శ్రీశైలం ప్రాజెక్టు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీశైలం దేవస్థానం
ప్రదేశంశ్రీశైలం, నంద్యాల జిల్లా, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశము
నిర్మాణం ప్రారంభం1960
ప్రారంభ తేదీ1981
ఆనకట్ట - స్రావణ మార్గాలు
నిర్మించిన జలవనరుకృష్ణా నది
Height145.10 మీ. (476 అ.)[1][2]
పొడవు512 మీ. (1,680 అ.)
జలాశయం
సృష్టించేదిశ్రీశైలం రిజర్వాయరు (తెలంగాణ)
పరీవాహక ప్రాంతం206,040 కి.మీ2 (79,550 చ. మై.)
ఉపరితల వైశాల్యం800 కి.మీ2 (310 చ. మై.)
విద్యుత్ కేంద్రం
టర్బైన్లు6 × 150MW reversible Francis-type (left bank)
7 × 110MW Francis type(right bank)
Installed capacity1,670 MW

నీలం సంజీవ రెడ్డి శ్రీశైలం ప్రాజెక్టు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా నదిపై నిర్మించిన భారీ బహుళార్థసాధక ప్రాజెక్టు. కేవలం జలవిద్యుత్తు ప్రాజెక్టుగానే ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు, తరువాత కాలంలో నీటిపారుదల అవసరాలను కూడా చేర్చడంతో బహుళార్థసాధక ప్రాజెక్టుగా మారింది. తరువాత కాలంలో ప్రాజెక్టు పేరును నీలం సంజీవరెడ్డి సాగర్ ప్రాజెక్టుగా మార్చారు. 2009 అక్టోబరు 2న ప్రాజెక్టు చరిత్రలోనే అత్యధికంగా 26 లక్షల క్యూసెక్కుల వరద జలాశయంలోకి ప్రవేశించింది.[3] భారీ వరదనీటితో ప్రాజెక్టు సామర్థ్యం కంటే 10 అడుగులపై నుంచి నీరు ప్రవహించింది.

స్థలము

[మార్చు]
శ్రీశైలం ఆనకట్ట 2005 నాడు గేట్లు తీసినప్పటి దృశ్యం

శ్రీశైలం ప్రాజెక్టు ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలం వద్ద ఉంది. ఈ పుణ్యక్షేత్రంలోని పాతాళగంగ స్నానఘట్టానికి 0.8 కి.మీ. దిగువన డ్యాము నిర్మించబడింది. ఇది హైదరాబాదుకు 200 కి.మీ., విజయవాడకు 250 కి.మీ., కర్నూలుకు 180 కి.మీ. దూరంలో ఉంది.

చరిత్ర

[మార్చు]
శ్రీశైల ఆలయం

ప్రాజెక్టు శంకుస్థాపన 1963 జూలైలో అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ చేతుల మీదుగా జరిగింది. 1964లో రూ.39.97 కోట్లుగా ఉన్న ప్రాజెక్టు అంచనా 1991 నాటికి రూ.567.27 కోట్లయింది. డ్యాము నిర్మాణం క్రెస్టుగేట్లతో సహా 1984 డిసెంబరు నాటికి పూర్తయింది. 1985 వర్షాకాలంలో జలాశయం పూర్తి మట్టానికి నీటితో నిండింది. 2009 అక్టోబరు 2న ప్రాజెక్టు చరిత్రలోనే అత్యధికంగా 26 లక్షల క్యూసెక్కుల వరద జలాశయంలోకి వచ్చింది.[4] భారీ వరదనీటితో ప్రాజెక్టు అత్యధిక స్థాయి నీటిమట్టం కంటే 10 అడుగుల పై నుంచి నీరు ప్రవహించింది.

2009 అక్టోబరు వరదలు

[మార్చు]

2009 అక్టోబరు 2న ప్రాజెక్టు సామర్థానికి మించి వరదనీరు వచ్చిచేరింది. అంతకు మూడు దశాబ్దాల ముందు 13 లక్షల క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టులోని 25 లక్షల క్యూసెక్కుల వరదనీరు ప్రవహించడంతో ప్రాజెక్టు అధికారులు భయాందోళనలకు గురయ్యారు. ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని గేట్లను పూర్తిస్థాయిలో ఎత్తినప్పటికీ వరద రాక, పోక కంటే రెట్టింపు స్థాయిలో ఉండటంతో ఒకదశలో ప్రాజెక్టు పైనుంచి నీరు ప్రవహించవచ్చని ప్రాజెక్టు లోతట్టు గ్రామాలు మునిగిపోవచ్చనీ భావించారు. విద్యుదుత్పత్తిని పూర్తిగా నిలిపివేశారు. ప్రాజెక్టు లోతట్టు ప్రాంతాలలోని జనావాసాలను పూర్తిగా ఖాళీ చేయించారు. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా 2009 అక్టోబరు 2 మధ్యాహ్నం నాటికి 896 అడుగులకు చేరింది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం దాటితే ఏ క్షణమైనా వరద ఉధృతితో ప్రాజెక్టుకు ముప్పు ఏర్పడుతుందని భావించిన ఇంజనీర్లు సైతం ప్రాజెక్టు శక్తిని చూసి నివ్వెరపోయారు.[3] అక్టోబరు 2 అర్థరాత్రి నుంచి వరద కొద్దికొద్దిగా తగ్గుముఖం పట్టడంతో ప్రతిగంటకు రెండు అంగుళాల నీటిమట్టం తగ్గడంతో అక్టోబరు 3 సాయంత్రం నాటికి భయాందోళనలు తగ్గాయి.

కుడిగట్టు విద్యుత్కేంద్రం కూడా డ్యాము నిర్మాణంలో భాగంగానే నిర్మించారు. ఈ విద్యుత్కేంద్రంలోని 7 యూనిట్లు 1982లో మొదలుకొని 1987 నాటికి అన్నీ పని ప్రారంభించాయి. ఎడమగట్టు విద్యుత్కేంద్రంలోని 6 యూనిట్లు మాత్రం ప్రాజెక్టు నిర్మాణంలో భాగం కావు. వీటిని తరువాతి కాలంలో రూ.2620 కోట్ల ఖర్చుతో జపాను ఆర్థిక సహాయంతో నిర్మించారు. 2001, 2003 మధ్యకాలంలో ఈ యూనిట్లన్నీ పని ప్రారంభించాయి.

ప్రాజెక్టు గణాంకాలు

[మార్చు]

డ్యాము

[మార్చు]
  • డ్యాము పొడవు:512మీ.
  • క్రెస్టుగేట్ల సంఖ్య:12
  • జలాశయం పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం:263 టి.ఎం.సి
  • ఇందులో వాడుకోగలిగే నీరు:223 టి.ఎం.సి

కుడిగట్టు విద్యుత్కేంద్రం

[మార్చు]
  • మొత్తం ఉత్పత్తి సామర్థ్యం: 770 మె.వా.
  • యూనిట్ల సంఖ్య: 7 x 110 మె.వా.

ఎడమగట్టు విద్యుత్కేంద్రం

[మార్చు]

ఎడమగట్టు విద్యుత్కేంద్రం భూగర్భంలో నిర్మింపబడింది. జపాను ఆర్థిక సహాయంతో నిర్మించబడిన ఈ కేంద్రం దేశంలోనే అరుదైనది.

  • మొత్తం ఉత్పత్తి సామర్థ్యం:900 మె.వా.
  • యూనిట్ల సంఖ్య: 6 x 150 మె.వా.

విద్యుత్ ఉత్పత్తి

[మార్చు]

ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ప్రారంభ నీటి లభ్యత (ఇన్‌ఫ్లోస్) విద్యుత్ ఉత్పత్తి కోసం ఉపయోగించకుండా కేవలం అధికంగా నీటిని నిల్వ చేస్తున్నారు. మిగిలిన ఖాళీ శ్రీశైలం జలాశయంలో వరద నీరు త్వరగా నింపుతుంది. దానివల్ల అధిక మొత్తంలో వరద నీరు కిందకు పంపుటకు విద్యుత్ వాడే అవసరం లేకుండానే పొంగి అత్యంత దిగువన ఉన్ననాగార్జున సాగర్ ఆనకట్ట జలాశయం చేరుతుంది. నాగార్జున సాగర్ లో విద్యుదుత్పత్తికి వాడుతున్నారు.[5] ఏకరీతి (ఒకే పరిమాణం) గా నీటి విడుదలతో అన్ని విద్యుత్ తయారీ యూనిట్ల ద్వారా పూర్తిగా నాగార్జునసాగర్ రిజర్వాయర్ పూరించడానికి ప్రయత్నం ఉండాలి.

సాగునీటి సరఫరా వివరాలు

[మార్చు]

కర్నూలు, కడప, నెల్లూరు, చిత్తూరు, నల్గొండ జిల్లాలతో పాటు చెన్నైకి తాగునీటి సరఫరాకు అవసరమైన నీటిని శ్రీశైలం ప్రాజెక్టు నుండి తీసుకునే ఏర్పాట్లతో ప్రాజెక్టు తొలి ప్రతిపాదనలకు మార్పులు జరుగుతూ వచ్చాయి. ఇందులో భాగంగా శ్రీశైలం కుడి ప్రధాన కాలువ రాయలసీమ ప్రాంతాలకు నీరు తిసుకువెళ్తుంది. ఎడమ కాలువ నల్గొండ జిల్లాకు నీటి సరఫరా చేస్తుంది.

కుడి ప్రధాన కాలువ: కర్నూలు జిల్లాలోని పోతిరెడ్డిపాడు గ్రామం వద్ద గల పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా శ్రీశైలం ప్రాజెక్టు నుండి బయలుదేరే 16.4 కి.మీ. పొడవైన ఈ కాలువ బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వద్దకు చేరి అంతమవుతుంది. బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ మూడు రెగ్యులేటర్ల కలయిక. కుడి రెగ్యులేటర్ నుండి కుడి బ్రాంచి కాలువ ద్వారా కడప, కర్నూలు జిల్లాలకు నీరు సరఫరా అవుతుంది. ఈ కాలువ 50 కి.మీ. దూరంలోని గోరకల్లు బాలెన్సింగు జలాశయం (పూర్వ ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు పేరిట దీనికి నరసింహరాయ జలాశయం అని పేరు పెట్టారు) కు, 112.7 కి.మీ. దూరంలోని అవుకు జలాశయానికి నీటిని చేరుస్తుంది. కృష్ణలో శ్రీశైలం ప్రాజెక్టు వద్ద లభించే అదనపు నీటిని ఈ జలాశయాల్లోకి మళ్ళించే పథకమిది. కర్నూలు, కడప జిల్లాల్లో 1,90,000 ఎకరాలకు నీరందించే ప్రాజెక్టిది.

బనకచర్ల ఎడమ రెగ్యులేటర్ నుండి తెలుగుగంగ ప్రాజెక్టుకు సంబంధించిన కాలువ బయలుదేరి వెలుగోడు జలాశయానికి, అక్కడి నుండి పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి జలాశయానికి, సోమశిల ప్రాజెక్టుకు చేరుతుంది. మధ్య రెగ్యులేటర్ ద్వారా వరద సమయంలో వెల్లువెత్తే నీటిని నిప్పులవాగులోకి వదిలే ఏర్పాటు ఉంది. జాతీయ నదుల అనుసంధానంలో భాగంగా కృష్ణా, పెన్నా నదులను కలిపే ప్రణాళికలో ఈ రెగ్యులేటర్ ద్వారా నిప్పులవాగు, గాలేరు, కుందేరు, పెన్నాలను కలిపే ప్రతిపాదన ఉంది.

శ్రీశైలం ఎడమ కాలువ: తొలి ప్రతిపాదనలను అనుసరించి, ఎడమ కాలువ సొరంగ మార్గం ద్వారా ప్రయాణించి, నల్గొండ జిల్లాలో 3 లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చేందుకు 30 టి.ఎం.సి నీటిని సరఫరా చేస్తుంది. అయితే తరువాతి కాలంలో ఈ ప్రతిపాదన వెనక్కుపోయి, దాని స్థానంలో ఎత్తిపోతల పథకం పరిశీలన లోకి వచ్చింది. అదే ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు జలాశయం నుండి నీటిని పంపుచేసి, నల్గొండకు తాగు, సాగునీరు అందించే ప్రాజెక్టు ఇది. భారతదేశపు అతిపెద్ద ఎత్తిపోతల పథకమైన ఈ ప్రాజెక్టు ద్వారా నల్గొండ జిల్లాలో 2.7 లక్షల ఎకరాలకు సాగునీరు, 212 ఫ్లోరైడు ప్రభావిత ప్రాంతాలకు తాగునీరు అందించే ప్రాజెక్టు ఇది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు జలాశయం నుండి నీటిని పుట్టంగండి వద్ద కొండపైనున్న జలాశయంలోకి నాలుగు పంపుల ద్వారా ఎత్తిపోస్తారు. అక్కడినుండి 10 కి.మీ. దూరంలోని అక్కంపల్లి బాలెన్సింగు జలాశయం లోకి నీరు చేరుతుంది. అయితే ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నుండి 143 కి.మీ. సొరంగం తవ్వి సహజంగా నీటిని పారించే ప్రతిపాదనపై సర్వే జరుగుతున్నది.

ముంపు, పునరావాసం

[మార్చు]

జలాశయంలో మునిగిపోయే గ్రామాల ప్రజల పునరావాసానికి సంబంధించి, శ్రీశైలం ప్రాజెక్టు ఎంతో వివాదాస్పదమైంది. కర్నూలు, మహబూబ్‌నగర్‌ జిల్లాలలోని 100 గ్రామాలు, 17 శివారు పల్లెలు జలాశయంలో మునిగిపోయాయి.ఆనాటి ప్రభుత్వాలు ముంపు బాధితులను కనీసం మనుసులగానైనా చూడలేదు. ఈ రోజుకు అమాయక రైతులకు కనీస న్యాయం చేయలేదు. మన ప్రభుత్వాలు, మనం హిరోసిమ నాగసాకి లను మాత్రమే గుర్తు పెటుకుంటాం కానీ మన మధ్య జరిగిన మానవ విద్వంసం అమాయక రైతులకు జరిగిన అన్యాయం మనకు తెలియదు.

సూచనలు

[మార్చు]
  • "India: National Register of Large Dams 2009". [1] Central Water Commission. Retrieved 10 July 2011.
  • Jauhari, V.P. (2005). Sustaining river linking. [2] New Delhi, India: Mittal Publications. p. 84. ISBN 817099991X.
  • Managing historic flood in the Krishna river basin in the year 2009. [3]
  • Optimisation of power generation from Srisailam Hydroelectric Power Station. [4]

బయటి లింకులు

[మార్చు]

  • టి.ఎం.సి:(Thousand Million Cubic Feet) శతకోటి ఘనపుటడుగులు. ఘనపరిమాణపు కొలత.
  • క్యూసెక్కు: క్యూబిక్ ఫుట్/సెకండు. ప్రవాహపు రేటు యొక్క కొలత. 1 క్యూసెక్కు = 28.317 లీటర్లు/సెకండు


దృశ్యమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "India: National Register of Large Dams 2009" (PDF). Central Water Commission. Archived from the original (PDF) on 19 ఫిబ్రవరి 2018. Retrieved 10 July 2011.
  2. Jauhari, V.P. (2005). Sustaining river linking. New Delhi, India: Mittal Publications. p. 84. ISBN 817099991X.
  3. 3.0 3.1 సాక్షి దినపత్రిక, తేది 04-10-2009
  4. ఈనాడు దినపత్రిక, తేది 03-10-2009
  5. Optimisation of power generation from Srisailam Hydroelectric Power Station