గురువాయూరు
?గురువాయూరు కేరళ • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 10°21′N 76°12′E / 10.35°N 76.2°ECoordinates: 10°21′N 76°12′E / 10.35°N 76.2°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
జిల్లా (లు) | త్రిసూర్ జిల్లా |
జనాభా | 21,187 (2001 నాటికి) |
కోడులు • పిన్‌కోడ్ • ప్రాంతీయ ఫోన్ కోడ్ • వాహనం |
• 680101 • ++ 91 0487 • KL-46 |
గురువాయూరు (Guruvayoor) కేరళలోని పవిత్రమైన విష్ణుక్షేత్రం. ఇది త్రిసూర్ జిల్లాలోని పట్టణం, పురపాలకసంఘం. దక్షిణ ద్వారకగా పిలవబడే ఈ క్షేత్రంలో శ్రీకృష్ణుడు 'గురువాయూరప్పన్' అనే పేరుతో కొలవబడుతున్నాడు.నాలుగు చేతులలో పాంచజన్య శంఖం, సుదర్శన చక్రం, కౌమోదకం, పద్మాలయాలను ధరించి.. తులసి మాలలతో, ముగ్ధ మనోహర రూపంతో అలరించే బాలగోపాలుడి ఆలయం "గురువాయూర్". కేరళలోని త్రిసూర్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఆలయంలోని స్వామిని కన్నన్, ఉన్నికృష్ణన్ (బాలకృష్ణుడు), ఉనికన్నన్, గురువాయురప్పన్ అనే పేర్లతో కొలుస్తుంటారుశ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్ఠకు ముఖ్య కారకులు గురు - వాయువులు కాబట్టి ఈ ఊరిని 'గురువాయూరు' (గురువు+వాయువు+ఊరు) గా నిర్ణయించారు.
వ్యుత్పత్తి[మార్చు]
శ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్ఠకు ముఖ్య కారకులు గురు - వాయువులు కాబట్టి ఈ ఊరిని 'గురువాయూరు' (గురువు+వాయువు+ఊరు) గా నిర్ణయించారు. శ్రీకృష్ణ దేవుడిని 'గురువాయూరప్పన్' అని భక్తిభావంతో పిలుస్తారు. దక్షిణ భారతంలో 'అప్ప' అనగా తండ్రి అనీ ప్రభువు, దేవుడు అనీ అర్థాలున్నాయి.
జనాభా గణాంకాలు[మార్చు]
2001 జనాభా లెక్కల ప్రకారం,[1] గురువాయూరు జనాభా 21,187. వీరిలో పురుషులు 46%, స్త్రీలు 54%. ఇక్కడ సగటు అక్షరాస్యత 85 %, జాతీయ రేటు 59.5% కన్నా చాలా ఎక్కువ. ఇక్కడ 10% కన్నా తక్కువ మంది పిల్లలు.
గురువాయూరు శ్రీకృష్ణాలయం[మార్చు]
పాతాళశిల[మార్చు]
ఐదువేల సంవత్సరాలక్రితం నాటిదిగా చెప్పే ఆలయ గర్భగుడిలోని నారాయణ విగ్రహం పౌరాణిక ప్రాశస్త్యమైనది. ఈ విగ్రహాన్ని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురూ ఆరాధించారని పురాణేతిహాసాలు చెబుతున్నాయి. పాతాళశిలతో తయారైన ఈ విగ్రహాన్ని వెుదట శివుడు బ్రహ్మకు ఇచ్చాడనీ ఆయన దాన్ని సంతానంకోసం తపిస్తోన్న సూతపాశరుషికి ప్రసాదించాడనీ ఆయన నుంచి వారసత్వంగా కశ్యప ప్రజాపతి అందుకోగా ఆయన దాన్ని వసుదేవుడికి అనుగ్రహించాడనీ, తండ్రి నుంచి దాన్ని శ్రీకృష్ణుడు అందుకుని ద్వారకలో ప్రతిష్ఠించి పూజించాడనీ పురాణాలు చెబుతున్నాయి. స్వర్గారోహణ సమయంలో కృష్ణుడు తన శిష్యుడైన ఉద్ధవుని పిలిచి 'త్వరలోనే ద్వారక సముద్రంలో మునిగిపోతుందనీ అప్పుడు ఈ విగ్రహం నీళ్లలో తేలుతుందనీ దాన్ని దేవతల గురువైన బృహస్పతికి అందజేయమ'నీ చెప్పాడని పురాణప్రతీతి. ఉద్ధవుని సందేశం ప్రకారం బృహస్పతి- వాయుదేవుడి సహాయంతో కేరళ తీరానికి వచ్చాడట. అక్కడ ఓ కోనేరు సమీపంలో శివుడు తపస్సు చేస్తూ కనిపించి ఆ విగ్రహాన్ని కోనేటి ఒడ్డున ప్రతిష్ఠించమని చెప్పాడట. అదే ఈ విగ్రహ ప్రాశస్త్యం. ఆ కోనేరే నేటి రుద్రతీర్థం. గురువు-వాయువు ఇద్దరూ కలిసి ప్రతిష్ఠించడంవల్లే ఈ ప్రాంతం గురువాయూర్‌గా ప్రసిద్ధిచెందింది. తరవాత శివుడు పార్వతిని తీసుకుని అక్కడ నుంచి సరస్సు అవతలి ఒడ్డుకు వెళ్లిపోయాడనీ అంటారు. అదే ప్రస్తుతం శివాలయం ఉన్న మామ్మియూర్. వెుదట ఇక్కడ ఆలయాన్ని విశ్వకర్మ నిర్మించగా పాండ్యరాజులు పునర్నిర్మించారనీ తరవాత భక్తులు ఇచ్చిన విరాళాలతో అభివృద్ధి చేశారనీ చెబుతారు.
నారాయణీయం[మార్చు]
గురువాయురప్ప బాలకృష్ణుడి రూపంలో భక్తులకీ అర్చకులకీ కలల్లో కనిపించి వాళ్ల తప్పొప్పుల్ని విప్పిచెప్పిన వైనం గురించిన గాథలెన్నో. ఆయన గురించి భక్తులూ, పురాణేతిహాసాలూ చెప్పేవన్నీ ఒక ఎత్తు. కవితాత్మకంగా కృష్ణుణ్ణి కీర్తిస్తూ నారాయణ భట్టాతిరి రాసిన నారాయణీయం మరో ఎత్తు. 16వ శతాబ్దంలో జన్మించిన నారాయణ భట్టాతిరి పదహారేళ్లకే వేద శాస్త్రాలు ఔపోసన పట్టాడట. ఇరవై యేడేళ్లకే పక్షవాతం, కీళ్లనొప్పులతో బాధపడ్డాడట. ఎన్ని మందులు వాడినా ఫలితం లేకపోవడంతో గురువాయురప్ప పాదాల చెంత చేరాక స్వస్థత చేకూరడంతో మహావిష్ణువు అవతారంగా కృష్ణుణ్ణి స్తుతిస్తూ నారాయణీయం రచించారట.
భక్తులు గురువాయురప్పని కన్నన్, ఉన్నికృష్ణన్, బాలకృష్ణన్... అంటూ పలుపేర్లతో అర్చిస్తారు. ప్రధానపూజారి వేకువజామున 3 గంటలకే పచ్చిమంచినీళ్లు కూడా ముట్టకుండా ఆలయంలోకి ప్రవేశించి నాదస్వరంతో చిన్నికృష్ణుణ్ణి నిద్రలేపుతారు. దీన్నే నిర్మలదర్శనం అంటారు. రోజూ విగ్రహాన్ని పాలు, గులాబీఅత్తరు, కొబ్బరినీళ్లు, గంధాలతో అభిషేకించి, పట్టుపీతాంబరాలూ స్వర్ణాభరణాలతో అలంకరిస్తారు. బియ్యప్పిండి, బెల్లం, నెయ్యితో చేసిన తీపిరొట్టెలు; కొబ్బరి ఉండలు; కొబ్బరిపాలు, బెల్లం, బియ్యంతో చేసిన పాయసం; పాలలో ఉడికించిన పిండిరొట్టెల్ని స్వామికి నైవేద్యంగా పెడతారు. పుత్తడితో చేసిన స్వామి ఉత్సవవిగ్రహాన్ని అంబారీ ఎక్కించి మేళతాళాలతో ప్రహరీలోపల ఆలయం చుట్టూ మూడుసార్లు తిప్పుకొస్తారు. 108 దివ్యదేశాల్లో ఈ ఆలయం లేకపోయినప్పటికీ వేదపద్ధతిలో పూజలు నిర్వహించడంవల్లే వైష్ణవులకు గురువాయూర్ పరమపవిత్ర ప్రదేశంగా మారింది.
అన్నప్రాశన[మార్చు]
గురువాయురప్ప సన్నిధిలో రోజూ ఎంతోమంది చిన్నారులకు అన్నప్రాశన నిర్వహిస్తారు. ఇలా చేయడంవల్ల భవిష్యత్తులో ఆ పిల్లలకి ఎలాంటి విపత్తూ వాటిల్లదనేది భక్తుల విశ్వాసం. అలాగే స్వామిసమక్షంలో వివాహబంధం ద్వారా ఒక్కటైతే జీవితం ఆనందమయంగా ఉంటుందన్న నమ్మకంతో ప్రముఖుల నుంచి సామాన్యులవరకూ ఇక్కడ పెళ్లిళ్లు చేసుకునేందుకు ఇష్టపడతారు. అందుకే కేరళలో మరే గుడిలో లేనన్ని కల్యాణాలు ఇక్కడ జరుగుతుంటాయి. ఇక్కడ నిత్యం జరిగే మరో వేడుక తులాభారం. తమ బరువుకి సమానంగా అరటిపండ్లు, బెల్లం, కొబ్బరికాయలు, పంచదారల్ని స్వామివారికి నివేదిస్తారు భక్తులు.
గజేంద్ర సేవ[మార్చు]
గజరాజుల ప్రస్తావన లేని గురువాయూర్‌ని వూహించలేం. ముఖ్యంగా స్వామిని సేవించిన పద్మనాభన్, కేశవన్‌ల గురించిన గాథలెన్నో. ఎత్తుగా సాధుస్వభావంతో ఉండే పద్మనాభన్ జీవించి ఉన్నంతవరకూ స్వామి సేవలోనే గడిపిందట. 1931లో అది చనిపోయినప్పుడు స్వామి నుదుట ఉన్న గంధంబొట్టు రాలిపడిపోయిందట. పద్మనాభన్ వారసత్వాన్ని అందిపుచ్చుకుంది కేశవన్. అచ్చం దానిలానే స్వామిని సేవించేదట. తిడాంబుని ఎక్కించినంతసేపూ భక్తితో ముందుకాలుని ఎత్తిపెట్టుకునే ఉండేదట. అందుకే దీన్ని గజరాజు అన్న పేరుతో సత్కరించారు. 1976లో ఏకాదశి రోజున ఉదయాన్నే స్వామికి అభిముఖంగా తిరిగి దేహాన్ని చాలించిందట. ఆలయానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న పున్నత్తూర్‌కోటలోనే దేవస్థానానికి చెందిన ఏనుగులశాల ఉంది. అందులో సుమారు 50 ఏనుగులవరకూ ఉన్నాయి. ఇందులో కేశవన్ విగ్రహం కూడా ఉంది. ఇక్కడ జరిగే కుంభం ఉత్సవంలో భాగంగా ఏనుగుల పందాలు జరుగుతాయి. అవి చూసేందుకు జనం భారీసంఖ్యలో తరలివస్తారు
మూలాలు[మార్చు]
- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.
బయటి లింకులు[మార్చు]
- [1] Archived 2008-12-05 at the Wayback Machine
- Guruvayoor.com Web abode of Guruvayoorappan
- Krishna Kripa Archived 2010-05-13 at the Wayback Machine
- Read the details about Sri Guruvayoor Temple