హిందూ జర్మను కుట్ర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

1914 - 1917 మధ్య, మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో బ్రిటిషు సామ్రాజ్యంపై తిరుగుబాటును లేవదీసేందుకు భారతీయ జాతీయవాద సమూహాలు చేసిన వరుస ప్రయత్నాలను హిందూ-జర్మన్ కుట్ర (పేరుపై వివరణ) అంటారు. ప్రచ్ఛన్నంలో ఉన్న భారత విప్లవకారులు, అమెరికాలో ప్రవాసంలో ఉన్న లేదా బహిష్కరించబడిన జాతీయవాదులూ కలిసి ఈ తిరుగుబాటును రూపొందించారు. యుద్ధానికి ముందరి దశాబ్ద కాలంలో గదర్ పార్టీ, జర్మనీలోని భారత స్వాతంత్ర్య కమిటీ కూడా ఇందులో భాగంగా ఉన్నాయి. [1][2][3] యుద్ధం ప్రారంభం తోనే కుట్ర కూడా మొదలైంది. జర్మన్ విదేశాంగ కార్యాలయం, శాన్ ఫ్రాన్సిస్కోలోని జర్మనీ రాయబార కార్యాలయం, ఒట్టోమన్ టర్కీ, ఐరిష్ రిపబ్లికన్ ఉద్యమం నుండి ఈ కుట్రకు విస్తృతమైన మద్దతు లభించింది. అత్యంత ముఖ్యంగా, పంజాబ్ నుండి సింగపూర్ వరకు బ్రిటిషు భారత సైన్యంలో తిరుగుబాటును లేవదీయడానికీ, అశాంతిని ప్రేరేపించడానికీ ఈ కుట్ర ప్రయత్నించింది. దీన్ని 1915 ఫిబ్రవరిలో దీన్ని అమలు చేసి, భారత ఉపఖండంలో బ్రిటిషు పాలనను పడగొట్టాలనేది ప్రణాళిక. బ్రిటిషు నిఘా వ్యవస్థ గదర్ ఉద్యమంలోకి చొరబడి కీలక వ్యక్తులను అరెస్టు చేసి, ఫిబ్రవరి తిరుగుబాటును ఛేదించింది. భారతదేశంలోని చిన్న యూనిట్లు, సైనిక శిబిరాల్లో రేగిన తిరుగుబాట్లను కూడా అణిచివేసారు.

ఇండో-జర్మన్ కూటమి చేస్తున్న కుట్రల ఛేదనే లక్ష్యంగా ప్రపంచవ్యాప్తంగా బ్రిటిషు నిఘా వ్యవస్థ పనిచేసింది. తిరుగుబాటుదారుల మరిన్ని ప్రయత్నాలను విజయవంతంగా నిరోధించింది. 1917 లో ఆనీ లార్సెన్ వ్యవహారంలో అమెరికన్ గూఢచార సంస్థలు కీలక వ్యక్తులను అరెస్టు చేశాయి. భారతదేశంలో లాహోర్ కుట్ర కేసుపై జరిగిన విచారణతో పాటే అమెరికాలో హిందూ జర్మన్ కుట్ర విచారణ కూడా జరిగింది. ఆ సమయంలో అది అమెరికాలో జరిగిన అత్యంత సుదీర్ఘమైన, అత్యంత ఖరీదైన విచారణ. [4]

ఈ సంఘటనల పరంపర భారత స్వాతంత్ర్య ఉద్యమానికి కీలకమైనది. బ్రిటిషు వారు భారతదేశం పట్ల తమ విధానాన్ని సంస్కరించుకోవడంలో ఇది ప్రధాన కారకం. [5] రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ లోను, జపాను ఆక్రమించుకున్న ఆగ్నేయాసియాలోనూ ఇలాంటి ప్రయత్నాలే జరిగాయి. సుభాష్ చంద్రబోస్ ఇండియన్ లీజియన్ను, భారత జాతీయ సైన్యాన్నీ (ఆజాద్ హింద్ ఫౌజ్) ఏర్పాటు చేశాడు. ఇటలీలో మహ్మద్ ఇక్బాల్ షెడాయ్, బట్టాగ్లియోన్ ఆజాద్ హిందూస్తాన్‌ను ఏర్పాటు చేశాడు.

పేరుపై వివరణ

[మార్చు]

ఈ కుట్రకు 'హిందూ కుట్ర' అని, 'ఇండో జర్మను కుట్ర' అని, 'గదర్ కుట్ర' అని, 'జర్మను కుట్ర' అనీ అనేక పేర్లున్నాయి.[6][7][8][9][10] హిందూ-జర్మన్ కుట్ర అనే పదం అమెరికాలో ఆనీ లార్సెన్ కుట్రను బహిర్గతం చేయడానికి, అమెరికా తటస్థతను ఉల్లంఘించినందుకు భారతీయ జాతీయవాదులు, శాన్ ఫ్రాన్సిస్కోలోని జర్మన్ కాన్సులేట్ సిబ్బందిపై విచారణకూ చాలా దగ్గరి సంబంధం కలిగి ఉంది. ఈ సంఘటనపై అమెరికాలో జరిగిన విచారణను హిందూ-జర్మన్ కుట్ర విచారణ అని పిలుస్తారు. మీడియాలో కూడా ఈ కుట్రను ఆ పేరుతోనే రాసారు (ఆ తర్వాత అనేక మంది చరిత్రకారులు దాన్ని అధ్యయనం చేశారు). అయితే, ఈ కుట్రలో హిందువులు, జర్మన్‌లు మాత్రమే కాకుండా, గణనీయమైన సంఖ్యలో ముస్లింలు, పంజాబీ సిక్కులు కూడా పాల్గొన్నారు. జర్మన్, టర్కిష్ ప్రమేయం కంటే ముందే బలమైన ఐరిష్ మద్దతు కూడా ఉంది. అమెరికాలో భారతీయులను విమర్శించే సందర్భంలో సాధారణంగా ఏ మతస్థులనైనా హిందూ అనే పదం తోనే ఉదహరించేవారు. అలాగే, కుట్ర అనేది కూడా ప్రతికూల అర్థాలతో కూడిన పదం. అమెరికా జర్మనీకి వ్యతిరేకంగా యుద్ధంలో చేరబోతున్న సమయంలో భారతీయ విప్లవకారులను అప్రతిష్టపాలు చేయడానికి హిందూ కుట్ర అనే పదాన్ని ప్రభుత్వం ఉపయోగించింది.[11][12][13]

'గదర్ కుట్ర' అనే పదాన్ని ప్రత్యేకించి భారతదేశంలో 1915 ఫిబ్రవరిలో జరిగిన తిరుగుబాటును సూచించేందుకు వాడతారు, అయితే 'జర్మన్ కుట్ర' లేదా 'క్రిస్మస్ నాటి కుట్ర' అనే పదాలు 1915 శరదృతువులో జతిన్ ముఖర్జీకి ఆయుధాలను రవాణా చేసే ప్రణాళికలను సూచించేందుకు వాడతారు. ఇండో-జర్మన్ కుట్ర అనే పదాన్ని సాధారణంగా ఆగ్నేయాసియాలో ప్రణాళికలను సూచించడానికి, యుద్ధం ముగింపులో కుట్ర యొక్క అవశేషంగా మిగిలిపోయిన కాబూల్‌కు మిషన్‌ను సూచించడానికి కూడా ఉపయోగిస్తారు. ఇవన్నీ పెద్ద కుట్రలో భాగమే. అమెరికన్ కోణాన్ని సమీక్షించే చాలా మంది పండితులు హిందూ-జర్మన్ కుట్ర, హిందూ-కుట్ర లేదా గదర్ కుట్ర అనే పేరును ఉపయోగిస్తారు. అయితే ఆగ్నేయాసియా నుండి యూరప్ ద్వారా అమెరికా వరకూ సాగిన మొత్తం కుట్రను సమీక్షించే సందర్భంలో ఇండో-జర్మన్ కుట్ర అనే పదాన్ని తరచుగా ఉపయోగిస్తారు. [10][14] బ్రిటిషు భారతదేశంలో, ఈ సంఘటనలపై దర్యాప్తు చేసిన రౌలట్ కమిటీ, దాన్ని "దేశద్రోహ కుట్ర"గా పేర్కొంది.

నేపథ్యం

[మార్చు]

19 వ శతాబ్దం చివరి దశాబ్దాలలో భారతదేశంలో వచ్చిన సామాజిక, ఆర్థిక, రాజకీయ మార్పుల ఫలితంగా దేశంలో జాతీయవాదం బలపడింది. [15][16][17][18][19] 1885 లో స్థాపించబడిన భారత జాతీయ కాంగ్రెస్, రాజకీయ సరళీకరణ, స్వయంప్రతిపత్తిల కోసం చేసే డిమాండ్లకు ప్రధాన వేదికగా వెలుగు లోకి వచ్చింది. 1890 లలో ప్రచ్ఛన్న సమూహాల స్థాపనతో జాతీయవాద ఉద్యమం పెరిగింది. మహారాష్ట్ర, మద్రాస్, దక్షిణ భారతదేశంలోని ఇతర ప్రదేశాలలో వచ్చిన ఉద్యమాలు చిన్నవైనప్పటికీ గుర్తించదగినవే. కానీ బెంగాల్, పంజాబ్‌లో మాత్రం ఈ ఉద్యమాలు బలంగా, తీవ్రంగా, హింసాత్మకంగా మారాయి. [20] బెంగాల్‌లో విప్లవకారులు పట్టణ మధ్యతరగతి భద్రలోక్ కమ్యూనిటీకి చెందిన విద్యావంతులైన యువకులను చేర్చుకోగా, పంజాబ్‌లో గ్రామీణ, సైనిక సమాజాలకు చెందినవారు ఉద్యమంలో చేరారు.

ఈ కుట్రలో భాగమైన ఇతర సంఘటనలు:

  • 1915 సింగపూర్ తిరుగుబాటు
  • ఆనీ లార్సెన్ ఆయుధాల రవాణా
  • జుగాంతర్ -జర్మన్ కుట్రలు
  • జర్మనీ మిషన్ కాబూల్
  • భారతదేశంలోని కానాట్ రేంజర్స్ తిరుగుబాటు
  • 1916 లో బ్లాక్ టామ్ పేలుడు.

మొదటి ప్రపంచ యుద్ధంలో మధ్యప్రాచ్య యుద్ధరంగంలో బ్రిటిషు భారత సైన్యాన్ని నాశనం చేసే ప్రయత్నాలు కూడా కుట్రలో భాగమే.

ప్రచ్ఛన్న భారతీయ విప్లవకారులు

[మార్చు]
రాష్ బిహారీ బోస్, ఢిల్లీ -లాహోర్ కుట్రకు ఆ తరువాత, ఫిబ్రవరి కుట్రకూ ప్రధాన నాయకుడు

1905 లో వివాదాస్పదమైన బెంగాల్ విభజన విస్తృతమైన రాజకీయ ప్రభావాన్ని చూపింది. భారతదేశంలోను, విదేశాలలోనూ తీవ్రమైన జాతీయవాద అభిప్రాయానికి ప్రేరణగా నిలిచిన ఈ అంశం, భారతీయ విప్లవకారులకు కేంద్రబిందువు లాంటి సమస్యగా మారింది. జుగంతర్, అనుశీలన్ సమితి వంటి విప్లవ సంస్థలు 20 వ శతాబ్దంలో ఉద్భవించాయి. 1907 లో బెంగాల్ లెఫ్టినెంట్-గవర్నర్ సర్ ఆండ్రూ ఫ్రేజర్‌ని చంపడానికి చేసిన ప్రయత్నంతో సహా, అధికారులు, ప్రముఖ ప్రజాప్రతినిధులు, భారతీయ విప్లవద్రోహుల హత్యలు, హత్యాయత్నాల వంటి ముఖ్యమైన సంఘటనలు జరిగాయి. జుగంతర్ సభ్యుడు రాష్ బిహారీ బోస్ నేతృత్వంలో 1912 ఢిల్లీ-లాహోర్ కుట్రలో అప్పటి భారత వైస్రాయ్ చార్లెస్ హార్డింగ్‌ని హత్య చేయడానికి ప్రయత్నించినప్పుడు విషయాలు తారస్థాయికి చేరాయి. ఈ సంఘటన తర్వాత, బెంగాలీ, పంజాబీల విప్లవకారులను నాశనం చేయడానికి బ్రిటిషు భారతీయ పోలీసులు కేంద్రీకృత ప్రయత్నాలు చేశారు. దీంతో కొంతకాలం పాటు ఉద్యమం తీవ్ర ఒత్తిడికి గురైనప్పటికీ, రాష్ బిహారీ మాత్రం దాదాపు మూడు సంవత్సరాల పాటు పట్టుబడకుండా తప్పించుకున్నాడు. 1914 లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యే సమయానికి, పంజాబ్, బెంగాల్‌లలో విప్లవోద్యమం పుంజుకుంది. బెంగాల్‌లో ఉద్యమానికి ఫ్రెంచ్ స్థావరమైన చందర్‌నాగూర్ సురక్షితమైన స్థానంగా ఉండేది. రాష్ట్ర పరిపాలనను స్థంభింపజేయడం మినహా ఏమైనా చెయ్యగలిగేంతటి బలం ఉద్యమానికి ఉండేది.

భారతదేశంలో సాయుధ విప్లవం కోసం జరిగిన తొలి కుట్ర గురించిన ప్రస్తావన నిక్సన్ యొక్క రివల్యూషనరీ ఆర్గనైజేషన్ నివేదికలో కనిపిస్తుంది, 1912 లో కలకత్తా పర్యటనలో ఉన్న జర్మనీ యువరాజును జతిన్ ముఖర్జీ (బాఘా జతిన్), నరేన్ భట్టాచార్య లు కలిసినట్లు ఈ నివేదికలో రాసారు. ఆయుధాలు, మందుగుండు సామగ్రిని అందిస్తాం అనే భరోసాను వాళ్ళు యువరాజు నుండి పొందారు. [21] అదే సమయంలో, బలమైన పాన్-ఇస్లామిక్ ఉద్యమం ప్రధానంగా భారతదేశంలోని ఉత్తర, వాయువ్య ప్రాంతాలలో అభివృద్ధి చెందడం మొదలైంది. 1914 లో యుద్ధం ప్రారంభంలో, ఈ ఉద్యమ సభ్యులు కుట్రలో ముఖ్యమైన భాగంగా ఏర్పడ్డారు.

బెంగాల్ విభజన సమయంలో, శ్యామ్‌జీ కృష్ణ వర్మ లండన్‌లో ఇండియా హౌస్‌ను స్థాపించాడు. మేడమ్ భికాజీ కామా, లాలా లజపతిరాయ్, ఎస్ఆర్ రాణా, దాదాభాయ్ నౌరోజీ వంటి ప్రముఖ ప్రవాస భారతీయుల నుండి విస్తృత మద్దతును పొందాడు. భారతీయ విద్యార్థుల నివాసంగా కనబడే ఈ సంస్థ వాస్తవానికి జాతీయవాద అభిప్రాయాన్ని, స్వాతంత్ర్య సాధన కృషినీ ప్రోత్సహించడానికి ప్రయత్నించింది. ఇండియా హౌస్ ML ధింగ్రా, VD సావర్కర్, VN ఛటర్జీ, MPT ఆచార్య, లాలా హర్ దయాళ్ వంటి యువ తీవ్రవాద కార్యకర్తలను ఆకర్షించింది. [22][23][24] ఇది భారతదేశంలో విప్లవోద్యమంతో సంబంధాలను పెంపొందించుకుని, దానికి ఆయుధాలు, నిధులు అందజేసి ప్రచారం కల్పించింది. హౌస్ ప్రచురించిన ఇండియన్ సోషియాలజిస్ట్, తదితర సాహిత్యాలను భారతదేశంలో అధికారులు నిషేధించారు. VD సావర్కర్ నాయకత్వంలో హౌస్, మేధో రాజకీయ క్రియాశీలతకు కేంద్రంగా అభివృద్ధి చెందింది. బ్రిటన్‌లో భారతీయ విద్యార్థులలో రాడికల్ విప్లవకారులకు సమావేశ స్థలంగా రూపొందింది. వాలెంటైన్ చిరోల్ దీన్ని "భారతదేశం బయట ఉన్న అత్యంత ప్రమాదకరమైన సంస్థ" గా వర్ణించాడు. 1909 లో లండన్‌లో ML ధింగ్రా, భారత స్టేట్ సెక్రెటరీకి రాజకీయ సహాయకుడైన సర్ డబ్ల్యూహెచ్ కర్జన్ వైల్లీని కాల్చి చంపాడు. ఆ హత్య తరువాత, మెట్రోపాలిటన్ పోలీసు, హోం ఆఫీస్ లు ఇండియా హౌస్‌ను అణచివేశాయి. దాని నాయకత్వం ఐరోపాకు, అమెరికాకూ పారిపోయింది. ఛటర్జీ వంటి కొందరు జర్మనీ వెళ్లారు; హర్ దయాళ్, అనేకమంది ఇతరులూ పారిస్ వెళ్లారు. [25]

అమెరికా, జపాన్‌లో స్థాపించబడిన సంస్థలు లండన్ ఇండియా హౌస్‌ ను అనుకరించాయి. కృష్ణ వర్మ టర్కిష్, ఈజిప్టు జాతీయవాదులతోను, అమెరికాలో క్లాన్ నా గేల్‌తోనూ సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకున్నాడు. కృష్ణవర్మ 1906 లో న్యూయార్కులో ఇండియన్ హోమ్రూల్ సొసైటీ ఏర్పాటు చెయ్యడాన్ని ఆదర్శంగా తీసుకునిమహమ్మద్ బర్కతుల్లా, ఎస్ఎల్ జోషీ, జార్జ్ ఫ్రీమాన్ లు ఉమ్మడిగా ప్రయత్నాలు చేసి పాన్ ఆర్యన్ అసోసియేషన్ను స్థాపించారు. గతంలో లండన్‌లో ఉన్న సమయంలో బర్కతుల్లా కృష్ణవర్మతో సన్నిహితంగా మెలిగాడు. తదుపరి అతను జపానులో ప్రవాసంలో ఉండగా అక్కడి భారత రాజకీయ కార్యకలాపాలకు కేంద్రబిందువుగా నిలిచాడు. [26] కృష్ణ వర్మకు పరిచయస్తుడు, స్వామి వివేకానంద ఆరాధకుడూ అయిన మైరాన్ ఫెల్ప్ 1908 జనవరిలో న్యూయార్క్ లోని మాన్హాటన్ లో "ఇండియా హౌస్"ను స్థాపించాడు. [27] భారతీయ విద్యార్థుల సంఖ్య పెరిగే క్రమంలో, లండన్ లోని ఇండియా హౌస్ మాజీ సభ్యులు అట్లాంటిక్ అంతటా జాతీయవాద కృషిని విస్తరింపజేయడంలో విజయం సాధించారు. ఇండియన్ సోషియాలజిస్ట్ లో ప్రచురించిన కథనాలను గేలిక్ అమెరికన్ పత్రికలో పునర్ముద్రించారు. లిబరల్ పత్రికా చట్టాలు ఇండియన్ సోషియాలజిస్ట్‌ను స్వేచ్ఛగా పంచుకునేందుకు అనుమతించాయి. దాని మద్దతుదారులు అటువంటి జాతీయవాద సాహిత్యాన్ని, కరపత్రాలనూ ప్రపంచవ్యాప్తంగా ఉచితంగా రవాణా చేసే వీలుండేది. [28] న్యూయార్కు భారతీయ ఉద్యమానికి ఒక ముఖ్యమైన కేంద్రంగా మారింది. భారతీయ సామాజిక శాస్త్రవేత్త, తారకనాథ్ దాస్ ప్రచురించిన ఫ్రీ హిందూస్తాన్ 1908 లో వాంకోవర్, సీటెల్ ల నుండి న్యూయార్క్‌కు మారింది. జార్జ్ ఫ్రీమాన్ సహాయంతో దాస్, గేలిక్ అమెరికన్‌తో సహకారాన్ని స్థాపించాడు. 1910 లో బ్రిటిషు వారు తెచ్చిన దౌత్యపరమైన ఒత్తిడి కారణంగా అమెరికా ప్రభుత్వం దాన్ని నిషేధించింది. ఐరిష్ విప్లవకారులకు, భారతీయ విప్లవకారులకూ మధ్య ఏర్పడ్డ ఈ సహకారం భారతదేశంలోకి ఆయుధాలను స్మగ్లింగ్ చేసే ప్రయత్నాలకు దారితీసింది. అయితే ఈ ప్రయత్నాలు విఫలమయ్యాయి. 1908 లో ఎస్‌ఎస్ మోరైటిస్ అనే ఓడ న్యూయార్క్ నుండి ఆయుధాలతో వెళ్తూండగా పర్షియన్ గల్ఫ్ వెళ్ళేదారిలో ఉన్న స్మిర్నాలో దాన్ని పట్టుకున్నారు. అది తొలి సంఘటన. ఆ తరువాత ఐరిష్ కమ్యూనిటీ వారు జర్మను, భారత, ఐరిష్ కుట్రదారులకు విలువైన నిఘా సమాచారం, లాజిస్టిక్స్, కమ్యూనికేషన్, మీడియా మద్దతు, చట్టపరమైన మద్దతునూ అందించింది. ఈ అనుసంధానంలో పాలుపంచుకున్నవారు, తరువాత కుట్రలో పాలుపంచుకున్న వారిలో ప్రధానంగా ఐరిష్ రిపబ్లికన్లు, ఐరిష్-అమెరికన్ జాతీయవాదులూ అయిన జాన్ డెవోయ్, జోసెఫ్ మెక్‌గారిటీ, రోజర్ కేస్‌మెంట్, శామోన్ డి వాలెరా, ఫాదర్ పీటర్ యార్కే, లారీ డి లేసీ ఉన్నారు. [29] యుద్ధానికి ముందే ఏర్పడిన ఈ పరిచయాలను ఐరోపాలో యుద్ధం ప్రారంభమైన తరువాత జర్మనీ విదేశాంగ కార్యాలయం సమర్థవంతంగా వినియోగించుకునే ఏర్పాటు చేసింది. [30]

గదర్ పార్టీ

[మార్చు]
దస్త్రం:Early Punjabi Immigrants to America.gif
అమెరికాలో వలస వచ్చిన పంజాబీ కుటుంబం. c 1900 లు

20 వ శతాబ్దంలో, ఉత్తర అమెరికాలోని పసిఫిక్ తీరానికి పెద్ద ఎత్తున భారతీయులు ముఖ్యంగా ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటున్న పంజాబ్ నుండి వలస వచ్చారు. కెనడియన్ ప్రభుత్వం కెనడాలోకి దక్షిణ ఆసియన్ల ప్రవేశాన్ని పరిమితం చేయడం, ఇప్పటికే దేశంలో ఉన్నవారి రాజకీయ హక్కులను పరిమితం చేయడం లక్ష్యంగా చట్టాలు చేసి ఈ వలస ప్రవాహాన్ని ఎదుర్కొంది. పంజాబీ కమ్యూనిటీ ఇంతవరకు బ్రిటిషు సామ్రాజ్యానికి, కామన్వెల్తూఖు ఒక ముఖ్యమైన విధేయ శక్తిగా ఉంది. బ్రిటిషు, వలస ప్రభుత్వాలు బ్రిటిషు, తెల్ల వలసదారులకు అందించిన స్వాగతమే తమకూ ఇస్తుందని, వారికిచ్చిన హక్కులనే తమకూ ఇస్తుందనీ సంఘం ఆశించింది. నిరోధ చట్టాల కారణంగా ఈ సమాజంలో అసంతృప్తి, నిరసనలు, వలస వ్యతిరేక భావాలూ పెరిగాయి. క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూ, సంఘం రాజకీయ బృందాలుగా ఏర్పడటం ప్రారంభించింది. చాలా మంది పంజాబీలు కూడా అమెరికాకు వెళ్లారు. వారూ ఇలాంటి రాజకీయ సామాజిక సమస్యలనే ఎదుర్కొన్నారు. ఇంతలో, 1910 నాటికి ఉత్తర అమెరికా తూర్పు తీరంలో ఇండియా హౌస్, భారతీయ విద్యార్థుల జాతీయవాద కార్యకలాపాలు క్షీణించడం మొదలైంది. దాంతో ఈ కార్యకలాపాలు క్రమంగా పశ్చిమాన శాన్ ఫ్రాన్సిస్కోకు మారాయి. ఈ సమయంలోనే యూరప్ నుండి హర్ దయాళ్ రావడంతో న్యూయార్క్ లోని మేధావి ఆందోళనకారులకు, పశ్చిమ తీరంలో ఉన్న పంజాబీ వలసదారులకూ మధ్య అంతరాన్ని తగ్గించి, గదర్ ఉద్యమానికి పునాదులు వేసింది.

జాతీయవాద, సామ్యవాద సాహిత్య తొలి సంకలనం గదర్ దీ గంజ్. 1913లో దీన్ని భారతదేశంలో నిషేధించారు.

గదర్ పార్టీ, 1913లో 'పసిఫిక్ కోస్ట్ హిందుస్థాన్ అసోసియేషన్' అనే పేరుతో అమెరికాలో హర్ దయాళ్ నాయకత్వంలో సోహన్ సింగ్ భక్నా అధ్యక్షుడిగా ఏర్పడింది. భారతీయ వలసదారులు ముఖ్యంగా పంజాబు నుండి వచ్చినవారు ఇందులో సభ్యులు. దయాల్, తారక్ నాథ్ దాస్, కర్తార్ సింగ్ సరభా, VG పింగ్లేతో సహా బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందినవరు కూడా అనేక మంది ఉన్నారు. త్వరలోనే అమెరికా, కెనడా, ఆసియాలోని భారతీయ ప్రవాసుల మద్దతు పార్టీకి లభించింది. లాస్ ఏంజిల్స్, ఆక్స్‌ఫర్డ్, వియన్నా, వాషింగ్టన్, DC, షాంఘైల్లో గదర్ సమావేశాలు జరిగాయి.

సాయుధ విప్లవంతో భారతదేశంలో బ్రిటిషు వలస రాజ్యాన్ని పడగొట్టడమే గదర్ అంతిమ లక్ష్యం. అధినివేశ ప్రతిపత్తి కోసం కాంగ్రెస్ నేతృత్వంలో జరుగుతున్న ప్రధాన స్రవంతి ఉద్యమం మరీ మృదువైనదని గదర్ భావించింది. తిరుగుబాటుకు భారత సైనికులను పురికొల్పడం గదర్ వ్యూహం. అందుకు గాను, 1913 నవంబరులో శాన్ ఫ్రాన్సిస్కోలో యుగంతర్ ఆశ్రమ ముద్రణాలయాన్ని గదర్ స్థాపించింది. హిందూస్థాన్ గదర్ వార్తాపత్రికను, ఇతర జాతీయవాద సాహిత్యాన్నీ ఇక్కడ ముద్రించేవారు.

1913 చివరి నాటికి పార్టీ, రాష్ బిహారీ బోస్‌తో సహా భారతదేశంలోని ప్రముఖ విప్లవకారులతో సంబంధాలను ఏర్పరచుకుంది. హిందూస్థాన్ గదర్ పత్రిక భారతీయ ఎడిషను భారతదేశంలో బ్రిటిషు ప్రయోజనాలకు వ్యతిరేకంగా అరాచకవాదాన్ని విప్లవాత్మక ఉగ్రవాదాన్నీ సమర్థించింది. పంజాబ్‌లో రాజకీయ అసంతృప్తి, హింస పెరిగింది. కాలిఫోర్నియా నుండి బొంబాయికి చేరిన గదర్ ప్రచురణలను రాజద్రోహంగా బ్రిటిషు ప్రభుత్వం పరిగణించి, నిషేధించింది. ఈ సంఘటనలతో పాటు, 1912 నాటి ఢిల్లీ కుట్రకేసుకు పురికొల్పారన్న రుజువుల కారణంగా, శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా జరుగుతున్న భారతీయ విప్లవ కార్యకలాపాలను, గదర్ సాహిత్యాన్నీ అణిచివేసేందుకు అమెరికా విదేశాంగ శాఖపై బ్రిటిషు ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది.

జర్మనీ, బెర్లిన్ కమిటీ

[మార్చు]

మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభంతో, జర్మనీలో బెర్లిన్ కమిటీ (తరువాతి కాలంలో దీన్ని భారతీయ స్వాతంత్ర్య మండలి (ఇండియన్ ఇండిపెండెన్స్ కమిటీ) అని అన్నారు) అనే భారతీయ విప్లవ సమూహం ఏర్పడింది. దీని ప్రధాన రూపకర్తలు CR పిళ్లై, VN ఛటర్జీ. [31][32] ఈ కమిటీ భారతీయ విద్యార్థులతోపాటు, అభినాష్ భట్టాచార్య, డాక్టర్. అబ్దుల్ హఫీజ్, పద్మనాభన్ పిళ్లై, AR పిళ్లై, MPT ఆచార్య, గోపాల్ పరాంజపే మొదలైన ఇండియా హౌస్ పూర్వ సభ్యులు కూడా ఇందులో సభ్యులుగా ఉన్నారు. జర్మనీ పురావస్తు శాస్త్రవేత్త, చరిత్రకారుడూ ఐన మాక్స్ వాన్ ఒపెన్‌హీమ్ నేతృత్వంలో తూర్పు కోసం నిఘా సంస్థను ప్రారంభించింది. ఒపెన్‌హీమ్, జర్మన్ సామ్రాజ్యం యొక్క విదేశాంగ వ్యవహారాల రాష్ట్ర కార్యదర్శి ఆర్థర్ జిమ్మెర్‌మాన్‌లు, బెర్లిన్ కమిటీకి మద్దతు ఇచ్చారు. దీనికి జుగంతర్ పార్టీ సభ్యుడూ, ఆ సమయంలో బెంగాల్‌లోని ప్రముఖ విప్లవకారులలో ఒకరూ ఐన జతిన్ ముఖర్జీతో సంబంధాలు ఉండేవి. [33][34][35][36] No.38 వైలాండ్‌స్ట్రాసే వద్ద ఉన్న 25 మంది సభ్యుల కమిటీ కార్యాలయానికి పూర్తి స్థాయి రాయబార హోదాను ఇచ్చారు. [37]

1914 సెప్టెంబరులో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమవడంతో జర్మనీ ఛాన్సలర్ థియోబాల్డ్ వాన్ బెత్‌మన్-హోల్‌వెగ్ బ్రిటిషు ఇండియాకు వ్యతిరేకంగా జర్మన్ కార్యకలాపాలకు అధికారం ఇచ్చారు. గదర్ ప్రణాళికలకు చురుకుగా మద్దతు ఇవ్వాలని జర్మనీ నిర్ణయించుకుంది. [38] జర్మనీలోని భారతీయ, ఐరిష్ ప్రవాసుల మధ్య (ఐరిష్ జాతీయవాది, కవి రోజర్ కేస్‌మెంట్‌తో సహా), భారతీయులకు జర్మన్ విదేశాంగ కార్యాలయానికీ మధ్యనా ఏర్పడిన సంబంధాలను ఉపయోగించి, ఓపెన్‌హీమ్ అమెరికా‌లోని ఇండో-ఐరిష్ నెట్‌వర్క్‌లోకి ప్రవేశించాడు. హర్ దయాళ్ 1914లో అమెరికా‌లో అరెస్టవడానికి ముందు గదర్ పార్టీని నడిపించడంలో తోడ్పడ్డాడు. 1914లో గదర్ ప్రెసిడెంట్ అయిన రామ్ చంద్ర భరద్వాజ్‌కి పార్టీ బాధ్యతను, దాని ప్రచురణల బాధ్యతనూ వదిలిపెట్టి, అతను, బెయిలులో ఉండగా తప్పించుకుని స్విట్జర్లాండ్‌కు వెళ్లాడు. కాలిఫోర్నియాలోని గదర్ నాయకులను సంప్రదించే బాధ్యతను జర్మను ప్రభుత్వం శాన్ ఫ్రాన్సిస్కోలోని జర్మన్ కాన్సులేటుకు అప్పగించింది. భారత జాతీయవాద పాత్రికేయుడు తారక్ నాథ్ దాస్ సహాయంతో విల్హెల్మ్ వాన్ బ్రింకెన్ అనే నావికాదళ లెఫ్టినెంట్, చార్లెస్ లాటెండోర్ఫ్ అనే మధ్యవర్తి భరద్వాజ్‌తో సంబంధాలను ఏర్పరచుకున్నారు. ఇదిలా ఉండగా, స్విట్జర్లాండ్‌లో బెర్లిన్ కమిటీ భారతదేశంలో విప్లవాన్ని నిర్వహించడం సాధ్యమేనని హర్ దయాళ్‌ను ఒప్పించగలిగింది. [39]

కుట్ర

[మార్చు]
1914 మే 23 న వాంకోవర్ ఇంగ్లీష్ బేలో కొమగటా మారులో ఉన్న పంజాబీ సిక్కులు. కెనడా ప్రభుత్వం ఈ ప్రయాణీకులను కెనడాలో దిగకుండా నిరోధించి, ఓడను భారతదేశానికి తిరిగి పంపించేసింది. కొమగాట మారు సంఘటన చుట్టూ జరిగిన సంఘటనలు గదర్ పార్టీ వాదానికి ఉత్ప్రేరకంగా పనిచేశాయి.

1914 మేలో, కెనడా ప్రభుత్వం 400 మంది భారతీయ ప్రయాణీకులతో ఉన్న కొమగటా మారు నౌకను వాంకోవర్‌ రేవులో ఆగేందుకు అనుమతించలేదు. భారతీయ వలసలను అడ్డుకుంతున్న కెనడా చట్టాలను తప్పించుకునే ప్రయత్నంగా గుర్దిత్ సింగ్ సంధు ఈ యాత్రను ప్లాన్ చేశాడు. ఓడ వాంకోవర్ చేరుకోవడానికి ముందు, జర్మన్ రేడియో అది వస్తున్నట్లు ప్రకటించింది, బ్రిటిషు కొలంబియన్ అధికారులు ప్రయాణికులను కెనడాలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి సిద్ధమయ్యారు. HMCS రెయిన్‌బో కూయిజరును రక్షణగా ఉంచి నౌకను వాంకోవర్ నుండి బయటకు పంపించారు. చివరికది భారతదేశానికి తిరిగి వచ్చింది.

ఈ సంఘటన కెనడాలోని భారతీయ సమాజం ఏకీకృతం కావడానికి కేంద్ర బిందువుగా మారింది. ప్రయాణికులకు మద్దతుగా, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వాళ్ళు గొంతు కలిపారు. రెండు నెలల న్యాయ పోరాటం తర్వాత 24 మంది ప్రయాణికులను మాత్రం కెనడా లోకి అనుమతించారు. కలకత్తా చేరుకున్నప్పుడు, మిగతా ప్రయాణీకులను బ్రిటిషు భారత ప్రభుత్వం బడ్జ్ బడ్జ్ వద్ద భారత రక్షణ చట్టం 1915 కింద నిర్బంధించింది. వారిని బలవంతంగా పంజాబ్‌ పంపించేందుకు ప్రయత్నించింది. దీంతో బడ్జ్ బడ్జ్ వద్ద అల్లర్లు రేగాయి. ఫలితంగా రెండు వైపులా మరణాలు సంభవించాయి. [40] బర్కతుల్లా, తారక్ నాథ్ దాస్ వంటి గదర్ నాయకులు ఈ కొమగాట మారు ఘటన చుట్టూ పెనవేసుకుని ఉన్న ఉద్వేగాన్ని ప్రజలను సమీకరించేందుకు ఉపయోగించుకున్నారు. ఉత్తర అమెరికాలో అసంతుష్టులై ఉన్న భారతీయులు అనేక మందిని విజయవంతంగా పార్టీలోకి తీసుకువచ్చారు. [41]

ఇదిలా ఉండగా బ్రిటిషు భారతీయ సైన్యం, మొదటి ప్రపంచ యుద్ధంలో మిత్రరాజ్యాల యుద్ధ ప్రయత్నాలకు గణనీయంగా సహకరించింది. తత్ఫలితంగా, 1914 చివరలో 15,000 మంది సైనికులు మాత్రమే భారతదేశంలో ఉన్నట్లు అంచనా వేసారు. [42] ఈ నేపథ్యం లోనే భారతదేశంలో తిరుగుబాట్లు లేపేందుకు ఖచ్చితమైన ప్రణాళికలు రూపొందించారు.

1913 సెప్టెంబరులో మాత్రా సింగ్ అనే గదరీయుడు షాంఘై లోని భారతీయులలో జాతీయ వాదాన్ని ప్రోత్సహించడానికి అక్కడ పర్యటించాడు. 1914 జనవరిలో భారతదేశాన్ని కూడా సందర్శించాడు. అక్కడి నుండి హాంకాంగ్‌కు వెళ్లే ముందు సింగ్, రహస్య కార్యకర్తల ద్వారా భారతీయ సైనికులకు గదర్ సాహిత్యాన్ని పంపిణీ చేశాడు. భారత్‌లో పరిస్థితి, విప్లవానికి అనుకూలంగా ఉందని సింగ్ నివేదించాడు. [41][43]

1914 అక్టోబరు నాటికి, చాలా మంది గదరీయులు భారతదేశానికి తిరిగి వచ్చారు. భారతీయ విప్లవకారులను, సంస్థలనూ సంప్రదించడం, ప్రచారం చెయ్యడం, సాహిత్యాన్ని వ్యాప్తి చేయడం, దేశంలోకి ఆయుధాలు సర్ఫరా చేసే ఏర్పాట్లు చేయడం వంటి పనులు వారికి అప్పగించబడ్డాయి. [44] జవాలా సింగ్ నేతృత్వంలోని 60 మంది గదరీయుల మొదటి బృందం ఆగస్టు 29న కొరియా నౌకలో శాన్‌ఫ్రాన్సిస్కో నుండి కాంటన్‌కు బయలుదేరింది. వారు భారతదేశానికి ప్రయాణించవలసి ఉంది. అక్కడ తిరుగుబాటును లేపేందుకు వారికి అక్కడ ఆయుధాలు అందుతాయి. కాంటన్ వద్ద మరింత మంది భారతీయులు ఎక్కారు. ఇప్పుడు దాదాపు 150 మంది ఉన్న ఈ బృందం జపాన్ నౌకలో కలకత్తాకు బయలుదేరింది. చిన్న చిన్న సమూహాలలో వచ్చే మరింత మంది గదరీయులు వారితో కలవాల్సి ఉంది. సెప్టెంబరు, అక్టోబర్లలో, SS సైబీరియా, చిన్యో మారు, చైనా, మంచూరియా, SS టెన్యో మారు, SS మంగోలియా, SS షిన్యో మారు వంటి వివిధ నౌకలలో సుమారు 300 మంది భారతీయులు భారతదేశానికి బయలుదేరారు. కొరియా నౌక లోని వారి గురించి బ్రిటిషు ప్రభుత్వానికి తెలిసిపోయింది. కలకత్తాకు రాగానే వారిని అరెస్టు చేసారు. అయినప్పటికీ, షాంఘై, స్వాతో, సియామ్ ద్వారా అమెరికా, భారతదేశాల మధ్య విజయవంతమైన ప్రచ్ఛన్న నెట్‌వర్కును స్థాపించారు. షాంఘైలో గదర్ కార్యకర్త అయిన తెహల్ సింగ్, విప్లవకారులను భారతదేశంలోకి చేర్చేందుకు $30,000 ఖర్చు చేసినట్లు భావిస్తున్నారు. [45] భారతదేశంలోని గదరీయులు బ్రిటిషు భారత సైన్యం లోని సానుభూతిపరులతో సంబంధాన్ని ఏర్పరచుకోగలిగారు. ప్రచ్ఛన్న విప్లవ సమూహాలతో నెట్‌వర్కులను నిర్మించుకోగలిగారు.

తూర్పు ఆసియా

[మార్చు]

1911 లోనే ఆయుధాలను సేకరించి వాటిని అక్రమంగా భారత్‌లోకి తరలించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. [46] కుట్ర గురించిన ఆలోచనలో స్పష్టత వచ్చేటప్పటికి, ఆయుధాలను సంపాదించేందుకు, అంతర్జాతీయ మద్దతును పొందేందుకూ మరింత తీవ్రమైన, విస్తృతమైన ప్రణాళికలను రూపొందించారు. 1914లో బెర్లిన్ కమిటీ ఆదేశానుసారం అమెరికా చేరుకున్న హేరంబాలాల్ గుప్తా, SS కొరియా మిషన్ వైఫల్యం తర్వాత, కుట్రకు సంబంధించిన అమెరికన్ విభాగానికి నాయకత్వం తీసుకున్నాడు. గుప్తా వెంటనే మనుషులను ఆయుధాలను సేకరించే ప్రయత్నాలను ప్రారంభించాడు. గదర్ ఉద్యమంలో చేరడానికి ఎక్కువ మంది భారతీయులు ముందుకు రావడంతో కార్యకర్తలు సమృద్ధిగానే సరఫరా అవుతున్నప్పటికీ, తిరుగుబాటు కోసం ఆయుధాలను సేకరించడం మరింత కష్టతరంగా మారింది.[47]

విప్లవకారులు, సన్ యట్-సేన్ పవర్ ఆఫ్ అటార్నీని కలిగి ఉన్న జేమ్స్ డైట్రిచ్ ద్వారా చైనా ప్రభుత్వంతో పది లక్షల రైఫిళ్ళను కొనుగోలు చేయడానికి చర్చలు ప్రారంభించారు. అయితే, వాళ్ళు అమ్మజూపిన ఆయుధాలు పనికిరాని ఫ్లింట్‌లాక్‌లు, మజిల్ లోడర్‌లు అని వారు గుర్తించడంతో ఒప్పందం కుదరలేదు. ఆయుధాలు సంపాదించే ప్రయత్నంలో గుప్తా జపాన్ వెళ్ళాడు. భారత స్వాతంత్ర్య ఉద్యమానికి జపాన్ మద్దతును పొందడం కూడా అతడి లక్ష్యంగా ఉంది. అయితే, జపాన్ అధికారులు తనను బ్రిటిషు వారికి అప్పగించాలని యోచిస్తున్నారని తెలుసుకున్న గుప్తా, 48 గంటల్లోనే అజ్ఞాతంలోకి వెళ్ళాడు. [48] మితవాద రాజకీయ నాయకుడు, జెనియోషా జాతీయవాద రహస్య సమాజం స్థాపకుడూ అయిన టొయామా మిత్సురు అతన్ని రక్షించాడని తరువాతి నివేదికల్లో తెలిసింది.

భారత నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ గదర్ ఉద్యమానికి మద్దతు పొందే ప్రయత్నంలో జపాన్ ప్రధాని కౌంట్ తెరౌచిని, మాజీ ప్రధాన మంత్రి కౌంట్ ఒకుమానీ కలిశాడు. [49] అమెరికా యుద్ధ సన్నద్ధతను జపాన్‌ లక్ష్యంగా సాగుతుందనే కారణంతో, తారక్ నాథ్ దాస్ జపాన్ జర్మనీతో జతకట్టాలని కోరాడు. [50] తర్వాత 1915 లో, జూగాంతర్ కార్యకర్త, రాష్ బిహారీ బోస్ సహచరుడూ అయిన అబనీ ముఖర్జీ జపాన్ నుండి ఆయుధాలను సమకూర్చుకోవడానికి విఫలయత్నం చేసాడు. 1916లో లీ యువాన్‌హాంగ్ చైనా అధ్యక్షుడిగా గద్దె నెక్కడంతో ఆ సమయంలో అమెరికా‌లో నివసిస్తున్న అతని మాజీ ప్రైవేట్ సెక్రటరీ ద్వారా చర్చలు తిరిగి మొదలయ్యాయి. చైనా ద్వారా భారతదేశానికి ఆయుధాల రవాణాను అనుమతినిస్తే దానికి బదులుగా, చైనాకు జర్మన్ సైనిక సహాయమూ, చైనా ద్వారా భారతదేశానికి రవాణా చేసే ఆయుధాల్లో 10% పైన హక్కూ ఇవ్వజూపారు. జర్మనీతో పొత్తుకు సన్ యాట్-సేన్ వ్యతిరేకత చూపడంతో చర్చలు చివరికి విఫలమయ్యాయి. [51]

ఐరోపా, అమెరికా

[మార్చు]
ఫ్రాంజ్ వాన్ పాపెన్, హిట్లర్ అధికారంలోకి రావడానికి కొంతకాలం ముందు జర్మనీ ఛాన్సలర్. ఆయుధాల రవాణాను నిర్వహించడంలో పాపన్ కీలక పాత్ర పోషించాడు.

అప్పుడు పారిస్‌లో ఉన్న భారతీయ జాతీయవాదులు, ఈజిప్టు విప్లవకారులతో కలిసి 1911లోనే లార్డ్ కిచెనర్‌ను హత్య చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు, కానీ వాటిని అమలు చేయలేదు. యుద్ధం ప్రారంభమైన తర్వాత, ఈ ప్రణాళికను తిరిగి తెరపైకి తెచ్చారు. హర్ దయాళ్‌కు సన్నిహిత సహచరుడైన గోవింద్ బిహారీ లాల్ ఈ ప్రణాళికను అమలు చేయడానికి న్యూయార్క్ నుండి 1915 మార్చిలో లివర్‌పూల్‌ను సందర్శించాడు. అతను ఈ సమయంలో లివర్‌పూల్‌లోని డాక్స్‌పై బాంబు దాడి చేయాలని కూడా ఉద్దేశించి ఉండవచ్చు. అయితే, ఈ ప్రణాళికలు చివరికి విఫలమయ్యాయి. [52] చటోపాధ్యాయ ఈ సమయంలో లండన్‌లో మిగిలి ఉన్న ఇండియా హౌస్ సభ్యులతో అప్పట్లో బ్రిటన్లో నివసిస్తున్న స్విస్, జర్మన్, ఆంగ్ల సానుభూతిపరుల ద్వారా సంబంధాలను పునరుద్ధరించడానికి కూడా ప్రయత్నించాడు. వారిలో మెటా బ్రన్నర్ (ఒక స్విస్ మహిళ), విష్ణ దూబే (ఒక భారతీయ వ్యక్తి), అతని జర్మన్ భార్య అన్నా బ్రాండ్ట్, హిల్డా హౌసిన్ (యార్క్‌షైర్‌లోని ఒక ఆంగ్ల మహిళ) ఉన్నారు. చటోపాధ్యాయ లేఖలను సెన్సార్ అధికారులు గుర్తించి, సెల్ సభ్యులను అరెస్టు చేశారు. ఈ సమయంలో విప్లవకారులు పరిగణించిన ఇతర ప్రణాళికలలో 1915 జూన్‌లో విదేశాంగ కార్యదర్శి సర్ ఎడ్వర్డ్ గ్రే, యుద్ధ మంత్రి లార్డ్ కిచెనర్‌లను హత్య చేయడానికి కుట్రలు చేపట్టడం. అదనంగా, వారు ఫ్రెంచ్ ప్రెసిడెంట్ రేమండ్ పాయింకేర్, ప్రధాన మంత్రి రెనే వివియాని, ఇటలీ రాజు విక్టర్ ఇమ్మాన్యుయేల్ III, అతని ప్రధాన మంత్రి ఆంటోనియో సలాంద్రాలను కూడా లక్ష్యంగా చేసుకున్నారు. ఇటాలియన్ అరాచకవాదులతో సమన్వయం చేస్తూ, ఇటలీలో తయారు చేయబడిన పేలుడు పదార్థాలను వాడుతూ ఈ హత్యలు చెయ్యాలని ఈ ప్రణాళికలను రూపొందించారు. బర్కతుల్లా, ఇప్పుడు ఐరోపాలో బెర్లిన్ కమిటీతో కలిసి పని చేస్తూ, ఈ పేలుడు పదార్థాలను జ్యూరిచ్‌లోని జర్మన్ కాన్సులేట్‌కు పంపడానికి ఏర్పాటు చేసాడు. అక్కడ నుండి వాటిని బెర్టోని అనే ఇటాలియన్ అరాచకవాది బాధ్యతలు స్వీకరించాలని భావించారు. అయితే, బ్రిటిషు నిఘా వర్గాలకు ఈ ప్రణాళిక గురించి తెలిసిపోయింది. అబ్దుల్ హఫీజ్‌ను బహిష్కరించేలా స్విస్ పోలీసులను ఒత్తిడి చేసింది. [53]

అమెరికా నుండి, దూర ప్రచ్యం నుండీ షాంఘై, బటావియా, బ్యాంకాక్, బర్మాల మీదుగా ఆయుధాలను రవాణా చేయడానికి అమెరికాలో విస్తృతమైన ప్రణాళిక చేసారు. హేరంబాలాల్ గుప్తా చైనా, జపాన్‌లలో యాత్రలో ఉండగానే, అమెరికా, తూర్పు ఆసియాల నుండి ఆయుధాలను రవాణా చేయడానికి ఆలోచనలు జరిగాయి. భారతీయ సమూహాలకు పెద్దయెత్తున సహాయం చేస్తే తప్ప కొద్దిపాటి సాయాలు నిరర్థకమైతాయని జర్మన్ హైకమాండ్ ముందుగానే నిర్ణయించింది. [54] 1914 అక్టోబరులో, శాన్ ఫ్రాన్సిస్కోలోని జర్మన్ వైస్ కాన్సుల్ EH వాన్ షాక్ నిధులు, ఆయుధాల ఏర్పాట్లను ఆమోదించాడు. జర్మన్ మిలిటరీ అటాచ్ కెప్టెన్ ఫ్రాంజ్ వాన్ పాపెన్ క్రుప్ ఏజెంట్ల ద్వారా $2,00,000 విలువైన చిన్న ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సంపాదించాడు. శాన్ డియాగో, జావా, బర్మాల ద్వారా భారతదేశానికి రవాణా చేయడానికి ఏర్పాటు చేశాడు. ఈ ఆయుధాల్లో స్పానిష్-అమెరికన్ యుద్ధంలో వాడిన 8,080 స్ప్రింగ్ఫీల్డ్ రైఫిళ్ళు, 2,400 స్ప్రింగ్ఫీల్డ్ కార్బైన్లు, 410 హాట్చ్కిస్ రైఫిళ్ళు, 40,00,000 గుళికలు, 500 కోల్ట్ రివాల్వర్లూ వాటి గుళికలు ఒక లక్షా, 250 మౌజర్ తుపాకి మందుగుండు ఉన్నాయి. అమెరికా నుండి ఆయుధాలను రవాణా చేసి, వాటిని SS మావెరిక్ లోకి ఎక్కించేందుకూ ఆనీ లార్సెన్ నౌక, సెయిలింగ్ షిప్ SS హెన్రీ S లను అద్దెకు తీసుకున్నారు. ఆగ్నేయాసియాలో నకిలీ కంపెనీలు, చమురు వ్యాపారాల మాటున ఓడల అసలు యాజమానులు ఎవరనేది దాచిపెట్టారు. ఈ ఆయుధాలు, మెక్సికో అంతర్యుద్ధంలో పోరాడుతున్న వర్గాల కోసమని బ్రిటిషు ఏజెంట్లను నమ్మించడానికి ఒక కథనాన్ని అల్లారు. [55][56][57][58][59][60][61] మెక్సికో లోని ప్రత్యర్థి వర్గమైన విల్లా వర్గం, ఆ ఆయుధాలను తమ నియంత్రణలో ఉన్న నౌకాశ్రయానికి మళ్లిస్తే $15,000 ఇస్తామని చెప్పడంతో విప్లవకారుల ఉపాయం పారినట్లైంది. [62]

ఈ ఆయుధాలు 1915 ఫిబ్రవరిలో తలపెట్టిన తిరుగుబాటు కోసం సరఫరా చేయడానికి ఉద్దేశించినప్పటికీ, జూన్ వరకు దాన్ని పంపలేదు. అప్పటికి భారతదేశంలో కుట్ర బయటపడింది. దాని ప్రధాన నాయకుల్లో కొందరిని అరెస్టు చేసారు. కొందరు అజ్ఞాతంలోకి వెళ్లారు. సోకోరో ద్వీపం వద్ద మావెరిక్‌ నౌకను కలవాలనే ప్రణాళిక, సమన్వయ లోపం కారణంగా విఫలమైంది. కుట్రతో దగ్గరి సంబంధం ఉన్న భారతీయ, ఐరిష్ ఏజెంట్ల ద్వారా బ్రిటిషు నిఘా వవస్థకు అప్పటికే ఈ కుట్ర గురించి తెలిసిపోయింది. అనేక విఫల ప్రయత్నాల తర్వాత అన్నీ లార్సెన్ నౌక హోక్వియామ్, వాషింగ్టన్‌కు తిరిగి వచ్చిన తర్వాత, దాని కార్గోను అమెరిక కస్టమ్స్ శాఖ స్వాధీనం చేసుకుంది. [63][64] ఈ ఆయుధాలు జర్మన్ తూర్పు ఆఫ్రికా కోసం ఉద్దేశించినవని చెబుతూ జర్మన్ రాయబారి కౌంట్ జోహాన్ వాన్ బెర్న్‌స్టాఫ్ వాటిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, కార్గోను వేలం వేసారు. [65] హిందూ-జర్మన్ కుట్ర విచారణ 1917లో అమెరికాలో ఆయుధాల రవాణా ఆరోపణలపై మొదలైంది. ఆ సమయంలో అది, అమెరికా న్యాయ చరిత్రలో సుదీర్ఘమైన, అత్యంత ఖరీదైన విచారణల్లో ఒకటి. [66] ఫ్రాంజ్ వాన్ పాపెన్ కెనడాలో రైలు మార్గాలను విధ్వంసం చేయడానికీ, వెల్లాండ్ కెనాల్‌ను నాశనం చేయడానికీ ప్రయత్నించాడు. బ్రిటిషు కొలంబియాలో రైల్వే బ్రిడ్జిలను పేల్చేందుకు సిక్కులకు రైఫిళ్లు, డైనమైట్‌లను సరఫరా చేసేందుకు కూడా అతను ప్రయత్నించాడు. కెనడాలో ఈ ప్రణాళికలు కార్యరూపం దాల్చలేదు. అమెరికాలో బ్లాక్ టామ్ పేలుడు ఘటనలో 1916 జూలై 30 రాత్రి, న్యూయార్క్ నౌకాశ్రయంలోని బ్లాక్ టామ్ టెర్మినల్ వద్ద విధ్వంసకులు దాదాపు 20 లక్షల టన్నుల ఆయుధాలు, మందుగుండు సామగ్రిని పేల్చివేశారు. ఈ ఆయుధాలు బ్రిటిషు యుద్ధ ప్రయత్నానికి మద్దతుగా రవాణా కోసం సిద్ధంగా ఉన్నాయి. ఆ సమయంలో దానికి పూర్తి బాధ్యులుగా జర్మన్ ఏజెంట్లనే నిందించారు. కానీ, ఆనీ లార్సెన్ సంఘటన తర్వాత డైరెక్టరేట్ ఆఫ్ నేవల్ ఇంటెలిజెన్స్ చేసిన పరిశోధనల్లో బ్లాక్ టామ్ పేలుడుకూ ఫ్రాంజ్ వాన్ పాపెన్, ఐరిష్ ఉద్యమం, భారత ఉద్యమం, అమెరికా కమ్యూనిస్టులకూ మధ్య సంబంధం బయటపడింది. [67] [68]

పాన్-ఇండియన్ తిరుగుబాటు

[మార్చు]

1915 ప్రారంభం నాటికి, చాలా మంది గదరీయులు భారతదేశానికి తిరిగి వచ్చారు (కొన్ని అంచనాల ప్రకారం పంజాబ్ ప్రావిన్స్‌లోనే దాదాపు 8,000 మంది). అయితే, వారికి కేంద్రీకృత నాయకత్వం లేదు. తాత్కాలిక ప్రాతిపదికన వారి పనిని ప్రారంభించారు. అనుమానంతో కొంతమందిని పోలీసులు చుట్టుముట్టినప్పటికీ, చాలా మంది పరారీ అయ్యారు. లాహోర్, ఫిరోజ్‌పూర్, రావల్పిండి వంటి ప్రధాన నగరాల్లోని దండులతో పరిచయాలను ఏర్పరచుకోవడం ప్రారంభించారు. లాహోర్ సమీపంలోని మియాన్ మీర్ వద్ద సైనిక ఆయుధాగారంపై దాడి చేసి 1914 నవంబరు 15 న సాధారణ తిరుగుబాటును ప్రారంభించేందుకు వివిధ ప్రణాళికలను రూపొందించారు. మరొక ప్రణాళికలో, సిక్కు సైనికుల బృందం, మంఝా జాతా, నవంబరు 26న లాహోర్ కంటోన్మెంట్ వద్ద 23వ అశ్వికదళంలో తిరుగుబాటును లేపాలని ప్రణాళిక వేసింది. నిధామ్ సింగ్ ఆధ్వర్యంలో ఫిరోజ్‌పూర్ నుండి నవంబరు 30న తిరుగుబాటును ప్రారంభించాలని తదుపరి ప్రణాళిక పిలుపునిచ్చింది. బెంగాల్‌లో, జుగంతర్, జతిన్ ముఖర్జీ ద్వారా కలకత్తాలోని ఫోర్ట్ విలియం వద్ద ఉన్న దండుతో పరిచయాలను ఏర్పరచుకుంది. [69][70] 1914 ఆగష్టులో, ముఖర్జీ బృందం భారతదేశంలోని ప్రధాన తుపాకీ తయారీ సంస్థ అయిన రోడ్డా కంపెనీ నుండి పెద్ద మొత్తంలో తుపాకులు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకుంది. 1914 డిసెంబరులో, కలకత్తాలో అనేక రాజకీయ ప్రేరేపిత సాయుధ దోపిడీలు జరిగాయి. ముఖర్జీ, కర్తార్ సింగ్, VG పింగ్లే ద్వారా రాష్ బిహారీ బోస్‌తో సంప్రదిస్తూ ఊండేవాడు. అప్పటి వరకు వేర్వేరు సమూహాలు విడివిడిగా నిర్వహిస్తూ ఉన్న ఈ తిరుగుబాటు చర్యలను ఉత్తర భారతదేశంలో రాష్ బిహారీ బోస్, మహారాష్ట్రలో VG పింగ్లే, బెనారస్‌లో సచీంద్రనాథ్ సన్యాల్ నాయకత్వంలో ఒకే గొడుగు కిందకి తీసుకువచ్చారు. [71][72][73] 1915 ఫిబ్రవరి 21 తేదీన ఒక ఏకీకృత సాధారణ తిరుగుబాటు లేవదీసేందుకు ఒక ప్రణాళికను రూపొందించారు. [74][75]

1915 ఫిబ్రవరి

[మార్చు]
సింగపూర్‌లోని అవుట్‌రామ్ రోడ్‌లో దోషులుగా తేలిన తిరుగుబాటుదారుల బహిరంగ ఉరిశిక్షలు c. 1915 మార్చి

ఆయుధాల రవాణాలో జరిగిన ఆలస్యం గురించి తెలియక, భారతీయ సిపాయిని సమీకరించగలమన్న నమ్మకంతోటీ, భారతదేశం లోని విప్లవకారులు తిరుగుబాటుకు సంబంధించిన పన్నాగాన్ని తుది రూపానికి తీసుకొచ్చారు. ప్రణాళిక ప్రకారం, పంజాబ్‌లోని 23వ అశ్విక దళం ఫిబ్రవరి 21న రోల్ కాల్‌లో ఉన్న సమయంలో ఆయుధాలను స్వాధీనం చేసుకుని, తమ అధికారులను చంపాలి. దీని వెంటనే 26వ పంజాబ్‌ బెటాలియన్లో తిరుగుబాటు జరగాలి. ఇది తిరుగుబాటు మొదలైందనే సంకేతాన్ని ఇస్తుంది. ఫలితంగా ఢిల్లీ, లాహోర్‌లపైకి దాడి వెళ్తారు. ఆమరుసటి రోజున బెంగాల్ విప్లవకారులు, పంజాబ్ మెయిల్ హౌరా స్టేషన్‌లోకి వస్తుందో రాదో చూడాలి (పంజాబ్‌ విప్లవకారుల స్వాధీనమైతే అది రాదు). ఆ వెంటనే వాళ్ళు దాడి మొదలుపెట్టాలి. అయితే, పంజాబ్ CID శాఖ కిర్పాల్ సింగ్ అనే సిపాయి ద్వారా చివరి క్షణంలో కుట్ర గురిచి తెలుసుకుంది. [76] తమ ప్రణాళికలు బయట పడ్డాయని గ్రహించి, తిరుగుబాటు తేదీని ఫిబ్రవరి 19కి ముందుకు జరిపారు. అయితే ఈ ప్రణాళికలు కూడా గూఢచారులకు తెలిశాయి. [76] జనవరి 21న రంగూన్‌లో 130వ బలూచి రెజిమెంట్ చేసిన తిరుగుబాటు ప్రణాళికలు విఫలమయ్యాయి. 26వ పంజాబ్, 7వ రాజ్‌పుత్, 130వ బలూచ్, 24వ జాట్ ఆర్టిలరీ, ఇతర రెజిమెంట్‌లలో జరిగిన తిరుగుబాట్లను అణచివేసారు. ఫిరోజ్‌పూర్, లాహోర్, ఆగ్రాలో లేచిన తిరుగుబాట్లను కూడా అణచివేసారు. కుట్రకు సంబంధించిన అనేక మంది ముఖ్య నాయకులను అరెస్టు చేశారు, అయితే కొందరు తప్పించుకోగలిగారు. ఆఖరి ప్రయత్నంగా ట్రిగ్గర్ కర్తార్ సింగ్, వీజీ పింగళేలు, మీరట్‌లో 12 వ అశ్విక దళంలో ఒక తిరుగుబాటు లేవదీసారు. కర్తార్ సింగ్ లాహోర్ నుండి తప్పించుకున్నాడు, కానీ వారణాసిలో అరెస్టయ్యాడు. VG పింగ్లే మీరట్‌లో పట్టుబడ్డాడు. పంజాబ్, సెంట్రల్ ప్రావిన్స్‌లలో గదరీయులను చుట్టుముట్టడంతో సామూహిక అరెస్టులు జరిగాయి. రాష్ బిహారీ బోస్ లాహోర్ నుండి తప్పించుకొని 1915 మేలో జపాన్‌ పారిపోయాడు. జ్ఞాని ప్రీతమ్ సింగ్, స్వామి సత్యానంద పూరి తదితర నాయకులు థాయ్‌లాండ్‌కు పారిపోయారు. [76][77]

ఫిబ్రవరి 15న, సింగపూర్‌లో 5వ తేలికపాటి పదాతిదళం విజయవంతంగా తిరుగుబాటు చేసిన కొన్ని యూనిట్లలో ఒకటి. 15వ తేదీ మధ్యాహ్నం, అందులోని దాదాపు ఎనిమిది వందల యాభై మంది సైనికులు దాదాపు వంద మంది మలయ్ స్టేట్స్ గైడ్స్‌తో కలిసి తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటు దాదాపు ఏడు రోజులు కొనసాగింది. 47 మంది బ్రిటిషు సైనికులు, స్థానిక పౌరులూ మరణించారు. అరెస్టైన SMS ఎమ్డెన్ సిబ్బందిని తిరుగుబాటుదారులు విడుదల చేశారు. వారిని తిరుగుబాటుదారులు తమతో చేరమని అడగ్గారు వారు తిరస్కరించారు. వాస్తవానికి వాళ్ళు, తిరుగుబాటుదారులు వెళ్ళిపోయిన తర్వాత, ఆయుధాలు చేపట్టి బ్యారక్‌లను రక్షించారు (కొంతమంది బ్రిటిషు శరణార్థులకు కూడా ఆశ్రయం కల్పించారు). [78] ఫ్రెంచ్, రష్యన్, జపాన్ నౌకలు బలగాలతో వచ్చిన తర్వాత మాత్రమే తిరుగుబాటు అణచివేయగలిగారు. [79] [80] సింగపూర్‌లో విచారించిన 200 మందిలో, 47 మంది తిరుగుబాటుదారులను బహిరంగ మరణశిక్షలో కాల్చిచంపారు. [81][82] మిగిలిన వారిలో కొంతమందిని తూర్పు ఆఫ్రికాకు ఆమరణాంత శిక్షగా తరలించారు. కొంతమందిని ఏడు నుండి ఇరవై సంవత్సరాల మధ్య జైలు శిక్ష విధించారు. [83] మొత్తం మీద, 800 మంది తిరుగుబాటుదారులను కాల్చివేసారు, ఖైదు చేసారు లేదా బహిష్కరించారు. [84] సింగపూర్ యూనిట్‌లో కొందరు గదర్ ఏజెంట్లు పనిచేసినప్పటికీ, తిరుగుబాటు స్వతంత్రంగా జరిగిందనీ, కుట్రతో దానికి సంబంధం లేదనీ హ్యూ స్ట్రాచన్‌తో సహా కొంతమంది చరిత్రకారులు, వాదించారు. [85] మరికొందరు దీనిని పట్టు లేఖల ఉద్యమం ప్రేరేపించిందని భావిస్తారు. పట్టు లేఖల ఉద్యమం గదర్ కుట్రతో ముడిపడి ఉంది.[86]

క్రిస్మస్ నాటి కుట్ర

[మార్చు]
బాఘా జతిన్, బాలాసోర్‌లోని బుర్హా బలాంగ్ ఒడ్డున తన చివరి యుద్ధంలో గాయపడ్డాడు. అతని సంస్థ 1915 శరదృతువులో బ్రిటిషు ఇండియాకు అత్యంత ముఖ్యమైన ప్రమాదాలలో ఒకటిగా పరిగణించబడింది.

ఏప్రిల్ 1915లో, ఆనీ లార్సెన్ ప్రణాళిక వైఫల్యం గురించి తెలియని పాపెన్, క్రుప్ సంస్థ అమెరికన్ ప్రతినిధి హన్స్ టౌషర్ ద్వారా 7,300 స్ప్రింగ్‌ఫీల్డ్ రైఫిళ్ళు, 1,930 పిస్టళ్ళు, పది గాట్లింగ్ తుపాకులు, దాదాపు 30,00,000 కాట్రిడ్జ్‌లతో కూడిన రెండవ ఆయుధ రవాణాను ఏర్పాటు చేశాడు. ఈ ఆయుధ సామాగ్రిని హాలండ్ అమెరికా పొగ ఓడ SS డ్జెంబర్‌పై జూన్ మధ్యలో ఈస్ట్ ఇండీస్ లోని సురాబాయాకు రవాణా చేయాల్సి ఉంది. అయితే, న్యూయార్క్‌కు కాన్సుల్ జనరల్ కోర్టేనే బెన్నెట్ నిర్వహిస్తున్న ఇంటెలిజెన్స్ నెట్‌వర్కు, న్యూయార్క్‌లోని టౌషర్‌కు కార్గోతో సంబంధం ఉన్నట్లు గుర్తించగలిగింది. దాన్ని కంపెనీకి సమాచారాన్ని అందించడంతో, ఈ ప్రణాళికలు కూడా భగ్నమయ్యాయి. [87] ఈలోగా, ఫిబ్రవరి కుట్రలు చెడిపోయిన తర్వాత కూడా, జతిన్ ముఖర్జీ (బాఘా జతిన్) ఆధ్వర్యంలోని జుగంతర్ కూటమి ద్వారా బెంగాల్‌లో తిరుగుబాటుకు ప్రణాళికలు కొనసాగాయి. థాయ్‌లాండ్, బర్మాల్లోని జర్మన్ ఏజెంట్లు, ముఖ్యంగా ఎమిల్, థియోడర్ హెల్ఫెరిచ్- జర్మన్ ఆర్థిక మంత్రి కార్ల్ హెల్ఫెరిచ్‌కు సోదరులు- ఆ సంవత్సరం మార్చిలో జితేంద్రనాథ్ లాహిరి ద్వారా జుగాంతర్‌తో సంబంధాలు ఏర్పరచుకున్నారు. ఏప్రిల్‌లో, జతిన్ యొక్క చీఫ్ లెఫ్టినెంట్ నరేంద్రనాథ్ భట్టాచార్య హెల్ఫెరిచ్‌లతో సమావేశమైనపుడు, ఆయుధాలనుతీసుకుని మావెరిక్ నౌక రానుందని తెలుసుకున్నాడు. ఇవి వాస్తవానికి గదర్ ఉపయోగం కోసం ఉద్దేశించబడినప్పటికీ, బెర్లిన్ కమిటీ తన ప్రణాళికలను సవరించింది. ముందు అనుకున్నట్లు కరాచీకికాకుండా, తూర్పు తీరం ద్వారా, చిట్టగాంగ్ తీరంలోని హటియా, సుందర్‌బన్స్‌లోని రాయమంగల్, ఒరిస్సాలోని బాలాసోర్ ద్వారా భారతదేశంలోకి ఆయుధాలను రవాణా చేయలని నిర్ణయించుకుంది. [88] బంగాళాఖాతం తీరం నుండి వీటిని జతిన్ బృందం సేకరిస్తుంది. తిరుగుబాటు తేదీ 1915 క్రిస్మస్ రోజున అని నిర్ణయించారు. దీనికే "క్రిస్మస్ నాటి కుట్ర" అనే పేరు వచ్చింది. [89] జతిన్ కలకత్తాలోని 14వ రాజ్‌పుత్ రెజిమెంట్‌పై విజయం సాధించగలడని, బాలాసోర్‌లో మద్రాసుకు లైన్ కట్ చేసి బెంగాల్‌పై నియంత్రణ సాధించగలడనీ అంచనా వేసారు. [90] కలకత్తాలోని ఒక కల్పిత సంస్థ ద్వారా హెల్ఫెరిచ్ సోదరుల నుండి జుగంతర్‌కు కూడా నిధులు (1915 జూన్ - ఆగస్టు మధ్య రూ. 33,000 అందాయని అంచనా) అందాయి. అయితే, ఈ సమయంలోనే మావెరిక్, జుగాంతర్ ప్లాన్‌ల వివరాలను బటావియాలోని బ్రిటిషు కాన్సుల్ అయిన బెకెట్‌కు "ఓరెన్ " అనే మారుపేరుతో ఉన్న బాల్టిక్-జర్మన్ ఏజెంటు లీక్ చేశాడు. మావెరిక్‌ను స్వాధీనం చేసుకున్నారు. కలకత్తాలో ప్రచ్ఛన్న విప్లవోద్యమాన్ని పోలీసులు ధ్వంసం చేశారు. ఇదేమీ తెలియని జతిన్, ప్రణాళిక ప్రకారం బాలసోర్ వెళ్లగా అతనిని భారత పోలీసులు అనుసరించారు. 1915 సెప్టెంబరు 9 న, అతన్ని, ఐదుగురు విప్లవకారుల బృందాన్నీఎదుర్కొన్నారు. డెబ్బై ఐదు నిమిషాల పాటు జరిగిన తుపాకీ యుద్ధంలో తీవ్రంగా గాయపడిన జతిన్ మరుసటి రోజు బాలాసోర్‌లో మరణించాడు. [91][92]

కలకత్తాను స్వాధీనం చేసుకోవడంలో బెంగాల్ సమూహానికి తగినంత సమయం అందించడానికీ, అదనపు బ్రిటిషు బలగాలను రానీకుండా నిరోధించడానికీ, జూగాంతర్ తలపెట్టిన క్రిస్మస్ రోజు తిరుగుబాటు జరిగిన సమయం లోనే బర్మా లోనూ ఒక తిరుగుబాటుకు ప్రణాళిక వేసారు. తటస్థ థాయ్‌లాండ్ నుండి అక్రమంగా రవాణా చేయబడిన ఆయుధాలను ఇందుకు వాడారు. [93][94][95] థాయ్‌లాండ్ (సియామ్) గదరీయులకు బలమైన స్థావరం. బర్మాలో తిరుగుబాటు ప్రణాళికలు (ఇది ఆ సమయంలో బ్రిటిషు ఇండియాలో భాగం) గదర్ పార్టీ 1914 అక్టోబరు లోనే ప్రతిపాదించింది. బర్మాను భారతదేశంలోకి తదుపరి పురోగమనానికి పునాదిగా ఉపయోగించాలని ఈ ప్రణాళికల ద్వారా తలపెట్టింది. [96][97]సియామ్-బర్మా ప్రణాళిక చివరకు 1915 జనవరిలో ముగిసింది. షాంఘై నుండి ఆత్మా రామ్, థాకర్ సింగ్, బంటా సింగ్‌లు, శాన్ ఫ్రాన్సిస్కో నుండి సంతోఖ్ సింగ్, భగవాన్ సింగ్‌లతో సహా చైనా, అమెరికాల్లోని శాఖలకు చెందిన గదరీయులు థాయ్‌లాండ్‌లోని బర్మా మిలిటరీ పోలీసులలోకి చొరబడటానికి ప్రయత్నించారు. ఇందులో సిక్కులు, పంజాబీ ముస్లింలు ఎక్కువగా ఉన్నారు. 1915 ప్రారంభంలో, ఆత్మారామ్ కలకత్తా, పంజాబ్‌లను కూడా సందర్శించాడు. జుగంతర్‌తో సహా అక్కడి విప్లవకారులతో సంపర్కం లోకి వచ్చాడు. హేరంబాలాల్ గుప్తా, చికాగోలోని జర్మన్ కాన్సుల్ భారతీయులకు శిక్షణ ఇచ్చే ఉద్దేశ్యంతో జర్మన్ కార్యకర్తలైన జార్జ్ పాల్ బోహెమ్, హెన్రీ షుల్ట్, ఆల్బర్ట్ వెహ్డేలను మనీలా ద్వారా సియామ్‌కు పంపే ఏర్పాటు చేశాడు. యున్నాన్ మీదుగా భారత సరిహద్దుకు చేరుకోవడం ఒకటి, ఎగువ బర్మాలోకి చొచ్చుకుపోయి అక్కడ విప్లవకారులతో కలవడం అనే రెండు దండయాత్రలను పంపే పనిమీద సంతోఖ్ సింగ్ షాంఘైకి తిరిగి వెళ్ళాడు. జర్మన్లు, మనీలాలో ఉన్నప్పుడు, మనీలా నౌకాశ్రయంలో ఆశ్రయం పొంది, సాచ్‌సెన్, సువియా అనే రెండు జర్మన్ నౌకల లోని ఆయుధ సరుకును ఒక ఓడ లోకి మార్చి, సియామ్‌కు పంపడానికి ప్రయత్నించారు. అయితే, అమెరికా కస్టమ్స్ ఈ ప్రయత్నాలను అడ్డుకుంది. ఈలోగా గదరీయులు, థాయ్‌లాండ్‌ లోని జర్మన్ కాన్సుల్ రెమీ సహాయంతో, చైనా, కెనడాల నుండి వచ్చే గదరీయులకు శిక్షణ నిచ్చేందుకు థాయ్-బర్మా సరిహద్దు సమీపంలోని అడవిలో ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. షాంఘైలోని జర్మన్ కాన్సుల్ జనరల్ నిప్పింగ్, పెకింగ్ ఎంబసీ గార్డ్‌కు చెందిన ముగ్గురు అధికారులను శిక్షణ నిచ్చేందుకు పంపాడు. అదనంగా స్వాటోలో ఒక నార్వేజియన్ ఏజెంట్‌ను ఆయుధాల అక్రమ రవాణాకు ఏర్పాటు చేశారు. [98] అయితే, థాయ్ పోలీస్ హైకమాండ్ - ఇందులో ఎక్కువగా బ్రిటిషు వారే ఉండేవారు - ఈ ప్రణాళికలను పసిగట్టింది. ఆస్ట్రియన్ ఛార్జ్ డి'అఫైర్స్ ద్వారా ఈ వివరాలను తెలుసుకున్నాక, భారత పోలీసులు ఈ కుట్రలోకి చొరబడ్డారు. థాయిలాండ్, అధికారికంగా తటస్థంగా ఉన్నప్పటికీ, బ్రిటన్ తోటి, బ్రిటిషు ఇండియా తోటీ సన్నిహితంగా ఉండేది. జూలై 21న, కొత్తగా వచ్చిన బ్రిటిషు మంత్రి హెర్బర్ట్ డెరింగ్ భారతీయ ఏజెంటు గుర్తించిన గదరీయులను అరెస్టు చేసి అప్పగించాలని విదేశాంగ మంత్రి ప్రిన్స్ దేవావాంగ్సేకి అభ్యర్థనను అందించాడు. చివరికి ఆగస్టులో ప్రముఖ గదరీయులను అరెస్టు చేశారు. ఒకే ఒక్క దాడి, బర్మాలో ఆరుగురు గదరీయులు చేసారు. వారిని పట్టుకుని ఉరితీశారు. [99][98][100]

అలాగే కలకత్తాలో ప్రతిపాదిత జుగంతర్ తిరుగుబాటు సమయం లోనే అండమాన్ దీవుల లోని జౌలు మీద ఈస్ట్ ఇండీస్ నుండి వచ్చిన జర్మన్ వాలంటీర్ ఫోర్స్‌తో ఒక దాడి చెయ్యాలని ప్రణాళిక వేసారు. ఈ దాడి లో రాజకీయ ఖైదీలను విడుదల చేస్తారు. వారితో భారత తీరంపై దాడి చేసేందుకు ఒక దళాన్ని తయారు చేస్తారు. [101][102] ఫ్రాన్స్‌లో జరిగిన పోరాటంలో గాయపడిన బటావియాలోని జర్మన్ ప్లాంటర్ విన్సెంట్ క్రాఫ్ట్ ఈ ప్రణాళికను ప్రతిపాదించాడు. భారతీయ కమిటీతో సంప్రదింపుల తర్వాత 1915 మే 14న విదేశాంగ కార్యాలయం దీన్ని ఆమోదించింది. దాదాపు వంద మంది జర్మన్ల బలగంతో 1915 క్రిస్మస్ రోజున దాడికి ప్రణాళిక చేసారు. నిప్పింగ్ అండమాన్ దీవులకు ఆయుధాలను రవాణా చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసాడు. అయితే, విన్సెంట్ క్రాఫ్ట్ ఒక డబుల్ ఏజెంటు. అతడు నిప్పింగ్ ప్రణాళికల వివరాల గురించి బ్రిటిషు నిఘావర్గాలకు ఉప్పందించాడు. దాడి కోసం అతను చేసిన బూటకపు ప్రణాళికలు కూడా ఈ సమయంలో బెకెట్‌కి తెలిసిపోయింది. అయితే ఇండో-జర్మన్ ప్రణాళికల వరుస వైఫల్యాల కారణంగా, బెర్లిన్ కమిటీ, నిప్పింగ్ ఇద్దరూ చేసిన సిఫార్సుల మేరకు కార్యకలాపాలకు సంబంధించిన ప్రణాళికలను రద్దు చేసారు. [103]

ఆఫ్ఘనిస్తాన్

[మార్చు]
దస్త్రం:Indian,German and Turkish delegates of Niedermayer Mission.jpg
మహేంద్ర ప్రతాప్ (మధ్యలో) కాబూల్, 1915లో జర్మన్, టర్కిష్ ప్రతినిధులతో కూడిన సంఘానికి అధిపతిగా. అతని కుడి వైపున వెర్నర్ ఒట్టో వాన్ హెంటిగ్ కూర్చున్నాడు.

మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఆఫ్ఘనిస్తాన్‌ను సెంట్రల్ పవర్స్ వైపు యుద్ధంలోకి లాగేందుకు ప్రయత్నాలు జరిగాయి. భారతదేశంలో జాతీయవాద విప్లవాన్ని లేదా పాన్-ఇస్లామిక్ తిరుగుబాటునూ ప్రేరేపిస్తుందని, పంజాబ్లోను భారతదేశం అంతటా బ్రిటిషు వారి రిక్రూటింగ్ క్షేత్రాలను అస్థిరపరుస్తాయనీ భావించడమే దీనికి కారణం. 1905 రస్సో-జపనీస్ యుద్ధంలో రష్యా ఓటమి తర్వాత, దాని ప్రభావం క్షీణించింది. ఆ సమయంలో బ్రిటిషు భారతదేశానికి ముప్పు కాగల శక్తి ఆఫ్ఘనిస్తాన్ ఒక్కటేనని బ్రిటన్ భావించింది. [104]

1915 వసంతకాలంలో, పర్షియా గుండా భూమార్గం ద్వారా ఆఫ్ఘనిస్తాన్‌కు ఇండో-జర్మన్ దౌత్య సంఘాన్ని పంపించారు. బహిష్కరించబడిన భారతీయ యువరాజు రాజా మహేంద్ర ప్రతాప్ నేతృత్వంలోని ఈ సంఘం, బ్రిటన్‌ నుండి విడిపోవడానికి, స్వాతంత్ర్యం ప్రకటించుకోడానికి, కేంద్ర శక్తుల తరపున యుద్ధంలో చేరడానికి, బ్రిటిషు ఇండియాపై దాడి చేయడానికీ ఆఫ్ఘన్ ఎమిర్ హబీబుల్లా ఖాన్‌ను ప్రేరేపించేందుకు ప్రయత్నించింది. ఇది 1915 ఆగస్టులో ఆఫ్ఘనిస్తాన్‌కు చేరుకోవడానికి ముందు మెసొపొటేమియా, పర్షియన్ ఎడారులలో అడ్డగించేందుకు జరిగిన ఆంగ్లో-రష్యన్ ప్రయత్నాలను తప్పించుకోగలిగింది. [105][106] ఆఫ్ఘనిస్తాన్‌లో, మౌలానా ఉబైదుల్లా సింధీ నేతృత్వంలోని పాన్-ఇస్లామిక్ గ్రూప్ దారుల్ ఉలూమ్ దేవబంద్ సభ్యులు కాబూల్‌లో ఈ దళాన్ని కలిసారు. ఈ బృందం యుద్ధం ప్రారంభంలో భారతదేశం నుండి కాబూల్‌కు బయలుదేరింది. మహ్మద్ అల్-హసన్ నేతృత్వంలోని మరొక సమూహం హిజాజ్ చేరుకుంది, అక్కడ వారు పాన్-ఇస్లామిక్ తిరుగుబాటు కోసం ఆఫ్ఘన్ ఎమిర్, ఒట్టోమన్ సామ్రాజ్యం, ఇంపీరియల్ జర్మనీల నుండి మద్దతు పొందాలని ఆశించారు. ఈ తిరుగుబాటును వాయువ్య భారతదేశంలోని గిరిజన బెల్ట్‌లో మొదలుపెట్టాలని వారి ఉద్దేశం. [107][108] ఇండో-జర్మన్ దౌత్య దళం, ఎమిర్ హబీబుల్లా తన తటస్థ వైఖరిని విరమించుకోవాలనీ, జర్మనీతో దౌత్య సంబంధాలను నెలకొల్పుకోవాలనీ ఒత్తిడి చేసింది. ఎలాగోలా ఎమిర్‌ జర్మన్ యుద్ధ ప్రయత్నాలకు సహకరించేలా ఒప్పించవచ్చని దళం ఆశించింది. [109][110] హబీబుల్లా ఖాన్ 1915 శీతాకాలమంతా మిషన్ ప్రతిపాదనలపై ఊగిసలాడాడు. యుద్ధం ముగిసే వరకూ తటస్థ వైఖరిని కొనసాగించాలని ఆశపడ్డాడు. అయితే ఈ సమయంలో దౌత్య దళం, ఎమిర్ దర్బారులో ఉన్న అతని సోదరుడు నస్రుల్లా ఖాన్, కుమారుడు అమానుల్లా ఖాన్‌తో సహా సలహా మండలిలోని జర్మన్ అనుకూల వ్యక్తులతో రహస్యంగా చర్చలను మొదలుపెట్టింది. దీనికి ఆఫ్ఘన్ మేధావులు, మత పెద్దలు, ఆఫ్ఘన్ పత్రికల మద్దతు లభించింది. పత్రికల్లో బ్రిటిషు వ్యతిరేక, కేంద్రశక్తుల అనుకూల కథనాలు విరివిగా వచ్చాయి. 1916 నాటికి, భారతదేశానికి పంపిన ఆఫ్ఘన్ వార్తాపత్రిక సిరాజ్ అల్ అఖ్బరు కాపీలను బ్రిటిషు ప్రభుత్వం అడ్డగించవలసి వచ్చింది. [111] ఎమీర్ బ్రిటిషు వారికి తొత్తుగా మారాడని, దేశంలో తిరుగుబాటు, గిరిజనులలో అశాంతి ముప్పు ఉందనీ ఇది ఎత్తి చూపింది.

1915 డిసెంబరులో, భారతీయ సభ్యులు తాత్కాలిక ప్రభుత్వాన్ని స్థాపించారు. ఇది భారతదేశానికి సహాయం చేయడానికి, ఎమిర్ కు మద్దతు ఇచ్చేందుకూ హబీబుల్లా సలహా మండలిపై బరువు పెడుతుందని భావించారు. 1916 జనవరిలో, కొంత కాలయాపన జరిపే మిషతో ఎమిర్, జర్మనీతో ముసాయిదా ఒప్పందాన్ని ఆమోదించాడు. అయితే, ఈ సమయంలో మధ్యప్రాచ్యంలో కేంద్ర శక్తులు ఓటమి చవిచూసాయి. ఆఫ్ఘనిస్తాన్‌కు సహాయాన్ని పంపేందుకు పర్షియా గుండా భూమార్గాన్ని వాడుకోవచ్చనే ఆశలు మూసుకుపోయాయి. దౌత్య దళం లోని జర్మన్ సభ్యులు 1916 జూన్ లో ఆఫ్ఘనిస్తాన్‌ను విడిచిపెట్టి, అక్కడ తమ కుట్రలను ముగించారు. [112] అయినప్పటికీ, మహేంద్ర ప్రతాప్, అతని తాత్కాలిక ప్రభుత్వం జపాన్, రిపబ్లికన్ చైనా, జారిస్ట్ రష్యాలతో సంబంధాలను ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తూ అక్కడే ఉండి పోయారు. రష్యన్ విప్లవం తర్వాత ప్రతాప్, సోవియట్ యూనియన్‌తో చర్చలు ప్రారంభించాడు. 1918లో రెడ్ పెట్రోగ్రాడ్‌లో ట్రాట్స్కీని, 1919లో మాస్కోలో లెనిన్‌నూ కలిసాడు. 1918లో బెర్లిన్‌లో కైసర్‌ను కలిసాడు. [113] అతను ఆఫ్ఘనిస్తాన్ ద్వారా భారతదేశంలోకి సోవియట్-జర్మన్లు ఉమ్మడిగా దాడి చెయ్యాలని ఒత్తిడి చేశాడు. 1919లో ఆఫ్ఘనిస్తాన్‌లో జరిగిన తిరుగుబాటు తర్వాత సోవియట్‌లు దీనిని కొంతకాలం పరిగణించారు. ఈ తిరుగుబాటు తరువాత అమానుల్లా ఖాన్‌ను ఎమిర్‌ అయ్యాడు. మూడవ ఆంగ్లో-ఆఫ్ఘన్ యుద్ధం ప్రారంభమైంది. టిబెట్, హిమాలయ బఫర్ ప్రాంతాల ద్వారా భారతదేశాన్ని ఆక్రమించాలనే సోవియట్ ప్రణాళిక "కల్మిక్ ప్రాజెక్ట్ " వెనుక కూడా ప్రతాప్ ఉండి ఉండవచ్చు.[114][115]

మధ్యప్రాచ్యం

[మార్చు]

మధ్య ప్రాచ్యంలో పనిచేస్తున్న భారత సైనికులను దృష్టిలో ఉంచుకుని మరో కుట్ర జరిగింది. మధ్య ప్రాచ్య థియేటర్‌లో, హర్ దయాళ్, MPT ఆచార్యతో సహా బెర్లిన్ కమిటీ సభ్యులను 1915 వేసవిలో బాగ్దాద్, సిరియాలకు మిషన్‌లపై పంపారు. దక్షిణ మెసొపొటేమియా, ఈజిప్ట్‌లలోని భారత సాయుధ దళంలోకి చొరబడి బ్రిటిషు అధికారులను హత్య చేయడం వీరికి ఇచ్చిన పని. [116] భారతీయ ప్రయత్నం రెండు గ్రూపులుగా విభజించారు. ఒకదానిలో బెంగాలీ విప్లవకారుడు PN దత్ (అలియాస్ దావూద్ అలీ ఖాన్), పాండురంగ్ ఖాన్కోజే ఉన్నారు. ఈ బృందం బుషైర్‌కు చేరుకుంది, అక్కడ వారు విల్‌హెల్మ్ వాస్మస్‌తో కలిసి పనిచేశారు. మెసొపొటేమియా, పర్షియాలోని భారతీయ దళాలకు జాతీయవాద, విప్లవాత్మక సాహిత్యాన్ని పంపిణీ చేశారు. రెండవ సమూహం, ఈజిప్టు జాతీయవాదులతో కలిసి, సూయజ్ కాలువను అడ్డుకోవడానికి ప్రయత్నించింది. ఈ బృందాలు మెసొపొటేమియాలోని భారతీయ సైనికులలో జాతీయవాద సాహిత్యాన్ని, ప్రచారాన్నీ రహస్యంగా వ్యాప్తి చేయడంలో విజయవంతమయ్యాయి. ఒక సందర్భంలో ఒక అధికారి భోజనశాలపై బాంబు దాడి కూడా చేశారు. [117] ఈ సమయంలో కాన్‌స్టాంటినోపుల్, బుషైర్, కుత్-అల్- అమరాలలో భారతీయ యుద్ధ ఖైదీలను తమ దళంలో చేర్చుకోడానికి జాతీయవాద కార్యక్రమాన్ని విస్తరించారు. [118][119] MPT ఆచార్య యొక్క స్వంత ప్రణాళికల్లో టర్కీలోని భారతీయ పౌరుల సహాయంతో ఇండియన్ నేషనల్ వాలంటీర్ కార్ప్స్‌ను ఏర్పాటు చేయడం, భారతీయ యుద్ధ ఖైదీలను చేర్చుకోవడం వంటివి ఉన్నాయి. అతను బుషైర్‌లో విల్‌హెల్మ్ వాస్‌మస్‌తో కలిసి భారత సైనికులతో పనిచేసినట్లు తెలిసింది. [120][121] అయితే, ప్రధానంగా హిందువులైన బెర్లిన్ కమిటీ సభ్యులకు, టర్కీలో ఇప్పటికే ఉన్న భారతీయ విప్లవకారులైన ముస్లిములకూ మధ్య విభేదాల కారణంగా ఈ ప్రయత్నాలకు ఆటంకం ఏర్పడింది. [122] ఇంకా, ఈజిప్టు జాతీయవాదులు బెర్లిన్ కమిటీని విశ్వసించలేదు. వారు దాన్ని జర్మనీ తొత్తుగా భావించారు. [120]

అయినప్పటికీ, ఈ ప్రయత్నాల పరాకాష్టగా, ఫ్రాన్స్, టర్కీ, జర్మనీ, మెసొపొటేమియా నుండి -ముఖ్యంగా బాస్రా, బుషెహర్, కుత్ అల్ అమరాల నుండి భారతీయ యుద్ధ ఖైదీలను చేర్చుకున్నారు. అనేక రంగాలలో టర్కీ దళాలతో పోరాడిన భారతీయ వాలంటీర్ కార్ప్స్‌ను నెలకొల్పారు. అంబా ప్రసాద్ సూఫీ నేతృత్వంలోని దేవబందీలు పర్షియా నుండి బలూచిస్తాన్ మీదుగా పంజాబ్ వరకు భారతదేశ పశ్చిమ సరిహద్దులో చొరబాట్లను నిర్వహించడానికి ప్రయత్నించారు. కేదార్ నాథ్ సోంధీ, రిషికేష్ లేథా, అమీన్ చౌదరి యుద్ధ సమయంలో అంబా ప్రసాద్‌తో కలిసారు. ఈ భారతీయ దళాలు ఉజ్బెకిస్తాన్‌లోని సరిహద్దు నగరమైన కర్మాన్‌ను స్వాధీనం చేసుకోవడంలోను, అక్కడి బ్రిటిషు కాన్సుల్‌ను నిర్బంధించడంలోనూ పాలుపంచుకున్నాయి. బలూచి, పెర్షియన్ గిరిజన అధిపతులకు వ్యతిరేకంగా పెర్సీ సైక్స్ చేసిన పెర్సీ ప్రచారాన్ని విజయవంతంగా జర్మన్ల సహాయంతో అడ్డుకున్నారు. [123][124] తిరుగుబాటుదారులతో పోరాడుతున్న సమయంలో ఆగాఖాన్ సోదరుడు చనిపోయాడు. [125] తిరుగుబాటుదారులు ఆఫ్ఘనిస్తాన్‌లోని సిస్తాన్‌లో బ్రిటిషు దళాలను విజయవంతంగా వేధించారు. వారిని బలూచిస్తాన్‌లోని కరంషీర్‌కు పరిమితం చేశారు. తరువాత కరాచీ వైపు వెళ్లారు. కొన్ని నివేదికల్లో వారు గ్వాదర్, దావర్ తీర పట్టణాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారని ఉంది. బంపూర్ యొక్క బలూచి చీఫ్, బ్రిటిషు పాలన నుండి స్వాతంత్ర్యం ప్రకటించుకున్న తరువాత, గదరీయులతో కలిసాడు. కానీ ఐరోపాలో జరుగుతున్న యుద్ధం టర్కీకి వతిరేకంగా పరిణమించింది. బాగ్దాద్‌ను బ్రిటిషు దళాలు స్వాధీనం చేసుకున్నాయి. గదర్ దళాలు, సరఫరాలు ఆగిపోవడంతో చెదరిపోయాయి. చెదరిపోయిన గదర్ దళాలు షిరాజ్ వద్ద తిరిగి కలిసాయి. అక్కడ షిరాజ్ ముట్టడి సమయంలో ఘోరమైన పోరాటం తర్వాత వారు చివరకు ఓడిపోయారు. ఈ యుద్ధంలో అంబా ప్రసాద్ సూఫీ మరణించాడు. అయితే గదరీయులు 1919 వరకు ఇరాన్ పక్షపాతులతో కలిసి గెరిల్లా యుద్ధాన్ని కొనసాగించారు. [126][127] 1917 చివరి నాటికి, అమెరికాలో ఒకవైపు గదర్ పార్టీ, మరోవైపు బెర్లిన్ కమిటీ, జర్మన్ హైకమాండ్ మధ్య విభేదాలు కనిపించడం మొదలయ్యాయి. ఆగ్నేయాసియా, అమెరికాల్లోని గదరీయులతో కలిసి పనిచేస్తున్న జర్మన్ ఏజెంట్లు పంపిన నివేదికలు సంస్థ లోని అస్తవ్యస్తతను, గదర్ సంస్థ పట్ల ప్రజల మద్దతును అంచనా వేయడంలో ఉన్న అవాస్తవికతనూ యూరోపియన్ విభాగానికి సూచించాయి. ఫిబ్రవరి ప్లాట్లు విఫలం కావడం, 1917లో జరిగిన యుద్ధంలో చైనా పాల్గొన్న తర్వాత ఆగ్నేయాసియాలో స్థావరాలు లేకపోవడం, సముద్రం ద్వారా ఆగ్నేయాసియా ఆపరేషన్‌కు మద్దతు ఇవ్వడంలో సమస్యలు ప్రణాళికలను గణనీయంగా కుదించాయి. బ్రిటిషు ఏజెంట్ల చొరబాటు, అమెరికా వైఖరిలో మార్పు, యుద్ధంలో గెలుపోటములు తిరగబడడం వల్ల భారతదేశంలో విప్లవం కోసం చేసిన భారీ కుట్ర ఏనాడూ విజయవంతం కాలేదు.

నిఘా

[మార్చు]

బ్రిటిషు ఇంటెలిజెన్స్ 1911 నాటికే కుట్ర రూపురేఖలను, కొత్త ఆలోచనలనూ గమనించడం ప్రారంభించింది. ఢిల్లీ-లాహోర్ కుట్ర, కోమగట మారు సంఘటన వంటి సంఘటనలు ఇప్పటికే పెద్ద ఎత్తున ఈ నెట్‌వర్కు ఉనికి, భారతదేశంలో విప్లవ అశాంతికి సంబంధించిన ప్రణాళికలు మొదలైన వాటితో క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంటు (సిఐడి) ముందే అప్రమత్తమైంది. ఆ సమయంలో అత్యంత తీవ్రమైన విప్లవ ఉగ్రవాదం ఉన్న బెంగాల్‌పై, కోమగాట మారు నేపథ్యంలో బలమైన మిలిటెంట్ స్థావరంగా వెలికితీసిన పంజాబ్‌పై ప్రభుత్వం దృష్టి సారించి పలు చర్యలు తీసుకుంది. హర్ దయాళ్ సమూహానికి రాష్ బిహారీ బోస్‌తో బలమైన సంబంధాలు ఉన్నట్లు కనుగొన్నారు. ఢిల్లీ బాంబు కేసు నేపథ్యంలో వీళ్లను శుభ్రంగా తుడిచిపెట్టారు. [128]

విచారణ

[మార్చు]

ఈ కుట్రలపై భారతదేశంలో అనేక విచారణలు జరిగాయి. వాటిలో అత్యంత ప్రసిద్ధి చెందిన లాహోర్ కుట్ర విచారణ. 1915 ఫిబ్రవరిలో విఫలమైన ఫిబ్రవరి తిరుగుబాటు తర్వాత ఇది లాహోర్‌లో మొదలైంది. ఇతర విచారణలలో బెనారస్, సిమ్లా, ఢిల్లీ, ఫిరోజ్‌పూర్ కుట్ర కేసులు, బడ్జ్ బడ్జ్ వద్ద అరెస్టయిన వారి విచారణలూ ఉన్నాయి. [129] లాహోర్‌లో, డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1915 ప్రకారం ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసారు. మొత్తం 291 మంది కుట్రదారులపై విచారణ జరిగింది. వీరిలో 42 మందికి మరణశిక్ష, 114 మందికి ఆమరణ జైలుశిక్ష, 93 మందికి వివిధ రకాల జైలు శిక్షలూ పడ్డాయి. వీరిలో చాలా మందిని అండమాన్ దీవుల్లోని సెల్యులార్ జైలుకు తరలించారు. విచారణలో నలభై ఇద్దరు నిందితులను నిర్దోషులుగా భావించి విడుదల చేసారు. లాహోర్ విచారణలో, అమెరికాలో చేసిన కుట్రలను ఫిబ్రవరి తిరుగుబాటు కుట్రకూ నేరుగా లింకు కలిపింది. విచారణ ముగిసిన తరువాత, అమెరికాలో భారతీయ విప్లవోద్యమాన్ని నాశనం చేయడానికీ, దాని సభ్యులను విచారణకు తీసుకురావడానికీ దౌత్య ప్రయత్నాలు గణనీయంగా జరిగాయి. [130][131][132]

అమెరికాలో, ఆనీ లార్సెన్ వ్యవహారాన్ని వెలికితీసిన తర్వాత 1917 నవంబరు 12న శాన్ ఫ్రాన్సిస్కోలోని జిల్లా కోర్టులో హిందూ-జర్మన్ కుట్ర విచారణ ప్రారంభమైంది. గదర్ పార్టీ సభ్యులు, మాజీ జర్మన్ కాన్సుల్ జనరల్, వైస్ కాన్సుల్, శాన్ ఫ్రాన్సిస్కోలోని జర్మన్ కాన్సులేట్ సిబ్బందితో సహా నూట ఐదుగురు వ్యక్తులను విచారించారు. విచారణ 1917 నవంబరు 20 నుండి 1918 ఏప్రిల్ 24 వరకూ జరిగింది. విచారణ చివరి రోజున ప్రధాన నిందితుడైన రామ చంద్ర బ్రిటిషు వారికి గూఢచారి అని నమ్మిన తోటి ప్రతివాది రామ్ సింగ్ కోర్టు గదిలోనే సంచలనాత్మకంగా హత్య చేసాడు. సింగ్‌ను వెంటనే US మార్షల్ కాల్చి చంపాడు.

1917 మేలో, గదర్ పార్టీకి చెందిన ఎనిమిది మంది భారతీయ జాతీయవాదులు బ్రిటన్‌కు వ్యతిరేకంగా సైనిక సంస్థను ఏర్పాటు చేసేందుకు కుట్ర పన్నారనే అభియోగంపై ఫెడరల్ గ్రాండ్ జ్యూరీ అభియోగాలు మోపింది. తరువాతి సంవత్సరాలలో, ఈ ప్రక్రియలు బ్రిటిషు ప్రభుత్వాన్ని సంతృప్తి పరచడానికి రూపొందించబడిన ప్రదర్శనేనని విమర్శలు వచ్చాయి. రిపబ్లికన్ అభిప్రాయాలు, రిపబ్లికన్లతో సంబంధాలు ఉన్న ఐరిష్ వ్యక్తులు జ్యూరీ ఎంపికలోకి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. [133] భారతీయులకు అనుకూలంగా ప్రజల్లో ఉన్న బలమైన మద్దతు కారణంగాను, వెర్సైల్లెస్ ఒప్పందం వలన తిరిగి తలెత్తిన ఆంగ్లోఫోబిక్ భావాల వలనా, గదర్ ఉద్యమం పునరుజ్జీవం పొందింది. [134]

ప్రభావం

[మార్చు]

బ్రిటిషు సామ్రాజ్యం లోపల, అంతర్జాతీయ సంబంధాలలోనూ బ్రిటన్ విధానాలపై ఈ కుట్ర గణనీయమైన ప్రభావాన్ని చూపింది. కుట్ర ఆరంభ ఆలోచనలు సరిహద్దులు, ప్రణాళికలను 1911 నాటికి బ్రిటిషు నిఘా వర్గాలు గుర్తించాయి. కొందరు లొంగిపోయినప్పటికీ దేశంలోని వివిధ ప్రాంతాలలో వివిధ రూపాల్లో పదేపదే తలెత్తుతున్న ఉద్యమం గురించి ఇండియన్ ఇంటెలిజెన్స్ చీఫ్ సర్ చార్లెస్ క్లీవ్‌లాండ్ హెచ్చరిస్తూ, ఈ విప్లవోద్యమం నివురు గప్పిన నిప్పులా విస్తరిస్తోందన్నాడు. [135][136] ఉద్యమాన్ని అణచివేయడానికి భారీ, సంఘటిత, సమన్వయ ప్రయత్నం అవసరం పడింది. 1914లో తారక్ నాథ్ దాస్ ఒక అమెరికన్ పౌరసత్వం పొందడాన్ని అడ్డుకునే ప్రయత్నాలు జరిగాయి. అయితే హర్ దయాళ్‌ని బంధించేందుకు చేసిన ప్రయత్నం విజయవంతమైంది. [137]

రెండవ ప్రపంచ యుద్ధం

[మార్చు]

మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో ఈ కుట్ర విఫలమైనప్పటికీ - ఆ సమయంలో ఉద్యమం అణచివేసారు. అనేకమంది ముఖ్య నాయకులను ఉరితీసారు లేదా జైలులో వేసారు - అనేకమంది ప్రముఖ గదరీయులు భారతదేశం నుండి జపాన్ థాయ్‌లాండ్‌లకు పారిపోయారు. స్వాతంత్ర్యం కోసం విప్లవోద్యమం చెయ్యాలనే భావన తరువాతి తరం భారతీయ నాయకులలో తిరిగి మొలకెత్తింది. ముఖ్యంగా సుభాష్ చంద్రబోస్ 1930ల మధ్యకాలంలో వలసవాద ఆధిపత్యానికి వతిరేకంగా మరింత తీవ్రమైన విధానాన్ని అవలంబించడం ప్రారంభించాడు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఈ నాయకులలో చాలామంది, అటువంటి భావనను పునరుద్ధరించడానికి అక్షరాజ్యాల మద్దతును కోరడంలో కీలక పాత్ర పోషించారు. రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభం నుండి, బోస్ స్వయంగా, బ్రిటిషు పాలనకు వ్యతిరేకంగా విప్లవోద్యమ భావనను చురుకుగా విశ్లేషించాడు. జపాన్‌తో సంభాషించాడు. జర్మనీ పారిపోయి, బ్రిటన్‌కు వ్యతిరేకంగా పోరాడటానికి భారత సాయుధ దళమైన, ఇండియన్ లీజియన్‌ను స్థాపించాడు. [138] ప్రవాస జాతీయవాదులు స్థాపించిన భారత జాతీయ సైన్యానికి నేతృత్వం వహించడానికి అతను ఆగ్నేయాసియాకు తిరిగి వెళ్ళాడు. వీటిలో అత్యంత ప్రసిద్ధమైనవి ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్, భారత జాతీయ సైన్యం, చివరికి ఆగ్నేయాసియాలో అర్జీ హుకుమత్-ఎ-ఆజాద్ హింద్ లను ఏర్పాటు చేసాడు. [139][140]

మూలాలు 

[మార్చు]
  1. Plowman 2003, p. 84
  2. Hoover 1985, p. 252
  3. Brown 1948, p. 300
  4. Plowman 2003, p. 84
  5. Popplewell 1995, p. 4
  6. Plowman 2003, p. 82
  7. Jensen 1979, p. 83
  8. Plowman 2003, p. Footnote 2
  9. Isemonger & Slattery 1919
  10. 10.0 10.1 "Bagha Jatin". whereinthecity.com. Archived from the original on 18 డిసెంబరు 2008. Retrieved 10 December 2007.
  11. Jensen 1979, p. 65
  12. Jensen 1979, p. 67
  13. Strother 2004, p. 308
  14. "Dr. Matt Plowman to have conference paper published". Waldorf College. 14 April 2005. Archived from the original on 15 December 2012. Retrieved 10 December 2007.
  15. Desai 2005, p. 30
  16. Desai 2005, p. 43
  17. Desai 2005, p. 93
  18. Desai 2005, p. 125
  19. Desai 2005, p. 154
  20. Yadav 1992, p. 6
  21. Terrorism in Bengal, Compiled and Edited by A.K. Samanta, Government of West Bengal, 1995, Vol. II, p625.
  22. "Champak-Chatto" And the Berlin Committee". Bharatiya Vidya Bhavan. Archived from the original on 8 జూన్ 2008. Retrieved 4 November 2007.
  23. Strachan 2001, p. 794
  24. Yadav 1992, p. 8
  25. "Champak-Chatto" And the Berlin Committee". Bharatiya Vidya Bhavan. Archived from the original on 8 జూన్ 2008. Retrieved 4 November 2007.
  26. Fischer-Tinē 2007, p. 334
  27. Fischer-Tinē 2007, p. 334
  28. Fischer-Tinē 2007, p. 334
  29. Plowman 2003, p. 84
  30. Plowman 2003, p. 84
  31. Hoover 1985, p. 251
  32. Strachan 2001, p. 798
  33. Gupta 1997, p. 12
  34. "Champak-Chatto" And the Berlin Committee". Bharatiya Vidya Bhavan. Archived from the original on 8 జూన్ 2008. Retrieved 4 November 2007.
  35. Gupta 1997, p. 11
  36. Puri 1980, p. 60
  37. Hopkirk 2001, p. 96
  38. Hoover 1985, p. 251
  39. Hoover 1985, p. 252
  40. Ward 2002, pp. 79–96
  41. 41.0 41.1 Strachan 2001, p. 796
  42. Strachan 2001, p. 793
  43. Deepak 1999, p. 442
  44. Sarkar 1983, p. 148
  45. Brown 1948, p. 303
  46. Plowman 2003, p. 87
  47. Brown 1948, p. 301
  48. Plowman 2003, p. 87
  49. Brown 1948, p. 306
  50. Brown 1948, p. 306
  51. Brown 1948, p. 307
  52. Popplewell 1995, p. 224
  53. Popplewell 1995, p. 225
  54. Fraser 1977, p. 261
  55. Hoover 1985, p. 252
  56. Brown 1948, p. 303
  57. Plowman 2003, p. 90
  58. Gupta 1997, p. 3
  59. Hoover 1985, p. 255
  60. Wilma D (18 May 2006). "U.S. Customs at Grays Harbor seizes the schooner Annie Larsen loaded with arms and ammunition on June 29, 1915". HistoryLink.org. Retrieved 22 September 2007.
  61. Hoover 1985, p. 256
  62. Hoover 1985, p. 252
  63. Wilma D (18 May 2006). "U.S. Customs at Grays Harbor seizes the schooner Annie Larsen loaded with arms and ammunition on June 29, 1915". HistoryLink.org. Retrieved 22 September 2007.
  64. Hoover 1985, p. 256
  65. Brown 1948, p. 304
  66. Plowman 2003, p. 84
  67. Stafford, D. "Men of Secrets. Roosevelt and Churchill". The New York Times. Retrieved 24 October 2007.
  68. Myonihan, D.P. "Report of the Commission on Protecting and Reducing Government Secrecy. Senate Document 105-2". Fas.org. Retrieved 24 October 2007.
  69. Gupta 1997, p. 12
  70. Gupta 1997, p. 11
  71. Gupta 1997, p. 12
  72. Gupta 1997, p. 11
  73. Puri 1980, p. 60
  74. Gupta 1997, p. 12
  75. Gupta 1997, p. 11
  76. 76.0 76.1 76.2 Strachan 2001, p. 796
  77. Gupta 1997, p. 3
  78. Herbert 2003, p. 223
  79. Sareen 1995, p. 14,15
  80. Kuwajima 1988, p. 23
  81. Farwell 1992, p. 244
  82. Corr 1975, p. 15
  83. Sareen 1995, p. 14,15
  84. Herbert 2003, p. 223
  85. Strachan 2001, p. 797
  86. Qureshi 1999, p. 78
  87. Fraser 1977, p. 263
  88. Strachan 2001, p. 800
  89. Hopkirk 2001, p. 189
  90. Strachan 2001, p. 800
  91. Gupta 1997, p. 12
  92. Strachan 2001, p. 802
  93. Strachan 2001, p. 802
  94. Hopkirk 2001, p. 179
  95. Majumdar 1971, p. 382
  96. Strachan 2001, p. 802
  97. Majumdar 1971, p. 382
  98. 98.0 98.1 Fraser 1977, p. 266
  99. Strachan 2001, p. 802
  100. Fraser 1977, p. 267
  101. Fraser 1977, p. 264
  102. Hopkirk 2001, p. 180
  103. Fraser 1977, p. 265
  104. Hughes 2002, p. 453
  105. Hopkirk 2001, p. 98
  106. Hopkirk 2001, pp. 136–140
  107. Jalal 2007, p. 105
  108. Reetz 2007, p. 142
  109. Hughes 2002, p. 466
  110. Hopkirk 2001, p. 160
  111. Sims-Williams 1980, p. 120
  112. Hughes 2002, p. 472
  113. Andreyev 2003, p. 95
  114. Andreyev 2003, p. 87
  115. Andreyev 2003, p. 96
  116. McKale 1998, p. 127
  117. McKale 1998, p. 127
  118. Qureshi 1999, p. 78
  119. Yadav 1992, p. 36
  120. 120.0 120.1 Yadav 1992, p. 35
  121. Yadav 1992, p. 36
  122. McKale 1998, p. 127
  123. Sykes 1921, p. 101
  124. Herbert 2003
  125. Singh, Jaspal. "History of the Ghadar Movement". panjab.org.uk. Retrieved 31 October 2007.
  126. Herbert 2003
  127. Asghar, S.B (12 June 2005). "A famous uprising". dawn.com. Archived from the original on 3 ఆగస్టు 2007. Retrieved 2 November 2007.
  128. Popplewell 1995, p. 200
  129. Chhabra 2005, p. 598
  130. Talbot 2000, p. 124
  131. "History of Andaman Cellular Jail". Andaman Cellular Jail heritage committee. Archived from the original on 9 February 2010. Retrieved 8 December 2007.
  132. Khosla, K (23 June 2002). "Ghadr revisited". The Tribune. Chandigarh. Retrieved 8 December 2007.
  133. Jensen 1979, p. 65
  134. Dignan 1971, p. 75
  135. Hopkirk 2001, p. 41
  136. Hopkirk 1997, p. 43
  137. Dignan 1971, p. 60
  138. Thomson M (23 September 2004). "Hitler's secret Indian Army". bbc.co.uk. Retrieved 2 September 2007.
  139. Fay 1993, p. 90
  140. "Historical Journey of the Indian National Army". National Archives of Singapore. 2003. Archived from the original on 16 మే 2007. Retrieved 7 July 2007.

వనరులు

[మార్చు]