Jump to content

తిరుమల శ్రీవారి మెట్టు

వికీపీడియా నుండి
(శ్రీ వారి మెట్టు నుండి దారిమార్పు చెందింది)

తిరుపతి నుంచి తిరుమలకు కాలి నడకన వెళ్ళుటకు అలిపిరి దగ్గర నుంచి వున్న మార్గం కాగ శ్రీనివాస మంగాపురం ఆలయానికి అతి సమీపం నుంచి వున్న మరొక మార్గమే శ్రీ వారి మెట్టు. అలిపిరి మార్గంలో వున్న మొత్తం మెట్ల సంకఖ్య కన్నా శ్రీ వారి మెట్టు మార్గంలో వున్న మెట్లు చాలా తక్కువ. ఒక సగటు వ్యక్తి ఈ మార్గము ద్వారా ఒకటిన్నర గంటలో కొండ పైకి చేరుకొనవచ్చు.

తిరుమలకు దగ్గరి దారి

[మార్చు]

తిరుమల కొండపైకి రెండు మార్గాలున్నాయి. అలిపిరి నుండి వేళ్ళే దారి అందరికీ పరిచయమైనది. ఈ దారిలో వేగంగా నడిస్తే నాలుగు గంటల సమయం పడుతుంది. తిరుమల చేరుకోవడానికి రెండవ కాలిబాట '''శ్రీవారి మెట్టు''' నుండి ఉంది. ఈ మార్గంలో ప్రయాణం ఒక గంట మాత్రమే పడుతుంది. పాలు, పెరుగు, పూలు వంటి పదార్ధాలు కొండపైకి తీసుకొని వెళ్ళి అమ్ముకొనేవారు ఈ మార్గంలోనే వెళతారు. ఈ మార్గం రద్దీ లేకుండా, ప్రకృతి రమణీయతతో సుందరంగా ఉంటుంది. ఈ దారిని నూరుమెట్ల దారి అని అంటారు. అనగా ఇవి నూరు మెట్లె కాదు. ఇవి సుమారు రెండు వేలా ఐదువందల మెట్లున్నాయి. తిరుమలకు వెళ్లడానికి ఇది చాల దగ్గరి దారి. గతంలో శ్రీనివాస మంగాపురం వద్ద మంగాపురం అనే రైల్వే స్టేషను వుండేది. ఆ రైలు మార్గంలో వెళ్లే అనేక రైళ్లు అక్కడ ఆగేవి. అక్కడి నుండి భక్తులు నూరు మెట్ల దారి గుండా కొండపైకి వెళ్లే వారు. ప్రస్తుతం ఈ మెట్లదారి అంత ప్రాచుర్యంలో లేదు. స్థానికులకు తప్ప ఇక్కడ మరొక మెట్ల దారి వున్నదనే సంగతి సుదూర ప్రాంతాల వారికి తెలియదు.
19వ శతాబ్ది తొలినాళ్ళకు చెందిన ఈస్టిండియాకంపెనీ ఉద్యోగి, యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య ఈ బాట గురించి తమ కాశీయాత్రాచరిత్ర గ్రంథంలో వ్రాశారు. 1830ల నాటికే శ్రీనివాసుని పాదం ఇక్కడ ఉండేది. పడమటి దేశస్థులు అక్కడ నుంచి ఎక్కుతారని ఆయన వ్రాశారు.[1]

అభివృద్ధి

[మార్చు]

తిరుమల పట్టణానికి కళ్యాణీ డ్యాము నుండి నీటి సరఫరాకి ఈ మార్గం మీదుగా పైపులైను వేసిన తరువాత నుండి ఈ దారి కొంత అభివృద్ధి చెందింది. అలిపిరి కాలిబాట మొత్తం సుమారుగా 9 కిలోమీటర్లు ఉంటే ఈ కాలిబాట సుమారుగా మూడు కిలోమీటర్లు లోపే ఉంటుంది. అలిపిరి మార్గం ప్రస్తుతం అధికంగా వాడకంలో ఉన్నందున శ్రీవారి మెట్టునుండి వెళ్ళే దారి గురించి చాలా మందికి తెలియదు. ఇది కేవలం 2.1 కీ.మీ. మాత్రమే ఉంటుంది. అయితే ఈ కాలిబాటతో సమస్య ఏమిటంటే దీనికి చేరుకోవడానికి రవాణా సౌకర్యాలు ఎక్కువగా లేవు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారు ఇక్కడికి తిరుపతి నుండి, చంద్రగిరి, శ్రీనివాస మంగాపురం ల మీదుగా ఒక బస్సు నడుపుతున్నారు. దేవస్థానం వారి ఉచిత బస్సు సేవ కూడా రైల్వే స్టేషను, బస్ స్టాండ్, అలిపిరి నుండి శ్రీవారి మెట్టు వరకూ అందుబాటులో ఉంది. లేదా శ్రీనివాస మంగాపురం చేరుకొని అక్కడి నుండి ఆటోలో వెళ్లవచ్చు. శ్రీనివాస మంగాపురం నుండి శ్రీవారి మెట్టు సుమారుగా 6 కిలోమీటర్లు ఉంటుంది. ఈ దారిగుండానే వేంకటేశ్వరుడు వివాహానంతరం ఆరు నెలలు కాలం అగస్త్యాశ్రమంలో గడిపి తరువాత తిరుమల చేరుకున్నాడని పురాణ కథ. నడిరేయి ఏ జామునో అలమేలు మంగను చేరడానికి దిగి వచ్చే స్వామి ఒక అడుగు ఈ "శ్రీవారి మెట్టు"పై వేసి రెండవ డుగు అలమేలు మంగాపురంలో వేస్తాడని ప్రతీతి. చంద్రగిరిని వేసవి విడిదిగా చేసుకొన్న విజయనగర చక్రవర్తులు శ్రీవారి మెట్టునుండ ఉన్న మెట్లదారిలో తిరుమలేశుని దర్శనం చేసుకొనేవారు. తన దేవేరులతో కలిసి కృష్ణ దేవరాయలు ఈ మార్గంలో అనేక పర్యాయాలు నడచి స్వామిని దర్శించుకొన్నాడు.

ప్రస్తుతం ఈ మార్గాన్ని కూడా అభివృద్ధి చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానములు సంస్థ కొన్ని కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా దారి ఆరంభంలో "పాదాల మండపం", భక్తుల సౌకర్య సదుపాయాలను నిర్మిస్తారు. ఇందుకు 6 కోట్ల రూపాయల వ్యయాన్ని అంచనా వేశారు. వసతి గృహంగా "కృష్ణదేవరాయ సదనం" కూడా 4.3 కోట్ల రూపాయలతో నిర్మించనున్నారు.[2]

అలిపిరి నుంచి ఉన్న మెట్ల దారిలో మెట్లోత్సవం జరపడం ఆనవాయితీగా వస్తోంది. అయితే 2007, 2008 సంవత్సరాలలో కొన్ని మెట్లోత్సవాలు శ్రీవారి మెట్టునుండి ఉన్న బాటలో జరుపుతున్నారు. టీటీడీ, దాస సాహిత్య ప్రాజెక్ట్ సంయుక్తంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. చిన్నారులు పెద్దసంఖ్యలో పాల్గోవడంతో తక్కువదూరం ఉండే శ్రీవారి మెట్ల మీదుగా ఈ యాత్ర జరపడం అనుకూలంగా ఉంటున్నది.[3]

విశేషాలు

[మార్చు]
అలిపిరి మెట్ల దారిలో సాష్టాంగ నమస్కార ముద్రలో శిల్పం, అలిపిరి వద్ద తీసిన చిత్రం

తి.తి.దే ప్రచార లోపం వలన ఇక్కడ ఒక మార్గం వున్న సంగతి తిరుపతి స్థానికులకు తప్ప మిక్కిలి తక్కువ మందికి తెలుసు. రెండు సంవత్సరముల ముందు వరకు, ఈ మార్గంలో వర్షం వచ్చినా, ఎండ ఎక్కువైనా రక్షణకు పైకప్పు వుండేది కాదు. తిరుమలకి కాలి నడకన వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో అప్పటి తి.తి.దే అధ్యక్షుడి చొరవతో ఈ మార్గాన్ని కూడా అభివృద్ధి చేశారు.పూర్వ కాలం నుండి తిరుమల కొండకు రెండు సోపాన మార్గాలున్నాయి. మొదటిది శ్రీవారి మెట్టు: దీన్నే నూరు మెట్ల దారి అంటారు. ఇది శ్రీనివాస మంగాపురం లోని కళ్యాణ వేంకటేశ్వర ఆలయం నుండి ప్రారంభమై కొంత దూరం మైదాన రహదారిలో సాగి కొండ పాద బాగానికి చేరి అక్కడి నుండి మెట్ల దారి ప్రారంభ మౌతుంది. ఇది మొత్తం మెట్ల దారె. మధ్యలో ఎక్కడా మెట్లు లేకుండా వుండదు. దీనికి నూరు మెట్ల దారి అని పేరు. ఇందులో వున్నవి కేవలం నూరు మెట్లు మాత్రమే కాదు. అనేక వేల మెట్లుంటాయి. కాని చివరగా నూరు మెట్లను ప్రత్యేకంగా జంటగా ఏర్పాటు చేసి వుంటారు. ఇది చాల దగ్గరి దారి. గతంలో శ్రీనివాస మంగాపురం వద్ద మంగాపురం అనె రైల్వే స్టేషను వుండేది. గుంతకల్లు, ధర్మవరం, మదనపల్లె, పాకాల మీదుగా తిరుపతి రైళ్లు వచ్చి పోయేవి. అదేవిధంగా తమిళనాడు లోని కాట్పాడి, చిత్తూరు, పాకాల మీదుగా వచ్చి పోయె రైళ్లు వుండేవి. ఈ రైళ్లు మంగాపురం వద్ద ఆగేవి. తిరుమలకు వెళ్లే యాత్రీకులందరు అక్కడే దిగి [[కళ్యాణ వేకటేశ్వరున్ని దర్శించుకొని కాలి నడకన నూరు మెట్ల ద్వార కొండ పైకి వెళ్లే వారు. ప్రస్తుతం మంగాపురం రైల్వే స్టేషను లేదు.

అలిపిరిలోని శ్రీవారి పాదాల మండపం: మండపం వద్ద తీసిన చిత్రం
తలయేరు గుండు

వీరందరు తిరుపతి వరకు రాకుండా మంగాపురం లోనె రైలు దిగి నూరు మెట్ల ద్వారా కొండపైకి వెళ్లే వారు. ఆ రోజుల్లో ఒకే ఘాట్ రోడ్డు వున్నందున బస్సులు కూడా తక్కువగా వున్నందున ఎక్కువ జనం మెట్ల దారినే ఆశ్రయించేవారు. నూరు మెట్లదారి దగ్గరైనందున వ్వాపారస్తులు ఎక్కువగా ఈ మార్గాన్నె ఎంచుకునే వారు. ఆవిధంగా ఈ నూరు మెట్ల దారి ఆ రోజుల్లో బహుళ ఉపయోగంలో వుండేది. ఇది పేరుకు మాత్రమే నూరు మెట్ల దారి. అందులో సుమారు మూడు వేల మెట్లున్నాయి. మధ్యలో కొంత దూరము కూడా కాలి బాట వుండదు అలిపిరి మెట్ల దారిలో లాగ. అంతా మెట్ల దారె. రాను రాను రవాణా వ్వవస్త పెరిగినందున యాత్రికులందరు తిరుపతికి చేరి అక్కడి నుండి తిరుమలకు వెళ్ల నారంబించారు. దానివలన ఈ నూరు మెట్లదారి ఉపయేగించే వారి సంఖ్య తగ్గి పోయింది. ప్రస్తుతం చిల్లర వ్వాపారస్తులకు అనగా కూరగాయలు, పాలు పెరుగు, పండ్లు మొదలైనవాటిని తట్టలపై తెచ్చేవారు, స్థానికులు తప్ప ఈ మెట్ల దారి గుండా నడిచే వారు ఎక్కువ లేరు. దూర ప్రాంతాల వారికి ఇలాంటి మెట్ల దారి ఒకటి వున్నదనే సంగతి కూడా తెలియని పరిస్థితి. గతంలో వున్నట్టు మంగాపురం వద్ద రైల్వే స్టేషను పునరుద్దరించి అన్ని రైళ్లను ఎక్స్ ప్రెస్స్ రైళ్లతో సహా అక్కడ ఆగితే ఈ నూరు మెట్ల దారి తిరిగి పూర్వ వైభవాన్ని పొంద గలదు. తిరుపతి రైల్వే స్టేషనుకు వున్న రద్ది కొంత మేర తగ్గ గలదు.

రెండో మెట్ల దారి అలిపిరి నుండి ప్రారంభమై తలయేరు గుండు నుండి వరుసగా మెట్లు వుండి పైన కనుపించే గోపురం వరకు కష్టంగా వుండి ఆ తర్వాత ఎక్కువగా మైదాన ప్రాంతం ద్వారా దారి ఉంది. ఇక్కడ వున్న మొదటి కొండ మెట్లను మోకాలి మెట్లు అని అంటారు. అక్కడక్కడా సేద దీరడానికి వసతులు, ఆహ్లాదం కొరకు జంతు ప్రదర్శన శాలలు ఉన్నాయి. ఈ దారి అక్కడక్కడా బస్సులు వెళ్లే రోడ్డు పైన కూడా సాగుతుంది. ఈ మెట్ల దారిపై ఎండకు, వానకు రక్షణగా పైకప్పు కూడా వేశారు. ఇది చాల దూర మైనా ఎక్కువగా ఈ మెట్ల దారి ద్వారానె ఎక్కువగా భక్తులు వెళ్లుతుంటారు. మొక్కు బడి వున్నావారు ఎక్కువగా వెళు తుంటారు. ఈ మెట్ల దారి ద్వారా నడచి వెళ్లే వారికి మరొక సదుపాయం కూడా ఉంది. అదే మంటే యాత్రికుల సామనులు అలిపిరి వద్ద అందిస్తే దానిని ఉచితంగా కొండపైకి చేర్చి ఎవరి సామానులను వారికి అప్పగించే సౌకర్యం ఉంది. దీనిని ఉపయోగించుకొని యాత్రికులు సామానులు వెంట తీసుకెళ్లకుండా సునాయాసంగా మెట్లు ఎక్కి వెళ్ల గలుగుతున్నారు. వీరికి మరొ సౌకర్యంకూడ ఉంది. ఇలా మెట్ల దారి ద్వారా కాలి నడకన వచ్చే వారికి శ్రీ వారి దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. ఇన్ని కారణాల వల్ల ఈ మెట్ల దారి దూరమైనా ఈ మెట్ల దారికె ప్రస్తుతం ప్రాధాన్యత ఎక్కువగా ఉంది.

గతంలో యాత్రికులు శ్రీ వారి మెట్టు వద్ద గల నూరు మెట్ల దారి గుండా పైకి ఎక్కి దైవ దర్శనానంతరం తిరుపతి వైపున వున్న మెట్ల దారి గుండా కిందికి దిగి వెళ్లే వారు. ఆ విధంగా ఏడు కొండలను కాలి నడకన ప్రధక్షణం చేశామని భావించే వారు.

పూర్వ కాలంలో కడపలోని దేవుని గడప శ్రీ వెంకటేశ్వర ఆలయం నుండి సరాసరి మైదాన దారి, మెట్ల దారి వుండేదని దానికి ఆధారంగా అక్కడక్కడా ఇప్పటికి కొంత భాగం మెట్ల దారి కనబడుతుందని అంటారు. ఇది అత్యంత దూరమైనది. రవాణ సౌకర్యాలు లేని ఆరోజుల్లో ఈ సుధూర మెట్లదారి వాడుకలో వుండేది. ప్రస్తుతం అది పూర్తిగా కనుమరుగైనది. ఆరోజుల్లో రాయలసీమ జిల్లాల వారికి ఈ సుధూర నడక దారె దగ్గరి దారి. రవాణ సౌకర్యాలు బాగా పెరిగి నందున దాని అవసరం ప్రస్తుతం లేదు.

మూలాలు, వనరులు

[మార్చు]
  1. వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.
  2. "[[హిందూ పత్రిక]] వార్త - ఏప్రిల్ 24, 2008". Archived from the original on 2011-08-23. Retrieved 2008-10-30.
  3. VIshnu, Jamuni. "Tirumala Darshan Today LIVE Waiting Time Today Crowd Rush". https://gokshetra.com. Go Kshetra. Retrieved 28 December 2023. {{cite web}}: External link in |website= (help)