అష్టదిగ్గజములు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

అష్ట దిగ్గజాలు అంటే "ఎనిమిది దిక్కుల ఉండే ఏనుగులు" అని అర్ధం. హిందూ పురాణాలలో ఎనిమిది దిక్కులనూ కాపలా కాస్తూ ఎనిమిది ఏనుగులు ఉంటారయని ప్రతీతి. ఇవే అష్టదిగ్గజాలు. అదే విధంగా శ్రీ కృష్ణదేవరాయల ఆస్థానంలోని ఎనిమిది మంది కవులను అష్టదిగ్గజాలు అని అంటారు.

పురాణాలలో అష్టదిగ్గజాలు[మార్చు]

 1. ఐరావతం
 2. పుండరీకం
 3. వామనం
 4. కుముదం
 5. అంజనం
 6. పుష్పదంతం
 7. సార్వభౌమం
 8. సుప్రతీకం

కృష్ణదేవరాయలు ఆస్థానంలో[మార్చు]

విజయ నగర చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయల ఆస్థానంలోని ఎనిమిది మంది కవులు అష్టదిగ్గజాలుగా తెలుగు సాహితీ సంప్రదాయంలో ప్రసిద్ధులయ్యారు. వీరికి కడప జిల్లాలోని తిప్పలూరు గ్రామాన్ని ఇచ్చినట్లు శాసనాధారాన్ని బట్టి తెలుస్తూంది. అష్టదిగ్గజములు ఎవరెవరనే విషయమై చరిత్రకారులలో భిన్నాభిప్రాయాలున్నాయి. ఈ క్రింది వారు అయి ఉండవచ్చు అని ఒక భావన.

 1. అల్లసాని పెద్దన
 2. నంది తిమ్మన
 3. ధూర్జటి
 4. మాదయ్యగారి మల్లన లేక కందుకూరి రుద్రకవి
 5. అయ్యలరాజు రామభధ్రుడు
 6. పింగళి సూరన
 7. రామరాజభూషణుడు (భట్టుమూర్తి)
 8. తెనాలి రామకృష్ణుడు

రాయలు సర్సవతీ పీఠాన్ని పరివేష్టించి ఎనమండుగురు కవులు కూర్చొనేవారని కథ ఉంది. కృష్ణదేవరాయలు ఆస్థానంలో అష్టదిగ్గజాలుగా మన్ననలందుకొన్న ఈ ఎనిమిదిమందీ నిజంగా తెలుగు కవికవులేనా, వారి పేర్లు పై జాబితాలోనివేనా అన్న విషయంపై సాహితీ చరిత్రకారులలో భిన్నభిప్రాయాలున్నాయి. పింగళి లక్ష్మీకాంతం ఈ విషయంపై ఇలా పరిశీలించాడు.[1]

కుమార ధూర్జటి వ్రాసిన కృష్ణరాయ విజయము అనే గ్రంధంలో

సరస సాహిత్య విస్ఫురణ మొనయ
సార మధురోక్తి మాదయగారి మల్ల
నార్యుడల యల్లసాని పెద్దనార్యవరుండు
ముక్కు తిమ్మన మొదలైన ముఖ్య కవులు

అనే పద్యం ఉంది.

అష్టదిగ్గజాలలో ఐదుగురి పేర్లు నిశ్చయంగా చెప్పవచ్చును -

 1. అల్లసాని పెద్దన : కృష్ణరాయలకు ఆప్తుడు. తన కృతిని రాయలకు అంకితమిచ్చినాడు.
 2. నంది తిమ్మన : తన కృతిని రాయలకు అంకితమిచ్చినాడు. రాయల వంశముతో తిమ్మన వంశమునకు పూర్వమునుండి అనుబంధమున్నది. నంది మల్లయ, ఘంట సింగయలు తుళువ వంశమునకు ఆస్థాన కవులు.
 3. అయ్యలరాజు రామభద్రుడు : ఇతని సకలకథాసార సంగ్రహమును రాయల యానతిపై ఆరంభించినట్లు, రాయల కాలంలో అది పూర్తికానట్లు పీఠికలో తెలుస్తున్నది. రామాభ్యుదయము మాత్రం రాయల అనంతరం వ్రాసి రాయల మేనల్లడు అళియ రామరాజుకు అంకితమిచ్చాడు.
 4. ధూర్జటి : రాయల ఆస్థానంలో మన్ననలు అందుకొన్నాడు. ధూర్జటి తమ్ముని మనుమడు కుమార ధూర్జటి వ్రాసిన కృష్ణరాయ విజయంలో ఈ విషయం చెప్పబడింది. జనశృతి కూడా ఇందుకు అనుకూలంగానే ఉంది.
 5. మాదయగారి మల్లన : ఇతడు అష్ట దిగ్గజాలలో ఒకడని చెప్పడానికి కూడా కుమార ధూర్జటి రచనయే ఆధారం. మల్లన తన గ్రంధాన్ని కొండవీటి దుర్గాధిపతి, తిమ్మరుసు అల్లుడు అయిన నాదెండ్ల అప్పామాత్యునకు అంకితమిచ్చాడు.


ఈ ఐదుగురు కాక తక్కిన మువ్వురి పేర్లు నిర్ణయించడానికి తగిన ఆధారాలు లేవు. ఊహలలో ఉన్న పేర్లు - (1) తాళ్ళపాక చిన్నన్న (2) పింగళి సూరన (3) తెనాలి రామకృష్ణుడు (4) కందుకూరి రుద్రయ్య (5) రామరాజ భూషణుడు (6) ఎడపాటి ఎఱ్ఱన (7) చింతలపూడి ఎల్లన. ఈ విషయం నిర్ణయించడానికి వాడదగిన ప్రమాణాలు ...

 • అతను రాయల సమకాలికుడయ్యుండాలి
 • రాయల ఆస్థానంలో ప్రవేశం కలిగి ఉండాలి

ఇలా చూస్తే తాళ్ళపాక చిన్నన్న (పరమయోగి విలాసము, అష్టమహిషీ కళ్యాణము వంటి గ్రంధముల రచయిత) బహుశా తాళ్ళపాక అన్నమయ్య కొడుకో, మనుమడో కావలెను. ఇతడు రాయల సమకాలికుడు కావచ్చును. అష్టదిగ్గజాలలో ఒకడైయుండే అవకాశం ఉంది. కందుకూరి రుద్రకవి రాయల సరస్వతీ మహలు ఈశాన్యంలో కూర్చొనేవాడని నానుడి. ఇతని నిరంకుశోపాఖ్యానము 1580లో వ్రాయబడినది అనగా ఈ కవి చిన్నతనములోనే రాయలు గతించియుండవలెను. రామరాజభూషణుని వసుచరిత్ర తళ్ళికోట యుద్ధం తరువాత వ్రాయబడినట్లుగా అనిపిస్తుంది. కనుక ఇతని చిన్నవయసులోనే రాయల ఆస్థానంలో ఉండడం అనూహ్యం. పింగళి సూరన జననం రాయల మరణానికి 25 సంవత్సరాలముందు కావచ్చును కనుక అతడు కూడా అష్టదిగ్గజకవులలో ఉండే అవకాశం లేదు. అంతేగాక సూరన తండ్రికి రాయలు నిడమానూరు అగ్రహారం ఇచ్చినట్లు తెలుస్తున్నది. తెనాలి రామకృష్ణకవి కాలం ఊహించడం చాలా కష్టంగా ఉంది. ఉద్భటారాధ్య చరిత్ర బహుశా రాయల కాలంనాటి గ్రంధం. పాండురంగ మహాత్మ్యం రాయలు తరువాత వ్రాసినది.

ఈ పరిశీలనను ముగిస్తూ పింగళి లక్ష్మీకాంతం చేసిన వ్యాఖ్యలు గమనించదగినవి - "రాయలు సరస్వతీ మహలులోని ఎనిమిదిమంది కవులు తెలుగువారే కానక్కరలేదు. రాజనీతిపరంగా వివిధ భాషలకు, ప్రాంతాలకు ప్రాతినిధ్యం ఉండిఉండాలి. ఆయన తెనుగురాజు, ఆయన రాజ్యము తెనుగు రాజ్యము అయినందును ఆస్థానంలో ఐదు స్థానాలు తెలుగు కవులకు లభించాయి. అందరూ తెలుగువారేనని చరిత్రకారులెవరైనా వ్రాయదలచినచో చిక్కులు వచ్చును"

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. పింగళి లక్ష్మీకాంతం - ఆంధ్ర సాహిత్య చరిత్ర - ప్రచురణ: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు (2005) ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యంఅష్టదిగ్గజములు
అల్లసాని పెద్దన | నంది తిమ్మన | ధూర్జటి | మాదయ్యగారి మల్లన | అయ్యలరాజు రామభధ్రుడు | పింగళి సూరన | రామరాజభూషణుడు | తెనాలి రామకృష్ణుడు