Jump to content

బీబి నాంచారమ్మ

వికీపీడియా నుండి

దక్షిణ భారతదేశంలో ప్రచారంలో ఉన్న జానపదాల ప్రకారం బీబి నాంచారమ్మ లేదా తుళుక్క నాచ్చియార్ (తురుష్క దేవత) అనే ముస్లిం స్త్రీ శ్రీరంగం రంగనాథుని భక్తురాలిగా మారి జీవితాంతం రంగనాథుని సేవ చేసుకుని జీవిత చరమాంకంలో ఆయనలో ఐక్యం అయ్యింది. బీబీ అనేదిఉర్దూ పదం. "నాంచారి" తమిళం. రెండింటికీ ఒకటే అర్ధం. ఈ "బీబీ నాంచారమ్మ" గురించి వివిధ కథలు ప్రచారంలో ఉన్నాయి. బీబీ నాంచారమ్మకి కనకదుర్గ ఆడపడచు అట.[1]. భూదేవి బీబీ నాంచారిగా అవతారమెత్తి శ్రీహరికోసం వెతుకుతూ వచ్చిందట.[2] నాంచారమ్మ వృత్తాంతము ఒక జానపద కథ అని, భారతదేశాన్ని మహమ్మదీయుల పాలించిన కాలంలో తిరుమల దేవస్థానాన్ని ముస్లిం దండయాత్రలనుండి రక్షించడానికి ఈ కథను సృష్టించారని విశ్లేశకులు భావిస్తున్నారు. 1780లో చంద్రగిరిని పట్టుకొన్న హైదర్అలీ తిరుమల సంపదను కన్నెత్తి చూడకపోవడానికి కారణం ఈ కథలేనని ఒక అభిప్రాయం. బీబీ నాంచారమ్మ కథను విశ్వసిస్తూ చాలామంది మహమ్మదీయులు నేటికీ తిరుమలను దర్శించుకుంటున్నారు. తుళుక్క నాచ్చియార్ విగ్రహ రూపంలో తిరుమలలోను, శ్రీరంగంలో రంగనాథాలయంలోనూ, మేళ్కోటెలోని చెళువనారాయణస్వామి ఆలయంలోనూ పూజలందుకుంటున్నది. శ్రీరంగంలో రంగనాధుని ఆలయంలో తుళుక్కు నాచియార్ గుడి ఉంది. వైష్ణవానికి రాజధాని అయిన శ్రీరంగంనుండి తిరుమలకు ఎగుమతి అయిన దేవతలలో బహుశా బీబీనాంచారమ్మ ఒకరు.

ప్రతి మంగళవారం తిరుమలలో మూలవిరాట్టుకు హైదరాబాదుకు చెందిన సయ్యద్ మీర్జా అనే ముస్లిం సమర్పించిన 108 బంగారు పుష్పాలతో బాలాజీ 108 నామాలు ఉచ్చరిస్తూ "స్వర్ణ పుష్పార్చన" లేదా "అష్టదళ పాద పద్మారాధన" చేస్తారు. ఉత్సవదేవతలైన శ్రీదేవి, భూదేవిలకు సయ్యద్ మీర్జా సమర్పించిన రెండు మంగళసూత్రాలనే నేటికీ వేంకటేశ్వర కళ్యాణోత్సవంలో ఉపయోగిస్తున్నారు.[3]

నాంచారమ్మ గురించి రకరకాల గాధలు

[మార్చు]
  • బీబీ నాంచారమ్మ గురించి ప్రచారంలో ఉన్న పలు వృత్తాంతాలలో లోని ప్రధాన ఇతివృత్తం ఇలా సాగుతుంది. మధ్యయుగంలో దక్షిణ భారతదేశాన్ని ఒక మహమ్మదీయ సుల్తాను దండెత్తి, వైష్ణవాలయంలోని వైష్ణవ విగ్రహాన్ని (శ్రీరంగంలోని ఉత్సవ విగ్రహాన్ని) ఢిల్లీ తీసుకొని వెళతాడు. ఆ విగ్రహాన్ని చూసిన సుల్తాను కూతురు సమ్మోహితురాలై ప్రేమలో పడుతుంది. విగ్రహాన్ని తిరిగి ఇవ్వడానికి అంగీకరించక, తీసుకువెళ్ళటానికి వచ్చిన వ్యక్తులతో పాటు తనూ వెళుతుంది. ఆ తరువాత దైవసన్నిధిలో ఐక్యమై విష్ణు భార్యగా నిలచిపోతుంది.[4] వివిధ వృత్తాంతాల్లో దండెత్తిన చక్రవర్తి ఔరంగజేబు గానూ[5], మాలిక్ కాఫూర్ గానూ చెప్పబడింది. తీసుకెళ్ళిన వైష్ణవ విగ్రహం శ్రీరంగంలోని శ్రీరంగనాథ విగ్రహమనీ, మేళ్కోటలోని కృష్ణ (సంపత్ కుమారుడి) విగ్రహమని, [6] విగ్రహన్ని సుల్తాను కూతురే తిరిగితీసుకు వచ్చిందని[7], రామానుజుడు వెళ్ళి తెచ్చాడని[6], పురబ్రాహ్మణులు తీసుకువచ్చారని ఇలా వివిధ రకాలుగా చెప్పబడుచున్నది.
  • ఆమె ముస్లిం కాదు.బహు మతావలంబీకురాలయిన దూదేకుల స్త్రీ.[8]

సాహిత్యంలో నాంచారమ్మ

[మార్చు]

మైసూరు రాజు, దొడ్డ కృష్ణరాజ వొడియారు (1717-1731) పట్టమహిషి చెలువాంబ, కన్నడంలో బీబీ నాంచారు కథ ఆధారితంగా వరనందీ కళ్యాణ అనే కావ్యాన్ని సాంగత్య పద్యాలలో రచించింది. చెలువాంబ వరనందిని సత్యభామ అవతారంగా వర్ణించింది.[9]

  • ప్రొద్దుటూరుకు చెందిన డా.సి.వి.సుబ్బన్న శతావధాని రచించిన "బీబీ నాంచారి ప్రబంధము" తిరుపతిలో తెలుగు భాషోధ్యమ సమితి ఆధ్వర్యంలో 25.4.2010 న ఆవిష్కరణ జరిగింది.కర్నాటకలోని మేల్కోటే లోని చెళ్ళపిళ్ళరాయుని విగ్రహాన్ని ఢిల్లీ సుల్తాన్ ఢిల్లీకి తెప్పిస్తాడు.ఆ విగ్రహాన్ని ఆయన కుమార్తె ఆరాధిస్తుంది.ప్రేమలో పడుతుంది.వెంకటేశ్వరుడు సుల్తాన్ కు కలలో కనపడి ఆయన కుమార్తెను వివాహమాడతానని చెపుతాడు.సుల్తాన్ అంగీకరిస్తాడు.గోదాదేవి లాగానే నాంచారి కూడా విష్ణుపత్నిగా ఆరాధించ బడుతుంది.వెంకటేశ్వరుడు లౌకికవాదానికి ప్రతీకగా మారి మతాంతర వివాహాలుకు మార్గం సుగమం చేసి మార్గదర్శకుడయ్యాడని శతావధాని చెప్పారు.[10]
  • తాళ్ళపాకనుండి తిరుమల వరకు దాదాపు అన్ని క్షేత్రాలను, ఆచారాలను ప్రస్తావించిన 16వ శతాబ్దానికి చెందిన అన్నమయ్య, తలనీలాలు ఇవ్వడం గురించి, బీబీ నాంచారి గురించి ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనింపదగిన విషయం.[11]
  • వేంకటేశ్వరుండు, బీబి నాంచారమ్మ
బెండ్లియాడి మతమభేదమనియె
హరి, ప్రమాణమైన వ్యర్థవాదాలేల?
పాపసాబు మాట పైడిమూట ---- తక్కెళ్ళపల్లి పాపాసాహెబ్‌ 1949 [12]
నాపాలి దైవమని నమ్ముకున్నానయ్య
నా భాగ్యదేవతా నను మరువకయ్యా
బీబి నాంచారమ్మ పొంచి ఉన్నాదయ్య
చాటు చేసుకు ఎటులో చెంతజేరెదనయ్య…
ఏడు కొండలవాడ వెంకటా రమణా -- పెళ్ళిచేసి చూడు లో పి.లీల పాడిన పాట.

మూలాలు

[మార్చు]
  1. 1980-1990వరకు 9వ తరగతి తెలుగు నాన్ డిటైల్డ్ లో పాఠం
  2. అలమేలుమంగా విలాసం http://www.hindu.com/fr/2007/06/01/stories/2007060152210300.htm Archived 2007-09-09 at the Wayback Machine
  3. http://ravindrasriramanujadasan.co.cc/tirumala/impq/tfaq13.html[permanent dead link]
  4. A Muslim Princess in the Temples of Visnu Archived 2010-06-15 at the Wayback Machine - Richard H Davis
  5. Census of India, 1961, Volume 2, Issue 4
  6. 6.0 6.1 Ramanuja: Social Influence of His Life and Teaching - Kandadai Seshadri Economic and political weekly, Vol. 31, No. 5 (Feb. 3, 1996), p.296
  7. Hindu spirituality: Postclassical and modern By K. R. Sundararajan, Bithika Mukerji
  8. http://sankrant.sulekha.com/blog/post/2003/10/why-india-is-a-nation/comment/330433.htm[permanent dead link]
  9. Narasimhacharya, R (1988) [1934]. History of Kannada Literature. Asian Educational Services. ISBN 81-206-0303-6.
  10. http://beta.thehindu.com/arts/books/article415269.ece[permanent dead link]
  11. తిరుమల కొండ పదచిత్రాలు - పున్నా కృష్ణమూర్తి
  12. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-08-25. Retrieved 2010-08-27.