Jump to content

అశ్వమేధ పర్వము చతుర్థాశ్వాసము

వికీపీడియా నుండి
(అశ్వమేధ పర్వము చతుర్ధాశ్వాసము నుండి దారిమార్పు చెందింది)


చతుర్ధాస్వాసం

[మార్చు]

అశ్వమేధయాగము ముహూర్తము సమీపింగానే వ్యాసుడు మొదలైన ఋత్విక్కులు వేదహితముగా ధర్మరాజు చేత యాగదీక్ష చేయించారు. ధర్మరాజు దండము ధరించి కృష్ణాజినము మీద కూర్చున్నాడు. తరువాత యాగాశ్వమును పూజించి యాగాశ్వమును వదిలి పెట్టాడు. యాగాశ్వము బయలు దేరింది. అర్జునుడు గాడీవము చేతబూని తన సైన్యముతో యాగాశ్వముకు రక్షణగా వెంబడించాడు. హస్థినాపుర ప్రజలందరూ పురవీధులలో రెండు వైపులా నిలిచి అర్జునుడిని ఆశీర్వదించారు. వారి ఆశీర్వాదాలు వినయంగా స్వీకరిస్తూ అర్జునుడు యాగశ్వముకు రక్షణగా బయలుదేరాడు. అర్జునుడి వెంట యజ్ఞవల్క్య శిష్యుడు మరికొంత మంది బ్రాహ్మణులతో అర్జునుడి వెంట బయలుదేరాడు.

అశ్వమేధయాగ సందర్భంగా తామ్రధ్వజునితో పోరాడుతున్న అర్జునుడు-రాజ్మానామా నుండి ఒక దృశ్యం

ఆశ్వము త్రిగర్త దేశములో ప్రవేశించుట

[మార్చు]

యాగాశ్వము ఉత్తర దిక్కుగా ప్రయాణిస్తూ త్రిగర్తదేశంలో ప్రవేశించింది. త్రిగర్తాధీశుని కుమారులు, మనుమలు ఉత్సాహవంతులై అశ్వమును పట్టడానికి ముందుకు ఉరికారు. అర్జునుడు వారితో అనునయంగా ఇలా చెప్పాడు. " రాకుమారులారా ! ఇది ధర్మరాజుతో విడువబడిన యాగాశ్వము. దీనికి కీడుతలపెట్టిన అది ధర్మరాజుకు కీడుతలపెట్టిన దానితో సమానము. మనలో మనకు వైరము ఎందుకు సఖ్యతతో ఉంటాము. ధర్మరాజు నాతో " మహాభారత యుద్ధములో రాజులందరూ మరణించారు. ప్రస్తుతము వారి కుమారులు మాత్రమే ఉన్నారు. నీవు వారిమీద దయ చూపించు. వారిని చంపవద్దు. వారికి మనమధ్య కల బంధమును వివరించి వారితో స్నేహబంధాన్ని వృద్ధి చేయ ప్రయత్నించు " అని చెప్పాడు. కనుక నేను మీతో పోరాడను. మీరు కూడా ధర్మరాజుతో సఖ్యతను ఏర్పరచుకుని మీ ప్రాణములు రక్షించుకోండి. అని వినయంగా పలికిన అర్జునుడి మాటలను పెడచెవిన పెట్టిన త్రిగర్తాదీశుడు సూర్యవర్మ అర్జునుడి మీద శరవర్షము కురిపించాడు. అర్జునుడికి యుద్ధము చేయక తప్పలేదు కనుక సూర్యవర్మ బాణాలను మధ్యలోనే తుంచి వేసాడు. సూర్యవర్మ తమ్ముడు కేతువర్మ అన్నకు తోడుగా యుద్ధానికి వచ్చాడు. అర్జునుడు అతడి బాణములను కూడా మధ్యలోనే తుంచివేసి వారిని యుద్ధరంగము నుండి తరిమివేసాడు. తరువాత కేతువర్మ తమ్ముడు ధృతవర్మ అర్జునుడిని ఎదిరించి తన బాణకౌశలముతో అర్జునుడిని మెప్పించాడు. అర్జునుడు అతడి బాణములను మధ్యలో తుంచుతూ అతడిని వదిలివేసినా అతడు అర్జునుడి మీద వాడి అయిన బాణములు వేసి బాధించాడు. అర్జునుడు కోపించి అతడిమీద వాడి అయిన బాణ ప్రయోగము చేసాడు. అతడు అర్జునుడి చేతి మీద వేసిన బాణము దెబ్బకు అర్జునుడు గాండీవమును జారవిడిచాడు. అది చూసిన త్రిగర్తసేనలు హర్షధ్వానాలు చేసినా సైన్యాధీశులు మాత్రము " అర్జునుడు ధర్మరాజు మాట మీద గాండీవము జారిపడినా ఊరుకున్నాడు కాని అర్జునుడు కోపించిన మనమంతా భస్మముకాక తప్పదు " అని చెప్పి అర్జునుడికి ఎదురుగా వారంతా నిలిచారు. ఇంతలో అర్జునుడు కింద పడిన గాండీవమును చేత పట్టుకుని పిడుగుల వంటి బాణములను ప్రయోగించి త్రిగర్త సైన్యాలను పీనుగుపెంట చేసాడు. త్రిగర్తదేశ సైన్యాలు చెదిరిపోగా మిగిలిన వారు అర్జునుడిని శరణువేడారు. అర్జునుడు వారిని వెంబడించక వదిలివేసాడు. ఇలా అర్జునుడు త్రిగర్తసైన్యాలను జయించాడు.

అశ్వము ప్రాగ్జ్యోతిషపురంలో ప్రవేశించుట

[మార్చు]

తరువాత అశ్వము ప్రాగ్జ్యోతిషపురములో ప్రవేశించింది. భగదత్తుడికుమారుడు వజ్రదత్తుడు ప్రాగ్జ్యోతిషపురమును పాలిస్తున్నాడు. అతడు హయమును అడ్డగించి అర్జునుడిని ఎదుర్కొన్నాడు. అర్జునుడి వాడి అయిన బాణముల ధాటికి తాళలేక పారి పోయిన వజ్రదత్తుడు హయమును వదిలి పారిపోయి తిరిగి ఏనుగు ఎక్కి వచ్చాడు. అర్జునుడు ముందు వజ్రదత్తుడి బాణములను మధ్యలో తుంచినా అతడి మీద వాడి అయిన బాణ ప్రయోగము చేయ లేదు. వజ్రదత్తుడు అర్జునుడి మీద ప్రయోగించిన వాడి అయిన బాణములకు ప్రతిగా అర్జునుడు కూడా వాడి అయిన బాణములు ప్రయోగించి వజ్రదత్తుడిని కింద పడవేసాడు. కింద పడిన వజ్రదత్తుడు తిరిగి ఏనుగు ఎక్కి అర్జునుడిని తన బాణములతో కప్పి వేసాడు. ఇలా వారి మధ్య మూడు రోజులపాటు హోరాహోరీగా యుద్ధము సాగింది. నాలుగవ రోజున వజ్రదత్తుడు విజృంబించి " అర్జునా ! నా తండ్రి వృద్ధుడు కనుక అతడు యుద్ధములో మీ చేత మరణించాడు. కాని యువకుడిని అయిన నన్ను జయించడము అసాధ్యము " అన్నడు. అంటూ అర్జునుడి మీదకు కొండవంటి ఏనుగును తోలి అర్జునుడి మీద బాణవర్షము కురిపించాడు. అర్జునుడు ఒకే బాణముతో ఆ ఏనుగును పడగొట్టి వజ్రదత్తుడిని కింద పడవేసి అతడిని చూసి " వజ్రదత్తా ! ఈ యాగాశ్వమును వదులుతూ ధర్మరాజు నన్ను ఈ యాగాశ్వముకు రక్షకుడిగా నియమించి " అర్జునా ! ఈ అశ్వమును అడ్డగించిన వారిని వధించక వారిమీద కరుణ వహించు" అని చెప్పాడు. కనుక నేను నిన్ను చంపను. నాకు నీ మీద ఎలాంటి కోపము లేదు. ధర్మరాజు తరఫున నేను నిన్ను బంధుమిత్ర సమేతంగా వచ్చే చైత్రశుద్ధ పౌర్ణమి నాటికి ధర్మరాజు నిర్వహిస్తున్న అశ్వమేధయాగానికి ఆహ్వానిస్తున్నాను. నీవూ అ యాగముకు వచ్చి యాగమును జయప్రథము చెయ్యి " అని పలికాడు. వజ్రదత్తుడు కూడా అందుకు సమ్మతించి యాగాశ్వమును వదిలి అర్జునుడితో సంధి చేసుకున్నాడు.

అశ్వము సింధుదేశములో ప్రవేశించుట

[మార్చు]

తరువాత యాగాశ్వము సింధుదేశములో ప్రవేశించింది. సింధుదేశపురాజు సైంధవుడు మహాభారతయుద్ధములో మరణించగా అతడి కుమారులు మనుమలు మాత్రము రాజ్యముచేస్తున్నారు. వారంతా అర్జునుడి మీద ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. వారి ధాటికి అర్జునుడు తట్టుకోలేక గాడీవమును జారవిడిచి తిరిగి శక్తిని కూడతీసుకుని వారిమీద విరుచుకు పడి సింధురాజుల మీద వారి సైన్యాలను చీల్చిచెండాడి రణభూమిని శవాల పెంటకుప్పగా మార్చాడు. సైన్యము చెల్లాచెదురు అయినా సింధురాజులు సైన్యాలను కూడదీసుకుని యుద్ధానికి తలపడ్డారు. అర్జునుడు వారితో ధర్మరాజు చెప్పిన శాంతి వచనాలు చెప్పాడు. అయినా సింధురాజులు వాటిని పెడచెవిన పెట్టి అర్జునుడిని ఎదుర్కొన్నారు. అర్జునుడు చేసేది ఏమి లేక వారి వీరులను సంహరించారు. అప్పుడు దుస్సల రోదిస్తూ వారి వద్దకు వచ్చింది. అర్జునుడు దుస్సలను చూడగానే రధము దిగి ఆమెను సమీపించాడు. దుస్సల అర్జునుడితో " అన్నయ్యా ! వీడు నీ మేనల్లుడి కుమారుడు. నీ మనుమడు. వీడిని రక్షించు " అన్నది. అర్జునుడు " అమ్మా దుస్సలా ! నా మేనల్లుడు ఎక్కడ? " అని అడిగాడు. దుస్సల " అన్నా ! తన తండ్రి సైంధవుడు నీ చేతిలో భారతయుద్ధములో మరణించిన విషయము తెలిసి నా కుమారుడు చాలా దుఃఖించాడు. ఇప్పుడు నువ్వు వచ్చిన విషయము తెలిసి గుండె ఆగి మరణించాడు. ఇప్పుడు వీడొక్కడే వంశాంకురము మిగిలాడు " అని చెప్పింది. ఆ మాటాలకు అర్జునుడు కూడా దుఃఖించాడు. తిరిగి దుస్సల " అన్నయ్యా అర్జునా ! ధృతరాష్ట్రులు మీకు చేసిన అపకారములు, సైంధవుని అనుచిత ప్రవర్తన మనసులో పెట్టుకోకు. తండ్రి లేని వాడైన నా మనుమడిని రక్షించు " అని మనుమడితో అర్జునుడికి పాదాభివందనము చేయించింది. అర్జునుడు " అమ్మా ! నీ సోదరుడు సుయోధనుడు దుర్మార్గుడే కాని మేము మాత్రము తక్కువా చెప్పు. ఇంతటి ఘోరయుద్ధానికి మేము కూడా కారణం అయ్యాము. రాచకులములో పుట్టడం ఎంతటి మహాపాపము. దుస్సలా ! నీ మనుమడికి హానిచెయ్యను నీవూ భయపడవలసిన పని లేదు " అని పలికాడు. ఆ మాటలకు దుస్సల సంతోషించిన దుస్సల మనుమడిని తీసుకుని వెళ్ళింది. అర్జునుడు అశ్వాన్ని విడిపించుకుని జయిత్రయాత్ర సాగించాడు.

అశ్వము మణిపూర్వక నగరంలో ప్రవేశించుట

[మార్చు]

ఆ తరువాత యాగాశ్వము నిరాఘాటంగా పయనిస్తూ మణీపూర రాజ్యములో ప్రవేశించింది. మణిపూరాజ్యాన్ని అర్జున చిత్రాంగధల కుమారుడైన బభ్రువాహనుడు పాలిస్తున్నాడు. బభ్రువాహనుడు తనతండ్రి అర్జునుడు యాగాశ్వరక్షకుడిగా రాజ్యంలో ప్రవేశించాడన్న విషయము తెలుసుకుని అర్జునుడికి స్వాగతము చెప్పడానికి తగిన ఏర్పాటుతో ఎదురు వచ్చాడు. కాని అర్జునుడు తన కుమారుడైన బభ్రువాహనుడు వీరమును ప్రదర్శిస్తూ అశ్వమును పట్టకుండా తనకు స్వాగతము పలకడము భీరుత్వములా అనిపించింది. అందుకని అర్జునుడు " బభ్రువాహనా ! నీవు నా కుమారుడివి పైగా వీరుడివి. నీవిలా పిరికివాడిలా స్వాగతము పలుకక నీ వీరమును ప్రదర్శించి నన్ను ఎదుర్కొనడమే క్షత్రియ ధర్మము. అలా ఎదిరించినప్పుడే ఉత్తమక్షత్రియుడవు అనిపించుకుంటావు. అప్పుడే నీకు రాజయ్యే అర్హత ఉంటుంది " అంటూ బభ్రువాహనుడిని రెచ్చగొట్టాడు. అయినా బభ్రువాహనుడికి అర్జునుడిని ఎదుర్కొనడానికి మనస్కరించక తిరిగి రాజ్యానికిపోసాగాడు. మార్గమధ్యంలో బభ్రువాహనుడిని కలుసుకున్న నాగరాజ కుమార్తె అయిన ఉలూపి అతడిని కలుసుకుని " బభ్రువాహనా నేను అర్జునుడి పత్నిని నీకు తల్లిని. అర్జునుడు తనకుమారుడైన నిన్ను వీరుడిలా చూడాలని అనికుంటాడే కాని పిరికివాడిలా స్వాగతం చెప్పాలని ఎదురు చూడడు. కనుక యాగాశ్వమును అడ్డగించి నీ తండ్రి అర్జునుడి ముందు నీ వీరమును ప్రదర్శించి అతడికి ఆనందము కలిగించు. ఇది ఉత్తమ క్షత్రియధర్మము " అని ఉలూపి బభ్రువాహనుడితో చెప్పింది. బభ్రువాహనుడు ఉలూపికి నమస్కరించి " అమ్మా ఉలూపి ! నేను నా తండ్రి అయిన అర్జుడితో యుద్ధము చేయ మనస్కరించక తిరిగి పోతున్నాను. కన్న తండ్రితో యుద్ధము చేయడము ధర్మము కాదని అకున్నాను. లేకున్న నేను యుద్ధము చేయలేక కాదు ఇక నేను యుద్ధముచేయక తిరిగి రాను. ఇప్పుడు నా తల్లివైన నీ అనుమతి లభించింది. కనుక నాకిక ఎవరి అనుమతితో పని లేదు. నేను నా తండ్రి అర్జునుడిని ఎదుర్కొని యుద్ధము చేసి నా తల్లి తండ్రులను ఆనందపరుస్తాను " అని చెప్పాడు.

బభ్రువాహనుడు అర్జునుడిని ఎదుర్కొనుట

[మార్చు]
బబ్రువాహనుని చేతిలో అర్జునుని మరణము--రాజ్మానామా నుండి ఒక దృశ్యం

బభ్రువాహనుడు తల్లికి నమస్కరించి తనతండ్రి అర్జునుడితో యుద్ధానికి సన్నద్ధము అయ్యాడు. ముందుగా అశ్వాన్ని బంధించి తరువాత అర్జునుడిని ఎదుర్కొన్నాడు. ముందుగా బభ్రువాహనుడు అర్జునుడి మీద బాణప్రయోగము చేసాడు. అర్జునుడు కుమారుడు వేసిన బాణములను మధ్యలోనె తుంచివేసి బభ్రువాహనుడి శరీరములో నాటేలా పదునారు బాణములు ప్రయోగించాడు. బభ్రువాహనుడు బదులుగా ఇరువది బాణములు అర్జునుడి శరీరములో నాటాడు. కుమారుడి యుద్ధకౌశలానికి మురిసిపోయిన అర్జునుడు ముండూఘమను శరమువేసి బభ్రువాహనుడి ధ్వజమును విరిచాడు. బభ్రువాహనుడు బెదరక అర్జునుడి భుజములో గుచ్చేలా ఒక బాణమును ప్రయోగించాడు. అర్జునుడు ఆదెబ్బకు దిమ్మతిరిగినా అంతలోనే తేరుకుని కుమారుడి యుద్ధకౌశలానికి మెచ్చుకుని తిరిగి బభ్రువాహనుడి మీద శరప్రయోగము చేసాడు. బభ్రువాహనుడు వాటిని అన్నింటినీ మధ్యలోనే తుంచాడు. కుమారుడి యుద్ధకౌశలానికి అర్జునుడిలో ఒకింత కోపము వచ్చింది బదులుగా బభ్రువాహనుడి శరీరము అంతా బాణములు గుచ్చాడు. బభ్రువాహనుడు కూడా పట్టరాని కోపంతో ఒక బాణాన్ని అర్జునుడి గుండెలలో సూటిగా గుచ్చాడు. ఆ బాణము అర్జునుడి గుండెలను చీల్చుకుంటూ బయటకు వెళ్ళింది. అర్జునుడు నేలకు ఒరుగుతూ బభ్రువాహనుడి మీద బాణాలను ప్రయీగించాడు. ఆ బాణముల ధాటికి బభ్రువాహనుడు కూడా నేలకు ఒరిగాడు.

చిత్రాంగద దుఃఖించుట

[మార్చు]

చిత్రాంగదకు అర్జునుడు, బభ్రువాహనుడు నేలకొరిగిన విషయము తెలిసి పరుగు పరుగున యుద్ధభూమికి తరలి వచ్చింది. ఉలూపీ కూడా యుద్ధభూమికి వచ్చింది. ఉలూపీణీ ఛుసిన చిత్రాంగద " ఉలూపీ ! నీ వలన ఎంత ఘోరము జరిగిందో చూసావా ! తండ్రి కొడుకులను యుద్ధానికి పురికొలిపిన ఫలితంగా వారిరువురు ఇలా అచేతనులయ్యారు. నీవూ పతివ్రతవు కాదా ! నీకు ధర్మము తెలియదా ! నీవు ఈ పసివాడిని తండ్రిమీద ఎందుకు యుద్ధానికి పురికొల్పావు. నీవె మనభర్త అర్జునుడిని పునరుజ్జీవితుడిని చెయ్యాలి. నీ వలననే ఈ ఘోరము జరిగింది కనుక అర్జునుడిని పునరుజ్జీవితుడిని చేయవలసిన బాధ్యత నీదే " అన్నది చిత్రాంగద. తరువాత చిత్రాంగద అర్జునుడిని చూసి " నాధా మహావీరా ! ఎందరి ప్రాణాలనో కాపాడిన నీవిలా నీ ప్రాణాలు కాపాడ లేక పోయావు. ప్రాణనాధా ! ఎన్ని రోజులైంది నిన్ను చూసి. కళ్ళు తెరచి చూడండి నేను మీ చిత్రాంగదను వచ్చాను. మీరు మీ అన్న గారి యాగాశ్వమును కాపాడాలి. లేవండి యాగాశ్వము వెంట వెళ్ళండి " అని శోకించింది చిత్రాంగద. మరలా ఉలూపిని చూసి ఇతడు మన ఇద్దరికి భర్త. నాకుమారుడి చేతిలోనే నా భర్త ప్రాణాలు పోయేలా చేసావు. నీవు ముందు నా భర్తను బ్రతికించక పోయినచో నేను ప్రాయోపవేశము చేస్తాను " అని దృఢంగా చెప్పింది.

బభ్రువాహనుడు విలపించుట

[మార్చు]

ఇంతలో మూర్చ నుండి లేచిన బభ్రువాహనుడు ఏడుస్తున్నా చిత్రాంగదను చూసి " అమ్మా ! నీవు శోకించడము నేను ఎన్నెడూ చూడ లేదు. ఇది కూడదు తగదు అని చూడక కన్నతండ్రిని యుద్ధములో చంపిన మహాపాపిని నేను. నా పాపానికి నిష్కృతి లేదు " అని తల్లి పక్కన కూర్చుని బభ్రువాహనుడు విలపించసాగాడు. ఇంతలో అక్కడకు వచ్చిన యాజ్ఞవల్క్య శిష్యులు మిగిలిన బ్రాహ్మణులు అక్కడకు వచ్చారు. వారిని చూసిన బభ్రువాహనుడు " అయ్యో ! ఈ బ్రాహ్మణులు అర్జునుడిని అనుసరించి వచ్చారు. ఇక్కడ అర్జునుడు విగతజీవుడై పడి ఉన్నాడు " అని శోకించసాగాడు. తిరిగి ఉలూపిని చూసి " అమ్మా ! నీ మాట మీద నిన్ను సంతోషపరచాలని కదా నా తండ్రి అర్జునుడితో యుద్ధము చేసాను. నా తండ్రి మరణానికి నేనే కారణమయ్యాను. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా ! తండ్రినిచంపిన నా పాపానికిక నిష్కృతిలేదు. నాకిక మనశ్శాంతి లేదు ఉత్తమలోక ప్రాప్తిలేదు " అని విలపించసాగాడు. తరువాత పైకి లేచిన బభ్రువాహనుడు తల్లి చిత్రాంగద అక్కడ చేరిన జనులు వినేలా " నా తండ్రి లేని లోకంలో నేనిక బ్రతుకలేను. నేనిక నా తండ్రితో కలసి ప్రాయోపవేశము చేస్తాను. వీరుడు, రాజు, ధార్మీకుడు, మీదు మిక్కిలి నా తండ్రి అయిన అర్జునుడిని చంపిన నాకిక ప్రాయోపవేశమే గతి " అని నేల మీద మౌనంగా కూర్చున్నాడు.

ఉలూపి బభ్రువాహనుడిని ఓదార్చుట

[మార్చు]

అప్పటి వరకు ఒక్క మాట మాట్లాడక ఊరక ఉన్న ఉలూపి కళ్ళు మూసుకుని తన మనసులో నాగజాతికి ప్రియమైన సంజీవమణిని స్మరించింది. వెంటనే ఉలూపి చేతిలో సంజీవనీ మణి ప్రత్యక్షము అయింది. ఉలూపి బభ్రువాహనుడిని చూసి " కుమారా ! ఏమిటయ్యా ఈ వెర్రి. మీ అందరికి పిచ్చి ఏమైనా పట్టిందా ! లేకున్న అర్జునుడు ఏమిటి చావడము ఏమిటి సాక్షాత్తు దేవేంద్రుడికి కుమారుడైన అర్జునుడు యుద్ధమున మరణిస్తాడా ! అతడిని చంపకలిగిన వీరుడు ఈ లోకంలో ఉన్నాడా ! నీ శక్తిని పరీక్షించడానికి అర్జునుడితో పోరాడమని చెప్పి అర్జునుడి అభిమతము నెరవేర్చాను. మీలో ఎవరూ చావలేదు. కేవలము మూర్చపోయేలా చేసాను. అర్జునుడు చనిపోయాడని అనుకోవడము కేవలము నీ భ్రమ. నీ తండ్రి అర్జునుడు ఇప్పుడే లేచి కూర్చుంటాడు చూడు " అని పలికింది. ఆ మాటలకు అందరూ ఒక్కసారిగా ఆనందాశ్చర్యచకితులు అయ్యారు. ఉలూపి బభ్రువాహనుడి చేతిలో ఆమణిని పెట్టి " కుమారా ! ఈ మణిని అర్జునుడి గుండెల మీద పెట్టు " అని చెప్పింది. బభ్రువాహనుడు ఆ మణిని అర్జునుడి గుండెల మీద పెట్టగానే అర్జునుడు నిద్ర నుండి మేల్కొన్నట్లు లేచి బభ్రువాహనుడిని చూసి " కుమారా ! కుశలమా " అని అడిగాడు. అప్పుడు బభ్రువాహనుడు " మీ దయ వలన అంతా క్షేమమే " అని అర్జునుడి కాళ్ళకు మొక్కాడు. అర్జునుడు తన చుట్టూ చిత్రాంగద, ఉలూపి, బ్రాహ్మణులను వారి ముఖాలలోని ఆశ్చర్యానందాలను చూసి " కుమారా ! వీ రందరి ముఖాలలో ఆనందము ఆశ్చర్యము విషాదము ఒక్కసారిగా కనిపిస్తున్నాయి. పైగా మన ఇరువురి మధ్య యుద్ధము జరుగుతున్న సమయంలో చిత్రాంగద, ఉలూపి ఎందుకు వచ్చారు అని అడిగాడు. అప్పుడు బభ్రువాహనుడు ఉలూపిని చూపి " తండ్రీ ! ఈమెను అడగండి ఈ మహానుభావురాలు జరిగినది అంతా మీకు వివరిస్తుంది " అని సవివరంగా చెప్పాడు.

ఉలూపి ఎరిగించిన రహస్యము

[మార్చు]

అర్జునుడు ఉలూపిని చూసి " ఉలూపీ ! ఏమి జరిగింది. కుమారుడు బభ్రువాహనుడు కాని అతడి తల్లి చిత్రాంగద కాని నీ పట్ల అనుచితంగా ప్రవర్తించారా ! నీ రాకకు కారణము ఏమిటి ? " అని అడిగాడు. ఉలూపి చిరునవ్వు నవ్వి నాధా ఇందులో ఎవరి తప్పు లేదు. ఎవరూ నాపట్ల అనుచితముగా ప్రవర్తించ లేదు. మీరు కాని, కుమారుడైన బభ్రువాహనుడు కాని, చిత్రాంగద కాని అనుచితంగా ప్రవర్తిస్తారా ! తాము నా పట్ల దయ వహించి నేను చెప్పేది శరద్ధగా వినండి. బభ్రువాహనుడు మీతో యుద్ధము చేస్తున్న తరుణంలో కుమారుడు వలన మీకు అశుభం జరిగింది. ఇందుకు ఒక కారణము ఉంది. మీరు భారతయుద్ధములో శిఖండిని ముందు పెట్టుకుని తాతగారైన గంగాపుత్రుడు అయిన భీష్ముడిని పడగొట్టారు. అందు వలన మీకు సంక్రమించిన పాపపరిహారము చేయకున్న మీకు నరకప్రాప్తి కలుగుతుంది. అందు వలన నేను పాతాళము నుండి వచ్చి మీ పాపముకు నివృత్తి చేసాను. ఇది నాకు ఎలా తెలిసింది అంటే ఒకరోజు నేను గంగానదిలో స్నానము చేస్తున్న తరుణములో వసువులు కూడా వచ్చి గంగా నదిలో స్నానము చేస్తున్నారు. అప్పుడు గంగాదేవి తన నిజరూపములో వచ్చి వసువులతో మాట్లాడసాగింది. అప్పుడు వసువులు గంగాదేవితో " అమ్మా ! భీష్ముడు నీ కుమారుడు, వసువులలో ఒకడు. అలాంటి భీష్ముడిని అర్జునుడు శిఖండిని అడ్డు పెట్టుకుని పడకొట్టాడు. అయినా భీష్ముడు తనకుతాను ఏర్పరుచుకున్న నియమము ప్రకారము శరసంధానము చేయలేదు. ఆ కారణముగా భీష్ముడు అంపశయ్య మీద పడి పరమపదించాడు. నిరాయుధుడైన భీష్ముడిని కుత్సితంగా, నీచంగా జయించాడు. అలాంటి అర్జునుడిని మేము శపించాలని అనుకున్నాము " అన్నారు. అందుకు గంగాదేవి తన ఆమోదము తెలిపింది. ఇది విన్న నేను నాగలోకముపోయి జరిగిన విషయము నా తండ్రి నాగరాజుకు వివరించాను. నా తండ్రి వసువుల వద్దకు వెళ్ళి అర్జునుడిని క్షమించమని పలు విధముల ప్రాధేయపడ్డాడు. చివరకు వారు కరుణించి ఒక నియమము పెట్టారు. అది ఏమంటే అర్జునుడు తన కుమారుడైన బభ్రువాహనుడి చేతిలో యుద్ధము చేసి నేలకు ఒరిగిన ఆ పాపము పోతుంది అని చెప్పారు. నా తండ్రి ఈ విషయము నాకు చెప్పారు. నేను తగిన సమయము కొరకు వేచి చూస్తున్నాను. ఇప్పుడు మీరు యాగాశ్వరక్షణ నిమిత్తము ఇక్కడకు వచ్చి బభ్రువాహనుడిని తమతో యుద్ధము చేమని చెప్పడమూ బభ్రువాహనుడు తమతో యుద్ధము చేయ మనస్కరించక తిరిగి పోవాడమూ తెలుసుకుని నేను బభ్రువాహనుడిని మార్గ మధ్యములో ఆపి తమతో యుద్ధానికి ప్రోత్సహించాను. కుమారుడి చేతిలో తమరు ఓడి పోయారు. అందువలన నీ పాపము నశించినది. నేను సంజీవమణిని బభ్రువానుడికి ఇచ్చి మిమ్ము పునరుజ్జీవితుడిని చేసాను. తరువాత జరిగినది మీకు అందరికీ తెలిసినదే " అని ఉలూపి అర్జునుడితో సహా అందరికీ తెలిపింది.

అర్జునుడు చింత్రాంగాదులను విడిచి వెళ్ళుట

[మార్చు]

ఉలూపి మాటలకు అర్జునుడు సంతోషించాడు. అర్జునుడు అక్కడ ఉన్న వారిని అందరినీ చూసి " రాబోవు చైత్రశుద్ధ పౌర్ణమి నాడు హస్థినాపురములో వ్యాసుడు చెప్పిన విధంగానే అశ్వమేధయాగము చేస్తాము. ధర్మరాజు ఆధ్వర్యములో అశ్వమేధయాగము చేస్తున్నారు. తమరు అందరూ బంధుమిత్ర సమేతంగా విచ్చేయమని ధర్మరాజు తరఫున ఆహ్వానము అందచేస్తున్నాను " అని చెప్పాడు. బభ్రువాహనుడు " తండ్రిగారూ ! తమరు మా నగరముకు విచ్చేసి మా ఆతిధ్యము స్వీకరించాలని కోరుతున్నాను " అని బభ్రువాహనుడు ప్రార్థిచాడు. అర్జునుడు " కుమారా ! యాగదీక్షాలో ఉన్న నేను నగరప్రవేశము చేయకూడదు " అని అర్జునుడు బభ్రువాహనుడికి చెప్పి ఉలూపి, చిత్రాంగదల వద్ద శలవు తీసుకుని యాగాశ్వమును అనుసరించాడు.

అశ్వం రాజగృహనగరంలో ప్రవేశించుట

[మార్చు]

యాగాశ్వము రాజగృహము అనే నగరములో ప్రవేశించింది. రాజగృహనగరాన్ని పరిపాలిస్తున్న జరాసంధుడి మనుమడు మేఘసంధి యాగాశవమును పట్టి బంధించి అర్జునుడితో " అర్జునా ! ఇదేమన్నా విరాటనగర అంతఃపురము అనుకున్నావా ! ఆడవాళ్ళ మధ్య తిరగడానికి. ఇది రణరంగము ఇక్కడ యుద్ధము చేయాలి . నేను హయమును పట్టుకున్నాను నువ్వు నాతో యుద్ధము చెయ్యాలి " అని అర్జునుడిని రెచ్చగొట్టాడు. అర్జునుడు నవ్వి " రాజా ! నాకు నీ మీద ఎలాంటి కోపము లేదు. ఇది యాగాశ్వము దీనిని పట్టుకున్న వారిని చంపవద్దని ధర్మరాజు నన్ను యాగాశ్వరక్షకుడిగా పంపుతూ చెప్పాడు. ఉన్న విషయము నీకు చెప్పాను. తరువాత నీ ఇష్టము " అని అన్నాడు. అర్జునుడి మాటలను అలుసుగా తీసుకుని మేఘసంధి అర్జుడి మీద శరవర్షము కురిపించాడు. అర్జునుడు తనను తాను రక్షించుకుంటూ మేఘంధి బాణములను ఖండించస్తూ మేఘసంధి సారథిని కాని మేఘసంధి సారథినిగాని గాయపరచ లేదు. మేఘసంధి అది అలుసుగా తీసుకుని అర్జునుడి శరీరము అంతా బాణములతో గాయపరిచాడు. అర్జునుడు కోపించి ఇక మేఘసంధిని వదిలితే ప్రయోజనము లేదని ముందుగా మేఘసంధి హయములను కొట్టి చంపాడు, తరువాత సారథిని చంపాడు, తరువాత పతాకమును కూల్చాడు, తరువాత రథమును కూలగొట్టాడు. రథము నుండి కిందకు దిగిన మేఘసంధి గదను తిప్పుతూ అర్జునుడితో తలపడ్డాడు. అప్పుడు కూడా అర్జునుడు మేఘసంధిని గాయపరచక అతడి గదను మాత్రము పడగొట్టి అతడిని నిరాయుధుడిని చేసి " మేఘసంధీ ! ధర్మరాజు మాటను మన్నించి నేను నిన్ను చంప లేదు. అందు వలన ఇంతవరకు నాతో యుద్ధముచేసి జీవించి ఉన్నావు. క్షత్రియధర్మము పాటించి అశ్వమును పట్టావు. నాతో యుద్ధము చేసావు. ఇక శాంతము వహించి యుద్ధము మానుము " అన్నాడు. మేఘసంధి అలోచించి అర్జుడి మాటను మన్నించడమే మేలనుకుని అర్జునుడికి నమస్కరించాడు. అర్జునుడు మేఘసంధిని కౌగలించుకుని అశ్వమేధయాగముకు మేఘసంధిని ధర్మరాజు తరఫున ఆహ్వానించాడు. మేఘసంధి అర్జునుడి ఆహ్వానాన్ని మన్నించాడు. అర్జునుడు యాగాశ్వమును అనుసరించి ముందుకు సాగాడు.

యాగాశ్వదిగ్విజయ యాత్ర

[మార్చు]
వింధ్య పర్వతాలలో రాతిపై నిలబడిపోయిన యాగాశ్వం - రాజ్మానామా నుండి ఒక దృశ్యం.

యాగాశ్వము ఆ తరువాత వంగదేశము, పౌండ్రదేశము, మ్లేచ్చదేశము మొదలైన రాజ్యములలో ప్రవేశించింది. అర్జునుడు ఆయా రాజులను జయించి వారిని ధర్మరాజు తరఫున అశ్వమేధయాగముకు ఆహ్వానించాడు. తరువాత అశ్వము చేధిరాజ్యములో ప్రవేశించింది. చేధిరాజ్యాన్ని శిశుపాలుడి కుమారుడు శరభుడు పాలిస్తున్నాడు. శరభుడు ముందు అశ్వమును బంధించినా తరువాత తెలివి తెచ్చుకుని అర్జునుడితో సంధి చేసుకున్నాడు. అర్జునుడు చేధిరాజుకు ధర్మరాజు తరఫున అశ్వమేధయాగానికి ఆహ్వానము తెలిపాడు. తరువాత అర్జునుడు టెంకణ దేశ రాజైన కిరాతరాజును జయించాడు. తరువాత కోసల, కాశీ రాజ్యాలను జయించాడు. తరువాత దశార్ణదేశాధీశుడు చిత్రాంగదుడు కూడా మొదట ఎదిరించినా తరువాత లొంగి పోయాడు. తరువాత అశ్వము నిషాదదేశము చేరింది. ఆ దేశమును ఏకలవ్యుడి కుమారుడు పాలిస్తున్నాడు. అతడు అర్జునుడి మీదకు ససైన్యముగా యుద్ధానికి వచ్చాడు. కాని ఎంతో కాలము అర్జునుడి ముందు నిలువ లేక తుదకు అర్జునుడికి లొంగి పోయాడు. తరువాత అశ్వము దక్షిణంగా పయనించిది. పౌండ్రదేశము, ఆంధ్రదేశము, ద్రవిడదేశము, కేరళదేశము, కర్నాటకదేశములలో సంచరించింది. అర్జునుడు ఆయా దేశాధీశులను యుద్ధము చేసి ఓడించాడు. తరువాత అశ్వము సౌరాష్ట్రదేశములో ప్రవేశించింది. గోకర్ణము చేరి తరువాత ద్వారక చేరింది. అర్జునుడి రాక విన్న యాదవులు అర్జునుడికి ఘనమైన సత్కారాలు చేసారు. తరువాత అశ్వము పశ్చిమ సముద్రతీరాన పయనించి పాంచాలదేశంలో ప్రవేశించింది.

అశ్వము గాంధారదేశంలో ప్రవేశించుట

[మార్చు]

తరువాత గాంధారదేశములో ప్రవేశించింది. గాంధారదేశమును శకుని కుమారుడు పాలిస్తున్నాడు. అతడు కూడా బాల్యచాపల్యము చేత అర్జునుడిని ఎదుర్కొన్నాడు. అర్జునుడు తన అన్న ధర్మరాజు సందేశము ఎరిగించాడు. కాని శకుని కుమారుడు మొండిగా అర్జునితో యుద్ధము చేసాడు. గాంధారసేన అంతా అర్జునుడి చేతిలో మరణించినా శకుని కుమారుడు విడువక యుద్ధము కొనసాగించాడు. అతడి బలపరాక్రమాలకు అర్జునుడు ముచ్చటపడి " కుమారా ! మా అన్న ధర్మరాజు నన్ను యాగరక్షకుడిగా నియమించి జయిత్రయాత్రలో ఎవరిని చంపవద్దని అశ్వమేధయాగానికి ఆహ్వానము మాత్రము తెలియచెయ్యమని చెప్పాడు. కనుక ఇక యుద్ధము కొనసాగించుట అనవసరము " అనునయంగా పలికాడు. అయినా శకుని కుమారుడు వినక పదునైన బాణములను అర్జునుడి మీద ప్రయోగించాడు. విధిలేక అర్జునుడు శకుని కుమారుడి కిరీటమును పడగొట్టాడు. అక్కడ ఉన్నవారు అందరూ " అర్జునుడు తలచుకుంటే శకుని కుమారుడి తల ఎగురకొట్టే వాడు. కాని అర్జునుడు దయతలచి విడిచిపెట్టాడు " అన్నాడు. అయినా శకుని కుమారుడు వినక తిరిగి అర్జునుడి మీద బాణప్రయోగము చేసాడు. అర్జునుడు కేవలము ఆబాణములను మాత్రమే తిప్పికొట్టాడు. అది చూసిన గాంధారసేనలు పారిపోయాయి. శకుని కుమారుడు అర్జునుడితో యుద్ధము చేస్తున్నాడని తెలిసి అతడి తల్లి, మంత్రులు యుద్ధభూమికి వచ్చారు. వారు శకుని కుమారుడిని విడువమని అర్జునుడిని వేడుకున్నారు. అర్జునుడు వెంటనే యుద్ధము ఆపి శకుని భార్యకు నమస్కారము చేసి శకుని కుమారుడితో " కుమారా ! నీవు నాతో యుద్ధము చేయడము నాకు బాధ కలిగించింది. నాకు ధర్మరాజు ఎవరిని చంపవద్దని చెప్పాడు. ఆ విషయము నీకు ముందే చెప్పాను నీవు వినలేదు. అయినా నేను నిన్ను చంపలేదు. నీవు మా పెదనాన ధృతరాష్ట్రుడికి, మా పెదమ్మ గాంధారికి దగ్గర బంధువువు. యుద్ధముచెయ్యడానికి మనమేమైనా శత్రువులమా ! ఇకనైనా శాంతించి యుద్ధముమాను " అన్నాడు. ఆ మాటలకు శాంతించిన శకుని కుమారుడితో అర్జునుడు " కుమారా నీవు బంధుమిత్ర సమేతంగా ధర్మరాజు చేస్తున్న అశ్వమేధ యాగముకు రావలసిందని ధర్మరాజు ఆహ్వానము తెలియజేయమని నాకు చెప్పాడు " అని యాగముకు ఆహ్వానించాడు. తరువాత అర్జునుడు అశ్వమును వెంబడించాడు. అశ్వము తరువాత హస్థినాపురానికి తిరుగు ప్రయాణము అయ్యింది.

యాగశాల నిర్మాణం

[మార్చు]

అర్జునుడు యాగాశ్వాన్ని వెంబడిస్తూ ఆయారాజులను జయిస్తూ దిగ్విజయయాత్ర చేస్తున్న విషయము ఎప్పటికప్పుడు చారులద్వారా వింటూ ధర్మరాజు పరమాందభరితుడు అవుతున్నాడు. ఇంతలో మాఘశుద్ధపౌర్ణమి రానే వచ్చింది. ధర్మరాజు కొలువు తీర్చి తమ్ములను కొలువుకు ఆహ్వానించి " భీమసేనా ! నీ తమ్ముడు అర్జునుడు యాగాశ్వము వెంట జైత్రయాత్ర ముగించుకుని హస్థినకు తిరిగి వస్తున్నాడని వర్తమానము అందింది. ఇక చైత్రమాసము రావడానికి అధిక సమయము లేదు. మహామునులను, రాజులను ఆహ్వానించాలి కనుక వార్తాహరులను సిద్ధము చెయ్యి. అలాగే యాగనిర్వహణకు ఒక యాగశాలను నిర్మించడానికి సన్నాహాలు చెయ్యి. యాగముకు వచ్చు రాజులకు, మునులకు, ప్రముఖులకు తగిన ఏర్పాట్లు చెయ్యండి. తగిన అతిథి గృహములను నిర్మించడానికి ఏర్పాటు చెయ్యండి " ఆదేశించాడు. భీముడు వెంటనే వాస్తుశిల్పులను పిలిపించి యాగశాలను విడిది గృహములను వెనువెంటనే నిర్మింపజేసాడు. భూమండలము అంతాతిరిగి రాజులను మునులను ఆహ్వానించడానికి బ్రాహ్మణులను పంపాడు. ధర్మరాజు ఆహ్వానాన్ని అందుకున్న రాజులు తమతమ సైన్యములతో మునులు తమ శిష్యబృందముతో హస్థినాపురము చేరుకున్నారు. వారందరిని చూసిన ధర్మరాజు పరమానందభరితుడు అయ్యాడు. వారి, వారి అంతస్తులను అనుసరించి వారికి అతిథిమర్యాదలు, భోజనసదుపాయాలు, విడుదులు ఏర్పాటు చేయించాడు. ఈ ఏర్పాట్లన్నీ సేవకులకు అప్పగించక ధర్మరాజు తానే స్వయముగా పర్యవేక్షించ సాగాడు. భీముని ఆధ్వర్యంలో నిర్మింపజేసిన యాగశాలను, అతిథిగృహాలను చూసిన శ్రీకృష్ణుడు, వచ్చిన అతిథులు ఎంతో సంతోషించారు. జనమేజయమహారాజా ! అతిథిసత్కారాలు ఎలా జరుగుతున్నాయని అంటే లక్షమంది ఒకసారి భోజనము చేస్తే ఒక నగారా మోగుతుంది. ఆ నగారా ఎడతెరిపి లేకుండా అలా మోగుతూనే ఉంది. అంటే అన్ని లక్షల మంది భోజనము చేస్తున్నారన్నమాట " అని వైశంపాయానుడు జనమేజయుడికి చెప్పాడు.

అర్జునుడు హస్థినకు వచ్చుట

[మార్చు]

భీముడి ఆధ్వర్యములో నిర్మింపబడిన యాగశాలను, అతిథిగృహములను చూసి శ్రీకృష్ణుడు, వచ్చిన అతిథులు, ఎంతో సంతోషించారు. జనమేజయ మహారాజా ! లక్షమంది ఒకసారి భోజనము చేస్తే ఒకసారి నగారా మ్రోగుతుంది. అలా నగారా ఎడతెరపి లేకుండా మ్రోగుతూనే ఉంది. అంటే ఎడతెరపి లేకుండా లక్షల మంది భోజనము చేస్తునారన్న మాట " వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పాడు. ధర్మరాజు భీమసేనుడి సహాయంతో వచ్చిన అతిధులను పూజించాడు. ఆ పూజలు అందుకున్న శ్రీకృష్ణుడు, బలరాముడు, సాత్యకి, యాదవప్రముఖులు మొదలగు వారు ఎంతో సంతోషించారు. ఇంతలో అర్జునుని దగ్గర నుండి వర్తమానము వచ్చిందని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఇలా చెప్పాడు. " ధర్మనందనా ! అర్జునుడు తాను కలసిన రాజులందరిని అశ్వమేధయాగానికి ఆహ్వానించాడట. వారందరూ యాగముకు వస్తున్నారట. వారు మన విరోధులైనా ప్రస్థుతము మన ఆహ్వానము మన్నించి వస్తున్నారు. కనుక వారిని పూజించడము మన కర్తవ్యము. అదీ కాక " మణీపురాధీశుడు నా కుమారుడైన బభ్రువాహనుడు యాగముకు వస్తున్నాడు. అతడికి తగిన మర్యాదలు చెయ్యండి " అని అర్జునుడు నీకు చెప్పమని చెప్పాడు. ఆ మాటలకు సంతోషించిన ధర్మరాజు " శ్రీకృష్ణా ! నేనూ విన్నాను. అర్జునుడు అనేక మందిని యుద్ధమున జయించి వారితో మిత్రత్వము వహించి యాగముకు ఆహ్వానము తెలిపాడు. కృష్ణా ! అర్జునుడు మొన్న జరిగిన యుద్ధములో భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు మొదలైన మహాయోధులతో యుద్ధముచేసి ఎంతో శ్రమపడ్డాడు. అంతలోనే తిరిగి అశ్వమేధయాగము కొరకు యుద్ధములో పాల్గొన్నాడు. అయ్యో ! నా వలన అర్జునుడికి ఎన్ని కష్టాలు దాపురించాయి. కృష్ణా ! నిన్ను ఒకటి అడగాలని అనుకుంటున్నాను. అర్జునుడి దేహము అనేక శుభలక్షణములతో కూడి ఉన్నది కదా ! మరి ఈ యుద్ధములు ఒకదాని వెంట ఒకటిగా ఈ యుద్ధములు అతడికి ఎందుకు ప్రాప్తిస్తున్నాయి . అతడి అంగాలలో ఎదైనా దోషము ఉందా ! నీకేమైనా తెసుసా " అని అడిగాడు. శ్రీకృష్ణుడు " ధర్మనందనా ! నీవు చెప్పినది నిజమే. అర్జునుడు సకలలక్షణ సమన్వితుడు. కానీ ఒక లోపము ఉంది. అతడికి శరీరముకు తగినట్లు కాక కొంచము అధికముగా అతడి పిక్కలు ఉన్నాయి. అందువలననే అతడికి ఈ కష్టాలు కలుగుతున్నాయి. ఇప్పుడు అర్జునుడి కష్టాలు అన్నీ తొలగి పోయాయి " అని అన్నాడు.

అర్జునుడు హస్థినలో ప్రవేశించుట

[మార్చు]

ఇంతలో అక్కడకు అర్జునుడి వద్ద నుండి ఒకదూత వచ్చాడు. ఆ దూత ధర్మరాజుకు నమస్కరించి " మహారా ! అర్జునుల వారు హస్థినాపుర సమీపానికి విచ్చేసారు. రేపు తమరిదర్శనము చేసుకుంటారు అని తమరికి మనవి చేయమన్నారు " అని చెప్పాడు. ఆ మాటలు విన్న ధర్మరాజు, భీమ, నకుల, సహదేవులు, శ్రీకృష్ణుడు పరమానందభరితులయ్యారు. అర్జునుడి రాక కొరకు ఎదురుచూస్తున్నారు. మరునాడు అర్జునుడు యాగాశ్వమును అనుసరిస్తూ హస్థినాపురప్రవేశము చేసాడు. వంధిమాగధులు, హస్థినాపురప్రజలు అర్జునుడిని వేనోళ్ళ కొనియాడసాగారు. అర్జునుడు యాగశాలను సమీపించగానే ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులు, శ్రీకృష్ణుడు, బలరాముడు, యాదవులు అర్జునుడికి ఎదురు వెళ్ళి స్వాగతము పలికి సాదరంగా యాగశాలకు తీసుకుని వెళ్ళారు. అర్జునుడు ముందుగా ధృతరాష్ట్ర గాంధారులను తరువాత కుంతీదేవిని దర్శించి వారి ఆశీర్వాదములు అందుకున్నాడు. ఇంతలో అర్జునుడి భార్యలు ఉలూపి, చిత్రాంగధలు బభ్రువాహనుడు హస్థినకు వచ్చి చేరారు. అర్జునుడు తన భార్యలను, కుమారుడిని ధర్మరాజు వద్దకు తీసుకు వెళ్ళి పరిచయము చేసాడు. తరువాత ధృతరాష్ట్ర, గాంధారీల వద్దకు వెళ్ళి వారి ఆశీర్వాదము అందుకున్నాడు. తరువాత తల్లి కుంతీదేవికి కోడళ్ళను మనుమడిని చూపించాడు. కుంతీదేవి వారిని ఆనందముతో ఆదరించి ఆశీర్వదించింది. తరువాత చిత్రాంగధ, ఉలూపి ద్రౌపదిని సుభద్రను కలిసారు. అందరూ అరమరికలు లేకుండా మాట్లాడుకున్నారు. ఈ విధంగా అశ్వమేధయాగ సన్నాహాలు పూర్తి అయ్యాయి.

యాగదీక్ష

[మార్చు]

వ్యాసుడు ధర్మరాజుతో " ధర్మనందనా ! ఈ యజ్ఞము గొప్పది. నీవు యజ్ఞముకు కావలసిన ధనము సంపాదించావు. కనుక యాగమును నిర్విజ్ఞముగా నిర్వహించు. అశ్వమేధయాగము సమాప్తి అయ్యేరోజున చేసే స్నానము పవిత్రమైనది. ఆ స్నానముతో సమస్త పాపములు తొలగి పోతాయి. నీవు భారతయుద్ధములో అన్నదమ్ములను, గురువులను, బంధువులను, మిత్రులను చంపిన పాపము అంతా ఆ స్నానము వలన పోతుంది. నీకిక శుభములు కలుగుతాయి. వ్యాసుడి ఆదేశానుసారము ధర్మరాజు యాగదీక్ష పునాడు. ఋత్విక్కులు యజ్ఞకాండ నిర్వహిస్తున్నారు. మంత్రాలు పఠిస్తూ అగ్నిలో హోమద్రవ్యాలు వేలుస్తున్నారు. వేదమంత్రాలను ఉచ్ఛారణ చేస్తూ సోమలతల నుండి సోమరసముపిండుతున్నారు. యజ్ఞముకు వచ్చిన వారికి భీముడు భోజన సదుపాయలు చూసే పనిని నిర్వహిస్తున్నాడు. అందరి చేత కొసరి కొసరి తినిపిస్తున్నాడు. లేదు అనకుండా సంతర్పణలు చేయిస్తున్నాడు. యజ్ఞముకు వచ్చిన వారు అందరూ వట్టిచేతులతో తిరిగి వెళ్ళడము లేదు. ఆ యజ్ఞవాటిక దేవయజ్ఞమును తలపించ చేస్తుంది. భూలోకములో ధర్మరాజుతో నిర్వహించ పడుతున్న ఈ యజ్ఞమును దివి నుండి దేవతలు సహితము ఆసక్తితో తిలకిస్తున్నారు. ప్రధాన యజ్ఞవాటికను చతురస్రాకారముగా బంగారు ఇటుకలతో నిర్మించారు. యజ్ఞవాటిక ఎటు చూసినా 18 మూరలు పొడవు ఉండేలా నిర్మాణము జరిగింది. గరుడుని ఆకారముతో యజ్ఞవాటిక నిర్మాణము జరిగింది. ఋత్విక్కులు ఊపస్తంభాలు పాతారు. మొత్తము 21 ఊపస్తంభాలు పాతబడ్డాయి. వీటిలో ఖాదిరములతో చేసిన స్తంభములు 6, మోగుతో చేసిన స్తంభాలు 6, దేదారు కర్రలతో చేసిన స్తంభాలు 2, శ్లేషాతక చెట్టు కొయ్యతో చేయబడిన స్తంభం 1 స్తంభము ఒకటి 21. ఇవి కాక అలంకరణార్ధము పాతిన బంగారుస్తంభాలు అనేకము. ఆ ఉపస్తంభాలకు నాలుగుకాళ్ళ జంతువులు, పక్షులు, జలచరములను కట్టారు. ఆ ప్రాణులు మొత్తము 300. ప్రధాన ఊపస్తంభానికి యాగాశ్వమును కట్టారు. ఆ యజ్ఞముకు విచ్చేసిన వేదవ్యాసుడి శిష్యబృందము అందరిలో ప్రత్యేకముగా వెలిగి పోతున్నారు. తరువాత ఊపస్తంభాలకు కట్టిన 300 జంతువులను, పక్షులను, జలచరాలను బలి ఇచ్చారు. తరువాత యజ్ఞాశ్వమును బలి ఇచ్చే తరుణము ఆసన్నము కాగానే ద్రౌపదిని యజ్ఞాశ్వముకు సమీపముగా రమ్మని చెప్పి యజ్ఞాశ్వమును వధించారు. ద్రౌపది స్వహస్థాలతో ఆ అశ్వము యొక్క వివిధావయవములను హోమములో వేల్చి దేవతలకు హవిస్సు రూపములో అందజేసింది. యజ్ఞాశ్వము యొక్క ప్రధాన భాగాలు ఆ మాంసము హోమములో కాలుతుంటే వచ్చే వాసనను పాండవులు ద్రౌపది ఆస్వాదించి ఎంతో ఆనందించారు. ఋత్విక్కులు మిగిలిన మాంసమును శాస్త్ర విధిగా హోమములో వేసారు. ఆ విధముగా అశ్వమేధయాగము సమాప్తము అయ్యింది.

యాగములో జరిగిన దానధర్మాలు

[మార్చు]

ధర్మరాజు సదస్యులకు కోటివేల నిష్కములు దానముగా ఇచ్చాడు. వ్యాసుడికి ధర్మరాజు తనరాజ్యమును దానముగా ఇచ్చాడు. వ్యాసుడు " ధర్మనందనా ! నీవు నాకు భూమిని దానంగా ఇచ్చావు. నేను ఈ భూమిని ఏమి చేసుకుంటాను. దానికి సమానమైన బంగారమును దానముగా ఇవ్వు " అని అన్నాడు. ధర్మరాజు " వ్యాసమునీంద్రా ! అశ్వమేధయాగ సమాప్తంలో భూదానము చెయ్యాలని ఆర్యులు అంటారు. అందు వలన అర్జునుడి వలన జయింపబడిన భూమిని నీకు దానము ఇచ్చాను. నాకు ఇక రాజ్యము లేదు. కనుక వనవాసముకు వెడతాను. అంతేకాని ఇచ్చిన రాజ్యము తిరిగి తీసుకోను " అన్నడు. వ్యాసుడు " ధర్మతనయా ! నీ చేత దానముగా స్వీకరించబడిన ఈ భూమి నాకే స్వంతము అనుటలో ఎటువంటి సందేహము లేదు. అందుకని మేము తిరిగి ఈ భూమిని నీకు అమ్ముతున్నాము నువ్వు తగిన వెల ఇచ్చి దానిని తిరిగి నీవే తీసుకో. ఇది రాజధర్మము ఇందులో ఎమీ తప్పులేదు " అని వ్యాసుడు చెప్పాడు. ఆ మాటలు విన్న శ్రీకృష్ణుడు కూడా వ్యాసుడు చెప్పినట్లే చెయ్యమన్నాడు. అప్పుడు ధర్మరాజు కోటికోట్లమాడలు కుప్పగా పోసి " నేను దానముగా ఇచ్చిన భూమి వెల ఇంత " అన్నాడు. వ్యాసుడు ఆ బంగారమును తీసుకుని రాజ్యాన్ని ధర్మరాజుకు తిరిగి ఇచ్చాడు. ఆ బంగారమును వ్యాసుడు యాగముకు వచ్చిన బ్రాహ్మణులకు దానముగా ఇచ్చాడు. ధర్మరాజు యాగము కొరకు తయారుచేసిన బంగారు పళ్ళెములు, బిందెలు, ఇతర వస్తువులు బ్రాహ్మణులకు పంచి పెట్టాడు. బ్రాహ్మణ దానములు అయిన తరువాత క్షత్రియులకు ఆ తరువాత వైశ్యులకు, ఆ తరువాత శూద్రులకు, ఆ తరువాత ఇంకా తక్కువ జాతి వారికి అపారముగా దానములు చేసాడు. యజ్ఞముకు వచ్చిన వారంతా అత్యంత సంతుష్టులై వారి వారి నివాసములకు వెళ్ళారు. వేదవ్యాసుడు తన వంతుకు వచ్చిన ధనమును కుంతీదేవికి ఇచ్చాడు. కుంతీదేవి ఆ ధనమును పేదలకు పంచి ఇచ్చింది. జనమేజయ మహారాజా ! దానములలో ధర్మరాజు రెండవ మరుత్తు అనిపించుకున్నాడు. యజ్ఞము పరిసమాప్తి అయిన తరువాత ధర్మరాజు తమ్ములతో భార్య ద్రౌపదితో యజ్ఞస్నానము చేసాడు. ఈ యజ్ఞముతో ధర్మరాజు తన మనసును శరీరాన్ని పవిత్రము చేసుకున్నాడు. ఆ యజ్ఞమును నిర్విజ్ఞముగా జరిపించిన వ్యాసుడికి ధర్మరాజు సాష్టాంగప్రమాణము చేసాడు. ధర్మరాజును దీవించి వ్యాసుడు తన శిష్యులతో అక్కడ నుండి వెళ్ళి పోయాడు.

యాగానంతరం రాజులను సత్కరించుట

[మార్చు]
అశ్వం తిరిగివచ్చిన తరువాత జరిగిన విందులో యుధిష్టురినితో మాట్లాడుతున్న కృష్ణుడు - రాజ్మానామా నుండి ఒక దృశ్యం

వ్యాసుడు తన శిష్యులతో వెళ్ళిన తరువాత ధర్మరాజు " యాగముకు వచ్చిన రాజులకు సముచిత సత్కారాలు చేసాడు. బంగారమును, మణులను, నగలను, మాణిక్యాలను, నగలను, ఏనుగులను, అశ్వములను, వేశ్యలను కానుకగా ఇచ్చాడు. బభ్రువాహనుడికి సముచుత సత్కారము చేసి తన దేశముకు వెళ్ళడానికి అనుమతి ఇచ్చాడు. ఎన్ని రోజులుగానో అర్జునుడికి దూరముగా ఉన్న ఉలూపి, చిత్రాంగదలు తమ భర్త అర్జునుడి వద్ద ఉండి పోయారు. బభ్రువాహనుడు మాత్రము తన దేశానికి తిరిగి వెళ్ళాడు. అందరికంటే ముందుగా యాగము చూడడానికి వచ్చిన శిశుపాలుని భార్యను ధర్మరాజు సముచితంగా సత్కరించాడు. ఆమె మనుమడిని సింధుదేశానికి అధిపతిగా పట్టాభిషిక్తుడిగా చేసాడు. తరువాత భారత యుద్ధములో ఓడిపోయి చనిపోయిన రాజుల రాజ్యాలను వారి వారసులకు ఇచ్చివేసాడు. అందరూ వెళ్ళిన తరువాత కూడా శ్రీకృష్ణుడు, బలరాముడు, యాదవ ప్రముఖులు ఉండిపోయారు. శ్రీకృష్ణుడికి, బలరాముడికి, సాత్యకికి, మిగిలిన యాదవ ప్రముఖులకు ధర్మరాజు అనేక రత్నాభరణాలు, విలువైన కానుకలు ఇచ్చి సత్కరించాడు. ధర్మరాజు చేసిన సత్కారాలకు తృప్తిచెందిన యాదవప్రముఖులు ద్వారకకు తిరిగి వెళ్ళారు " అని వైశంపాయనుడు జనమేజయునికి అశ్వమేధయాగ విశేషములు తెలిపాడు.

అశ్వమేధయాగములో జరిగిన విశ్మయం

[మార్చు]

జనమేజయుడు ధర్మరాజు చేసిన అశ్వమేధయాగము గురించి వింటూ వైశపాయనుడితో " వైశంపాయన మహర్షీ ! అత్యంత వైభవోపేతంగా జరిగిన అశ్వమేధయాగములో విస్మయం కలిగించే విషయము ఏదైనా జరిగిందా వివరించండి " అని అడిగాడు. వైశంపాయనుడు బదులుగా " జనమేజయమహారాజా ! మీ తాతగారైన ధర్మరాజు యాగము చేస్తున్న సమయంలో ఒక ముంగిస యాగశాలకు వచ్చింది. అక్కడ ఉన్న ఋత్విక్కులను సదస్యులను బ్రాహ్మణులను చూసి " ఈ అశ్వమేధయాగము సక్తుప్రస్థుని ధర్మమును కొంచము కూడా పోలదు " అని ప్రకటించింది. ఆ మాటలు విన్న అక్కడ బ్రాహ్మణులు ఆశ్చర్యపోయారు. అప్పుడు ఋత్విక్కులు ముంగిసతో " ఈ యాగములో మంత్రపఠనము, కర్మకాండ, వివిధ దానధర్మాలు పలువురి ప్రశంసలను పొందాయి. ధర్మరాజు ఈ యాగమును నిర్వహించిన తీరు, శ్రద్ధ, భక్తి, అందరికీ యోగ్యము అయింది. ఇందులో జరిగిన ధర్మవిరుద్ధ కార్యము ఏమి ? " అని అడిగారు.

బ్రాహ్మణుడి కథ

[మార్చు]

ఆందుకు ఆ ముంగిస " ధర్మక్షేత్రము అని పిలువబడుతున్న ఈ కురుక్షేత్రములో ఒక బ్రాహ్మణుడు ఉండే వాడు. అతడు మానము, అభిమానము, కామములను జయించిన వాడు అతి సౌమ్యుడు. అతడు భార్య, కుమారుడు, కోడలుతో గృహస్థజీవనము సాగించే వాడు. అతడు ఊంఛవృత్తి సాగిస్తూ పొలములో రాలిపడిన గింజలను ఏరుకుని తృప్తిగా జీవనం సాగించే వాడు. ఒకసారి తీవృమైన అనావృష్టి వచ్చి ఎక్కడ చూసినా ఆహారము లభించడము కష్టము అయింది. ఒక రోజు వారు నలుగురూ పొలముకు వెళ్ళి గింజలు ఏరుకుని వచ్చి వాటితో పేలపిండి చేసి దేవతారాధనా సంధ్యా వందనము చేసి పేలపిండిని నలుగురూ సమానంగా పంచుకున్నారు. వారు ఆ పేలపిండిని తినడానికి సిద్ధము ఔతున్న తరుణములో వారి వద్దకు ఒక బాటసారి అతిథిగా వచ్చాడు. వారు నలుగురూ ఆ అతిథికి ఎదురు వెళ్ళి సాదరంగా ఆహ్వానించి కుటీరము లోనికి తీసుకుని వెళ్ళి అతిథి మర్యాదలు చేసారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు " మహానుభావా ! ఈ పేలపిండి అన్యార్జితము కాదు. ధర్మముగా సంపాదించింది కనుక మీరు దీనిని తీసుకుని మీ ఆకలి తీర్చుకోండి " అని అన్నాడు. ఆ పేలపిండిని తిన్న తరువాత కూడా అతడి ఆకలి తీరలేదు. అప్పుడు ఆ బ్రాహ్మనుడి భార్య ముందుకు వచ్చి " నాధా ! నా వంతుకు వచ్చిన పేలపిండిని అతిథికి ఇచ్చి అతడి ఆకలి తీర్చండి " అన్నది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు " నోరులేని పక్షులు కూడా తమ భార్యలకు ఆహారము తెచ్చి ఇస్తాయి. అలాంటప్పుడు నేను నీ అహారమును ఎలా తీసుకొనగలను ? " అన్నాడు. ఆ మాటలకు అతడి భార్య " నాధా ! భార్యకు భర్తయే దైవము, చుట్టము, స్నేహితుడు, తల్లి, తండ్రి, గురువు అన్నీ. కనుక భర్తకర్తవ్యము నెరవేర్చడము భార్య ధర్మము కదా ! మీరు మీ భాగము పేలపిండిని ఇచ్చారు కనుక తరువాత ఇవ్వవలసిన బాధ్యత నాది. అదీ కాక మీరు తినకుండా నేను మాత్రము ఎలా తినగలను. కనుక పేలపిండిని అతిథికి ఇవ్వడములో సంకోచించవలసిన అవసరము లేదు " అన్నది. బ్రాహ్మణుడు ఇక తప్పదనుకుని పేలపిండిని అతిథికి సమర్పించాడు. ఆ పేలపిండి అతిథి ఆకలి తీర్చలేదు. అతడు ఇంకా విచారముగా ఉన్నాడు. బ్రాహ్మణుడు అతిథిని సంతోషపెట్ట లేకపోయినందుకు చింతించసాగాడు. తండ్రి బాధను చూసిన తనయుడు " తండ్రీ ! ఇందు కొరకు ఇలా చింతించ తగునా ! నా వంతు వచ్చిన పేలపిండిని అతిథికి ఇచ్చి అతడిని తృప్తి పరచండి " అన్నాడు. అందుకు ఆ బ్రాహ్మణుడు " కుమారా ! ఎంతైనా పెద్ద వాళ్ళకంటే చిన్న వాళ్ళకు ఆకలి ఎక్కువ. నీ నోటి వద్దనుండి ఆహారమును నేను ఎలా తీసుకొనగలను ? " అన్నాడు. ఆ మాటలకు కుమారుడు " తండ్రీ ! కుమారుడు అంటే తండ్రికి ప్రతిరూపము కదా ! మీ దుఃఖము తీర్చడము కుమారుడిగా నా కర్తవ్యము కాదా ! కనుక సంకోచము వదిలి ఈ పేలపిండిని అతిథికి ఇవ్వండి " అన్నాడు. కుమారుడి మాటలకు తృప్తిచెంది బ్రాహ్మణుడు కుమారుడి వంతు పేలపిండిని అతిథికి ఇచ్చాడు. అంతటితో అతిథి ఆకలి తీరలేదు. అది చూసి బ్రాహ్మణుడు చింతించసాగాడు. అది చూసిన కోడలు తన వంతు పేలపిండిని మామగారి ముందు పెట్టి " మామగారూ ! ఈ పేల పిండిని కూడా పెట్టి అతిథి ఆకలి తీర్చండి " అన్నది. అది విని బ్రాహ్మణుడు " అమ్మా ! నీవు కోడలివి. మా దరిద్రములో భాగము పంచుకున్నావు. సరి అయిన ఆహారము లేక సుకుమారమైన నీ శరీరము శుష్కించి పోయింది. దొరక్క దొరక్క ఈ రోజు పేలపిండి దొరికింది. ఇది కూడా ఇచ్చి నీవు ఆకలితో ఎలా ఉండగలవు నీవు ఆకలితో అలమటిస్తూ ఉంటే నేను ఎలా ఉండగలను ? " అని బాధపడ్డాడు. అందుకు కోడలు " మామగారూ ! మీరు నాకు గురువులు. ఈ దేహములో ప్రాణమ్ములు ఉన్నంత వరకు గురువుకు శుశ్రూష చేయడము శిష్యుని కర్తవ్యము. కనుక ఈ పేలపిండిని అతిథికి సమర్పించి మీకు సేవ చేసుకునే భాగ్యము నాకు ప్రసాదించండి " అని బదులిచ్చింది. ఆ మాటలకు సంతోషించిన బ్రాహ్మణుడు ఆ పేలపిండిని అతిథికి ఇచ్చాడు. అతిథి ఆ పేలపిండిని తిని అమ్మయ్యా నా ఆకలి తీరింది అన్నాడు. అది విని నలుగురూ సంతోషించారు. అప్పుడు ఆ అతిథి బ్రాహ్మణుడితో " మిత్రమా ! నేను యమధర్మరాజును మిమ్ము పరిక్షించడానికి మీ ఇంటికి అతిధిగా వచ్చాను. నీ యొక్క , మీ కుటుంబము యొక్క ధర్మనిరతిని సద్గుణ సంపత్తిని చూసి ఆనందించాను. నీ అందు పెద్దల ఎడ భక్తి, అతిథుల పట్ల వినయము, చేసే పనిమీద శ్రద్ధ మిక్కుటముగా ఉన్నవి. నీవు చేసిన దానము దేవతలు పై నుండి చూసి ప్రశంసిస్తున్నారు చూడు " అన్నాడు. దేవేంద్రుడు వారి మీద పూలవాన కురిపించాడు.

యముని ప్రశంస

[మార్చు]

యమధర్మరాజు " బ్రాహ్మణోత్తమా ! దేవలోకములో సప్తఋషులు నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. నీవు నీ భార్య, కుమారుడు, కోడలితో స్వర్గానికి రా " అని తిరిగి " మహాభాగా ! ఆకలి అన్నింటి కంటే చెడ్డది. ఆకలి బుద్ధిని, వివేకమును మట్టు పెడుతుంది. ఆశ దయాగుణమును నాశనము చేస్తుంది. నీవు, నీ భార్య, కుమారుడు, కోడలు, ఆశను జయించారు. అతిథి పూజ చేసి దివ్యత్వము సాధించారు. నీ దానగుణముకు మెచ్చిన బ్రహ్మ తమ లోకానికి మిమ్ము ఆహ్వానించారు. బ్రహ్మలోకము నుండి త్వరలో విమానము వచ్చింది. బ్రాహ్మణోత్తమా! తనకు ఉన్న సంపదలో దానము ధర్మము చెయ్యడము గొప్ప విషయము కాదు. ధర్మముగా సంపాదించినది కొంచమైనా తమకంటూ ఏమీ మిగల్చకోకుండా యోగ్యుడైన వాడికి దానము చెయ్యడం ఉత్తమోత్తమము " అని పలికి యమధర్మరాజు తన దివ్యమైన రూపమును వారికి చూపించాడు. ఇంతలో ఆకాశము నుండి ఒక దివ్యమైన విమానము కనపడింది. అది చూసిన దేవతలు ఆశ్చర్య పోయారు. బ్రాహ్మణుడు, ఆయన భార్య, కుమారుడు, కోడలు యముడికి సాష్టాంగప్రమాణము ఆచరించారు. " బ్రాహ్మణోత్తమా ! అదుగో బ్రహ్మదేవుడు పంపిన దివ్య విమానము మీరంతా ఆదివ్య విమానము ఎక్కి బ్రహ్మలోకము వెళ్ళండి. అని యమధర్మరాజు చెప్పాడు. అప్పుడు ఆబ్రాహ్మణుడు, భార్య, కుమారుడు, కోడలుతో సహా ఆ దివ్య విమానము ఎక్కి బ్రహ్మ లోకము వెళ్ళాడు. ఇదంతా నేను పక్కనే ఉన్న కలుగులో నుండి చూసాను. నేను వెంటనే సక్తుప్రస్థుడు, యమధర్మరాజు కాళ్ళు కడిగిన నీటిలో అటూ ఇటూ పొర్లినప్పుడు నా శరీరానికి ఒక వైపు మాత్రమే ఆ నీరు అంటుకుంది. ఆ నీటి ప్రభావంతో నా శరీరము సువర్ణమయము అయ్యింది. ఆ రోజు నుండి నేను ఎక్కడ యజ్ఞ యాగములు జరుగుతున్నా అక్కడకు వెడుతుంటాను. ఎందుకంటే నా శరీరము రెండవ వైపు కూడా సువర్ణమయము ఔతుందని నా ఆశ. కాని ఇంతవరకు జరగ లేదు. ధర్మరాజు లోకోత్తరమైన యాగము చేస్తున్నాడని విని ఇక్కడకు వచ్చాను కాని ఇక్కడ ఉన్న నీటిలో ఎంత పొర్లినా నా శరీరము నా మిగిలిన శరీరము సువర్ణము కాలేదు. ఎందు కంటే కేవలము పొలములో రాలిన గింజలు ఏరుకుని తినే బ్రాహ్మణుడు చేసే దానముకు ధర్మరాజు చేసే ఈ అశ్వమేధయాగము సాటిరాదు అని తెలుసుకున్నాను " అని ముంగిస అక్కడనుండి వెళ్ళింది.

యాగము జంతుబలి

[మార్చు]

జనమేజయమహారాజు " వైశంపాయనమహర్షీ ! రాజులు యజ్ఞములు చెయ్యడంలో, మునులకు తపస్సు చేసుకొనడము, బ్రాహ్మణులు మనోనిగ్రహము, ఇంద్రియ నిగ్రహములలోఆసక్తి చూపుతారు కదా ! రాజులు ఎన్నో యజ్ఞ యాగములు చేసి కీర్తిగడించి పుణ్యలోకాలకు పోతారని విన్నాము కదా ! ధర్మరాజు అశ్వమేధయాగమును అత్యంత ఉదాత్తరీతిలో నిర్వహించాడు కదా ! ఇంతకు ముందు రాజులకంటే సత్యము, శౌచమూ, భక్తి, శ్రద్ధలతో నిర్వహించాడు కదా ! అతడు చేసిన యాగమును వ్యాసుడి వంటి మహర్షులు కూడా మెచ్చుకున్నారు కదా ! దేవేంద్రుడు చేసినట్లు అశ్వమేధయాగము చేసాడు కదా ! అటువంటి యాగమును ముంగిస గర్హించి ఆవహేళన చేయడానికి కల కారణము ఏమిటి ? " అని అడిగాడు. వైశంపాయనుడు " జనమెజయమహఅరాజా ! ధర్మరాజు నిర్వహించినశ్వమేధయాగములో ఎంతో జీవహింస జరిగింది. దేశమంతాతిరిగివచ్చిన అశ్వాన్నికూడా బలి ఇచ్చారు. 300 మూగజీవులను కూడా చంపారు. ఇంతటి జీవహింసతో కూడుకున్న అశ్వమేధయాగము కంటే ఆ బ్రాహ్మణుడు చేసిన తపోయజ్ఞము ఎంతో మేలైనది అని ఆ ముంగిస చెప్పింది. ఆ బ్రాహ్మణుడు చేసిన సాత్విక , తపోయజ్ఞము వలన తన శరీరము సగభాగము సువర్ణమయము అయింది అని చెప్పింది కనుక అది అబద్ధము అని త్రోసిపుచ్చ లేము " అన్నాడు వైశంపాయనుడు.

అగస్త్యుని యాగం

[మార్చు]

ఈ విషయమును వివరించడానికి ఒక ఇతిహాసము చెప్తాను " పూర్వము ఒక సారి దేవేంద్రుడు ఒక యజ్ఞము చేయ తలపెట్టాడు. ఆ యజ్ఞముకు అనేక వేల మంది ఋత్విక్కులు, మునులు, దేవతలు వచ్చారు. యజ్ఞవాటికను తయారు చేసారు. అగ్నిని వేల్చారు. యజ్ఞములో బలి ఇవ్వడానికి అనేక జంతువులను సమకూర్చారు. అది చూసిన మునులు దేవేంద్రుడితో " దేవేంద్రా ! నీవు చేసిన యజ్ఞములో ఇన్ని జంతువులను బలి ఇవ్వాలా ! యజ్ఞముకు ఇంత జీవ హింస చేయాలా ! జంతువులకు బదులుగా మూడు సంవత్సరాలు నివువ ఉంచిన విత్తనములను యజ్ఞద్రవ్యములుగా వాడ వచ్చును కదా ! ఇది కృతయుగధర్మమని వేదము చెప్తుంది కదా ! కనుక వేదోక్తముగా యజ్ఞము చెయ్యి. కన్నీరు కారుస్తున్న జంతువులను చూసి కనికరించి ఈ యజ్ఞములో జీవ హింస మానుకో " అన్నారు. కాని దేవేంద్రుడు వారి మాట విన లేదు. మునులు కూడా జీవహింస వద్దని పట్టుబట్టారు. దేవ లోకము ఈ వాదనతో రెండు ముక్కలు అయ్యింది. దేవతలు దేవేంద్రుని పక్షము వహించారు. ఆ యాగమును చూడడానికి వచ్చిన దేవేంద్రుడి స్నేహితుడు ఉపరిచరమనువు ఇరు పక్షముల కోరికమీద మధ్యవర్తిత్వము వహించాడు. అందరూ కలసి విషయము వివరించి యజ్ఞములో జీవహింస మంచిదా కాదా అని చెప్పమన్నారు. దేవేంద్రుడి మిత్రుడైన ఉపరిచర మనువు యజ్ఞములో జీవహింస సరి అయినదే అని చెప్పాడు. అలా చెప్పినందుకు అతడు నరకానికి వెళ్ళాడు. కనుక జనమేజయ మహారాజా ! జీవహింస లేని యజ్ఞము ఉత్తమమైనది అనుటలో ఇసుమంత అయినా సందేహము లేదు " అని వైశంపాయనుడు చెప్పాడు.

దానము ధనము

[మార్చు]

జనమేజయుడు " మహర్షీ ! మీరు చెప్పినది నిజమే. ఆ బ్రాహ్మణుడి త్యాగము కొనియాడతగినది. దానము చెయ్యడానికి ధర్మమార్గములో సంపాదించిన ధనము మాత్రమే యోగ్యమైనది అని ఇంకా వివరించండి " అని అడిగాడు. వైశంపాయనుడు " జనమేజయ మహారాజా ! ఈ విషయము వివరించడానికి నీకు ఒక కథ చెప్తాను. పూర్వము అగస్త్యుడు 12 సంవత్సరాలు నిరాఘంటముగా సాగే ఒక యాగము చేయడానికి పూనుకున్నాడు. ఆ యాగమునకు అనువజ్ఞులు అయిన మునులు, ఋత్విక్కులు వచ్చారు. యజ్ఞముకు తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయి కాని ఇంద్రుడు మాత్రం వర్షం కురిపించలేదు. కనుక ఓషధులు లభించలేదు. కనుక బ్రాహ్మణులకు, ఆహుతులకు దానధ్ర్మమములు చెయ్యడానికి భోజనము పెట్టడానికి ధనము, ధాన్యము లేదు. ఈ యాగము ఎలా నిర్వహిస్తాడో అని అందరూ ఆతురతతో ఎదురుచూస్తున్నారు. ఎందు కంటే అగస్త్యుడు 12 సంవత్సరాలు దీక్షలో ఉన్నాడు. ధర్మమార్గములో వచ్చినది తప్ప వేరొకటి ముట్టడు. ధర్మమార్గములో ధాన్యము రావలంటే వర్షాలు పడాలి. పంటలు పండాలి. ఏమి జరుగనున్నదో అని అందరూ విచారంగా ఎదురు చూస్తున్నారు.

అగస్త్యుడు మునులకు ధైర్యము చెప్పుట

[మార్చు]

ఆ మాటలు విన్న అగస్త్యుడు " మహామునులారా ఋత్విక్కులారా ! నేను చేయబోవు ధర్మయజ్ఞముకు దేవేంద్రుడు సహకరించి వర్షములు కురిపిస్తే సరి, లేకున్న నేను ఇంద్రపదవిని స్వీకరించి లోకములను పాలిస్తాను. మీరిక నిశ్చింతగా ఉండండి. అదీ కాకపోతే ఈ మూడు లోకాలలో ఉన్న యజ్ఞద్రవ్యాలను తీసుకువచ్చి యజ్ఞము చేస్తాను. ఈ సంవత్సరము ఉత్తర కురుభూములలో వర్షములు సమృద్ధిగా పడ్డాయి. ధాన్యాలు పుష్కలంగా ఉన్నాయి. యాగసమయంలో అన్నదానము చేయడానికి అక్కడ నుండి ధాన్యము తెప్పిస్తాను. నేను యజ్ఞములో విత్తనములు వేసి వేల్చడము వలన లోకానికి ఏమన్నా కీడు జరుగుతుందా ! విత్తనములతో యజ్ఞము చేస్తే యజ్ఞముకు ఆటంకము జరుగుతుందా ! కనుక ఈ విషయములో మీరు ఇక చింతించ పని లేదు " అన్నాడు. ఆ మాటలకు అక్కడ చేరిన మునులు " మహార్షీ ! ఇంత చిన్న విషయానికి మీరు మీ తపోశక్తిని ఎందుకు వ్యర్ధము చేసుకుంటారు. ఇతరుల వద్ద నుండి ధనము తీసుకొనడము ఎందుకు, ఉత్తర కురుభూముల నుండి ధాన్యము తెప్పించిడము ఎందుకు, పంటలు పండించడానికి ఉపయోగించే విత్తనములతో యజ్ఞము చెయ్యడము ఎందుకు. మాకు కావలసిన వస్తువులు, యజ్ఞముకు కావలసిన వస్తువులు మేము మా ఆశ్రమాల నుండి తీసుకు వచ్చి యజ్ఞమును నిర్విజ్ఞముగా జరిపిస్తాము " అన్నారు. ఈ విషయము అంతా తెలుసుకున్న ఇంద్రుడు తన పదవి ఎక్కడ ఊడుతుందో అని భయపడి వర్షములు పుష్కలముగా కురిపించి బృహస్పతిని తోడు తీసుకుని భయభక్తులతో అగస్త్యుడి వద్దకు వచ్చాడు. అగస్త్యుడు ఇంద్రుడిని సాదరంగా ఆహ్వానించాడు. యజ్ఞము నిర్విజ్ఞముగా జరిగింది. దేవేంద్రుడిని సాదరంగా స్వర్గలోకముకు పంపాడు. యజ్ఞముకు వచ్చిన మునులకు, ఋత్విక్కులను భక్తితో పూజించి తగినసత్కారము చేసి పంపాడు. ఈ విధంగా అగస్త్యుడు హింసకు తావు లేని యజ్ఞము చేసి కీర్తి గడించాడు. కనుక జనమేజయ మహారాజా ! ధర్మమార్గమున సంపాదించిన ధనముతో చేసే యజ్ఞము హింసకు తావు లేకుండా చేసే యజ్ఞము మనోజ్ఞమై వెలుగుతుంది " అని వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పాడు.

ముంగిస పూర్వ కథ

[మార్చు]

జనమేజయుడు వైశంపాయనుడిని " మహర్షీ ! ఇది వరకు మీరు ఒక ముంగిస మనుషభాషలో మాట్లాడింది అని చెప్పారు కదా ! ఆ ముంగిస పూర్వజన్మలో ఎవరో ఒక మహానుభావుడు అయి ఉంటాడు. ఆ విషయము వివరించండి " అని అడిగాడు. వైశంపాయనుడు ఒకసారి పితృకార్యము చేయ సంకల్పించి ఒక కొత్తకుండలో తమ ఇంటిలో ఉన్న హోమధేనువు పాలుపితికి ఒక ప్రదేశములో పదిలంగా పెట్టాడు. అప్పుడు అతడిలోని క్రోధదేవత సాకారముగా వచ్చి పొరపాటున చేసినట్లు ఆ పాలకుండను పడగొట్టింది. పాలు అన్ని నేలపాలు అయ్యాయి. అది చూసిన జమదగ్ని కోపించ లేదు. అప్పుడు కోపదేవత " జమదగ్నీ ! సాధారణంగా భృగు వంశస్థులు మహాకోపిష్టులు కదా ! అది నిజము కాదు అని నీవు నిరూపించావు. నేను ఓడి పోయాను. నీ పట్ల అపరాధము చేసినందుకు నన్ను క్షమించు " అన్నది. జమదగ్ని " అదేమిటి నీవేమి తప్పు చేసావు. ఒక వేళ నీవు తప్పు చేవని భావిస్తే దానిని నీ మనసు నుండి తీసి వెయ్యి. అయినా నీవు మా పితృదేవతలకు చేయు శ్రాద్ధకర్మలకు విజ్ఞము కలిగించావు. అందువలన పితృదేవతలు నిన్ను శపించగలరు. కనుక నీవు ఇక్కడ నుండి వెళ్ళిపో " అన్నాడు. జమదగ్ని మాట మన్నించి క్రోధదేవత అక్కడ నుండి వెళ్ళి పోయింది. తరువాత జమదగ్ని ఆహ్వానము మీద అక్కడకు వచ్చిన పితృదేవతలు జరిగిన విషయము తెలుసుకున్నారు. వారు జరిగినదానికి కోపించి " నీవు చేయబోవు శ్రాద్ధకర్మకు విజ్ఞము కలిగించిన క్రోధదేవతను నీవు శపించక విడిచి క్షమించరాని శాంతము వహించావు. అందువలన నీవు ముంగిసవై పుట్టు " అని శపించారు. అప్పుడు జమదగ్ని " పితృదేవతలారా ! బ్రాహ్మణులకు కోపము తగదు అంటారు కదా ! అందుకని క్రోధదేవతను శపించ లేదు. నా అపరాధము మన్నించి నాకు శాపవిమిక్తి కలిగించండి " అని వేడుకున్నాడు. పితృదేవతలు శాంతించి " కుమారా ! మహా పండితులు ఉన్న సభలో ఒక మహాధర్మమును అధర్మము అని నిరూపించి శాపవిముక్తుడవై మోక్షపదవిని పొందు " అన్నారు. జనమేజయమహారాజా ! ఆ ముంగిస గతజన్మలో జమదగ్ని. మరుజన్మలో ముంగిసగా జన్మించి ధర్మరాజు చేసిన అశ్వమేధయాగాన్ని అధర్మమని నిరూపించి శాపవిముక్తి పొందింది " అని వైశంపాయనుడు చెప్పాడు.

బయటి లింకులు

[మార్చు]