Jump to content

వన పర్వము ద్వితీయాశ్వాసము

వికీపీడియా నుండి
(వనపర్వము ద్వితీయాశ్వాసము నుండి దారిమార్పు చెందింది)


ద్వితీయాశ్వాశం

[మార్చు]

ఒకరోజు బృహదశ్వుడు అనే ముని పాండవుల వద్దకు వచ్చాడు. ధర్మరాజు ఆ మునికి అతిధిసత్కారాలు కావించి కౌరవుల వలన తాము పడుతున్న బాధలు అన్నీ వివరించి "మహాత్మా! రాజ్యాన్ని, నివాసాన్ని పోగొట్టుకుని మాలాగ అడవిలో కష్టాలుపడుతున్నవారు ఎవరైనా ఉన్నారా? ఉంటే చెప్పండి" అని అడిగాడు. అందుకు బృహదశ్వుడు "ధర్మరాజా! నీవు కష్టాలు పడుతూ అడవులలో ఉన్నా, నీ వెంట నీ అన్నదమ్ములు, నీ భార్యా, నీ హితం కోరే విప్రులు నీ వెంట ఉన్నారు. పూర్వం నలుడనే మహారాజు నీవలె జూదంలో సర్వం కోల్పోయి, పుష్కరునికి రాజ్యాన్ని అప్పగించి భార్యా సమేతుడై ఒంటరిగా అరణ్యాలకు వెళ్ళాడు", అని చెప్పాడు. అది విని ధర్మరాజు "మహత్మా! నాకు నలుని కథ వివరించండి" అని అడిగాడు.

నలదమయంతులు

[మార్చు]

బృహదశుడు ధర్మరాజుకు ఇలా వివరించ సాగాడు. "నిషిధదేశాన్ని వీరసేనుడి కుమారుడైన నలుడు పరిపాలిస్తున్నాడు. తన పరాక్రమంతో ఎన్నో దేశాలను జయించి ప్రజారంజకంగా పరిపాలిస్తున్నాడు. అతనికి జూదం అంటే ఎక్కువ ప్రీతి. ఆ కాలంలో విదర్భ దేశాన్ని భీముడనే అనేరాజు పరిపాలిస్తున్నాడు. చాలా కాలం అతనికి సంతానం లేదు. అతనికి దమనుడు అనే ముని ఇచ్చిన వరము వలన దమయంతి అనే కూతురు, దముడు, దమనుడు, దాంతుడు అనే కుమారులు కలిగారు. దమయంతి సౌందర్యరాశి, గుణవంతురాలు. దమయంతి నలుని గుణగణాలను గురించి విన్నది. నలుడు దమయంతి గురించి, ఆమె సౌందర్యం గురించి విన్నాడు. ఇరువురి నడుమ ప్రేమ అంకురించింది.

నలదమయంతుల మధ్య హంస రాయబారం

[మార్చు]
అంతఃపురం ముందు విహరిస్తున్న హంసను చూసి ముచ్చట పడుతున్న దమయంతి

ఒకరోజు నలుడు ఉద్యానవనంలో ఉండగా హంసల గుంపు వచ్చి అక్కడ వాలింది. ఆ హంసలను చూసి ముచ్చట పడి నలుడు వాటిలో ఒకదానిని పట్టుకున్నాడు. మిగిలిన హంసలు తోటి హంసను విడిచి వెళ్ళలేక ఆకాశంలో తిరుగుతున్నాయి. నలునితో అతని చేతిలోని హంస మానవభాషలో ఇలా అన్నది. "ఓ మహారాజా! నీవు దమయంతిని ప్రేమిస్తున్నావు. నేను దమయంతి వద్దకు వెళ్ళి నీ గురించి, నీ అందచందాల గురించి గుణగణాల గురించి చెప్పి నీమీద అనురాగం కలిగేలా చేస్తాను" అని పలికింది. ఆ హంస పలుకులు విని నలుడు ఆనంద పడి, దానిని విడిచిపెట్టాడు. ఇచ్చిన మాట ప్రకారం ఆ హంస విదర్భదేశానికి ఎగిరిపోయింది. అంతఃపురం ముందు విహరిస్తున్న హంసను చూసి దమయంతి ముచ్చట పడింది. చెలికత్తెల సాయంతో దమయంతి ఆ హంసను పట్టుకుంది. ఆ హంస దమయంతితో "దమయంతీ! నేను నీ హృదయేశ్వరుడైన నలుని వద్ద నుండి వచ్చాను. నలుడు సౌందర్యవంతుడు, సంపన్నుడు, సద్గుణ వంతుడు. నీవు సౌందర్యంలో, గుణంలో అతనికి తగినదానివి. అతనికి భార్యవైతేనే నీకు రాణింపు" అని పలికింది. దమయంతి "ఓ హంసా! నలుని గురించి నాకు ఎలా చెప్పావో అలాగే నలునికి నా గురించి చెప్పు" అన్నది. ఆ హంస అలాగే చేసింది. ఇలా ఇరువురికి ఒకరిపై ఒకరికి అనురాగం అధికమైంది.

దమయంతి స్వయంవరం

[మార్చు]
నల దమయంతుల వివాహం

నల దమయంతుల ప్రణయ విషయం దమయంతి చెలికత్తెల ద్వారా తెలుసుకున్న భీమమహారాజు కుమార్తెకు స్వయంవరం ప్రకటించాడు. ఆహ్వానాన్నందుకున్న రాజులంతా స్వయంవరానికి విచ్చేశారు. నలుడు కూడా స్వయంవరానికి పోతున్నాడు. ఇంద్రునికి దమయంతి స్వయంవర విశేషం తెలిసి దిక్పాలకులతో స్వయం వరానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో నలుని చూసిన ఇంద్రుడు నలునితో "నిషధ రాజా !నీవు నాకు దూతగా పని చేయాలి" అన్నాడు. నలుడు "అలాగే చేస్తాను. ఇంతకీ మీరెవరు? నేను మీకేమి చేయాలి?" అని అడిగాడు. ఇంద్రుడు నలునితో "నేను ఇంద్రుడను. వీరు దిక్పాలకులు. నీవు పోయి దమయంతికి మా గురించి చెప్పి ఆమె మమ్ములను వరించేలా చేయాలి" అన్నాడు. నలుడు ఇంద్రునితో "అయ్యా! నీకిది ధర్మమా? నేను కూడా అదే పనిమీద పోతున్నాను కదా" అన్నాడు. ఇంద్రుడు నలునితో "నీవు మాకు మాటిచ్చావు కనుక, ఈ కార్యం చేయవలసిందే. ఇది దేవతాకార్యం, నీవు చేయగలవు. మాట తప్పడం ధర్మం కాదు. మా మహిమచేత అంతఃపురానికి వెళ్ళడానికి నీకు ఎవరూ అడ్డు చెప్పరు" అన్నాడు. గత్యంతరం లేక, నలుడు దమయంతి అంతఃపురంలో ప్రవేశించాడు. నలుడు దమయంతిని మొదటి సారిగా చూసి, 'హంస చెప్పినదాని కంటే దమయంతి సౌందర్యవతి' అనుకున్నాడు. దమయంతి, ఆమె చెలికత్తెలు నలుడుని చూసి ఆశ్చర్యపోయారు. దమయంతి నలుని చూసి "మహాత్మా మీ రెవరు? ఎక్కడి నుండి వచ్చారు? ఈ అంతఃపురంలో ఎవరికీ కనపడకుండా ఎలా ప్రవేశించారు?" అని అడిగింది. నలుడు దమయంతితో "నా పేరు నలుడు. నేను దేవదూతగా వచ్చాను. దిక్పాలకులు, వారిలో ఒకరిని వరించమని నీకు చెప్పమని నన్ను పంపారు" అన్నాడు. నలుని మాటలకు ఆమె మనసు కష్టపడింది. "అయ్యా! నేను మానవకాంతను. నమస్కరించ వలసిన దేవతలను వరించడం ధర్మమా? నాడు హంస చెప్పినది మొదలు, నిన్నే నా భర్తగా తలచుకుంటున్నాను. నా తండ్రి భీమరాజు మిమ్ము ఇక్కడికి రప్పించడానికే స్వయంవరం ప్రకటించాడు. మీరే నాభర్త, కనుక నన్ను స్వీకరించండి. లేకుంటే నా ప్రాణాలను తీసుకుంటాను కాని, ఇతరులను వరించను" అని దమయంతి ప్రార్థించింది. నలుడు దమయంతితో "దమయంతీ! దేవతలు ఐశ్వర్యవంతులు, జరా మరణాలు లేని వారు, వారిని కాదని జరామరణాలకు ఆలవాలమైన నన్ను కోరడం న్యాయమా?" అని అన్నాడు. ఆ మాటలు విని దమయంతి దుఃఖించింది. ఆమె నలునితో "నేను ఒక ఉపాయం చెప్తాను. అందరి ముందు నేను దేవతలను ప్రార్ధించి నిన్ను వివాహమాడతాను. అప్పుడు మీకు దేవతల మాట వినలేదన్న దోషం ఉండదు" అన్నది. ఆ మాటలు నలుడు ఇంద్రునికి చెప్పాడు. అది విని దిక్పాలకులు "దమయంతి మమ్మల్ని ఎలా వరించదో చూస్తాము" అని అందరూ నలుని రూపంలో స్వయంవరానికి వచ్చారు. స్వయంవరమండపంలో ఒకేసారి ఐదుగురు నలులు కనిపించారు. దమయంతి వరమాల పట్టుకుని వచ్చింది. మనస్సులో ధ్యానించి "దేవలారా! నలుని గుర్తు పట్టడంలో నాకు సహకరించండి. మీ నిజరూపాలతో ప్రత్యక్షం అవండి" అని ప్రార్థించింది. వారు దమయంతిని కరుణించి తమ నిజరూపాలతో ప్రత్యక్షం అయ్యారు. నలదమయంతులకు వైభవోపేతంగా వివాహం జరిగింది. ఇంద్రాది దేవతలు అనేక వరాలిచ్చి అనుగ్రహించారు.

నలదమయంతులపై కలిప్రభావం

[మార్చు]
రాజ్యాన్ని కోల్పోయి అడవులకు వెళుతున్న నలుడు

దమయంతి స్వయంవరం చూసి దేవలోకం వెళుతుండగా, దేవతలకు కలి పురుషుడు కనిపించాడు. ఇంద్రుడు కలి పురుషుని చూసి "ఎక్కడికి పోతున్నావు?" అని అడిగాడు. "భూలోకంలో జరుగుతున్న దమయంతి స్వయంవరానికి పోతున్నాను" అన్నాడు. అ మాటలకు వారు నవ్వి "దమయంతి స్వయంవరం జరిగింది. ఆమె నలుని వివాహమాడింది" అన్నారు. కలికి కోపం వచ్చింది. నలుడిని రాజ్యభ్రష్టుని చేసి వారిరువురికి వియోగం కల్పించాలని అనుకున్నాడు. నలుడు ధర్మాత్ముడు, కలి ప్రవేశానికి చాలా కాలానికి గాని అవకాశం రాలేదు. ఒకరోజు నలుడు మూత్ర విసర్జన చేసి పాదప్రక్షాళన చేయకుండా సంధ్యా వందనం చేశాడు. ఆ అశౌచాన్ని ఆధారం చేసుకుని కలి అతనిలో ప్రవేశించాడు. నలుని దాయాది అయిన పుష్కరుని వద్దకు వెళ్ళి నలునికి జూదవ్యసనం ఉందని అతనితో జూదమాడి అతని రాజ్యాన్ని గెలువవచ్చని నమ్మబలికాడు. బ్రాహ్మణ వేషంలో పుష్కరునితో నలుని వద్దకు వెళ్ళి జూదానికి ఆహ్వానించాడు. జూదానికి పిలిస్తే పోకపోవడం ధర్మం కాదని, నలుడు జూదమాడటానికి అంగీకరించాడు. జూదం మొదలైంది. నలుడు తనరాజ్యాన్ని, సంపదలను వరుసగా పోగొట్టుకుంటున్నాడు అయినా ఆడటం మానక, సమస్తం పోయే వరకు ఆడాడు. దమయంతి దుఃఖించి "ఓడేకొద్ది గెలవాలని పంతం పెరుగుతుంది. ఏమీ చెయ్యలేము" అని సరిపెట్టుకుంది. పుష్కరుడు గెలవటం, నలుడు ఓడటం తథ్యమని గ్రహించిన దమయంతి తన కుమార్తె ఇంద్రసేనను, కుమారుడు ఇంద్రసేనను సారథిని తోడిచ్చి విదర్భలో ఉన్న తండ్రి వద్దకు పంపింది. నలుడు తన రాజ్యాన్ని కోల్పోయి, నగరం వెలుపల మూడు రోజులు ఉన్నాడు. జూదంలో సర్వం పోగొట్టుకున్న నలుని చూడటానికి ఎవరూ రాలేదు. ఆకలికి తట్టుకోలేక పోయాడు. ఆకాశంలో ఎగురుతున్న పక్షులను పట్టడానికి తన పైవస్త్రాన్ని వాటి మీద విసిరాడు. ఆ పక్షులు ఆ వస్త్రంతో సహా ఎగిరిపోయాయి. నలుడు ఖేదపడి తన భార్య కొంగును పైవస్త్రంగా కప్పుకున్నాడు. ఆ దుస్థితికి తట్టుకోలేని నలుడు "దమయంతీ! ఇక్కడ నాలుగు మార్గాలు ఉన్నాయి. ఇది, నీపుట్టిల్లు విదర్భ దేశానికి పోయే దారి. ఇది, దక్షిణ దేశానికి పోయే మార్గం, ఇది కోసల దేశానికి పోయే మార్గం, ఇది ఉజ్జయినికి పోయే మార్గం.. వీటిలో మనకు అనుకూలమైన మార్గమేదో చెప్పు. నీవు అడవులలో కష్టాలు పడలేవు, నీ తండ్రి ఇంటికి వెళ్ళి సుఖంగా ఉండు" అని చెప్పాడు. "అవును నాథా, మనం విదర్భకు వెళ్ళి సుఖంగా ఉంటాము" అని చెప్పింది. నులుడు "దమయంతీ! మహారాజుగా విదర్భలో తిరిగిన వాడిని, రాజ్యభ్రష్టునిగా ఎలా రాగలను చెప్పు. అన్ని రోగాలకన్నా పెద్ద రోగం దుఃఖం అందుకు భార్య పక్కన ఉండటం పరమౌషధం. అందుకని నీవు పక్కన ఉంటే, ఎన్ని కష్టాలైనా సుఖాలుగానే ఉంటాయి" అన్నాడు నలుడు. దమయంతి "నిజమే అందుకనే నన్ను ఎప్పుడూ మీ వెంట ఉండటానికి అనుమతించండి" అన్నది. అందుకు నలుడు అంగీకరించాడు.

నలదమయంతుల వియోగం

[మార్చు]
దమయంతిని అడవిలో వదిలి పోతున్న నలుడు - రాజా రవి వర్మ గీచిన చిత్రం

ఒకరోజు అడవిలో నలుని తొడమీద తల పెట్టుకుని, దమయంతి నిద్రపోతూ ఉంది. అమెను చూసి నలుడు "ఈ సుకుమారి నాతో అడవులలో కష్టాలు పడుతోంది. నా వెంట ఉండటమే ఈమె కష్టాలకు కారణం. నేను లేకపోతే ఈమె పుట్టింటికి వెళ్ళి సుఖ పడుతుంది" అని మనసులో అనుకుని, తాను ధరించిన చీరభాగాన్ని చింపి, పైన వేసుకుని ఆమెను వదలలేక వదలలేక విడిచి వెళ్ళాడు. నిద్రలేచిన దమయంతి భర్త లేకపోవడం చూసి దుఃఖించింది. భర్తను తలచుకుంటూ అడవిలో తిరుగు తున్న దమయంతిని ఒక కొండచిలువ పట్టుకుంది. భయంతో దమయంతి కేకలు వేసింది. ఆ కేకలు విని ఒక కిరాతుడు తన కత్తితో ఆ కొండచిలువను చంపి, దమయంతిని రక్షించాడు. ఆ కిరాతుడు దమయంతి గురించి తెలుసుకున్నాడు. ఆమె నిస్సహాయతను తెలుసుకుని, ఆమెను తాకబోవగా, దమయంతి అతనిని భస్మం చేసింది.

దస్త్రం:Damayanthi cursed of burning a man.jpg
దమయంతి తేజస్సు వలన దగ్ధమవుతున్న కిరాతుడు

భర్తను తలుచుకుంటూ అడవిలో దారీతెన్నూ లేకుండా ప్రయాణిస్తూ ఉండగా, ఆమెకు ఒక మునిపల్లె కనపడింది. అక్కడ ఆమె మునిశ్రేష్టులను చూసింది. మునులు దమయంతిని చూసి "అమ్మా! నీవు ఎవరు? ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు?" అని అడిగారు. సమాధానంగా దమయంతి "మునిపుంగవులారా! నేను నలచక్రవర్తి భార్యను. నా పేరు దమయంతి. విధివశంతో నా భర్త నన్ను విడిచి వెళ్ళాడు. నాకు వారి జాడ చెప్పగలరా? నేను భర్త లేనిదే జీవించ లేను" అని అడిగింది. మునులు "అమ్మా! నీకు త్వరలోనే భర్త సమాగమం జరుగుతుంది. చింత పడకుము" అని చెప్పి, వెళ్ళారు. దమయంతి పిచ్చిదానిలా భర్తను వెతుక్కుంటూ ఆ అడవిలో తిరుగుతూ ఉంది. ఇంతలో అటుగా పోతున్న బాటసారులు ఆమెను చూసి చూసారు. కొందరు ఆమెను పిచ్చిది అని ఎగతాళి చేసారు. కొందరు ఆమెకు మొక్కారు. వారిలో ఉన్న వ్యాపారి ఆమెను గురించి తెలుసుకుని "అమ్మా! నేను నలుని చూడలేదు, కానీ మేము ఛేది దేశానికి వెళుతున్నాము" అన్నాడు. దమయంతి వారితో "నేను కూడా మీ వెంట వస్తాను" అన్నది. ఆ

అడవిలో ఒంటరిగా మిగిలిన దమయంతి - రాజా రవి వర్మ గీచిన చిత్రం

వ్యాపారి ఆమెను తమ వెంట తీసుకు వెళ్ళాడు. వారు అడవి మార్గంలో రాత్రి వేళ నిద్రిస్తున్న సమయంలో ఒక ఏనుగుల గుంపు వారిలో చాలా మందిని తొక్కివేసింది. వారిలో చాలామంది మరణించడం చూసి, దమయంతి తన దురదృష్టానికి దుఃఖించింది. తనను చంపలేదని రోదిస్తున్న ఆమెను కొందరు బ్రాహ్మణులు ఓదార్చి ఆమెను తమ వెంట సుబాహు నగరానికి తీసుకు వెళ్ళారు. ఛేదిదేశ రాజధాని సుబాహుపురం చేరింది. ఒళ్ళంతా దుమ్ముతో వీధిలో వెళుతున్న దమయంతిని రాజమాత చూసి దాసీలను పంపి దమయంతిని అంతఃపురానికి పిలిపించింది. రాజమాత దమయంతితో "అమ్మా! నిన్ను చూస్తుంటే రాచకళ ఉట్టి పడుతుంది. నీవు ఎవరు?" అని అడిగింది. దమయంతి "అమ్మా! నా భర్త జూదంలో రాజ్యం పోగొట్టుకున్నాడు. నన్ను అడవిలో ఒంటరిగా విడిచి వెళ్ళాడు. అతనిని వెతుకుతూ తిరుగుతున్నాను" అని చెప్పింది. రాజమాత "అమ్మా! ఇకనుండి నువ్వు నా దగ్గర సైరంధ్రిగా ఉండు. నీకు ఏ లోటూ రాకుండా నేను చూస్తాను. నీ భర్తను వెతికిస్తాను" అని చెప్పింది. దమయంతి అందుకు అంగీకరించి "అలాగే ఉంటాను, కానీ నేను సైరంధ్రిగా ఎవరి ఎంగిలీ తినను, పరులకు కాళ్ళుపట్టను, పరపురుషులతో మాట్లాడను. కేవలం నా భర్తను వెతుకుతూ వెళ్ళే బ్రాహ్మణులతో మాత్రం మాట్లాడు తాను" అని చెప్పింది. రాజమాత అంగీకరించి తన కుమార్తె సునంద వద్దకు పంపింది. దమయంతి అక్కడే ఉండిపోయింది.

నలుడు వికృతరూపుడగుట

[మార్చు]

దమయంతిని వదిలివెళ్ళిన నలుడు అడవిలో ప్రయాణిస్తుండగా, అడవి అంతటా దావానలం వ్యాపించింది. ఆ మంటల మధ్యనుండి "రక్షించండి రక్షించండి" అన్న ఆర్తనాదం వినిపించింది. ఆ ఆర్తనాదం విని నలుడు అగ్నికీలల నడుమ ఉన్న నాగ కుమారుని రక్షించాడు. ఆ పాము నలుని కాటు వేసింది. పాము కాటుకు నలుడు వికృత రూపుడయ్యాడు. అప్పుడు ఆ పాము తన నిజరూపంతో ప్రత్యక్షం అయి నలునితో "నలమహారాజా! నా పేరు కర్కోటకుడు. నేను నిన్ను కాటువేసానని భయపడకు. ఇక నిన్ను ఎవరూ గుర్తించరు. పాముకాటు నిన్ను ఏమీ చేయదు. నీ రాజ్యం నీకు ప్రాప్తిస్తుంది, నీ భార్య నీకు దక్కుతుంది, నీకు ఎప్పుడు నిజరూపం కావాలన్నా, నన్ను తలచుకుంటే నీ వద్దకు ఒక వస్త్రం ఎగురుతూ వస్తుంది. దానిని కప్పుకుంటే నీ పూర్వాకృతి వస్తుంది. నీకు మరొక విషయం చెప్తాను.. ఇక్కడికి దగ్గరలో ఇక్ష్వాకు వంశస్థుడైన రుతుపర్ణుని రాజ్యం ఉంది. నీవు అక్కడికి వెళ్ళు. బాహుకుడు అనే పేరుతో అతని వద్ద రధసారధిగా చేరు. నీవు అతనికి అశ్వహృదయం అనే విద్యను ఇచ్చి అతనినుండి అక్షహృదయం అనేవిద్యను గ్రహించు", అని చెప్పి కర్కోటకుడు వెళ్ళాడు. నలుడు ఋతుపర్ణుని వద్ద సారథిగా చేరాడు. అలాగే వంటశాలలో చేరి రుచికరమైన వంటలు వండి పెట్టసాగాడు. నలునికి జీవలుడు సహాయకుడుగా ఉన్నాడు. ఎక్కడ ఉన్నా, నలుడు ఎప్పుడూ దమయంతిని తలచి దుఃఖిస్తూ ఉండేవాడు. ఒకరోజు నలుడు దమయంతిని తలచుకుని దుఃఖిస్తూండగా జీవలుడు విని ఈ వికృతరూపి ప్రియురాలు ఎంత వికృతరూపంతో ఉంటుందో అనుకుంటూ నలుని దగ్గరకు వచ్చి, విషయం ఏమిటని అడిగాడు. అందుకు నలుడు జీవలునితో "అయ్యా నాకు ఒక ప్రేయసి కూడానా. నాకు తెలిసిన ఒక సైనికుడు తన ప్రేయసిని గురించి దుఃఖిస్తుండగా చూసాను. అతనిని అనుకరిస్తూ ఏడుస్తున్నాను" అన్నాడు.

దమయంతి విదర్భ దేశానికి చేరుట

[మార్చు]

విదర్భదేశంలో ఉన్న భీమునికి నలుని విషయాలు తెలిసాయి. తన కూతురు, అల్లుడు ఏమయ్యారో అని పరితపించాడు. వారిని వెదకడానికి నలువైపులా బ్రాహ్మణులను పంపించాడు. ఎన్నో బహుమానాలు ప్రకటించాడు. ఛేదిదేశం చేరిన బ్రాహ్మణుడు, దమయంతి నుదుటన ఉన్న పుట్టుమచ్చని చూసి ఆమెను గుర్తించాడు. అతడు దమయంతితో "అమ్మా! నేను నీ తండ్రి వద్దనుండి వస్తున్నాను. అక్కడి వారంతా క్షేమం. నేను నీ సోదరుని మిత్రుడను" అనగానే దమయంతి వారిని తలచుకుని పెద్దగా రోదించింది. అది చూసిన రాజమాత ఆ బ్రాహ్మణుని చూసి "బ్రాహ్మణోత్తమా! ఈమె ఎవరి భార్య? ఎవరి కూతురు? ఇలా ఉండటానికి కారణం ఏమిటి?" అని అడిగింది. అందుకు అతడు "అమ్మా! ఈమె విదర్భరాజు కుమార్తె. నలచక్రవర్తి భార్య. ఈమె పేరు దమయంతి. అతడు విధివశాత్తు రాజ్యాన్ని పోగొట్టుకుని అడవుల పాలయ్యాడు. భీముని ఆజ్ఞపై ఈమెను వెతుకుతూ ఇక్కడికివచ్చి ఈమెను గుర్తించాను" అన్నాడు. అది విని దయంతిని కౌగలించుకున్న రాజమాత "దమయంతీ! నీవు నాకు పుత్రికా సమానురాలివి. నేను, నీ తల్లి దశార్ణరాజు కుమార్తెలము. నీ తల్లి విదర్భరాజును వివాహమాడింది. నేను వీరబాహును వివాహమాడాను" అన్నది. అందుకు అందరూ ఆనందపడ్డారు. దమయంతి బ్రాహ్మణునితో పుట్టింటికి ప్రయాణం అయింది.

దమయంతికి ద్వితీయ స్వయంవరం ప్రకటించుట

[మార్చు]

రాజ సౌధంలో ఉన్నా దమయంతి భర్తృవియోగంతో బాధపడుతూనే ఉంది. ఆమె తనతండ్రితో "నా భర్తను తక్షణం వెతికించండి. ఆయన లేకుండా నేను బ్రతక లేను" అన్నది. భీముడు వెంటనే బ్రాహ్మణులను పిలిచి నలుని వెతకమని చెప్పాడు. వారితో దమయంతి ఇలా చెప్పింది. "నా భర్త ఇప్పుడు రాజ్యభ్రష్టుడు కనుక, మారు వేషంలో ఉంటాడు. మీరు వెళ్ళిన రాజ్య సభలలో ఈ విధంగా ప్రకటించండి. "నీవు సత్యసంధుడవు కాని, నీ సతిని వంచించావు. ఆమె సగం వస్త్రం ధరించి వెళ్ళావు. అలా చెయ్యడం ధర్మమా? నాపై కరుణ చూపు" అని చెప్పండి. ఈ మాటకు ఎవరైనా రోషపడి బదులిస్తే, నా వద్దకు వచ్చి చెప్పండి" అన్నది. అలా నలుని వెదకడానికి వెళ్ళినవారంతా నలుని జాడ తెలుపక పోయినా, వారిలో పర్ణాదుడు అనే విప్రుడు దమయంతితో "అమ్మా! నేను ఋతుపర్ణుని రాజ్యంలో నీవు చెప్పినట్లే చెప్పాను. అక్కడ ఒక కురూపి వంటవాడు, సారధి అయిన బాహుకుడు అనేవాడు నన్ను రహస్యంగా కలుసుకుని, 'అయ్యా! భర్త కష్టాలలో ఉన్నా సహించి, ఆదరించే భార్య ఇహలోకంలోనూ పరలోకంలోనూ సుఖపడుతుంది' అన్నాడు" అని దమయంతితో చెప్పాడు. దమయంతి ఆలోచించగా అతడు నలుడు కాకపోతే అలా ఎందుకు బదులిస్తాడు అనుకుంది. తన అనుమానం దృఢపరచుకోవడానికి తల్లి అనుమతితో సుదేవడనే బ్రాహ్మణుని పిలిపించింది. "సుదేవా నీవు ఋతుపర్ణుని రాజుతో, "రాజా! భీముడు తన అల్లుని కొరకు వెతికించినా ఫలితం లేదు కనుక ద్వితీయ స్వయంవరం ప్రకటించాడు. భూమండలం లోని రాజులంతా వస్తున్నారు. మరునాడే స్వయంవరం కనుక వెంటనే బయలుదేరు" అని చెప్పు" అని చెప్పి పంపింది. సుదేవుడు ఋతుపర్ణునితో దమయంతి చెప్పమన్నట్లే చెప్పాడు.

నలుడు స్వయంవరానికి బయలుదేరుట

[మార్చు]

దమయంతి బ్రాహ్మణుని ద్వారా పంపిన సందేశం విని ఋతుపర్ణుడు స్వయంవరానికి వెళ్ళాలని అనుకున్నాడు. ఒకరోజులో విదర్భను చేరటం ఎలా? అనుకుని సారధి అయిన బాహుకుని పిలిచి "బాహుకా! దమయంతికి ద్వితీయ స్వయంవరం ప్రకటించారు. నాకు చూడాలని ఉంది. ఒక్కరోజులో మనం విదర్భకు వెళ్ళాలి. నీ అశ్వసామర్ధ్యం ప్రకటించు" అన్నాడు. సరే అని చెప్పినా బాహుకుడు మనస్సు కలతకు గురైంది. "నేను అడవిలో నిర్దాక్షిణ్యంగా వదిలి రాబట్టి కదా, దమయంతి రెండవ స్వయంవరం ప్రకటించింది. అవివేకులైన పురుషులు తాము ఏమి చేసినా భార్య ప్రేమిస్తుందని అనుకుంటారు, కాని అది నిజంకాదు. నా మీద కలిగిన కోపంతో దమయంతి ఇలా చేసింది. అని దుఃఖించాడు. "అయినా దమయంతి పతివ్రత. ఇద్దరుపిల్లల తల్లి. ఈ విధంగా రెండవ పెళ్ళి చేసుకుంటుందా? ఏమో? ఆ వింత చూస్తాను" అని మనసులో అనుకున్నాడు. వెంటనే రథానికి గుర్రాలను కట్టి విదర్భకు ఋతుపర్ణుని తీసుకుని ప్రయాణం అయ్యాడు. ఋతుపర్ణునికి రథం పోయే వేగం చూస్తుంటే అది సూర్యుని రథంలా, బాహుకుడు అనూరుడిలా అనిపించింది. పక్కనే ఉన్న వార్ష్ణేయుడికి అదే సందేహం కలిగింది. "భూలోకంలో నలునికి మాత్రమే ఇలాంటి నైపుణ్యం ఉంది, కాని ఈ కురూపి నలుడెలా ఔతాడు" అని మనసులో అనుకున్నాడు. ఇంతలో ఋతుపర్ణుని ఉత్తరీయం జారి, క్రింద పడింది "బాహుకా రథం ఆపు, వార్ష్ణేయుడు దిగి ఉత్తరీయం తీసుకు వస్తాడు" అన్నాడు. బాహుకుడు "మహారాజా! మనం ఆమడ దూరం వచ్చేసాం. అంతదూరం నడుచుకుంటూ ఎలా తీసుకు రాగలడు?" అన్నాడు. అతని రథ సారథ్యానికి ఋతుపర్ణుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. తన పరిజ్ఞానాన్ని బాహుకునికి చూపించాలన్న ఆసక్తి కలిగింది. అంతలో రథం ఒక పెద్ద వృక్షాన్ని దాటింది. ఋతుపర్ణుడు బాహుకునితో "బాహుకా ఆ వృక్షంలో ఎన్ని కాయలు, ఎన్ని పూలు, ఎన్ని ఆకులు ఉన్నాయో నేను చెప్పగలను " అని అన్నాడు. బాహుకుడు "చెప్పండి మహారాజా" అని అడిగాడు. ఋతుపర్ణుడు చెప్పాడు లెక్కించి చూస్తే కాని నమ్మను అని రథం ఆపి ఆ చెట్టుని పడగొత్తించి లెక్కించాడు. ఋతుపర్ణుడు చిప్పిన లెక్కకు కచ్చితంగా సరిపోయింది. బాహుకుడు ఆశ్చర్యపడి ఆ విద్యను తనకు ఉపదేశించమని అడిగాడు. ఋతుపర్ణుడు "బాహుకా ఇది అక్షవిద్య అనే సంఖ్యాశాస్త్రం" అన్నాడు. అప్పుడు బాహుకుడు "మహారాజా! ఇందుకు ప్రతిగా నేను నీకు అశ్వహృదయం అనే విద్యను నేర్పుతాను" అన్నాడు.ఋతుపర్ణుడు "ఇప్పుడు కాదు, తరువాత అడిగి నేర్చుకుంటాను" అన్నాడు. అక్షహృదయ విద్య మహిమవలన నలునిలో నుండి కలి వెలుపలికి వచ్చాడు. తనను క్షమించమని నలుని వేడుకున్నాడు. నలుడు ఆగ్రహించి శపించబోయాడు. కలి నలునితో "నలమహారాజా! నిన్ను ఆవహించి నీలో ఉన్న సమయంలో నిన్ను కర్కోటకడు కాటువేయడం వలన అనుక్షణం కాలి పోయాను. ఇంతకంటే శాపం ఏముంది, నన్ను క్షమించి విడిచిపెట్టు" అని వేడుకున్నాడు.

నలుని రథం విపరీతమైన ఘోషతో విదర్భలో ప్రవేశించింది. ఆ ఘోష విని, దమయంతి అది నలుని రథం అని గుర్తుపట్టింది. కాని రథంలో ఋతుపర్ణుని చూసి నిరాశ చెందింది. భీముడు ఎంతో ఆనందంతో ఋతుపర్ణుని ఆహ్వానించి విడిది చూపాడు. ఋతుపర్ణునికి విదర్భలో స్వయంవరం జరుగుతున్న సందడి కనిపించ లేదు. బాహుకుడు రథాన్ని అశ్వశాలలో నిలిపి, సేదతీరాడు.

నలదమయంతుల కలయిక

[మార్చు]
దస్త్రం:Reunion of Nala and Damayanthi.jpg
తిరిగి కలుసుకున్న నల దమయంతులు

దమయంతి తన దాసితో "వచ్చింది ఋతుపర్ణ మహారాజు అతని సారధి వార్ష్ణేయుడు. వారు నాకు తెలుసు, కాని వారి వెంట ఉన్న కురూపి ఎవరు? అతనిని చూసి నా మనస పరవశించి పోతుంది. అతని వివరాలు తెలుసుకుని రా" అని పంపింది. దాసి నలుని వద్దకు వచ్చి "అయ్యా! రాకుమారి మీ యోగ క్షేమాలు కనుక్కుని రమ్మంది" అని చెప్పింది. నలుడు "మీ రాకుమారి స్వయంవరం ప్రకటించింది కదా, దానికి నేను మా మహారాజును ఒక్కరోజులో నూరు ఆమడల దూరం ప్రయాణించి తీసుకు వచ్చాను అని చెప్పు "అన్నాడు. "మీతో వచ్చిన మూడవ వ్యక్తి ఎవరు?" అని దాసి అడిగింది. నలుడు "అతడు వార్ష్ణేయుడు. ఇంతకు ముందు నలుని సారధి" అన్నాడు. దాసి "అతనికి నలుని జాడ తెలుసు కదా?" అని అడిగింది. నలుడు దాసితో "తనరాజ్యాన్ని పోగొట్టుకునేముందు నలుడు తన పిల్లలనిచ్చి వార్ష్ణేయుని విదర్భకు పంపాడు. ఆ తరువాత వార్ష్ణేయుడు ఋతుపర్ణుని వద్ద సారధిగా చేరాడు. నలుని గురించి నలునికి తెలియాలి, లేదా అతని భార్యకి తెలియాలి, వేరొకరికి తెలిసే అవకాశం లేదు" అన్నాడు బాహుకుడు. దాసి "అయ్యా! నలుడు తనను ప్రాణపదంగా చూసుకునే భార్యను నిర్దాక్షిణ్యంగా అడవిలో విడిచి వెళ్ళాడు. దమయంతి నలుడు విడిచి వెళ్ళిన సగంచీర ధరించి కాలం గడుపుతోంది. ఆమెను ఇలా విడిచి వెళ్ళడం ధర్మమా?" అని అడిగింది. నలుని కంట నీరు పెల్లుబికింది. అది దాసికి తెలియ కూడదని మొహం తిప్పుకున్నాడు. దమయంతికి దాసి జరిగినదంతా వివరించింది. దమయంతి దాసితో "సందేహం లేదు, అతడు నలుడే. అయినా ఈ వికృత రూపం ఏమిటి? అతను వంటవాడు అని చెప్పారు కనుక, వంట ఎలా చేస్తాడో పరీక్షించు" అని పంపింది. దాసి వెళ్ళి నలుని నిశితంగా పరిశీలించి "అమ్మా! అతను సామాన్యుడు కాదు. అతడు ఏ పని అయినా సునాయాసంగా చేస్తున్నాడు. అతడు గడ్డిని విదిలిస్తే మంటలు వస్తున్నాయి. వంట పూర్తయే వరకు అలా మండు తున్నాయి. వంటలు అద్భుతంగా ఉన్నాయి" అని దమయంతికి చెప్పింది. దమయంతి నలుడు వండిన వంటలు తెప్పించి రుచి చూసి "సందేహం లేదు, ఇవి నలుని వంటలే" అని గ్రహించి, దాసితో తన పిల్లలను నలుని వద్దకు పంపింది. నలుడు వారిని చూసి చలించి ఎత్తుకుని ముద్దాడాడు. దాసితో "అమ్మా! ఏమీ అనుకోవద్దు, వీరిని చూస్తే నా బిడ్డలు గుర్తుకు వచ్చారు అందుకే అలాచేసాను. ఇక నువ్వు నా వద్దకు రావద్దు. ఎవరైనా చూస్తే ఏదైనా అనుకుంటారు. అయినా మేము విదేశాలనుండి వచ్చిన అతిథులం మాతో నీకేం పని?" అన్నాడు. ఇది విని దమయంతి సంతోషపడి తన తల్లి వద్దకు వెళ్ళి "ఋతుపర్ణుని సారధిగా వచ్చిన కురూపి బాహుకుడే నలుడు. అమ్మా అతను ఇక్కడకు వస్తాడా, నేను అక్కడకు వెళ్ళాలా నువ్వే నిర్ణయించు" అని అడిగింది. భీమరాజు అనుమతితో ఆమె బాహుకుడిని దమయంతి వద్దకు రప్పించింది. దమయంతి నలుని చూసి, "అయ్యా నిస్సహాయంగా ఉన్న నన్ను నా భర్త నలమహారాజు నట్టడవిలో నిర్డాక్షిణ్యంగా వదిలి వెళ్ళాడు. అలా సంతానవతినైన నన్ను విడిచి పెట్టడం ధర్మమా? అలా చేయడానికి నేనేమి అపకారం చేసాను? అగ్ని సాక్షిగా విడువను అని నాకు ప్రమాణం చేసిన భర్త అలా చేయవచ్చా?" అని దుఃఖించింది. నలుడు "సాధ్వీ! ఆ సమయంలో నన్ను కలి ఆవహించి ఉన్నాడు. అందువలన నేను అలా చేసాను. జూదంలో సర్వం పోగోట్టుకుని బాధలు పడుతున్న నేను, నాతోపాటు బాధలు పడుతున్న నీ బాధను సహించ లేక, నిన్ను విడిచి వెళ్ళాను. అలా చేస్తే నువ్వైనా నీ తండ్రి ఇంటికి వెళ్ళి సుఖంగా ఉంటావని అలా చేసాను. నీపై అనురాగంతో మిమ్మల్ని చూడటానికే నేను ఇక్కడకు వచ్చాను. మరొక భర్తకోసం స్వయంవరం ప్రకటించడం కులస్త్రీలకు తగునా? అలా ఎందుకు చేసావు? అందుకే కదా ఋతుపర్ణుడు వచ్చాడు.ఇది ధర్మమా?" అని దమయంతిని అడిగాడు. దమయంతి "నాధా నేను మీకోసం గాలిస్తూ పంపిన విప్రులలో అయోధ్యకు వెళ్ళిన విప్రుడు మిమ్ములను గుర్తించాడు. మిమ్మలిని రప్పించుటకే ఇలా చేసాను. మీరుకాక, ఇంకెవరు నూరు యోజమలు దూరం ఒక్క రోజులో ప్రయాణించగలరు? నాలో ఎటువంటి పాపపు తలపు లేదు అని మీ పాదములు అంటి నమస్కరించి ప్రమాణం చేస్తున్నాను" అని దమయంతి నలుని పాదాలకు నమస్కరించింది. వెంటనే ఆకాశం నుండి వాయుదేవుడు "నలచక్రవర్తీ! ఈమె పవిత్రురాలు, పతివ్రత. నేను, సూర్యుడు, చంద్రుడు ఈమె సౌశీల్యం కాపాడుతున్నాము" అని పలికాడు. నలుడు కర్కోటకుని స్మరించాడు వెంటనే ఒక వస్త్రం వచ్చింది. అది ధరించగానే నలునికి ఇంద్రతేజస్సుతో సమానమైన మనోహరమైన పూర్వరూపం వచ్చింది. దమయంతిని పరిగ్రహించాడు.

నలదమయంతులు రాజ్యాన్ని పొందుట

[మార్చు]
సభలో నల దమయంతులు

నలుడు విదర్భలో ఒక మాసం ఉండి, తన రాజధానికి వెళ్ళి పుష్కరుని కలిసాడు. నలుడు పుష్కరునితో "పుష్కరా!జూదమాడటం నీకు ప్రియం కదా. నేను నా భార్య దమయంతిని ఫణంగా పెడతాను, నీవు నీ సర్వస్వం పెట్టి నాతో ఆడతావా? లేదా నాతో యుద్ధం చెయ్యి, ఎవరు గెలిస్తే వారిదే రాజ్యం. నీకేది ఇష్టమో నిర్ణయించుకో" అన్నాడు. పుష్కరుడు జూదప్రియుడు పైగా ఒకసారి జూదమాడి గెలిచాడు కనుక అతడు నలునితో "నేను జూదమే ఆడతాను" అన్నాడు. నలుడు పుష్కరునితో జూదమాడి రాజ్యాన్ని గెలుచుకున్నాడు. పుష్కరునితో "పుష్కరా, నేను ఇదివరకు నీతో జూదమాడినపుడు నన్ను కలి ఆవహించి ఉన్నాడు. కనుక ఓడి పోయాను, నీబలం వలన కాదు. నీవు నా పిన తండ్రి కుమారుడివి కనుక, నిన్ను ఏమి చేయను వెళ్ళు" అని చెప్పి పంపాడు. ఇంకా బృహదశ్వుడు నలచరిత్ర విన్నవారికి కలిదోషములు ఉండవని నాగుడైన కర్కోటకుని, దమయంతిని , నలుని , రాజర్షియైన ఋతుపర్ణుని తలచిన వారికి కలిబాధింపదని ఈ శ్లోకము చెప్పాడు కర్కోటకస్య నాగస్య దమయంత్యాః నలస్యచ ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలినాశనం

ధర్మరాజు వద్దకు నారదుని రాక

[మార్చు]

మహాముని బృహదశ్వుడు నలచరిత్రను ధర్మరాజుకు తెలిపి "ధర్మరాజా! జూదంలో కోల్పోయానని బాధపడకు. నీవు దైవ సహాయంతో, నీ స్వప్రయత్నంతో విజయం సాధిస్తావు " అని ధైర్య వచనాలు పలికి తన వద్ద ఉన్న అక్షవిద్యను ధర్మరాజుకు చెప్పి వెళ్ళి పోయాడు. ధర్మరాజు అర్జుని కోసం నిరీక్షిస్తున్న సమయంలో అతని వద్దకు నారద మహర్షి వచ్చాడు.ధర్మరాజు నారదునికి అతిథి మర్యాద చేసాడు. ఆ యనను చూసి ధర్మరాజు " మునీంద్రా నాకు ఒక ధర్మ సందేహం ఉంది. తీర్చగలరా ?" అని అడిగాడు. నారదుడు నవ్వి అలాగే అడగమన్నాడు.ధర్మరాజు " ఈ భూమిలో తీర్ధములు సేవించిన ధన్యులకు ఎలాంటి ఫలితం కలుగుతాయి " అని నారదుని అడిగాడు.నారదుడు ధర్మరాజా చెబుతాను విను " పూర్వం భీష్ముడు గంగాతీరంలో వేదాధ్యనం చేస్తూ చాలా మంచి పనులు చేసూ ఉండే వాడు. భీష్ముని వద్దకు ఒక సారి పులస్త్యుడు అనే ముని వచ్చాడు. అతనికి అతిధి మర్యాదలు చేసిన పిమ్మట భీష్ముడు పులస్త్యుని చూసి నీవు నన్ను అడిగినట్లే అడిగాడు. ఆ మహర్షి భీష్మునితో చెప్పిన విషయాలు నీకు చెప్తాను " అని ధర్మరాజుతో అన్నాడు.

తీర్ధ మహిమ

[మార్చు]

ఇంద్రియాలను త్రికరణ శుద్ధిగా పెట్టున్న వారు, దృఢమైన మనసు కలిగిన వారు, అహంకారం లేని వారు, ఇతరుల నుండి ఏమీ ఆశించని వారు మిత భోజనం చేసేవారు, ఎల్లప్పుడూ సత్యం పలికే వారు, శాంత స్వభావం కలిగిన వారు తీర్ధయాత్రలు చేసిన వారుఎన్నో యజ్ఞాలు చేసిన ఫలితం వస్తుంది. మలిన మనస్కులు, పాపాత్ములు ఎన్ని తీర్ధాలు చేసినా ఫలితం శూన్యం.దాన ధర్మాలు చేయని వారు తాము చేసిన అపరాధం వలన దరిద్రులు ఔతారు.అలాంటి వారు దరిద్రులు యజ్ఞములు చేయ లేరు. కనుక పుణ్య తీర్ధములు చేసి పుణ్యం పొందవచ్చు. సాధారణంగా బ్రహ్మదేవుడు తీర్ధాలలో విహరిస్తుంటాడు. అందులో పుష్కరతీర్థం ప్రసిద్ధమైంది. దానిలో స్నానమాచరించిన పది అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం వస్తుంది. ఆ పష్కరంలో పది సంవత్సరాలు నివసించిన బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. జంబూ మార్గంలోని అగస్త్యవటం అనే తీర్థంలో స్నానం చేస్తే అశ్వమేధం చేసిన ఫలితం వస్తుంది. కణ్వాశ్రమం, ధర్యారణ్యం, యయాతి పతనం అనే పుణ్యక్షేత్రం దర్శించిన వారికి అన్ని పాపాలు పోతాయి. ఇంకా మహాకాళం, కోటి తీర్థం, భద్రపటంలో శివుని పూజించినా నర్మదా నదీ స్నానం, దక్షిణ నదీ స్నానం, జర్మణ్వతీ నదీ స్నానం ఎంతో పుణ్యాన్నిస్తుంది. వశిష్టాశ్రమంలో ఒకరోజు నివాసం, పింగం అనే పుణ్యతీర్ధ సేవనం, ప్రభాస తీర్ధ స్నానం, వరదాన తీర్ధ స్నానం, సరస్వతీ నదీ సంగమ స్నానం పుణ్యఫలాన్నిస్తుంది. ద్వారావతీ పురం లోని పిండారక తీర్థంలో శివుని పూజించినా, సాగర సింధు సంగమంలో స్నానమాచరించినా, శంకు కర్ణేశ్వరంలో శివిని పూజించినా, వసుధారా, వసు సరంలో తీర్ధమాడినా, సింధూత్తమంలో స్నానం చేసినా, బ్రహ్మతుంగ తీర్థం సేవించినా, శక్రకుమారీ యాత్ర చేసినా, శ్రీకుండంలో బ్రహ్మదేవుని సందర్శించినా, బడబ తీర్థంలో అగ్ని దేవుని సేవించినా ఎన్నో గోదానాలు భూదానాలు చేసిన ఫలితం వస్తుంది. శివుడు నివసించే దేవికా క్షేత్రాన్ని, కామ క్షేత్రాన్ని, రుద్రతీర్ధాన్ని, బ్రహ్మవాలుకాన్ని, దీర్ఘసత్రాన్ని సేవించిన వారికి అష్ట కామ్య సిద్ధి కలుగుతుంది. వినశనంలో మాయమైన సరస్వతీ నది నాగోద్భేద, శివోద్భేద, చమసోద్భేద లలో స్నానం చేసిన నాగలోక ప్రాప్తి కలుగుతుంది. శశియాన తీర్థం స్నానం సహస్ర గోదాన ఫలం వస్తుంది. రుద్రకోటిలో శివుని అర్చించిన కైలాస ప్రాప్తి లభిస్తుంది. ధర్మజా కురుక్షేత్రం, నైమిశ తీర్థం, పుష్కర తీర్థం అనేవి మూడూ పవిత్ర క్షేత్రాలు. కురుక్షేత్రం సరస్వతీ నదికి దక్షిణంలో దృషద్వతీ నదికి ఉత్తరంలో ఉంది. ఆ కురుక్షేత్రంలో శమంతక పంచకం నడుమ రామహ్రదం అనే సరస్సు మధ్య పితామహుడు బ్రహ్మదేవుని ఉత్తరవేది అనే క్షేత్రం దర్శించిన వారికి సర్వపాపక్షయం కలుగుతుంది. విష్ణు స్థానంలో విష్ణుమూర్తిని పూజించినా, పారిప్లవ తీర్థంలో, శాలుకినీ తీర్థంలో, సర్పతీర్థంలో, వరాహతీర్థంలో, అ శ్వినీ తీర్థంలో, జయంతిలో ఉండే సోమతీర్థంలో, కృతశౌచ తీర్థంలో స్నానమాచరించిన ఎంతో పుణ్య ప్రాప్తి కలుగుతుంది. అగ్నివట క్షేత్రంలో, ముంజవట క్షేత్రంలో శివారాధన చేసినా యక్షిణీ తీర్థంలో స్నానం చేసినా కామ్యసిద్ధి కలుగుతుంది. "ధర్మజా! జమదగ్ని కుమారుడైన పరశురాముడు, తన గొడ్డలితో రాజులందరిని వధించినప్పుడు వారి రక్తం ఐదు పాయలుగా పారింది. వాటిని శమంతక పంచకం అంటారు. అందులో పరశురాముడు తన తండ్రికి తర్పణం విడిచాడు. అప్పుడు పితృదేవతలు సాక్షాత్కరించి వరాలు కోరుకొమ్మని అడిగారు. పరశురాముడు తనకు రాజులను సంహరించిన పాపం నశించాలి అని తనకు పుణ్యలోక ప్రాప్తి కలగాలని కోరుకున్నాడు. ఈ శమంతక పంచకం పవిత్రత సంతరించు కోవాలి అని కోరాడు. అప్పటి నుండి శమంతక పంచకం పుణ్యతీర్ధాలుగా భాసిల్లుతున్నాయి. వాటిలో స్నానం చేస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలితం కలుగుతుంది. కాయసోధనం, లోకోద్ధారం, శ్రీతీర్థం, కపిలతీర్థం, సూర్యతీర్థం, గోభనం, శంఖినీ తీర్థం, యక్షేంద్రతీర్థం, సరస్వతీ నది, మాతృతీర్థం, బ్రహ్మావర్తం, శరవణం, శ్వావిల్లోమాపహం, మానుష తీర్థం, ఆపగ నదీ తీర్థం, సప్తఋషి కుండం, కేదారం, కపిల కేదారం, సరకం, ఇలాస్పదం, కిందానం, కింజప్యం అనే తీర్ధాలలో స్నానం చేస్తే అనంతమైన పుణ్యాలు కలుగుతాయి . నారద నిర్మిత అంబాజన్మం అనే తీర్థంలో చనిపోతే పుణ్య లోకాలకు పోతారు.పుండరీకం అనే తీర్థంలో ఉన్న వైతరణిలో స్నానమాడినా, ఫలకీ వనం, మిశ్రకం, వ్యాసవనం, మనోజవం, మధువటి, కౌశికీనది, దృషద్వతీ నదీ సంగమంలో సమస్త పాపాలు నశిస్తాయి. కిందర్త తీర్థంలో తిలోదానం చేస్తే పితృ ఋణం తీరితుంది. అహస్సు, సుదినం, అనే తీర్ధాలలో స్నామాచరిస్తే సూర్యలోక ప్రాప్తి కలుగుతుంది. మృగధూమం అనే క్షేత్రంలో గంగా స్నానమాచరించి శివుని ఆరాధించిన అశ్వమేధ ఫలం కలుగుతుంది. వామన తీర్థంలో స్నానం చేస్తే విష్ణు లోకానికి పోతారు. పావన తీర్థంలో స్నానమాచరించిన వంశం పవిత్రమౌతుంది. శ్రీకుంజంలో తీర్ధాన్ని దర్శిస్తే బ్రహ్మలోకం సిద్ధిస్తుంది. సప్తసారస్వతాలు అనే తీర్థంలో స్నానంచేస్తే సమగ్ర సారస్వతప్రాప్తి కులుగుతుంది. ఔశనశం, కపాలమోచనం, విశ్వా మిత్రం, కార్తికేయం అనే తీర్ధాలలో స్నానమాచరిస్తే పాప విముక్తులౌతారు. పృధూక తీర్థంలో చనిపోతే పాపాల నుండి విముక్తులౌతారు.గంగా, సరస్వతీ సంగమంలో స్నానమాచరిస్తే బ్రహ్మ హత్యా పాతకం పోతుంది.శతం, సహస్రం అనే తీర్ధాలలో తపస్సు చేస్తే అంతులేని పుణ్యం వస్తుంది. రుద్రపత్ని అనే తీర్థంలో స్నానం చేస్తే సర్వ దుఃఖ విముక్తి కలుగు తుంది. స్వస్తి పురం అనే తీర్థం చుట్టూ ప్రదక్షిణ చేస్తే వేయి ఆవులను దానం చేసిన పుణ్యం కలుగుతుంది. ఏకరాత్రం అనే తీర్థంలో ఉపవాసం చేస్తే స్త్యలోకం సిద్ధిస్తుంది. ఆ దిత్యాశ్రమంలో సూర్యుడిని ఆరాధిస్తే సూర్యలోక ప్రాప్తి కలుగుతుంది. దధీచి తీర్థంలో మూడురాత్రులు నివసిస్తే ఇంద్రలోక ప్రాప్తి కలుగుతుంది. స్యర్యగ్రహణ సమయంలో సన్నిహిత తీర్థంలోస్నానం చేస్తే నూరు అశ్వమేధాలు చేసిన ఫలం పొందుతారు. ధర్మతీర్థంలో స్నానం చేస్తే ధర్మాచరణ కలుగుతుంది. జ్ఞానపావనం, సౌగంధికం అనే తీర్ధాలలో స్నానం చేస్తే సర్వపాపాలు పోతాయి.సరస్వతీ హ్రదం నుండి వచ్చే జలంలో స్నానం చేస్తే అశ్వమేధయాగం చేసిన ఫలం వస్తుంది. శాకంబరీ తీర్థంలో ఒకరోజు శాకాహార తపస్సు చేస్తే పణ్యం లభిస్తుంది. ధూమావతీ, రథావర్తం అనే తీర్ధాలలో స్నానం చేస్తే దు॰ఖం నుండి విముక్తులౌతారు. అందరూ పుణ్య తీర్ధాలలో స్నానం చేయలేరు. నోములు నోచని వారు, చెడ్డవారు, ఉపవాసాలు చేయని వారు, శుచిత్వం లేని వారు తీర్ధయాత్రలు చేయలేరు. కనుక నీవు తీర్ధ యాత్రలకు వెళ్ళి రమ్ము. రోమశుడు అనే మహర్షి నీ దగ్గరకు వచ్చి నిన్ను తీర్ధయాత్రలు చెయ్యమని ఆదేశిస్తాడు. నీవు ధౌమ్యుని అనుమతితో తీర్ధయాత్రలు చేసి రా " అని చెప్పి నారదుడు వెళ్ళాడు.

రోమశుని రాక

[మార్చు]

నారదుముని వెళ్ళిన తరువాత ధర్మరాజు ధౌమ్యునితో "అర్జునుడు దివ్యాస్త్రాలు సాధించటానికి వెళ్ళాడు. ఇంకా రాలేదు. అర్జునుడు లేని కామ్యకవనం శోభించడం లేదు. మేమంతా అర్జునిని రాక కొరకు నిరీక్షిస్తున్నాం " అన్నాడు. ధౌమ్యుడు "ధర్మజా నీకు మేలు జరుగుతుంది. అర్జునుడు విజయుడై తిరిగి వస్తాడు. నారదుడు చెప్పినట్లు మనం తీర్ధయాత్రలు చేద్దాం " అన్నాడు. ఇంతలో రోమశ మహర్షి వారి వద్దకు వచ్చాడు. ధర్మరాజుతో రోమశ మహర్షి "ధర్మజా! నేను ఇంద్రలోకం వెళ్ళినపుడు అక్కడ దేవేంద్రుని పూజలందుకుంటున్న అర్జునిని చూసాను. పరమశివుడు, దేవతలు అర్జునినికి దివ్యాస్త్రాలు ఇచ్చారు. అర్జునిని విషయం నీకు చెప్పమని దేవేంద్రుడు నన్ను పంపాడు. అలాగే నిన్ను తీర్ధయాత్రలు చేయమని ఆదేశించాడు " అన్నాడు . ఆ మాటలకు ధర్మరాజు ఆనందపడి "మహర్షీ! అర్జునుని క్షేమవార్తకు దేవేంద్రుని తీర్ధయాత్రలు చెయ్యమని దేవేంద్రుడు ఆదేశించినందుకు ఆనందంగా ఉంది. నారద మహర్షి ఆదేశం అదే కనుక నేను ఇప్పుడు తీర్ధయాత్ర చేయాలను కుంటున్నాను " అన్నాడు. ధర్మరాజు వెంటనే తీర్ధయాత్రకు బయలు దేరాడు. విప్రులందరూ వెంట వస్తామని అన్నారు. ధర్మరాజు అంగీకరించాడు. ఆ సమయంలో వ్యాసుడు అక్కడకు వచ్చాడు.వ్యాసుడు ధర్మరాజుతో " ధర్మజా ! మనో బుద్ది సౌచం, శ్రీర నియమాలు ఆచరిస్తూ సన్మార్గంలో తీర్ధాలు సేవించండి. నీ పూర్వులైన మహాభిషుడు, నాభాగుడు, భరతుడు, భగీరధుడు, ముచుకుందుడు, మాంధాత , సగరుడు, సార్వభౌముడు, అష్టకుడు, రోమపాదుడు మొదలైన చక్రవర్తులు తీర్ధయాత్రలు చేసి సుఖాలు పొందారు. వారి వలెనె నువ్వు తీర్ధయాత్రలు చేసి సుఖించు " అని ఆశీర్వదించాడు. ధర్మరాజు రోమశుని చూసి "మహర్షీ! లోకంలో అధర్మపరులకు, దుర్జనులకు అభివృద్ధి కలుగుతుంది. కాని ధర్మం ఆచరించే వారికి కష్టాలు ప్రాప్తిస్తున్నాయి ఎందుకు?" అని అడిగాడు.రోమశుడు "ధర్మరాజా! అధర్మపరులకు అభ్యుదయం ఎల్లకాలం ఉండదు. త్వరలో నశిస్తుంది. రాక్షసులు అధర్మవర్తనులై నాశనమైనారు. దేవతలు ధర్మాచరణులై వృద్ధి పొందుతున్నారు.కౌరవులు వారి అధర్మవర్తనం వలన అచిరకాలంలో నశిస్తారు. అధర్మవర్తనం వలన గర్వం పుడుతుంది గర్వం వలన అహంకారం పుడుతుంది అహంకారం క్రోధానికి మూలం క్రోధ వలన సిగ్గు విడుస్తుంది అలాంటి వారిని లక్ష్మి వదిలి వెడుతుంది. మీరు ధర్మపరులు మీకు జయం కలుగుతుంది " అన్నాడు.ఆ తరువాత ధర్మరాజు తీర్ధయాత్రలకు బయలు దేరాడు. అన్నీ తీర్థాలు సేవిస్తూ గయ చేరుకున్నాడు. అక్కడి నుండి అగస్త్యాశ్రమం చేరుకున్నాడు.

ఆగస్త్యమహాముని వృత్తాంతం

[మార్చు]

అగస్త్యాశ్రమం చేరిన తరువాత రోమశుడు అగస్త్యు ని గురించి వివరించసాగాడు. "ధర్మజా పూర్వం వాతాపి ఇల్వలుడు అనే ఇద్దరు రాక్షసులు ఉండే వారు. వారిరువురు అన్నదమ్ములు. వారిలో పెద్దవాడైన ఇల్వలుడు ఒక బ్రాహ్మణుని పూజించి అయ్యా అన్ని కోరికలు తీర్చే మంత్రం ఉపదేశించమని అడిగాడు. రాక్షసులకు అలాంటి మంత్రం ఉపదేశించటానికి వీలు పడదని అతడు చెప్పాడు. తరువాత ఇలలుడు తమ్ముడైన వాతాపిని మేకకా మార్చి ఆ మేకను చంపి వండి ఆ బ్రాహ్మణునికి వడ్డించాడు. బ్రాహ్మణుడు భుజించిన తరువాత ఇల్వలుడు "వాతాపి బయటకురా " అన్నాడు. వెంటనే వాతాపి బ్రాహ్మణుని పొట్ట చీల్చుకుని బయటకు వచ్చాడు. ఆ బ్రాహ్మణుడు మరణించాడు. ఇలా అన్నదమ్ములు అతిథులుగా పిలిచి బ్రాహ్మణులను చంపుతూ వచ్చారు. ఒక రోజు బ్రహ్మ చర్య వ్రతంలో ఉన్న అగస్త్యుడు లేచిగురుటాకులను ఆధారం చేసుకుని వ్రేలాడుతున్న తన పితరులను చూసాడు. అగస్త్యుడు వారితో "అయ్యా! మీరెవరు? ఇలా ఎందుకు వ్రేలాడుతున్నారు " అని అడిగాడు. బదులుగా వారు "నాయనా!మేము నీపితరులము. నీవు వివాహం చేసుకొనకుండా సంతాన హీనుడవయ్యావు. కనుక మేము ఉత్తమ గతులు లేక ఇలా అయ్యాము. కనుక నీవు వివాహం చేసుకుని సంతానం పొంది మాకు ఉత్తమగతులు ప్రసాదించు " అన్నారు. అగస్త్యుడు అలాగే అన్నాడు.ఆ సమయంలో విదర్భ రాజు సంతానం కోసం పరితపిస్తున్నాడు. అగస్త్యుడు తన తపో మహిమతో అతనికి ఒక కూతురిని అనుగ్రహించాడు. ఆమె యవ్వనవతి అయ్యింది. ఆమె పేరు లోపాముద్ర. లోపాముద్రకు వివాహ ప్రయత్నాలు చేస్తున్నాడని విని అగస్త్యుడు లోపాముద్రను తనకిమ్మని అడిగాడు. రాజు " ఈ నిరుపేద బ్రాహ్మణుడా నాకుమార్తె భర్త. ఇతడిని చేసుకుని నా కూతురు నారచీరెలు ధరించవలసినదేనా? " అని పరితపించాడు. లోపాముద్ర తనను అగస్త్యునికి ఇచ్చి వివాహం చేయమని తండ్రిని కోరింది. గత్యంరం లేక ఆమె తండ్రి అలాగే ఆమెను అగస్త్యునకిచ్చి వివాహం చేసాడు. ఆమె నారచీరెలు ధరించి భర్త వెంట వెళ్ళింది. ఒకరోజు అగస్త్యుడు కోరికతో భార్యను చేరాడు. లోపాముద్ర "నాధా! సంతానం కోసం భార్యను కోరడం సహజం. నన్ను సర్వాలంకార భూషితను చేసి నన్ను కోరండి " అన్నది. అగస్త్య్డుడు " నా వద్ద ధనం, ఆభరణములు లేవు వాటి కొరకు తపశ్శక్తిని ధారపోయడం వ్యర్ధం " అనుకుని ధనం కొరకు అగస్త్యుడు శతర్వురుడు అనే రాజు వద్దకు వెళ్ళాడు. శతర్వురుడు తనవద్ద ధనం లేదని చెప్పాడు. అగస్త్యుడు, శతర్వురుడు బృహదశ్వుని వద్దకు అనే రాజు వద్దకు వెళ్ళి ధనం అడిగాడు. ఆ రాజు కూడా తనకు ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయని కనుక ధనం లేదని చెప్పాడు. ఆ తరువాత ఆ ముగ్గురూ ధనం కొరకు త్రసదస్యుడి వద్దకు వెళ్ళారు. అతను కూడా ధనం లేదని చెప్పి "మునీంద్రా! ఇల్వలుడు ధనవంతుడు. అతడిని అడిగితే మీకోరిక తీరుతుంది " అన్నాడు.వెంటనే అందరూ ఇల్వలుడి దగ్గరకు వెళ్ళారు. అగస్త్యుడు ఇల్వలుని ధనం అడిగాడు. ఇల్వలుడు మామూలుగా వాతాపిని వండి వడ్డించాడు. ముందు అగస్త్యుడుని భుజించమని చెప్పాడు. ఈ విషయం గ్రహించిన రాజఋషులు "మునీంద్రా! ఇల్వవుడు తన తమ్ముని మేకగా మార్చి వండి బ్రాహ్మణులచే తినిపించి అతనిని బయటకు రమ్మంటాడు. అతడు పొట్ట చీల్చుకుని ఆబ్రాహ్మణుని చంపి బయటకు వస్తాడు. కనుక మీరు భుజించరాదు " అన్నారు. అగస్త్యుడు చిరునవ్వు నవ్వి ఆ భోజనం తినేశాడు. అగస్త్యుడు పొట్టను తడుముకుని తేన్చాడు. అంతే వాతాపి జీర్ణం అయ్యాడు. ఇల్వలుడు "వాతాపీ బయటకు రా " అన్నాడు. అతను రాకపోవడంతో అతను జీర్ణం అయ్యాడని తెలుసుకుని భయపడి అగస్త్యునితో "అయ్యా మీరు కోరిన ధనం ఇస్తాను " అన్నాడు. ఆ ధనంతో అగస్త్యుడు లోపాముద్ర కోరికను తీర్చాడు. అగస్త్యుడు లోపాముద్రతో "నీకు పది మందితో సమానమైన నూరుగురు కొడుకులు కావాలా? లేక నూరుగురుతో సమానమైన ఒక్క కొడుకు కావాలా? లేక నూరుగురు కొడుకులతో సమానమైన వెయ్యి మంది కొడుకులు కావాలా లేక వెయ్యి మందికి సమానమైన ఒక్క కొడుకు కావాలా ? " అని అడిగాడు.అందుకు లోపాముద్ర "నాకు వేయి మందితో సమాన మైన బల వంతుడూ, బుద్ధి మంతుడూ అయిన ఒక్క కుమారుని ప్రసాదించండి " అని కోరింది. లోపాముద్ర గర్భందాల్చి తేజోవంతుడూ, గుణ వంతుడూ అయిన దృఢస్యుడు అనే కొడుకును కన్నది.ఆ విధంగా అగస్త్యుడు తన పితృదేవతలకు ఉత్తమ గతులు కలిగించాడు.

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]