పాకాల యశోదారెడ్డి
పాకాల యశోదారెడ్డి | |
---|---|
జననం | |
మరణం | 2007 అక్టోబరు 7 హైదరాబాదు | (వయసు 78)
జాతీయత | భారతీయురాలు |
విద్య | ఎం.ఎ. (తెలుగు), ఎం.ఎ.(సంస్కృతం), పి.హెచ్.డి., డి.లిట్. |
విద్యాసంస్థ | ఉస్మానియా విశ్వవిద్యాలయం, అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం |
వృత్తి | ఆచార్యులు |
తెలుగు శాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయం | |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | రచయిత్రి, కవయిత్రి |
గుర్తించదగిన సేవలు | ఎచ్చమ్మ కథలు, మావూరి ముచ్చట్లు |
జీవిత భాగస్వామి | పాకాల తిరుమల్ రెడ్డి |
తల్లిదండ్రులు | కాశిరెడ్డి, సరస్వతమ్మ |
పాకాల యశోదారెడ్డి ( ఆగష్టు 8, 1929 - అక్టోబర్ 7, 2007) ప్రముఖ రచయిత్రి. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో ఆచార్యులుగా పనిచేసి, పదవీ విరమణ చేసింది. ఆమె ధర్మశాల, ఎచ్చమ్మ కథలు తదితర కథాసంపుటులను వెలువరించింది. తెలంగాణ సజీవ భాషను ఆమె తన రచనల్లో వాడి పలువురి మన్ననలు పొందింది. ఆమె రాసిన కవితాసంపుటి కూడా వెలువడింది. పలు సాహిత్య విమర్శనా గ్రంథాలు రాసింది. తెలుగు ప్రాచీన సాహిత్యంపై ఆమె చేసిన ప్రసంగాలు పండితుల మన్ననలు పొందాయి. ఆకాశవాణిలో తెలంగాణ మాండలికంలో ప్రసంగం చేసిన తొలి రచయితగా ఆమె పేరు పొందింది. ఆమె ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షురాలుగా కూడా పనిచేసింది.
బాల్యం
[మార్చు]యశోదారెడ్డి 1929, ఆగష్టు 8 న మహబూబ్ నగర్ జిల్లా (ప్రస్తుతం నాగర్‌కర్నుల్ జిల్లా), బిజినేపల్లి లో జన్మించింది.[1].సరస్వతమ్మ, కాశిరెడ్డి ఈమె తల్లిదండ్రులు [2]
విద్యాభ్యాసం
[మార్చు]యశోదారెడ్డి మూడవ తరగతి వరకు మహబూబ్ నగర్ లో, ఉన్నత పాఠశాల విద్యను హైదరాబాద్, నారాయణగూడలోని బాలికల ఉన్నత పాఠశాలలోను పూర్తి చేసింది. రాజబహద్దూర్ వెంకట్రామిరెడ్డి ప్రోత్సాహంతో కళాశాల విద్య కొసాగించి, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగు, సంస్కృత భాషలలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేసింది.జర్మన్ భాషలో, భాష శాస్త్రంలో డిప్లొమా చేసింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే తెలుగులో హరివంశాలు" అను అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టాను పొందింది. 1976లో అలీఘర్ విశ్వవిద్యాలయం నుండి డి.లిట్ అందుకుంది. యశోదారెడ్దికి హిందీ, ఉర్దూ, కన్నడ భాషల్లో ప్రావీణ్యంతో పాటు, జర్మన్ భాష తో కూడా పరిచయమున్నది.
జీవిత భాగస్వామి
[మార్చు]ఆమె భర్త ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు పాకాల తిరుమల్ రెడ్డి. జె.జె.ఆర్ట్ కళాశాలలో చదువుకుని, కొన్నాళ్ళు లాహోర్లో పనిచేసి హైదరాబాదు తిరిగి వచ్చిన తిరుమలరెడ్డి తెలంగాణ ప్రాంతంలో స్త్రీలు చదువుకుని వేదికలు ఎక్కి మాట్లాడటం అరుదైన కాలంలో ఒక పాఠశాల ప్రసంగంలో ఆమె వక్తృత్వ ప్రతిభను చూసి, పి.టి.రెడ్డి ఆకర్షితుడై 1947లో ప్రేమ వివాహం చేసుకున్నాడు.[3] తిరుమల్ రెడ్డి గీసిన అనేక చిత్రాలకు ఆమే స్ఫూర్తి. యశోదారెడ్డి కూడా స్వతహాగా కళాపిపాసి. ఆమె రకరకాల ఇత్తడి విగ్రహాలను హాబీగా సేకరించేది. పి.టి రెడ్డి సాంగత్యంతో వాటిలోని కళానైపుణ్యాన్ని, వైెభవాన్ని ఆమె గుర్తించగలిగేవారు. భర్త చిత్రకళా ప్రదర్శన ఏర్పాటు చేసినపుడు ఒక కార్యకర్తగా పని చేసి అది విజయవంతం అయ్యేందుకు దోహదపడేది.[4]
వృత్తి జీవితం
[మార్చు]1955లో హైదరాబాద్, కోఠి మహిళా కళాశాలలో అధ్యాపకురాలిగా ఉద్యోగ జీవితం ప్రాంభించింది. తరువాత రీడర్‌గా, ప్రొఫెసర్‌గా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పనిచేసి, 1989లో పదవీ విరమణ చేసింది.[5]
కథారచయిత్రిగా...
[మార్చు]యశోదారెడ్డి వందకు పైగా కథలు వ్రాసినా వాటిలో 63 మాత్రమే పుస్తక రూపంలో వచ్చినవి. ఈమె ప్రచురించిన మూడు కథా సంపుటాల్లో, మావూరి ముచ్చట్లు (1973) కథా సంపుటి 1920-40 నాటి తెలంగాణ గ్రామీణ జీవన విధానాన్ని చిత్రీకరిస్తే, ఎచ్చమ్మ కథలు (1999) 1950-70 నాటి తెలంగాణ సంస్కృతికి ప్రతీకలు, ధర్మశాల (2000) కథా సంపుటి 1980-1990 నాటికి తెలంగాణ సమాజంలో వచ్చిన మార్పులకు దర్పణం పట్టింది. ఈ మూడు కథా సంపుటాల్లో ఈమె తెలంగాణ భాషను, యాసను, సంస్కృతిని, సామాజిక జీవితాన్నిఅక్షర బద్ధం చేసింది.[6] మావూరి ముచ్చట్లు, ఎచ్చమ్మ కథలు, పాలమూరు జిల్లా మాండలికంలో వ్రాస్తే, ధర్మశాల కథా సంపుటిని మాత్రం వ్యవహారిక తెలుగు భాషలో వ్రాసింది.
యశోదారెడ్డి కథలు తెలంగాణ జనజీవనసంస్కృతిను, తెలంగాణా మాండలిక నుడికారానికి అద్దం పడుతున్నవి. ఎచ్చమ్మ కథలకు ముందుమాటలో "ఒక జాతి సంస్కృతిలో ఆ జాతి జీవనవిధానం ప్రతిఫలిస్తుంది. ఈ సంస్కృతీ సర్వస్వం ఆ జాతి భాషలో నిక్షిప్తమై జీవిస్తుంది. ఆ భాష ఆ జాతికి ప్రత్యేకమైన ఆచార వ్యవహార, ఆర్థిక, రాజకీయ, సామాజిక మూలధాతువులను జీర్ణించుకొని రససిద్ధిని పొంది జాతీయాల్లో, పలుకుబళ్లలో, సామెతల్లో పొందుపడి ప్రభుత్వాన్ని నెరుపుతుంది. ఒక భాషలో ఒక నానుడి కానీ, సామెత కానీ, జాతీయం కానీ అలవోకగా పుట్టదు. ఆయా జాతీయులు, తలలు పండినవారి అనుభవాన్ని వీడబోసి నిగ్గుదేల్చిన సారమే ఈ నుడికారపు ఇంపుసొంపులు. అందుకే అవి భాషకు జీవనాడి. ప్రాణ ధాతువుల వంటివి అని అభిప్రాయడిన యశోదారెడ్డి కథల నిండా తెలంగాణా నుడికారపు సొంపులకు పెద్దపీట వేసింది.[7]
కవయిత్రిగా...
[మార్చు]యశోదారెడ్డి కథారచయిత్రిగానే కాకుండా కవయిత్రిగానూ ప్రసిద్డులే. ఆమె రాసిన కవితలు అనేక పత్రికలలో ముద్రించబడ్డాయి. స్వయంగా తానే తన కవితలను ' ఉగాదికి ఉయ్యాల , భావిక అనే రెండు సంపుటాలగా వెలువరించారు.[8]. మలేషియాలో జరిగిన తెలుగు సమ్మేళనంలో కవయిత్రిగా పాల్గొని, ప్రశంసలందుంది.
రచనలు
[మార్చు]- ద్విపద వాజ్మయం
- ప్రబంధ వాజ్మయం
- భారతీయ చిత్రకళ
- భాగవత సుధ
- మా ఊరి ముచ్చట్లు (1973)
- ఎచ్చమ్మ కథలు (1999)
- ధర్మశాల (2000)
- ఉగాదికి ఉయ్యాల
- భావిక
ఇతరులతో కలిసి...
[మార్చు]- కావ్యానుశీలనం (డాక్టర్ ఎం.కులశేఖరరావుతో కలిసి)
- చిరు గజ్జెలు (ఆళ్వార్‌స్వామి, సి. నారాయణరెడ్డిలతో కలిసి)
సంపాదకత్వం-పీఠికలు
[మార్చు]పారిజాతాపహరణం, ఉత్తర హరివంశం, తెలుగు సామెతలు, ఆంధ్ర క్రియా స్వరూపమణి దీపిక మొదలగు పుస్తకాలకు సంపాదకత్వం వహించి, విలువైన పీఠికలను రాసి, వెలువరించింది[2].
అకాడమీలతో అనుబంధం
[మార్చు]ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ, లలిత కళా అకాడమీ, సంగీత అకాడమీలలో సభ్యురాలిగా పనిచేసింది. ఆంధ్ర సారస్వత పరిషత్, జానపద కళా సాహిత్య సంస్థలతోనూ ఆమెకు అనుబంధం ఉంది.
మరణం
[మార్చు]యశోదారెడ్డి 2007, అక్టోబర్ 7 న హైదరాబాదులో మరణించింది.
బయటి లంకెలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ పాలమూరు ఆధునిక యుగ కవుల చరిత్ర, రచన ఆచార్య ఎస్వీ రామారావు, పేజీ 76
- ↑ 2.0 2.1 మహబూబ్ నగర జిల్లా సర్వస్వం, సంపాదకులు:బి.ఎన్. శాస్త్రి, మూసి పబ్లికేషన్స్, హైదరాబాద్,1993, పుట -661
- ↑ A scholarly voice - The Hindu October 26, 2007
- ↑ ఎచ్చమ్మ కథల యశోదమ్మ - సూర్య పత్రిక[permanent dead link]
- ↑ పి.యశోదారెడ్డి - రాగం భూపాలం బ్లాగు - పి.సత్యవతి
- ↑ తొలితరం రచయిత్రి యశోదారెడ్డి - ప్రజాశక్తి 15 Sep 2013[permanent dead link]
- ↑ ఎచ్చమ్మ కతల యశోదారెడ్డి - వన్ ఇండియా తెలుగు - జూలై 4, 2002
- ↑ పాలమూరు కవిత, సంపాదకులు: భీంపల్లి శ్రీకాంత్, పాలమూరు సాహితి, మహబూబ్ నగర్, 2004, పుట-157
- All articles with dead external links
- Pages using infobox person with unknown parameters
- Infobox person using religion
- నాగర్‌కర్నూల్ జిల్లా కవులు
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- తెలుగు రచయిత్రులు
- ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘ అధ్యక్షులు
- 1929 జననాలు
- 2007 మరణాలు
- ఉస్మానియా విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్ధులు
- నాగర్‌కర్నూల్ జిల్లా రచయిత్రులు
- నాగర్‌కర్నూల్ జిల్లా కవయిత్రులు