Jump to content

ద్రోణ పర్వము చతుర్థాశ్వాసము

వికీపీడియా నుండి
(ద్రోణ పర్వము చతుర్ధాశ్వాసము నుండి దారిమార్పు చెందింది)


చతుర్ధాశ్వాసం

[మార్చు]

అప్పటి వరకూ సంజయుని మాటలు వింటున్న ధృతరాష్ట్రుడు సంజయునితో " సంజయా! ధర్మరాజు అనుమతి తీసుకుని వెళుతున్న సాత్యకి ద్రోణుని ఎలా దాటగలిగాడు. మన సైన్యం ఎవరూ సాత్యకిని అడ్డుకొన లేదా ! సాత్యకి అర్జునుడిని కలిసాడా ! వివరంగా చెప్పు " అని అడిగాడు. సంజయుడు చెప్పసాగాడు " ధర్మరాజు ఆజ్ఞా బద్ధుడైన సాత్యకి అడ్డువచ్చిన కౌరవ సేనలను చంపుతూ ముందుకు దూసుకు వెళుతున్నాడు. తనను అడ్డుకున్న ఏడుగురిని యమపురికి పంపాడు సాత్యకి. అది చూసి ద్రోణుడు సాత్యకిని అడ్డుకుని అతిక్రూర శరములతో కొట్టాడు. సాత్యకి రధమును, సారధిని కొట్టాడు. అందుకు సాత్యకి కోపించి ద్రోణునిపై బాణములు గుప్పించాడు. ద్రోణుడు వాటిని త్రుంచి తిరిగి సాత్యకిపై బాణములు గుప్పించి " సాత్యకీ ! నా పరాక్రమముకు తట్టుకోలేక నీ గురువు అర్జునుడు నాతో యుద్ధము చేయకుండా పారి పోయాడు. ఇప్పుడు నువ్వు వచ్చావు నా బాణముల రుచి చూద్దువుగాని " అన్నాడు. సాత్యకి ద్రోణునికి నమస్కరించి " ఆచార్యా! నేను అంతటి వాడిని కాను. ధర్మరాజు ఆజ్ఞ మేరకు అర్జునుడికి సాయం వెడుతున్నాను. దయ ఉంచి నన్ను విడువుము . నా వంటి పిన్నలను మన్నించుట మీ వంటి పెద్దల ధర్మము కదా ! " అన్నాడు. అయినా ద్రోణుడు సాత్యకికి దారి విడువ లేదు. సాత్యకి తనకు అడ్డుగా ఉన్న అంగ, బాహ్లిక, దాక్షిణాత్య సేన మధ్య నుండి ఆవలకు వెళ్ళాడు. ఇంతలో కృతవర్మ సాత్యకిని అడ్డుకుని ఆరు బాణములతో సాత్యకిని కొట్టాడు. నాలుగు బాణములతో సాత్యకి రథాశ్వములను కొట్టాడు. సాత్యకిని కృతవర్మ అడ్డుకొనడం చూసిన ద్రోణుడు ధర్మరాజు వైపు వెళ్ళాడు. సాత్యకి కృతవర్మను పదహారు శరములతో కొట్టాడు. అతడి సారథి చంపి, అతడి విల్లు విరిచాడు. కృతవర్మ తన రథమును తానే తోలుకుంటూ యుద్ధం చేస్తూ కృతవర్మ సాత్యకిని వదిలి భీముని వైపు పోయాడు. సాత్యకి కాంభోజుని సేనలో ప్రవేశించి అక్కడి వీరులను తనుమాడుతున్నాడు. ఇంతలో ద్రోణుడు కృతవర్మకు మరొక రథమును ఏర్పాటు చేసాడు.

కృతవర్మ పరాక్రమం

[మార్చు]

కృతవర్మ ధర్మరాజును అతడికి సాయంగా ఉన్న వీరులను ఎదుర్కొన్నాడు. భీమసేనుడు వారికి సాయంగా వచ్చాడు. భీముడు, ధృష్టద్యుమ్నుడు మూడేసి బాణములతోను ధర్మరాజు, ద్రుపదుడు అయిదేసి బాణమలతోను విరాటరాజు పదిహేను బాణములతోను సహదేవుడు ఇరవై ఐదు బాణములతోను, శిఖండి ఇరవై బాణములతోను, ఉపపాడవులు డెబ్బై అయిదు బాణములతోను, నకులుడు నూరు బాణములతోను కృతవర్మను చుట్టుముట్టి కొట్టారు. కృతవర్మ జంకక ఒక్కొక్కరిని ఐదేసి బాణములతో కొట్టి భీమునిపై ఏడు బాణములు వేసి, భీముని విల్లు పతాకము తుంచి డెబ్బై బాణములతో భీముని గుండెలకు గురిపెట్టి కొట్టాడు. ఆ దెబ్బకు భీముడు మూర్చిల్లాడు. ఇంతలో పాండవ వీరులు ఒక్కుమ్మడిగా కృతవర్మను చుట్టుముట్టారు. ఇంతలో భీముడు తేరుకుని కృతవర్మ మీద ఉజ్వలమైన శక్తిని ప్రయోగించాడు. కృతవర్మ దానిని మూడు ముక్కలుగా కొట్టాడు. కృతవర్మ దానిని మూడు ముక్కలు చేసాడు. భీముడు కృతవర్మను నెత్తురు కారేలా కొట్టాడు. కృతవర్మ భీమునిపై మూడు బాణములు వేసాడు. పాండవ సైన్యం కృతవర్మను చుట్టుముట్టి తీవ్రమైన బాణములతో కొట్టారు. కృతవర్మ కూడా జంకక శిఖండి విల్లు తుంచి భీముని వంటి రథికులపై శరములు గుప్పించి శిఖండి పైన బాణములు గుప్పించాడు. ఆ దెబ్బకు శిఖండి రథముపై పడ్డాడు. సారథి శిఖండిని పక్కకు తీసుకు వెళ్ళాడు. శిఖండి పడిపోవడం చూసి మత్స్య, కేకయ, చేధి రాజులు ఒక్కుమ్మడిగా తమసైన్యములతో కృతవర్మను ఎదుర్కొన్నారు. కృతవర్మ వారందరిని మర్మభేది బాణములు ప్రయోగించి బాధించాడు. కృతవర్మ ధాటికి పాండవ సైన్యాలు పారి పోవడం చూసిన సాత్యకి అర్జునుడి వద్దకు పోవడం కంటే ధర్మజుని రక్షణే ముఖ్యం అని తలచి ద్రోణుని పక్క నుండి ధర్మజుని వద్దకు వచ్చి కృతవర్మను ఎదుర్కొన్నాడు.

సాత్యకి శౌర్యం

[మార్చు]

సాత్యకి కృతవర్మను ఎదుర్కొని భల్ల బాణములతో కృతవర్మ వింటిని తుంచి నాలుగు బాణములు వేసి రథాశ్వములను చంపి, ఒక్క అగ్నిబాణముతో సారథిని కొట్టి, ఇంతలో తనకు అడ్డు వచ్చిన త్రిగర్త సైన్యమును నాశనం చేసాడు. రథము విరిగిన కృతవర్మను పాండవ సైన్యం చుట్టుముట్టింది. ఇది చూసిన ద్రోణుడు సాత్యకిని వదిలి పాండవ సైన్యమును ఎదుర్కొన్నాడు. ఇంతలో జలసంధుడు అనే రాజు సాత్యకిని ఎదుర్కొని తన ఏనుగును సాత్యకి మీదకు తోలాడు. సాత్యకి అతడిని అడ్డుకున్నాడు. జస్లసంధుడు సాత్యకి వింటిని విరిచి ఏభై బాణములతో సాత్యకి గుండెలకు గురి చూసి కొట్టాడు. సాత్యకి కోపించి జలసంధుని అరవై బాణములు జలసంధుని శరీరంపై నాటాడు. జలసంధుడు ఒక తోమరంతో సాత్యకిని కొట్టి కత్తితో అతడి విల్లు విరిచాడు. సాత్యకి వెంటనే మరొక విల్లు తీసుకుని ఆలస్యం చేయక జలసంధుని క్రూరమైన బాణముతో చేతులు నరికి, మరొక బాణముతో అతడి తల నరికి మరొక బాణంతో అతడి ఏనుగును తరిమాడు. సాత్యకి పరాక్రమానికి కౌరవసైన్యం భయకంపితం అయింది. ఇది చూసిన ద్రోణుడు కృతవర్మను వ్యూహము వద్ద నిలిపి తాను సాత్యకిని ఎదుర్కొన్నాడు. తనకు ఎదురుగా ద్రోణుడు రావడం చూసాడు సాత్యకి అతడి వెనుక కురుకుమారులైన దుర్మర్షణ, దుర్ముఖ, దుశ్శాసన, దుస్సహ, వికర్ణ, చిత్రసేనాదులు రావడం చూసాడు. ఇంతలో సుయోధనుడు వారితో చేరాడు. వారిని చూసిన ద్రోణుడు సుయోధనుడు తన సహోదరులతో సాత్యకిని ఎదిరించగలడు అనుకుని తిరిగి వ్యూహరక్షణకు వెళ్ళాడు. సాత్యకి కురుకుమారులకు ఒక్కొక్కరికి ఒక్కొకడిలా కనిపిస్తూ వారందరితో ఏక కాలంలో యుద్ధం చేస్తున్నాడు. అలా యుద్ధం చేస్తూ సుయోధనుడి విల్లు విరిచి అతడి శరీరం తూట్లు పడేలా కొట్టాడు. ఇది చూసిన కురుకుమారులు సాత్యకిపై బాణవర్షం కురిపించారు. సాత్యకి వారి అందరిపై ఒక్కొక్కరిపై అయిదేసి బాణము వేసి సుయోధనుడి మీద ఎనిమిది బాణములు వేసి అతడి వింటిని తుంచి, కేతనమును విరిచి, సారథిని కొట్టి, రథాశ్వములను చంపాడు. సుయోధనుడు సాత్యకి పరాక్రమానికి భయపడి పక్కనే ఉన్న చిత్రసేనుడి రథం ఎక్కి పారిపోయాడు.

సాత్యకి కౌరవ సేనలను ఎదుర్కొనుట

[మార్చు]

సుయోధనుడిపై సాత్యకి పైచేయి కావడం చూసిన కౌరవసేన హాహాకారాలు చేసింది. అది చూసి కృతవర్మ అక్కడకు చేరాడు. సాత్యకి కూడా తన రథమును కృతవర్మకు ఎదురుగా నిలిపాడు. ఇద్దరూ ఒకరి మీద ఒకరు శరవర్షం కురిపించుకున్నారు. సాత్యకి కృతవర్మ విల్లు విరిచి, సారథిని చంపి మరొక బాణంతో కృతవర్మను మూర్చపోయేలా కొట్టాడు. ఆ దెబ్బకు కృతవర్మ రథంపైన పడ్డాడు. కృతవర్మ మరణించాడని అనుకుని సాత్యకి అర్జునుడి వద్దకు పోవడానికి ఆయత్తమయ్యాడు. కృతవర్మ తేరుకుని తిరిగి యుద్ధానికి వచ్చాడు. ద్రోణుడు కృతవర్మను వ్యూహద్వారము వద్ద నిలిపి తాను సాత్యకిని అడ్డగించడానికి వెళ్ళి మూడు క్రూర బాణములతో సాత్యకి నుదుటన కొట్టాడు. సాత్యకి అందుకు ప్రతిగా ద్రోణుడిపై బాణప్రయోగం చేసాడు. ఇరువురి మధ్య పోరు ఘోరమైంది. ద్రోణుడు ప్రయోగించిన శక్తి ఆయుధం విధి వశమున సాత్యకి రథమును తాకింది. సాత్యకి ద్రోణుడి భుజం మీద బాణమును వేసాడు. ద్రోణుడు సాత్యకి విల్లు తుంచి, సారథిని మూర్ఛిల్లేలా కొట్టాడు. సాత్యకి తానే రథము తోలుతూ యుద్ధము చేస్తున్నాడు. సాత్యకి ద్రోణుని రథసారథిని చంపాడు. సారథి లేని ద్రోణుని రథాన్ని గుర్రములు ఎటో లాక్కెళ్ళి చివరకు వ్యూహద్వారం చేర్చాయి. ద్రోణుని అడ్డు తొలగగానే సాత్యకి తన రథమును అర్జునుడి వైపు నడిపాడు. శరవేగంతో దూసుకుపోతున్న సాత్యకిని సుదర్శనుడు ఎదుర్కొని సాత్యకిపై బాణములు గుప్పించాడు. సాత్యకి ఆ బాణములను తునాతునకలు చేసి సుదర్శనుడి రథాశ్వములను చంపి, సారథిని చంపి చివరకు సుదర్శనుడి తల నరికాడు. సాత్యకి రథసారథితో " మహాసముద్రం వంటి ద్రోణుడిని దాటి వచ్చాను. ఈ పిల్ల కాలువలు ఒక లెక్కా ! " అన్నాడు. " ఆ విషయం నాకు తెలియనిదా ! ఇప్పుడు మనమెవరిని ఎదుర్కోవాలి " అన్నాడు సారథి. సాత్యకి " సారధీ! ఇక్కడ రధములు విరిగి పడి ఉన్నాయి. చనిపోయిన ఏనుగులు, హయములు, సైనికుల శవాలు పడి ఉన్నాయి. వీరిని అర్జునుడే చంపి ఉంటాడు. కనుక రధాన్ని ఈ మార్గంలో పోనిమ్ము అదిగో గాండీవం యొక్క ధనుష్టంకారం వినిపిస్తుంది అటు పోనిమ్ము. ఇంతలో కాంభోజరాజ సైన్యములు సాత్యకిని చుట్టుముట్టాయి. సాత్యకి వారి బాణములను ఎదుర్కొని అందరిని యమసదనముకు పంపాడు. ఆ ప్రాంతం అంతా పీనుగుల పెంట అయింది. వారి మీదనుండి రధము నడుపుతూ సాత్యకి ముందుకు సాగాడు.

దుర్యోధనుడు సాత్యకిని వెంబడించుట

[మార్చు]

ముందుకు పోతున్న సాత్యకిని సుయోధనుడు తన సోదరులైన దుశ్శాసనుడు, వివిశంతి, చిత్రసేనుడు, దుర్మర్షణుడు, దుస్సహుడు, శకుని మొదలైన యోధులతో సాత్యకిని తరుముకొస్తున్నారు. వారిని చూసిన సాత్యకి " సారథీ ! రథము వెనుకకు తిప్పు వీరి సంగతి చూసి అర్జునుడి వద్దకు పోతాము " అన్నాడు. రధము వెనుకకు తిరిగి వారి ముందుకు రాగానే కురుసేనలు వారిని చుట్టుముట్టాయి. సాత్యకి భయపడక నాలుగు వందల ఏనుగులను మూడు వందల హయములను ఒకే సారి చంపాడు. కౌరవ యోధులలో సాత్యకి బాణముల రుచి చూడని వాడు లేడు. సుయోధనాదులు సాత్యకి మీద ధారాపాతంగా శరములు గుప్పించాడు. సాత్యకి వారినందరిని ఎదుర్కొని వారి రధములను, కేతనములను విరిచి, సారధులను, హయములను చంపాడు. ఇంతలో శకుని సుయోధనుడికి సాయంగా రాగా ఇద్దరూ సాత్యకిని ఎదుర్కొన్నారు. సాత్యకి విజృంభించి శకుని సారధి చంపి, సుయోధనుడి విల్లు విరిచాడు. శకుని రధమును గుర్రములు ఎటో ఈడ్చుకు వెళ్ళాయి. సుయోధనుడు అతడి తమ్ములు తప్పుకోగా సాత్యకి నిరాటంకంగా ముందుకు సాగాడు. దుశ్శాసనుడు కొండ జాతి వారిని సాత్యకి మీద పురికొల్పాడు. వారు సాత్యకిని ఎదుర్కొని అతడిపై రాళ్ళతో యుద్ధం చేయసాగారు. సాత్యకి వారి రాళ్ళను బాణ ప్రయోగంతో పొడి పొడి చేయగా వాళ్ళు సాత్యకి ధాటికి ఆగ లేక పారి పోయారు.

దుశ్శాసనుడిని ద్రోణుడు తూలనాడుట

[మార్చు]

దుశ్శాసనుడు అక్కడ నుండి ద్రోణుని వద్దకు వెళ్ళగా అతడిని చూసిన ద్రోణుడు " యువరాజా ! ఏమిటిలా పరుగెత్తుకు వచ్చావు. సుయోధనుడు క్షేమమే కదా! అర్జునుడు సైంధవుడిని ఏదైనా చేసాడా! నీ వెందుకు పారిపోతున్నావు. అయినా దుశ్శాసనా ! అధికార మధంతో పాండవులను అవమానించినందుకు అష్టకష్టాలు పెట్టినందుకు ఫలితం అనుభవించాలి కదా! ద్రౌపది జుట్టుపట్టి ఈడ్చిన విషయం మరిచావా! పాడవులను హేళన చేసి పలికిన పలుకులు మరిచావా! ఆ నాటి అధికారం గర్వం ఏమయ్యాయి ఇలా భీరువులా పరుగెడుతున్నావు. అయినా ఎంతటి వారికైనా ప్రాణములంటే తీపి కదా ! దుశ్శాసనా ! నీకు నాలుగు కాలాలపాటు బ్రతకాలనుకుంటే ప్రాణాల మీద ఆశ ఉంటే నీ అన్న సుయోధనుడిని సంధికి ఒప్పించి అందరి ప్రాణాలు కాపాడు. అయినా నీ అన్న ఒట్టి వెర్రివాడు తాత భీష్ముని మాట వినక ఒక్కొక్క తమ్ముడిని చంపు కుంటున్నాడు నీ వంతు వస్తుందిలే అదిగో సాత్యకి నీ పక్షాన యుద్ధముకు వచ్చిన రాజులను తరుము తున్నాడు వెళ్ళి వారికి సాయపడక ఇలా భయపడి పారిపోయి రావచ్చునా! " అన్నాడు. ద్రోణుడి మాటకు రోషం తెచ్చుకున్న దుశ్శాసనుడు తిరిగి సాత్యకితో యుద్ధం చేయడానికి వెళ్ళాడు.

ద్రోణుడి పరాక్రమము

[మార్చు]

ద్రోణుడు పాండవ వీరులతో యుద్ధం చేస్తుండగా వీరకేతుడు ద్రోణుని ఎదుర్కొని మరుక్షణంలో ద్రోణుని బాణాలకు బలి అయ్యాడు. వీరకేతుని మరణం చూసి సుధన్వుడు, చిత్రకేతుడు, చిత్రవర్మ, చిత్రరధుడు మొదలగు యోధులు ఒక్కుమ్మడిగా ద్రోణుని ఎదుర్కొన్నారు. కోపించిన ద్రోణుడు వారినందరినీ ఒక్కొక్క బాణముతో చంపి వారి శిరస్సులను భూదేవికి బలి ఇచ్చాడు. ఇది చూసి బాధపడిన ధృష్టద్యుమ్నుడు మహోగ్రంతో ద్రోణుని ఎదుర్కొని అతడి రథమును తన బాణములతో కప్పి అతడి వక్షస్థలంపై కొట్టాడు. ద్రోణుడు ఆ దెబ్బకు మూర్చిల్లాడు. ధృష్టద్యుమ్నుడు కత్తి డాలు తీసుకుని ద్రోణుని రథము ఎక్కి అతడి తల నరకబోయాడు. ఆ సమయానికి కోలుకున్న ద్రోణుడు అందిన ఆయుధము తీసుకుని ధృష్టద్యుమ్నుని ఒళ్ళంతా పొడిచాడు. ఆ బాధ భరించలేని ధృష్టద్యుమ్నుడు తిరిగి తన రథము ఎక్కి ద్రోణునిపై శరవర్షం కురిపించాడు. కోపించిన ద్రోణుడు ధృష్టద్యుమ్నుని సారథిని చంపి, విల్లు విరిచి, గుర్రములను కొట్టాడు. ఆ బాధ భరించ లేని గుర్రాలు ధృష్టద్యుమ్నుని పక్కకు లాక్కెళ్ళాయి. ద్రోణుని పరాక్రమానికి భయపడిన పాండవ సేన అతడి ఎదుట పడటానికి జంకుతున్నారు. ద్రోణుడు తన మాటకు రోషపడి సాత్యకితో యుద్ధము చేయడానికి వెళ్ళిన దుశ్శాసనుడికి సాయంగా మూడు వేల మంది త్రిగర్త సైనికులను పంపాడు. సాత్యకి వారిని ఎదుర్కొని ఒకే దెబ్బకు ఐదు వందల మందిని చంపి మిగిలిన వారిని కూడా తెగ నరక సాగాడు. త్రిగర్త సైనికులు భయపడి ద్రోణుని వైపు పారిపోయారు. ఎదురుగా నిలబడిన దుశ్శాసనుడిని చూసిన సాత్యకి అతడి విల్లు తుంచాడు. దుశ్శాసనుడు వేరొక విల్లు తీసుకుని సాత్యకిపై శక్తి బాణము వేసాడు. సాత్యకి తిరిగి దుశ్శాసనుడి విల్లు విరిచి, సారథిని చంపి, కేతనమును పడగొట్టి దుశ్శాసనుడిని మూర్ఛ పోయేలా కొట్టాడు. అప్పుడు సాత్యకి భీముని ప్రతిజ్ఞ గుర్తుకు తెచ్చుకుని దుశ్శాసనుడిని చంపక వదిలి అర్జునుడి వైపు పోసాగాడు.

కురు పాండవుల సంకుల సమరం

[మార్చు]

ధర్మరాజు సాత్యకికి సాయంగా వెళ్ళాలని ధృష్టద్యుమ్నుని, భీముని, నకుల సహదేవులను ముందుంచుకుని కౌరవ సేనలను తరుముతున్నాడు. అర్జునుడు కౌరవ సేనలో దూరి వారిని హతమారుస్తున్నాడు. సాత్యకి అర్జునుడిని చేరాలని ఎదురైన కురు సేనలను చెండాడుతున్నాడు. ద్రోణుడు పాండుకుమారులను వ్యూహంలోకి రాకుండా అడ్డుకుంటూ పాండవసేనలను తనుమాడుతున్నాడు. ఈ విధంగా ఇరుపక్షల యోధులు మరణిస్తూ మారణహోమము తీవ్రంగా జరుగుతూ రణరంగం భీతి కొల్పుతుంది. అక్కడ ఏమి జరుగుతుందో చూడాలని సుయోధనుడు వచ్చి పాండవులను చూసి భీముని మీద పది బాణములు నకుల సహదేవులు, ఉపపాండవులు, ద్రుపదుడు, విరాటరాజు మీద మూడేసి బాణములు, కేయరాజులు ఐదుగురి మీద శిఖండి మీద మూడు బాణములు, ధృష్టద్యుమ్నుని మీద ఇరవై బాణములు వేసాడు. ధర్మరాజు దుర్యోధనుడి విల్లు విరిచాడు. మిగిలిన పాండవులు అతడిని చుట్టుముట్టారు. సుయోధనుడు తిరిగి సైంధవుని వద్దకు వెళ్ళాడు. ద్రోణునికి కేకయరాజులకు యుద్ధం జరుగుతుంది. ద్రోణుని బాణములను కేకయరాజులు తిప్పి కొడుతున్నారు. ద్రోణుడు అరవై బాణములతో బృహక్షత్రుని కొట్టాడు. బృహక్షత్రుడు కోపించి ద్రోణుని ఎదుర్కొన్నాడు ఇంతలో శిశుపాలుని కొడుకు ధృష్టకేతు ద్రోణుని మీద లంఘించాడు. ద్రోణుడు అతడి విల్లు విరిచాడు. ధృష్టకేతు తన గదతో ద్రోణుని కొట్టాడు. ద్రోణుడు ఆ గదను తుత్తునియలు చేసి మరొక బాణంతో ధృష్టకేతు గొండెలకు గురిపెట్టి కొట్టాడు. ఆదెబ్బకు ధృష్టకేతు యమసదనం చేరాడు. ధృష్టకేతు కుమారుడు తండ్రి మరణానికి ఆగ్రహించి ద్రోణాచార్యుని ఎదుర్కొన్నాడు. ఒక్క బాణంతో ద్రోణుడు ధృష్టకేతు కుమారుని తుదముట్టించాడు. వెంటనే జరాసంధుని కుమారుడు ద్రోణుని ఎదుర్కొన్నాడు. ద్రోణుడు వాని పటాటోపాన్ని చూసి అతడి సైన్యం ముందే అతడిని చంపాడు. అది చూసిన భీముడు " ధృష్టద్యుమ్నా ఈ బ్రాహ్మణుడు మన సైన్యాలను అవిశ్రాంతంగా చంపుతున్నాడు " అన్నాడు. ఇంతలో క్షత్రవర్మ ద్రోణుని విల్లు విరిచాడు. ద్రోణుడు మరొక విల్లు అందుకుని అగ్నిశిఖలు విరజిమ్మే బాణాలతో క్షత్రవర్మను చంపాడు. చేకితానుడు ద్రోణుని ఎదుర్కొని అతడి రథము విరిచి, అతడి సారథిని చంపి శరీరం అంతా బాణములు నాటాడు. కోపించిన ద్రోణుడు చేకితానుడి భుజము నరికి సారథిని చంపి, హయములను చంపాడు. ద్రోణుడి పరాక్రమము తట్టుకోలేని చేకితానుడు అక్కడి నుండి పారిపోయాడు. ఇది చూసి ద్రుపదుడు ద్రోణుని ఎదుర్కొన్నాడు. ఇరువురికి పోరు ఘోరమైంది.

ధర్మరాజు భీమసేనిడిని అర్జునుడికి సాయంగా పంపుట

[మార్చు]

ధర్మరాజు మనసులో ఇలా అనుకుంటున్నాడు. " అర్జునుడుకి సాయంగా పంపిన సాత్యకి జాడ తెలియ లేదు అర్జునుడుఏలా ఉన్నాడో తలితెలియ లేదు " అనుకుంటూ భీముని పిలిచి " భీమసేనా ! నీ తమ్ముడు అర్జునుడి జాడ తెలియ లేదు. అతడికి సాయంగా వెళ్ళిన సాత్యకి ఏమయ్యాడో తెలియ లేదు. నాకు చాలా ఆందోళనగా ఉంది " అన్నాడు. భీముడు " అన్నయ్యా ! నేను ఏమి చెయ్యాలో చెప్పు . సత్వరం ఆచరిస్తాను " అని అన్నాడు. " భీమసేనా ! నాకు పాంవజన్యం శబ్ధం మాత్రం వినవచ్చింది. అర్జునుడి దేవదత్త శంఖధ్వని వినరాలేదు అందు వలన సాత్యకిని పంపాను. అతడి జాడ తెలియ లేదు. నీవు వెళ్ళి అర్జునుడి క్షేమం కనుక్కుని రా ! " అని అన్నాడు. " అదేమిటి అన్నయ్యా ! అర్జునుడి పరాక్రమము గురించి నీకు తెలియదా! అతడి గురించి దిగులు ఎందుకు అయినా నీ ఆజ్ఞ శిరసావహించి నేను వెడుతున్నాను నన్ను ఆశీర్వదించు " అని అన్నగారి ఆశీర్వచనాలు తీసుకుని ధృష్టద్యుమ్నుని చూసి " ధృష్టద్యుమ్నా! నీకు ద్రోణుని ప్రతిజ్ఞ గురించి తెలుసుకదా ! అన్నగారు జాగర్త నేను అర్జునుడికి సాయంగా వేడుతున్నాను " అన్నాడు. " భీమసేనా ! ఈ ధృష్టద్యుమ్నుని మేనిలో ప్రాణమున్నతంత వరకు ధర్మజుని మీద ఈగ వాలనివ్వను నీవు క్షేమముగా వెళ్ళి రమ్ము " అన్నాడు ధృష్టద్యుమ్నుడు. ఇంతలో పాంచజన్య ఘోషవినిపించింది. ధర్మరాజు కంగారుగా ఉన్నాడు " భీమసేనా ! విన్నావుగా కృష్ణుడు పాంచజన్యం పూరిస్తున్నాడు. అర్జునుడి దేవదత్త ఘోష వినరాలేదు అర్జునుడు ఆపదలో ఉన్నాడనడానికి ఇది సూచన. నీవు త్వరగా అర్జునుడికి సాయంగా వెళ్ళు " అని భీమసేనుడిని తొందర పెట్టాడు. వెంటనే భీముడు పాంచజన్య శంఖ శబ్ధం వినవచ్చిన దిక్కుగా తన రథమును నడిపించాడు.

భీముడు కురు రాకుమారులను వధించుట

[మార్చు]

ఇంతలో నీ కుమారుడు దుశ్శలుడు, వివిశంతి, కుండభేధి, చిత్రసేనుడు, దుర్ముఖుడు, దుస్సహుడు, వికర్ణుడు, శలుడు, విందుడు, అనువిందుడు, సుముఖుడు, దీర్ఘబాహుడు, సుదర్శనుడు, బృందారకుడు, సుహస్తుడు, సుషేణుడు, దీర్ఘలోచనుడు, అభయుడు, రౌద్రకర్ముడు, సుశర్మ, దుర్విమోచనుడు మొదలైవ వారు భీమసేనుడిని అడ్డుకున్నారు. భీమసేనుడు వారిని నిలువరిస్తూ అర్జునుడి వైపు పోతూ బృందారకుని, అభయుని, రౌద్రకర్ముని, దుర్విమోచనుడిని చంపాడు. కురుకుమారులు అందుకు జడవక భీముని చుట్టుముట్టారు. భీముడు కోపించి విందానువిందులను, సుశర్మను,సుదర్శనుడిని భూమి మీద పడేలా కొట్టాడు. ఆ దెబ్బకు కౌరవ సేన పారిపోయారు. ఆ దెబ్బకు కౌరవ సేన పారిపోయారు. భీమసేనుడు సింహనాదం చేస్తూ ముందుకు సాగుతున్నాడు.

ద్రోణుడు భీముని అడ్డగించుట

[మార్చు]
దస్త్రం:Bhima fights Drona.jpg
ద్రోణుడి రథాన్ని దూరంగా విసిరి వేస్తున్న భీముడు

ద్రోణుడు అర్జునుడికి సాయంగా వెడుతున్న భీముని అడ్డగించి అతడి మీద బాణవర్షం కురిపించి " భీమసేనా ! నీవు నన్ను జయించి కాని నీవు లోపలకు వెళ్ళలేవు. నీ తమ్ముడు అర్జునుడు కూడా నా అనుమతి తీసుకుని లోపలకు వెళ్ళాడు " అన్నాడు. అది అర్ధం చేసుకోని భీముడు కోపంగా " ద్రోణాచార్యా ! నా తమ్ముడు ఎప్పుడూ అటువంటి పని చేయడు. అర్జునుడు ఒక రధికుని సాయంతో లోపలకు వెడతాడా ! అది అసంభవం. ఏవేవో తియ్యటి మాటలు చెప్పి పక్క నుండి తప్పుకు పోవడానికి నేను పార్ధుడిని కాను. నేను భీమసేనుడిని నా తండ్రిగా గురువుగా మిమ్ము గౌరవిస్తాను. కాని మీరు శత్రుపక్షాన చేరి వారికి విజయం కట్టబెడుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను " అంటూ తన గదను ద్రోణుని మీదకు విసిరాడు. అది ఆకాశంలో చక్కర్లు కొడుతూ ద్రోణుని రథంపై పడి నుగ్గు నుగ్గు చేసి, సారథిని, హయములులను చంపింది. అది చూసిన నీ కుమారులు భీమసేనుడిని ఎదుర్కొని నిలువ లేక పారిపోయారు. ద్రోణుడు మరొక రథం ఎక్కి మరొక విల్లు అందుకుని భీమసేనుడిపై శరవర్షం కురిపించాడు. భీమసేనుడు తన రథం దిగి ద్రోణుడి బాణవర్షంలో నుండి నడచి వెళ్ళి ద్రోణుడి రథం తీసుకుని ఎత్తి విసిరాడు. తిరిగి ద్రోణుడి రథం నుగ్గు నుగ్గు అయింది. ద్రోణుడు మరొక రథం ఎక్కి వీడితో మనకెందుకు అని వైదొలిగాడు. భీముని రథసారథి విశోకుడు భీమసేనుని రథం తీసుకు వచ్చి నిలిపాడు. భీమసేనుడు అర్జునుడి వపు సాగిపోసాగాడు. ద్రోణుని జయించి ముందుకు పోతున్న భీముని చూసి కాంభోజ, భోజ, యవన సేనలు భయంతో వైదొలిగి పోయాయి. కౌరవ సేనలో భీముని ఎదుర్కొనే ధైర్యం ఎవరికి లేక పోయింది. భీముడు కౌరవ సేనతో యుద్ధం చేస్తున్న సాత్యకిని చూస్తూ ముందుకు సాగి అర్జునుడిని చేరుకుని కృష్ణార్జునులను చూసి సింహనాదం చేసాడు. భీముని చూసి కృష్ణార్జునులు సింహనాదం చేసారు. ఈ కలకలం విన్న ధర్మరాజు అర్జునుడు కృష్ణుడు క్షేమంగా ఉన్నారని తెలుసుకుని ఆనంద పరవశుడయ్యాడు " అని సంజయుడు చెప్పగా విన్న ధృతరాష్ట్రుడు " అదేమిటి సంజయా ! మన సైన్యంలో భీముని ఎదుర్కొనే వీరుడే లేడా ? అవునులే భీముడు నా కుమారులను చంపడానికే పుట్టాడు అతడికి ఎదురేముంటుంది లే " అని మనసులో అనుకున్నాడు.

సుయోధనుడు ద్రోణుని నిందించుట

[మార్చు]

భీమసేనుడిని చూసిన కర్ణుడు అతడిని తక్కువ అంచనా వేసి ఎదుర్కొని ఇరవై బాణములు అతడి మీద వేసాడు. భీమసేనుడు ఆబాణములు త్రుంచి భీముని మీద అరవై నిశిత శరములు కురిపించాడు. వేరొక బాణము వేసి కర్ణుని కేతనము విరిచి, విల్లు విరుగ కొట్టాడు. కర్ణుడు మరొక విల్లు తీసుకుని భీముని మీద శరసంధానం చేసాడు. భీముడు తిరిగి శరసంధానం చేసి కర్ణుని విల్లు విరిచి, సారధిని, హయములను చంపాడు. కర్ణుడు వృషసేనుడి రధము ఎక్కి పారిపోయాడు. ఇది చూసి కౌరవ సేనలో కలకలం రేగింది అది విని సుయోధనుడు " ఆచార్యా ! అటు చూడండి అర్జునుడు, సాత్యకి, భీమసేనుడు సైంధవుడు ఉన్న చోటికి చేరుకున్నారు. అర్జునుడు చొరబడితే పరవా లేదు కాని సాత్యకిని, భీముని లోనికి వదలడం మీకు భావ్యమా ! ఆఖరికి సాత్యకిని ఆపలేక పోవడం మా దౌర్భాగ్యం కాక మరేమిటి " అని నిష్ఠూరంగా మాటాడాడు. ఆ మాటలకు ద్రోణుడు " సుయోధనా ! ఇక్కడ ఎవరు ఎలా వెళ్ళారు అన్నది మనకు ముఖ్యం కాదు. సైంధవుని రక్షణ మాత్రమే మనకు ముఖ్యము. ఈ రోజు యుద్ధం ఒక జూదం అందు సైంధవుడు పందెం. ఈ జూదం శకుని తెలివి తేటలతో గెలిచేది కాదు. యుద్ధకౌశలంతో గెలువతగినది. కనుక నీవు ధైర్యంగా సాగి కర్ణుడు, అశ్వత్థామ మొదలైన వీరులతో సైంధవుని కాపాడు. నేను ఇక్కడ నిలిచి అర్జున, భీమ, సాత్యకులకు పాండవ సేన సాయం అందకుండా చూస్తాను. నేను ఇక్కడ నుండి కదిలితే సైన్యం చెదురుతుంది అప్పుడు సైంధవుని రక్షించడం సాధ్యం కాని పని. నేను లేకున్న పాండవ సైవ్యాలకు ద్వారం తెరిచి నట్లే నేను నీతో రాలేను నీవు వెళ్ళు " అన్నాడు.

సుయోధనుడు పాండవ యోధులను ఎదుర్కొనుట

[మార్చు]

సుయోధనుడు ద్రోణుని మాట మన్నించి తిరిగి వెళ్ళాడు. అప్పుడు సాత్యకి కృతవర్మను జయించి అర్జునుడి వద్దకు చేరాడు. సుయోధనుడు వారి ముగ్గురను ఎదుర్కొన్నాడు. యుద్ధమాన్యుడు పక్కన ఉన్న ఉత్తమౌజుడు సుయోధనుడి మీద బాణప్రయోగం చేసి సుయోధనుడి విల్లు విరిచి, అతడి గుండెలకు గురి చూసి నిశిత బాణములతో కొట్టాడు. సుయోధనుడు మరొక విల్లు అందుకుని ఉత్తమౌజుని సారధిని, రధాశ్వములను చంపాడు. ఉత్తమౌజుడు యుద్ధమాన్యూని రథం ఎక్కి సుయోధనుడి విల్లు విరిచి, రధమును విరిచాడు. సుయోధనుడు తన రధము దిగి గధతో సాత్యకి రథం విరిచాడు. యుద్ధమాన్యూ, ఉత్తమౌజులు రథం నుoడి కిందకు దిగగానే సుయోధనుడు శల్యుని రథం ఎక్కాడు. యుద్ధమాన్యూ, ఉత్తమౌజులు తమ గధాయుధములతో శల్యసుయోధనులను చావగొట్టి వారిని రధము నుండి కిందికి త్రోసి ఆ రధము ఎక్కి అర్జునుడిని చేరుకున్నారు " అని చెప్పిన సంజయుని పలుకులు విని " అదేమిటి సంజయా ! మన వాళ్ళు కర్ణుడు పాండవులను గెలిచి మనలను కాపాడుతాడనుకుంటే ఇలా అయిందేమిటి ? కర్ణుడు ఎక్కడకు వెళ్ళాడు ఏమి చేస్తున్నాడు వివరించు " అని అడిగాడు.

భీముడు కర్ణుని ఎదుర్కొనుట

[మార్చు]
దస్త్రం:Bhima defeats Karna.jpg
భీముని చేతిలో కర్ణుని పరాజయం

వృషసేనుడి రథము ఎకి పారి పోయిన కర్ణుడు " భీమసేనా! " అని ఎలుగెత్తి పిలిచాడు. ఆ పిలుపు విని కోపించిన భీముడు కర్ణుని మీద శరవర్షం కురిపించాడు. కర్ణుడు కూడా భీముని బాణములు తుంచి అతడి మీద అతి క్రూర బాణములు వేసాడు (ఈ సారి పూర్తి శక్తి తో యుద్ధం చేసాడు ). ఇరువురి నడుమ పోరు ఘోరమైంది. భీముడు కర్ణుని రథాశ్వములను, సారథిని చంపాడు. కర్ణుడు చికాకు పడి పక్కకు పోయి వేరొక రథం ఎక్కాడు " అన్న సంజయునితో ధృతరాష్ట్రుడు " ఛా! సుయోధనుడు ఎంతగానో నమ్మిన కర్ణుడు ఇలా చేస్తుంటే బుద్ధి హీనుడైన సుయోధనుడు ఏమనుకున్నాడో ఏమో అన్ని డంబములు పలికిన కర్ణడు ఆతరువాత ఏమి చేసాడు ? " అన్నాడు. సంజయుడు " అవమాన భారంతో రగిలిపోతున్న కర్ణుడు తిరిగి భీమసేనుడిని ఎదుర్కొన్నాడు. ఇరువురి మధ్య పోరు ఘోరమై భీమసేనుడి చేతిలో కర్ణుడి సైన్యం మొత్తము హతమైంది " అనగానే ధృతరాష్ట్రుడు " సంజయా ! కర్ణుడు అర్జునుడిని జయిస్తాడన్న అహంతోనే కదా సుయోధనుడు మదమెక్కి పాండవులతో యుద్ధానికి దిగాడే ఈ కర్ణుడు కనీసం భీమ సేనుడిని కూడా జయించ లేక పోతున్నాడు. వీడు అర్జునుడిని కృష్ణుని మిగిలిన పాండవులను గెలువగలడా. ఆనాడు శ్రీకృష్ణుని సంధి తిరస్కరించినందుకు ఫలితం అనుభవించ తప్పుతుందా ! " అన్నాడు. తన సేన మొత్తం నాశనం కావడం చూసి కర్ణుడు కోపించి భీమునిపై ముప్పై నిశిత శరములు ప్రయోగించాడు. భీముడు కర్ణుడి రధసారధిని చంపి అతడి రధాశ్వములను చంపాడు. కర్ణుడు తన రధమును తానే తోలుతూ భీమునిపై శక్తి ఆయుధమును ప్రయోగించాడు. భీముడు ఆ శక్తిని తునా తునకలు చేసి కర్ణుని తొమ్మిది వాడి అయిన బాణములతో కొట్టాడు. కర్ణుడు మరొక విల్లు తీసుకుని భీమునిపై అవిశ్రాంతంగా శరవర్షం కురిపించాడు. ఇరువురూ సింహనాదాలు చేస్తూ ఒకరితో ఒకరు పోరుతున్నారు. భీముడు కర్ణుని హయనులు చంపి, విల్లు విరిచి, కర్ణుని శరీరమంతా బాణములు గుప్పించాడు.

భీముడు కురు రాజకుమారులను వధించుట

[మార్చు]

కర్ణుడు భీముని చేతిలో ఓడుట చూసి సుయోధనుడు కర్ణునికి సాయంగా దుర్జయుని పంపాడు. దుర్జయుడు అత్యంతసాహసంతో భీమసేనుడిని ఎదుర్కొని భీముడి రధాశ్వములను, సారధిని గాయపరిచాడు. భీముడు ఆగ్రహించి కర్ణుని కంటి ముందే ఒకేబాణంతో దుర్జయుని తల నరికాడు. కర్ణుడు భీముని ఎదుర్కొని భీముని వక్షస్థలం మీద ఒక వాడి అయిన బాణం నాటాడు. భీముడు తన గధ తీసుకుని కర్ణుని రధము విరుగకొట్టాడు. రధము విరిచి, కేతనము తుంచి,సారధిని చంపాడు. అయినా కర్ణుడు వెనుదిరుగ లేదు. సుయోధనుడు తన తమ్ముడైన దుర్ముఖుని కర్ణుడికి సాయంగా పంపాడు. భీముడు ఒక పక్క కర్ణునితో యుద్ధము చేస్తూనే తనను ధైర్యంగా ఎదుర్కొన్న దుర్ముఖుని తొమ్మిది నిశిత బాణములు ప్రయోగించి చంపాడు. దుర్ముఖుని చావు కళ్ళారా చూసిన కర్ణుడు కుమిలిపోయి తిరిగి భీమసేనుడిని ఎదుర్కొన్నాడు. ఇరువురి నడుమ పోరు ఘోరమై భీముడు అత్యంత క్రూరబాణములు కర్ణుడి గుండెలకు గురి చూసి కొట్టాడు. భీమునిని దెబ్బకు తాళ లేక కర్ణుడు తన రధమును పక్కకు తొలిగించాడు " అని సంజయుడు చెప్పగా ధృతరాష్ట్రుడు విధి వైపరీత్యము కాకుంటే కర్ణుడు భీముని చేతిలో పరాజుతుడు కావడమేమిటి ఈ కర్ణుని నమ్మే కదా నా కుమారుడు సుయోధనుడితో వైరము పెంచుకుని ఈ యుద్ధానికి దిగాడు. కర్ణుడు పాండవులను జయించగలడు అని పొగిడే సుయోధనుడు ఇది చూసి ఎంత బాధ పడ్డాడో కదా ! అయినా సంజయా ! నాగులకు, దేవతకూ కూడా భయపడని భీమునికి కర్ణుడు ఒక లెక్కా! జరాసంధుని చంపిన భీమసేనుడిని పసి వారైన దుర్జయుడు, దుర్ముఖుడు ఎందుకు ఎదుర్కొన్నారు. భీముడేమి సాత్యకి తక్కువ వాడా! సుయోధనుడు సాత్యకిని మాత్రం ఎదుర్కొనగలడా ! మన వాళ్ళకు ఓటమి తప్పదని అనిపిస్తుంది " అని బాధపడ్డాడు. అది విన్న సంజయుడు " మహారాజా ! కావాలని విషం త్రాగి శరీరం బాధ పడుతుంది శోకించి ప్రయోజనం లేదు. మారు మాటాడక మిగిలిన విశేషాలు వినండి " అన్నాడు. " కర్ణుడు ఓడి పోవడం చూసిన నీ కుమారులు దుర్మర్షణుడు, దుర్మదుడు, దుస్సహుడు, విజయుడు, విచిత్రుడు, ఒక్కుమ్మడిగా భీముని చుట్టుముట్టారు. వారి అండ చూసుకుని కర్ణుడు కూడా శరప్రయోగం చేయసాగాడు. భీముడు విజృంభించి నీ కుమారుల రథములు విరిచి వారిని తన శరములతో యమసదనానికి పంపాడు. అది చూసి కర్ణుడు భీమునిపై డబ్బై ఐదు బాణములు వేసాడు. భీముడు విజృంభించి నూట ఐదు బాణములను కర్ణుని శరీరంలో గుచ్చి కర్ణుని సారథిని చంపి, విల్లు విరిచాడు. కర్ణుడు భీమసేనుడిపై గదను విసిరాడు. భీముడు ఆ గదను ముక్కలు చేసాడు. కర్ణుడు మరొక విల్లు తీసుకుని భీమసేనుని కవచమును భేదించాడు. భీమసేనుడు కూడా కర్ణుని కవచమును కొట్టాడు. కర్ణుడు నేలపై నిలబడి యుద్ధం చేయడం చూసిన సుయోధనుడు తన సోదరులైన చిత్రుడు, విచిత్రుడు, చారుచిత్రుడు, చిత్రధ్వజుడు, చిత్రాయుధుడు, చిత్రకర్ముడు మొదలైన వారిని భీమసేనుడి పైకి పంపాడు. భీమసేనుడు వారి రథుములను అన్నింటినీ విరిచి, సారధులను చంపి వాడి అయిన బాణములతో నీ ఏడుగురు కుమారుల తలలను నరికాడు. ఈ వ్యవధిలో కర్ణుడు మరొక రథం ఎక్కి భీమసేనుడిని ఎదుర్కొన్నాడు. ఇరువురి నడుమ పోరు ఘోరమైంది. ఒకరికి ఒకరు తీసి పోకుండా పోరుతున్నారు. ఇంతలో నీ కుమారులైన శత్రుంజయుడు, శత్రుసహుడు, సుదేహుడు, మదనుడు, ద్రుముడు, చిత్రబాహుడు, వికర్ణుడు మొదలైన వారు కర్ణుడికి రక్షణగా వచ్చి భీమసేనుడిని ఒక్కుమ్మడిగా చుట్టుముట్టి భీముడి మీద శరవర్షం కురిపించారు. భీముడు పట్టరాని కోపంతో వారందరిని ఒక్కొక్కరిని ఒక్కొక్క బాణంతో యమసదనానికి పంపి విజయోత్సాహంతో సింహనాదం చేసాడు. భీముని చేతిలో తన తమ్ములు మరణించడం చూసి సుయోధనుడు ఎంతో బాధ పడ్డాడు " అని సంజయుడు చెప్పగా ధృతరాష్ట్రుడు దుఃఖంతో " సంజయా ! ఆ నాడు జూదం జరుగుతున్నప్పుడు విదురుడు చెప్పిన మాటలు నిజమౌతున్నాయి. సుయోధనుడి కుయుక్తి కారణంగా నా కుమారుల దుర్మరణం గురించి వినవలసిన దుస్థితి దాపురించింది. శోకించడం తప్ప నాకు మిగిలినదేమిటి ఎవరిని అనుకుని ఏమి ప్రయోజనం " అన్నాడు.

కర్ణుడు భీముని ఎదుర్కొనుట

[మార్చు]
దస్త్రం:Bhima throws an elephant at Karna's chariot.jpg
కర్ణునిపై ఏనుగులను విసురుతున్న భీముడు

భీముడి సింహనాదం విన్న కర్ణుడు కోపంతో ఊగిపోయి తిరిగి భీమసేనుడి మీదకు విజృంభించాడు. కౌరవసేనలు భీమసేనుడిని కమ్ముకున్నాయి. భీమసేనుడు వారందరితో యుద్ధం చేస్తూ వారి రధములు విరుస్తూ, కేతనములను విరిచి, రధసారధులను రధాశ్వములను చంపుతూ, కౌరవసేనలను తెగనరకసాగాడు. వారి నెత్తురు కాలువలుగా ప్రవహిస్తుంది. చావగా మిగిలిన కౌరవ సేన భీముని ఎదుట పడకుండా తప్పించుకుంటున్నారు. భీముడికి కౌరవసైన్యంలో ఎదురులేక పోయింది. కర్ణుడు మాత్రమే ఎదురుగా ఉన్నాడు. కర్ణుని నుదిటి మీద వరుసగా బాణములు నాటాడు. కర్ణుడు తిరిగి భీముని మీద నూరు బాణములు ప్రయోగించాడు. భీముడు కోపించి కర్ణుని విల్లు విరిచాడు. కర్ణుడు మరొక విల్లు తీసుకుని భీమసేనుడి మీద శర పరంపర గుప్పిస్తున్నాడు. కర్ణుడు భీముని కేతనమును పడగొట్టి, విల్లు విరిచి, సారధిని కొట్టాడు. భీముడు కర్ణుని మీద శక్తి బాణము వేసాడు. కర్ణుడు తొమ్మిది బాణములు వేసి శక్తి ఆయుధమును త్రుంచాడు. భీముడు కత్తి డాలు తీసుకున్నాడు. కర్ణుడు భీముని డాలును విరుగకొట్టాడు. భీముడు తన కత్తితో కర్ణుని విల్లు విరిచాడు. కర్ణుడు వేరే విల్లు తీసుకునే లోపు భీముడు కర్ణుడి రధము మీదకు లంఘించాడు. కర్ణుడు భయపడి తన రధము వెనుక దాక్కున్నాడు. భీముడు నలు దిక్కుల చూసి కర్ణుడు కానరాక రధము కిందకు చూసాడు. ఆ సమయంలో కర్ణుడు భీముని మీద బాణప్రయోగం చేసాడు. ఆ బాణముల ధాటికి ఆగలేని భీముడు పక్కన పడి ఉన్న శవముల గుట్టలో దూరాడు. భీముని దైన్య స్థితి చూసి కర్ణుడు అతడి మీద విల్లు పెట్టి విలాసంగా నిలబడి " ఓరి భీమసేనా! తిండిపోతా ! నీకు యుద్ధము ఎందుకురా కడుపు నిండా మింగి ఒక పక్క కూర్చొనకుండా నీకు యుద్ధమెందుకురా ! అడవిలో మృగముల మాదిరి ఆకులలములు, పచ్చి మాంసము తిన్న మీకు యుద్ధమెందుకు ఈ మిడిసి పాటు ఎందుకు అయినా నీ శక్తి తెలుసుకుని నీకు తగిన వాడితో యుద్ధం చెయ్యి కాని నాతో పెట్టుకోకు. కృష్ణార్జునుల వద్దకు వెళ్ళి తల దాచుకో పో " అని భీముని నిందించాడు.

అర్జునుడు కర్ణునితో తలపడుట

[మార్చు]

భీముని కర్ణుడు అవమానకరంగా మాటాడుట చూసి అర్జునుడు భీముని దుఃఖమును నివారించడానికి కర్ణునితో యుద్ధానికి తలపడ్డాడు. ఇది చూసి కర్ణునికి సాయంగా అశ్వత్థామ వచ్చాడు. అర్జునుడు కర్ణుని మీద ప్రయోగించిన బాణములన్నీ అశ్వత్థామ మధ్యలోనే తుంచి అర్జునుడిపై అరవై నాలుగు బాణములు వేసాడు. అర్జునుడు అశ్వత్థామను తరిమాడు. అశ్వత్థామ ఏనుగుల సేనలో దూరి తప్పించుకున్నాడు. విశోకుడు రథం సిద్ధం చేసి భీముని వద్దకు వచ్చాడు. భీముడు రధము ఎక్కి అర్జునుడి వద్దకు వచ్చాడు. ఆ సమయంలో సాత్యకి కూడా అర్జునుడి వద్దకు వచ్చాడు " అని సంజయుడు చెప్పగానే ధృతరాష్ట్రుడు సంజయా ! బలవంతులతో వైరము ఎన్నటికీ మంచిది కాదు కదా ! ఇప్పటికైనా పాండవుల రాజ్యభాగం వారికి మంచిది కదా ! నా కుమారుడు పెద్ద మూర్ఖుడు వాడికి తెలియదు ఒకరు చెప్పినా వినడు. నా మాటంటే లక్ష్యం లేని సుయోధనుడు సంధికి ఒప్పడు. నేనేమి చేయగలను ? అర్జునుడు ద్రోణుడి శకటవ్యూహములో ప్రవేశించగానే సైంధవుడు సగం చచ్చాడు. సాత్యకి, భీమసేనులు వచ్చి చేరిన పిమ్మట సైంధవుని చావు ఇక తధ్యం " అన్నాడు.

అర్జునాదులు కౌరవసేనలతో పోరుట

[మార్చు]

భీమ సాత్యకులు అర్జునుడి వద్దకు చేరగానే అలంబసుడు అనే రాజు వారిని చేరుకున్నాడు. సాత్యకి, అలంబసుడు ఘోరంగా చేస్తున్నాడు. ఒకరి విల్లు ఒకరు విరిచారు. కవచాలను చీల్చుకున్నారు. సాత్యకి కోపించి అలంబసుని రధసారధిని, హయములను చంపి ఒక అర్ధచంద్ర బాణంతో అలంబసుని తల తెగనరికాడు. ఇంతలో నీ కుమారులు అందరూ దుశ్శాసనుడిని ముందుంచుకుని సాత్యకిని ఎదుర్కొన్నారు. సాత్యకి దుశ్శాసనుని హయములను చంపి రధము మీదకు దూకబోయాడు. అది చూసి త్రిగర్త సైనికులు అతడిని ఎదుర్కొన్నారు. సాత్యకి వారిని ఎదుర్కొని వెంటనే ఏభై మందిని చంపాడు. అది చూసి మిగిలిన సైనికిలు పారిపోయారు. సాత్యకి శూరసేనదేశాధీశుని వెంబడించాడు. కళింగ సైనికులను నాశనం చేసాడు. అతడి బలపరాక్రమము చూసిన కృష్ణుడు " అర్జునా ! అటు చూడు నీ శిష్యుడు సాత్యకి నీ పేరు నిలబెడుతున్నాడు. ద్రోణుడు అంతటి వాడిని జయించి లోపలకు వచ్చాడు. ధర్మరాజు మీద భక్తి, నీతోటి మైత్రి అతడిని ఇంత వరకు తీసుకు వచ్చింది " అని ప్రశంసించాడు. అర్జునుడు " కృష్ణా ! నేను సాత్యకిని ధర్మరాజుకు రక్షణగా ఉండమన్నాను. నా మాట వినక ఇక్కడకు వచ్చాడు. అక్కడ ధర్మజుని పరిస్థితి ఎలా ఉందో కదా! అతడు ద్రోణుని బారిన పడ్డాడు. ఇక్కడ నేను సైంధవుడిని ఇంకా చంప లేదు. పొద్దు వాలి పోతుంది. సాత్యకి కృపాచార్యుడు, కృతవర్మ మొదలైన యోధులను ఎదిరించి అలసిపోయాడు. భూరిశ్రవసుడు అతడితో తలపడుతున్నాడు. సాత్యకి ఎలా యుద్ధం చేస్తాడో ఏమో ! ద్రోణాచార్యుడు పక్షి కొరకు ఎదురు చూస్తున్న డేగవలె మా అన్నయ్య ధర్మజుని కొరకు ఎదురు చూస్తున్నాడు అని ధర్మజునికి ఎందుకు అర్ధం కాలేదు " అని మనసులో పరితపిస్తున్నాడు. ఇంతలో సోమదత్తుని కుమారుడు భూరిశ్రవసుడు సాత్యకిపై విరుచుకు పడ్డాడు. ఇరువురి నడుమ పోరు ఘోరమైంది. ఒకరి మీద ఒకరు బాణవర్షం కురిపించారు. ఒకరి రధాశ్వములను ఒకరు చంపారు. ఒకరి రధసారధిని ఒకరు చంపుకున్నారు. రధము దిగి నేల మీద కత్తి సాము చేస్తున్నారు. అవి కూడా వదిలి మల్ల యుద్ధము చేయసాగారు. చివరకు భూరిశ్రవసుడిదే పైచేయిగా ఉండటము చూసి కృష్ణుడు చూసి " అర్జునా! ఏమిటి అలాచూస్తున్నావు నీకు సాయంగా వచ్చిన సాత్యకి భూశ్రవసునితో యుద్ధమ చేసి అలసి ఉన్నాడు. సత్వరమే రక్షించు " అన్నాడు. అప్పుడు భూరిశ్రవసుడు సాత్యకిని కింద పడ వేసాడు. అది చూసిన కృష్ణుడు " అర్జునా! ఇది న్యాయం కాదు నీకు సాయం చేయడానికి వచ్చిన నీశిష్యుడు ఆపదలో ఉన్నాడు సతరం రక్షించడం నీ కఎర్తవ్యం " అన్నాడు. అర్జునుడు " కృష్ణా ! మల్లయుద్ధం చేసుకుంటున్న ఇరువురి నడుమ నేను బాణ ప్రయోగం చేయడం ధర్మం కాదు అయినా నా మిత్రుడిని నేను రక్షిస్తాను " అన్నాడు. అర్జునుడు అలా అంటుండగా భూశ్రవసుడు సాత్యకిని నేలపై వేసి గొండెలపై కాలు వేసి సాత్యకి తల నరకడానికి కత్తి తీసుకుని చేయి పైకెత్తాడు. అది చూసిన కృష్ణుడు " అర్జునా! ఇక ఆలస్యం చేయకు బాణ ప్రయోగం చెయ్యి " అన్నాడు. అర్జునుడు గాండీవం ఎక్కు పెట్టి ఒకే ఒక బాణంతో ఎత్తిన భూశ్రవసుడి చేయి నరికాడు. భూరిశ్రవుసుడి చేయి తెగి పడింది వెంటనే భూరిశ్రవడు " అర్జునా ! ఇంతటి అన్యాయానికి పాలు పడతావని అనుకోలేదు. సాత్యకితో యుద్ధం చేస్తున్న నా చేయి నరకడం న్యాయమా, ధర్మమా ! ఇంటటి నీచ రాజ నీతిని నీకు నీరువు ద్రోణుడు నేర్పాడా ! నిన్ను పుట్టించిన ఇంద్రుడు నేర్పాడా ! పాశుపతం అందించిన శివుడు నేర్పాడా! నీ పక్కన కూర్చుని శ్రీకృష్ణుడు ఇది చూసి ఎలా సహించాడు " అన్నాడు. అర్జునుడు ఆ మాటలకు నవ్వి భూరిశ్రవసా! నీవు నాకు నీతులు నేర్పే వాడివా యుద్ధరంగమున యుద్ధం చేస్తున్న వీరులను వారి బంధువులు కాపాడరా ! అలసి పోయి నిరాయుధుడైన సాత్యకిని చంపబూనడం ధర్మమా ! అతడిని నేను రక్షించండం అధర్మమా! మీరంతా కలసి బాలుడైన అభిమన్యుని వధించడం మాత్రం అధర్మమం కాదా! " అన్నాడు. చేయి తెగిన భూరిశ్రవసుడు బాణములను భూమి మీద పరచి వాటిపై కూర్చుని ప్రాయోపవేశం చేసాడు. ఇది చూసి సాత్యకి భీమసేనుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, కర్ణుడు, శ్రీకృష్ణుడు, అర్జునుడు వారిస్తున్నా వినక భూరిశ్రవుసుడి తల నరికి వారించిన వారిని అభిమన్యుని చంపిన వారిని ఇలా చంపడం అధర్మము కాదని సమర్ధించుకున్నాడు " అని సంజయుడు చెప్పగా

భూరిశ్రవసుడి కథ

[మార్చు]

భూరిశ్రవసుడి మరణం గురించి వన్న ధృతరాష్ట్రుడు " సంజయా! మహా బలవంతుడైన సాత్యకి భూరిశ్రవసుడి చేత ఎందుకు అవమానాల పాలైయ్యాడు " అని అడిగాడు. సంజయుడు " మహారాజా ! చంద్ర వంశపు రాజైన యయాతి మహారాజు వలన వచ్చిందే యాదవ కులము. యాదవ కులమున పుట్టి దేవమీఢుని కుమారుడు శూరుడు అతడి కొడుకు వసుదేవుడు. దేవకుడనే రాజు తన కుమార్తె దేవకికి స్వయం వరం ప్రకటించగానే యాదవకుల రాజైన శిని దేవకిని వసుదేవుడికి ఇచ్చి వివాహం జరపాలని స్వయంవరానికి వచ్చిన రాజులను ఓడించి బలవంతంగా తీసుకు పోయాడు. అప్పుడు శినిని ఎవరూ ఎదిరించి నిలువ లేకపోగా సోమదత్తుడు మాత్రం ఎదుర్కొని యుద్ధం చేసాడు. ఇరువురు ఘోరంగా పోరాడిన పిదప శిని సోమదత్తుని ఓడించి అతడి జుట్టు పట్టుకుని ఈడ్చి చంపక వదిలాడు. ఆ అవమాన భారం భరించ లేక సోమదత్తుడు రాజ్యం విడిచి అడవులకు వెళ్ళి శివుని గురించి ఘోర తపమాచరించాడు. శివుడు ప్రత్యక్షం అయ్యాడు అప్పటికి శిని, అతడి కుమారుడు చనిపోయారు కనుక శిని మనుమడైన సాత్యకిని ఓడించే కుమారుడిని ప్రసాదించమని అడుగగా శివుడు అందుకు అంగీకరించాడు. శివుని వరప్రభావంతో సోమదత్తుడికి భూరిశ్రవసుడు పుట్టాడు. కనుక భూరిశ్రవసుడి చేతిలో సాత్యకి అవమానం పొందాడు " అని చెప్పాడు.

సాత్యకి భీమార్జునులు కర్ణుని ఎదుర్కొనుట

[మార్చు]

అలా సాత్యకి చేతిలో భూరిశ్రవసుడు మరణించగానే అర్జునుడు తన రధమును సైంధవుడు ఉన్న వైపుకు పోనిచ్చాడు. సుయోధనుడు, అశ్వత్థామ, కర్ణుడు మొదలైన వారు అర్జునుడిని ఎదుర్కొన్నారు. సాత్యకి కర్ణుని ఎదుర్కొన్నాడు. కృష్ణుడు పాఛజన్యం పూరించగానే ముందు రోజు కృష్ణుడు చెప్పినట్లే దారుకుడు రథం సిద్ధం చేసి తీసుకు వచ్చి వారి ముందు నిలిపాడు. ఆ రధము గరుఢ ధ్వజముతో, శైల్య, సుగ్రీవ, మేఘపుష్ప, వలాహకము, అను హయములు కట్టి ఉన్నాయి. శ్రీకృష్ణుడు సాత్యకితో " తమ్ముడా ! ఆ రథము ఎక్కి కర్ణునితో యుద్ధము చేయి " అన్నాడు. సాత్యకి ఆ రధమును అధిరోహించి కర్ణుని ఎదుర్కొన్నాడు. ఇది ఆశ్చర్యంగా చూస్తున్న అర్జునుడి చూసి శ్రీకృష్ణుడు " ఆర్జునా! తరువాత ఆశ్చర్యపడవచ్చు ముందు సైంధవుడిని కనిపెట్టు " అన్నాడు.అర్జునుడు సాత్యకి ఎలా అని అడుగగా కృష్ణుడు " సాత్యకి కర్ణులు ఒకరికి ఒకరు తీసిపోరు. సాత్యకిని నా చక్రరక్షకులు రక్షిస్తారు. వారి సంగతి విడిచి సైంధవుని వెదుకుట మన కర్తవ్యం " అన్నాడు. రెట్టించిన ఉత్సాహంతో సాత్యకి కర్ణుని శరీరం తూట్లు పడేలా కొట్టి, రధము విరుగ కొట్టి కేతమును తుంచు, రధాశ్వములను చంపి, సారధిని చంపాడు. అది శ్రీకృష్ణుని రధము కనుక దారుకుడు దానిలో సమృద్ధిగా ఆయుధములు పెట్టాడు కనుక సాత్యకి కర్ణుని అతడి సేనను తరిమి తరిమి కొట్టాడు. నీ కుమారులు వేరొక రధమును తీసుకు వచ్చి కర్ణుడి ముందు నిలిపారు. కర్ణుడు ఆ రధము ఎక్కి సాత్యకిని ఎదుర్కొన్నాడు. కర్ణుడి చేత అవమానం పొందిన భీముడు తల వంచుకుని అర్జునుడి వద్దకు వచ్చి కర్ణుడు అన్న మాటలన్నీ చెప్పి " తమ్ముడూ ! నేను వెంటనే కర్ణుడికి తగిన గుణపాఠం చెప్పాలి " అన్నాడు. అర్జునుడు " అన్నయ్యా ! నిన్ను అనడం నన్ను అన్నట్లే కనుక నేను వెంటనే వెళ్ళి కర్ణుని మదం అణుస్తాను " అన్నాడు. శ్రీకృష్ణుడు కర్ణుడి ఎదుట రథం నిలపగానే అర్జునుడు " ఏరా కర్ణా! మా అన్నయ్య భీమసేనుడిని తూలనాడతావా! భీమసేనుడు తరిమినప్పుడు సిగ్గు లేకుండా వెనక్కు పరిగెత్తావే అప్పుడు నిన్ను ఎవరైనా తిట్టారా ! యుద్ధంలో ఒక సారి ఓడుట ఒక సారి గెలుచుట సహజము కాదా ! ఒక్క సారి భీమసేనుడి మీద పైచేయి కాగానే ఇంత గర్వమా ! ఇప్పుడు సాత్యకి చేతిలో నీవు ఓడి పోలేదా ! ఎంతటి విశారదులకైనా గెలుపోటములు సహజం నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. మా చేతులో ఎన్ని సార్లు ఓడిపోయావు నేను లేనప్పుడు నా కుమారుని అభిమన్యుని అందరు కలసి చంపారు. ఇప్పుడు నేను నీ కుమారుని వృషసేనుడిని నీ కళ్ళ ముందే చంపుతాను నిన్నే కాదు నిన్న నా కుమారుడిని అధర్మంగా చంపిన అందరినీ ఏం చేస్తానో చూస్తూ ఉండండి " అంటూ కర్ణుడిని తరిమాడు. అప్పుడు కౌరవసేన అర్జునుడిని ఎదుర్కొంది. పోరు ఘోరం అయింది. పొద్దు వాలసాగింది.

సైంధవ వధ

[మార్చు]
సైంధవుని తల నరికిన అర్జునుడు

సుయోధనుడు కర్ణుని చూసి " కర్ణా ! సాత్యకి, భీముడు తోడు రాగా అర్జునుడు సైంధవుడి వైపు సాగుతున్నాడు. ఇంకా కొంచెం సమయం అర్జునుడిని ఆపకలిగిన పొద్దు వాలి అర్జునుడి ప్రతిజ్ఞా భంగం అయి మనకు విజయం చేకూరుతుంది. నువ్వు, నేను, కృపాచార్యుడు, అశ్వత్థామ, శల్యుడు కలసి అర్జునుడిని ఆపగలమా! అర్జునుడికి పోగాలము దాపురించి ఇలా ప్రతిజ్ఞ చేసాడు. దానిని మనం సద్వినియోగం చేసుకుంటాము. అర్జునుడు మరణిస్తే పాండవులు బ్రతుక లేరు. కనుక కురుసామ్రాజ్యాన్ని మనం ఏకఛత్రంగా ఏలవచ్చు కనుక మీ మీ ప్రతాపాలు చూపండి. కర్ణుడు " సుయోధనా! ఈ మాత్రం చేయక పోతే కర్ణుడు ఎందుకు. నా బలపరాక్రమం చూపుతాను ఆ మీద దైవ నిర్ణయం " అన్నాడు. భీమసేనుడు సాత్యకి తోడు రాగా కౌరవ సేనను తుత్తునియలు చేస్తున్నాడు. రక్తం ఏరులై ప్రవహిస్తుంది. కర్ణుడు, వృషసేనుడు, కృపాచార్యుడు, అశ్వత్తామ, శల్యుడు మొదలైన వారు అర్జునుడుని ఎదుర్కొన్నారు. వారు వేసిన బాణములను అర్జునుడు ముక్కలు చేసాడు. వారు ఒక్కుమ్మడిగా అర్జునుడిని ఎదుర్కొని కృష్ణార్జునుల శరీరం అంతా బాణములు వేసి నొప్పించారు. వాటిని లక్ష్యపెట్టక అర్జునుడు సైంధవుని వైపు దూసుకు పోతున్నాడు. భీముడు, సాత్యకి, కర్ణుడి మీద శరవర్షం కురిపించారు. అందుకు కోపించిన కర్ణుడు అరవై బాణములను భీమ సాత్యకుల మర్మ స్థానంలో వేసి బాధించాడు. అర్జునుడు కర్ణుని నూరు బాణములతో కొట్టగా అయిదు వందల బాణములతో కర్ణుడు వాటిని తిప్పి కొట్టాడు. అర్జునుడు కర్ణుని విల్లు తుంచి కర్ణుని గుండెలకు గురి పెట్టి బాణప్రయోగం చెయ్యగా అశ్వత్థామ వాటిని తన అర్ధచంద్ర బాణంతో అడ్డుకున్నాడు. అర్జునుడు వేరొక విల్లు తీసుకున్నాడు. ఒకరిపై ఒకరు తీవ్రమైన బాణము వేసుకుంటున్నారు. సుయోధనుడు తన సైన్యమూ కర్ణునికి సాయంగా పంపగా అర్జునుడు కర్ణుని రథాశ్వములను, సారథిని చంపి కర్ణుడి మీద భయంకర బాణ ప్రయోగం చేసాడు. అశ్వత్థామ కర్ణుడిని తాన రథం మీద ఎక్కించుకున్నాడు. శల్యుడు అర్జునుడిని ఎదుర్కొన్నాడు. కృపాచార్యుడు, అశ్వత్థామ, వృషసేనుడు శల్యునితో చేరి అర్జునుడిని ఎదుర్కొన్నారు. సైంధవుడు వారి వెనుక దాక్కున్నాడు. అర్జునుడు వారందరి బాణములు అడ్డుకుంటూ సైంధవుడి మీద బాణములు వేస్తున్నాడు. సైంధవుడు ఆపదలో ఉన్నాడని గ్రహించి సుయోధనుడు తన సేనలను అక్కడకు రమ్మని సైగ చేసాడు. కౌరవ సేనలు అర్జునుడిని చుట్టుముట్టాయి. సైంధవుడు కంటబడగానే అర్జునుడికి ఉత్సాహం కలిగింది. కౌరవసేనలను పటాపంచలు చేస్తూ సైంధవుని మీద బాణములు ప్రయోగిస్తున్నాడు. సైందవుడి వరాహకేతనము విరిచి సైంధవుని సారథిని చంపాడు. అది చూసి కౌరవసేన భయకంపితమైంది. కృపాచార్యుడు, అశ్వత్థామ, వృషసేనుడు, శల్యుడు సైంధవునికి అడ్డంగా నిలిచారు. వారి వెనుక ఉన్న సైంధవుడిని కొట్టే మార్గం లేక అర్జునుడు సూర్యుని వంక చూసాడు. అది గమనించిన కృష్ణుడు " అర్జునా! ఇప్పుడు న్యాయం ధర్మం అని ఆలోచిస్తే ప్రయోజనము లేదు. సూర్యుడు పశ్చిమదిక్కుకు పోతున్నాడు. నేను ఒక ఉపాయం చెప్తాను. నేను మాయోపాయంతో సూర్యమండలాన్ని మరుగుపరుస్తాను. సూర్యుడు అస్తమించాడని కౌరవ ప్రముఖులు సైంధవుడు నీ ప్రతిజ్ఞ భంగమైందన్న ఆనందంతో యుద్ధభూమి అంతా తిరుగుతూ విచ్చల విడిగా తిరుగుతుంటారు. అప్పుడు నీవు సైంధవుడిని చంపు " అన్నాడు. కాని అర్జునుడు అందుకు మనసారా అంగీకరించ లేదు ఒక పరాక్రమవంతుడైన వీరుడు చేయతగిన కార్యం కాదని మదన పడినా చేసేది లేక ఊరకున్నాడు. కృష్ణుడు తన మాయతో సూర్యుని కప్పి చీకట్లు ముసురుకునేలా చేసాడు. అది సూర్యాస్తమయమని భావించిన కౌరవులు పొంగిపోతూ గర్వంగా సింహనాదాలు చేసారు. సైంధవుడు తల ఎత్తి సూర్యుని వంక చూస్తుండగా కృష్ణుడు " అదుగో అర్జునా! సైంధవుని తల సూర్యుని వంక చూస్తుంది వెంటనే తెగనరుకు " అన్నాడు. అర్జునుడు వెంటనే ఒక వాడి అయిన బాణం గాండీవంలో సంధించి ఒక్క వేటుతో సైంధవుడి తల తెగనరికాడు " ఆకాశంలో డేగ పక్షిని తీసుకు పోతున్నట్లు అర్జునుడి బాణం సౌంధవుడి తల ఎగరేసుకు పోతుంది. సైంధవ వధ కాగానే కృష్ణ మాయ తొలగి పోయి చీకట్లు తొలగి సూర్యుడు ఆకాశంలో ప్రకాశించసాగాడు. ఇది చూసిన కౌరవ ప్రముఖులు ఆశ్చర్యపోయారు. వారు ఆగ్రహంతో ఊగిపోతూ అర్జునుడిని చుట్టుముట్టారు.

సైంధవుని మరణం

[మార్చు]

కృష్ణుడు " అర్జునా! సైంధవుని తల నేల మీద పడితే ప్రమాదం. కనుక దానిని ఆపు " అన్నాడు. అర్జునుడు ఒక దాని వెంట ఒక బాణం సంధిస్తూ ఆ తల నేల మీద పడకుండా ఆపాడు. సైంధవుని తల బంతిలా తిరుగుతూ ఉంది. ఒక వైపు యుద్ధం చేస్తూనే ఒక వైపు బాణప్రయోగంతో సైంధవుని తలని ఆపుతూ " కృష్ణా ! ఎంత సేపు ఈ తలని ఇలా ఆపాలి " అన్నాడు. కృష్ణుడు " సైంధవుని తండ్రి వృద్ధక్షత్రుడు. అతడు సింధు దేశపు రాజు. అతడికి వర ప్రసాదంగా సైంధవుడు జన్మించాడు. ఒక రోజు ఆకాశవాణి " సైంధవుని తల యుద్ధంలో నరకబడుతుంది " అని చెప్పింది. అది విన్న వృద్ధక్షతుడు " నా కుమారుని తల నేల మీద పడవేసిన వాడి తల ముక్కలౌతుంది " అని శపించాడు. అతడు ఇప్పుడు తపమాచరించుటకు అడవులకు వెళ్ళాడు. కనుక నీవు పాశుపతాస్త్ర సాయంతో సైంధవుని తల అతడి తండ్రి వృద్ధక్షతుడి ఒడిలో పడేలా చేయి " అన్నాడు. అర్జునుడు " కృష్ణా! వృద్ధక్షతుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు " అన్నాడు. కృష్ణుడు " అర్జునా! వృద్ధక్షతుడు ఇప్పుడు శమంతక పంచకం సమీపంలో తపస్సు చేసుకుంటున్నాడు. నీవు అతడి తలను వృద్ధక్షతుడి ఒడిలో పడేలా అస్త్ర ప్రయోగం చేయి " అన్నాడు. అర్జునుడు పరమశివుని భక్తితో స్మరించి పాశుపతాన్ని ప్రయోగించాడు. సైంధవుడి తల ఆశ్రమంలో తపస్సు చేసుకుంటున్న వృద్ధక్షతుడి ఒడిలో పడేలా చేసాడు. హటాత్తుగా తన ఒడిలో పడిన మానవ మస్తకాన్ని చూసి కంగారు పడిన వృద్ధక్షతుడు దానిని నేల మీద విసిరి వేసాడు. వెంటనే శాపప్రభావంతో అతడి తల ముక్కలైంది. కృష్ణుడుఅర్జునుడిని ప్రశంసించాడు. కౌరసేన భయంతో పారిపోయింది. సైంధవుని తల నేల మీద పడే వరకు అలాగే ఉన్న సైంధవుని మొండెము సైంధవుని తల నేల మీద పడగానే కింద పడింది. ఇది చూసి అందరూ ఆశ్చర్య పడ్డారు. శ్రీకృష్ణుడి సాయంతో అర్జునుడు ప్రతిజ్ఞ నెరవేర్చుకొనడం చూసి సాత్యకి, భీముడు సింహ నాదాలు చేసారు. కౌరవ సేనలో విషాదఛాయలు కమ్ముకున్నాయి. అది విని ధర్మరాజు ఆనందసాగరంలో మునిగాడు. పాడవుల ఆనందానికి అంతు లేకుండా పోయింది. పాండవసైన్యం తూర్యనాదాలు, భేరి, మృదంగ నాదాలు చేసారు.

బయటి లింకులు

[మార్చు]