Jump to content

జ్ఞాన సరస్వతి దేవాలయం, బాసర

అక్షాంశ రేఖాంశాలు: 18°52′40″N 77°57′23″E / 18.87778°N 77.95639°E / 18.87778; 77.95639
వికీపీడియా నుండి
(శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానము, బాసర నుండి దారిమార్పు చెందింది)
శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం
శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం is located in Telangana
శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం
శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం
తెలంగాణ లోని ప్రదేశం
భౌగోళికాంశాలు:18°52′40″N 77°57′23″E / 18.87778°N 77.95639°E / 18.87778; 77.95639
పేరు
స్థానిక పేరు:Shri Gnana Saraswati Temple
శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానము
స్థానం
దేశం:భారతదేశం
రాష్ట్రం:తెలంగాణ
ప్రదేశం:బాసర
నిర్మాణశైలి, సంస్కృతి
ప్రధానదైవం:సరస్వతి
నిర్మాణ శైలి:దక్షిణ భారతదేశం

నిర్మల్ జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే ప్రఖ్యాతి చెందిన ఆలయం జ్ఞానసరస్వతి ఆలయం. ఇది నిర్మల్ జిల్లా బాసర మండలం, బాసరలో ఉంది. ఈ ఆలయం నిర్మల్ పట్టణానికి 75 కి.మీ దూరంలో గోదావరి నది ఒడ్డున ఉంది. హైదరాబాదుకు సుమారు 200 కి.మీ. దూరంలో ఉంది. భారతదేశంలో ఉన్న ప్రముఖ సరస్వతీ దేవాలయాల్లో ఒకటి కాశ్మీరులో ఉండగా, రెండవది ఇదేనని చెపపుకోవచ్చు. బాసరలో జ్ఞాన సరస్వతీ అమ్మవారు మహాలక్ష్మి, మహాకాళి సమేతులై కొలువు తీరి ఉన్నారు. ఇక్కడి మందిరం చాళుక్యులకాలంలో నిర్మింపబడింది. ఈ మందిరం సాదా సీదాగా ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉంది.

పురాణగాధ

[మార్చు]
సరస్వతి ఆలయ గోపురం, వెనక సరస్వతి విగ్రహం

బాసర క్షేత్రాన్ని వేదవ్యాసుడు ప్రతిష్ఠించినట్లు స్థలపురాణం చెబుతోంది.[1] కురుక్షేత్ర యుద్ధానంతరం వేదవ్యాసుడు మనశ్శాంతి కోరి, తన కుమారుడైన శుకునితో దండకారణ్యానికి వచ్చి ఇక్కడ గోదావరి తీరాన ఉన్న ప్రశాంత వాతావరణానికి ముగ్ధుడై ఇక్కడ కుటీరం నిర్మించి, తపస్సు చేయడం ప్రారంభించాడు. వేదవ్యాస మహర్షికి జగన్మాత దర్శనమిచ్చి ముగ్గురమ్మలకు ఆలయాన్ని నిర్మించమని ఆదేశించింది. వ్యాసుడు నదిలోంచి మూడు గుప్పెళ్ళు ఇసుక తెచ్చి ముగ్గురు దేవతలమూర్తులును ప్రతిష్ఠించాడు. వ్యాసుడు ఇక్కడ కొంత కాలం నివసించాడని తెలుస్తుంది.కనుక అప్పటినుండి ఈ ఊరు వ్యాసపురి, వ్యాసర అనబడి, తరువాత ఇక్కడ ఉన్న మహారాష్ట్ర ప్రజల ప్రభావం వలన 'బాసర' గా నామాంతరాన్ని సంతరించుకుంది. ఇక్కడ వ్యాస నిర్మితమైన ఇసుక విగ్రహాలకు పసుపు పూసి అలంకరించి పూజలు నిర్వహిస్తారు. ఈ పసుపును ఒక్క రవ్వంత తినినా అత్యంత విజ్ఞానం, జ్ఞానం లభిస్తుందని గాఢంగా విశ్వసిస్తారు. ఆది కవి వాల్మికి ఇక్కడ సరస్వతీ దేవిని ప్రతిష్ఠించి రామాయణం వ్రాసాడని బ్రహ్మాండ పురాణం వివరిస్తుంది. ఈ గుడికి సమీపంలో వాల్మికి మహర్షి సమాధి, పాలరాతి శిల ఉన్నాయి. మంజీరా, గోదావరి తీరాన రాష్ట్రకూటుల చేత నిర్మించబడిన మూడు దేవాలయాలలో ఇది ఒకటని విశ్వసించబడుతుంది. ఆరవ శతాబ్దంలో నందగిరి ప్రాంతాంలో నందేడుని రాజధానిగా చేసుకుని పరిపాలించిన బిజలుడు అను రాజు బాసరలోని ఈ ఆలయాన్ని నిర్మించాడన్న కథనం ప్రచారంలో ఉంది.

ఆలయ విశేషాలు

[మార్చు]
బాసరలో సరస్వతి మూర్తి

బాసర సరస్వతీ ఆలయం దేశంలోని ప్రఖ్యాత సరస్వతీ ఆలయాలలో ఒకటి. ఇక్కడ సరస్వతీ ఆలయంలో బాలబాలికలకు అక్షరాభ్యాసం చేయడానికి ప్రజలు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ ఉన్న త్రిదేవీ మూర్తులు వ్యాస ప్రతిష్ఠితం కనుక ఈ ప్రత్యేకత. అక్షరాభ్యాసానికి ప్రత్యేక రుసుం ఉంటుంది. ప్రజలు బంధు మిత్రులతో వచ్చి పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తారు. ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక మందిరంలో అక్షరాభ్యాసం జరిపిస్తారు. ఆలయ ప్రాంగణంలోని జ్ఞానప్రసూనాంబ చేతిలో ఉన్న అఖండ జ్యోతికి నూనె పంచడానికి భక్తులు ఆసక్తి ప్రదర్శిస్తారు.

పునఃనిర్మాణం

[మార్చు]

దేవాలయ అభివృద్ధికి 2018 తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో 50 కోట్ల రూపాయలు కేటాయించారు.[2][3] 2023 మార్చి 24న ఆ దేవాలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ప్రాకార మండపానికి తూర్పు, పశ్చిమ దిశల్లో ఏడంతస్తులతో రెండు రాజ గోపురాలు, ఉత్తర, దక్షిణ దిశల్లో ఐదు అందస్తులతో మరో రెండు రాజ గోపురాలు, ప్రస్తుతమున్న ప్రాకార మండపం మరో 50 మీటర్లు ముందుకు నిర్మించనున్నారు. 10 అడుగుల పొడవు 10 అడుగుల వెడల్పుతో ఉన్న గర్భగుడి 25.5 అడుగుల వెడల్పు, 16.5 అడుగుల పొడవుతో పునర్నిర్మించనున్నారు. 6.5 అడుగుల వెడల్పున్న ఆలయ ముఖ ద్వారాన్ని 18.5 అడుగులకు పెంచాలని నిర్ణయించారు.[4][5]

రవాణా సౌకర్యాలు

[మార్చు]

హైదరాబాదు-మన్మాడ్ మార్గంలో బాసర స్టేషను ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి, మరికొన్ని సమీప పట్టణాలనుండి (నిర్మల్, నిజామాబాద్, భైంసా) బస్సు సౌకర్యం ఉంది. నిజామాబాదు నుండి బాసరకు 30 కి.మీ. దూరం. నిర్మల్ పట్టణానికి 75 కి.మీ. హైదరాబాదుకు సుమారు 205 కి.మీ. దూరం. హైదరాబాద్ - మన్మాడ్ మార్గంలో బాసర స్టేషను ఉంది.

సుమారు 200 సంవత్సరాల క్రితం విధ్వంస కాండకు పాల్పడుతున్న కొందరు దుండగులను తరిమివేసి మక్కాజీ పటేల్ అనే వ్యక్తి మరి కొందరి సహాయంతో ఆలయం పునర్నిర్మాణం చేయించాడు.

ప్రధాన దేవాలయానికి తూర్పు భాగాన ఔదుంబర వృక్షఛాయలో దత్త మందిరం, దత్త పాదుకలు ఉన్నాయి. మహాకాళీ దేవాలయం పశ్చిమ భాగాన నిత్యార్చనలతో చూడ ముచ్చటగా ఉంటుంది. శ్రీ వ్యాస మందిరం దక్షిణ దిశలో ఉంది. ఇందులో వ్యాస భగవానుని విగ్రహం, వ్యాస లింగం ఉన్నాయి.

మందిరానికి దగ్గరలో ఒక గుహ ఉంది. ఇది నరహరి మాలుకుడు తపస్సు చేసిన స్థలమంటారు. అక్కడ "వేదవతి" (ధనపు గుండు) అనే శిలపై తడితే ఒక్కోప్రక్క ఒక్కో శబ్దం వస్తుంది. అందులో సీతమ్మవారి నగలున్నాయంటారు. ఇక్కడికి దగ్గరలో 8 పుష్కరిణులున్నాయి. వాటి పేర్లు - ఇంద్రతీర్థం, సూర్యతీర్థం, వ్యాసతీర్థం, వాల్మీకి తీర్థం, విష్ణుతీర్థం, గణేషతీర్థం, పుత్రతీర్థం, శివతీర్థం.

పూజా విశేషాలు

[మార్చు]

ప్రతి నిత్యం ఉదయం 4 గంటలకు సరస్వతీ మూర్తికి వైదిక మంత్రోపేతంగా అభిషేక పూజ జరుపుతారు. అనంతరం ఉదయం 7:30 కి అక్షరాభ్యాస పూజలు మొదలై సాయంత్రం 6గంటల వరకు జరుగుతాయి. ఈ ఆలయానికి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిషా. మధ్య ప్రదేశ్ వంటి రాష్ట్రాలనుండి అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. ముఖ్యంగా విద్యా ప్రాప్తికై ఇక్కడ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి దేవికి పలక, బలపం, కాగితం, కలం వంటి కానుకలు సమర్పించే ఆచారం ఉంది. కేశ ఖండనం, ఉపనయనం, వివాహాలు, భజనలు నిరంతరం జరుగుతూ ఉంటాయి.

దర్శన వేళలు:- ఉదయం 4 గంటలకు ఆలయద్వారాలు తెరచి 4 గంటల నుండి 4.3 గంటల వరకు అభిషేకం టిక్కెట్లను ఇస్తారు. 4 గంటల నుండి 6:30 గంటల వరకు అభిషేకం, అలంకారం, హారతి, నైవేద్యం చేసి ప్రసాద వితరణ చేస్తారు. 7.3 గంటల నుండి 12.3 గంటల వరకు అర్చన, సర్వదర్శనం అక్షరాభ్యాస పూజలు చేస్తారు. 12.3 గంటలకు నివేదన చేసి ఆలయం 2 గంటవరకు మూసి ఉంచుతారు(రద్దీ సమయాల్లో మినహాయింపు). 2 గంటల నుండి 6.3 గంటల వరకు అర్చన సర్వదర్శనం అక్షరాభ్యాసం చేస్తారు.6.3 గంటల నుండి 7 గంటల వరకు ప్రదోష పూజ నిర్వహిస్తారు. 7 గంటల నుండి 8.3 గంటల వరకు మహా హారతి దర్శనం తరువాత ఆలయం మూసి వేస్తారు.

నవరాత్రులు

[మార్చు]

ఆశ్విని శుద్ధ పాఢ్యమి మొదలు నవమి వరకు జరుగుతాయి. ఉదయం, సాయంకాలం 64 ఉపచారములతో వైదిక విధానంలో అమ్మవారికి వైభవంగా పూజలు జరుగుతాయి. శ్రీదేవీ భాగవతం, దుర్గా సప్తశతి పారాయణాలు జరుగుతాయి. మహార్నవమి రోజున చండీ హోమం జరుగుతుంది. విజయదశమి నాడు వైదిక మంత్రాలతో మహాభిషేకం, సుందరమైన అలంకారం, సాయంకాలం పల్లకీ సేవ, శమీపూజ జరుగుతాయి. ఈ ఉత్సవాలలో భక్తులు, ఉపాసకులు తమ తమ అభిష్టానుసారం పూజలు చేసుకొంటారు. ఇంకా ధార్మిక చర్చలు, ఉపన్యాసాలు, హరికథలు, పురాణ పఠనం నిర్వహిస్తారు. యాత్రికులకు నిత్యాన్నదానం సమర్పిస్తారు.

కొన్ని ప్రార్ధనలు

[మార్చు]
విహిత నమస్కార శరణ్యాం సుఖప్రదామ్
ఓంకార పూరిత నామార్చనాం శుభ ప్రదామ్
పురస్కార సహిత దర్శనాం ఫలప్రదామ్
బాసర క్షేత్రదేవీం భజ సరస్వతీ మాతరమ్
నమోస్తు వేదవ్యాస నిర్మిత ప్రతిష్టితాయై
నమోస్తు మహాలక్ష్మీ మహాకాళీ సమేతాయై
నమోస్తు అష్ట తీర్థజల మహిమాన్వితాయై
నమోస్తు బాసర క్షేత్రే విలసితాయై
యా దేవీ సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థితా
నమస్తస్మై నమస్తస్మై నమస్తస్మై నమోనమః

శ్రీ వాసర సరస్వతీ స్తోత్రం

శరచ్చంద్ర వక్త్రాం లసత్పద్మ హస్తాం - సరోజ నేత్రాం స్ఫురద్రత్న మౌళీం!
ఘనాకార వేణీ౦ నిరాకార వృత్తిం భజే శారదాం వాసరా పీఠ వాసాం!!
ధరా భార పోషాం సురానీక వంద్యాం మృణాళీ లసద్బాహు కేయూర యుక్తాం!
త్రిలోకైక సాక్షీ ముదార స్తనాధ్యాం భజే శారదాం వాసరా పీఠ వాసాం!!
దురాసార సంసార తీర్ధాంఘ్రి పోతాం క్వణత్ స్వర్ణ మాణిక్య హారాభి రామాం!
శరచ్చంద్రికా ధౌత వాసోలసంతీం భజే శారదాం వాసరా పీఠ వాసాం!!
విరించీ విష్ణ్వింద్ర యోగీంద్ర పూజ్యాం ప్రసన్నాం విపన్నార్తినాశాం శరణ్యాం!
త్రిలోకాధి నాథాధి నాథాం త్రిశూన్యాం భజే శారదాం వాసరా పీఠ వాసాం!!
అనంతా మగమ్యా మనాద్యా మభావ్యా మభేద్యా మదాహ్యా మలేప్యా మరూపాం!
అశోష్యా మసంగా మదేహా మవాచ్యాం భజే శారదాం వాసరా పీఠ వాసాం!!
మనో వాగతీతా మనామ్నీ మఖండా మభిన్నాత్మికా మద్వయాం స్వ ప్రకాశాం!
చిదానంద కందాం పరంజ్యోతి రూపాం భజే శారదాం వాసరా పీఠ వాసాం!!
సదానంద రూపాం శుభాయోగ రూపా~మశేషాత్మికాం నిర్గుణాం నిర్వికారాం!
మహా వాక్య వేద్యాం విచార ప్రసంగాం భజే శారదా౦ వాసరా పీఠ వాసాం!!
ఇమం స్తవం పఠేద్వస్తు త్రికాలం భక్తి సంయుతః!
శారదా సౌమ్య మాప్నోతి గృహేస్థిత్వాజ్ఞ సంభవం!!

ఇతి శ్రీ బ్రహ్మాండ పురాణాంతర్గత వాల్మీకి కృత శ్రీ వాసర సరస్వతీ స్తోత్రం సంపూర్ణం

ఇవికూడా చూడండి

[మార్చు]

వనరులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. నా దక్షిణ భారత యాత్రావిశేషాలు, పాటిబండ్ల వెంకటపతిరాయలు, 2005 ముద్రణ, పేజీ 42
  2. "తెలంగాణ బడ్జెట్ 2018: ఈటల ప్రసంగం". Samayam Telugu. 2018-03-15. Archived from the original on 2022-10-12. Retrieved 2022-10-12.
  3. Mar 15, TIMESOFINDIA COM / Updated:; 2018; Ist, 13:23 (2018-03-15). "Telangana Budget 2018: Highlights of Telangana budget 2018-19 | Hyderabad News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 2018-04-17. Retrieved 2022-10-12. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  4. telugu, NT News (2023-03-24). "Basara Temple | బాస‌ర‌ ఆల‌య పునఃనిర్మాణానికి శ్రీకారం". www.ntnews.com. Archived from the original on 2023-03-24. Retrieved 2023-03-27.
  5. "బాసర సరస్వతీ ఆలయ పునర్నిర్మాణ పనులు షురూ". ETV Bharat News. 2023-03-24. Retrieved 2023-03-27.

ఇతర లింకులు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.