ధన్‌రాజ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ధన్‌రాజ్
నివాసంహైదరాబాద్
వృత్తినటుడు
జీవిత భాగస్వామిశిరీష[1]
పిల్లలుసుక్కురామ్[1]
తల్లిదండ్రులు
 • సత్యరాజ్[1] (తండ్రి)
 • కమలమ్మ[1] (తల్లి)

ధన్‌రాజ్ ఒక తెలుగు సినీ నటుడు. 2004 లో తేజ దర్శకత్వం వహించిన జై సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు.[2] జగడం, పిల్ల జమీందార్, భీమిలి కబడ్డీ జట్టు అతనికి గుర్తింపు సాధించి పెట్టిన సినిమాలు.[3] ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమంలో ధనాధన్ ధనరాజ్ పేరుతో ఒక బృందాన్ని నడిపాడు.[4]

70 కి పైగా సినిమాల్లో నటించిన తర్వాత నిర్మాతగా మారి ధనలక్ష్మి తలుపు తడితే అనే సినిమాను నిర్మించాడు.[5]

వ్యక్తిగత జీవితం[మార్చు]

ధనరాజ్ తండ్రి సత్యరాజ్ ది పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం. తల్లి కమలమ్మది కృష్ణా జిల్లా, హనుమాన్ జంక్షన్. ధనరాజ్ తండ్రి, కమలమ్మ తండ్రి దగ్గర లారీ క్లీనర్ గా పనిచేసేవాడు. వారిద్దరిదీ ప్రేమ వివాహం. మొదట్లో కమలమ్మ తండ్రి వారి వివాహాన్ని అంగీకరించకపోయినా తరువాత అంతా సర్దుకుపోయారు. ధనరాజ్ పదేళ్ళ వయసులో తండ్రి లారీ ప్రమాదంలో చనిపోయాడు. అతను కొన్నాళ్ళు తాడేపల్లిగూడెంలో, కొన్నాళ్ళు హనుమాన్ జంక్షన్ లో సాగింది. చిన్నప్పుడే సినిమా పోస్టర్లు చూసి సినిమాల్లోకి వెళ్ళాలనుకునే వాడు. [1]

ధన్‌రాజ్ తల్లికి చెప్పకుండా కేవలం వంద రూపాయలతో తన స్వస్థలాన్ని వదిలి హైదరాబాదుకు వచ్చాడు. కొద్ది రోజులు ఫిలిం నగర్ లో తిరిగి ఒక హోటల్లో సర్వర్ గా కుదిరాడు. సర్వర్ గా పనిచేస్తూనే సినిమా ఆఫీసుల కోసం ఆరా తీసేవాడు. పది రోజుల తర్వాత తల్లికి విషయం తెలిసి కుమారుడిని వదిలి ఉండలేక, సహాయంగా ఉండటం కోసం ఆమె కూడా హైదరాబాదుకు వచ్చి అపోలో ఆస్పత్రిలో ఆయాగా చేరింది. కొద్దిరోజులకు ధనరాజ్ కు డ్యాన్స్ మాస్టర్ విజయ్ తో పరిచయం అయ్యింది. ఆయన సూపర్ స్టార్ ఫిలిం ఇన్స్టిట్యూట్ పేరుతో ఒక యాక్టింగ్ స్కూల్ నడిపేవాడు. ఆయన దగ్గర రెండేళ్ళు పనిచేస్తూ ఆయన లేనప్పుడు సంస్థ బాగోగులు చూసుకునేవాడు. ఆ సంస్థలోనే ధనరాజ్ కు జబర్దస్త్ లో తన తోటి నటుడు చమ్మక్ చంద్ర, సహాద దర్శకుడు క్రాంతి పరిచయమయ్యారు. అలా తేజ సినిమాలో జై లో అవకాశం వచ్చింది. ఆ సినిమాలో కొడుకును చూసి ఆమె సంతోషించింది. ఆ సినిమాలో పని చేస్తున్నపుడే మరో నటుడు వేణు తో పరిచయమైంది. జగడం సినిమా చేస్తున్నపుడే తల్లికి క్యాన్సర్ అని తేలింది. ఆ సినిమా పూర్తవక ముందే ఆమె చనిపోయింది.[1]

యాక్టింగ్ స్కూల్ నడిపిన అనుభవంతో తనే సొంతంగా మరో యాక్టింగ్ స్కూల్ ప్రారంభించాలనుకున్నాడు. ఫిలిం నగర్ లో స్టార్ ఫిలిం ఇన్స్టిట్యూట్ పేరుతో ఓ సంస్థను ప్రారంభించాడు. ఆ సంస్థలో నాట్యంలో శిక్షణ ఇవ్వడం కోసం శిరీష అనే కూచిపూడి నర్తకిని సంప్రదించాడు. ఆమె వచ్చిన తొలిరోజే ఆమెను ప్రేమిస్తున్నట్లు చెప్పాడు. మరుసటి రోజే అతని తల్లి చనిపోయింది. చేతిలో ఉన్న డబ్బంతా ఇన్స్టిట్యూట్ కోసం అడ్వాన్సు ఇచ్చేయడంతో సహాయం కోసం ఎవరిని అడగాలో తెలియక శిరీషకే ఫోన్ చేశాడు. ఆమె తన చెవి దిద్దులు అమ్మి సహాయం చేసింది. మరుసటి రోజే ఆమెను పెళ్ళి చేసుకోమని అడిగాడు. అతనిలోని నిజాయితీ నచ్చి ఆమె అందుకు అంగీకరించింది. అలా తల్లి చనిపోయిన మూడో రోజే జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిలో శిరీషతో అతని వివాహం జరిగింది.[1]

తనకు కష్టకాలంలో వేషాలిచ్చి ఆదుకున్న దర్శకుడు సుకుమార్, హీరో రాం పేరు మీదుగా తన కుమారుడికి సుక్కురామ్ అని పేరు పెట్టుకుని తన కృతజ్ఞతను చాటుకున్నాడు ధనరాజ్.

కెరీర్[మార్చు]

రామ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన జగడం సినిమాలో నాంపల్లి సత్తి పాత్రకు ఎంపికయ్యాడు. ఆ సినిమా అతని కెరీర్ ని మలుపు తిప్పింది. తరువాత అల్లు అర్జున్ హీరోగా నటించిన పరుగు సినిమాలో హీరో స్నేహితుడి వేషం దక్కింది. తరువాత వెంట వెంటనే యువత, గోపి గోపిక గోదావరి లాంటి సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.[1]

తను స్వంతంగా యాక్టింగ్ స్కూల్ ప్రారంభంలోనే వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. అలా సుమారుగా 80 సినిమాల్లో దాకా నటించాడు. అదే సమయంలో ఈటీవీలో ప్రసారమైన జబర్దస్త్ కార్యక్రమం కూడా అతనికి మంచి పేరు తెచ్చి పెట్టింది. అతన్ని ఇంటింటికీ పరిచయం చేసింది. తరువాత వచ్చిన పిల్ల జమీందార్, కెమెరామెన్ గంగతో రాంబాబు, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, గోపాల గోపాల సినిమాల్లో చెప్పుకోదగ్గ పాత్రలలో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు.

పిలవని పేరంటం సినిమాలో ధన్‌రాజ్, మంచు లక్ష్మి సరసన నటించాడు.[6]

నిర్మాత[మార్చు]

సాయి అచ్యుత్ అనే దర్శకుడని పరిచయం చేస్తూ ధనరాజ్ హీరోగా ఓ చచ్చినోడి ప్రేమకథ అనే సినిమా మొదలై నిర్మాత సమస్యలతో కొద్దిరోజులకు ఆగిపోయింది. సాయి అచ్యుత్ కెరీర్ కోసం ధనరాజ్ చాలా మందిని కలిశాడు కానీ ఆ సినిమా తీయడానికి ఎవరూ ముందుకు రాలేదు. దాంతో ధనరాజ్ కథ ప్రధానంగా ఉన్న సినిమా తీద్దామని ధనలక్ష్మి తలుపు తడితే సినిమాతో తనే నిర్మాతగా మారి అచ్యుత్ కి దర్శకుడిగా అవకాశం ఇచ్చాడు. ఈ సినిమాకు ధనరాజ్ తో పాటు రామసత్యనారాయణ అనే మరో నిర్మాత, అమెరికాలో ధనరాజ్ కి పరిచయమైన ప్రసాద్, మరి ప్రతాప్ లు ఈ సినిమా నిర్మాణంలో భాగస్వాములయ్యారు.

సినిమాలు[మార్చు]

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 జీవి. "ధనరాజ్ బర్త్ డే ఇంటర్వ్యూ". idlebrain.com. జీవి. Retrieved 27 September 2016.
 2. "Dhanraj - Business of Tollywood". Business of Tollywood. మూలం నుండి 25 నవంబర్ 2014 న ఆర్కైవు చేసారు. Retrieved 30 November 2014.
 3. శశిధర్, ఎ. ఎస్. "Tollywood's new funny men". timesofindia.indiatimes.com. టైమ్స్ న్యూస్ నెట్వర్క్. Retrieved 27 September 2016.
 4. "ETV Telugu Jabardasth Katharnak Comedy Show,Nagababu,Roja,Jabardasth Latest All Episodes Online". Smarttalkies.com. Retrieved 30 November 2014. Cite web requires |website= (help)
 5. "Interview : Dhanraj- I have invested all my hard earned money". 123telugu.com. మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్. Retrieved 27 September 2016.
 6. "Promotional poster" (JPG). Pbs.twimg.com. Retrieved 30 November 2014. Cite web requires |website= (help)
 7. "Pilavani Perantam Movie Opening/Launch - Dhanraj, Lakshmi Manchu - Gulte.com". YouTube. Retrieved 30 November 2014.
 8. "Dhanraj - Business of Tollywood". Business of Tollywood. మూలం నుండి 25 నవంబర్ 2014 న ఆర్కైవు చేసారు. Retrieved 30 November 2014.
 9. "jeevi review for Adda". idlebrain.com. Retrieved 16 July 2019. Cite web requires |website= (help)
 10. "Kevvu Keka Movie Review, Rating". gulte.com. Retrieved 16 July 2019. Cite web requires |website= (help)
"https://te.wikipedia.org/w/index.php?title=ధన్‌రాజ్&oldid=2805708" నుండి వెలికితీశారు