ఎవడే సుబ్రహ్మణ్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎవడే సుబ్రహ్మణ్యం
Yevade Subramanyam first poster.jpg
చిత్ర ప్రచార చిత్రం
దర్శకత్వంనాగ్ అశ్విన్
నిర్మాతప్రియాంక దత్
నటులునాని
మాళవిక నాయర్
విజయ్ దేవరకొండ
రీతు వర్మ
సంగీతంరాధన్
ఇళయరాజా-1 పాట
దేశంభారతదేశం
భాషతెలుగు

ఎవడే సుబ్రహ్మణ్యం సినీనటుడు నాని తనను తాను అన్వేషించుకునేందుకు ఓ ప్రయాణం చేసే కార్పొరేట్ ఉద్యోగి సుబ్రహ్మణ్యంగా నటించగా, నాగ్ అశ్విన్ తొలిగా దర్శకత్వం వహించిన తెలుగు సినిమా. సినిమాను ప్రియాంక దత్ నిర్మించారు. దీనిలో విజయ్ దేవరకొండ, మాళవిక వంటి కొత్తనటులు నటించారు.[1] ఈ సినిమాలోని అధికభాగం ఎవరెస్టు పర్వతం లో చోటుచేసుకుంది. ఎవరెస్టు శిఖరంపై చిత్రీకరణ జరుపుకున్న తొలి తెలుగు చిత్రంగా చరిత్రకెక్కింది.[2] హిందీలో అశుతోష్ గోవారికర్ చేసిన సీరియల్ తప్పితే వేరే ఏ భారతీయ ఫీచర్ ఫిలిం ఈ లొకేషన్లలో సినిమాను చిత్రీకరించలేదు. సినిమా 2014 నవంబరు సమయంలో చిత్రీకరణ జరుపుకుని 21 మార్చి 2015న విడుదలైంది.

తారాగణం[మార్చు]

కథాంశం[మార్చు]

సుబ్బు అలియాస్ సుబ్రహ్మణ్యం పశుపతి ఇండస్ట్రీస్ అనే కార్పొరేట్ సంస్థలో జనరల్ మేనేజర్ హోదాలో పనిచేస్తూ ఉంటాడు. సుబ్బు జీవితంలో డబ్బే సర్వస్వం అన్నట్టుగా వ్యవహరిస్తూంటాడు. అదే రంగానికి చెందిన వేరే కంపెనీ వ్యాపారాత్మకతతో కాక ప్రజాక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తుండడంతో దాన్ని టేకోవర్ చేయాల్సిన స్థితి ఏర్పడుతుంది. ఆ కంపెనీ షేర్లు కొనుగోలు చేస్తూ ఆ సమస్యను పరిష్కరించే పనిలో పడతాడు. ఆ కంపెనీని టేకోవర్ చేయగలిగితే తన కూతురు రియాని ఇచ్చి పెళ్ళిచేసి, కంపెనీకి అధిపతిని చేస్తానని పశుపతి ఇండస్ట్రీస్ ఓనర్ పశుపతి ప్రతిపాదిస్తాడు. ఆ క్రమంలో సుబ్బుతో రియాకి నిశ్చితార్థం కూడా జరుగుతుంది. సరిగ్గా అదే సమయంలో గోవా నుంచి సుబ్బు ఫ్రెండ్ రిషి వస్తాడు. సుబ్బు డబ్బుకోసం పనిచేసే మనస్తత్వం కలవాడైతే దానికి వ్యతిరేకమైన ఆలోచన విధానం రిషిది. ఆ తర్వాత ఆనంది అనే అమ్మాయి కూడా అనుకోకండా సుబ్బు లైఫ్ లోకి వస్తుంది. వాళ్ళతో కలిసి ఎంజాయ్ చేయడం మొదలు పెట్టిన సుబ్బు తన ప్రొఫెషనల్ వర్క్ ని కాస్త పక్కన పెడతాడు. రిషి రోజూ హిమాలయాల్లోని దూద్ కాశీ వెళ్ళాలని సుబ్బును అడుగుతూంటాడు అప్పుడు హఠాత్తుగా జరిగే సంఘటన తర్వాత సుబ్బు ఆనందిని తీసుకొని హిమాలయాలకు బయలు దేరుతాడు.. సుబ్బు లైఫ్ లో జరిగిన సంఘటన ఏంటి.? అసలు సుబ్బు హిమాలయాలకు ఎందుకు బయల్దేరాడు.? అందులో తనకి తోడుగా ఆనందిని ఎందుకు తీసుకెళ్ళాడు.? అసలు ఈ ప్రయాణంలో ఏం జరిగింది.? అనే విషయాలు కథలో మిగతా భాగం.

నిర్మాణం[మార్చు]

చిత్ర నేపథ్యం[మార్చు]

స్వప్నదత్, ప్రియాంక దత్ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కోసం షార్ట్ ఫిలిం తీయాలనుకున్నప్పుడు వారికి దర్శకుడు నాగ్ అశ్విన్ పరిచయమయ్యారు. రెండే రోజుల వ్యవధి మిగలడంతో ఆ స్వల్పవ్యవధిలోనే షార్ట్ ఫిలిం కోసం ఓ కథాంశాన్ని అభివృద్ధి చేసి, చిత్రీకరణ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసి అందించిన యాదోంకీ బారాత్ సినిమా ప్రతిష్ఠాత్మక కేన్స్ చలన చిత్రోత్సవానికి ఎంపికకావడంతో వారికి నాగ్ అశ్విన్ పనితీరు నచ్చింది. పూర్తిస్థాయి సినిమా చేసే అవకాశం ఇచ్చినప్పుడు వేరే కథాంశంపై చర్చలు సాగాయి. 5డి కెమెరా వాడి చిన్న సినిమాగా చేద్దామనుకున్న ఈ కథాంశాన్ని వారికి చెప్పడంతో అది విపరీతంగా నచ్చి ఈ సినిమా ఫీచర్ ఫిల్మ్‌గానే చేద్దామన్న ప్రతిపాదన తీసుకువచ్చారు, కథానాయకుడు నానికి కథను చెప్పి ఒప్పించగలగడంతో చిత్రం ప్రారంభమైంది.[3]

కథాంశం అభివృద్ధి[మార్చు]

నీవెవరో నీవు తెలుసుకో అన్న ఆలోచన నుంచే ఈ సినిమా కథాంశం ప్రారంభమైంది. దర్శకుడు, రచయిత నాగ్ అశ్విన్ చదివిన పుస్తకాలు, గమనించిన స్థితిగతులు ఈ కథాంశం అభివృద్ధిలో కీలకమైన పాత్ర వహించాయి.[3]

పేరు, తారాగణం ఎంపిక[మార్చు]

దర్శకుడు సినిమా పేరు ఎంపిక గురించి వివరిస్తూ తన పాఠశాలలో సీనియర్ ఐన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఆ పేరు వెనుక స్ఫూర్తి అని పేర్కొన్నారు. నాగ్ అశ్విన్ సీనియర్ అయిన సుబ్రహ్మణ్యం ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఫేస్‌బుక్‌లో ఆయన జీవితం గురించి చక్కని వ్యాఖ్యలు చేస్తూంటారని, అలా ఆయనపై కలిగిన సద్భావం వల్ల హీరోకి సుబ్రహ్మణ్యం అన్న పేరు పెట్టి స్క్రిప్ట్ రాసుకున్నానన్నారు. సినిమాకు తొలుత "హూ యాం ఐ" అనీ, తర్వాత "హూ ఈజ్ సుబ్రహ్మణ్యం" అనీ పేరుపెడదామనుకున్నారు.[3] చివరికి ఎవడే సుబ్రహ్మణ్యం అన్న ప్రస్తుత పేరును ఖరారుచేశారు.

చిత్రీకరణ[మార్చు]

సినిమా చిత్రీకరణను ఇతర ప్రాంతాలతో పాటుగా ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తైన శిఖరమైన ఎవరెస్ట్ పర్వతంపై జరిపారు. ఈ సినిమా భారతీయ చలన చిత్రాల్లో తొలిసారిగా ఎవరెస్ట్ శిఖరంపై చిత్ర నిర్మాణం జరుపుకున్న సినిమాగా చరిత్రకెక్కింది. ఆ క్రమంలో చిత్రబృందం చాలా ఇబ్బందులు, సవాలు విసిరే పరిస్థితులు ఎదుర్కోవాల్సివచ్చింది. మైనస్ 10 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఈ చిత్రీకరణ సాగింది. నేపాల్ రాజధాని కాఠ్మండు వరకూ, అక్కడనుంచి లుక్లా నగరం వరకూ విమానయానం ద్వారా వెళ్ళిన బృందం, అక్కడినుంచి సాంకేతిక సామగ్రి, వస్తువులతో సహా కాలినడక, ఎడ్లబళ్ళు వంటి రవాణా సాధనాలపై చిత్రీకరించాల్సిన స్పాట్‌కు చేరుకునేందుకే 10రోజులు పట్టింది. ఎలాంటి ఆధునిక సౌకర్యాలూ లేని ఆ ప్రాంతంలో మార్గమధ్యంలోని ఇళ్ళలో వసతి తీసుకుంటూ దారిలో కొన్ని షాట్స్ చిత్రీకరిస్తూ చిత్రబృందం ముందుకుసాగింది. సినిమాలో కీలకమైన ప్రాంతమైన దూద్‌కాశీ చేరుకున్నాకా అక్కడ 5రోజుల చిత్రీకరణ జరుపుకున్నారు.[4] మొత్తంగా ఈ ఎత్తైన శిఖరాలలో దాదాపుగా 40రోజుల షూటింగ్ షెడ్యూల్ జరుపుకున్నారు. ఈ షెడ్యూల్‌కు 33మందితో వెళ్ళగా వారిలో ఏడుగురు అతిశీతల వాతావరణం, అత్యంత ఎత్తైన ప్రదేశాల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, తక్కువ ఆహారం అందుబాటులో ఉండడం వంటి కారణాలతో వెనుదిరిగివచ్చారు. చివరివరకూ 27మంది షూటింగ్ చేయగలిగారు.[5] అక్కడి వాతావరణం, జంతువులు వంటివాటితో సిబ్బందికి జరిగిన చిరుచేదు అనుభవాలతో కొన్ని వీడియోలు తీసి యూట్యూబ్‌లో కూడా చేర్చారు. స్విట్జర్లాండ్ వంటి ప్రదేశాల్లో చిత్రీకరణ జరిపి, దాన్నే మౌంట్ ఎవరెస్ట్‌గా భ్రమింపజేయవచ్చని, కాకుంటే సినిమాను మరింత సహజంగా తీయాలన్న సంకల్పంతోనే ఇంత శ్రమకోర్చి తీశామని దర్శకుడు పేర్కొన్నారు.
సినిమాలో మిగతా భాగాన్ని హైదరాబాదు‌లో చిత్రీకరించారు.

నిర్మాణానంతర పనులు[మార్చు]

కోటగిరి వెంకటేశ్వరరావు సినిమాకు ఎడిటింగ్ నిర్వహించారు.

విడుదల[మార్చు]

ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా మార్చి 31, 2015న విడుదలైంది. విడుదలకు ముందు సెన్సార్ కార్యక్రమాలను మార్చి మూడవ వారంలో పూర్తిచేసుకుంది. సినిమాకు సెన్సార్ బోర్డ్ క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చింది.[6]

సంగీతం[మార్చు]

సినిమాకి సంగీతాన్ని రాధన్ (అందాల రాక్షసి ఫేం) అందించారు. సినిమాలోని చల్లగాలి పాటను ప్రముఖ సంగీతదర్శకుడు ఇళయరాజా సంగీతం సమకూర్చిన తమిళ చిత్రం అవతారం (1995)లోని తెండ్రల్ వంతు పాట నుంచి తీసుకున్నారు. ఇళయరాజాను చిత్రయూనిట్ సంప్రదించగా ఆయనే స్వయంగా పాటను తెలుగులో చేసియిచ్చారు.[3]

ఆదరణ[మార్చు]

ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా 31 మార్చి 2015న విడుదలై కొంతవరకూ అనుకూల సమీక్షలు పొందింది. ప్రేక్ష‌కుల భావోద్వేగాల‌ను ట‌చ్ చేస్తూ... కాస్త న‌వ్విస్తూ.. కాస్త ఆలోచింప‌చేస్తూ.. ఓ విభిన్న‌మైన ప్ర‌యాణం చూపించారని న్యూస్ 4 ఆంధ్ర వెబ్సెట్ 2.5/5 రేటింగ్ ఇచ్చారు.[7] ఇండియా గ్లిట్జ్ వెబ్‌సైట్ వారు కొత్త ప్రయత్నం ఫర్వాలేదని 2.25/5కు రేట్ చేశారు. ఎపి హెరాల్డ్ వారు కథనం చాలా నెమ్మదిగా సాగుతూండడం, ప్రేక్షకుడు ముందుగానే ఊహించగలిగేలా సీన్లు సాగడం వంటివాటి వల్ల సినిమా ఆలోచన మంచిదే అయినా ఆచరణలో తేలిపోయిందని వ్రాశారు.[8] సినిమాలో నాని నటనకు, సినిమాటోగ్రఫీకి, తారాగణం ఎంపికకూ చాలానే ప్రశంసలు దక్కాయి.

మూలం[మార్చు]

  1. "సమీక్ష : ఎవడే సుబ్రహ్మణ్యం – మెప్పించిన డేరింగ్ అటెంప్ట్.!". 123 తెలుగు.కాం. Retrieved 9 April 2015. |first1= missing |last1= (help)
  2. "Yevade Subramanyam, the first Telugu film shot in Everest". టైమ్స్ ఆఫ్ ఇండియా. 2 డిసెంబర్ 2014. Retrieved 9 April 2015.
  3. 3.0 3.1 3.2 3.3 "ఎప్పటికైనా జానపదమో... పౌరాణికమో తీస్తాను!". సాక్షి. 6 ఏప్రిల్ 2015. Retrieved 9 April 2015. |first1= missing |last1= (help)
  4. "నాని 'ఎవడే సుబ్రహ్మణ్యం' ఫస్ట్ లుక్!". ఫిల్మ్ బీట్ తెలుగు. Retrieved 9 April 2015. |first1= missing |last1= (help)
  5. "I showered only 8 times in 40 days: Nani". టైమ్స్ ఆఫ్ ఇండియా (8 డిసెంబర్ 2014). Retrieved 9 April 2015.
  6. "ఎవడే సుబ్రహ్మణ్యం సెన్సార్ రిపోర్ట్...ఫ్యామిలీ మూవీగా ప్రశంసలు". పల్లి బఠానీ. మూలం నుండి 22 మే 2015 న ఆర్కైవు చేసారు. Retrieved 9 April 2015. |first1= missing |last1= (help)
  7. "ఫర్లేదు బాగున్నాడు.. ఎవడే సుబ్రహ్మణ్యం". న్యూస్ 4 ఆంధ్రా. మూలం నుండి 23 ఏప్రిల్ 2015 న ఆర్కైవు చేసారు. Retrieved 10 April 2015. |first1= missing |last1= (help)
  8. కామన్, మేన్. "ఎవడే సుబ్రహ్మణ్యం రివ్యూ". ఎపిహెరాల్డ్. Retrieved 10 April 2015.