Jump to content

తిరుమల శ్రీవారి వారోత్సవాలు

వికీపీడియా నుండి
ఈ వ్యాసాన్ని లేదా వ్యాస విభాగాన్ని శ్రీవారి వారోత్సవాలు వ్యాసంలో విలీనం చెయ్యాలని ప్రతిపాదించడమైనది. (చర్చించండి)

తిరుమలలో శ్రీ వెంకటేశ్వరస్వామి వారికి వారానికి ఒకమారు మాత్రమే తప్పనిసరిగా జరిగే వారోత్సవాలు కొన్ని ఉన్నాయి. ఇలా ఆయా వారాల్లో జరిగే ఆయా సేవలను గూర్చి తెలుసుకుందాం.

  • ఆదివారం -
  • సోమవారం - విశేషపూజ
  • మంగళవారం - అష్టదళ పాదపద్మారాధన
  • బుధవారం - సహస్ర కలశాభిషేకం
  • గురువారం - ఉదయం తిరుప్పావడ సేవ, రాత్రి పూలంగి సేవ
  • శుక్రవారం - శుక్రవారాభిషేకం, ఆకాశ గంగ తీర్థంతో అభిషేకం, నిజ పాద దర్శనం
  • శనివారం -

తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు గోవిందం - పరమానందం అనే చిన్న పుస్తకం ద్వారా స్వామి వారి నిత్య సేవలను, వారోత్సవాలను చక్కగా కళ్లకు కట్టినట్లు వ్యావహారిక భాషలో సామాన్య జనులకు అర్థమగు రీతిలో ఫోటోలతో సహా వివరించింది.

సోమవారం - విశేషపూజ

[మార్చు]

తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారికి ప్రతి సోమవారం ఉదయం 6గంటలకు జరిగే ప్రధాన సేవ విశేషపూజ. ఈ సేవ సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణమండపంలో శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్పస్వామివారికి జరుగుతుంది. ప్రతి సోమవారం జరిగే ఈ సేవ 1991 ఏప్రియల్ 8న ప్రారంభింపబడి, ఆర్జితసేవగా రూపుదిద్దుకుంది.

శ్రీవారి ఆలయంలో రెండవ అర్చన, రెండవ నైవేద్యం తర్వాత దేవేరులతో కూడి శ్రీ మలయప్పస్వామి కల్యాణమండపానికి వేంచేస్తారు. వైఖానసాగమ శాస్త్రోక్తంగా హోమాలు నిర్వహించిన పిదప శ్రీస్వామివారలకు (స్నపన) తిరుమంజనం నిర్వహిస్తారు. ఈ సేవలో పాల్గొన్న భక్తులకు ప్రసాదాలు ఇస్తారు.

మంగళవారం - అష్టదళ పాదపద్మారాధన

[మార్చు]

ప్రతి మంగళవారం ఉదయం 6గంటలకు రెండవ అర్చనగా 108 బంగారు కమలాలతో మూలవిరాట్టుకు జరిగే అర్చన కార్యక్రమమే అష్టదళ పాదపద్మారాధన. ఇది సుమారు 20 నిమిషాలపాటు జరుగుతుంది.

1984వ సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం స్వర్ణోత్సవ సందర్భంగా ప్రవేశపెట్టబడిన సేవ ఇది. హైదరాబాదు వాస్తవ్యుడైన మహమ్మదీయ భక్తుడు ఇందుకు అవసరమైన 108 బంగారు పద్మాలను కానుకగా సమర్పించాడు. తర్వాత ఇది ఆర్జిత సేవగా కూడా రూపుదిద్దుకుంది. 108 బంగారు కమలాలతో అష్టోత్తర శతనామాలతో అర్చన జరుగుతుండగా భక్తులు నయనానందకరంగా శ్రీస్వామి వారిని దర్శిస్తారు.

బుధవారం - సహస్ర కలశాభిషేకం

[మార్చు]

ప్రతి బుధవారం ఉదయం 6 గంటలకు తిరుమలలో బంగారువాకిలి ముందు జరిగే ప్రధాన సేవయే సహస్ర కలశాభిషేకం. భోగ శ్రీనివాసమూర్తితో పాటు శ్రీదేవీ భూదేవీ సమేతంగా శ్రీ మలయప్పస్వామివారికి ఈ సహస్ర కలశాభిషేకం జరుగుతుంది. 1511 వ సంవత్సరం నాటికి ముందు నుండి ఈ సహస్ర కలశాభిషేకం జరుగుతున్నట్లు దాఖలాలున్నాయి. బంగారు వాకిలి ముందు జరిగే ఈ సహస్ర కలశాభిషేకంలో ఆర్జత రుసుమును చెల్లించిన భక్తులు కూడా పాల్గొని దర్శించవచ్చు. వీరికి శ్రీవారి దర్శనం కలిగించి ప్రసాదాలు ఇస్తారు.

గురువారం - ఉదయం తిరుప్పావడ సేవ, రాత్రి పూలంగి సేవ

[మార్చు]

తిరుప్పావడ సేవ

[మార్చు]

ప్రతి గురువారం శ్రీ వెంకటేశ్వరస్వామి వారికి రెండవ అర్చనానంతరం జరిగే నివేదనే తిరుప్పావడ సేవ అనీ అన్నకూటోత్సవ మనీ అంటారు. ఉదయం 6 గంటలకు శ్రీస్వామివారి మూలవిరాట్టుకు ఉన్న ఆభరణాలను అన్నింటినీ తీసివేస్తారు. పిదప ఊర్ధ్వపుండ్రాన్ని కూడా బాగా తగ్గించి నేత్రాలు స్పష్టంగా కనపడేట్లు చేస్తారు. తర్వాత శ్రీస్వామి వారికి ఎదురుగా బంగారు వాకిలి ముందర పెద్ద శిఖరంలాగా పులిహోర రాశిని ఏర్పాటు చేస్తారు. పులిహోరతో పాటు జిలేబిలను, మురుకులను చక్కగా అమర్చి పూలతో అలంకరిస్తారు. ఈ పులిహోర రాశిని నేరుగా గర్భాలయంలోని స్వామివారికి నివేదిస్తారు.

ఈ సేవలో ఆర్జితం చెల్ల్లించిన భక్తులు కూడా పాల్గొనవచ్చు. ఈ సేవలో వేదపండితులు వేదపారాయణంతో పాటు శ్రీనివాస గద్యం పఠిస్తారు. ఆ తర్వాత భక్తులందరికి తిరుప్పావడ సేవతో పాటు శ్రీవారి నేత్ర దర్శనం పొందే అవకాశం కల్గుతుంది.

పూలంగి సేవ

[మార్చు]

ప్రతి గురువారం రాత్రి 8 గంటలకు శ్రీ వారికి జరిగే తోమాలసేవను పూలంగి సేవ అంటారు. అయితే ఈ సేవ మాత్రం పూర్తిగా ఏకాంతంగా జరుగుతుంది. జియ్యంగార్లు అందించే పూలమాలతో అర్చకులు శ్రీవారి విగ్రహాన్ని మొత్తం అలంకరిస్తారు. శ్రీస్వామివారు పూలంగి తొడిగినట్లుగా ఉంటారు. పూలంగి సేవ అలంకరణం అయిన తర్వాత ప్రతి గురువారం రాత్రి యాత్రికులు పూలంగి అలంకరణలో ఉన్న శ్రీస్వామివారిని నయనానందంగా దర్శింపవచ్చు.

శుక్రవారం - శుక్రవారాభిషేకం, ఆకాశగంగ తీర్థంతో అభిషేకం, నిజపాద దర్శనం

[మార్చు]

శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మూలమూర్తికి ప్రతి శుక్రవారం తెల్లవారు జామున 4 గంటలకు జరిగే అభిషేకమే శుక్రవారాభిషేకం. ప్రతి శుక్రవారం విశేషోత్సవంగా జరుపబడే ఈ అభిషేకం 614వ సంవత్సరానికి పూర్వం నుండే జరిగేదని తెలుస్తుంది. విశేష సందర్భాల్లో జరిగే ఈ శుక్రవారాభిషేకాన్ని భగవద్రామానుజులవారు శ్రీస్వామి వారి వక్షఃస్థలంలో బంగారు అలమేలుమంగ ప్రతిమను అలంకరింపజేసిన శుక్రవారం మొదలుగా ప్రతి శుక్రవారం నాడు ఈ అభిషేకం జరిగేట్లు ఏర్పాటు చేశారట.

ఆకాశ గంగ తీర్థంతో అభిషేకం

[మార్చు]

పూర్వం శ్రీవారి నిత్యాభిషేక కైంకర్యంతో తరించిన మహాభక్తుడైన తిరుమలనంబి వంశీయుడు అందించిన కలశ తీర్థాన్ని తొలుత జియ్యంగారు స్వీకరించి భక్తి ప్రపత్తులతో బంగారు శంఖంతో అందించగా ఆ ఆకాశగంగ తీర్థాన్ని అర్చక స్వాములు శ్రీవారి శిరస్సుపై సమర్పిస్తూ హరిః ఓం సహస్రశీర్షా పురుషః అని పురుష సూక్తాన్ని ప్రారంభిస్తారు. కులశేఖరపడికి ఇవతల ఉన్న విద్వాంసులు పురుషసూక్తం అందుకుని అభిషేకం జరుగుతున్నంత సేపు పంచసూక్తాలను పఠిస్తూనే ఉంటారు. ఆకాశగంగాతీర్థంతో అభిషేకించబడుతున్న శ్రీవారి దివ్య మంగళమూర్తిని వీక్షిస్తున్న భక్తులు ఆ అభిషేకం తామే చేస్తున్నట్లుగా భావిస్తూ తన్మయులౌతారు.

పునుగు, కస్తూరి, జవ్వాది మున్నగు సుగంధెద్రవ్యాలతో, ఆకాశగంగా తీర్థంతో, సుమారు ఒక గంటపాటు అభిషేకం జరుగుతుంది. ఆ తర్వాత పసుపుతో శ్రీవారి వక్షఃస్థలం మీద ఉన్న మహాలక్ష్మికి కూడా ఈ అభిషేకం జరుగుతుంది.

ఎప్పుడో, ఏనాడో బ్రహ్మాది దేవతల కోరికమేరకు కలియుగ మానవుల కోసం వెలసిన శ్రీనివాసుని యథాతథమైన రూపాన్ని వక్షఃస్థల లక్ష్మితో కూడా ఈ శుక్రవారాభిషేక సమయంలో మాత్రమే దర్శించ వీలవుతుంది.

అభిషేకం అయిన తర్వాత శ్రీస్వామివారి మెడలో ఉన్న బంగారు అలమేలుమంగకు కూడా అభిషేకం జరుగుతుంది. ఆర్జితసేవగా జరుపబడుతున్న ఈ అభిషేకోత్సవం భక్తులను విశేషంగా ఆకర్షిస్తూంది. అభిషేకానంతరం భక్తులందరి మీదా అభిషేక తీర్థాన్ని సంప్రోక్షించడంతో అభిషేకదర్శనం పూర్తవుతుంది.

నిజపాద దర్శనం

[మార్చు]

ప్రతి శుక్రవారం అభిషేకానంతరం అభిషేక సేవలో పాల్గొన్న గృహస్థులు శ్రైస్వామి వారిని దర్శించి వెళ్లిన తర్వాత నిజ పాద దర్శనం ప్రారంభమవుతుంది. ఆర్జిత రుసుమును చెల్లించిన భక్తులు ఈ సేవలో పాల్గొని శ్రీ వెంకటేశ్వరస్వామి వారి నిజపాదాలను అంటే (ఎలాంటి తొడుగులు లేకుండా) దర్శించవచ్చు. ఈ దర్శనంలో మాత్రమే శ్రీవారి నిజపాదాలు దర్శించుటకు ఆవకాశముంటుంది. మిగిలిన వేళల్లో ఆ పాదాలు బంగారు తొడుగులతో విరాజిల్లుతూ ఉంటాయి.

శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్

[మార్చు]

ఈ ఉత్సవాలలో కొన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. ఆనంద నిలయంలో నిర్వహించే ఆయా వారాల సేవలను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు సాంప్రదాయరీత్యా సాధ్యం కాదు. అందుచేత ఈ సేవలను శ్రీవారి నమూనా ఆలయంలో చిత్రీకరించి ప్రసారం చేస్తూంది.

మూలాలు

[మార్చు]