తిరుమల ప్రసాదం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తిరుపతి లడ్డు: తిరుమల ప్రసాదాల్లోకెల్లా ప్రఖ్యాతి పొంది, భౌగోళిక గుర్తింపు సాధించినది లడ్డు

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి నైవేద్యంగా[నోట్స్ 1] నివేదించి, భక్తులకు పంచిపెట్టే లడ్డు, వడ వంటి తినే పదార్థాలు తిరుమల ప్రసాదంగా ప్రసిద్ధి చెందాయి. ప్రస్తుతం లడ్డు తిరుమలలో శ్రీవారి ప్రసాదాల్లో అత్యంత ప్రాచుర్యం పొంది, తిరుమల ప్రసాదం అంటే గుర్తుకువచ్చేలా పేరు తెచ్చుకుంది. అయితే చారిత్రకంగా 15వ శతాబ్ది నుంచి 20వ శతాబ్ది తొలినాళ్ళ వరకూ వడకు తిరుమల ప్రసాదంగా ప్రస్తుతం లడ్డుకు ఉన్న పేరు ఉండేది. మనోహరం పడిగా పిలిచే సున్నుండ వంటి ప్రసాదానికి కూడా 16-20 శతాబ్దాల కాలంలో ప్రాముఖ్యత ఉండేది. ఈ రెండు ప్రసాదాల ప్రాధాన్యతను 20వ శతాబ్ది నుంచి సెనగపిండితోనూ, పంచదారతోనూ చేసే ప్రస్తుత తిరుపతి లడ్డు తీసుకుంది.

విజయనగర కాలంలోనూ, ఆ తర్వాత రాజులు, ఉన్నతోద్యోగులు, సంపన్నులు ప్రసాదాల నిమిత్తం ఇచ్చిన డబ్బు మూలనిధిగా చేసి కానీ, వారు భూములు, గ్రామాల రూపంగా ఇస్తే వాటి మీద వచ్చే ఆదాయంతో కానీ ప్రసాదాలు తయారుచేసేవారు. ఆ ప్రసాదాల్లో నాలుగింట ఒక వంతు దాతకు, మిగతా ప్రసాదంలో స్థానత్తార్లు (ధర్మకర్తలు), ఆలయ సిబ్బంది, మఠాల వార్లు వంటివారికి వాటా ఉండేది. స్థానత్తార్లు, సిబ్బంది ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని తిరుమల ప్రసాదాలను అమ్మి, ఆ అమ్మకాన్నే సంపద కూడబెట్టుకోవడానికి మార్గంగా తీసుకునేవారు. సాళువ వీరనరసింహరాయలు తన హయాంలో తిరుమలలో స్వామివారికి నైవేద్యాల నిమిత్తం అనేక దానాలు చేసి, దాతగా తనకు వచ్చిన భాగాన్ని ఉపయోగించి అన్నదాన సత్రాలు, ప్రసాద వితరణ ఏర్పాట్లు చేశాడు.

విజయనగర సామ్రాజ్యం అత్యున్నత దశకు చేరుకునేనాటికి, తిరుమల వైభవం ప్రసాదాల రూపంలో కళ్ళకు కట్టింది. రాజులు, అధికారులు, సంపన్నులు ఏర్పాటుచేసిన దానాలు వందలాది గంగాళాల్లో, వందల రకాల నైవేద్యాలు తయారుచేసి రోజుకు వందసార్లు నివేదించే పరిస్థితి వచ్చింది. ఈస్టిండియా కంపెనీ కాలంలో ఆర్థిక, మతపరమైన కారణాలతో తిరుమలలో నైవేద్యాల కోసం వందల ఏళ్ళుగా దాతలు ఇచ్చిన దేవదేయాల భూములు, గ్రామాలను ఈస్టిండియా ప్రభుత్వం జప్తుచేసుకుని, ఆ ఆదాయం మీద ఏర్పాటుచేయాల్సిన అన్ని నైవేద్యాలను నిలిపివేసింది. 1840లో తిరిగి ఆలయ నిర్వహణ కంపెనీ చేతి నుంచి మహంతులకు అప్పగించాకా దేవాలయానికి సమకూడే ఆదాయంతో పూర్వపు పద్ధతుల్లో నైవేద్యాలు చేయడం మొదలుపెట్టి, ఇప్పటిదాకా ఆ పద్ధతే కొనసాగుతోంది.

ప్రస్తుతం తిరుమలలో అన్నప్రసాదాన్ని నిత్యాన్నదాన భవనంలోనూ, ఇతర ప్రదేశాల్లోనూ ఉచితంగా వితరణ చేస్తూండగా, దర్శనం చేసుకున్నవారికి ఏదోక రకం ప్రసాదాన్ని తినేందుకు, కనీసం ఒక లడ్డూ అయినా తీసుకువెళ్ళేందుకు ఉచితంగా ఇస్తున్నారు. మిగిలిన ప్రసాదాలను భక్తులు ఒక పరిమితి మేరకు కొనుక్కోవచ్చు. నైవేద్యాల తయారీకి వంశపారంపర్యంగా చేసే పోటు మిరాశీదారుని 1980వ దశకంలో మిరాశీ వ్యవస్థ రద్దులో భాగంగా తొలగించి, కొన్నాళ్ళు తితిదే నేరుగాను, ఆపైన తయారీ గుత్తేదారులకు అప్పగించడం ద్వారానూ చేస్తోంది.

చరిత్ర

[మార్చు]

సిబ్బందికి భోజనం

[మార్చు]

తిరుమలలో నైవేద్యాలపై దాతల దృష్టి 14వ శతాబ్దికి ముందు పెద్దగా పడలేనట్టే ఆలయ శాసనాలు సూచిస్తున్నాయి. 13, 14 శతాబ్దుల్లో ఆలయంలో పనిచేసే సిబ్బంది వరకే ప్రసాదాలు తయారుచేసినట్టు శాసనాధారాలు చెప్తున్నాయి. కొండమీద పనిచేసే సిబ్బందికి వేరే భోజన భాజనాల అవసరం లేకుండా ఆ చేసే నైవేద్యమే ప్రసాదంగా భోజనం చేసేందుకు సరిపోయేట్టుగా ఏర్పాటుచేసుకునేవారు. [1]

ప్రసాదం కోసం దానాలు

[మార్చు]

తిరుమలలో తొలినాళ్ళలో అన్న ప్రసాదం మాత్రమే ఉండేది, తర్వాతి కాలంలో వివిధ రకాల ప్రసాదాలు మొదలయ్యాయి. ఈ ప్రసాదాలతో పాటుగా ప్రసాదాలను తయారుచేయడానికి రాజులు, రాజపురుషులు, ఉన్నతాధికారులు, సంపన్నులు దేవదేయాలుగా (దానాలుగా) సొమ్ము కానీ, భూమి కానీ, గ్రామాలు కానీ సమర్పించడం, వారి పేరిట ఆ ప్రసాదాలు తయారుచేసి నివేదించే పద్ధతి ఏర్పడడం ఉంది. 14వ శతాబ్దం చివరి కాలం వరకూ ప్రసాదాలను చిట్టడవుల్లోంచి, దుష్కరమైన కొండ మీద నివాసం ఉంటూ ఆలయాన్ని కనిపెట్టుకున్నందున సిబ్బందికి వెసులుబాటుగా భోజనం బదులు ఇచ్చే పద్ధతి ఉండేది, అప్పటికి యాత్రికులకు ప్రసాదాన్ని ఉచితంగా పంచిపెట్టే పద్ధతి లేదు, సిబ్బందికే తప్ప ధర్మకర్తలు (స్థానత్తార్లు) వగైరా ఎవరికీ దానిలో భాగం లేదు. అయితే 1390ల నాటికి ఆలయ నిర్వహణపై స్థానత్తార్ల పట్టు పెరిగిపోయి, వారికీ సిబ్బందితో పాటుగా వాటా వచ్చింది. అంతవరకూ సిబ్బంది వాటా కేవలం వారు తినడానికే సరిపోయేట్టు ఉంటే 14వ శతాబ్ది చివరికల్లా ఆ గంగాళాలకు గంగాళాలుగా పెరిగింది. ఒక గంగాళం (తళిగ అని వ్యవహరిస్తారు) ప్రసాదాన్ని చేయించేందుకు దాత దేవదాయం ఇస్తే, దానిలో పావు వంతు వాటా అతనికీ, మిగిలిన ముప్పావు భాగం స్థానత్తార్లు, సిబ్బందికి వాటా ఉండేది. [1]

ప్రసాదాలతో వ్యాపారాలు

[మార్చు]

దూరప్రాంతాలకు చెందిన రాజులు, అధికారులు, ధనికులు ప్రసాదాలకు దేవదాయం ఇచ్చినప్పుడు, దాతగా తమకు వచ్చిన 25 శాతం వాటా ప్రసాదాన్ని భక్తులకు ఉచితంగా పంచాలని కోరుకునేవారు. ఆ కొద్దిభాగం ఉచితంగా పంచినా, ఇంకా ఎందరో భక్తులకు ప్రసాదాల అవసరం అలానే ఉండేది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ స్థానత్తార్లు, సిబ్బంది తమకు వచ్చిన వాటా ప్రసాదాన్ని భక్తులకు అమ్ముకునేవారు. కొందరు స్థానత్తార్లు, సిబ్బంది మాత్రం ఆ బెడద తాము పెట్టుకోకుండా తమ వాటా ప్రసాదాలు కౌలుదార్లకు ఇస్తూండడంతో, పలువురి ప్రసాదాలు తీసుకుని అమ్మే పెద్ద పెద్ద కౌలుదార్లు ఏర్పడ్డారు. ఇలా ప్రసాదాలు అమ్మేవారిని ప్రసాదక్కార్ అని వ్యవహరించేవారు. స్థానత్తార్లు, సిబ్బంది దాతల నుంచి కూడా వారి దాతల భాగాలపై హక్కులను కొనుక్కుని, ఆ విధంగా మిగతా పావుశాతం ప్రసాదాలను కూడా అమ్మకానికి పెట్టడంతో తర్వాతి అడుగు వేశారు. తుదకు ఈ రకంగా వచ్చిన సంపాదనను ప్రసాదాల ఏర్పాటుకు దేవదేయంగా ఇచ్చి, తామే దాతలుగా ఆ దాతల వాటాతో పాటు తమ వాటా కూడా ప్రసాదక్కర్‌లకు అమ్ముకోవడం, తామే ప్రసాదక్కార్‌లుగా భక్తులకే ఆ ప్రసాదం అంతా అమ్మడం వంటివి చేయసాగారు. 1510 నుంచి 1570 వరకూ ఆలయానికి ప్రసాదాల కోసం జరిగిన దేవదాయాలను పరిశీలిస్తే వాటిలో నాలుగో వంతు దేవాలయ సిబ్బంది, స్థానత్తార్లు చేసినవనీ, మిగిలిన నలభై శాతం తిరుపతిలో నివసిస్తున్న వర్తకులు చేసినవనీ తెలుస్తున్నాయి. అలా ప్రసాదాల్లో ప్రసాదాల్లో 65 శాతం వరకూ సిబ్బంది, స్థానికుల చేతిలో ఉండేవి. [1]

ప్రసాదంలో వాటాలు, పంపకాలు

[మార్చు]

ప్రసాదంలో దేవదేయాలు చేసిన దాతలకు 25 శాతం వాటా ఉంటుందన్నది మొదటి నుంచీ ఉన్న నియమమే అయినా మిగిలిని 75 శాతంలో ఎవరికి ఎంత దక్కుతుందన్నది విజయనగర సామ్రాజ్యం సంగమ వంశం వచ్చేవరకూ అస్పష్టంగానే కొనసాగింది. సంగమ వంశ కాలంలో అవ్యవస్థలో ఉన్న ఈ పద్ధతులకు ఒక క్రమం తీసుకువచ్చారు. ఆ కాలంలో వేయించిన శాసనాల్లో ఏయే భాగాలు ఎవరెవరికి చెందాలన్నది సుస్పష్టంగా వివరించారు. దాతలకు నాలుగో వంతు పోగా, మిగతా మూడు వంతుల ప్రసాదం 24 భాగాలుగా విభజించి వాటిలో నాలుగు భాగాలు ఏకాంగి శ్రీవైష్ణవుల కోసం జియ్యంగారి మఠానికి, తిరుమలలోనే నివసిస్తూ ఒక్కో వీధిని నిర్వహిస్తూన్న 12 మంది స్థానత్తార్లకు 12 భాగాలు ఇవ్వాలి. మిగిలిన 8 భాగాలు మండపంలో తిరువాయ్‌మొళి చదివే శ్రీవైష్ణవులకు పంచాలి. దాత భాగంలోనూ కొంత వెంపరమన్నార్ జియ్యరుకు, దేవాలయ నాట్యకత్తెలకు, ఆలయంలో పనిచేసే సాలెగాళ్ళకు ఇచ్చి, మిగతాది దాత తీసుకోవచ్చు. [2]

ఉచిత అన్న ప్రసాద సత్రాల ఏర్పాటు

[మార్చు]

తిరుమల దేవస్థానంలో చక్కని పద్ధతులు ఏర్పరిచి, యాత్రికుల సౌకర్యాలకు ఏర్పాట్లుచేసిన పాలకుడు సాళువ వీరనరసింహరాయలు తన కాలంలోనే ఉచిత అన్నదాన సత్రాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టాడు. నైవేద్యాల సేవలకు గాను స్వయంగానూ, తన కుమారులు, కుటుంబసభ్యుల పేరు మీద ధనరూపంలోనూ, భూమి రూపంలోనూ కూడా పలు దేవదేయాలు సమర్పించాడు. తిరుమల ఉత్తర మాడవీధుల్లో రామానుజ కూటాలను ఏర్పాటుచేసి, తన గురువు కందాడై రామానుజ అయ్యంగారుకు నిర్వహణ అప్పగించి, వాటిని అన్నదాన సత్రాలుగా ఉచితంగా భక్తులకు భోజనాలు పెట్టేలా ఏర్పాటుచేశాడు. తన దేవదేయాల ద్వారా దాతగా తనకు లభించే వంతు మొత్తాన్ని రామానుజ కూటాల ద్వారా శ్రీవైష్ణవులకు ఉచితంగా భోజనంగా పెట్టించేందుకు చెందేలా స్థానత్తార్లకు ఆదేశాలిచ్చాడు. కాలినడక దారిలో కట్టించిన గోపురం పక్కన మరో సత్రం ఏర్పాటుచేశాడు నాలుగు గ్రామాలు దేవదేయం చేసి, ఆ ప్రసాదంలో దాతగా తన వంతుకు వచ్చే పాతిక శాతం ప్రసాదాన్ని ఇక్కడికి మోసుకువచ్చేందుకు బ్రాహ్మణులను నియమిస్తూ, ఆ ఉచిత అన్నదాన సత్రం నిర్వహణకు ఏర్పాటుచేశాడు. భక్తులకు ఆ ప్రసాదం చాలకపోతే, మరికొంత వండి పెట్టేందుకు కూడా ఏర్పాటుచేశాడు. ఇంతేకాక బ్రహ్మోత్సవాల సమయాల్లో వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆ పదిరోజులు ఉచిత అన్నదాన వితరణ చేసే మరో సత్రాన్ని పుష్కరిణికు పశ్చిమాన కట్టించాడు.

వీరనరసింహరాయలు తిరుమలలో చేసిన ఈ పనులను అతని అనుచరులు, అధికారులు కూడా సహజంగానే అనుసరించడంతో 15వ శతాబ్ది రెండో అర్థభాగం నాటికి నూటికి పైగా నైవేద్యాలకు దేవదేయాలు ఇచ్చే ఏర్పాట్లు జరిగాయి. దానితో ఉప్పుపొంగల్, చక్కెర పొంగల్, దద్దోజనం, పులిహోర, కదంబం కాక, పాయసం, పానకం, అప్పపడి, దోవ, వడ మొదలైన 57 రకాల సంధి నైవేద్యాలకు ఏర్పాటు జరిగింది. [3]

సంస్కరణలు

[మార్చు]

విజయనగర పతనానంతరం గోల్కొండ నవాబుల పరిపాలనలో మంత్రులు అక్కన్న మాదన్నలు తిరుమలను దర్శించుకుని తిరుమల దేవాలయ ప్రసాద వితరణ విషయంలో చాలా సంస్కరణలు తీసుకువచ్చారు. స్థానత్తార్లకు, పెద్ద అధికారులకు పెద్ద పెద్ద భాగాలు పంచే పద్ధతి తీసేసి, దేవాలయ నిర్వహణలో నిజమైన కాయకష్టం చేసేవారికే నైవేద్యంలో భాగాలు కల్పించడం చేశారు. దేవదాయాలను పెట్టుబడి మార్గాలుగా చూసి, ప్రసాదంలో పెద్ద ఎత్తున తమకు వచ్చేలా కొందరు పెద్దలు చేసుకున్న ఏర్పాట్లను భంగపరిచేలా దాతలకు నామమాత్రమైన ప్రసాదం లభించేలా మార్పుచేశారు. నైవేద్య దేవదేయాలు రాజ్యం చేతులుమారడంతో పోవడంతో, దేవాలయంలో పనిచేసేవారికి భోజనానికి ఇబ్బందిగా ఉండడాన్ని గమనించి అవసరానికి తగ్గట్టుగా అవసర నైవేద్యాలు ఏర్పాటుచేసి వారి ఆకలి తీర్చారు. [4]

ప్రసాదాల రద్దు

[మార్చు]

దేవాలయం ఆర్కాటు నవాబు పాలనలోకి వచ్చినప్పుడు అతను రెంటర్ అనే పేరిట ఒక గుత్తేదారుకు మొత్తం తిరుమల ఆలయ నిర్వహణ అంతా లీజుకు ఇచ్చేశాడు. రెంటర్ దేవాలయాల్లో ప్రసాదాలు చేయించేందుకు డబ్బివ్వాలన్నా కూడా పన్నువేయడం, దేవాలయంలో ప్రసాదాలు తన ఆధ్వర్యంలోనే అమ్మడం వంటివి చేసేవాడు. [5] ఆపైన 1801లో ఈస్టిండియా కంపెనీ పరిపాలనకు వచ్చాకా, పూర్వ ప్రభుత్వాలు, అధికారులు, సంపన్నులు శతాబ్దాలుగా దేవదేయాల కింద దేవాలయానికి ఇచ్చిన భూములన్నిటినీ కంపెనీ ప్రభుత్వం జప్తుచేసుకుని, వాటి ఆదాయాన్ని స్వాధీనపరుచుకుంది. అలా దేవదేయాలు రద్దుకావడంతో ఆదాయం లేని స్థితి రావడం వల్ల ఈస్టిండియా కంపెనీ ప్రభుత్వకాలంలో తిరుమలలోని ఇన్నిన్ని నైవేద్యాలూ మొత్తంగా నిలిపివేశారు. ఒక్క వడ నైవేద్యం తప్ప వండాల్సిన నైవేద్యాలన్నీ రద్దుచేశారు. ఇక పళ్ళు, పటిక బెల్లం, జీడిపప్పు, బాదంపప్పు, ఖర్జూరం, కిస్‌మిస్ వంటివండని నైవేద్యాలు యాత్రికులు వేంకటేశ్వరస్వామికి భక్తిగా ఎప్పటికప్పుడు సమర్పించుకునేవి మాత్రం కొనసాగాయి. [6] పది బ్రహ్మోత్సవాల్లో తొమ్మిదింటిని రద్దుచేసిన ప్రభుత్వం ప్రసాదాలను రద్దుచేయడం పెద్ద విచిత్రం కాదు. అయితే ఈ రద్దు వెనుక ఆర్థికమైన కారణాలు మాత్రమే కాకుండా కంపెనీ వారి మత పాక్షికత, తిరుమల వంటి పెద్ద ఆలయాల వల్ల భారీగా సంపాదించుకుంటున్న బ్రాహ్మణులను ఆర్థికంగా దెబ్బతీయాలనే ఆలోచన కూడా ఉన్నట్టు కంపెనీ రెవెన్యూ ఉన్నతోద్యోగి ఒకరు రాసిన వ్యాసం సూచిస్తోంది. [నోట్స్ 2][7]

తిరిగి ప్రారంభం

[మార్చు]

1840వ దశకంలో ఈస్టిండియా కంపెనీ ఉన్నతాధికారులు స్థానిక ప్రజల మత వ్యవహారాల్లో కంపెనీ కల్పించుకోవడం సరికాదనీ, దానివల్ల అనవసరమైన ప్రజావ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని నివేదికలు సమర్పించారు. దీనివల్ల హాథీరాంజీ మఠానికి చెందిన మహంతును తిరుమల-తిరుపతి ఆలయాల విచారణకర్తను చేస్తూ, అధికారం వారి పరం చేశారు. ఈస్టిండియా కంపెనీ కాలంలో అప్పటివరకూ స్వామివారికి జరిగే నివేదనలు, సేవలు, ఉత్సవాలు, కైంకర్యాల జాబితా వేసిన సవాల్-జవాబ్ పట్టీ, దిట్టం ఆధారంగా తిరుమలలోని సంప్రదాయాలకు లోటుచేయకుండా పరిపాలించాలని నియమం. [8] తిరుమల ఆలయానికి అప్పటికి వచ్చే రూ. లక్ష పైబడి ఆదాయంలో ముప్ఫై శాతానికి మించి ఖర్చు లేకపోవడంతో, మళ్ళీ నైవేద్యాలు, ప్రసాదాలు పూర్వపు పద్ధతిలో చేయడం ప్రారంభమైంది. [9] మహంతుల పాలన ప్రారంభమైన 90 ఏళ్ళకు 1930లో మహంతుల పాలన ముగిసి ధర్మకర్తల మండలి ఏర్పాటు జరిగి, ఆపైన వివిధ మార్పుచేర్పులకు గురైనా ప్రసాదాలు, నైవేద్యాల పద్ధతి పునరుద్ధరణ చెందాకా ఒడిదుడుకులు లేకుండా స్వామి కైంకర్యాలు సాగుతూ వస్తున్నాయి. 1986లో పోటు మిరాశీదారు వ్యవస్థ రద్దు తర్వాత పూర్తిగా వ్యవస్థ తితిదే చేతిలోకి వచ్చింది. పూర్వపు ప్రసాదం వాటాలు పోయి, తితిదే ముందస్తుగా నిర్ణయించినదాని ప్రకారం చెల్లింపులు చేస్తూన్నారు. [10] తితిదే పరిపాలన కాలంలో తిరుమలలో నిత్యం అన్నప్రసాదాన్ని వితరణ చేయడానికి ఏర్పాట్లు పెరుగుతూ వస్తున్నాయి. దర్శనం చేసుకున్నవారికి కనీసం ఒక రకం ప్రసాదాన్ని ఉచితంగా పంచిపెట్టే ఏర్పాటు జరుగుతోంది. తిరుమల ప్రసాదంపై ప్రజలకు ఉన్న భక్తి, ప్రాధాన్యత వల్ల ప్రసాదాలను చేయించి తితిదే అమ్మేందుకు ఏర్పాటుచేస్తోంది. ఐతే రద్దీ, ప్రసాదాల డిమాండ్ దృష్ట్యా కొన్ని విధాలుగా ప్రసాదాల అమ్మకాల్లోనూ భక్తులకు ఇంత అన్న నిబంధనలు పరోక్షంగానూ, ప్రత్యక్షంగానూ అమలుచేయాల్సివస్తోంది.

వివిధ ప్రసాదాలు

[మార్చు]

లడ్డు

[మార్చు]

తిరుమల ప్రసాదాల్లో అత్యంత ప్రాచుర్యం పొందినది లడ్డు. తిరుమల యాత్రలో లడ్డు ప్రసాదాన్ని స్వీకరించడం, తీసుకువచ్చి స్నేహితులకు, బంధువులకు పంచిపెట్టడం ముఖ్యమైన భాగంగా భక్తులు భావిస్తూంటారు. తిరుమల ప్రసాదం అన్నదానికి పర్యాయపదం అనే స్థాయిని లడ్డు సంపాదించుకుంది. తిరుమలలో ఆవు నెయ్యితో తయారు చేయబడే ఈ లడ్డు ఇక్కడకు వచ్చే భక్తులకు ఉచితంగా లేదా నామమాత్రపు రుసుముకు పరిమితంగా అందజేస్తారు.

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి లడ్డు ప్రసాదానికి భౌగోళిక గుర్తింపు లభించింది. లడ్డు తయారీలోని విశిష్టత, దాన్ని స్వీకరించే భక్తుల్లో దానికి ఉన్న ప్రత్యేకత వంటివి అన్నీ కలిసి ఈ హోదా లభించేలా చేశాయి. లడ్డూల తయారీలో వాడే పదార్ధాలు, ఫార్మూలాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఈ తరహాలో లడ్డూను తయారు చేయాలని ప్రయత్నించిన చాలా సంస్థలు కూడా ఆ రుచిని సాధించలేకపోయాయి. అందుకే టీటీడీ వీటి తయారీకి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది.

అయితే ఇంత విశిష్టత కలిగిన లడ్డు 20వ శతాబ్ది వరకూ తిరుమలలోని వందలాది నైవేద్యాలలో చోటుచేసుకోలేదు. 16వ శతాబ్ది మధ్యభాగం నుంచి మధురం లేక మనోహరపడి అనే పదార్థం బెల్లం, మినపపిండి మిశ్రమంతో ఒక విధమైన సున్నుండలా ఉండేది. అలానే 19వ శతాబ్ది మధ్యభాగం నుంచి తీపిబూందీని ప్రసాదంగా అమ్మడం ప్రారంభమైంది. బహుశా ఈ రెండిటి కలయికగా తిరుమలలో 1942 నుంచి భక్తులకు లడ్డూ ప్రసాదాన్ని అందిస్తున్నారు. తర్వాత చెలికాని అన్నారావు పాలకమండలి అధ్యక్షునిగా, చంద్రమౌళిరెడ్డి కార్యనిర్వహణాధికారిగా ఉండగా ఇప్పటి లడ్డూ రూపంలో పంచదార, సెనగపిండి మిశ్రమం ప్రధానంగా, యాలకులు, కిస్‌మిస్‌లు, జీడిపప్పులు వంటివి పంటికి తగిలేలా రూపకల్పన చేశారు. [11]

51 లడ్డూలను ఒక ప్రోక్తం అంటారు. ఒక్కోసారి వెయ్యి ప్రోక్తాలను తిరుమలలో తయారు చేస్తారు. అంటే 51వేల లడ్డూలన్న మాట. ఇందుకుగాను 2వేల కిలోల శనగ పిండి, 4వేల కిలోల చక్కెర, 1850 కిలోల నెయ్యి, 350 కిలోల జీడిపప్పు, ఎనభై ఏడున్నర కిలోల ఎండుద్రాక్ష, 50 కిలోల యాలకులు, 50 కిలోల కలకండ అవసరమవుతాయి. రోజుకు లక్షా పాతికవేల లడ్డూలను తితిదే పోటు కార్మికులు తయారుచేస్తున్నారు. భవిష్యత్ లో ఈ సంఖ్యను 5 లక్షలకు పెంచి భక్తులు అడిగినన్ని లడ్డూలు పంచాలనేది టీటీడీ ఆలోచన. తిరుమల తిరుపతి దేవస్థానం వారు భక్తులకు 2016 మే నెలలో కోటి లడ్డూలను పంపిణీ చేసి, చరిత్ర సృష్టించింది. తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో అత్యధిక స్థాయిలో ప్రసాద వితరణ జరిగినట్లు రికార్డు నమోదైంది. [12]

15వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దం ఉత్తరార్థం వరకూ తిరుమల ప్రసాదాల్లో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నది వడ. తిరుమల ప్రసాదం అనగానే భక్తులకు వడ గుర్తుకువచ్చే పరిస్థితి ఉండేది. 16వ శతాబ్ది మధ్యభాగంలో ప్రారంభమై 20వ శతాబ్ది ఉత్తరార్థం వరకూ కొనసాగిన మనోహరం పడి అనే తీపివంటకం కూడా వడతో పాటుగా తిరుమలలో ముఖ్య ప్రసాదమనే స్థాయిని కలిగివుండేది. ఈ మనోహరం పడి అన్న ప్రసాదం ఇప్పటి సున్నుండను కొంతవరకూ పోలివుండేది. [13][11]

వివిధ నైవేద్యాలు

[మార్చు]

తిరుమలలో విజయనగర సామ్రాజ్య కాలం నాటికే రోజుకు వందకు పైగా నివేదనలు చేసే పద్ధతి ఏర్పడిపోయింది. వందలాది మంది దాతలు అనేక పదార్థాల నివేదనకు ఏర్పాట్లు చేయడంతో ఎన్నెన్నో నైవేద్యాలు స్వామివారికి నివేదిస్తూవుంటారు. వీటిలో కొన్నిటిని ప్రసాదంగా భక్తులకు పంచిపెట్టడమో, అమ్మడమో చేసే పద్ధతి ఉంది. స్వామి వారి కైంకర్యాలు, ఉత్సవాలు నిర్దుష్టంగా ఈస్టిండియా కంపెనీ పాలనా కాలంలో సవాల్ జవాబ్ పట్టీలో నిర్దేశించడంతో, తిరుమల తిరుపతి దేవస్థానం దానని ప్రమాణంగా తీసుకుని ఈ నివేదనలు కొనసాగిస్తోంది.

వేర్వేరు నైవేద్యాల పేర్లు ఇలా ఉన్నాయి:

అన్న నైవేద్యాలు
  • సంధి తిరుప్పానకం
  • తిరుప్పానకం
  • రజన తిరుప్పానకం
  • వెళ్ళై తిరుప్పానకం
  • అర్ధనాయకతళిగ
  • నాయికతళిగ
  • దద్దోజనం (దధ్యోజనం)
  • మట్టిరాయ్ తళిగ
  • తిరుప్పావడ (పులిహోర లాంటి పదార్థం)
  • తిరువలక్కం
  • తిలాన్నం
  • అక్కలిమండై
  • పంచవాహి - పవిత్ర అన్నం
భక్ష్యాలు
  • అప్పపడి - అప్పాలు
  • అతిరసపడి - అరిసెలు
  • వడైపడి - వడ
  • గోధిపడి - వడ వంటిది
  • సుఖియాన్‌పడి
  • ఇడ్డిలీపడి - ఇడ్లీ
  • సిడైపడి
  • ప్రోదిలింగైపడి
ఇతర పదార్థాలు
  • పోరిపడి - అటుకులు
  • తిరుక్కనమడై లేక మనోహరపడి - మినపలడ్డు (సున్నుండ లాంటిది)
  • పారుప్పువియలు - గుగ్గిళ్ళు
  • తిరుప్పయ్యారం - మినపవడ (పొట్టు ఉన్న మినుములతో చేస్తారు)
  • అవల్‌పడి - గట్టి అటుకులు
  • తెరకులాల్
ఇతర తినుబండారాలు
  • మాత్ర
  • బెల్లం
  • పంచదార
  • రకరకాల పళ్ళు
  • వేయించిన జీడిపప్పు
  • బాదం
  • మినపసున్ని
  • జిలేబీ
  • దోసె
  • వేయించిన నువ్వుల పొడి
  • కజ్జాయం పాలు
  • పెరుగు
  • వెన్న
  • తాంబూలం

ఈ జాబితాలో ఉన్నవి కొన్ని ముఖ్యమైనవి మాత్రమే. ఆలయంలో సంప్రదాయానుసారం వీటికి ప్రాచీన తమిళ పేర్లే ఎక్కువ వాడుక.

నైవేద్యం తయారీ (పోటు)

[మార్చు]

తయారీ నిర్వహణ

[మార్చు]

తిరుమలలో నైవేద్యాల తయారీని పోటు అని పిలుస్తూంటారు. వడ పోటు, లడ్డు పోటు అంటూ వివిధ రకాల నైవేద్యాల తయారీకి పరిభాష. వందల కొద్దీ రాజులు, అధికారులు, సంపన్నులు నైవేద్యాలు తయారుచేయమని ఇచ్చిన ఆదాయాలతో ఎన్నో రకాల నైవేద్యాలు సంప్రదాయానుసారం తయారుచేయాల్సి రావడం అన్నది తొలి నుంచీ తిరుమల ఆలయ నిర్వహణలో ఒక కష్టసాధ్యమైన పనిగానే పేరుతెచ్చుకుంది. ఒక దశలో రోజుకు వందమార్లు నివేదనలు చేసే పరిస్థితి, వందలాది గంగాళాల్లో నైవేద్యాలు తయారుచేయాల్సిన అవసరం ఏర్పడింది. వివిధ రకాల నైవేద్యాలకు సంభారాలు, వాటిని వండేందుకు వంటచెరుకు ఏర్పాటుచేసుకోవడం, వైష్ణవ వంట బ్రాహ్మణులను సమకూర్చుకోవడం - ఇవన్నీ దుర్గమమైన అరణ్యాల నడుమ, కొండమీదికి చేయాల్సిరావడంతో ఆ పని ఆలయ నిర్వాహకులు చేయలేకపోయేవారు. దాంతో ఈ పని మొత్తాన్ని సంబాళించడానికి ప్రత్యేకించి పారంపర్యంగా వచ్చే ఒక గుత్తేదారు వంటి "పోటు మిరాశీదారు"ను ఏర్పాటుచేసుకున్నారు. ఈ పోటు మిరాశీదారుల పనికి జీతంగా కాక ప్రసాదాల్లో పెద్ద భాగంగా ముట్టేది. ఆ ప్రసాదాలను అమ్ముకుని వీరు అత్యంత సంపన్నులుగా మారడమే కాక, తిరుమలలో అధికారం, ప్రాభవం కూడా కలిగివుండేవారు. 1970ల నాటికి వీరికింద 400 మంది వంట బ్రాహ్మణులు రెండు షిఫ్టుల్లో పనిచేసేవారు. [13] ఐతే ఈ వ్యవస్థ 1986లో ప్రభుత్వం అన్నిరకాల మిరాశీలను (వంశపారంపర్య హక్కులు) రద్దుచేయడంతో రద్దు అయింది. పోటు మిరాశీల ఆధ్వర్యంలో ఉన్న వ్యవస్థ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యక్ష బాధ్యతల్లోకి వచ్చి, పోటు మిరాశీదారు కింద పనిచేసే వైష్ణవ వంట బ్రాహ్మణులు అందరూ సంస్థ ఉద్యోగులు అయ్యారు. ఐతే పోటు మిరాశీదారు వ్యవస్థ ఉన్నప్పుడు సంబాళించినంత జాగ్రత్తగా ఆలయం అదుపులోకి వచ్చాకా నిర్వహించలేకపోవడం, ప్రసాదాలకు డిమాండ్ బాగా పెరిగిపోతూవుండడం వంటి కారణాలతో తిరిగి పోటు నిర్వహణకు తితిదే గుత్తేదారును ఏర్పాటుచేసుకుంది. [10]

తయారీ విధానాలు, కైంకర్యం పద్ధతులు

[మార్చు]

తిరుమలలో లడ్డూ వంటి వాటి తయారీకి రకరకాల ఆధునిక పద్ధతులు ఎన్నో అమలులోకి వచ్చాయి. అయితే స్వామివారికి ప్రత్యేకించి ఆలయంలో కైంకర్యం చేసే పదార్థాలను మాత్రం కట్టెల పొయ్యి మీద వండినవే నివేదిస్తారు.

సుప్రభాత సేవ, తోమాల, అర్చన సేవలు ముగిసిన తర్వాత వేంకటేశ్వరుని ఆలయం ఎదురుగా, స్వామి పుష్కరిణి వద్ద కొలువైన ఆది వరాహస్వామివారికి తొలుత నైవేద్యం సమర్పించిన తర్వాత గర్భగుడిలోని మూలవిరాట్టుకు నైవేద్యం సమర్పిస్తారు. తిరుమల వేంకటేశ్వరునికి ఓడు అని వ్యవహరించే పగిలిన కొత్త మట్టికుండలో వెన్న మీగడలు కలిపిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ అన్నాన్ని మాతృ దద్దోజనం అంటారు.

తిరుమలలో ఏకమూర్తి ఆరాధన ప్రత్యేకత. కనుక గర్భగుడిలోని ధృవబేరానికి, పురాణ కథనం ప్రకారం వేంకటేశ్వరస్వామి కొండ మీద కొలువైవుండేందుకు అనుమతించిన భూ వరాహ స్వామికీ తప్ప వేరే ఏ విగ్రహానికి నేరుగా నైవేద్యాన్ని నివేదించరు. వేంకటేశ్వరస్వామికి నివేదించిన పదార్థాలనే మిగిలిన ఏ ఉపాలయాల్లో అయినా నివేదించడం ఆచారం.

నోట్స్

[మార్చు]
  1. వేంకటేశ్వరస్వామికి సమర్పించిన పదార్థాన్ని నైవేద్యంగా, నివేదించాకా భక్తులకు అందేసరికి వాటినే ప్రసాదంగా పిలవడం కద్దు. కనుక సందర్భాన్ని బట్టి నైవేద్యం, ప్రసాదం అన్న పదాలు ఒకటికొకటి పర్యాయపదాల్లా వాడడం జరగవచ్చు.
  2. ఏషియాటిక్ జర్నల్ 1831 మే-ఆగస్టు సంచికలో తిరుమల రెవెన్యూ వ్యవహారాలు చూసే ఈస్టిండియా కంపెనీ ఉద్యోగి రాసిన వ్యాసం (పి.వి.ఆర్.కె.ప్రసాద్ అనువాదం) నుంచి: మనం ఇప్పుడు చేస్తున్నదేమిటి? దేశంలో ఉన్న అన్ని ఆలయాల ఆదాయాలు పోగొట్టి ఆలయ వ్యవస్థను దెబ్బతినేట్లు చేశాం. ఆలయాలలో ఆధిపత్యం, దానివల్ల సమాజంమీద పట్టు ఉన్న బ్రాహ్మణుల ఆదాయాలు పోగొట్టి, వారిని బలహీనపరిచి, సమాజంలో వారి పట్టు పోయేలా చేశాం.... తిరుపతి ఆలయం విషయంలోనూ అంతే. కంపనీ ఆధీనంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం ఆదాయం తగ్గేట్లు చూస్తున్నాం. వచ్చిన ఆదాయం కూడా వారికి దక్కుండా సర్కారుకే చెందేట్లు చూస్తున్నాం. ఇలా కొన్ని సంవత్సరాలు జరిగితే తిరుపతి ఆదాయం పూర్తిగా పడిపోయి, ఆలయ వ్యవస్థ కుప్పకూలి పోతుంది. హిందువులను ఉత్తేజపరచగల స్థోమతగల ఈ ఆలయం నిర్వీర్యం అవుతుంది. అలానే దేశంలోని ఇతర ముఖ్యమైన ఆలయాల విషయం కూడా. ఇవన్నీ తిరుపతిలా కాదు. ఇప్పటికే దెబ్బతిని పోయి ఉన్నాయి.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 పి. వి. ఆర్. కె., ప్రసాద్ (August 2013). "ప్రసాదాలతో 'భక్తివ్యాపారం'". In జి.వల్లీశ్వర్ (ed.). తిరుమల చరితామృతం. ఎమెస్కో బుక్స్.
  2. పి. వి. ఆర్. కె., ప్రసాద్ (August 2013). "తిరుమల కొండమీద స్థలం కొనుక్కోవచ్చు!". In జి.వల్లీశ్వర్ (ed.). తిరుమల చరితామృతం. ఎమెస్కో బుక్స్.
  3. పి. వి. ఆర్. కె., ప్రసాద్ (August 2013). "ఐదు శతాబ్దాలు గడిచినా, అతనే ఆదర్శం". In జి.వల్లీశ్వర్ (ed.). తిరుమల చరితామృతం. ఎమెస్కో బుక్స్.
  4. పి. వి. ఆర్. కె., ప్రసాద్ (August 2013). "సైనిక, రాజకీయ కేంద్రం తిరుపతి". In జి.వల్లీశ్వర్ (ed.). తిరుమల చరితామృతం. ఎమెస్కో బుక్స్.
  5. పి. వి. ఆర్. కె., ప్రసాద్ (ఆగస్టు 2013). "కొండ ఎక్కాలంటే, పన్ను కట్టాలి!". In జి.వల్లీశ్వర్ (ed.). తిరుమల చరితామృతం. ఎమెస్కో బుక్స్.
  6. పి. వి. ఆర్. కె., ప్రసాద్ (ఆగస్టు 2013). "స్వామి చేజారిన వందల గ్రామాలు". In జి.వల్లీశ్వర్ (ed.). తిరుమల చరితామృతం. ఎమెస్కో బుక్స్.
  7. పి. వి. ఆర్. కె., ప్రసాద్ (August 2013). "ఈస్టిండియా కంపెనీ - హిందూమతపు 'దయ్యం'". In జి.వల్లీశ్వర్ (ed.). తిరుమల చరితామృతం. ఎమెస్కో బుక్స్.
  8. పి. వి. ఆర్. కె., ప్రసాద్ (August 2013). "కంపెనీ వదిలేసిన 'బంగారు బాతులు'". In జి.వల్లీశ్వర్ (ed.). తిరుమల చరితామృతం. ఎమెస్కో బుక్స్.
  9. పి. వి. ఆర్. కె., ప్రసాద్ (August 2013). "కంపెనీ వదిలితే బాధ్యత ఎవరికివ్వాలి?". In జి.వల్లీశ్వర్ (ed.). తిరుమల చరితామృతం. ఎమెస్కో బుక్స్.
  10. 10.0 10.1 పి. వి. ఆర్. కె., ప్రసాద్ (August 2013). "తిరుమల మిరాశీలు". In జి.వల్లీశ్వర్ (ed.). తిరుమల చరితామృతం. ఎమెస్కో బుక్స్.
  11. 11.0 11.1 పి. వి. ఆర్. కె., ప్రసాద్ (August 2013). "భక్తుల కోసం గజ్జె కట్టిన ముద్దుకుప్పాయి". In జి.వల్లీశ్వర్ (ed.). తిరుమల చరితామృతం. ఎమెస్కో బుక్స్.
  12. "భారత్ టు డే". bhaarattoday.com/news/regional-news/one-crore-tirumala-laddoos-distributed-in-the-month-of-may-by-ttd/11582.html. 6 June 2016. Archived from the original on 11 జూన్ 2016. Retrieved 6 June 2016. {{cite journal}}: Cite journal requires |journal= (help)
  13. 13.0 13.1 పి. వి. ఆర్. కె., ప్రసాద్ (August 2013). "ఆలయమే ఆళ్వారు అయితే...". In జి.వల్లీశ్వర్ (ed.). తిరుమల చరితామృతం. ఎమెస్కో బుక్స్.