Jump to content

కొండపల్లి

అక్షాంశ రేఖాంశాలు: 16°37′13″N 80°32′36″E / 16.620416°N 80.543407°E / 16.620416; 80.543407
వికీపీడియా నుండి
(కొండపల్లి కొయ్య బొమ్మలు నుండి దారిమార్పు చెందింది)

కొండపల్లి
—  రెవెన్యూయేతర గ్రామం  —
కొండపల్లి కోట
కొండపల్లి కోట
కొండపల్లి కోట
కొండపల్లి is located in Andhra Pradesh
కొండపల్లి
కొండపల్లి
అక్షాంశరేఖాంశాలు: 16°37′13″N 80°32′36″E / 16.620416°N 80.543407°E / 16.620416; 80.543407
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ఎన్టీఆర్ జిల్లా
మండలం ఇబ్రహీంపట్నం
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 33,373
 - పురుషుల సంఖ్య 16,772
 - స్త్రీల సంఖ్య 16,606
 - గృహాల సంఖ్య 8,947
పిన్ కోడ్ 521228
ఎస్.టి.డి కోడ్ 08645
ఆంధ్ర సంస్కృతి జన జీవనం. ఆంధ్రుల కట్టు బొట్టు వేషదారణలను చూపిస్తున్న కొండపల్లి బొమ్మలు

కొండపల్లి బొమ్మలకు ప్రసిద్ధి చెందిన ఈ కొండపల్లి ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన పట్టణం. కొండపల్లి విజయవాడ గుండా పోయే జాతీయ రహదారి 221 మీద విజయవాడకు 16 కి.మీ. దూరములో ఉంది.

సమీప గ్రామాలు

[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో ఈలప్రోలు,ఇబ్రహీంపట్నం, పైదూరుపాడు, గడ్డమనుగు, వెలగలేరు, కొండూరు గ్రామాలు ఉన్నాయి.

రవాణా సౌకర్యాలు

[మార్చు]

హైదరాబాదు-విజయవాడ రైల్వే లైను పై ఈ గ్రామం వుంది.

విద్యా సౌకర్యాలు

[మార్చు]
  1. జిల్లా పరిషత్తు బాలికల ఉన్నత పాఠశాల:- ఈ పాఠశాలలో చదువుచున్న ఎం.సుభద్ర అను విద్యార్థిని 2013 నవంబరు 10న మహారాష్ట్రలోని పూణేలో జరుగనున్న జాతీయస్థాయి బాల్ బాడ్మింటను పోటీలలో రాష్ట్రం తరపున పాల్గొనే జట్టుకి ఎన్నికైనది.
  2. శాంతినగర్ మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల.

కొండపల్లి బొమ్మలు

[మార్చు]

ఈ గ్రామం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కొండపల్లి బొమ్మలకు పుట్టినిల్లు. తేలికైన పొనికి చెక్కతో చేసిన ఈ బొమ్మలు దశాబ్దాల తరబడి ప్రజలను అలరిస్తున్నాయి.ఒకసారి తయారు చేసిన దానిని మూసగా పోసి చేసే వీలులేదు. ఒకసారి తయారు చేసి దానిని ముద్రగుద్దే ప్రశ్నేలేదు. మొదటిది ఎంత సమయం, ఎంత కళాదృష్టి, ఎంత ఏకాగ్రతతో చేసారో రెండవదీ అంతే సమయం, దృష్టి, ఏకాగ్రతలతో చేయబడుతూ కొండపల్లి గ్రామస్తులకు మాత్రమే సాధ్యమైన గొప్ప పనివాడితనం కొండపల్లి బొమ్మలు. వీటిని తేలికైన పొనికి అనే చెక్కతో తయారు చేస్తారు. ముందుగా చెక్క మీద తయారు చేయవలసిన బొమ్మ ఆకారాన్ని చెక్కుతారు. తరువాత రంపపు పొట్టు, చింత గింజల నుండి వచ్చిన పొడితో కావలసిన ఆకారములో మలుస్తారు. బొమ్మలకు ప్రత్యేకంగా వేరే అతకవలసిన భాగాలు, మార్పులు చేస్తారు. తరువాత వాటికి సున్నం పూసి ఎండపెడతారు. ఆ తరువాత ఆరిన సున్నంపై రంగులు పూస్తారు. కొండపల్లి బొమ్మలలో ప్రసిద్ధి చెందినవి ఏనుగు అంబారి -మావటివాడు,నాట్యం చేస్తున్న నృత్యకళాకారిణిల బొమ్మ, పల్లెలలో తలపాగా పంచె కట్టుకొన్న పురుషుల సంఖ్య, చీరలు కట్టుకొన్న స్త్రీల సంఖ్య కల జీవనవ్యవస్థ సూచించే ప్రజల బొమ్మలు ముఖ్యమైనవి. పౌరాణిక ప్రముఖులు, పక్షులు, జంతువులు, పండ్లు, కూరగాయలు, ఇళ్ళు మొదలైన ఎన్నో రూపాల్లో ఈ బొమ్మలు తయారు చేస్తారు. అన్ని తీర్ధ యాత్రా స్థలాల్లోను, హస్తకళా కేంద్రాలలోను ఇవి లభిస్తాయి. ఈ బొమ్మల తయారీలో ఉన్న శైలి, 17 వ శతాబ్దంలో రాజస్థాన్ రాష్ట్రములో బొమ్మల తయారీ శైలి ఒకే విధంగా ఉండడం వల్ల ఈ కళాకారులు రాజస్థాన్ నుండి ఇక్కడకు వలస వచ్చారని భావిస్తారు. కొండపల్లిలో పూర్వం 150 వరకు కుమ్మరి కుటుంబాలు కుండలు తయారు చేసి జీవనం సాగించేవారు. ప్రస్తుతం 10 నుంచి 15మంది మాత్రమే ఈ వృత్తిలో ఉన్నారు.

కొండపల్లి కోటలోని గద్దె

కొండపల్లి కోట

[మార్చు]

ముసునూరి కమ్మరాజుల కాలంలో ఈ కోట నిర్మితమైనది. ఢిల్లీ సుల్తానులను పారద్రోలి ఈ దేశాన్ని పరాయిపాలన నుంచి విముక్తి చేసిన తెలుఁగు వీరుడు ముసునూరి ప్రోలయ రాజ్యాన్ని సుభక్షింగా, శత్రు దుర్బేధ్యంగా మలచే ప్రయత్నంలో ఈ త్రిలింగ దేశంలో అనేక కోటల నిర్మాణాలు చేపట్టాడు. అందులో భాగంగా కొండపల్లి కోట నిర్మాణానికి పూనుకున్నాడు. ఈ కోట నిర్మాణం ప్రోలయ వారసుడైన కాపయ కాలంలో పూర్తి అయింది. కాపయ ఈ కోట నిర్మాణం దిగ్విజయంగా పూర్తి చేసి గుంటూరు జిల్లా కొల్లూరులో శాసనం వేయించాడు. అడపా, దాసరి, అట్లూరి అనే గృహనామాలు కలిగిన కమ్మరాజులు సుమారు 100 ఏళ్లు ఈ కోటని గజపతుల సామంతులుగా పాలించారు. ముసునూరి కమ్మ రాజులని కొండపల్లి కమ్మరాజులు అని వ్యవహరిస్తారు. దీనిలో మూడంతస్తుల రాతి బురుజు ఉంది. ఇక్కడ విరూపాక్ష దేవాలయం ఉంది.

కొండ చుట్టూ శుత్రుదుర్భేద్యమైన ప్రాకారం. రాజమహల్ గోడలపై కళాఖండాలను తీర్చిదిద్దారు. దర్బారు నిర్వహించే రాజమహల్, రాణి, పరివారం నివాసముండే రాణీమహల్, నర్తనశాల, నేటి రైతు బజార్లను తలపించే అంగడి, నేరగాళ్లను ఉంచే కారాగారం, ఆయుధాగారం, ప్రజలు స్నానం చేయడానికి వీలుగా పెద్ద కొలను, రాజ కుటుంబీకుల కోసం మరో కొలను, గుంపులుగా తరలివెళ్లడానికి, ఏనుగులు, గుర్రాలు వెళ్లడానికి వీలుగా రహదారుల నిర్మాణం -ఇవన్నీ ఒక కొండపైనే ఉన్నాయి. కొండపల్లి కోటను ప్రస్తుతము పునర్నిర్మిస్తున్నారు. క్రీశ1687 మధ్య కాలంలో మొగల్ చక్రవర్తి ఔరంగజేబు, తరువాత గోల్కొండ నవాబులు అనంతరం నాజర్ జంగ్ పరిపాలించారు.

సా.శ. 1766లో జనరల్ కాలియేడ్ కోటను ఆక్రమించి, కెప్టెన్ మాడ్గే ఆధ్వర్యంలో ఈ కోటకు కొన్ని మరమ్మతులు చేసినట్లుగా ఆధారాలు ఉన్నాయి. చివరగా కీశ 1767లో బ్రిటీష్ వారు కొండపల్లి కోటను తమ ఆధీనంలోకి తీసుకుని తమ సిపాయీలకు శిక్షణ పాఠశాలను ఏర్పాటు చేశారు. అయితే ఆర్థిక సమస్యలతో క్రీశ1859లో ఈ శిక్షణ పాఠశాలను మూసివేశారు. ఆ తరువాత దీనిని పట్టించుకున్నవారు లేరు. 1962 నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలోకి వచ్చాక రక్షిత కట్టడంగా ప్రకటించారు.

ప్రోలయ వేమారెడ్డి నిర్మించిన కొండపల్లి కోట శిథిలాలు

కొండపల్లి ఖిల్లాకి వెళ్ళేందుకు జూపూడి మీదుగా కొండపైకి రోడ్డుమార్గం ఉంది. కొండపల్లి నుండి నడక మార్గం కూడా ఉంది.

కొండపల్లి కోట -అభివృద్ధి చేసిన తరువాత

గత 10 నెలల నుండి కొండపల్లి కోటకు మరమ్మత్తులు చేస్తున్నారు. అందులో భాగంగా గజశాల తూర్పువైపు కోట గోడలను పటిష్ఠ పరచే పనులు జరుగుచుండగా, 2016,జనవరి-14వతేదీనాడు దేవతామూర్తుల విగ్రహాలు ఆలయ స్తంభాలు వెలుగు చూసినవి. ఈ విగ్రహాలను పరిశీలించిన పురావస్తుశాఖ అధికారులు, వీటిని ముసునూరి కమ్మరాజులు, శ్రీ కృష్ణదేవరాయల కాలంనాటివిగా గుర్తించారు.

ఇతర దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]
  • శ్రీ చెన్నకేశవ రామాలయం:- ఇక్కడ దసరాకు దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా నిర్వహించెదరు. 2014, జూన్-18, బుధవారం నాడు, ఈ ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మూడు ధ్వజస్తంభాలు, రెండు సింహద్వారాలు, ఒక మంటపం ఏర్పాటు చేసెదరు. ఈ పనులకు దేవాదాయ శాఖ రు. 16 లక్షలను మంజూరు చేసింది. ఆలయ యాజమాన్యం రు. ఆరులక్షలను అందించింది. [3] & [9]
  • ఈ గ్రామంలో శివుడు గిరి విరేశ్వర విశ్వేశ్వర స్వామిగా కొలువై సేవలందుకొనుచున్నాడు. ఈ ఆలయంలో కార్తీకమాస మహోత్సవ పూజలు అత్యంత వైభవంగా నెలరోజులూ నిర్వహించెదరు. ఈ ఆలయంలో శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి, గోవిందమాంబల కళ్యాణోత్సవం, 2015, ఫిబ్రవరి-18వ తేదీనాడు వైభవంగా నిర్వహించారు. ఈ ఆలయానికి 17 ఎకరాల మాన్యంభూమి ఉంది. [4] & [10]
  • శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయం స్థానిక ఖిల్లా రహదారిపై, జనార్ధననగర్ లోఉంది.
  • కొండపల్లి గ్రామ మార్కెట్ సెంటర్లో శిథిలావస్థకు చేరిన గంగానమ్మ ఆలయానికి పూర్తిస్థాయిలో మరమ్మత్తులు చేపట్టి, అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పొలిమేరలలోని 13 గ్రామ దేవతల విగ్రహాలకు ప్రత్యేకపూజలు, శాంతిపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతి హోమాన్ని జరిపించి, గ్రామ శాంతికోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, అందంగా అలంకరించిన ఎడ్లబండ్లపై అమ్మవారి గ్రామోత్సవాన్ని నిర్వహించారు. [7]
  • ఇక్కడికి దగ్గరలోని బి-కాలనీలో నెలకొన్న నూకాలమ్మ కొలువు తిరునాళ్ళు, 2014,మార్చి-30 న (ఉగాదికి ముందురోజున) ముగిసి2వి. ఈ సందర్భంగా, అత్యంత భక్తిశ్రద్ధలతో గ్రామోత్సవం నిర్వహించారు. అమృతఘడియలలో అమ్మవారికి పంచామృత ఫలాలతో విశేషస్వపన అభిషేకం నిర్వహించారు. ప్రధాన అర్చకులు, వేదమంత్రాలతో సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. అమ్మవారి మహా అఖండ భక్తిదీప కార్యక్రమం, అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం సహపంక్తి భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. [8]
  • శ్రీ కోదండరామాలయం:-ఈ ఆలయ షష్టమ వార్షికోత్సవం, 2015,మార్చి-5వ తేదీ గురువారం నాడు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి కల్యాణమహోత్న్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గ్రామానికి చెందిన పెద్దల ఆధ్వర్యంలో పూజాధికాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల కోలాటకార్యక్రమాలు మనోరంజితంగా ఉన్నాయి. [11]
  • శ్రీ అష్టలక్ష్మీ సమేత శ్రీ కోదండరామాలయం:- శాంతినగర్ లో నూతనంగా నిర్మితమైన ఈ ఆలయంలో, విగ్రహావిష్కరణ కార్యక్రమాలు 2015,మార్చి-8వ తేదీ ఆదివారం నుండి ప్రారంభమైనవి. 10వ తేదీ మంగళవారం నాడు, క్షీరాధివాస కార్యక్రమ, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం సప్త కలశారాధన, నవకలశారాధన, సర్వకుండేషు శాంతిహోమం, క్షీరాధివాసం, ప్రధాన హోమాలు, విశేషార్చన ప్రవచనాలు నిర్వహించారు. భక్తులు పెద్దసంఖ్యలో హోమ, పూజాధికాలలో పాల్గొన్నారు. సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణం, వేదపఠనం, నిత్యహోమం, ఆదివాసప్రధానహోమం, మంత్రపుష్పం నిర్వహించారు. 11వ తేదీ బుధవారం నాడు, పుత్రకామేష్టి హోమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు, ఈ సందర్భంగా స్వస్తివాచకం, విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం నిర్వహించారు. రాత్రి మంగళవాయిద్యాలతో స్వామివారల గ్రామోత్సవం నిర్వహించారు. కుంభపూజ,విశేషజీవకళాన్యాసం, పంచగవ్యాధివాసాన్ని చేసి, భక్తులకు తీర్ధప్రసాదాలు అందజేసినారు. 12వ తేదీ గురువారం ఉదయం 9 గంటలకు, ఉదయపు పూజలలో భాగంగా, స్వస్తి విష్వక్సేన ఆరాధన, త్రిషవణస్నానం, రత్నన్యాసం కార్యక్రమాలను నిర్వహించారు. ఆ పిమ్మట, అర్చకుల బృందం ఆధ్వర్యంలో హోమాలు, విగ్రహావిష్కరణ కార్యక్రమాలను, భక్తిశ్రద్ధలతో అంగరంగవైభవంగా నిర్వహించారు. అనంతరం కుంభదృష్టి,శాంతికర కళ్యాణం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. [12]
  • 2015,జూన్ నెలలో, కొండపల్లి కోట సమీపంలో, గ్రామస్థులు ఒక వెంకటేశ్వరస్వామివారి విగ్రహాన్ని కనుగొన్నారు. అప్పటి నుండి గ్రామస్థులు ఆ విగ్రహానికి పూజలు నిర్వహించుచున్నారు. [14]
  • శ్రీ లక్ష్మీ గణపతి, భద్రావతీ సమేత శ్రీ భావనాఋషి ఆలయం.

గ్రామ పంచాయతీ

[మార్చు]
  1. కొండిశెట్టి మస్థాన్ రావు, ఈ గ్రామానికి సర్పంచిగా 1959 నుండి 1964 వరకు, 1970 నుండి 1982 వరకు మరియూ జూన్-1982 నుండి 1988 వరకు సర్పంచిగా పనిచేసారు. ఇతను 2015,మే-24 న కాలధర్మం చెందినారు.
  2. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో వెనిగళ్ళ అమ్మాజీ, సర్పంచిగా ఎన్నికైంది.

ప్రముఖులు

[మార్చు]

ఇతర విశేషాలు

[మార్చు]

కొండపల్లిలో పద్మసాలీలు ఎక్కువ. ఇప్పుడు కొన్ని కుటుంబాలు మాత్రమే ఈ వృత్తి చేస్తున్నాయి. వీరిలో దామెర్ల ఇంటి పేరుగల వారు ఉన్న ప్రాంతం దామెర్ల వారి వీధిగా పేరు గాంచింది. వీరు నరసరావుపేట దగ్గర వున్న కుంకలగుంట గ్రామం నుండి వలస వచ్చారని తెలుస్తుంది. వీరు పూర్వీకులు దాసాంజనేయస్వామి విగ్రహాన్ని కొండపల్లి ఖిల్లా మీద నుండి తీసుకువచ్చి దామెర్ల వారి వీధిలో ప్రతిష్ఠించారు. దీనికి మరల దామెర్ల సత్యనారాయణ పున:ప్రతిష్ఠ చేసారు.

గణాంకాలు

[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 29868. ఇందులో పురుషుల సంఖ్య 15347, స్త్రీల సంఖ్య 14521, గ్రామంలో నివాసగృహాలు 6938 ఉన్నాయి.

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]