు మట్టి కుండలను మాత్రమే ఉపయోగిస్తారు. వంట కోసం వంటశాల దగ్గర వున్నా గంగ, యమునా అనే రెండు పవిత్ర బావుల నుంచి తోడిన నీటిని మాత్రమే ఉపయోగిస్తారు.ఇక్కడ ఐదు ప్రత్యేక ముహుర్తా లలో రత్నవేది, భోగ మండపాలలో ఉన్న ప్రతిమలకు పెట్టడానికి 56 రకాల నైవేద్యాలు ఉన్నాయి.ఆలయ వైదిక కర్మల ప్రకారం మధ్యాహ్నం 1 గంటలకు పెట్టె కోతోభోగ లేదా అబద అనే ప్రసాదం కోసం అందరూ ఎదురు చూస్తుంటారు. జగన్నాథునికి సమర్పించిన తర్వాత ఈ భోజనాన్ని తగినంత మొత్తంలో మహా ప్రసాదంగా ఆలయంలోని సింహద్వారానికి ఈశాన్యంలో ఉన్న ఆనంద బజారులో పంచుతారు. అక్కడి భక్తులు దీన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు.
పండుగలు
[మార్చు]రోజూవారి ఆరాధనా సేవలు వివరంగా ఉన్నాయి. ప్రతీ సంవత్సరం ఇక్కడ వేలాదిగా భక్తులు తరలివచ్చే పండుగలు అనేకం జరుగుతుంటాయి. అన్నిటికన్నా ముఖ్యమయినది జూన్ లో జరిగే రథయాత్రగా పిలిచే రథాల ఉత్సవం పండుగ. ఈ బ్రహ్మాండమైన పండుగలో జగన్నాథుడు, బలరాముడు, సుభద్రల విగ్రహాలు ఉన్న మూడు పెద్ద రథాలను ఊరేగిస్తారు.ఈ ఊరేగింపు బడా దందా గా పిలిచే పూరిలోనే అతిపెద్ద మార్గంనుంచి చివరి గమ్యస్థలమైన గుండీచ ఆలయం వరకు జరుగుతుంది.[14]
ప్రతి పన్నెండు నుంచి పందొమ్మిది ఏళ్ళకొకసారి ఏ ఎడాదిలోనైతే ఆషాఢ మాసం రెండుసార్లు వస్తుందో అప్పుడు నబకలేవర ఉత్సవం పేరుతో చెక్క విగ్రహాలను కొత్త వాటితో మారుస్తారు. ప్రతి ఏటా అక్షయ తృతీయ రోజున జరిగే చందనయాత్ర పండుగ రథోత్సవం కోసం రథాల నిర్మాణం ప్రారంభాన్ని సూచిస్తుంది. ప్రతి సంవత్సరం స్నానయాత్ర పేరుతో జ్యేష్ట మాసంలోని పౌర్ణమి రోజున అన్ని ప్రతిమలకు వేడుకగా స్నానం చేయించి అలంకరిస్తారు. అలాగే వసంతకాలంలో డోలయాత్ర, వర్షాకాలంలో ఝులన్ యాత్ర లాంటి పండుగలను ప్రతిఏటా నిర్వహిస్తారు. పంజిక లేదా పంచాంగం ప్రకారం పవిత్రోత్సవం, దమనక ఉత్సవాన్ని జరుపుతారు. అలాగే కార్తీక, పుష్య మాసాలలో ప్రత్యేక వేడుకలను నిర్వహిస్తుంటారు.
అలాగే విమలాదేవి కోసం ఆశ్వీజ మాసం మహాలయ ప్రారంభానికి 8 రోజుల ముందు అలాగే విజయదశమి ముగింపునకు సూచకంగా జరిగే షోడశ దినాత్మక అనే 16 రోజుల పూజకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఇందులో మదనమోహన, విమల ఉత్సవ మూర్తులు పాలు పంచుకుంటాయి.
పూరీ జగన్నాథ క్షేత్రంలో ఆలయంలోని జగన్నాథుడి మూలవిరాట్టులో ఉండే బ్రహ్మ పదార్థాన్ని.. కొత్తగా రూపొందించిన దారుశిల్పంలోకి మార్చే ఉత్సవాన్ని బ్రహ్మపరివర్తన వేడుక అంటారు. ఇది జ్యేష్ఠ మాసపు కృష్ణ చతుర్దశి నాడు అర్ధరాత్రి 'బ్రహ్మం' మార్పిడి అత్యంత గోప్యంగా జరుగుతుంది, ఈ బ్రహ్మపదార్థం మార్పిడి పూర్తయితే కొత్త దారు విగ్రహాలకు జీవం వచ్చినట్టే భావిస్తారు. ఆ విగ్రహాలకు పట్టువస్త్రాలు ధరింపజేసి బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు[15].
అనావాసర లేదా అనాసర
[మార్చు]వాడుక భాషలో విహార యాత్ర అని అర్థం.ప్రతీ ఏటా జ్యేష్ఠ పౌర్ణమి రోజున జరిగే పవిత్ర స్నాన యాత్ర తర్వాత జగన్నాధ, బలభద్ర, సుభద్ర, సుదర్శన విగ్రహాలు అనవాసర ఘర్గా పిలిచే రహస్య మందిరానికి వెళ్లి అక్కడే తర్వాత కృష్ణ పక్షం వరకు ఉంటాయి.కాబట్టి అప్పుడు వాటిని భక్తులు చూడడానికి వీలు పడదు.బదులుగా భక్తులు బ్రహ్మగిరి అనే సమీప ఊరిలో విష్ణు స్వరూపమైన అల్వర్నాథ్ అనే నాలుగు చేతుల రూపాన్ని కొలుస్తారు.భక్తులకు కేవలం రథయాత్ర ముందు రోజు మాత్రమే మొదటి చూపు దక్కుతుంది. దీనిని నవయవ్వన అని అంటారు. అధిక స్నానం తర్వాత దేవుళ్ళకు జ్వరం చేసిందని అందుకే పదిహేను రోజులపాటు రాజ వైద్యునితోటి చికిత్స చేయిస్తారు.
ప్రస్తుత ఆలయం
[మార్చు]ఇప్పటి నవీన సమయాలలో కూడా ఈ ఆలయం రద్దీగా ఉంటూ పనిచేస్తుంది.ఆలయ ప్రవేశానికి ఎవరిని అనుమతించాలో ఎన్నుకుంటుంది. హిందువులు కాని వారిని [16] అలాగే భారతీయులు కాని హిందువులను ఈ ఆలయ పరిసరాల్లోకి రానివ్వరు.ప్రవేశానికి అర్హులు కాని వారు దగ్గరలోని రఘురామ పుస్తకాలయం మిద్దె పైనుంచి ఆలయ కార్యకలాపాలను వీక్షించవచ్చు.[17] ఆగంతకులు ఆలయం, దాని పరిసరాల్లోకి చొరబడినప్పుడు దొరికిన ఆధారాల వల్ల ఈ రక్షణ అమలులోకి వచ్చింది. బౌద్ధ, జైన మతస్తులు తమ భారత వంశ సంతతిని నిరూపించుకున్న తర్వాతనే వారికి ప్రవేశం కల్పిస్తారు.[18] ఒకసారి 3 బాలి హిందువులకు ఆలయంలోకి ప్రవేశం కల్పించలేదు. కాని బాలి వాళ్ళు 90% హిందూ కాబట్టి ఈ సంఘటన తర్వాత నుంచి ఆలయంలోకి భారతీయులు కాని హిందువులకు కూడా ప్రవేశం కల్పిస్తున్నారు.[19]
జగన్నాథ రథయాత్ర
[మార్చు]ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటికల్లా ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర. భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి గాంచినది పూరీ జగన్నాథ రథయాత్ర. ఈ ఉత్సవం ప్రతీ సంవత్సరం జూన్ లేదా జూలై నెలల్లో నిర్వహిస్తారు. ఈ రథయాత్రలో శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర విగ్రహాలను పూరీ వీధుల్లో ఊరేగిస్తారు. రథం సుమారు 45 అడుగుల ఎత్తు, 35 చదరపు అడుగుల వైశాల్యం కలిగి ఉంటుంది. దీనికి ఏడు అడుగుల వ్యాసం కలిగిన 16 చక్రాలు ఉంటాయి. దాదాపు నాలుగు వేల మంది భక్తులు కలిసి ఈ రథాన్ని లాగుతారు. ఈ ఉత్సవాన్ని తిలకించడానికి భారతదేశం నలుమూలల నుంచి భక్తులు విశేషంగా తరలి వస్తారు. ప్రతి యేటా కొత్త రథాన్ని తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత. ఈ యాత్ర పూరీ నుండి గుండిచా దేవాలయం వరకు సాగుతుంది.
ప్రపంచంలో ఏ హిందూ ఆలయంలోనైనా సరే, వూరేగింపు నిమిత్తం మూలవిరాట్టును కదిలించరు. అందుకు ఉత్సవ విగ్రహాలుంటాయి. వూరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగించడం అన్ని చోట్లా చూసేదే. ఈ సంప్రదాయాలన్నింటికీ మినహాయింపు ఒడిశాలోని పూరీ జగన్నాథాలయం. బలభద్ర, సుభద్రలతో సహా ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుడిని ఏడాదికొకసారి గుడిలోంచి బయటికి తీసుకువచ్చి భక్తులకు కనువిందు చేస్తారు. వూరేగించేందుకు ఏటా కొత్తరథాలను నిర్మిస్తారు. అందుకే... జగన్నాథుడి రథయాత్రను అత్యంత అపురూపంగా భావిస్తారు భక్తులు.
ఆషాఢ శుద్ధవిదియ... పూరీ క్షేత్రంలో పండుగ ఆ రోజు. భక్తిభావం వెల్లువై పొంగులెత్తుతుంటుంది. జగన్నాథ జయజయధ్వానాలతో పూరీ నగరవీధులన్నీ మారుమోగుతుంటాయి. అంతరాలయంలో రత్నపీఠికపై ఏడాదిగా కొలువున్న జగన్నాథుడు బయటికి వచ్చే సమయం కోసం వేచి చూస్తుంటారు భక్తులు. స్వామి దర్శనం కాగానే ఆనందంతో పులకించి పోతారు. భక్తిపారవశ్యంతో మైమరచిపోతారు. ఆ క్షణం అపురూపం. స్వరం జగన్నాథం.
జగన్నాథ రథయాత్ర నేపథ్యం
[మార్చు]రథయాత్ర నేపథ్యం గురించి రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ద్వాపర యుగంలో కంసుడిని వధించడానికి బలరామకృష్ణులు బయలుదేరిన ఘట్టాన్ని పురస్కరించుకుని ఈ యాత్ర జరుపుతారని ఒక కథనం. ద్వారకకు వెళ్లాలన్న సుభద్రాదేవి కోరిక తీర్చే ముచ్చటే ఈ రథయాత్ర అని మరొకొందరు చెబుతారు. ఇక గుండీచాదేవి మందిరం విషయానికొస్తే... పూరీ జగన్నాథ ఆలయాన్ని నిర్మించిన ఇంద్రద్యుమ్న మహారాజు భార్య గుండీచా. ఆవిడ కూడా జగన్నాథబలభద్రుల కోసం ప్రధానాలయానికి మూడు కి.మీ. దూరంలో ఒక మందిరం నిర్మించింది. అదే గుండీచా ఆలయం. రథయాత్రలో భాగంగా అక్కడికి తీసుకువెళ్లిన మూడు విగ్రహాలనూ ఈ గుడిలోని రత్నసింహాసనంపై కూర్చుండబెట్టి గుండీచాదేవి పేరిట ఆతిథ్యం ఇస్తారు. ఒకరకంగా చెప్పాలంటే గుండీచామందిరం జగన్నాథుడి అతిథిగృహం అన్నమాట!
రథయాత్రకి ఏర్పాట్లు
[మార్చు]జగన్నాథ రథయాత్ర జరిగేది ఆషాఢ శుద్ధ విదియనాడే అయినా అందుకు రెండు నెలల ముందు నుంచే ఏర్పాట్లు మొదలవుతాయి. వైశాఖ బహుళ విదియనాడు రథనిర్మాణానికి కావలసిన ఏర్పాట్లు చేయమని ఆదేశిస్తాడు పూరీ రాజు. అందుకు అవసరమైన వృక్షాలను 1072 ముక్కలుగా ఖండించి పూరీకి తరలిస్తారు. ప్రధాన పూజారి, తొమ్మిది మంది ముఖ్య శిల్పులు, వారి సహాయకులు మరో 125 మంది కలిసి అక్షయతృతీయనాడు రథ నిర్మాణం మొదలుపెడతారు. 1072 వృక్ష భాగాలనూ నిర్మాణానికి అనువుగా 2188 ముక్కలుగా ఖండిస్తారు. వాటిలో 832 ముక్కల్ని జగన్నాథుడి రథం తయారీకీ, 763 కాండాలను బలరాముడి రథనిర్మాణానికీ, 593 భాగాలను సుభద్రాదేవి రథానికీ వినియోగిస్తారు.
ఆషాఢ శుద్ధ పాడ్యమినాటికి రథనిర్మాణాలు పూర్తయి యాత్రకు సిద్ధమవుతాయి. జగన్నాథుడి రథాన్ని నందిఘోష అంటారు. 45 అడుగుల ఎత్తున ఈ రథం పదహారు చక్రాలతో మిగతా రెండిటికన్నా పెద్దదిగా ఉంటుంది. ఎర్రటిచారలున్న పసుపువస్త్రంతో ‘నందిఘోష’ను అలంకరిస్తారు. బలభద్రుడి రథాన్ని తాళధ్వజం అంటారు. దీని ఎత్తు 44 అడుగులు. పద్నాలుగు చక్రాలుంటాయి. ఎర్రటి చారలున్న నీలివస్త్రంతో ఈ రథాన్ని కప్పుతారు. సుభద్రాదేవి రథం పద్మధ్వజం. ఎత్తు 43 అడుగులు. పన్నెండు చక్రాలుంటాయి. ఎర్రటి చారలున్న నలుపు వస్త్రంతో పద్మధ్వజాన్ని అలంకరిస్తారు. ప్రతిరథానికీ 250 అడుగుల పొడవూ ఎనిమిది అంగుళాల మందం ఉండే తాళ్లను కడతారు. ఆలయ తూర్పుభాగంలో ఉండే సింహద్వారానికి ఎదురుగా ఉత్తరముఖంగా నిలబెడతారు.
రథయాత్ర సంబరం
[మార్చు]మేళతాళాలతో గర్భగుడిలోకి వెళ్లిన పండాలు (పూజరులు) ఉదయకాల పూజాదికాలు నిర్వహిస్తారు. శుభముహూర్తం ఆసన్నమవగానే ‘మనిమా(జగన్నాథా)’ అని పెద్దపెట్టున అరుస్తూ రత్నపీఠం మీద నుంచి విగ్రహాలను కదిలిస్తారు. ఆలయ ప్రాంగణంలోని ఆనందబజారు, అరుణస్తంభం మీదుగా వాటిని వూరేగిస్తూ బయటికి తీసుకువస్తారు. ఈ క్రమంలో ముందుగా... దాదాపు ఐదున్నర అడుగుల ఎత్తుండే బలరాముడి విగ్రహాన్ని తీసుకువస్తారు. బలభద్రుడ్ని చూడగానే జై బలరామా, జైజై బలదేవా అంటూ భక్తులు చేసే జయజయధ్వానాలతో బోడోదండా మారుమోగిపోతుంది. బలరాముడి విగ్రహాన్ని ఆయన రథమైన తాళధ్వజంపై ప్రతిష్ఠింపజేస్తారు. అనంతరం ఆ స్వామి విగ్రహానికి అలంకరించిన తలపాగా ఇతర అలంకరణలను తీసి భక్తులకు పంచిపెడతారు. వాటి కోసం భక్తులు ఎగబడతారు. అనంతరం ఇదే పద్ధతిలో సుభద్రాదేవి విగ్రహాన్ని కూడా బయటికి తీసుకువచ్చి పద్మధ్వజం అనే రథం మీద ప్రతిష్ఠిస్తారు. ఇక ఆ జగన్నాథుడిని దర్శించుకునే క్షణం ఎప్పుడెప్పుడా అని తహతహలాడిపోతుంటారు భక్తులు. దాదాపు ఐదడుగుల ఏడంగుళాల ఎత్తుండే జగన్నాథుడి విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలో నుంచి బయటికి తీసుకువస్తుండగానే జయహో జగన్నాథా అంటూ భక్తిపారవశ్యంతో జయజయధ్వానాలు చేస్తారు. ఇలా మూడు విగ్రహాలనూ రథాలపై కూర్చుండబెట్టే వేడుకను పహాండీ అంటారు. ఈ దశలో కులమత భేదాలు లేకుండా అందరూ జగన్నాథుడి విగ్రహాన్ని తాకవచ్చు. ఈ మూడు విగ్రహాలనూ తీసుకువచ్చేవారిని దైత్యులు అంటారు. వీరు... ఇంద్రద్యుమ్న మహారాజుకన్నా ముందే ఆ జగన్నాథుడిని నీలమాధవుడి రూపంలో అర్చించిన సవరతెగ రాజు విశ్వావసు వారసులు. ఆలయ సంప్రదాయాల ప్రకారం... వూరేగింపు నిమిత్తం మూలవిరాట్టులను అంతరాలయం నుంచి బయటికి తీసుకువచ్చి రథాల మీద ప్రతిష్ఠింపచేసే అర్హత వీరికి మాత్రమే ఉంటుంది.
సుభద్ర, జగన్నాథ, బలభద్రులు రథారూఢులై యాత్రకు సిద్ధంగా ఉండగా... పూరీ సంస్థానాధీశులు అక్కడికి చేరుకుంటాడు. జగన్నాథుడికి నమస్కరించి రథం మీదికి ఎక్కి స్వామి ముంగిట బంగారు చీపురుతో శుభ్రం చేస్తాడు. ఈ వేడుకను చెరా పహారా అంటారు. అనంతరం స్వామిపై గంధం నీళ్లు చిలకరించి కిందికి దిగి రథం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణం చేస్తాడు. ఇదే తరహాలో బలరాముడినీ, సుభద్రాదేవినీ అర్చించి వారి రథాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తాడు. అనంతరం రథాలకు తాత్కాలికంగా అమర్చిన తాటిమెట్లను తొలగిస్తారు. ఇక యాత్ర మొదలవడమే తరువాయి.జగన్నాథుడి రథం మీదుండే ప్రధాన పండా నుంచి సూచన రాగానే కస్తూరి కళ్లాపి చల్లి హారతిచ్చి... జై జగన్నాథా అని పెద్దపెట్టున అరుస్తూ తాళ్లను పట్టుకుని రథాన్ని లాగడం మొదలుపెడతారు. విశాలమైన బోడోదండ (ప్రధానమార్గం) గుండా యాత్ర మందగమనంతో సాగుతుంది. లక్షలాది భక్తజనం నడుమ జగన్నాథుడి రథం అంగుళం అంగుళం చొప్పున చాలా నెమ్మదిగా కదులుతుంది. దీన్నే ఘోషయాత్ర అంటారు.భక్తుల తొక్కిసలాటలో చక్రాలకింద ఎవరైనా పడినా, దారిలో ఏ దుకాణమో అడ్డువచ్చినా రథం వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు. అడ్డొచ్చిన దుకాణాలను కూలగొట్టైనా సరే ముందుకే నడిపిస్తారు. ఈ యాత్ర ఎంత నెమ్మదిగా సాగుతుందంటే... జగన్నాథుడి గుడి నుంచి కేవలం మూడు మైళ్ల దూరంలో ఉండే గుండీచా గుడికి చేరుకోవడానికి దాదాపు పన్నెండుగంటల సమయం పడుతుంది. గుండీచా ఆలయానికి చేరుకున్నాక ఆ రాత్రి బయటే రథాల్లోనే మూలవిరాట్లకు విశ్రాంతినిస్తారు. మర్నాడు ఉదయం మేళతాళాలతో గుడిలోకి తీసుకువెళతారు. వారం రోజులపాటు గుండీచాదేవి ఆతిథ్యం స్వీకరించిన అనంతరం దశమినాడు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. దీన్ని బహుదాయాత్ర అంటారు. ఆ రోజు మధ్యాహ్నానికి మూడు రథాలూ జగన్నాథ ఆలయానికి చేరుకుని గుడిబయటే ఉండిపోతాయి. మర్నాడు ఏకాదశినాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. సునావేషగా వ్యవహారించే ఈ వేడుకను చూసేందుకు బారులు తీరుతారు భక్తులు. ద్వాదశినాడు విగ్రహాలను మళ్లీ గర్భగుడిలోని రత్నసింహాసనంపై అలంకరించడంతో యాత్ర పూర్తయినట్లే. యాత్రపేరిట పదిరోజులుగా స్వామి లేని ఆలయం నూతన జవజీవాలు పుంజుకుని కొత్తకళ సంతరించుకుంటుంది.
ప్రయాణ మార్గాలు
[మార్చు]- ఒడిశాలోని పూరి క్షేత్రానికి దేశంలోని అన్ని ప్రాంతాలతో రవాణా సదుపాయం ఉంది.
- భువనేశ్వర్‌లోని బిజూపట్నాయక్ విమానాశ్రయం పూరికి 60 కి.మీ. దూరంలో ఉంది.
- దేశంలోని ప్రధాన నగరాల నుంచి పూరీకి రైలు సర్వీసులు నడుస్తున్నాయి.
- కోల్‌కతా-చెన్నై ప్రధాన రైలుమార్గంలోని ఖుర్ధారోడ్ రైల్వేస్టేషన్ ఇక్కడ నుంచి 44 కి.మీ. దూరంలో ఉంది.
- భువనేశ్వర్, కోల్‌కతా, విశాఖపట్నం నుంచి బస్సు సౌకర్యముంది.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Jagannath Temple". Archived from the original on 2008-10-25. Retrieved 2009-03-06.
- ↑ "Juggernaut". Time. 1959-07-20. Archived from the original on 2018-12-25. Retrieved 2006-09-12.
- ↑ "Bhaktivedanta VedaBase". Archived from the original on 2007-09-30. Retrieved 2006-09-12.
- ↑ 4.0 4.1 "Jagannath Temple". Archived from the original on 2007-02-23.
- ↑ "Lord Jagannath : Symbol of Unity and Integration" (PDF). Archived from the original (PDF) on 2007-09-27. Retrieved 2006-05-01.
- ↑ "Jagannath Temple at Puri". Retrieved 2006-09-12.
- ↑ "Oldest Jagannath Temple of Puri The Buddhist and Somavamsi Connections" (PDF). Archived from the original (PDF) on 2008-02-29. Retrieved 2006-09-12.
- ↑ "Jainism and Buddhism in Jagannath Culture" (PDF). Retrieved 2003-07-01.
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2009-04-10. Retrieved 2015-10-13.
- ↑ 10.0 10.1 "Sri Jagannath". Archived from the original on 2008-07-24. Retrieved 2006-09-12.
- ↑ "Jagannath Temple, Orrisa". Archived from the original on 2008-05-17. Retrieved 2006-09-20.
- ↑ "Sri Jagannath Temple". Archived from the original on 2008-07-24. Retrieved 2006-09-20.
- ↑ "Juggernaut of Puri". Retrieved 2006-09-20.
- ↑ "Jagannath Temple at Puri". Retrieved 2006-09-20.
- ↑ http://www.andhrajyothy.com/Artical.aspx?SID=119407&SupID=21[permanent dead link]
- ↑ "Jagannatha Puri". Archived from the original on 2006-07-15. Retrieved 2006-09-12.
- ↑ "Puri - Jagannath Temple". Archived from the original on 2012-03-06. Retrieved 2015-10-13.
- ↑ "Jagannath Temple". Archived from the original on 2008-07-24. Retrieved 2006-09-12.
- ↑ హిందూ పోరాపాటులో జగన్నాథ ఆలయం Archived 2016-03-04 at the Wayback Machine, ది టెలిగ్రాఫ్, కలకత్తా - నవంబరు 08, 2007
బాహ్య లింకులు
[మార్చు]- జగన్నాథ ఆలయం
- ఒడిషా లోని ఆలయాలు
- పూరి జగన్నాథ ధామం (అధికారిక వెబ్సైటు)
- జగన్నాథ రథ-యాత్ర , జగన్నాథుని కథ Archived 2008-10-25 at the Wayback Machine (వేద ఎన్సైక్లోపీడియా)
- ఒడిస్సీ శ్రీ జగన్నాథ Archived 2008-07-24 at the Wayback Machine (ఒడిస్సీ.కాం)
- పూరిలోని జగన్నాథ ఆలయం
- జగన్నాథ ఆలయం (ఇండ్హిస్టరీ.కాం)
- ఒడిషా శిల్పశాస్త్రము (sscnet.ucla.edu)
- శ్రీ జగన్నాథ ఆలయం-జగన్నాథ ధర్మ
- శ్రీ జగన్నాథ స్వామి రథ యాత్ర వీడియో