Jump to content

వికీపీడియా:ఈ వారం వ్యాసాలు (2024)

వికీపీడియా నుండి

2024 సంవత్సరంలో "ఈ వారం వ్యాసం" శీర్షికలో ప్రదర్శించిన వ్యాసాలు

ప్రస్తుత ప్రతిపాదనలు, జాబితా కోసం వికీపీడియా:ఈ వారపు వ్యాసం జాబితా చూడండి.

1వ వారం
రామప్ప దేవాలయం

రామప్ప దేవాలయం ఓరుగల్లును పరిపాలించిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం. ఇది తెలంగాణ రాష్ట్ర రాజధానియైన హైదరాబాదు నగరానికి 220 కి.మీ.దూరంలో, కాకతీయ వంశీకుల రాజధానియైన వరంగల్లు పట్టణానికి సుమారు 70 కి.మీ.దూరంలో ములుగు జిల్లా, వెంకటాపూర్ మండలంలోని పలంపేట అనే గ్రామం దగ్గర ఉంది. దీనినే రామలింగేశ్వర దేవాలయం అని కూడా వ్యవహరిస్తారు. ఇది చాలా ప్రాముఖ్యత గల దేవాలయం. ఈ దేవాలయం విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చుతునకగా చెప్పవచ్చు. ఈ దేవాలయం పక్కనే రామప్ప సరస్సు ఉంది. ఆ చెరువు కాకతీయుల కాలం నాటిది. ఇది ఇప్పటికి వేల ఎకరాల పంటకు ఆధారంగా ఉంది. పలంపేట చారిత్రిక ప్రాథాన్యత గల గ్రామం. ఇది కాకతీయుల పరిపాలనలో 13-14 శతాబ్ధాల మధ్య వెలుగొందింది. కాకతీయ రాజు గణపతి దేవుడు ఈ దేవాలయంలో వేయించిన శిలాశాసనం ప్రకారం ఈ దేవాలయాన్ని రేచర్ల రుద్రయ్య నిర్మించాడు. కాకతీయుల కాలంలో క్రీస్తు శకం 1213లో నిర్మించిన రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా దక్కింది. చైనాలోని పూజౌలో నిర్వహించిన యునెస్కో హెరిటేజ్ కమిటీ సమావేశాలలో ప్రపంచ వ్యాప్తంగా 21 దేశాల ప్రతినిధులు ఓటింగ్ ప్రక్రియలో పాలుపంచుకొన్నారు. 17 దేశాల వారు రామప్ప దేవాలయానికి అనుకూలంగా వేసి వారసత్వ హోదా ఇచ్చే విషయంపై నిర్ణయం తీసుకున్నారు.
(ఇంకా…)

2వ వారం
మురారిరావు ఘోర్పడే

మురారిరావు ఘోర్పడే మరాఠా సర్దారు, సందూరు సంస్థానపు రాజు, గుత్తి దుర్గాధిపతి. భారతదేశంలో మొగలుల పాలన క్షీణదశకు చేరుకొని దక్షిణాపథంలో మరాఠులు విస్తరిస్తుంటే, మరో ప్రక్క ఫ్రెంచ్, బ్రిటిషు సేనలు ఉపఖండంలో పట్టుసాధించడానికి కృషి చేస్తూండేవారు. మరాఠులు, నిజాంలు, మైసూరు రాజ్యం, ఆధిపత్యంకై పోరాడుతూండేవారు. అలాంటి సంక్లిష్టమైన సమయంలో, దక్కన్‌లో పీష్వాలకు నమ్మకమైన సేనానిగా ఉన్న మురారిరావుకు 18వ శతాబ్దపు దక్షిణాపథ చరిత్రలో కీలకమైన స్థానమున్నది. మురారిరావు చాకచక్యమైన భాగస్వామిగా, తన స్వతంత్రతను కోల్పోకుండా మరాఠులతో వ్యవహారాలు సలిపాడు. 1940లో మురారిరావు జీవితాన్ని సమీక్షిస్తూ చరిత్రకారుడు గోవింద్ సఖారామ్ సర్దేశాయి "మరాఠా చరిత్రలో మురారిరావు లాంటి సాహసోపేతమైన రాజకీయ వ్యాసంగాన్ని మరేవ్వరూ కొనసాగించలేదు - ఆయన జీవితం మొత్తం అద్భుతమైన గెలుపులు, అనుకోని ఓటములు, నాటకీయ ఘట్టాలు, ముందుచూపుల్తో నిండిపోయిన ఒక మహోత్కృష్ట పోరాటం" అని తేల్చాడు.
(ఇంకా…)

3వ వారం
వందన శివ

వందన శివ (జననం 1952 నవంబరు 5) భారతీయ పండితురాలు, పర్యావరణ కార్యకర్త, ఆహార సార్వభౌమత్వ సమర్థకురాలు, ప్రపంచీకరణ వ్యతిరేకి, రచయిత్రి. ఆమె ఇరవైకి పైగా పుస్తకాలను రచించింది. ప్రపంచీకరణపై అంతర్జాతీయ సభలో (జెర్రీ మాండర్, రాల్ఫ్ నాడర్, జెరెమీ రిఫ్కిన్‌లు సహసభ్యులుగా గల ఇంటర్నేషనల్ ఫోరం ఆన్ గ్లోబలైజేషన్) ఒక నాయకురాలిగా ప్రపంచీకరణ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి. రాంచర్ ప్రైమ్ రాసిన వేద ఎకాలజీ పుస్తకం కొరకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె అనేక సాంప్రదాయ పద్ధతులకు అనుకూలంగా వాదించింది. 1993 లో సరియైన జీవనోపాధి (రైట్ లైవ్లీహుడ్) పురస్కారాన్ని అందుకుంది. వందన శివ వ్యవసాయం, ఆహార రంగాలలో పురోగతి గురించి విస్తృతంగా రచనలు చేసింది, ఉపన్యాసాలిచ్చింది. మేధో సంపత్తి హక్కులు, జీవ వైవిధ్యం, జీవ సాంకేతికం, జీవ నీతి, జన్యు ఇంజనీరింగ్ వంటి రంగాలలో ఆమె పోరాటాలు చేసింది. జన్యు ఇంజనీరింగ్ ద్వారా వ్యవసాయ అభివృద్ధికి వ్యతిరేకంగా వివిధ దేశాలలోని హరిత ఉద్యమ సంస్థలకు ఆమె సహాయం చేసింది.
(ఇంకా…)

4వ వారం
విశాఖపట్నం

విశాఖపట్నం భారత దేశంలోని ఆంధ్రప్రదేశ్‌ లో అతి పెద్ద నగరం, అదే పేరుగల జిల్లాకు కేంద్రం. బంగాళా ఖాతం ఒడ్డున గల ఈ నగరంలో భారత దేశపు నాలుగో పెద్ద ఓడరేవు, దేశంలోనే అతి పురాతన నౌకా నిర్మాణ కేంద్రం ఉన్నాయి. సముద్రం లోకి చొచ్చుకొని ఉన్న కొండ "డాల్ఫిన్ నోస్", అలల తాకిడిని తగ్గించి సహజ సిద్ధమైన నౌకాశ్రయానికి అనుకూలంగా వుంది. విశాఖపట్నానికి విశాఖ, వైజాగ్‌, వాల్తేరు అనే పేర్లు కూడా ఉన్నాయి. వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, సింహాచలం, బౌద్ధ విహారాల అవశేషాలున్న తొట్లకొండ, బావికొండ, పావురాల కొండ, బొజ్జన కొండ; సముద్రతీర ప్రాంతాలు, ఉద్యానవనాలు, ప్రదర్శనశాలలు ఇక్కడి ప్రముఖ పర్యాటక ఆకర్షణలు. భారత నౌకా దళ తూర్పు కమాండుకు విశాఖపట్నం ప్రధాన స్థావరం. 2019 లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వికేంద్రీకరణ లో భాగంగా అమరావతిని శాసన రాజధానిగా, విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా ప్రతిపాదించాడు.
(ఇంకా…)

5వ వారం
తుంగభద్ర

తుంగభద్ర నది కృష్ణా నదికి ముఖ్యమైన ఉపనది. రామాయణ కాలంలో పంపానదిగా పిలువబడిన తుంగభద్ర నది కర్ణాటకలో పడమటి కనుమలలో జన్మించిన తుంగ, భద్ర అను రెండు నదుల కలయిక వలన ఏర్పడినది. భౌగోళికంగానే కాకుండా చారిత్రకంగానూ ఈ నదికి ప్రాధాన్యత ఉంది. దక్షిణ భారతదేశ మధ్యయుగ చరిత్రలో వెలిసిన విజయనగర సామ్రాజ్యం ఈ నది ఒడ్డునే వెలిసింది. హంపి, మంత్రాలయం లాంటి పుణ్యక్షేత్రాలు ఈ నది ఒడ్డున వెలిశాయి. పెద్దలు తుంగభద్రను భారతదేశంలోని పంచగంగల్లో ఒకటిగా పేర్కొన్నారు.
(ఇంకా…)

6వ వారం
పిజ్జా

పిజ్జా ఇటలీలో పుట్టిన వంటకం. పులియబెట్టిన గోధుమ పిండిలో టొమాటోలు, చీజ్, అనేక ఇతర పదార్థాలను (వివిధ రకాల సాసేజ్‌లు, ఆంకోవీస్, పుట్టగొడుగులు, ఉల్లిపాయలు, ఆలివ్‌లు, కూరగాయలు, మాంసం, హామ్ వంటివి) వేసి దీన్ని తయారు చేస్తారు. సాంప్రదాయికంగా పుల్లల పొయ్యి ఓవెన్‌పై అధిక ఉష్ణోగ్రత వద్ద దీన్ని కాలుస్తారు. చిన్న సైజు పిజ్జాను పిజ్జెట్టా అని పిలవడం కద్దు. పిజ్జా తయారు చేసే వ్యక్తిని పిజ్జాయోలో అంటారు. ఇటలీలో, రెస్టారెంట్లలో పిజ్జాను ముక్కలు చేయకుండా ఇస్తారు. దాన్ని కత్తి ఫోర్కులతో తింటారు. ఇళ్ళలోను, అంతగా ఫార్మాలిటీ లేని చోట్లా అయితే, ముక్కలు చేసుకుని చేతితో పట్టుకొని తింటారు. పిజ్జా అనే పదం మొట్టమొదటగా 10వ శతాబ్దంలో ఇటలీ లోని కాంపానియా సరిహద్దులో ఉన్న లాజియోలో గేటా అనే పట్టణంలో లాటిన్ మాన్యుస్క్రిప్ట్‌లో నమోదైంది. ఆధునిక పిజ్జాను నేపుల్స్‌లో కనుగొన్నారు. ఈ వంటకం, దాని వివిధ రూపాలూ అనేక దేశాలలో ప్రజాదరణ పొందాయి. ఇది ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఆహారాలలో ఒకటిగా మారింది. ఐరోపా, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియాల్లో ఇదొక సాధారణ ఫాస్ట్ ఫుడ్ అంశంగా మారింది; పిజ్జేరియాలు (పిజ్జాలో ప్రత్యేకత కలిగిన రెస్టారెంట్లు), మధ్యధరా వంటకాలను అందించే రెస్టారెంట్లు, ఇంటికే తెచ్చి ఇవ్వడం ద్వారా, వీధి ఆహారంగా కూడా ఇవి అందుబాటులో ఉంటాయి. వివిధ ఆహార సంస్థలు రెడీ-బేక్డ్ పిజ్జాలను విక్రయిస్తాయి, వీటిని ఇంట్లోనే ఓవెన్‌లో తిరిగి వేడి చేసుకుని తినవచ్చు.
(ఇంకా…)

7వ వారం
స్టాక్ మార్కెట్

స్టాక్ మార్కెట్ లేదా షేర్ మార్కెట్ అనేది వ్యాపారసంస్థల్లోని వాటాల కొనుగోలు, అమ్మకాలు జరిపే విక్రేతల, కొనుగోలుదారుల సముదాయము. ఈ వాటాలు వ్యాపారంలో భాగస్వామ్యాన్ని సూచిస్తాయి. వీటిలో పబ్లిక్ స్టాక్ ఎక్స్చేంజిలో నమోదయ్యే సెక్యూరిటీలు, అలాగే ప్రైవేట్‌గా మాత్రమే ట్రేడ్ చేయబడే షేర్ల వంటివి ఉండవచ్చు. స్టాక్ ఎక్స్చేంజిలు స్టాక్ మార్కెట్లో ఒక ముఖ్యమైన భాగం. వ్యక్తిగత మదుపరులు, సంస్థాగత మదుపర్లు, హెడ్జ్ ఫండ్లు మొదలైనవారంతా స్టాక్ మార్కెట్ లో భాగస్వాములు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు చాలా తరచుగా స్టాక్ బ్రోకరేజ్‌లు, ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ మాధ్యమాల ద్వారా జరుగుతాయి. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతాయి. ఐరోపాలో 13 వ శతాబ్దం నుంచే ఈ స్టాక్ మార్కెట్లు అందుబాటులో ఉన్నాయి. 1980లో ప్రపంచ బహిరంగ మార్కెట్లో ఉన్న షేర్ల మార్కెట్ విలువ 2.5 ట్రిలియన్ అమెరికన్ డాలర్లు ఉండగా 2020 చివరి నాటికి వాటి విలువ 93.7 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేరింది. అతిపెద్ద స్టాక్ మార్కెట్ అమెరికా సంయుక్త రాష్ట్రాల లోని న్యూయార్క్ నగరంలోని ఎన్.వై.ఎస్.ఈ (NYSE). ప్రపంచంలో ముఖ్యమైన స్టాక్ మార్కెట్లు, లండన్, ఆమ్‌స్టర్‌డామ్, ప్యారిస్, ఫ్రాంక్‌ఫర్ట్, హాంగ్ కాంగ్, సింగపూర్, టోక్యోల్లో ఉన్నాయి. ఇంకా ప్రతి అభివృద్ధి చెందుతున్న దేశాలన్నింటిలో ఈ స్టాక్ మార్కెట్లు ఉన్నాయి. భారత దేశపు స్టాక్ మార్కెట్ లో రెండు ముఖ్యమైన స్టాక్ ఎక్ఛేంజీలు రెండు ఉన్నాయి. అవి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE), జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ (NSE). వీటి సూచీలను సెన్సెక్స్, నిఫ్టీ అని అంటారు.
(ఇంకా…)

8వ వారం
చిత్రలేఖన చరిత్ర

చిత్రలేఖన చరిత్ర అనగా చిత్రలేఖనం యొక్క చరిత్ర. ప్రపంచం లోనే (ఇప్పటివరకు తెలిసిన) మొట్టమొదటి చిత్రలేఖనాల నుండి నేటి వరకు వివిధ కళాఖండాలు, పలువురు చిత్రలేఖకులు, వీరి ఈ చిత్రలేఖనం వెనుక ఉన్న వాస్తవాలు వంటి వాటిని చర్చించే అంశం. చిత్రలేఖన చరిత్ర వివిధ సంస్కృతులు, భౌగోళిక ఖండాలు, శతాబ్దాల గుండా ప్రయాణిస్తూ 21వ శతాబ్దం వరకూ చేరుకొంటుంది. కొన్ని దశాబ్దాల క్రితం పాశ్చాత చిత్రలేఖనం లో, తూర్పు భౌగోళిక చిత్రలేఖనంలో అభివృద్ధి సమాంతరంగా ఉండేది. ఆఫ్రికన్ చిత్రకళ, యూదుల చిత్రకళ, ఇస్లామిక్ చిత్రకళ, ఇండోనేషియన్ చిత్రకళ, భారతీయ చిత్రకళ, చైనీస్ చిత్రకళ, జపనీస్ చిత్రకళ అన్ని పాశ్చాత చిత్రకళ పై, పాశ్చాత్య చిత్రకళ తిరిగి వీటన్నిటి పై ప్రభావం చూపింది. మధ్య యుగాల నుండి రినైజెన్స్ వరకు చిత్రకారులు చర్చి లకు, ధనిక వర్గాలకు పని చేసేవారు. కళ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని తత్వవేత్తలు నిర్వచించటం మొదలు అయ్యింది. 19వ శతాబ్దం ప్రారంభంలో ఫ్రెంచి తత్వవేత్త విక్టర్ కజిన్ l’art pour l’art (Art for art's sake) నినాదాన్ని తీసుకువచ్చాడు. ఈ నినాదంతో కళను కేవలం సౌందర్యాన్ని సృష్టించటానికి, కళాదృష్టితో చూడాలి తప్పితే, కళకు సైద్ధాంతికంగా గానీ, నైతికంగా గానీ, సాంఘికంగా గానీ, రాజకీయపరంగా గానీ ఎటువంటి సమర్థన ఉండనవసరం లేదని తెలిపాడు.
(ఇంకా…)

9వ వారం
వెంకటరామన్ రామకృష్ణన్

వెంకి రామకృష్ణన్ లేక వెంకటరామన్ రామకృష్ణన్ ప్రఖ్యాత నోబెల్ పురస్కారము పొందిన జీవరసాయన శాస్త్రజ్ఞుడు. తమిళనాడు లోని చిదంబరంలో 1952 సంవత్సరములో జన్మించాడు. తండ్రి ఉద్యోగరీత్యా గుజరాత్ కు వెళ్ళడంతో బాల్యం, విద్యాభ్యాసమంతా బరోడాలో గడిచింది. మహారాజా శాయాజీరావు విశ్వవిద్యాలయంలో బీయస్సీ ఫిజిక్స్ చదివాడు. తర్వాత అమెరికా వెళ్ళి భౌతికశాస్త్రంలో పీహెచ్‌డీ చేసి అక్కడే స్థిరపడ్డాడు; రైబోసోముల రూపము ధర్మములపై చేసిన పరిశోధనలకు గాను రసాయన శాస్త్రములో 2009 నోబెల్ పురస్కారము లభించింది. 2010లో భారత ప్రభుత్వం ఈయనను పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించింది.
(ఇంకా…)

10వ వారం
శాసనోల్లంఘన ఉద్యమం

భారత స్వాతంత్ర్యోద్యమంలో శాసనోల్లంఘన ఉద్యమం ఒక ప్రధాన ఘట్టం. ఈ ఉద్యమం కాంగ్రెసు పార్టీ నాయకత్వంలో 1930 మార్చిలో మొదలై, 1934 వరకూ సాగింది. ఉద్యమానికి నేతృత్వం వహించే బాధ్యతను కాంగ్రెసు పార్టీ మహాత్మా గాంధీకి అప్పగించింది. భారతదేశానికి అధినివేశ ప్రతిపత్తి కల్పించే విషయంలో బ్రిటిషు ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబించి, నిర్ణయం తీసుకోవడంలో కాలయాపన విధానాలను అవలంబించింది. దాంతో కాంగ్రెసు నాయకులు ఆశాభంగం చెంది ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. ఆ కార్యాచరణలో భాగమే శాసనోల్లంఘన.

ప్రజా క్షేమం దృష్ట్యా బ్రిటిషు ప్రభుత్వం తీసుకోవాల్సిన 11 కనీస చర్యలను ప్రకటించి, ఆ చర్యలు తీసుకోకపోతే, శాసనోల్లంఘన చెయ్యక తప్పదని గాంధీ, 1930 జనవరి 31 న యంగ్ ఇండియా పత్రికలో ప్రకటించాడు. ఉద్యమంలో భాగంగా చేపట్టవలసిన పలు కార్యక్రమాలను గాంధీ నిర్దేశించాడు. ఆ కార్యక్రమాల నన్నిటినీ అహింసా పద్ధతిలో జరగాలని కూడా అతడు నిర్దేశించాడు. ఉద్యమ కార్యక్రమంలో ప్రధానమైన అంశం ఉప్పు సత్యాగ్రహం. ఇతర కార్యక్రమాల్లో విదేశీ వస్త్ర దుకాణాల వద్ద పికెటింగు, మద్యం దుకాణాల వద్ద పికెటింగు, సారా దుకాణాల వేలం పాటలు జరిగే చోట పికెటింగు, బ్రిటిషు వస్తు బహిష్కరణ, పన్నుల ఎగవేత, అటవీ పరిరక్షణ చట్టాల అతిక్రమణ, కల్లు తీసే తాడి, ఈత చెట్లను నరకడం వంటివి ఉన్నాయి. అంతకు మునుపెన్నడూ లేని విధంగా మహిళలు పెద్దయెత్తున పాల్గొనడం ఈ ఉద్యమ ప్రత్యేకత.
(ఇంకా…)

11వ వారం
కొమ్మమూరు కాలువ

కొమ్మమూరు కాలువ ఆంధ్రప్రదేశ్‌, గుంటూరు జిల్లాలో దుగ్గిరాల నుండి బాపట్ల జిల్లా, పెదగంజాం వరకు ప్రవహించే పంట కాలువ. దీన్ని ఆంగ్లేయులు, 19 వ శతాబ్దంలో తవ్వించారు. దీని పొడవు 91 కిలోమీటర్లు. ఒకప్పుడు ఇది నౌకా రవాణా మార్గంగా విలసిల్లింది. కాకినాడ నుండి మద్రాసు (చెన్నై) వరకు ఉన్న జల మార్గం లోని కాలువల్లో ఇది ఒకటి. మిగతావి కాకినాడ కాలువ, ఏలూరు కాలువ, బకింగ్‌హాం కాలువ. భారత ప్రభుత్వం చేపట్టిన జాతీయ జలమార్గాల ప్రాజెక్టు లోని జలమార్గం 4 లో కొమ్మమూరు కాలువ ఒక భాగం. 1855 లో కృష్ణా బ్యారేజిని నిర్మించిన తరువాత ఈ కాలువ నిర్మాణం పూర్తైంది. సాగునీటిని అందించడంతో పాటు, నౌకా రవాణా మార్గంగా కూడా ఇది ఉపయోగపడింది.
(ఇంకా…)

12వ వారం
తెలుగు నాటకరంగం

నాటకం అనేది ఒక శ్రవణ సహిత దృశ్యరూపకం. జానపద కళలు విలసిల్లుతున్న రోజులలో, రాజుల పరిపాలనా కాలంలో ప్రజల వినోదం కోసం అత్యధికంగా ఆదరింపబడిన కళ నాటకం. నాటకం సంగీతం, పాటలు, నృత్యాలతో కూడుకొన్న ప్రక్రియ. యక్షగానానికి రూపాంతరమైన నాటకానికి సూత్రధారుడే ఆయువుపట్టు. ఇందులోని పాత్రలన్నీ తమను తామే పరిచయం చేసుకొంటూ రంగప్రవేశం చేస్తాయి.

పదహారవ శతాబ్దంలో ప్రారంభమైన నాటక ప్రక్రియను చిందు భాగవతము యక్షగాన నాటకం, వీధి భాగవతం, బయలాట అనీ పిలుస్తారు. వీధి నాటకాలను ఎక్కువ ప్రచారంలోకి తెచ్చినవారు కూచిపూడి భాగవతులు. కాకతీయుల కాలంలో ప్రదర్శించిన క్రీడాభిరామం కూడా ఒక నాటకమే. తెలుగు నాటకరంగ చరిత్ర, తెలుగులో ఆదికవిగా పేరుగాంచిన నన్నయ్య తన భారత అవతారికలో రసాన్విత కావ్యనాటకముల్ పెక్కుజూచితి అనడాన్ని బట్టి, నన్నయ కాలానికి నాటక ప్రదర్శనలుండేవని అర్ధం చేసుకోవచ్చు.
(ఇంకా…)

13వ వారం
సిమ్లా

సిమ్లా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని నగరం. అదే పేరుతో ఉన్న జిల్లాకు ముఖ్య పట్టణం. ఈ నగరం ఆపిల్ తోటలకు ప్రసిద్ధి. ఇది ఆంగ్లేయులకు భారతదేశపు వేసవి రాజధానిగా ఉండేది. భారతదేశంలో పెద్ద, అభివృద్ధి చెందుతున్న నగరంగా సిమ్లాకు గుర్తింపు ఉంది. కళాశాలలు, పరిశోధనా సంస్థలకు ఇది నెలవు. తుడోర్ బెతన్, నియో-గోతిక్ నిర్మాణాలలో వలసరాజ్యాల కాలం నాటి అనేక భవనాలకూ, ఎన్నో దేవాలయాలకూ, చర్చిలకు సిమ్లా నెలవు. ఈ కట్టడాలతో పాటు, నగరం యొక్క సహజ వాతావరణం పర్యాటకులను ఆకర్షిస్తాయి. శ్రీ హనుమాన్ జాఖు ఆలయం, వైస్రెగల్ లాడ్జ్, క్రైస్ట్ చర్చి, మాల్ రోడ్, ది రిడ్జ్ ఇంకా అన్నాడేల్ నగర కేంద్ర ప్రధాన ఆకర్షణలు. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన కల్కా-సిమ్లా రైల్వే మార్గం కూడా ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణ. ఇది బ్రిటిష్ కాలంలో నిర్మించబడింది. ఎత్తైన భూభాగం కారణంగా ఇక్కడ పర్వత బైకింగ్ రేసు (ఎంటిబి హిమాలయ) జరుగుతుంది. 2005 లో ప్రారంభమైన ఈ రేసును దక్షిణ ఆసియాలో ఈ రకమైన అతిపెద్ద కార్యక్రమంగా పరిగణిస్తారు.
(ఇంకా…)

14వ వారం
ఇథనాల్

ఇథనాల్ ఒక సేంద్రియ రసాయన సమ్మేళనం. దీన్ని ఇథైల్ ఆల్కహాల్, గ్రెయిన్ ఆల్కహాల్, తాగే మద్యం లేదా ఆల్కహాల్ అని కూడా పిలుస్తారు. ఇది C2H6O అనే రసాయన సూత్రం కలిగిన సాధారణ ఆల్కహాల్. దీని సూత్రాన్ని CH
3
CH
2
OH అని గానీ లేదా C
2
H
5
OH
అని గానీ కూడా రాయవచ్చు (హైడ్రాక్సిల్ సమూహానికి అనుసంధానించబడిన ఇథైల్ సమూహం). దీనిని EtOH అని సంక్షిప్తంగా అంటూ ఉంటారు. ఇథనాల్ ఒక అస్థిరమైన, మండే, రంగులేని ద్రవం. దీనికి వైన్ లాంటి వాసన, ఘాటైన రుచి ఉంటుంది. ఇది ఒక సైకోయాక్టివ్ డ్రగ్, రిక్రియేషనల్ డ్రగ్, ఆల్కహాలిక్ డ్రింక్స్‌లో క్రియాశీల పదార్థం. ఇథనాల్‌ను సహజంగా ఈస్ట్‌ల ద్వారా చక్కెరలను పులియబెట్టి తయారు చేస్తారు. లేదా ఇథిలీన్ హైడ్రేషన్ వంటి పెట్రోకెమికల్ ప్రక్రియల ద్వారా ఉత్పత్తి చేయవచ్చు. ఇది క్రిమినాశక, క్రిమిసంహారిణిగా కూడా పనిచేస్తుంది. రసాయన ద్రావకం గాను, కర్బన సమ్మేళనాల సంశ్లేషణలోనూ దీన్ని ఉపయోగిస్తారు. ఇథనాల్ ఒక ఇంధన వనరు. ఇథనాల్‌ను డీహైడ్రేట్ చేసి ఇథిలీన్‌ను తయారు చేయవచ్చు. ఇది ఒక ముఖ్యమైన రసాయన ఫీడ్‌స్టాక్.
(ఇంకా…)

15వ వారం
ఆర్కిమెడిస్

ఆర్కిమెడిస్  ( సుమారు 287 –  212 BC ) గ్రీకు గణిత శాస్త్రవేత్త, భౌతిక శాస్త్రవేత్త, ఇంజనీర్, ఆవిష్కర్త, ఖగోళ శాస్త్రవేత్త. అతని జీవితానికి సంబంధించిన కొన్ని వివరాలు తెలిసినప్పటికీ, అతను శాస్త్రీయ పురాతన కాలంలోని ప్రముఖ శాస్త్రవేత్తలలో ఒకనిగా పరిగణించబడ్డాడు. పురాతన కాలం నాటి గొప్ప గణిత శాస్త్రజ్ఞునిగా ఆర్కిమెడిస్ ప్లవన సూత్రాలను నిర్దేశించాడు. కప్పీలను రూపొందించి వాటి ఆధారంతో ఎక్కువ బరువు ఉన్న వస్తువులనైనా సునాయాసంగా లాగ వచ్చని తెలియజేసాడు. అతను "పై" విలువను కచ్చితంగా లెక్కించాడు. వృత్తంపరిధి, చుట్టుకొలతను నిర్ణయించేందుకు సూత్రాలను కనిపెట్టాడు. జల యంత్రాలు, యుద్ధ యంత్రాలు మొదలైన వాటిని ఎన్నింటినో రూపొందించాడు. నిలువెత్తు అద్దాలతో సూర్యుని వేడి కిరణాలను రోమన్ నౌకల మీదికి పరావర్తనం ద్వారా పంపించి ఆ నౌకలను మడుకునేటట్లు అతని చేసాడని కొందరు చెబుతారు.

గణితశాస్త్ర పరంగా అతను సాధించిన విజయాలలో పై విలువను కచ్చితంగా నిర్ణయించడం, అతని పేరుతో "ఆర్కిమెడియన్ వర్తులం"ను నిర్వచించడం, పెద్ద సంఖ్యలను నిర్ణయించడానికి ఘాతాలను ఉపయోగించే వ్యవస్థను రూపొందించడం ముఖ్యమైనవి. ద్రవస్థితి శాస్త్రం, స్థితిశాస్త్రము, కప్పీ సూత్రము వంటి భౌతిక శాస్త్ర దృగ్విషయాలకు గణిత శాస్త్ర సూత్రాలనుపయోగించి వివరించిన మొదటి శాస్త్రవేత్తగా గుర్తింపు పొందాడు. స్క్రూ పంపు, మిశ్రమ కప్పీలు, తన దేశమైన సిరక్యుస్ ను రక్షించేందుకు రూపొందించిన యుద్ధ యంత్రాలు అతను చేసిన ఆవిష్కరణలో ముఖ్యమైనవి.
(ఇంకా…)

16వ వారం
లోక్‌సభ

భారత పార్లమెంటు (హిందీ:संसद) లో దిగువ సభను లోక్‌సభ (ఆంగ్లం: Loksabha) అంటారు. లోక్‌సభ సభ్యులను ప్రజలే ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. ప్రజల ప్రత్యక్ష ప్రాతినిధ్యం ఉండే సభ కనుక ఇది ప్రజల సభ (House of the People) అయింది. పార్లమెంటులోని రాజ్యసభను ఎగువ సభ అని అంటారు. రాజ్యాంగం ప్రకారం లోక్‌సభలో గరిష్ఠంగా 550 (1950 లో ఇది 500) మంది సభ్యులు ఉండవచ్చు. ప్రస్తుతం లోక్‌సభలో 543 మంది ప్రజలచేత ఎన్నుకోబడిన సభ్యులు ఉన్నారు. వీరిలో 530 మంది రాష్ట్రాల నుండి, 13 మంది కేంద్రపాలిత ప్రాంతాల నుండి ఎన్నికైనవారు. లోక్‌సభ సభ్యులను ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలను సార్వత్రిక ఎన్నికలు (General Elections) అంటారు. వోటర్ల సంఖ్య రీత్యా, ఎన్నికల పరిమాణం రీత్యా భారత సార్వత్రిక ఎన్నికలు ప్రపంచంలోనే అత్యంత భారీ ఎన్నికలు.
(ఇంకా…)

17వ వారం
చాళుక్యులు

చాళుక్యులు సా.శ. 6 - 12 శతాబ్దాల మధ్య దక్షిణ భారతదేశంలో చాలా భాగం, మధ్య భారతదేశంలో కొంతవరకు పరిపాలించిన రాజవంశం. ఈ కాలంలో వీరు ఒకదానితో ఒకటి సంబంధం కలిగిన మూడు ప్రత్యేక వంశాలుగా పరిపాలన చేశారు. చాళుక్యులలో అన్నింటికన్నా ప్రాచీనమైన వారు సా.శ 6వ శతాబ్దం మధ్య, వాతాపి (ప్రస్తుతం బాదామి) కేంద్రంగా పరిపాలించిన బాదామి చాళుక్యులు. వీరు ప్రస్తుతం కర్ణాటకలోని సిర్సి సమీపంలో ఉన్న బనవాసి కేంద్రంగా పరిపాలించిన కదంబ రాజ్యం క్షీణించినప్పుడు తమ స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నారు. రెండవ పులకేశి పాలనలో వేగంగా ప్రాముఖ్యతను సంతరించుకున్నారు. రెండవ పులకేశి మరణించిన తర్వాత తూర్పు దక్కను ప్రాంతాన్ని పరిపాలించే తూర్పు చాళుక్యులు స్వతంత్య్ర రాజ్యంగా ఏర్పడ్డారు. వీరు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వేంగి ప్రాంతం కేంద్రంగా 11వ శతాబ్దం దాకా పరిపాలించారు. పశ్చిమ దక్కను ప్రాంతంలో 8వ శతాబ్దం మధ్యలో రాష్ట్రకూటుల ప్రాబల్యంతో బాదామి చాళుక్యుల ప్రాభవం మసక బారింది. అయితే వారి వారసులైన పశ్చిమ చాళుక్యులు 10వ శతాబ్దం చివరి నాటికి మళ్ళీ బలం పుంజుకున్నారు. వీరు కళ్యాణి (ప్రస్తుతం కర్ణాటకలోని బసవకల్యాణ్) ప్రాంతం నుంచి సుమారు 12వ శతాబ్దం దాకా పరిపాలించారు.
(ఇంకా…)

18వ వారం
బి. ఆర్. అంబేద్కర్

భీంరావ్ రాంజీ అంబేద్కర్ (1891 ఏప్రిల్ 14 - 1956 డిసెంబరు 6) ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. ఇతను అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు. అతను స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి, రాజ్యాంగ శిల్పి. ఇతను కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి., లండన్ విశ్వవిద్యాలయం నుండి డి.ఎస్.సి (డాక్టరేట్) పట్టాలను పొంది చాలా అరుదైన గౌరవాన్ని సంపాదించాడు. న్యాయ, సామాజిక, ఆర్థిక శాస్త్రాలలో పరిశోధనలు చేశాడు. మొదట్లో న్యాయవాదిగా, అధ్యాపకుడిగా, ఆర్థికవేత్తగా పనిచేశాడు. తరువాత భారతదేశ స్వాతంత్ర్యం, పత్రికల ప్రచురణ, దళితుల సామాజిక రాజకీయ హక్కులు, భారతదేశ రాజ్యాంగ వ్యవస్థాపన కోసం కృషి చేశాడు. 1956లో ఇతను బౌద్ధ మతాన్ని స్వీకరించడంతో దళితులు సామూహికంగా బౌద్ధంలోకి మత మార్పిడి చేసుకున్నారు. 1990లో భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నను ఇతనికి మరణాంతరం ప్రకటించింది. భారతదేశ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిన నాయకుడు.
(ఇంకా…)

19వ వారం
సిరియస్ నక్షత్రం

సిరియస్ అనేది సూర్యుని నుంచి 8.6 కాంతి సంవత్సరాల దూరంలో వున్న ఒక జంట నక్షత్ర వ్యవస్థ (Visual Binary System). దీనిలో సిరియస్-A , సిరియస్-B అనే రెండు నక్షత్రాలు వున్నాయి. టెలిస్కోప్ నుంచి చూస్తేనే సిరియస్ కి ఈ రెండు నక్షత్రాలున్నట్లు కనపడుతుంది. మామూలు కంటితో చూస్తే మాత్రం సిరియస్ ఒంటరి నక్షత్రంగానే కనిపిస్తుంది. భూమి మీద నుంచి చూస్తే ఆకాశంలో రాత్రిపూట కనిపించే నక్షత్రాలలో అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం ఈ సిరియస్ నక్షత్రమే. తెల్లని వజ్రంలా ప్రకాశించే ఈ నక్షత్ర దృశ్య ప్రకాశ పరిమాణం – 1.46. కానిస్ మేజర్ (బృహల్లుబ్దకం) అనే నక్షత్రరాశిలో కనిపించే ఈ నక్షత్రాన్ని బేయర్ నామకరణ పద్దతిలో Alpha Canis Majoris (α CMa) గా సూచిస్తారు. ఈ తారనే డాగ్ స్టార్ (Dog Star), మృగవ్యాధ రుద్రుడు అని కూడా వ్యవహరిస్తారు. సిరియస్ అనే జంట నక్షత్ర సముదాయంలో ఒకటి మహోజ్వలమైన నక్షత్రం (సిరియస్-A) కాగా మరొకటి కాంతివిహీనంగా కనిపించే వైట్ డ్వార్ఫ్ నక్షత్రం (సిరియస్-B). మహోజ్వలంగా మెరిసే సిరియస్ A నక్షత్రం తన పరిణామ దశలో ‘ప్రధాన క్రమం’ (Main Sequence) లో వున్న నక్షత్రం. A1V వర్ణపట తరగతికి చెందిన నీలి-తెలుపు (Blue-White) వర్ణనక్షత్రం. ఇది సూర్యునికంటే వ్యాసంలో 1.71 రెట్లు పెద్దది, తేజస్సు (Luminosity) లో సుమారుగా 25 రెట్లు పెద్దది. ఇకపోతే సిరియస్ B నక్షత్రం కాంతివిహీనంగా వున్న ఒక చిన్న నక్షత్రం. ఇది సూర్యుని కంటే వ్యాసంలో సుమారు 120 రెట్లు చిన్నది. భూమి కంటె కొద్దిగా చిన్నది. ఇది వైట్ డ్వార్ఫ్ (శ్వేత కుబ్జతార) నక్షత్రం. ఈ జంట నక్షత్ర వ్యవస్థ యొక్క వయస్సు సుమారు 20 నుంచి 30 కోట్ల సంవత్సరాల మధ్య ఉంటుంది.
(ఇంకా…)

20వ వారం
భారతదేశంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం

ప్రజా ప్రయోజన వ్యాజ్యం (Public interest litigation - PIL, పిల్) అనేది ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకు చేపట్టే వ్యాజ్యం. ఇది సామాజికంగా వెనుకబడిన పక్షాలకు న్యాయం అందుబాటులోకి తెస్తుంది. దీనిని జస్టిస్ పి.ఎన్ భగవతి ప్రవేశపెట్టారు. ఇది లోకస్ స్టాండి సాంప్రదాయ నియమానికి సడలింపు. 1980లకు ముందు భారత న్యాయవ్యవస్థ లోని కోర్టులు ప్రతివాది ద్వారా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావితమైన పక్షాల నుండి మాత్రమే వ్యాజ్యాన్ని స్వీకరించేవి. ఇవి తమ అసలు అధికార పరిధిలోని కేసులను మాత్రమే విచారించడం, నిర్ణయించడం జరిగేది. అయితే పిల్ వచ్చిన తరువాత సుప్రీంకోర్టు, ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఆధారంగా కూడా కేసులను అనుమతించడం ప్రారంభించింది, అంటే కేసులో ప్రత్యక్షంగా ప్రమేయం లేని వ్యక్తులు కూడా ప్రజా ప్రయోజన విషయాలను కోర్టుకు తీసుకురావచ్చు. పిల్ దరఖాస్తును స్వీకరించడం న్యాయస్థానపు హక్కు.
(ఇంకా…)

21వ వారం
సెరెంగెటి

సెరెంగెటి, ఉత్తర టాంజానియా, నైరుతి కెన్యాల్లో విస్తరించి ఉన్న భౌగోళిక ప్రాంతం. ఇదొక ప్రత్యేక పర్యావరణ వ్యవస్థ, వన్యప్రాణి సంరక్షిత ప్రాంతం. దీని వైశాల్యం సుమారు 30,000 చ.కి.మీ. ఉంటుంది. సెరెంగెటి నేషనల్ పార్కుతో సహా, అనేక వన్యప్రాణి సంరక్షక ప్రాంతాలు సెరెంగెటిలో ఉన్నాయి. ప్రపంచంలో కెల్లా రెండవ అత్యంత విస్తృతమైన క్షీరదాల వలస ఏటా సెరెంగెటిలో జరుగుతుంది. ఆఫ్రికాలోని ఏడు సహజ అద్భుతాలలో ఒకటిగా సెరెంగెటి రూపొందడానికి ఈ వలస ఒక కారణం. ప్రపంచంలోని పది ప్రకృతి సహజ ప్రయాణ అద్భుతాలలో సెరెంగెటి ఒకటి. టాంజానియాలోని సెరెంగెటి జిల్లా సెరెంగెటిలో భాగమే. సెరెంగెటి, సింహాలకు ప్రసిద్ది. సింహాల గుంపులను వాటి సహజ వాతావరణంలో చూసేందుకు వీలైన అత్యుత్తమమైన ప్రదేశాల్లో సెరెంగెటి ఒకటి. సుమారు 70 పెద్ద క్షీరదాలు, 500 పక్షి జాతులు కూడా ఇక్కడ కనిపిస్తాయి. నదీతీర అడవులు, చిత్తడినేలలు, కోప్‌జేలు, గడ్డిభూములు, చిట్టడవుల వంటి ప్రకృతి వైవిధ్యం, ఈ జీవవైవిధ్యానికి కారణం. బ్లూ వైల్డెబీస్ట్‌లు, గాజెల్‌లు, జీబ్రాలు, ఆఫ్రికా గేదెలు ఈ ప్రాంతంలో సాధారణంగా కనిపించే పెద్ద క్షీరదాలు. సెరెంగెటిని మాసాయిలాండ్ అని కూడా పిలుస్తారు. మాసాయిలకు వీరయోధులనే పేరుంది. వీరు అనేక అడవి జంతువులతో పాటు జీవిస్తారు. కానీ ఆ జంతువులను, పక్షులను తినడానికి ఇచ్చగించరు. ఆహారం కోసం వారు పశువులపై ఆధారపడతారు.
(ఇంకా…)

22వ వారం
వినాయక్ దామోదర్ సావర్కర్

వినాయక్ దామోదర్ సావర్కర్ (1883 మే 28 - 1966 ఫిబ్రవరి 26) భారత రాజకీయ నాయకుడు, కార్యకర్త, రచయిత. ఈయన 1922 లో రత్నగిరి కారాగారంలో ఉండగా హిందూత్వ అనే రాజకీయ హిందూ జాతీయవాదాన్ని అభివృద్ధి చేశాడు. హిందు మహాసభ ఏర్పాటులో ఈయన కీలక సభ్యుడు. తన ఆత్మకథ రాసినప్పటి నుంచి ఆయన పేరు ముందు వీర్ అనే పదాన్ని వాడటం ప్రారంభించాడు. హిందూ మహాసభలో చేరిన తర్వాత హిందువులనందరినీ భారతీయత పేరు మీదుగా ఏకతాటిపైకి తెచ్చేందుకు హిందూత్వ అనే పదాన్ని వాడాడు. సావర్కర్ నాస్తికుడు.

సావర్కర్ ఉన్నత పాఠశాల విద్యార్థిగా ఉండగానే తన రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించాడు. పుణె లోని ఫెర్గూసన్ కళాశాలలో కూడా వీటిని కొనసాగించాడు. ఇతను తన సోదరుడితో కలిసి రహస్యంగా అభినవ భారత్ సొసైటీ అనే సంస్థను స్థాపించాడు. తర్వాత తన న్యాయవిద్య కోసం యుకెకి వెళ్ళినపుడు అక్కడ ఇండియా హౌస్, ఫ్రీ ఇండియా సొసైటీ సంస్థ కార్యకలాపాల్లో పాల్గొనడం ప్రారంభించాడు. విప్లవం ద్వారా భారతదేశం సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని పొందాలని పుస్తకాలు రాశాడు. 1857 ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామాన్ని గురించి ఈయన రాసిన ది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనే పుస్తకాన్ని బ్రిటిష్ వారు నిషేధించారు.
(ఇంకా…)

23వ వారం
తూర్పు చాళుక్యులు

ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతాన్ని సా.శ 7 - 12 శతాబ్దాల మధ్య పరిపాలించిన రాజవంశం తూర్పు చాళుక్యులు. వారు దక్కన్ ప్రాంతంలోని బాదామి చాళుక్యుల సామంతులుగా తమ పాలన మొదలుపెట్టారు. తదనంతరం సార్వభౌమ శక్తిగా మారారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లోని పెదవేగి అప్పట్లో వారి రాజధాని వేంగి. దాని పేరు మీదుగానే వారికి వీరికి వేంగి చాళుక్యులు అనే పేరు కూడా వచ్చింది. వీరు ఈ ప్రాంతాన్ని సా.శ. 1130 వరకూ పాలించారు. సా.శ 1189 వరకు వారు ఈ ప్రాంతాన్ని చోళుల సామంతులుగా పాలించారు. రాజధాని వేంగి నగరాన్ని కొంతకాలం పరిపాలించిన తరువాత రాజమహేంద్రవరానికి (ఆధునిక రాజమండ్రి ) తరలించారు. వ్యూహాత్మకంగా ప్రాముఖ్యత ఉన్న వేంగీ దేశంపై నియంత్రణ కోసం బలవంతులైన చోళులకు పశ్చిమ చాళుక్యులకూ మధ్య అనేక యుద్ధాలు జరిగాయి. వేంగిలో ఐదు శతాబ్దాల పాటు సాగిన తూర్పు చాళుక్య పాలన వలన ఈ ప్రాంతం మొత్తాన్నీ ఏకీకృతం చేయడమే కాకుండా, వారి పాలన యొక్క తరువాతి భాగంలో తెలుగు సంస్కృతి, సాహిత్యం, కవిత్వం, కళలు అభివృద్ధి చెందాయి. తూర్పు చాళుక్య ప్రభువైన రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో ఉన్న నన్నయ భట్టారకుడు శ్రీమదాంధ్ర మహాభారతాన్ని రచించాడు.
(ఇంకా…)

24వ వారం
ఎ. ఆర్. రెహమాన్

ఎ. ఆర్. రెహమాన్ పేరుతో పేరుగాంచిన అల్లా రఖా రెహమాన్ (జ.6 జనవరి 1967) భారతీయ సంగీత దర్శకుడు, స్వరకర్త, గాయకుడు, గీత రచయిత, నిర్మాత, సంగీతకారుడు, దాత. రెహమాన్ జన్మనామం ఎ. ఎస్. దిలీప్ కుమార్. తండ్రి నుంచి సంగీత వారసత్వం పుచ్చుకున్న రెహమాన్ చిన్నతనంలో తండ్రి మరణంతో కుటుంబాన్ని పోషించడానికి పలువురు సంగీత దర్శకుల దగ్గర సహాయకుడిగా పనిచేశాడు. వాణిజ్య ప్రకటనలకు సంగీతం సమకూర్చాడు. తర్వాత మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన రోజా చిత్రానికి కూర్చిన సంగీతంతో మంచి పేరు వచ్చింది. మొదటి సినిమాతోనే ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ పురస్కారం దక్కింది. రెహమాన్ గీతాలు తూర్పుదేశాలకు చెందిన శాస్త్రీయ సంగీతాన్ని (ముఖ్యంగా భారతీయ శాస్త్రీయ సంగీతం) ప్రపంచ సంగీతం, ఎలక్ట్రానిక్ సంగీతం, సంప్రదాయ ఆర్కెస్ట్రా అరేంజ్మెంట్లనూ మేళవించే శైలికి పేరొందాయి. ఆయన పొందిన పురస్కారాల్లో రెండు ఆస్కార్ అవార్డులు, రెండు గ్రామీ పురస్కారాలు, ఒక బిఎఎఫ్‌టిఎ పురస్కారం, ఒక గోల్డెన్ గ్లోబ్ పురస్కారం, నాలుగు జాతీయ చలనచిత్ర పురస్కారాలు, పదిహేను ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు, పదమూడు ఫిల్మ్ ఫేర్ సౌత్ పురస్కారాలు ఉన్నాయి.
(ఇంకా…)

25వ వారం
2008 భారత పాకిస్తాన్ ప్రతిష్ఠంభన

2008 ముంబై ఉగ్రవాద దాడులకు, పాకిస్తాన్, దాని ISI లే కారణమని భారతదేశం విశ్వసించింది. దీనివలన కొంత కాలం పాటు రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. భారతదేశంలో కూడా పాకిస్తాన్ వ్యతిరేక సెంటిమెంట్ పెరిగింది. దీని వలన అమెరికాతో సహా చాలా దేశాలు దీనిపై విచారణకు పిలుపునిచ్చాయి. భారత పాకిస్తాన్‌లు రెండూ అణ్వాయుధ దేశాలు. 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఇరుదేశాల మధ్య 4 యుద్ధాలు జరిగాయి. మొదటి నుండి ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు ఉద్రిక్తంగానే ఉంటూ వచ్చాయి. ముంబై దాడుల్లో ప్రాణాలతో బయటపడిన ఏకైక ఉగ్రవాది అజ్మల్ కసబ్, తాము పాకిస్థాన్ నుంచి వచ్చామని, తమకు లష్కరే తోయిబా శిక్షణ ఇచ్చిందనీ ధ్రువీకరించాడు. తమకు పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ కూడా మద్దతిచ్చిందని అతడు 2011లో ఒప్పుకున్నాడు. 2008 నవంబరు 26 నుంచి 29 వరకు ముంబై దాడులు జరిగాయి. డిసెంబరు 7న లాహోర్‌లో జరిగిన అధికారిక విందులో అమెరికా సెనేటర్ జాన్ మెక్‌కెయిన్, భారత ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ సందేశాన్ని పాకిస్తాన్ ప్రధాన మంత్రి యూసఫ్ రజా గిలానీతో సహా అనేక మంది పాకిస్తాన్ ప్రముఖులకు అందించాడు.
(ఇంకా…)

26వ వారం
చంద్రయాన్-3

చంద్రయాన్-3, భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్ర యాత్ర. భారత చంద్రయాన్ కార్యక్రమంలో ఇది మూడవది. చంద్రయాన్-2లో లాగానే ఇందులో కూడా ఒక రోవరు, ఒక ల్యాండరూ ఉన్నాయి. కానీ ఇందులో ఆర్బిటరు లేదు. దాని ప్రొపల్షను మాడ్యూలే రిలే ఉపగ్రహం లాగా పనిచేస్తుంది. ఈ ప్రొపల్షను మాడ్యూలు చంద్రుని చుట్టూ 100 కి.మీ. కక్ష్య వరకూ ల్యాండరును రోవరునూ తీసుకుపోతుంది. ప్రొపల్షను మాడ్యూలులో రోవరు ల్యాండర్లతో పాటు స్పెక్ట్రో పోలారిమెట్రీ ఆఫ్ హ్యాబిటబుల్ ప్లానెట్ ఎర్త్ (SHAPE) అనే పేలోడును కూడా పంపించారు. ఇది చంద్రుని కక్ష్య నుండి భూమిని పరిశీలిస్తుంది. చంద్రయాన్-2 ప్రయోగంలో చంద్రుని కక్ష్య లోకి విజయవంతంగా ప్రవేశించాక, ప్రయోగాంతంలో సాఫ్ట్‌వేరు లోపం కారణంగా ల్యాండరు మృదువుగా దిగక వైఫల్యం చెందింది. ఆ తరువాత ఈ కార్యక్రమాన్ని ప్రకటించారు. చంద్రయాన్ 2023 ప్రయోగం 3 జూలై 14 న మధ్యాహ్నం 2:35 గంటలకు జరిగింది. శ్రీహరికోట, సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం లోని రెండవ ప్రయోగ వేదిక నుండి దీన్ని ఎల్‌విఎమ్-ఎమ్4 వాహక నౌక ద్వారా ప్రయోగించారు. చంద్రయాన్-3 ల్యాండర్ విక్రమ్ 2023 ఆగస్టు 23 సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడి దక్షిణ ధ్రువానికి సమీపంలో సురక్షితంగా సాఫ్ట్ ల్యాండ్ చేసింది. చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో 2023 ఆగష్టు 26న దేశ ప్రధాని నరేంద్రమోడి బెంగళూరుకు చేరుకుని పీణ్యలోని ఇస్రో కేంద్రంలో శాస్త్రవేత్తలను అభినందించారు. చంద్రయాన్‌ - 3 దిగిన ప్రదేశానికి శివశక్తి అని నామకరణం చేయడంతో పాటు ఇకపై ప్రతియేటా ఈ రోజు (ఆగష్టు 23)ని జాతీయ అంతరిక్ష దినోత్సవం జరుపుకోవాలని ప్రకటించారు.
(ఇంకా…)

27వ వారం
భైరవకోన

భైరవ కోన ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం మండలంలోని అంబవరం కొత్తపల్లి గ్రామానికి 5 కిమీ దూరంలో వున్న 9వ శతాబ్దానికి చెందిన శైవ పుణ్యక్షేత్రం. ఇక్కడ ఒకే కొండలో మలిచిన ఎనిమిది శివాలయాలున్నాయి. వీటిలో ఏడు దేవాలయాలు తూర్పుముఖంగా, ఒక్కటి మాత్రం ఉత్తర ముఖంగా చెక్కబడ్డాయి. వీటన్నింటిలోనూ గర్భాలయాలూ, వరండాలూ స్తంభాలూ అన్నీ ఒకే కొండ రాయితోనే మలచగలగడం విశేషం. శివలింగాలను మాత్రమే నల్లరాయి (గ్రానైట్) శిలలను చెక్కి ప్రతిష్ఠించారు. కొండల్ని తొలిచి ఆలయాలుగా చెక్కడం అన్నది భారతదేశంలో ప్రాచీనకాలంనుంచీ ఉన్నదే. ఆంధ్రప్రదేశ్లో గుంటుపల్లి, ఉండవల్లి, మొగల్రాజపురం, బొజ్జన్నకొండ, శ్రీపర్వతం, లింగాల మెట్ట గుహలన్నీ ఈ కోవకు చెందినవే. అయితే భైరవకోన గుహలకు పౌరాణిక, చారిత్రక ప్రాశస్త్యం ఉంది. పల్లవరాజగు మహేంద్రవర్మ ధాన్యకటకమందు రాజప్రతినిధిగా వున్నప్పుడు గుహాలయ నిర్మాణాలను గూర్చి తెలుసుకొని కలప, ఇటుక, లోహనిర్మితాలకంటె శాశ్వతమైన వీటి నిర్మాణాలను ఆంధ్రదేశమందు ప్రోత్సహించాడు. ఆ తరువాత పల్లవులు ఓడిపోయి, రాజ్యం పెన్న పరిసర దక్షిణ ప్రాంతాలను ఆక్రమించారు. ఆ కాలంలో నిర్మించిన పర్వత గుహాలయాలకు భైరవకొండలోని శిల్పాలే తార్కాణమని ప్రొ॥ఆర్. సుబ్రమణ్యం అభిప్రాయపడ్డాడు. అయితే ఐదోగుహలోని స్తంభాలమీద ఉన్న నరనరేంద్రుడు, శ్రీత్రిభువనాదిత్యం... వంటి పదాలను చూస్తుంటే ఈ ఆలయాల నిర్మాణం ఏడో శతాబ్దం నుంచి చాళుక్యులకాలం వరకూ అంటే 11వ శతాబ్దంవరకూ కొనసాగి ఉంటుందని భావిస్తారు.
(ఇంకా…)

28వ వారం
భూ సర్వే

సర్వేయింగ్ లేదా భూమి సర్వేయింగ్ అనేది భూమి ఉపరితలంపై ఉన్న వివిధ బిందువుల త్రిమితీయ స్థానాలను, వాటి మధ్య దూరాలను, కోణాలనూ నిర్ణయించే సాంకేతికత. అదొక వృత్తి, కళ. అదొక శాస్త్రం. సర్వే చేసే వారిని సర్వేయరు అంటారు. ఆస్తుల సరిహద్దులను, స్వంతదారులను నిర్ణయించేందుకు, ప్రభుత్వ, పౌర చట్టాల ద్వారా అవసరమయ్యే ఇతర ప్రయోజనాల కోసం, మ్యాపుల తయారీకీ సర్వే ఉపయోగపడుతుంది. సర్వేలో భాగంగా జ్యామితి, త్రికోణమితి, రిగ్రెషన్ విశ్లేషణ, భౌతిక శాస్త్రం, ఇంజనీరింగ్, మెట్రాలజీ, ప్రోగ్రామింగ్ భాషలు, చట్టం లోని అంశాలను వాడతారు. టోటల్ స్టేషన్లు, రోబోటిక్ టోటల్ స్టేషన్లు, థియోడోలైట్లు, GNSS రిసీవర్లు, రెట్రోరిఫ్లెక్టర్లు, 3D స్కానర్లు, రేడియోలు, ఇంక్లినోమీటర్లు, హ్యాండ్హెల్డ్ ట్యాబ్లెట్లు, డిజిటల్ లెవెల్‌లు, భూగర్భ లొకేటర్లు, డ్రోన్లు, GIS, సర్వేయింగ్ సాఫ్ట్వేర్ మొదలైనవి సర్వేయర్లు వాడే పరికరాల్లో కొన్ని. చరిత్ర ప్రారంభం నుండి మానవ అభివృద్ధిలో సర్వేయింగ్ ఒక అంశంగా ఉంది. చాలా రకాల నిర్మాణాల రూపకల్పనకు, అమలు చేయడానికీ సర్వేయింగు అవసరం. రవాణా, సమాచార ప్రసారం, మ్యాపింగ్, భూమి యాజమాన్యం కోసం చట్టపరమైన సరిహద్దుల నిర్వచనంలో కూడా సర్వేయింగు ఉపయోగపడుతుంది. అనేక ఇతర శాస్త్రీయ విభాగాలలో పరిశోధన కోసం సర్వే ముఖ్యమైన సాధనం. మానవులు మొదటి పెద్ద పెద్ద నిర్మాణాలను నిర్మించినప్పటి నుండి సర్వే చేస్తూ వచ్చారు. పురాతన ఈజిప్టులో, నైలు నది వార్షిక వరదల తరువాత కట్టలను పునర్నిర్మించడానికి సాధారణ జ్యామితిని ఉపయోగించేవారు.
(ఇంకా…)

29వ వారం
అలెగ్జాండర్

అలెగ్జాండర్ ప్రాచీన గ్రీకు రాజ్యమైన మాసిడోన్ కు రాజు (గ్రీకు సామ్రాజ్యంలో ఈ పదవిని బాసిలియస్ అంటారు), ఆర్గియడ్ రాజవంశస్థుడు. అతన్ని మాసిడోన్‌కు చెందిన అలెగ్జాండర్ III అని, అలెగ్జాండర్ ది గ్రేట్ (గ్రీకులో అలెగ్జాండ్రోస్ హో మెగాస్) అనీ పిలుస్తారు. అతను సా.పూ 356 లో పెల్లాలో జన్మించాడు. అతని తండ్రి ఫిలిప్ II మరణం తరువాత, 20 ఏళ్ళ వయస్సులో గద్దె నెక్కాడు. తన పాలనాకాలంలో ఎక్కువ భాగం పశ్చిమ ఆసియా, ఈశాన్య ఆఫ్రికాల్లో మున్నెన్నడూ ఎరగని సైనిక దండయాత్ర లోనే గడిపాడు. ముప్పై సంవత్సరాల వయస్సు నాటికే, గ్రీస్ నుండి వాయవ్య భారతదేశం వరకు విస్తరించిన, పురాతన ప్రపంచంలోని అతిపెద్ద సామ్రాజ్యాలలో ఒకదాన్ని సృష్టించాడు. అతను యుద్ధంలో అజేయంగా నిలిచాడు. చరిత్రలో అత్యంత విజయవంతమైన సేనాధిపతుల్లో ఒకరిగా అతన్ని పరిగణిస్తారు. అలెగ్జాండర్‌ 16 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు అరిస్టాటిల్ వద్ద విద్య అభ్యసించాడు. సా.పూ 336 లో ఫిలిప్ హత్య తరువాత, అతను సింహాసనం ఎక్కాడు. బలమైన రాజ్యాన్ని, అనుభవంగల సైన్యాన్నీ వారసత్వంగా పొందాడు. అలెగ్జాండర్‌కు గ్రీస్ సర్వసైన్యాధిపత్యం లభించింది. తన తండ్రి తలపెట్టి, మొదలుపెట్టలేక పోయిన పాన్-హెలెనిక్ ప్రాజెక్టును ప్రారంభించి, పర్షియాను ఆక్రమించడానికి ఈ అధికారాన్ని ఉపయోగించాడు.
(ఇంకా…)

30వ వారం
మొదటి రాజేంద్ర చోళుడు

రాజేంద్ర చోళుడు లేదా మొదటి రాజేంద్ర చోళుడు (1014−1044) ప్రాచీన భారతదేశాన్ని పరిపాలించిన 11వ శతాబ్దానికి చెందిన చోళ చక్రవర్తి. ఈయనకు గంగైకొండ, కడారంకొండ, పండిత చోళ అనే బిరుదులు కూడా ఉన్నాయి. భారతదేశాన్ని పరిపాలించిన గొప్ప పాలకులలో ఒకడిగా ఆయనను చరిత్రకారులు పరిగణిస్తారు. ఆయన తన తండ్రి రాజరాజ చోళుడి తర్వాత సా. శ 1014 లో సింహాసనాన్ని అధిష్టించాడు. ఇతని పరిపాలనలో చోళ సామ్రాజ్యం ఉత్తర భారతదేశంలో గంగానది తీరం వరకు, హిందూ మహాసముద్రం దాటి పశ్చిమానికి, ఆగ్నేయ ఆసియా వైపుకి విస్తరించింది. అందుకనే ఇది ప్రాచీన భారతీయ రాజ్యాలలో బలమైన వాటిలో ఒకటిగా పరిగణించబడుతోంది. ఈయన జైత్రయాత్రలో భాగంగా శ్రీలంక, మాల్దీవులు జయించాడు. అంతేకాక మలేషియాలోని శ్రీవిజయ, ఆగ్నేయ ఆసియాలోని దక్షిణ థాయి ల్యాండు, ఇండోనేషియా మీద కూడా దాడులు చేశాడు. థాయి ల్యాండు, కాంబోడియా రాజ్యానికి చెందిన ఖ్మేరు ప్రాంతాల నుంచి కప్పం వసూలు చేశాడు. ప్రస్తుతం బెంగాలు, బీహారు రాష్ట్రాలలో విస్తరించిన గౌడ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న పాలవంశ రాజు మహిపాలుడిని ఓడించాడు. తన విజయాలకు గుర్తుగా గంగైకొండ చోళుడు (గంగానది ప్రాంతాన్ని జయించిన వాడు) అనే బిరుదు పొందాడు. గంగైకొండ చోళపురం అనే కొత్త రాజధాని కూడా నిర్మించాడు. ఈయన తన కుమార్తె అమ్మాంగ దేవిని తూర్పు చాళుక్యరాజు రాజరాజ నరేంద్రుడికిచ్చి వివాహం చేశాడు. అమ్మాంగ దేవి కుమారుడే కులుత్తోంగ చోళుడు(చాలుక్యుడు).
(ఇంకా…)

31వ వారం
కిషోర్ కుమార్

కిషోర్ కుమార్ భారతీయ హిందీ సినిమా రంగంలో నటుడు, నేపథ్యగాయకుడు, నిర్మాత, సంగీత దర్శకుడు, పాటల రచయిత, సినిమా రచయిత, హాస్యరస చక్రవర్తి. అనేక కళలు ఒక్క మనిషి లోనే నిక్షిప్తమై ఉండడం నిజంగా ఆశ్చర్యకరమే. అతను పాడిన వందలాది పాటలు కిషోర్ ను మన హృదయాల్లో శాశ్వతంగా నిచిలిపోయేట్టు చేస్తాయి. హిందీ సినిమా పరిశ్రమలో ప్రసిద్ధి చెందిన గాయకులలో ఒకనిగా గుర్తింపు పొందాడు. అతను 'ట్రాజెడీ కింగ్' గా ప్రసిధ్ధి. హిందీ చిత్రాలతో పాటు అతను బెంగాలీ, మరాఠీ, అస్సామీ, గుజరాతీ, కన్నడ, బోజ్‌పురి, మలయాళం, ఉర్దూ భాషా చిత్రాలలో పాటలను పాడాడు. అతను అనేక భాషలలో ప్రవేట్ ఆల్బంలలో పాడాడు. ముఖ్యంగా బెంగాలీ భాషా ఆల్బంలు చేసాడు. అతను ఉత్తమ పురుష నేపధ్య గాయకునిగా ఎనిమిది ఫిలిం ఫేర్ పురస్కారాలను పొందాడు. ఈ విభాగంలో అత్యధిక ఫిలిం ఫేర్ పురస్కారాలు పొందిన రికార్డును స్వంతం చేసుకున్నాడు. అతనికి మద్యప్రదేశ్ ప్రభుత్వం 1985-86 సంవత్సరంలో "లతా మంగేష్కర్ పురస్కారం" అందజేసింది. 1997లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం "కిషోర్ కుమార్ పురస్కారం" ను ప్రారంభించింది.
(ఇంకా…)

32వ వారం
మదురా ద్వీపం

మదురా ద్వీపం ఇండోనేషియా లోని ఒక ద్వీపం. ఇది జావా ఈశాన్య తీరంలో ఉంది. ఈ ద్వీపం వైశాల్యం సుమారు 4,078.67 చ.కిమీ (పరిపాలనాపరంగా 5,168 కిమీ² తూర్పు, ఉత్తరాన ఉన్న వివిధ చిన్న ద్వీపాలతో సహా) ఉంది. పరిపాలనాపరంగా మదుర తూర్పు జావాలో భాగంగా ఉంది. ఇది ఒక సన్నని జలసంధి ద్వారా జావా నుండి వేరు చేయబడింది. పరిపాలనా విభాగంలో జనసాంద్రత చ.కి.మీ.కు 702 మంది ఉండగా ద్వీపంలో జనసాంద్రత చ.కి.మీ. కి 817. 1964 లో మాతురం సుల్తానేటుకు చెందిన సుల్తాన్ అగుంగు మదురా ద్వీపాన్ని జయించి ఈ ప్రాంతాన్ని కాక్రానింగ్రాట్సు రాచరికపాలన క్రిందకు తీసుకువచ్చాడు. కాక్రానిన్గ్రాటు కుటుంబం జావాకేంద్ర పాలనను వ్యతిరేకిస్తూ అత్యకమైన మాతారాం భాగాలను జయించింది. మూడవ అమంగ్కురాటు, ఆయన మామ పంగేరన్ పుగర్ మధ్య జరిగిన మొదటి జావానీస్ యుద్ధం తరువాత 1705 లో డచ్చి మదురా తూర్పు భాగంలో నియంత్రణ సాధించింది. ప్యూగర్ డచ్చి గుర్తింపు లభించడం పశ్చిమ మదుర ప్రభువు( కాక్రానింగ్రాట్)ని ప్రభావితమైంది. మద్య జావాలో మొదలైన యుద్ధంలో మదురీయులు జోక్యం చేసుకుంటారన్న ఆశతో పశ్చిమ మదుర ప్రభువు పుగర్ వాదనలకు మద్దతు ఇచ్చాడు. అమంగ్కురాటు ఖైదుచేయబడి చేయబడి సిలోనుకు పంపబడిన సమయంలో పుగర్ మొదటి పకుబువోనో అనే బిరుదును స్వీకరించి డచ్తో ఒక ఒప్పందం మీద సంతకం చేసిన ఫలితంగా డచ్చి తూర్పు మదురమీద సాధికారత సాధించింది.
(ఇంకా…)

33వ వారం
సీతాదేవి

హిందూ మతంలోని విశ్వాసాల ప్రకారం సీత, శ్రీమహాలక్ష్మి అవతారం. విష్ణువు అవతారమైన శ్రీరాముని ధర్మపత్ని. జానకి, మైధిలి, వైదేహి, రమ కూడా సీత పేర్లు. సీతను తరచు సీతమ్మ తల్లి, చల్లని తల్లి అని వివిధ రచనలలోను, కీర్తనలలోను ప్రస్తావిస్తారు. మిధిలాపుర నాయకుడైన జనక మహారాజు యాగము చేయుచూ భూమిని దున్నుచుండగా నాగలికి ఒక పెట్టె అడ్డుపడింది. ఆ పెట్టెను తెరచి చూడగా అందులో ఒక పసిపిల్ల కనిపించింది. నాగటి చాలులో లభించినందున ఆమెకు సీత' అని నామకరణము చేసి జనకమహారాజు, ఆయన భార్య సునయన అల్లారు ముద్దుగా ఆ బిడ్డను పెంచుకొన్నారు. కనుక సీత భూదేవి కుమార్తె అని అంటారు, శ్రీ సీతమ్మ జన్మనక్షత్రము ఆశ్లేష నక్షత్రము . సీత గర్భమున జన్మించలేదు గనుక అయోనిజ అని అంటారు. సీతాదేవి జననం సీత జన్మ నక్షత్రమైన ఆశ్లేష నక్షత్రం రోజున చైత్ర మాసం శుక్లపక్షంలో జరిగింది. ప్రస్తుతం నేపాల్‌లో ఉన్న జనక్‌పూర్ సీత జన్మస్థలమని చెబుతారు. రామ లక్ష్మణులు విశ్వామిత్రుని యాగ రక్షణా కార్యాన్ని జయప్రదంగా ముగించారు. తన శిష్యులను వెంటబెట్టుకొని విశ్వామిత్రుడు మిధిలా నగరం వచ్చాడు. అప్పుడు జనకుడు యజ్ఞం చేస్తున్నాడు. అతిధులను ఆహ్వానించి జనకుడు వారికోరికపై తనవద్దనున్న శివధనుస్సును వారికి చూపాడు. వేరెవ్వరూ ఎక్కుపెట్టలేకపోయిన ఆ ధనుస్సును శ్రీరాముడు అవలీలగా ఎక్కుపెట్టి, విరిచేశాడు.
(ఇంకా…)

34వ వారం
వెండి

వెండి లేదా రజతం ఒక తెల్లని లోహము, రసాయన మూలకము. దీని సంకేతం Ag, దీని పరమాణు సంఖ్య 47. ఇది ఒక మెత్తని, తెల్లని మెరిసే పరివర్తన మూలకము. దీనికి విద్యుత్, ఉష్ణ ప్రవాహ సామర్థ్యం చాలా ఎక్కువ. ఇది ప్రకృతిలో స్వేచ్ఛగాను, ఇతర మూలకాలతో అర్జెంటైట్ మొదలైన ఖనిజాలుగా లభిస్తుంది. వెండి ప్రాచీన కాలం నుండి విలువైన లోహంగా ప్రసిద్ధిచెందినది. ఇది ఆభరణాలు, నాణేలు, వంటపాత్రలుగా ఉపయోగంలో ఉన్నాయి. ఈనాడు వెండిని విద్యుత్ పరికరాలలో, అద్దాలు, రసాయనిక చర్యలలో ఉత్ప్రేరకంగా ఉపయోగిస్తున్నారు. వెండి సమ్మేళనాలు ముఖ్యంగా సిల్వర్ నైట్రేట్ ఫోటోగ్రఫీ ఫిల్మ్ తయారీలో విస్తృతంగా ఉపయోగంలో ఉంది. రసాయన శాస్త్రవేత్తలు వెండిని పరివర్తన లోహంగా గుర్తించారు. పరివర్తన మూలకాలు లేదా లోహాలు మూలకాల ఆవర్తన పట్టికలో గ్రూప్ 2, 13 మధ్యలో ఉన్న లోహములకాలు. 40 కి పైగా మూలకాలు లోహాలు. ఇవన్నీ పైన పేర్కొన్నపరివర్తన మూలకాలు/ లోహలకు చెందినవే. వెండిని విలువైన లోహంగా గుర్తింపు పొందిన మూలకం. సాధారణంగా విలువైన లోహాలు భూమిలో సంవృద్ధిగా లభించవు. విలువైన రకానికి చెందిన మూలకాలు ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ రసాయనికంగా అంతగా చురుకైన చర్యాశీలతను ప్రదర్శించవు. ఆవర్తన పట్టికలో వెండికి సమీపంలో ఉన్నములాకాల అరడజను వరకు విలువైన మూలకాలే. అవి బంగారం, ప్లాటినం, పల్లాడియం, రోడియం, ఇండియం లు.
(ఇంకా…)

35వ వారం
అయోధ్య వివాదం

అయోధ్య వివాదం భారతదేశంలో రాజకీయ, చారిత్రక, సామాజిక, మతపరమైన వివాదం. ఇది ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నగరంలోని ఒక స్థలంపై కేంద్రీకృతమై ఉంది. కనీసం 18వ శతాబ్దం నుండి హిందువులు తమ ఆరాధ్య దైవం రాముని జన్మస్థలంగా పరిగణిస్తున్న స్థలం ఇది. ఆ ప్రదేశంలో ఉన్న బాబ్రీ మసీదు చరిత్ర, దాని స్థానం, అక్కడ హిందూ దేవాలయం ఉండేదా, మసీదును నిర్మించేందుకు దాన్ని కూల్చేసారా అనే దాని చుట్టూ సమస్య తిరిగింది. బాబ్రీ మసీదు ఉన్న ప్రదేశం రామ జన్మస్థలంగా చెప్పబడుతోందనేందుకు ఆధారాలు కనీసం 1822 నుండి ఉన్నాయి. ఫైజాబాద్ కోర్టులో సూపరింటెండెంట్ అయిన హఫీజుల్లా 1822లో కోర్టుకు సమర్పించిన ఒక నివేదికలో అతను, "బాబరు చక్రవర్తి స్థాపించిన మసీదు, రాముడి జన్మస్థలం వద్ద ఉంది" అని పేర్కొన్నాడు. 1855లో స్థానిక ముస్లింలు సమీపంలోని హనుమాన్ గఢీ దేవాలయం పూర్వపు మసీదు స్థలంలో నిర్మించబడిందని భావించారు. ఆ ఆలయాన్ని కూల్చివేయాలని నిర్ణయించుకున్నారు, ఫలితంగా హింసాత్మక ఘర్షణలు జరిగి అనేక మంది ముస్లింల మరణానికి దారితీశాయి. 1857 లో, బాబ్రీ మసీదు ప్రాంగణంలో రామ జన్మస్థలం అనుకునే స్థలంలో ఒక చబుత్రాను (వేదిక) నిర్మించారు. ఈ వివాదం పర్యవసానంగా 1885 లో బాబ్రీ మసీదు ప్రాంగణంలో రామ జన్మస్థలానికి గుర్తుగా భావించే చబుత్ర చుట్టూ ఆలయాన్ని నిర్మించనీయాలని అభ్యర్థిస్తూ కోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఈ స్థలంపై హిందూ పక్షానికి యాజమాన్య హక్కులు లేవని పేర్కొంటూ తిరస్కరించబడింది.
(ఇంకా…)

36వ వారం
ఎ.సి. భక్తివేదాంత స్వామి ప్రభుపాద

అభయ్ చరణారవింద భక్తివేదాంత స్వామి ప్రభుపాద (1896 సెప్టెంబరు 1 - 1977 నవంబరు 14) ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ISKCON) సంస్థాపకాచార్యుడు. ఇస్కాన్ అనుచరులు భక్తివేదాంత స్వామి ప్రభుపాదను చైతన్య మహాప్రభు ప్రతినిధిగా, దూతగా చూస్తారు.

కలకత్తాలోని ఓ వ్యాపారస్తుల కుటుంబంలో జన్మించిన ఈయన స్కాటిష్ చర్చ్ కళాశాలలో చదివాడు. ఒక చిన్న మందుల సంస్థలో పనిచేస్తూ భక్తిసిద్ధాంత సరస్వతి స్వామిని కలిసి ఆయన శిష్యుడైనాడు. 1959 లో పదవీ విరమణ చేశాక సంసారాన్ని విడిచిపెట్టి సన్యాసి అయ్యాడు. వైష్ణవ గ్రంథాలపైన వ్యాఖ్యానాలు రాయడం మొదలుపెట్టాడు. వైష్ణవ సన్యాసిగా దేశ విదేశాలు తిరుగుతూ 1966 లో ఇస్కాన్ ను స్థాపించి, దాని ద్వారా గౌడీయ వైష్ణవ సిద్ధాంతాన్ని వ్యాప్తి చేశాడు. ఈయనను చాలామంది అమెరికన్ మత పండితులు అంగీకరించినా, కల్ట్ ను వ్యతిరేకించే వారు మాత్రం విమర్శించారు. నల్లవారిపై ఆయన అభిప్రాయాలు, నిమ్నకులాల వారు, యూదుల పట్ల వివక్ష, హిట్లర్ నేరాలపై ఆయన ధృక్పథం విమర్శలకు గురయ్యాయి.
(ఇంకా…)

37వ వారం
పుపుల్ జయకర్

పుపుల్ జయకర్ భారతదేశ ప్రముఖ కళాకారిణి, రచయిత్రి. ఈవిడ రచయితగానే కాకుండా ఇతర రంగాలలో కూడా విశేష ప్రతిభను ప్రదర్శించింది. స్వాతంత్ర్యానంతరం అంతరించి అవసాన దశకు చేరిన సాంప్రదాయ గ్రామీణ కళలను, హస్త కళలను పునరుజ్జీవింపజేయడంలో ఈమె విశేష కృషి చేసింది.1980 లలో ఈవిడ ఫ్రాన్స్, అమెరికా, జపాన్ దేశాలలో భారతీయ చిత్రకళా ప్రదర్శనలను ఏర్పాటు చేసి, పశ్చిమ దేశాలలో భారతీయ చిత్రకళకు అంతర్జతీయ కీర్తిని తెచ్చిపెట్టింది. గాంధీ, నెహ్రూ, ప్రముఖ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి లకు ఈవిడ మంచి స్నేహితురాలు. అంతే కాకుండా వారి జీవిత చరిత్రలను కూడా గ్రంథస్తం చేసింది. భారతదేశ ముగ్గురు ప్రధాన మంత్రులు నెహ్రూ ఆయన కూతురు ఇందిరా గాంధీ, ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ లకు ఈవిడ ఆప్తురాలుగా మెలిగింది. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ లకు సాంస్కృతిక సలహాదారుగా వ్యవహరించింది. 40 ఏళ్ళపాటు భారతదేశ చరిత్రను నిశితంగా అధ్యయనం చేసింది. మన దేశ సాంప్రదాయక కళలను ప్రపంచ వ్యాప్తంగా ప్రదర్శనలు ఏర్పాటు చేసి వాటికి ఘనమైన కీర్తిని తద్వారా గిరాకీని తీసుకువచ్చింది. 1950లో అప్పటి ప్రధాని నెహ్రూ కోరిక మేరకు మనదేశ చేనేత రంగంపై అధ్యయనం చేసింది.
(ఇంకా…)

38వ వారం
బైర్రాజు రామలింగరాజు

బైర్రాజు రామలింగరాజు సత్యం కంప్యూటర్స్ మాజీ అధిపతి. రాజు హైదరాబాదులో సత్యం కంప్యూటర్స్ ను 1987లో ప్రారంభించి వేగంగా అభివృద్ధి చేశాడు. అత్యవసర సేవలను, ఆరోగ్య సేవలను ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభించి, ప్రజలకు మెరుగైన సేవలందించటానికి కృషి చేశాడు. సత్యం కంపెనీ వ్యాపార లెక్కలలో మోసం చేసినందున జైలు శిక్షకు గురయ్యాడు. బైర్రాజు రామలింగరాజు 1954 సెప్టెంబరు 16 న ఆంధ్రప్రదేశ్ లోని భీమవరంలో జన్మించాడు. విజయవాడలోని ఆంధ్ర లయోలా కళాశాల నుంచి బి.కాం చదివాడు. తర్వాత అమెరికాలో ఓహయో విశ్వవిద్యాలయం నుంచి ఎం.బి.ఎ చదివాడు. 1977 లో భారతదేశానికి తిరిగి వచ్చిన రామలింగరాజు 22 ఏళ్ళ వయసులో నందినిని వివాహం చేసుకున్నాడు. రామలింగరాజు పలు వ్యాపారాల్లోకి ప్రవేశించాడు. 9 కోట్ల రూపాయల మూలధనంతో ధనంజయ హోటల్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పారిశ్రామిక సంఘం సహకారంతో శ్రీ సత్యం స్పిన్నింగ్ మిల్స్ లాంటి సంస్థలు స్థాపించాడు. ఈ వ్యాపారాలు అంతగా విజయం సాధించకపోవడంతో ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారంవైపు దృష్టి సారించి మేటాస్ ఇన్‌ఫ్రా అనే సంస్థను స్థాపించాడు.
(ఇంకా…)

39వ వారం
అత్తారింటికి దారేది

అత్తారింటికి దారేది 2013 సెప్టెంబరు 27న విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమాను శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి పతాకంపై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించాడు. పవన్ కళ్యాణ్, సమంత జంటగా నటించిన ఈ సినిమాలో బొమన్ ఇరానీ, నదియా, ప్రణీత, బ్రహ్మానందం ముఖ్య పాత్రలు పోషించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. వృద్ధుడైన ఓ వ్యాపారవేత్త చనిపోబోయే ముందు తన నుంచి దూరంగా వెళ్ళిపోయిన కుమార్తెను చూడాలని తాపత్రయపడుతుంటాడు. అతని మనవడు వెళ్ళి తన మేనత్తకు నచ్చజెప్పి ఎలా తీసుకువచ్చాడనేది ఈ చిత్ర కథాంశం. 2012 నవంబరు 23న ఈ సినిమా యొక్క పూజా కార్యక్రమాలు హైదరాబాదు లోని ఫిలిం నగర్ దేవాలయంలో నిర్వహించబడ్డాయి. ఆపై చిత్రీకరణ తమిళనాడులోని పొల్లాచి వద్ద 2013 ఫిబ్రవరి 10 నుంచి మొదలయ్యింది. పొల్లాచిలో చిత్రీకరణ జరుపుకున్నాక ఈ సినిమా షూటింగ్ హైదరాబాదు లోని రామోజీ ఫిలిం సిటీలో ఏర్పాటు చేసిన ఒక భారీ ఇంటి సెట్టులో కొనసాగింది. ఈ సెట్టుని ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ 3 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి తయారు చేయించారు. 2013 మే 25 నుంచి ఒక నెలపాటు యూరోప్ దేశంలో కొన్ని ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణ ఒక నెల వ్యవధిలో జరుపబడతాయని వెల్లడించారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. ఈ సినిమా పాటలు ఆదిత్య మ్యూజిక్ కంపెనీ ద్వారా సినిమా యూనిట్ సమక్షంలో హైదరాబాదులోని శిల్పకళా వేదికలో 2013 జూలై 19న విడుదలయ్యాయి.
(ఇంకా…)

40వ వారం
ఆనీ లార్సెన్ వ్యవహారం

ఆనీ లార్సెన్ వ్యవహారం అనేది మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో అమెరికా నుండి భారతదేశానికి ఆయుధాలను అక్రమంగా రవాణా చేసే ప్రయత్నం. భారతీయులకు చెందిన గదర్ పార్టీ, ఐరిష్ రిపబ్లికన్ బ్రదర్‌హుడ్, జర్మన్ విదేశాంగ కార్యాలయం - ఈ మూడూ కలిసి చేసిన కుట్ర కార్యక్రమాలైన హిందూ జర్మను కుట్రలో ఇది భాగం. 1917 లో జరిగిన హిందూ -జర్మన్ కుట్ర విచారణలో ఇదే ప్రధానమైన నేరం. అమెరికా న్యాయవ్యవస్థ చరిత్రలో అత్యంత సుదీర్ఘమైన, అత్యంత ఖరీదైన విచారణగా దీన్ని వర్ణించారు. 1914 నాటికి, యావద్భారత విప్లవం కోసం ప్రణాళికలు రూపొందించబడ్డాయి. మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు, గదర్ ప్రణాళికకు మద్దతు ఇవ్వాలని జర్మనీ నిర్ణయించుకుంది. దీని కోసం, జర్మనీలోని భారతీయ, ఐరిష్ ప్రజల మధ్య ఏర్పడిన లింకులను (రోజర్ కేస్‌మెంట్‌తో సహా), అమెరికా లోని జర్మనీ విదేశాంగ కార్యాలయాలనూ వాడి అమెరికా లోని ఇండో-ఐరిష్ నెట్‌వర్కుతో సంబంధాలు ఏర్పరచుకున్నారు. 1914 సెప్టెంబరులో జర్మనీ ఛాన్సలర్ థియోబాల్డ్ వాన్ బెత్‌మన్-హాల్‌వెగ్, బ్రిటిషు భారతదేశానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేపట్టేందుకు అధికార మిచ్చాడు. ఈ ప్రయత్నాలకు పురావస్తు శాస్త్రవేత్త, ప్రాచ్యదేశాల కోసం కొత్తగా ఏర్పడిన నిఘా సంస్థ అధిపతీ అయిన మాక్స్ వాన్ ఒపెన్‌హీమ్ నాయకత్వం వహించాడు. భారతీయ విద్యార్థి సంఘాలను ఒక సంఘటిత సమూహంగా ఏర్పాటు చేసే బాధ్యత ఒప్పెన్‌హీమ్‌పై పడింది.
(ఇంకా…)

41వ వారం
ఆలీ (నటుడు)

ఆలీ తెలుగు సినిమా హాస్యనటుడు, టీవీ వ్యాఖ్యాత. 1100 కి పైగా సినిమాల్లో నటించాడు. ఆలీ బాల నటుడిగా తెలుగు చలనచిత్ర రంగంలో ప్రవేశించాడు. సీతాకోకచిలుక చిత్రం ద్వారా ప్రసిద్ధి చెందాడు. అకాడమీ ఆఫ్ యూనివర్సల్ పీస్ వారు ఆలీకి గౌరవ డాక్టరేట్ ను ప్రకటించారు. ఆలీ తండ్రి పేరు మీదుగా మహమ్మద్ బాషా చారిటబుల్ ట్రస్ట్ అనే పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి దాని ద్వారా పేదలకు సేవ చేస్తున్నాడు. ఇతని తమ్ముడు ఖయ్యూం కూడా నటుడే. తెలుగు సినిమాలలో సహాయక పాత్రలను పోషిస్తుంటాడు. ఒకసారి రాజమండ్రిలో ప్రెసిడెంట్ పేరమ్మ చిత్రీకరణ జరుగుతోంది. అక్కడ చిత్రబృందానికి వినోదం పంచడానికి వచ్చిన అలీని చూసి దర్శకుడు కె. విశ్వనాథ్ ఆ సినిమాలో బాలనటుడిగా అవకాశం ఇచ్చాడు. తర్వాత దేవుడు మామయ్య, ఘరానా దొంగ, సిరిమల్లె నవ్వింది, ముక్కోపి మొదలైన సినిమాల్లో బాలనటుడిగా నటించాడు. ప్రేమఖైదీ సినిమాలో బ్రహ్మానందం, బాబు మోహన్, కోట శ్రీనివాసరావు తో పాటు ఆలీ కూడా మంచి హాస్యనటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కొద్ది కాలం తర్వాత హాస్య పాత్రలను పోషించడం మొదలుపెట్టాడు. ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాలో ఎంద చాట అంటూ అలీ పలికిన అర్థం కాని మలయాళీ భాష అతనికి మంచి గుర్తింపు తెచ్చింది. తర్వాత ఇలాంటి సంభాషణలే పలు సినిమాల్లో వాడుకున్నారు. అటు పిమ్మట యమలీల చిత్రంద్వారా కథానాయకుడిగా స్థిరపడ్డాడు.
(ఇంకా…)

42వ వారం
దిండిగల్

దిండిగల్, భారతీయ రాష్ట్రాలలోని, తమిళనాడుకు చెందిన ఒక నగరం. ఇది వస్త్ర పరిశ్రమకు పేరొందిన నగరం. దిండిగల్ జిల్లాకు ఇది పరిపాలనా కేంద్రం. దిండిగల్ రాష్ట్ర రాజధానికి చెన్నై నుండి నైరుతిలో 420 కి.మీ. (260 మై.) దూరంలో ఉంది. తిరుచిరాపల్లికి 100 కి.మీ (62మైళ్లు) దూరంగా, మధురై నుండి 66 కి.మీ (41 మైళ్లు) దూరంగా, వస్త్ర పరిశ్రమకు పేరొందిన కరూర్ నుండి 72 కిలోమీటర్ల దూరంలో ఉంది. దిండిగల్ నగరం తాళాలు తయారీకి, బిర్యానీ వంటకు ప్రసిద్ధి చెందింది. దిండిగల్ జిల్లాలో పళని, ఆడంచత్రమ్, వేదసందుర్, నీలకోట్టై, కొడైకెనాల్, నథం, అతూర్ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి. దిండిగల్ పురపాలకసంఘానికి పరిపాలనా కేంద్రం. దిండిగల్ పురపాలక స్థాయి నుండి, నగరపాలక సంస్థగా ఉన్నత స్థాయికి మార్చుతూ 2014 ఫిబ్రవరి 19 నుండి అమలుకు తీసుకునివస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దిండిగల్ ఒక పురాతన నివాస ప్రాంతంగా అని నమ్ముతారు. దీనిని వివిధ కాలాలలో చేరవంశం, ప్రారంభ పాండ్యులు, చోళులు, పల్లవ రాజవంశీకులు, మరలా తిరిగి పాండ్యులు, మదురై సుల్తానులు, డిండిగుల్ సుల్తానులు, విజయనగర సామ్రాజ్యకులు, మదురై నాయక్ రాజవంశీకులు, చందా సాహిబ్, కర్ణాటక రాజ్య, బ్రిటిష్ పాలనలో ఉన్నది. దిండిగల్ అనేక చారిత్రక స్మారక కట్టడాలను కలిగి ఉంది.
(ఇంకా…)

43వ వారం
పిప్లాంట్రి
పిప్లాంట్రి is located in Rajasthan
పిప్లాంట్రి
పిప్లాంట్రి
పిప్లాంట్రి (Rajasthan)

పిప్లాంట్రి (గ్రామం), భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన రాజసమంద్ జిల్లాకు చెందిన గ్రామం. పిప్లాంట్రి గ్రామస్థులు గ్రామంలో ఎవరికి ఆడపిల్ల జన్మించినా వారు పుట్టిన సందర్బంగా 111 చెట్లను నాటుతారు. అక్కడి సమాజం ఈ చెట్లను బతికేలా చూస్తుంది. ఆడపిల్లలు పెరిగేకొద్దీ ఈ చెట్లు పెరిగి ఫలాలను పొందుతాయి. భారతదేశంలో ఆడపిల్లల కొరత చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే సమాజం మగబిడ్డపై మక్కువ కలిగి, వరకట్న పద్ధతుల కారణంగా ఆడపిల్లలను ఆర్థిక భారంగా పరిగణిస్తారు. సంవత్సరాలుగా, ఇక్కడి ప్రజలు గ్రామ పరిధిలోని బీడు మైదానాలలో నాటిన చెట్లతో, ఈ ప్రాంతం ఇప్పుడు 3,50,000 కంటే ఎక్కువ చెట్లను కలిగి ఉంది. ఈ చెట్లు 1,000 హెక్టార్లలో విస్తరించి ఉన్నాయి. వీటిలో ఎక్కువుగా ఇరిడి, మామిడి, గూస్బెర్రీ, గంధం, వేప, వెదురు, ఆమ్లా మొదలగు చెట్లు ఉన్నాయి. ఇవి ఒకప్పుడు బంజరు భూములలో పెరిగేవి.ఆర్థికభద్రతను నిర్ధారించడానికి, ఒక ఆడపిల్ల పుట్టిన తరువాత, గ్రామస్తులు సమిష్టిగా రూ.21 వేలు ఇచ్చి, తల్లిదండ్రుల నుండి రూ.10,000 తీసుకొని బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాలోఉంచుతారు. ఆమెకు 20 ఏళ్లు దాటిన తర్వాత మాత్రమే ఆ డబ్బును ఉపయోగించుకోవటానికి అవకాశం ఉంది.
(ఇంకా…)

44వ వారం
ప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితా
నితిష్ కుమార్ (బీహార్ ముఖ్యమంత్రి)
ఖండూ (అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి)
చంద్రబాబు నాయుడు (ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి)
భారతదేశ ముఖ్యమంత్రులు

గణతంత్ర భారతదేశంలో ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వానికి అధినేతగా వ్యవహరిస్తాడు. భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాలకు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల లోని 3 ప్రాంతాలకి ముఖ్యమంత్రులు ఉంటారు. భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రస్థాయి ప్రభుత్వానికి గవర్నరు అధిపతి అయిన నిర్వహణ విషయాలు ముఖ్యమంత్రి చేపడతారు. ఆ రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో గెలుపొందిన పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి గవర్నరు ఆహ్వానం పంపుతాడు, అలా గెలుపొందిన పార్టీ లేదా కూటమి నాయకుడిని ముఖ్యమంత్రిగా నియమిస్తాడు. అలాగే వివిధ శాఖలకు మంత్రులను కూడా గవర్నరే నియమిస్తాడు. ప్రభుత్వం ఏర్పరచిన పార్టీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాల వరకూ కొనసాగవచ్చు, ఒక వ్యక్తి ఎన్నిసార్లైనా ముఖ్యమంత్రి పదవి చేపట్టవచ్చు.ప్రస్తుతం జమ్మూ కాశ్మీరు మినహాయించి రెండు కేంద్రపాలిత ప్రాంతాలు 28 రాష్ట్రాలకు అనగా 30 మంది భారత రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ఉన్నారు. వీరిలో ఏకైక మహిళా ముఖ్యమంత్రి పశ్చిమ బెంగాల్ కు చెందిన చెందిన మమతా బెనర్జీ. 2000 మార్చి 5 నుండి ఐదు సార్లు ముఖ్యమంత్రిగా 21 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న నవీన్ పట్నాయక్ ఈ పదవిని అత్యధిక కాలంగా చేపడుతున్నాడు. బీహార్ రాష్ట్రంలో నితీష్ కుమార్ అత్యదికంగా 7 సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు.
(ఇంకా…)

45వ వారం
ఫిన్‌లాండ్

ఫిన్‌లాండ్ స్కాండినేవియన్ దేశము. మూడు స్కాండినేవియన్ దేశాలలో ఇది ఒకటి. దేశ రాజధాని నగరం హెల్సింకి. ఈ దేశ అధికార భాష ఫిన్నిష్. ఫిన్లాండ్ దేశ విస్తీర్ణము 338,145 చదరపు కిలోమీటర్లు. దీనిని అధికారికంగా "రిపబ్లిక్ ఆఫ్ ఫిన్లాండ్" అంటారు. ఉత్తర ఐరోపా‌లో సార్వభౌమాధికారం కలిగిన దేశాలలో ఇది ఒకటి. దేశం వాయవ్య సరిహద్దులో స్వీడన్, ఉత్తర సరిహద్దులో నార్వే, తూర్పు సరిహద్దులో రష్యా ఉన్నాయి. దక్షిణ సరిహద్దులో "గల్ఫ్ ఆఫ్ ఫిన్లాండ్" తీరంలో స్కాండినేవియాలో భాగంగా ఉన్న ఫెన్నొస్కాండియా మీద ఎస్టోనియా ఉంది. ఫిన్లాండ్ జనాభా 5.5 మిలియన్లు (2016), అత్యధిక సంఖ్యలో ప్రజలు దక్షిణ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నారు. జనాభాలో 88.7% మంది ఫిన్నిష్ భాష (స్కాండినేవియన్ భాషలకు సంబంధం లేని యురల్ భాష) మాట్లాడేవారు ఉన్నారు. తరువాత సమూహం ఫిన్లాండ్-స్వీడిష్ శాతం (5.3%). ఐరోపాలో ఫిన్లాండ్ ఎనిమిదవ అతిపెద్ద దేశం. ఐరోపా సమాఖ్యలో అత్యంత తక్కువ జనాభా కలిగిన దేశం ఇది. ఈ దేశంలో 311 మునిసిపాలిటీలు ఉన్నాయి. ఒక స్వతంత్ర ప్రాంతం అయిన ఏల్యాండ్ ద్వీపాలలో ఇది ఒక పార్లమెంటరీ రిపబ్లిక్. గ్రేటర్ హెల్సింకి మెట్రోపాలిటన్ ప్రాంతంలో 1.4 మిలియన్ల మంది నివసిస్తున్నారు. ఇది దేశం జి.డి.పి.లో మూడో వంతు ఉత్పత్తి చేస్తుంది.
(ఇంకా…)

46వ వారం
కలచూరి రాజవంశం

కలచూరి రాజవంశం సా. శ. 6 నుంచి 7 వ శతాబ్దాల మధ్య పశ్చిమ-మధ్య భారతదేశంలో పాలించిన ఒక భారతీయ రాజవంశం. వారిని హైహయులు లేదా "ప్రారంభ కలాచూరీలు" అని కూడా పిలుస్తారు. కలచూరి భూభాగంలో ప్రస్తుత గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రాంతాలు ఉన్నాయి. వారి రాజధాని బహుశా మహిష్మతి వద్ద ఉందని భావిస్తున్నారు. ఎల్లోరా, ఎలిఫెంటా గుహ స్మారక చిహ్నాలను కలచూరి పాలనలో నిర్మించినట్లు శాసనాల, నాణేల ఆధారాలు సూచిస్తున్నాయి. రాజవంశం మూలం అనిశ్చితం. 6 వ శతాబ్దంలో కలచూరిలు గతంలో గుప్తులు, వాకాటకులు, విష్ణుకుండినులు పాలించిన భూభాగాల మీద నియంత్రణ సాధించారు. శిలాశాసనంలో ముగ్గురు కలచూరి రాజులు మాత్రమే పేర్కొనబడ్డారు: శంకరగాన, కృష్ణరాజు, బుద్ధరాజు. 7 వ శతాబ్దంలో కలచూరిలు శక్తిని వాతాపిలోని చాళుక్యులు పడగొట్టారు. ఒక సిద్ధాంతం త్రిపురి, కళ్యాణి తరువాతి కలచూరి రాజవంశాలను మహిష్మతి కలచూరిలతో కలుపుతుంది. కలచూరి శాసనాల ప్రకారం, రాజవంశం ఉజ్జయిని, విదిషా, ఆనందపురాలను నియంత్రించింది. వారి రాజధాని మాళ్వా ప్రాంతంలోని మహిష్మతి అని సాహిత్య ఆధారాలు సూచిస్తున్నాయి. ఈ రాజవంశం విదర్భను కూడా నియంత్రించింది. అక్కడ వారు ఒకతక, విష్ణుకుండిన రాజవంశాల తరువాత పాలన సాధించారు. 6 వ శతాబ్దం మధ్యకాలంలో కలచురిలు ఉత్తర కొంకణాన్ని (ఎలిఫెంటా పరిసరప్రాంతాలు) జయించారు.
(ఇంకా…)

47వ వారం
విశాఖపట్టణం ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదం

2023 విశాఖపట్టణం ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదం అన్నది 2023 నవంబరు 19న రాత్రి భారత కాలమానం ప్రకారం 23:00 గంటలకు విశాఖపట్నం నగరంలోని ఫిషింగ్ హార్బర్‌లో జరిగని అగ్నిప్రమాద దుర్ఘటన. దీని కారణంగా 45 మర పడవలు పూర్తిగా దగ్ధం కాగా 15 పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఏ కారణంగా ప్రమాదం జరిగిందన్న అంశం తెలియరాలేదు, కారణాన్ని కనిపెట్టడానికి పోలీసు దర్యాప్తు జరుగుతోంది. ఈ దుర్ఘటన వల్ల రూ. 30-35 కోట్ల ఆస్తినష్టం వాటిల్లిందని అధికారులు అంచనావేశారు. పేరొందిన యూట్యూబర్, స్థానిక మత్స్యకారుడు అయిన లోకల్ బాయ్ నాని ఈ ప్రమాదానికి సంబంధం ఉందన్న అనుమానాలతో పోలీసులు మొదట అరెస్టు చేశారు. సీసీ టీవీ ఫుటేజి నానికి సంబంధం ఉందన్న సందేహాన్ని బలపరచడం లేదని పోలీసులు ప్రకటించారు. లోకల్ బాయ్ నాని ఈ విషయంలో హైకోర్టును ఆశ్రయించాడని తర్వాత పోలీసులు తెలిపారు. 2023 నవంబరు 26న వాసుపల్లి నాని, అతని మామ సత్యంలు ఈ ప్రమాదానికి కారకులని నిర్ధారించినట్టు ప్రకటించారు. పోలీసుల కథనం ప్రకారం నవంబరు 19 రాత్రి మద్యం మత్తులో ఉన్న వీరు సిగరెట్టును వెళ్తూ ఒక బోటులోకి విసిరేయడంతో వలలకు నిప్పు అంటుకుని ఈ ప్రమాదానికి దారితీసింది. పోలీసులు వారిద్దరిపై కేసును నమోదుచేయడాన్ని తప్పుపడుతూ, పోలీసులు అమాయకులను కేసులో ఇరికిస్తున్నారంటూ స్థానిక మత్స్యకార మహిళలు ఆందోళన చేపట్టారు.
(ఇంకా…)

48వ వారం
కీ బోర్డు

కీ బోర్డు కంప్యూటరుకు అనుబంధంగా ఉండే ఇన్‌పుట్ పరికరాల్లో ముఖ్యమైనది. వాడుకరి దీని ద్వారా అక్షరాలు, అంకెలను, కొన్ని ప్రత్యేక వర్ణాలనూ కంప్యూటరు లోకి ఎక్కించవచ్చు. కంప్యూటర్ కీబోర్డుల సాంకేతికత అనేక అంశాలను కలిగి ఉంటుంది. వినియోగదారుల డిమాండ్ల కోసం అనేక విభిన్న కీబోర్డ్ సాంకేతికతలు అభివృద్ధి చేయబడ్డాయి. ఇవి పారిశ్రామిక అనువర్తనాల కోసం ఆప్టిమైజ్ చేయబడ్డాయి. ప్రామాణిక పూర్తి-పరిమాణ (100%) కంప్యూటర్ ఆల్ఫాన్యూమరిక్ కీబోర్డ్ సాధారణంగా 101 నుండి 105 కీలను ఉపయోగిస్తుంది; ల్యాప్‌టాప్ కంప్యూటర్‌లలో అనుసంధానించబడిన కీబోర్డ్‌లు సాధారణంగా తక్కువ సమగ్రంగా ఉంటాయి. కంప్యూటర్, ఫోన్ కీ బోర్డులు సాంప్రదాయికంగా భౌతిక మీటలు కలిగివుండేవి. వీటిపై సాధారణంగా ఇంగ్లీషు అక్షరాలే ముద్రించబడివుండేవి. అందువలన తెలుగు టైపు నేర్చుకోవడం కొంత కష్టంగా వుండేది. ఇటీవల స్మార్ట్ ఫోన్ల లేక టాబ్లెట్ కంప్యూటర్ లో స్పర్శా తెర (touch screen) సాంకేతికాల వలన మిథ్యా కీ బోర్డు (ఉదాహరణ మల్టీలింగ్ తెలుగు కీ బోర్డు) వుండటం వలన తెలుగు అక్షరాలు చూపించడం, దానివలన టైపు చేయడం అత్యంత సులభం అవుతున్నది. 2013లో ఆండ్రాయిడ్ 4.2 తో తెలుగు, ఇతర భారతీయ భాషల తోడ్పాటు మెరుగై పూర్తిగా తెలుగులో వాడుకోవడానికి వీలయ్యింది. (చూడండి ప్రక్కన ఫోటోలు) సాంప్రదాయక భౌతిక కీ బోర్డులకు ప్రామాణికాలు తయారైనా అవి అంతగా ప్రజాదరణ పొందలేక, వివిధ రకాల పద్ధతులు వాడుకలోకి వచ్చాయి.
(ఇంకా…)

49వ వారం
కోమగట మారు సంఘటన

కోమగట మారు అనే జపాను ఓడలో భారతీయులు కెనడాకు వలసపోగా వారిని కెనడాలో అడుగుపెట్టనీయకుండా వెనక్కి పంపేసిన ఘటనను కోమగట మారు సంఘటన అంటారు. ఈ ఓడలో బ్రిటిషు భారతదేశం నుండి ఒక సమూహం 1914 ఏప్రిల్‌లో కెనడాకు వలస వెళ్ళడానికి ప్రయత్నించింది. అయితే కెనడా, వారిలో చాలామందికి ప్రవేశం నిరాకరించి, వెనక్కి తిప్పి కోల్‌కతా (ప్రస్తుత కోల్‌కతా) కి పంపేసింది. కోల్‌కతాలో, ఇండియన్ ఇంపీరియల్ పోలీసులు ఆ గ్రూపు లీడర్లను అరెస్టు చేయడానికి ప్రయత్నించగా అల్లర్లు చెలరేగాయి, వారిపై పోలీసులు కాల్పులు జరిపారు, ఫలితంగా 20 మంది మరణించారు. బ్రిటిష్ ఇండియాలోని పంజాబ్ ప్రావిన్స్ నుండి 376 మంది ప్రయాణీకులను తీసుకుని కోమగట మారు బ్రిటిష్ హాంకాంగ్ నుండి షాంఘై, చైనా, జపాన్ లోని యోకోహామా మీదుగా కెనడాలోని వాంకోవర్‌కు 376 మంది ప్రయాణికులను తీసుకువెళ్ళింది. ప్రయాణీకులలో 337 మంది సిక్కులు, 27 మంది ముస్లింలు, 12 మంది హిందువులూ ఉన్నారు, వీరందరూ పంజాబీలే. ఈ 376 మంది ప్రయాణీకులలో 24 మందిని కెనడాలోకి రానిచ్చారు. మిగిలిన 352 మందిని కెనడా గడ్డపై దిగడానికి అనుమతించలేదు. ఓడ కెనడా జలాలను విడిచిపెట్టవలసి వచ్చింది. కెనడాకు చెందిన మొదటి రెండు నావికాదళ నౌకలలో ఒకటైన HMCS రెయిన్‌బోను ఈ ఓడకు కాపలాగా ఉంచారు.
(ఇంకా…)

50వ వారం
కార్ల్ విల్‌హెల్మ్ షీలే

కార్ల్ విల్‌హెల్మ్‌ షీలే ( 1742-1786) జర్మన్-స్వీడన్ కు చెందిన రసాయన శాస్త్రవేత్త. ఐజాక్ అసిమోవ్ అనే శాస్త్రవేత్త అతనిని "హార్డ్ లక్ షీలే" అని పిలిచేవాడు. ఎందువల్లనంటే, ఆయన అనేక రసాయన శాస్త్ర ఆవిష్కరణలను, ఇతర శాస్త్రవేత్తలు ప్రచురించక ముందే తెలియజేశాడు. ఉదాహరణకు ఆక్సిజన్ అనే మూలకం గూర్చి జోసెఫ్ ప్రీస్ట్‌లీ తన పరిశోధనను ప్రచురించక ముందే షీలే తెలియజేయటం. మాలిబ్డనం, టంగస్టన్, బేరియం, హైడ్రోజన్, క్లోరిన్ వంటి మూలకాలను హంఫ్రీ డేవీ, యితరులు తెలియజేయక ముందే తెలియజేయటం. షీలే స్ట్రాల్సండ్, స్వీడిష్ పొమెరానియాలో జన్మించాడు. అతని తండ్రి జోచిమ్‌ క్రిస్టియన్ షీలే. అతని తండ్రి ఒక జర్మన్ కుటుంబానికి చెందిన వర్తకుడు. షీలే తన 14 వ సంవత్సరంలో "గూటెన్‌బర్గ్"లో గల ఔషధతయారీ పరిశ్రమలో ఒక అప్రెంటిస్ గా "మార్టిన్ ఆండ్రియాస్ బచ్"తో కలసి చేరాడు. అచట 8 సంవత్సరాల వరకు ఉన్నాడు. ఆ తర్వాత ఒక వైద్యుని వద్ద సహాయకునిగా ఉన్నాడు. తర్వాత అతడు స్టాక్ హోంలో ఔషధ నిర్మాతగా ఉన్నాడు. 1770 నుండి 1775 వరకు 'ఉప్ప్సలా' లో, తరువాత కోపెన్ లో ఉన్నాడు. షీలే తన జీవితంలో ఎక్కువకాలం జర్మన్ మాట్లాడుటకు ఇష్టపడేవాడు. జర్మన్ భాషను స్వీడిష్ ఔషధ శాస్త్రవేత్తలతో కూడా మాట్లాడేవాడు.
(ఇంకా…)

51వ వారం
కోరింగ వన్యప్రాణి అభయారణ్యం

కోరింగ వన్యప్రాణి అభయారణ్యం లేదా కోరంగి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఆంధ్రప్రదేశ్ లో, కాకినాడ జిల్లా, కోరంగి వద్ద ఉన్న అతిపెద్ద మడ అడవుల అభయారణ్యం. కాకినాడ నుంచి కోనసీమ జిల్లా పరిధిలోని భైరవపాలెం వరకు సుమారు అరవై వేల ఎకరాల్లో ఈ అడవులు విస్తరించి ఉన్నాయి. ఈ అడవులు గోదావరి నదీ ముఖద్వారంలోని ఒక భాగంలో ఉన్నాయి. అందంగా, గుబురుగా పెరిగే మడ వృక్షాలు సముద్రపు కోతలు, ప్రకృతి వైపరీత్యాల నుంచి తీర ప్రాంతాలను రక్షిస్తాయి. ఈ అభయారణ్యం పలు రకాలైన జంతువులకు, జలచరాలను ఆశ్రయం ఇస్తోంది. కోరంగి అభయారణ్యం మడ అడవులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకినాడనుండి 10 కి.మీ. దూరంలో ఉంది. అటవీశాఖ వారి లెక్కప్రకారం 235 చ. కి. మీ. విస్తీర్ణంలో విస్తరించి ఉన్న మడ అడవులు దేశంలోనే రెండవ పెద్ద మడ అడవులుగా స్థానం సంపాదించుకున్నాయి. చిత్తడినేలలో పెరిగే చెట్లయొక్క వేర్ల వ్యవస్థ భిన్నంగా ఉంటుంది. భూమిలోనికి ఉండే వేర్లవల్ల ఈ చెట్లకి కావలసినంత ఆక్సిజన్‌ తీసుకొనే అవకాశం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే, ఇక్కడి నేలలు నిరంతరం నీటిలో మునిగి ఉంటాయి. వేర్ల ద్వారా గాలిపీల్చుకునే ఈ చిత్తడి అడవులు కేవలం నదీ సాగరసంగమ ప్రదేశంలో ఏర్పడ్డ చిత్తడి (బురద) నేలల్లోనే పెరుగుతాయి.
(ఇంకా…)

52వ వారం
ధీరుభాయ్ అంబానీ

ధీరుభాయ్ అంబానీ గా పేరుపొందిన ధీరజ్‌లాల్ హీరాచంద్ అంబానీ భారతదేశ వ్యాపారవేత్త. రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు. 1977లో ఈ సంస్థ పబ్లిక్ కి వెళ్ళింది. 2016లో భారత ప్రభుత్వం ఆయన వ్యాపార, వాణిజ్యాల్లో ఆయన చేసిన కృషికి గాను మరణానంతరం పద్మ విభూషణ్ పురస్కారం అందజేసింది. ఆయన మరణం తర్వాత కుమారులు ముకేష్ అంబానీ, అనిల్ అంబానీ ఇద్దరూ వ్యాపార సామ్రాజ్యాన్ని పంచుకున్నారు. ఈయనకు 17 ఏళ్ళు రాకముందే స్థానికంగా చిన్న వ్యాపారాల్లో పూర్తి పట్టు సంపాదించారు. యువకుడిగా ఉన్నప్పుడు భారతదేశ స్వాతంత్ర్యానంతరం రాష్ట్రాన్ని పాకిస్థాన్ లో విలీనం చేసే ప్రయత్నానికి అడ్డుకునేందుకు జునాగఢ్ నవాబుకు వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహించాడు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇంధనం మీద ఎక్కువగా ఆధారపడి ఉందని గ్రహించిన ఈయన చిన్న వయసులోనే గమనించాడు. ఒక దశలో అప్పటిదాకా తాను వ్యాపారంలో సంపాదించిన ధనాన్ని తండ్రికి ఇచ్చి భారతదేశాన్ని వదిలి బ్రిటిష్ కాలనీగా ఉన్న ఆడెన్ చేరుకుని అక్కడ బ్రిటిష్ షెల్ అనే ఇంధన కంపెనీలో 300 రూపాయాల జీతానికి ఉద్యోగంలో చేరాడు. ఇది ఆయనకు చమురు పరిశ్రమకు సంబంధించిన అనుభవాన్ని సమకూర్చింది.
(ఇంకా…)

ఇవి కూడా చూడండి

[మార్చు]