కాచిగూడ రైల్వేస్టేషను, (నిలయ సంకేతము: KCG) దక్షిణమధ్య రైల్వే (South Central Railway) విభాగానికి చెందిన హైదరాబాదులోని ప్రధాన రైల్వేస్టేషన్లలో ఒకటి. శిల్పశైలి పరంగా దక్షిణ మధ్య రైల్వే విభాగములో అందమైన స్టేషన్లలో ఇది ఒకటి. 1916లో అప్పటి హైదరాబాదు నిజాం చేత కట్టించబడిన ఈ స్టేషను నిజాం రాష్ట్ర గ్యారంటీడ్ రైల్వే ప్రధాన కేంద్రంగా ఉంది.[1]సికింద్రాబాదు రైల్వే జంక్షన్ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో విద్యానగర్, మలక్‌పేట రైల్వే స్టేషన్ల మధ్యలో కాచిగూడ ప్రాంతంలో ఉంది.నిజాం పరిపాలనలో ఉన్న మన్మాడ్ నాందేడ్, పర్భని, ఔరంగాబాద్ (ప్రస్తుతం ఇవి మహారాష్ట్రలో ఉన్నాయి) ప్రాంతాలను హైదరాబాద్‌తో అనుసంధానించడానికి ఈ రైల్వే మార్గం కీలకం. ప్రజల రద్దీ ఒక అంశం అయితే, ఇక్కడ ఉన్న నల్ల రేగడి నేల ప్రాంతాల నుండి పత్తిని రవాణా చేయడంలో ఈ రైల్వే మార్గం కీలక పాత్ర పోషించింది. ఈ ప్రాంతాన్ని గోదావరి వ్యాలీ రైల్వేమార్గం అని పిలుస్తారు. బ్రిటీష్ పాలకులకు, లండన్ నుండి పెట్టుబడిదారులకు నష్టపరిచేది అయినప్పటికీ వారి పెట్టుబడిపై నిజాం హామీ ఇవ్వడంతో దీనికి నిజాం గ్యారెంటీడ్ రైల్వే అని పేరు పెట్టారు.[2]
ఒక కేంద్ర ప్రధాన గుమ్మటము, రెండు ప్రక్క గుమ్మటాలు, మినార్లతో, ఈ కట్టడము గోథిక్ శైలిలో కట్టబడింది. రాజా ప్రసాదములాగా కట్టబడిన కాచిగూడా రైల్వేస్టేషను హైదరాబాదు చిహ్నాలలో ఒకటి. ఆధునిక ప్రయాణ సౌకర్యాలు కలిగిన ఈ స్టేషను ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వేలోని హైదరాబాదు విభాగానికి కేంద్రముగా పనిచేస్తున్నది. ఇచ్చటి నుండి బెంగుళూరు ఎక్స్‌ప్రెస్, తుంగభద్ర ఎక్స్‌ప్రెస్, చెంగల్పట్టు ఎక్స్‌ప్రెస్, వేంకటాద్రి ఎక్స్‌ప్రెస్, యశ్వంతపుర్ ఎక్స్‌ప్రెస్, మధురై ఎక్స్‌ప్రెస్, నాగర్కోవిల్ ఎక్స్‌ప్రెస్, మంగుళూరు ఎక్స్‌ప్రెస్, అకోలా ఎక్స్‌ప్రెస్, నార్ఖేడ్ ఎక్స్‌ప్రెస్ మొదలగునవి బయలుదేరును.[3]