తిరుమల సంకీర్తనా భాండాగారం
తిరుమల సంకీర్తనా భాండాగారం లేక తాళ్ళపాక సంకీర్తనా భాండాగారం లేక తాళ్ళపాక అఱై అన్నది తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయమైన ఆనందనిలయానికి సమీపంలో భాష్యకారుల సన్నిధిని ఆనుకుని ఉన్న తాళ్ళపాక వంశస్థుల సంకీర్తనల భాండాగారం. రాతి పలకలతో ఉండే ఈ అరపైన అన్నమయ్య, పెదతిరుమలాచార్యుల విగ్రహాలు చెక్కివున్నాయి. తిరుమల వేంకటేశ్వరస్వామిపై వేలాది సంకీర్తనలు రచించి, తిరుమల దేవాలయ ఆచారాలు, ఉత్సవాల్లోనూ విడదీయరాని భాగంగా మారిన సంకీర్తనాచార్యుడు తాళ్ళపాక అన్నమయ్య. అతని సంకీర్తన వారసత్వాన్ని, సంకీర్తనాచార్యునిగా అతని బాధ్యతలను అందిపుచ్చుకున్న రెండవ కుమారుడు తాళ్ళపాక పెదతిరుమలాచార్యుడు. తాళ్ళపాక కుటుంబ సంకీర్తన వారసత్వాన్ని స్వీకరించిన కవి తాళ్ళపాక చిన తిరుమలాచార్యులు. వీరందరి సంకీర్తనలు రాగిరేకుల మీద చెక్కబడి, ఈ అరలో వందల సంవత్సరాల పాటు భద్రంగా ఉన్నాయి. 1922లో ఈ భాండాగారం నుంచి రెండువేల ఐదువందల పైచిలుకు రేకులను తీసి తిరుమల తిరుపతి దేవస్థానం వ్రాతప్రతులు వ్రాయించారు. అన్నమాచార్యుల తుది దశలో కానీ, ఆయన మరణించిన తర్వాత కానీ రాగిరేకుల మీద ఆయన సాహిత్యాన్ని భద్రపరచడం జరిగాయి. తాళ్ళపాక సంకీర్తనా భాండాగారం 16వ శతాబ్ది నాటికి నిత్యం ఘనంగా నైవేద్యాలు, అఖండ దీపారాధన వంటి సేవలు జరిగేవి. ప్రస్తుతం తిరుమల దేవాలయంలోనే కనిపించే ఈ భాండాగారంలోని రాగిరేకుల్లో సంకీర్తనలను తిరుమల తిరుపతి దేవస్థానం తరలించి, భద్రంగా తమ అధీనంలో ఉంచింది.
విషయ సూచిక
నెలకొన్న ప్రదేశం[మార్చు]
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయమైన ఆనందనిలయానికి కుడివైపున వేంకటేశ్వరస్వామి ప్రధాన హుండీకి ఎదురుగా, భాష్యకారుల సన్నిధికి పక్కన ఈ సంకీర్తనా భాండాగారం నెలకొంది. సంకీర్తన భాండాగారం రాతి పలకల గది, దీనిపైన తాళ్ళపాక అన్నమయ్య, పెద తిరుమలాచార్యుల రాతి విగ్రహాలు చెక్కి ఉన్నాయి.
చరిత్ర[మార్చు]
నిర్మాణం[మార్చు]
సంప్రదాయ కథనం ప్రకారం, దాన్ని అనుసరించే సాహిత్యవేత్తలు అన్నమయ్య తన సంకీర్తనా కార్యక్రమాన్ని వ్యవస్థీకృతం చేయలేదని పేర్కొంటూ వుంటారు. [1] అయితే తాళ్ళపాక అన్నమయ్య రచించిన సంకీర్తనలు వివిధ దేవాలయాల్లో రాగిరేకులలో లభ్యమవుతూండడం, అన్నమయ్య వారసులు అతని సంకీర్తనలను పలు వైష్ణవాలయాల్లో పాడేందుకు వ్యవస్థీకృతమైన ఏర్పాట్లు చేసివుండడాన్ని బట్టి అన్నమయ్య, అతని వారసుల సంకీర్తన కృషి తెలుగు నాట వైష్ణవ భక్తి విస్తరణలో వ్యవస్థీకృతమైందని పరిశోధకులు భావిస్తున్నారు. [2] ఈ నేపథ్యంలో బహుశా అన్నమయ్య జీవిత చరమాంకంలోనో, అతను మరణించాకానో అన్నమయ్య సంకీర్తనలను రాగిరేకులపై చెక్కించే పని ప్రారంభమైంది. ఈ చెక్కించేపనిని అన్నమయ్య కుమారుడు, స్వయంగా సంకీర్తనాచార్యుడూ అయిన తాళ్ళపాక పెదతిరుమలాచార్యుడు పర్యవేక్షణలో సాగింది. ఎంతో సమయం, ధనం వ్యయమయ్యే ఇంతటి భారీ ప్రయత్నం తెలుగు సాహిత్యంలో అతిపెద్ద ప్రచురణా కృషిగా సాహిత్య పరిశోధకులు వెల్చేరు నారాయణరావు, డేవిడ్ షుల్మన్ అంచనా కట్టారు.
తాళ్ళపాక అన్నమయ్య, అతని వారసులైన తాళ్ళపాక కవుల సంకీర్తనలను భద్రపరిచేందుకు తిరుమల ఆలయంలోని రాతి అరలతో ఏర్పరిచిన సంకీర్తనా భాండాగారాన్ని ఉపయోగించారు. ఈ భాండాగారాన్ని అన్నమయ్య జీవిత కాలంలోనే, ప్రధానంగా అతని జీవితంలోని చివరి దశలో, ఏర్పాటుచేసి సంకీర్తనలు దాయడం మొదలుపెట్టారని పలువురు సాహిత్య పరిశోధకులు భావించారు. ఇందుకు "దాచుకో నీ పాదాలకు తగ నే చేసిన పూజలివి" అన్న సంకీర్తనలో "ఒక్క సంకీర్తనే చాలు ఒద్దికై మము రక్షించగ/తక్కినవి భాండారాన దాచివుంచనీ" అన్న పాదం తన సంకీర్తనలు రాగిరేకులపై చెక్కించి ఈ సంకీర్తనా భాండాగారంలో దాచివుంచడమన్న ప్రయత్నం గురించే ప్రస్తావిస్తున్నాడని భావించారు. [1]
ఆరాధనలు[మార్చు]
సంకీర్తనా భాండాగారానికి చారిత్రికంగా ఆరాధనలు జరిగేవి. 1530 నాటి శాసనాన్ని అనుసరించి అప్పటికి తాళ్లపాక వారి అరకు నిత్యం వైభవోపేతంగా పూజా నివేదనలు, అఖండ దీపారాధనలు జరిగేవని, భక్తులకు భాండాగారం వద్ద ప్రసాదంగా అతిరసాలను వితరణ చేసేవారనీ, ఇటువంటి ఆరాధనలకు తాళ్ళపాక అన్నమయ్య కుమారుడైన తాళ్ళపాక పెదతిరుమలాచార్యుడు ఖర్చు భరించేవాడని తెలుస్తోంది. సంకీర్తనా భాండాగారం వద్ద అన్నమయ్య సంకీర్తనలు పాడి వినిపించేందుకు ప్రత్యేకించి నియమించిన గాయకులు ఉండేవారు, పాటలు వినేందుకు వచ్చిన భక్తులకు పన్నీరు బుడ్లూ, చందన తాంబూలాలు ఇచ్చి పంపడం ఉండేది.
ప్రస్తుత స్థితి[మార్చు]
20వ శతాబ్ది వరకూ 700 సంవత్సరాల పాటు అన్నమయ్య సంకీర్తనలు తిరుమల ఆలయంలోని చీకటి కొట్లో పడి తెరమరుగై ఉన్నాయని, 20వ శతాబ్ది తొలినాళ్ళలో అనుకోకుండా వేటూరి ప్రభాకరశాస్త్రి లేదా ఆయన వంటి మరో పండితుడు తాళ్ళపాక వారి అఱలో ప్రవేశించి సంకీర్తనలు వెలికి తీసి, పరిష్కరించి ప్రపంచానికి అందించాకానే వెలుగు చూశాయని చెప్తారు. అయితే తాళ్ళపాక వారి అఱ ఏర్పాటు మొదలుకొని చారిత్రకంగా ఈ భాండాగారం వైష్ణవ ప్రచారంలోనూ, తిరుమల వేంకటేశ్వరస్వామి భక్తి ప్రచారంలోనూ ఒక కేంద్రంగానే ఉంది.[2] అన్నమాచార్యుల సంకీర్తనలు తిరుమల వేంకటేశ్వరుడి ఉత్సవాల్లో చాలావాటిలో ఆలపించడం ఒక విధిగా ఉండేది. క్రీ.శ.1816లో తెలుగు వ్యాకరణ రచన కోసం క్యాంప్‌బెల్ ఈ సంకర్తనా భాండాగారం నుంచి రేకులపైన సంకీర్తనలు వ్రాయించి తెప్పించుకున్నాడు.
1922లో తిరుమల దేవస్థానపు శిలాశాసనాధికారి సాధు సుబ్రహ్మణ్యశాస్త్రి రాగిరేకులను సంకీర్తనా భాండాగారం నుంచి స్వయంగా తెచ్చి తిరుమల దేవస్థాన కార్యాలయానికి తరలించాడు, ఆ రేకుల నుంచి సంకీర్తనలను వ్రాయించి వ్రాతప్రతులు తొలిసారిగా 1920 దశకంలోనే సిద్ధం చేశారు. ప్రస్తుతం భాండాగారం తిరుమల దేవాలయ ప్రాంగణంలో అదే ప్రదేశంలో నెలకొనివున్నా, అందులోని రాగిరేకులు మాత్రం అక్కడ లేవు. [1] అన్నమయ్య సంకీర్తనలు ఉన్న రాగిరేకులను రాగి కోసం కరిగించారనీ, దానివల్ల వేలాది సంకీర్తనలు పోయాయని ప్రచారం ఉంది. ఇప్పటికీ అలా అన్నమయ్య సంకీర్తనల రాగిరేకులు రాయలసీమ ప్రాంతంలో పాత రాగి బిందెలు, గంగాళాలుగా మారగా, సంకీర్తనల అక్షరాలు అలుక్కుపోయినట్టు కనిపిస్తూవుంటుందని చెప్పుకొంటూంటారు.[3] కానీ అలా ఏమీ పోలేదనీ, దేవస్థానానికి దొరికిన రేకులన్నీ భద్రంగా దేవస్థానంలోనే ఉన్నాయని తిరుమల తిరుపతి దేవస్థానాల పరిపానాధికారిగానూ, ఆపైన దేవాలయ వ్యవహారాల్లో పలు కమిటీలకు ఛైర్మన్, సమన్వయకర్త హోదాల్లో పనిచేసిన పి.వి.ఆర్.కె. ప్రసాద్ పేర్కొన్నాడు.[4]
భాండాగారంలో లభ్యమైనవి మొత్తం 2701 రేకులు కాగా వీటిలో 2289 రేకుల్లో తాళ్ళపాక అన్నమయ్య సంకీర్తనలు చెక్కించివున్నాయి, 205 రేకులపై తాళ్ళపాక పెదతిరుమలాచార్యుడు, 37 రేకులపై రేకులపై తాళ్లపాక చిన తిరుమలాచార్యుడు రచించిన కీర్తనలు చెక్కివున్నాయి.[1] వీటిలో 1922లో సాధు సుబ్రహ్మణ్యశాస్త్రికి లభించినవి 2590 రాగిరేకులు[4]
ఇవి కూడా చూడండి[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ 1.0 1.1 1.2 1.3 వి., వెంకట సుబ్బారావు (డిసెంబరు 2014). "అన్నమయ్య - జీవిత విశేషాలు" (PDF). అన్నమయ్య సాహిత్య ప్రస్థానం భక్తి నేపథ్యం. హైదరాబాద్. Retrieved May 7, 2018. Check date values in:
|date=
(help) - ↑ 2.0 2.1 వెల్చేరు, నారాయణరావు; డేవిడ్, షుల్మన్ (జనవరి 2013). "వేంగడంలో కొండలరాయుడు". ఈమాట. Retrieved May 7, 2018.
- ↑ తనికెళ్ళ, భరణి. ఎందరో మహానుభావులు. హాసం ప్రచురణలు.
- ↑ 4.0 4.1 పి. వి. ఆర్. కె., ప్రసాద్ (ఆగస్టు 2013). "దుష్టగ్రహకూటమిలో రాజ్యం దానం". In జి.వల్లీశ్వర్ (సంపాదకుడు.). తిరుమల చరితామృతం. ఎమెస్కో బుక్స్.