వికీపీడియా:ఈ వారం వ్యాసాలు (2011)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

2011 సంవత్సరంలో "ఈ వారం వ్యాసం" శీర్షికలో ప్రదర్శించిన వ్యాసాలు

ప్రస్తుత ప్రతిపాదనలు, జాబితా కోసం వికీపీడియా:ఈ వారపు వ్యాసం జాబితా చూడండి.


1వ వారం

పింగళి వెంకయ్య (ఆగష్టు 2, 1878 - జూలై 4, 1963), స్వాతంత్ర్య సమర యోధుడు మరియు భారతదేశ జాతీయ పతాక రూపకర్త. వెంకయ్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లా మచిలీపట్నము సమీపమున ఉన్న ప్రస్తుత మొవ్వ మండలములోని భట్లపెనుమర్రు గ్రామములో హనుమంతరాయుడు మరియు వెంకటరత్నమ్మ దంపతులకు జన్మించాడు. వెంకయ్య చిన్నప్పటి నుండే చాలా చురుకైన విద్యార్ధి. ఈయన ప్రాధమిక విద్య చల్లపల్లి లో మరియు మచిలీపట్నములోని హిందూ ఉన్నత పాఠశాలలో జరిగినది. ఈయన ఉన్నత పాఠశాల పూర్తిచేసుకొని సీనియర్ కేంబ్రిడ్జ్ చేయుటకు కొలంబో వెళ్లాడు.

19 ఏళ్ల వయసులో దేశభక్తి మరియు ఉత్సాహముతో దక్షిణాఫ్రికా లో జరుగుతున్న బోయర్ యుద్ధములో పాల్గొన్నాడు. దక్షిణాఫ్రికాలో ఉండగా మహాత్మా గాంధీని కలిశాడు. గాంధీతో వెంకయ్యకు యేర్పడిన ఈ సాన్నిహిత్యము అర్ధశతాబ్దము పాటు నిలిచింది. ఆనాటి నుండి జాతీయ జెండా ఎలా ఉండాలనే సమస్యనే తన అభిమాన విషయంగా పెట్టుకొని దీన్ని గురించి దేశంలో ప్రచారం ప్రారంభించాడు. 1913 నుండి ప్రతి కాంగ్రెస్ సమావేశానికి హాజరై నాయకులందరితోనూ జాతీయ పతాక ప్రతిష్ఠాపన గురించి చర్చలు జరిపాడు. 1916 లో " భారతదేశానికొక జాతీయ జెండా " అనే పుస్తకాన్ని ఇంగ్లీషులో రాసి ప్రచురించాడు. ఈ గ్రంథానికి అప్పటి వైస్రాయ్ కార్యనిర్వాహక సభ్యుడైన కేంద్రమంత్రి సర్ బి.ఎన్.శర్మ ఉత్తేజకరమైన పీఠిక వెలయించాడు. అప్పట్లో వెంకయ్య బందరు జాతీయ కళాశాలలో ఉపాధ్యాయులుగా ఉండేవాడు. ఆనాడు అతను చిత్రించిన పతాకమే నేటి త్రివర్ణ జాతీయ జెండాగా రూపొందింది.

1916 సంవత్సరం లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో వెంకయ్య తయారు చేసిన జాతీయ జెండానే ఎగురవేశారు. 1919 లో జలంధర్ వాస్తవ్యులైన లాలా హన్స్ రాజ్ మన జాతీయ పతాకంపై రాట్న చిహ్నముంటే బాగుంటుందని సూచించగా గాంధీజీ దాన్ని అంగీకరించాడు. 1921 లో అఖిల భారత కాంగ్రెస్ సమావేశాలు బెజవాడలో జరిగాయి. గాంధీజీ, వెంకయ్యను ఆ సమావేశానికి పిలిపించి కాషాయం- ఆకుపచ్చ రంగులు కలిగి, మధ్య రాట్నంగల ఒక జెండాను చిత్రించమని కోరాడు. మహాత్ముని సూచనపై కాషాయం, ఆకుపచ్చ రంగులు కలిగి, మధ్యన రాట్నం చిహ్నం గల జాతీయ జెండాను సమకూర్చాడు వెంకయ్య. అనంతరం కొత్త ఆలోచన మీద, సత్య- అహింసలకు ప్రత్యక్ష నిదర్శనమైన తెలుపు రంగును కూడా ఉండాలని గాంధీజీ అభిప్రాయపడగా, వెంకయ్య ఆ జెండాలో అదనంగా తెలుపు రంగును చేర్చి నేటి త్రివర్ణ పతాకాన్ని దేశానికి ప్రసాదించాడు.

ఇంకా....పూర్తివ్యాసం పాతవి

2వ వారం

ఏలూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లా యొక్క ముఖ్య పట్టణము. మద్రాసు - కలకత్తా జాతీయ రహదారి (NH5) లో ఏలూరు పట్టణం విజయవాడ నుండి 63 కి.మీ. రాజమండ్రి నుండి 98 కి.మీ. దూరంలో ఈ రెండు పట్టణాల మధ్య ఉంది. జిల్లా కేంద్రమైనందున ప్రభుత్వ కార్యాలయాల కేంద్రంగాను మరియు చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజల వ్యాపార, వైద్య, విద్య, రవాణా అవసరాల కేంద్రంగా ఉంటున్నది. వరి, కూరగాయలు, పొగాకు వర్తకం, చేపల ఎగుమతి, సి.ఆర్.రెడ్డి కాలేజి, అంబికా దర్బార్ బత్తి, జూట్ మిల్లు, తమ్మిలేరు, కృష్ణ కాలువ, సమీపంలో కొల్లేరు సరస్సు - ఇవి ఏలూరు గురించి చెప్పేటప్పుడు ప్రధానంగా ప్రస్తావించ దగిన అంశాలు.

ఏలూరు ఒక మునిసిపల్ కార్పొరేషన్. 2001 జనాభా లెక్కలు ప్రకారం ఏలూరు పట్టణ జనాభా 1,89,772. పరిసర ప్రాంతాలతో కలిపి (agglomeration) జనాభా 215,343. ఏలూరును సంస్కృతీకరించి హేలాపురి అని పిలుస్తారు. ఏలూరు పట్టణానికి ఒక ప్రక్క పల్లపు ప్రాంతాలు (కొల్లేరు, కైకలూరు), మరొక ప్రక్క మెరక ప్రాంతాలు (చింతలపూడి, జంగారెడ్డిగూడెం) ఉన్నందున ఇక్కడి నిత్య జీవనంలో రెండు ప్రాంతాల ప్రభావం కనిపిస్తుంది.

మెరక ప్రాంతమైన చింతలపూడి వైపు నుండి వచ్చే తమ్మిలేరు వాగు ఏలూరి చివర రెండు గా చీలుతుంది(అశోక్ నగర్ వద్ద). ఎడమవైపు చీలిన వాగు తంగెళ్లమూడి మీదుగా ప్రవహిస్తూ నగరానికి ఒక వైపు సరిహద్దుగా ఉంటుంది. రెండవ చీలిక ఆశోక్ నగర్, అమీనా పేట మీదుగా ప్రవహిస్తూ బస్‌స్టాండు, సి.ఆర్.రెడ్డి కాలేజీ పక్కగా ప్రవహిస్తూ, నగరానికి వేరే సరిహద్దుగా కనిపిస్తుంది. ఈ రెండు చీలికలమధ్య డెల్టాలా ఏలూరు పట్టణం వుంటుంది. కృష్ణానది నుండి వచ్చే ఏలూరు కాలువ పట్టణం మధ్యలో నైఋతి నుండి ఈశాన్యం దిశగా ప్రవహిస్తుంది. గోదావరి నుండి వచ్చే ఏలూరు కాలువ, కృష్ణ కాలువ, తమ్మిలేరు - ఇవి మూడూ పాలగూడెం (మల్కాపురం) వద్ద కలిసి కొల్లేరులో కలవడానికి సాగుతాయి.

పరిశ్రమల పరంగా ఏలూరు చెప్పుకోదగినంత అభివృద్ధి సాధించలేదనే అనవచ్చును. ఎంతో కాలంగా నడుస్తున్న జూట్ మిల్లు తప్పించి ఇక్కడ ఎక్కువ మందికి ఉపాధి కలిగించే పెద్ద పరిశ్రమలు లేవు. అంబికా దర్బార్ బత్తి మాత్రమే ఏలూరు నుండి ప్రసిద్ధమైన బ్రాండ్ ఉత్పత్తి. పారిశ్రామిక వాడలో ఉన్న కొద్దిపాటి పరిశ్రమలు ఇంకా కుటీర, చిన్నతరహా పరిశ్రమల స్థాయిలోనే ఉన్నాయి.

ఇంకా....పూర్తివ్యాసం పాతవి

3వ వారం
తెలుగు కథ లేదా కత తెలుగులో ఒక సాహితీ ప్రక్రియ. తెలుగు అకాడమి నిఘంటువు ప్రకారం కథ అనగా కొంత సత్యాంశతో కూడిన కల్పిత గద్య గ్రంథం. ఎవరైన లేనివి కల్పించి మట్లాడితే“కతలు చెప్పకు”అని అంటుంటాం. అంటే కల్పిత వృత్తాంతం కలిగినది కథ అని అర్థం. ఆంధ్ర దేశంలొ చిన్నపిల్లలకు నిద్రపోవడానికి తల్లిదండ్రులు చిన్న చిన్న కథలు చెప్పడం బాగా అలవాటు. పాత కాలపు కథల్లో తూర్పుదేశాల కథలు ప్రసిద్ధిపొందాయి. తెలుగులోను మరియు ఇతర భారతీయ భాషలలో కొత్త కథ పుట్టి సుమారు నూరేళ్ళయింది. ఈ నూరేళ్ళలో సుమారు లక్షకు పైగా కథలు రచించ బడినట్లుగా ఒక అంచనా. ఇవి ఎక్కువగా దిన, వార, మాస పత్రికలలో ప్రచురించబడుతున్నాయి. కొన్ని కథా సంకలనాలు ప్రత్యేకంగా ముద్రించ బడుతున్నాయి. ఈ కథలు ముఖ్యంగా నీతి, ధర్మం, సాహసం, ఔదార్యం, శృంగారం వంటి విషయాలు ప్రధాన వస్తువుగా నడుస్తాయి. ఇతర సాహిత్య ప్రక్రియలన్నింటికన్నా కథకి ఆదరణ ఎక్కువ.

విజ్ఞానాత్మకమైన పంచతంత్ర కథలు మొదలు సాహస ఔదార్యాది గుణ వర్ణనాత్మకమైన విక్రమార్కకథలు, అద్భుతమైన భేతాళకథలు, వినోదాత్మకమైన పేదరాశి పెద్దమ్మ కథలు, హాస్యభరితమైన తెనాలిరామలింగని కథలు పిల్లలను అలరిస్తూవినోదాన్ని విజ్ఞానాన్ని అందించి వారుఉత్తమగుణ సంపన్నులుగా ఎదగడానికిదోహదంచేస్తున్నాయి. కథలు పద్యరూపంలో రచింపబడితే వాటిని కథాకావ్యాలు అంటారు.

తెలుగు సాహిత్యంలో మహభారత రచనతో కవిత్రయంవారు కథలను ప్రారంభించారు. అలాగే భాగవతంలోకూడ అనేక కథలు ఉన్నాయి. కథలకే ఎక్కువప్రాధాన్యం గలవి కథాకావ్యాలు. కథాకావ్యాల్లో కథాకథన శిల్పానికి ప్రాముఖ్యం ఉంటుంది. ఆనాటి సాంఘిక పరిస్థితులను అవి ప్రతిబింబిస్తాయి. మొదటి కథాకావ్యం దశకుమార చరిత్ర. దీనిని తిక్కన శిష్యుడు కేతన 13వ శతాబ్దంలో రచించి తిక్కనకే అంకితంఇచ్చాడు. కేతన కథాకావ్యరచనకు మార్గదర్శకుడు కాగా ప్రస్తుతం వచన రూపంలో వెలువడే కథలన్నిటికి కథాకావ్యాలే మార్గం వేసినట్లు చెప్పవచ్చు.

ఇంకా....పూర్తివ్యాసం పాతవి

4వ వారం

చిత్తూరు జిల్లాలో ఉన్న 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటైన కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణాదిగా ఉన్న నియోజకవర్గం. తమిళనాడు, కర్ణాటక సరిహద్దులు కలిగిన కుప్పం నియోజకవర్గం రెండు సార్లు ముఖ్యమంత్రి అభ్యర్థిని గెలిపించి ప్రత్యేకతను చాటుకుంది. ఈ నియోజకవర్గానికి ఉన్న మరో ప్రత్యేకత రాష్ట్రంలోనే చిట్టచివరి శాసనసభ నియోజకవర్గపు సంఖ్యను కలిగి ఉండటం. 294 నియోజకవర్గాలు కలిగిన రాష్ట్రంలో ఈ నియోజకవర్గపు సంఖ్య 294. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ శాసనసభ నియోజకవర్గం మరో 6 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 1955లో ఏర్పడిన కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ మరియు కాంగ్రెస్ (ఐ) పార్టీలు కేవలం రెండుసార్లు మాత్రమే గెలిచాయి. గాంధేయవాది, స్వాతంత్ర్య సమరయోధుడైన డి.రామబ్రహ్మం కుప్పం తొలి శాసనసభా సభ్యునిగా ఎన్నికయ్యాడు. ఆ తరువాత 1962లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో సి.పి.ఎంకు చెందిన వజ్రవేలు చెట్టి ఎన్నికయ్యాడు. 1967 ఎన్నికలలో కుప్పం ప్రజలు రాజకీయాలలోకి కొత్తగా ప్రవేశించిన ఒక స్వతంత్ర అభ్యర్ధి అయిన డి.వెంకటేశంను గెలిపించారు. రాజకీయ అతిరథులైన డి.రామబ్రహ్మం మరియు వజ్రవేలు చెట్టి వంటి వారిని ఓడించి ఈయన సాధించిన అనూహ్య విజయం అందరినీ ఆశ్చర్యపరచింది. డి.వెంకటేశం 1972లో తిరిగి కుప్పం నుండి రెండవ పర్యాయము శాసనసభకు ఎన్నికయ్యాడు. ఆ తరువాత ఎన్నికలలో దేశమంతటా జనతా పార్టీ ప్రభంజనం వచ్చినా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం మాత్రం ఇందిరాగాంధీ పక్షాన నిలచింది. కుప్పం కూడా అందుకు అతీతం కాక ఇందిరా కాంగ్రేసుకు చెందిన బి.ఆర్.దొరస్వామి నాయున్ని శాసనసభకు ఎన్నుకున్నది. అయితే 1982లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపనతో కుప్పంలో కాంగ్రేసు పార్టీ తుడిచిపెట్టుకుపోయింది.

ఇంకా....పూర్తివ్యాసం పాతవి

5వ వారం

పశుపతినాథ్ దేవాలయం నేపాల్ దేశ రాజధాని ఖాట్మండు నగరం ఈశాన్య దిక్కు పొలిమేర్లలో బాగమతి నది ఒడ్డున ఉన్నది. భారతదేశం, నేపాల్ నుండి భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు. మహాశివరాత్రి రోజు అత్యంత పర్వదినం, వేల సంఖ్యలో భక్తులు పశుపతిని దర్శిస్తారు. ఈ దేవాలయంలోకి హిందువులు కాని వారిని అనుమతించరు. ఇక్కడి దేవాలయంలో ఉన్న మూల విరాట్టుని నలుగురు అర్చకులు మాత్రమే స్పృశించే అధికారం ఉన్నది. శంకరాచార్యులు ప్రారంభించిన ఆలయ సాంప్రదాయం ప్రకారం ఇక్కడి అర్చకులు దక్షిణ భారతదేశం నుండి నియమించబడతారు. శంకరాచార్యులు ఇక్కడ మానవ మరియు జంతు బలిని నిషేధించారు. దక్షిణ భారతదేశం నుండి అర్చకులు ఇక్కడ పూజలు నిర్వహించడానికి ప్రధాన కారణం నేపాల్ రాజు మరణించినప్పుడు నేపాల్ దేశము సంతాప సముద్రములో ఉంటుంది. నేపాల్ ప్రజలకు పశుపతినాథ్ స్వామి నిత్యకైంకర్యాలు చేసే అవకాశం ఉండదు, పశుపతినాథ్ కి నిత్యకైంకర్యాలు నిరంతంగా కొనసాగాలనే కారణం చేత భారతదేశార్చకులు ఇక్కడ అర్చకత్వం నిర్వహిస్తుంటారు.

గోవు ఇతిహాసం ప్రకారం శివుడు ఒకప్పుడు జింక వేషం ధరించి బాగమతి నది ఒడ్డున విహరిస్తుండగా దేవతలు అతని కొమ్ముని పట్టుకొన్నారు. అప్పుడు ఆ కొమ్ము విరిగి పోయి ఇక్కడ ఖననం చేయబడింది. శతాబ్ధాల తరువాత ఒకనాడు ఒక ఆవు ఇక్కడి ప్రాంతానికి వచ్చి ఈ లింగం పడిన ప్రాంతంలో పాలు కురిపిస్తుంటే పశువుల కాపరి అక్కడి ప్రదేశాన్ని త్రవ్వగా శివ లింగం బయట పడింది. మరో ఇతిహాసం నేపాల మహత్యం మరియు హిమవత్‌ఖండం ప్రకారం ఒకరోజు శివుడు కాశి నుండి భాగమతి నది ఒడ్డున ఉన్న మృగస్థలి అనే ప్రదేశంలో పార్వతి సమేతంగా వచ్చి జింక అవతారంతో నిద్రుస్తుండగా దేవతలు శివుడిని కాశి తిరిగి తీసుకొని పోవడానికి జింకని లాగినప్పుడు జింక కొమ్ము విరిగి నాలుగు ముక్కలుగా పడింది. ఈ నాలుగు ఖండాలుగా పడినదే ఇప్పుడు చతుర్ముఖ లింగం గా ఉన్నదని ఇతిహాసం చెబుతారు.

ఇంకా....పూర్తివ్యాసం పాతవి

6వ వారం

హిందూ జ్యోతీష్య శాస్త్రం ప్రకారం 'శనీశ్వరుడు' , నవగ్రహాలలో ఒక గ్రహం. సూర్యుడు, చంద్రుడు, ఛాయాగ్రహాలైన రాహువు మరియు కేతువులతో కలిపి గ్రహాలు తొమ్మిది. గగనమండలంలో ఉన్నగ్రహాలకు భూమితో సంబంధం ఉంది. కాబట్టి తొమ్మిది గ్రహాల ప్రభావం భూమిమీద, భూమిపై ఉన్న ప్రతి చరాచర జీవుల పైన, నిర్జీవ, ఝడ, నిర్లిప్త వస్తువుల మీద వుంటుంది. నవగ్రహాలలో ఒకటైన శని గ్రహం ఇందుకు భిన్నం కాదు. శని, శనిగ్రహం, శనేశ్వరుడు, శనీశ్వరుడు, అని పలు నామములతో పిలువబడి, గ్రహరూపలో పూజింపబడే 'శని' ఒక గ్రహదేవత. వారంలో ఏడవవారం శనివారం. శనివవారానికి అధిపతి శనేశ్వరుడు. సంఖ్యాశాస్త్రం ప్రకారం కూడా 'ఏడు' శనికి ప్రీతికరమయిన సంఖ్య.


సూర్యుడుభగవానుడికి, అతని రెండవ బార్య ఛాయదేవికి పుట్టిన సంతానం శని. ఆయనకు ఛాయాపుత్రుడు అనే పేరు కూడా ఉంది. జీవుల జాతక చక్రాలపైన తన ప్రభావాన్ని ఎలా చూపబోతున్నాడో అని నిరూపించడానికి , ఆయన జననం సూర్య గ్రహణములో జరిగింది. ఇతనికి మందగమనుడు అని కూడా పేరు. ఒకసారి సూర్యుని చుట్టిరావడానికి శనికి 30 సంవత్సరాలు పడుతుంది. శానైస్కర్య, అసిత, సప్తర్చి, క్రూరదృష్ట, క్రూరలోచనుడు, పంగు పాదుడు, గృద్రవాహనుడు మొదలైన పేర్లుకూడా ఉన్నాయి.

నల్లని ఛాయ అతని మేని వర్ణం. నల్లని వస్త్రములు అతని ఉడుపులు. ఖడ్గము, బాణములు మరియు రెండు బాకులు అతని ఆయుధాలు. నల్లని కాకి అతని వాహనం. శనిభగవానుడు సహజంగా నల్లటి ఛాయ కలవాడని, ఛాయా మార్థాండ సంభూతుడని, అందమైన ముఖం కలవాడుగాను, క్రూరుడిగాను, మందగమనుడిగాను, గానుగుల కులానికి చెందినవాడుగాను, కాల-భైరవుడికి మహాభక్తుడిగాను హిందూ పురాణాలు జ్యోతిష శాస్త్రాలలో వర్ణింపబడ్డాడు .

ఇంకా....పూర్తివ్యాసం పాతవి

7వ వారం
కపిల్ దేవ్ రాంలాల్ నిఖంజ్ (హిందీ:कपिल देव) భారతదేశపు ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు. 1959, జనవరి 6న ఛండీగఢ్ లో జన్మించిన కపిల్ దేవ్ భారత క్రికెట్ జట్టుకు ఎనలేని సేవలందించి దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యున్నత ఆల్‌రౌండర్‌లలో ఒకడిగా పేరుసంపాదించాడు. 2002లో విజ్డెన్ పత్రికచే 20 వ శతాబ్దపు మేటి భారతీయ క్రికెటర్‌గా గుర్తింపు పొందినాడు. సారథ్యం వహించిన ఏకైక ప్రపంచకప్ (1983) లో భారత్‌ను విశ్వవిజేతగా తీర్చిదిద్దాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించే నాటికి అత్యధిక టెస్ట్ వికెట్లు సాధించిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. 1999 అక్టోబర్ నుంచి 2000 ఆగష్టు వరకు 10 మాసాల పాటు భారత జట్టుకు కోచ్‌గా వ్యవహరించాడు.

కుడిచేతి పేస్ బౌలర్ అయిన కపిల్ దేవ్ తన క్రీడాజీవితంలో అత్యధిక భాగం తనే భారత జట్టు ప్రధాన బౌలర్‌గా చలామణి అయ్యాడు. 1980లలో ఇన్‌స్వింగ్ యార్కర్ బౌలింగ్ వేసి చివరిదశ బ్యాట్స్‌మెన్‌లను హడలెత్తించాడు. బ్యాట్స్‌మెన్ గానూ పలు పర్యాయాలు జట్టుకు విజయాలు అందించాడు. జట్టు ఆపత్కాల దశలో ఉన్నప్పుడు బ్యాటింగ్‌లో విరుచుకుపడి ప్రత్యర్థులను సవాలు చేసేవాడు. దీనికి ముఖ్య ఉదాహరణ 1983 ప్రపంచ కప్ పోటీలలో జింబాబ్వేపై జరిగిన వన్డే పోటీగా చెప్పవచ్చు. దేశవాళి పోటీలలో హర్యానా క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఇతడి ముద్దుపేరు హర్యానా హరికేన్.

ఇంకా....పూర్తివ్యాసం పాతవి

8వ వారం
దస్త్రం:APtown Elamanchili RlyStn.JPG

ఎలమంచిలి పట్టణము 17.33N, 82.52E అక్షాంశ రేఖాంశాలవద్ద ఉంది. సముద్ర తలం నుండి దీని సగటు ఎత్తు 7 మీటర్లు(26 ఆడుగులు). విశాఖపట్నం నుండి ఇది 64 కి.మీ. దూరంలో ఉంది. ఎలమంచిలి మీదుగా హౌరా-చెన్నై రైల్వేమార్గము మరియు జాతీయ రహదారి ఎన్.హెచ్-5 (కలకత్తా-చెన్నై) పోవుచున్నవి. ఎలమంచిలి అసలు పేరు "ఎల్ల-మజలీ" అని పూర్వపు కళింగ దేశానికి గోదావరి మండలపు ఆంధ్ర రాజ్యానికి అది సరిహద్దు అని, ఉభయ రాజ్యాలవారు పన్ను వసూలుకు ఎలమంచిలిని ఒక మజలీ కేంద్రం గా వాడుకొనుట వల్ల దానికి ఆ పేరు వచ్చినదని తెలుస్తున్నది. వరి, చెరకు పంటలు పండించే పరిసర ప్రాంతానికి ఇది కేంద్రం. ప్రధానంగా చెరకు పంట ఈ ప్రాంతపు ఆర్ధిక వ్యవస్థకు ప్రముఖ వనరు. ఊరిలో 2 ప్రభుత్వ కళాశాలలు, 3 ప్రైవేటు జూనియర్ కళాశాలలు, 3 డిగ్రి కళాశాలలు, పి.జి. సెంటర్ ఉన్నాయి. 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, పశువుల ఆసుపత్రి, ఆర్.టి.సి కాంప్లెక్స్, 4 సినిమా హాళ్ళున్నాయి. గ్రామ పంచాయతి 1-3-1886 లో ఏర్పడినది. ప్రస్తుతము మేజర్ పంచాయతి మరియూ మండల కేంద్రము.

చారిత్రిక యుగాల్లో ఈ ప్రాంతంలో వాసికెక్కిన ప్రముఖ వాణిజ్య రేవుపట్నం ‘దివ్వెల’యే యలమంచిలికి 6 కి.మీ.ల దూరంలో కుగ్రామంగా నున్న నేటి దిమిలి. నౌకలకు సంకేతం సూచికంగా ఎత్తైన దీప స్తంబాలపై దివ్వెలనుపయోగించుటచే ఈప్రదేశానికి ఆ పేరు వచ్చింది. ఆనాడు సముద్రయానానికి ముందు ఆరాధించబడే దైవం”రత్నాకరస్వామి” ఆలయం నేటికి దిమిలి సమీపాన గల తెరువుపల్లి గ్రామంలో ఉంది. యలమంచిలికి 10 కి.మీ. దూరం నున్న పంచదార్ల గ్రామంలో చారిత్రిక విశిష్టత కల అతి ప్రాచీన శైవక్షేత్రం ధర్మలింగేశ్వరాలయం కలదు. ఉత్తరాంధ్రవాసుల ఆరాధ్య దైవమైన 'ఉపమాక వెంకన్న'గా పిలువ బడే వేంకటేశ్వరస్వామి ఆలయం యలమంచిలి కి 20 కి.మీ.దూరంలో కల ఉపమాక గ్రామం లో వెలిసింది. యలమంచిలిలో గల ప్రాచీన దేవాలయాలలో వీరభద్రస్వామి దేవాలయం ఒకటి

స్వాతంత్ర్యోద్యమంలో పలువురు యలమంచిలి ప్రాంతవాసులు తుదివరకూ పాల్గొని జైలు శిక్షను అనుభవించారు. వారిలో స్త్రీలు కూడా ఉండడం విశేషం.

ఇంకా....పూర్తివ్యాసం పాతవి

9వ వారం

భారత దేశపు ఉక్కు మనిషి గా పేరుగాంచిన సర్దార్ వల్లభ్ భాయి పటేల్ ప్రముఖ స్వాతంత్ర యోధుడే కాడు, స్వాతంత్రానంతరం సంస్థానాలు భారతదేశము లో విలీనం కావడానికి గట్టి కృషిచేసి సపలుడైన ప్రముఖుడు. హైదరాబాదు, జునాగఢ్ లాంటి సంస్థానాలు భారతదేశము లో విలీనం చేసిన ఘనత అతనికే దక్కుతుంది. భారత రాజ్యాంగం రచనలో ప్రముఖ పాత్ర వహించడమే కాకుండా స్వాతంత్రానంతరం జవహార్ లాల్ నెహ్రూ మంత్రిమండలి లో హోంమంత్రి గాను, ఉప ప్రధానమంత్రి గాను బాధ్యతలను నిర్వహించాడు. ప్రజలు ప్రకటించిన నామం ఉక్కు మనిషి.

1875 అక్టోబర్ 31న గుజరాత్‌లోని నాడియర్లో జవేరీ భాయి, లాడ్‌లా పటేల్‌లకు నాల్గవ సంతానంగా జన్మించాడు. ప్రాథమిక విద్యాభ్యాసం స్థానికంగా జరిగిననూ ఉన్నత న్యాయశాస్త్ర చదువులకై ఇంగ్లాండు వెళ్ళి బారిష్టర్ పరీక్ష ఉత్తీర్ణుడైనాడు. ఆ తర్వాత స్వదేశానికి తిరిగివచ్చి అహ్మదాబాదులో న్యాయవాద వృత్తిని చేపట్టాడు. తన భార్య అయిన ఝవెర్బాను పుట్టింటినుండి తీసుకొచ్చి గోద్రాలో కాపురం పెట్టాడు. 1904లో ఆయనకు ఒక కుమార్తె - మణిబెన్, 1906లో దహ్యాభాయ్ అను కుమారుడు జన్మించారు. 1909లో ఆయన భార్య కాన్సర్తో మరణించింది. వల్లభాయ్ కోర్టులో ఒక కేసు గురించి వాదిస్తున్నపుడు ఆమె మరణించిన వార్తను అందించినపుడు ఆ పేపరును చూసి తన జేబులో పెట్టుకొని, తిరిగి కేసు వాదించి గెలిచాడు. ఆ తర్వాతే ఆ వార్తను ఇతరులకు తెలియచేసాడు. ఆమె మరణానంతరం తిరిగి వివాహం చేసుకోరాదని నిశ్చయించుకున్నాడు. తన కుటుంబసభ్యుల సహకారంతో పిల్లలను పెద్దవాళ్ళను చేసాడు.

36 ఏళ్ళ వయసులో ఇంగ్లాండుకు వెళ్ళి అక్కడ లండన్‌లో ఒక లా కాలేజీలో చేరాడు. 36 నెలల కోర్సును 30 నెలలో పూర్తిచేసాడు, అదీ క్లాసులో ప్రథమ స్థానంలో. తర్వాత అహ్మదాబాద్‌కు తిరిగి వచ్చి అనతికాలంలోనే గొప్ప లాయరుగా విశేష కీర్తిని ధనాన్ని ఆర్జించాడు. ఆయన ఎప్పుడూ తెల్ల దొరలా సూటు బూటు వేసుకొని దర్జాగా తిరిగేవాడు.

ఇంకా....పూర్తివ్యాసం పాతవి

10వ వారం

తారే జమీన్ పర్ 2007లో విడుదలై మంచి ప్రేక్షకాదరణ పొందిన చిత్రం. ఈ చిత్రానికి అమీర్ ఖాన్ దర్శకత్వం వహించాడు., అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మించింది. దీని భావన ముందుగా వచ్చినది మరియు అభివృద్ధి చేసినది వారు రచయిత మరియు సృజనాత్మక దర్శకుడు అయిన అమోల్ గుప్తే మరియు ఆయన భార్య దీపా భాటియా, శంకర్ ఎహసాన్ లాయ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. పాటల రచయిత ప్రసూన్ జోషి, CG యానిమేషన్ విజువల్ కంప్యూటింగ్ లాబ్స్, టాటా ఎలెక్సి Ltd., 2D యానిమేషన్ వైభవ్ కుమరేష్ యొక్క వైభవ్ స్టూడియోలు మరియు శీర్షిక యానిమేషన్ ధీమంత్ వ్యాస్ చే చేయబడ్డాయి. తారే జమీన్ పర్ ప్రపంచవ్యాప్తంగా సినిమా హాళ్ళలో 21 డిసెంబర్ 2007న విడుదలైనది. భారతీయ తర్జుమా యొక్క DVD ముంబాయిలో 25 జూలై 2008న విడుదలైనది . వాల్ట్ డిస్నీ కంపెనీ హోమ్ ఎంటర్టైన్మెంట్ ఉత్తర అమెరికా, బ్రిటన్, మరియు ఆస్ట్రేలియాలలో పంపిణీ చేయడానికి హోమ్ వీడియో హక్కులను కొనుగోలు చేసింది. ఒక అంతర్జాతీయ స్టూడియో భారతీయ చిత్రం యొక్క వీడియో హక్కులను కొనుగోలుచేసింది ఇదే ప్రధమం. ఈ చిత్రం ఎనిమిదేళ్ళ బాలుడు ఇషాన్ (దార్శీల్ సఫారీ)కధను చెప్తుంది, ఒక అధ్యాపకుడు (అమీర్ ఖాన్) అతనికి డిస్లెక్సిక్ (ఒక రకమైన మానసిక సమస్య) ఉందని గుర్తించేదాకా అతను విపరీతంగా బాధపడతాడు. ఈ సినిమా వ్యాపారపరంగానే కాక మరియు విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా పొందింది.తారే జమీన్ పర్ 2008లో ఉత్తమ చిత్రం ఫిలింఫేర్ అవార్డు సాధించింది. అదే సంవత్సరంలో ఉత్తమ కుటుంబ కథా చిత్రంగా జాతీయ అవార్డును గెలుచుకుంది. ఢిల్లీ ప్రభుత్వం దీనికి పన్ను మినహాయింపు ప్రకటించింది.

ఇంకా....పూర్తివ్యాసం పాతవి

11వ వారం
సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యమైన భారత దేశానికి దేశాధినేత రాష్ట్రపతి. రాష్ట్రపతి దేశ ప్రథమ పౌరుడు, సర్వ సైన్యాధ్యక్షుడు. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి కార్యనిర్వాహక దేశాధినేత. శాసన విభాగమైన పార్లమెంటు ఉభయ సభల్ను రాష్ట్రపతి సమావేశపరుస్తారు, ప్రభుత్వాధినేత అయిన ప్రధానమంత్రిని నియమిస్తారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని, ఇతర న్యాయమూర్తులను నియమిస్తారు. అయితే, వాస్తవానికి కార్యనిర్వాహక అధికారాలన్నీ ప్రభుత్వాధినేత అయిన ప్రధానమంత్రివే. ప్రధానమంత్రి సలహా మేరకే, రాష్ట్రపతి సంతకంతో ఉత్తర్వులు జారీ అవుతాయి. రాష్ట్రపతి పదవి అలంకార ప్రాయమైనది. 1950 జనవరి 26 న భారత రాజ్యాంగం అమలు లోకి వచ్చిన తరువాత దేశాధినేతగా రాష్ట్రపతి అయ్యారు. అప్పటి వరకు గవర్నర్ జనరల్ దేశాధినేతగా ఉండేవారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, భారత దేశానికి ఇద్దరు గవర్నర్ జనరల్ గా పనిచేసారు.


భారత రాష్ట్రపతిగా ఎన్నికయేందుకు ఈ అర్హతలు ఉండాలి. (1) భారత పౌరుడై ఉండాలి. (2) వయసు 35 ఏళ్ళు లేదా ఆ పైబడి ఉండాలి. (3) లోక్‌సభ సభ్యుడయేందుకు కావలసిన అర్హతలు ఉండాలి. (4) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో గానీ, ఆ ప్రభుత్వాల నియంత్రణలోనున్న సంస్థలలో గాని సంపాదనగల స్థానం కలిగి ఉండకూడదు. - ఒక వ్యక్తి ఎన్నిమార్లైనా రాష్ట్రపతిగా ఎన్నిక కావచ్చు. రాష్ట్రపతిగా ఎన్నికవ్వబోయే వ్యక్తి, పార్లమెంటు ఉభయసభల్లోగాని, రాష్ట్ర శాసన సభల్లోగాని సభ్యుడిగా ఉండరాదు. ఒకవేళ అటువంటి సభ్యుడు రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేస్తే వెంటనే సదరు సభల్లో సభ్యత్వం కోల్పోతారు. రాష్ట్రపతి వేతనం పార్లమెంటు నిర్ణయిస్తుంది. పదవీకాలం ముగిసే వరకు రాష్ట్రపతి వేతనంలో కోత ఉండదు.

రాష్ట్రపతిని ఎలెక్టోరల్ కాలేజి ఎన్నుకుంటుంది. (1) పార్లమెంటు రెండు సభలలోను గల ఎన్నికైన సభ్యులు (2) రాష్ట్ర శాసన సభలలోని ఎన్నికైన సభ్యులు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రపతిచే ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఏ కారణం చేతనైనా రాష్ట్రపతి పదవి ఖాళీ అయినపుడు, ఆరు నెలలలోగా కొత్త రాష్ట్రపతి పదవీ స్వీకారం జరగాలి.

రాష్ట్రపతి ఐదేళ్ళు పదవిలో ఉంటారు. ప్రభుత్వంలోని మూడు వ్యవస్థలకు సంబంధించి, రాష్ట్రపతికి అధికారాలు ఉంటాయి. అయితే ఈ అధికారాలన్నీ అలంకారప్రాయమైనవే. దాదాపుగా అన్ని విధులూ, ప్రధానమంత్రి సలహా మేరకే జరుగుతాయి.


ఇంకా....పూర్తివ్యాసం పాతవి

12వ వారం

పాలకొల్లు , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము, చిన్న పట్టణము. పాలకొల్లు చుట్టుప్రక్కల భూములు సారవంతమైనవి. ఊరిచుట్టూ పచ్చని వరిచేలు, కొబ్బరితోటలు, చేపల చెరువులు కనిపిస్తాయి. పాలకొల్లు నుండి నరసాపురం పట్టణానికి 10 కి.మీ. దూరం. పాలకొల్లుకు 7 కి.మీ. దూరంలో చించినాడ వద్ద వశిష్టగోదావరి నదిపై కట్టిన వంతెన తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలను కలుపుతుంది.

ఆంధ్రప్రదేశ్‌లో పంచారామాలుగా ప్రసిద్ధి చెందిన 5 పుణ్యక్షేత్రాలలో పాలకొల్లు ఒకటి. శ్రీరాముడు సీతమ్మ వార్ల స్వహస్తాలతో ప్రతిష్టితమైన ప్రసిద్ధ క్షీరారామలింగేశ్వరస్వామి దేవాలయం ఇక్కడే ఉంది. క్షీరం అంటే పాలు. ఆ పేరుమీదుగానే పట్టణానికి పాలకొల్లు అనే పేరు వచ్చింది. స్థల పురాణం ప్రకారం ఒకప్పుడు శివుడు ఇక్కడ బాణం వేస్తే భూమి లోనుంచి పాలు ఉబికివచ్చాయి. పాలకొల్లును పూర్వము క్షీరపురి, పాలకొలను అని పిలిచేవారు. ఇక్కడి మందిరాన్ని చాళుక్యుల కాలంలో, 10 - 11 శతాబ్దులలో, నిర్మించారు. ఈ గుడి గోపురం 9 అంతస్తులతో 125 అడుగుల ఎత్తుతో దర్శనమిస్తుంది. దీనికి కొద్ది దూరంలో ఒక చెరువు ఉన్నది గోపుర నిర్మాణసమయంలో ఒక్కొక్క అంతస్తు నిర్మితమైన తరువాత దాని చుట్టూ మట్టినిపోస్తూ దానిపై రాకపోకలతో రెండవ అంతస్తు నిర్మాణం చేసేవారట ఆవిధంగా మట్టి తీయగా ఏర్పడినదే ఈ చెరువు(ప్రస్తుతం దీనిని రామగుండం అని పిలుస్తున్నారు). తదనంతరం ప్రతిరోజూ చేయబడే అభిషేకక్షీరంతో ఈ చెరువు నిండిపోయి పాలకొలను అను పేరున పిలువబడుతూ ఆప్రాంతమునకు కూడా వర్తించి ఉండ వచ్చని ఒక కథనం. ఆంధ్రప్రదేశ్‌లో ఎత్తయిన,మరియు చోళ రాజుల శిల్పకళా రీతులను అద్భుతంగా చూపే గోపురాలలో ఇది ఒకటి.


ఇంకా....పూర్తివ్యాసం పాతవి

13వ వారం
దస్త్రం:Crreddy.jpg

సి.ఆర్.రెడ్డిగా ప్రసిద్ధుడైన డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి (1880 - 1951) ప్రతిభావంతుడైన సాహితీవేత్త, విద్యావేత్త, పండితుడు, వక్త, రచయిత, హేతువాది. ఆదర్శవాది, రాజనీతిజ్ఞుడు. ఇంతటి ప్రతిభా పాటవాలు ఒక వ్యక్తిలో కానరావడం అరుదు. ఆంధ్రభాషాభిరంజని సంఘంలో చురుకైన పాత్ర పోషించాడు. గైక్వాడ్‌ స్ఫూర్తితో అమెరికాలో విద్యాభ్యాసం చేశాడు. అక్కడినుంచి తిరిగి వచ్చిన తర్వాత బరోడా కళాశాల వైస్‌ప్రిన్సిపాల్‌గా చేరాడు. 1909లో మైసూరులో విద్యాశాఖలో చేరి 1918 నుంచి 1921 వరకు విద్యాశాఖ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌గా వ్యవహరించాడు. 1951లో అనారోగ్యంతో ఆయన మరణించాడు. ఇతడు ఆజన్మాంతం బ్రహ్మచారిగా జీవించారు.

రామలింగారెడ్డి చిత్తూరు జిల్లా కట్టమంచి గ్రామంలో 1880 డిసెంబరు 10న జన్మించాడు. సీఆర్‌రెడ్డి చదువు అతని అయిదో ఏట వీధి బడిలో మొదలయినది. చిన్న వయస్సులోనే భారతాన్ని, అమర బాల రామాయణాన్ని చదివేవాడు. 1890లో ప్రస్తుత పీసీఆర్ పేరుతో ఉన్న చిత్తూరు బోర్డు హైస్కూల్‌లో మొదటిఫారంలో చేరాడు. ప్రతి పరీక్షల్లోనూ ఉన్నత శ్రేణి సాధించేవాడు. ఉన్నతాభ్యాసం కోసం మదరాసు వెళ్ళి క్రైస్తవ కళాశాలలో ఉన్నత విద్య పూర్తి చేసాడు. 1899లో నవ్య కావ్యరచన పోటీలో, తన 19వ యేటనే ముసలమ్మ మరణము లఘు కావ్యాన్ని రచించి బహుమతి పొందాడు. 1902లో బీఏ పరీక్షలో చరిత్రలో, తత్వశాస్త్రంలో అత్యధిక మార్కులతో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణుడై బంగారు పతకాలను పొందాడు. అతను ఆంగ్ల, తెలుగు భాషలలో మంచి వక్త. ఎన్నో బహుమతులు అందుకొన్నాడు.

డిగ్రీలో వచ్చిన మంచి మార్కుల ఫలితంగా ప్రభుత్వం స్కాలర్‌షిప్పుతో ఇంగ్లాండులోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలలయానికి వెళ్ళాడు. భారత ప్రభుత్వపు విద్యార్థి వేతనంతో కేంబ్రిడ్జి విశ్వ విద్యాలయంలో, సెయింట్స్ జాన్స్ కళాశాలలో ప్రవేశించి పలు పురస్కారాలు అందుకున్నాడు. 1903లో అతని తెలివి తేటలకు, సామర్థ్యానికి గుర్తింపుగా రైట్ బహుమతి లభించింది. 1905లో కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో యూనియన్ లిబరల్ క్లబ్ కార్యదర్శిగా ఎన్నికై అక్కడ పలు ఉపన్యాసాలతో ఆంగ్లేయుల మన్ననలు ప్రశంసలు అందుకొన్నాడు. భారతీయుడుగా ఇలాంటి అసాధారణ గౌరవం దక్కడం అదే ప్రథమం. ఇతని విశేష విషయ పరిజ్ఞానం, సమయస్ఫూర్తి, వాగ్ధాటి, హస్య చతురతలకు అక్కడివారు ఆశ్చర్యపడేవారట.


ఇంకా....పూర్తివ్యాసం పాతవి

14వ వారం

ఆలిండియా రేడియో (అధికారికముగా ఆకాశవాణి) (హిందీ: आकाशवाणी) భారతదేశ అధికారిక రేడియో ప్రసార సంస్థ. ఇది భారత ప్రభుత్వ సమాచార మరియు ప్రసరణ మంత్రాంగ అధ్వర్యములో స్వయంప్రతిపత్తి కలిగిన ప్రసార భారతి (బ్రాడ్‌కాస్టింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా) యొక్క విభాగము. ఇది జాతీయ టెలివిజన్ ప్రసార సంస్థైన దూరదర్శన్ యొక్క సోదర విభాగం.

ఆకాశవాణి ప్రపంచములోని అతిపెద్ద రేడియో ప్రసార వ్యవస్థలలో ఒకటి. దీని ప్రధాన కార్యాలయము పార్లమెంటు వీధిలో భారత పార్లమెంటు పక్కనే ఉన్న ఆకాశవాణి భవన్ లో ఉన్నది. ఆకాశవాణి భవన్ లో నాటక విభాగం, ఎఫ్.ఎం రేడియో విభాగం మరియు జాతీయ ప్రసార విభాగాలు ఉన్నాయి. దూరదర్శన్ ఢిల్లీ కేంద్రం కూడా ఆకాశవాణి భవన్లో 6వ అంతస్థులో ఉన్నది.

భారతదేశం లో మెదటి రేడియో ప్రసారాలు 1923 జూన్ లో "రేడియో క్లబ్ ఆఫ్ బొంబాయీ" ద్వారా ప్రసారం చెయబడినవి. దీని తరువాత "బ్రాడ్ కాష్టింగ్ కంపెనీ" ఏర్పాటు చెయ్యబడింది. ప్రయౌగాత్మకంగా జూలై 1927 లొ కలకత్తా, బొంబాయి నగరాలలొ "ఇండియన్ బ్రాడ్ కాష్టింగ్ కంపెనీ" ప్రసారాలు చెసింది. ఇండియన్ బ్రాడ్ కాష్టింగు కంపెనీ భారత ప్రభుత్వం ఆధ్వర్యం లొ ఈ ప్రసారాలు చేసింది. 1936 సంవత్సరములొ ఆకాశవాణి ప్రభుత్వ సంస్ధగా అవతరించింది. అంతకి పూర్వము ప్రైవేటు రేడియో క్లబ్బులు ఉండేవి.

భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చెసరికి 6 ఆకాశవాణి కేంద్రాలు (కలకత్తా, ఢిల్లీ, బొంబాయి, మద్రాసు, లక్నో, తిరుచిరాపల్లి) మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు 215 అకాశవాణి కేంద్రాలు 337 ప్రసార కెంద్రాల (144 MW కేంద్రాలు, 54 SW కేంద్రాలు, 139 ఎఫ్‌ఎం కేంద్రాలు)తొ 77 ఆకాశవాణి కేంద్రాలు 99.13% ప్రజలకు ప్రస్తుతం ప్రజలకు సమాచారాన్ని, విజ్ఞానాన్ని, వినోదాన్ని అందిస్తున్నాయి.

ఇటీవలి కాలంలో టీవీ ఛానెళ్ల ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ ఎఫ్ ఎమ్ రేడియో చానెళ్లు అన్ని వర్గాల వారికీ శ్రవణానందాన్ని కలిగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్టంలో కల ఆకాశవాణి ప్రసార కేంద్రాలు అదిలాబాదు, కడప, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాదు, అనంతపురం, కర్నూలు, కొత్తగూడెం, నిజామాబాదు, తిరుపతి, వరంగల్లు.

ఇటీవలి కాలం లో ఎఫ్‌ఎం పైఆకాశవాణి రెయిన్ బో (హైదరాబాదు , విజయవాడ) కేంద్రాలతో పాటు కొన్ని ప్రెవేటు ఎఫ్‌ఎం కేంద్రాలు (రేడియో మిర్ఛి , రేడియో సిటీ , బిగ్ ఎఫ్‌ఎం , రెడ్ ఎఫ్‌ఎం) ప్రజాదరణ పొందుతున్నాయి. విద్యా ప్రసారాలకై జ్ఞానవాణి కేంద్రం (హైదరాబాదు , విశాఖపట్నం , ఇతర ముఖ్య నగరాలలో) పని చేస్తున్నది.


ఇంకా....పూర్తివ్యాసం పాతవి

15వ వారం

సూర్యకాంతం తూర్పు గోదావరి జిల్లా కాకినాడ దగ్గరున్న వెంకట కృష్ణరాయపురం లో 1924 అక్టోబర్ 28న తన తల్లితండ్రులకు 14వ సంతానంగా జన్మించింది. ఆరేళ్ళ చిన్న వయసులోనే పాడటం, నాట్యమాడటం నేర్చుకొంది. సినిమాల్లో నటించాలనే కోరిక ఆపుకోలేక చెన్నై చేరుకొంది. మొదట జెమిని స్టూడియో నిర్మించిన చంద్రలేఖ సినిమాలో డాన్సర్ గా అవకాశం వచ్చింది. ధర్మాంగద టైములో చిన్నా చితకా వేషాలువేసినా తరువాత లీలా కుమారి సాయంతో మొదటిసారిగా నారద నారది సినిమాలో సహాయ నటిగా అవకాశం వచ్చింది. చిన్న చిన్న పాత్రలు నచ్చక జెమినీ స్టూడియో నుంచి బయటకు వచ్చేసింది. మనసులో బొంబాయికి వెళదామని ఉన్నా అందుకు ఆర్థిక స్తోమత సరిపోక ఆ ఆలోచనను విరమించుకొంది. ఆ పరిస్థితిలో సహాయ నటిగా గృహప్రవేశం సినిమాలో మంచి అవకాశం వచ్చింది. తరువాత తన కల అయిన హీరోయిన్ వేషం సౌదామిని చిత్రం ద్వారా వచ్చింది. కానీ ఆ సమయంలో కారు ప్రమాదం జరిగి ముఖానికి గాయం అవడంతో ఆ అవకాశం తప్పిపోయింది. బాగైన తరువాత సంసారం చిత్రంలో మొట్టమొదటి సారిగా గయ్యాళి అత్త పాత్ర వచ్చింది. తరువాత తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఆంధ్ర సినీ అభిమానుల గుండెల్లో నిలిపోయేలా జీవితాంతం అవే పాత్రలలో నటించింది.


కోడరికం సినిమా ఆమెకు ఎంతో పేరు తీసుకొచ్చింది. బి.నాగిరెడ్డి, చక్రపాణి లు ఆమె లేకుండా సినిమాలు తీసేవారు కారు. ఆ రోజుల్లోని అనేక సాంఘిక చిత్రాల్లో రేలంగి - సూర్యకాంతం, రమణారెడ్డి - సూర్యకాంతం, ఎస్.వి.రంగారావు - సూర్యకాంతం- జంటలు, వాళ్ల దృశ్యాలు గుర్తుకు తెచ్చుకుని ఇవాళ కూడా హాయిగా నవ్వుకోవడం కద్దు. కొత్త సినిమా వస్తూంటే అందులో సూర్యకాంతం వుందా? అని ప్రేక్షకులూ, తారాగణంలో సూర్యకాంతం వున్నట్టేగదా? అని సినిమా డిస్ట్రిబ్యూటర్లూ - ఎదురు చూసేవారు. చక్రపాణి (1954), దొంగరాముడు (1955), చిరంజీవులు (1956), తోడికోడళ్లు (1957), అత్తా ఒకింటి కోడలే (1958), ఇల్లరికం (1959), భార్యాభర్తలు (1961), గుండమ్మకథ (1962), కులగోత్రాలు (1962), దాగుడుమూతలు (1964), అత్తగారు-కొత్తకోడలు, మూహూర్తబలం (1969) లాంటి మరపురాని ఎన్నో సినిమాలలో నటించింది.

ఇంకా....పూర్తివ్యాసం పాతవి

16వ వారం
పూరీ జగన్నాథ దేవాలయం, ఒరిస్సా రాష్ట్రంలో బంగాళాఖాతం తీరాన ఉన్న పూరీ పట్టణంలో గల ఒక ప్రాచీన మరియు ప్రముఖమైన హిందూ దేవాలయము. కృష్ణ భక్తులకు లేదా విష్ణు భక్తులకు ఈ దేవాలయం ఎంతో ప్రియమైనది. ఆలయ విగ్రహాలు చెక్కతో తయారు చేసి ఉండటం ఇక్కడి ప్రత్యేకత. ఆలయంలో శ్రీకృష్ణుడు, సుభద్ర మరియు బలరామ సమేతంగా దర్శనమిస్తాడు. ప్రస్తుతం ఉన్న దేవాలయం గంగ వంశానికి చిందిన కళింగ ప్రభువైన అనంత వర్మ చోడగంగ ( క్రీ.శ 1078—1148) ప్రారంభించాడు. ప్రస్తుతం ఉన్న చాలా నిర్మాణాలు మాత్రం అనంగ భీమదేవుడిచే క్రీ.శ. 1174 లో నిర్మించబడ్డాయి, ఆలయ నిర్మాణం పూర్తి కావడానికి పద్నాలుగేళ్ళు పట్టింది. ప్రాణప్రతిష్ట క్రీ.శ 1198 లో జరిగింది.

ఈ ఆలయం 4,00000 చదరపు అడుగుల భారీ వైశాల్యం కలిగి ఉండి చుట్టూరా ఎత్తైనా ప్రాకారం కలిగి ఉంది. లోపల సుమారు 120 దాకా ఆలయాలు ఉన్నాయి. అద్భుత శిల్పకళా నైపుణ్యం, సాంప్రదాయిక ఒరిస్సా ఆలయ శిల్పకళతో ఈ ఆలయం భారతదేశంలో అతి పురాతమైన కట్టడాల్లో ఒకటి. ఆలయానికి మొత్తం నాలుగు ద్వారాలున్నాయి. సింహ ద్వారానికి ఇరు వైపులా రెండు భారీ సింహాల విగ్రహాలు దర్శనమిస్తాయి. ఇది తూర్పు వైపుకు తెరుచుకుని ఉంటుంది.

ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటికల్లా ముఖ్యమైనది, భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి గాంచినది పూరీ జగన్నాథ రథయాత్ర. ఈ ఉత్సవం ప్రతీ సంవత్సరం జూన్ లేదా జులై నెలల్లో నిర్వహిస్తారు. ఈ రథయాత్రలో శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర విగ్రహాలను పూరీ వీధుల్లో ఊరేగిస్తారు. రథం సుమారు 45 అడుగుల ఎత్తు, 35 చదరపు అడుగుల వైశాల్యం కలిగి ఉంటుంది. దీనికి ఏడు అడుగుల వ్యాసం కలిగిన 16 చక్రాలు ఉంటాయి.దాదాపు నాలుగు వేల మంది భక్తులు కలిసి ఈ రథాన్ని లాగుతారు. ఈ ఉత్సవాన్ని తిలకించడానికి భారతదేశం నలుమూలల నుంచి భక్తులు విశేషంగా తరలి వస్తారు. ప్రతి యేటా కొత్త రథాన్ని తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత.

పురాణాల ప్రకారం స్వయంగా మాహాలక్ష్మి వచ్చి ఇక్కడి వంటలను పర్యవేక్షిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ వంటలన్నీ హిందూ ధర్మ శాస్త్రాలకనుగుణంగానే జరుగుతాయి. వంట చేయడానికి కేవలం మట్టి పాత్రలను మాత్రమే వాడతారు. అలాగే వంటకు అవసరమయ్యే నీటిని దగ్గర్లో గల గంగ, జమున అనే రెండు ప్రత్యేకమైన బావుల్లోంచి మాత్రమే సేకరిస్తారు. జగన్నాథునికి నైవేద్యం సమర్పించాక మిగతా ప్రసాదాన్ని భక్తులకు పంచిపెడతారు.

ఇంకా... పూర్తివ్యాసం పాతవి

17వ వారం
ఏకలవ్యుడు మహాభారతంలో గురుభక్తిని చాటే ఒక గొప్ప ఔన్నత్యం ఉన్న పాత్ర. నిషాధ తెగకు చెందినవాడు. తక్కువ కులానికి చెందిన వాడైనా ద్రోణాచార్యుని గురుకులంలో విలువిద్యను అభ్యసించాలని కోరికను కలిగి ఉండేవాడు. కానీ ద్రోణుడు అందుకు అంగీకరించలేదు.

ద్రోణుని తిరస్కారంతో ఏకలవ్యుడు ఏమాత్రం చెదిరిపోక తిరిగి అరణ్యానికి వెళ్ళి మట్టితో ద్రోణాచార్యుని ప్రతిమను సృష్టించుకున్నాడు. ఆ ప్రతిమనే తన గురువుగా భావించి తానే స్వంతంగా విద్య నేర్చుకోవడం ప్రారంభించాడు. ఈ విధంగా అకుంఠిత దీక్షతో శ్రద్ధా భక్తులతో విద్యనభ్యసించిన ఏకలవ్యుడు అపారమైన ప్రతిభను కూడగట్టుకొని ద్రోణుని ప్రియ శిష్యుడైన అర్జునుని కూడా మించిపోయాడు. ఇలా ఉండగా ఒక నాడు ఏకలవ్యుడు ధనురాభ్యాసం కావించుచుండగా ఎక్కడి నుంచో వచ్చిన ఒక శునకం పదే పదే మొరగనారంభించింది. అప్పుడు ఏకలవ్యుడు మొరుగుతున్న కుక్క నోరు మూయకుండా వెనువెంటనే ఏడు బాణాలు సంధించాడు. దానికి గాయం కూడా ఏమీ తగలలేదు. ఆ దారి వైపుగా వస్తున్న పాండవ రాకుమారులకు ఈ అద్భుత దృశ్యం కంటపడింది. ఇంతటి ప్రతిభా పాటవాలు కలిగిన వారు ఈ అరణ్యంలో ఎవరా? అని వారు ఆశ్చర్యపోయారు. వారు ఆ అరణ్యంలో వెతుకగా నల్లని వస్త్రధారణతో, దుమ్ముపట్టిన శరీరంతో, జడలు కట్టిన వెంట్రుకలతో ఉన్న ఏకలవ్యుడు కనిపించాడు. ద్రోణుని శిష్యునిగా తనను తాను పరిచయం చేసుకున్నాడు.

ఏకలవ్యుడు విలువిద్యలో తనను ఎక్కడ మించిపోతాడేమోనని మదనపడ సాగాడు. తన గురువైన ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళి తనను అందరి కన్నా మేటి విలుకానిని చేస్తానని ఇచ్చిన మాటను గుర్తు చేశాడు. అప్పుడు ద్రోణుడు అర్జునునికి అభయమిచ్చి రాజకుమారులతో కలిసి ఏకలవ్యుడిని కలవడానికి వెళ్ళాడు. ఏకలవ్యుడు ఎప్పటి లాగే విలువిద్య దీక్షగా సాధన చేస్తున్నాడు. గురువును చూడగానే అత్యంత భక్తి ప్రపత్తులతో గురువాజ్ఞ కోసం ఎదురుచూస్తూ ఆయన ముందు మోకరిల్లాడు.

ద్రోణుడు ఏకలవ్యుని గురుదక్షిణ ఇమ్మని అడిగాడు.ఏకలవ్యుడు అందుకు సంతోషంగా గురువు ఏదడిగినా సరే ఇస్తానన్నాడు. అప్పుడు ద్రోణుడు ఏమాత్రం కనికరం లేకుండా ఏకలవ్యుని కుడి చేతి బ్రొటనవేలుని ఇమ్మని అడిగాడు. ఆ వేలు పోయిన తరువాత ఏకలవ్యుడు విలువిద్య అభ్యసించలేడన్నది ద్రోణుడి అభిప్రాయం. కానీ ఏకలవ్యుడు మాత్రం బెదరక, సందేహించక వెను వెంటనే తన కుడి చేతి బ్రొటన వేలుని ఖండించి గురుదక్షిణ గా సమర్పించాడు. మరోవైపు అర్జునుడు కూడా తెగిన వేలుతో ఏకలవ్యుడు మునుపటి ప్రదర్శన చేయలేడని సంతోషించాడు.

తరువాత ఏకలవ్యుడు జరాసంధునికి చాలా విశ్వాసపాత్రుడిగా వ్యవహరించాడు. రుక్మిణీ స్వయంవరం సమయంలో జరాసంధుని కోరిక మేరకు, శిశుపాలుడికి మరియు రుక్మిణీ దేవి తండ్రియైన భీష్మకునికి మధ్యవర్తిగా వ్యవహరించాడు. భీష్మకుడు రుక్మిణి శిశుపాలుడిని పెళ్ళి చేసుకోవాలని కోరాడు. కానీ రుక్మిణీ శ్రీకృష్ణుని పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయింది. తరువాత ఒకసారి జరాసంధుని సైన్యంతో యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు పైకి ఏకలవ్యుడు ఒక రాయి విసరడంతో శ్రీకృష్ణుడే అతన్ని చంపివేశాడు.

ఇంకా... పూర్తివ్యాసం పాతవి

18వ వారం

కర్ణాటక సంగీతంలో పేరెన్నికగన్న వాగ్గేయకారులలో క్షేత్రయ్య ఒకడు. అనేక పుణ్యక్షేత్రాలు, దేవాలయాలను సందర్శిస్తూ వాటి గురించిన వివరాలు తెలుసుకుంటూ ఉండటం చేత ఈయనకు క్షేత్రజ్ఞుడనే పేరు వచ్చింది. క్రమేణా అది క్షేత్రయ్య గా మారింది. క్షేత్రయ్య జీవితకాలం 1595 - 1660 మధ్యకాలం కావచ్చును. ఇతని అసలుపేరు "వరదయ్య". ఇంటిపేరు "మొవ్వ". క్షేత్రయ్య పదాలలోని "వరద" అనే ముద్ర స్వనామ ముద్రగా భావించి అతని అసలుపేరు 'వరదయ్య'గా నిర్ణయించారు. ఇతని జన్మ స్థలం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లోని, కృష్ణా జిల్లాలో మొవ్వ గ్రామం. ఆ వూరిలో వెలసిన వేణుగోపాల స్వామి అతని ఇష్టదైవం.

జనబాహుళ్యంలో ఉన్న కథ ప్రకారం చిన్నతనంనుండి వరదయ్యకు గాన అభినయాలంటే మక్కువ. కూచిపూడిలో ఒక ఆచార్యుని వద్ద నాట్యం నేర్చుకొన్నాడు. సహపాఠి అయిన "మోహనాంగి" అనే దేవదాసితో సన్నిహితుడైనాడు. తరువాత మేనమామ కూతురు "రుక్మిణి"ని పెండ్లాడాడు. కాని మోహనాంగి పట్ల అతని మక్కువ తగ్గలేదు. దేవదాసి అయిన మోహనాంగి చాలా వివేకం కలిగిన పండితురాలు. తమ ఆరాధ్య దైవమైన మువ్వగోపాలునిపై నాలుగు పదాలు పాడి తనను మెప్పించగలిగితే తాను వరదయ్య ప్రేమను అంగీకరిస్తానని మోహనాంగి షరతు విధించిందట. మోహనాంగి పెట్టిన షరతు కోసం వరదయ్య నిరంతరం సాధన చేయసాగాడట. ఆ సాధన కారణంగా ప్రపంచములోని జీవాత్మలన్నీ స్త్రీలని, పరమాత్ముడయిన మువ్వగోపాలుడొక్కడే పురుషుడనే తత్వం వరదయ్యను అలుముకొన్నదట. మరొక కధ: బాల్యంలో విద్యాగంధం లేని వరదయ్య పశువుల కాపరిగా ఉండేవాడు. ఒక యోగి ఇతనికి 'గోపాల మంత్రం' ఉపదేశించాడు. ఆనాటి నుండి అతనికి గొప్ప కవితా శక్తి అలవడింది.

పదకవితలకు ఆద్యుడిగా క్షేత్రయ్యను భావిస్తున్నారు. ఆయన 4,500 కు పైగా పదాలు రచించాడు అని తెలుస్తున్నది. ఈనాడు మనకు 330 పదాలు మాత్రమే లభిస్తున్నాయి.

ఇంకా... పూర్తివ్యాసం పాతవి

19వ వారం

లవకుశ, 1963లో విడుదలైన ఒక తెలుగు సినిమా. ఈ "లవకుశ" తెలుగులో మొట్టమొదటి పూర్తి నిడివి రంగుల చిత్రం. ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి, ఒక యజ్ఞంలాగా ఈ సినిమా తీశారు. అసలే ఈ కధ ఎంతో హృద్యమైనది. ఆపైన పౌరాణికాలను తెరకెక్కించడంలో తెలుగువారికున్న నైపుణ్యంతో ఇది మనోహరమైన దృశ్యకావ్యముగా రూపు దిద్దుకుంది. అద్భుతమైన విజయం సాధించింది. రామాయణం ఉత్తరకాండము ఈ సినిమా కధాంశము. సీతపై నిందలు విని రాజధర్మమునకు అనుగుణముగా ఆమెను రాముడు అడవులకు పంపాడు. సీతమ్మ అప్పుడు వాల్మీకి ముని ఆశ్రమంలో కవలలను కంటుంది. వారు అసహాయశురులైన బాలురు. గానవిశారదులు. వాల్మీకి నేర్పిన రామాయణాన్ని రాముని కొలువులో గానం చేశారు. రాముడు అశ్వమేధ యాగం చేయతలపెడతాడు. లవకుశులు యాగాశ్వాన్ని నిలువరించి తండ్రితో యుద్దానికి తలపడ్డారు. అప్పుడు సీతమ్మ రామునకు కొడుకులనప్పగించి తాను భూప్రవేశం చేస్తుంది.

మొట్టమొదట ఈస్టిండియా ఫిల్మ్ కంపెనీ బానర్ పై దేవకీబోస్ దీనిని బెంగాలీలో తీశారు. అదే స్క్రిప్టుతో ఆ కంపెనీవారే తెలుగులో తీసే బాధ్యత సి.పుల్లయ్యకు అప్పగించారు. అప్పటి డ్రామా నటులైన పారుపల్లి సుబ్బారావు రామునిగా, శ్రీరంజని సీతగా 1934లో "లవకుశ" తెలుగు తెరకెక్కింది (నలుపు-తెలుపులో). బాగా విజయవంతమైనది. మళ్ళీ 24 సంవత్సరాల తర్వాత, 1958లో "లలితాశివజ్యోతి" బ్యానర్ పై ఇదే కధను, ఈ సారి రంగుల్లో చిత్రీకరించడం ప్రారంభించారు. తమిళంలోనూ, తెలుగులోనూ "లవకుశ" సినిమాను ఒకేసారి తీశారు.మరియు కన్నడం,హిందిలలోకి డబ్బింగు చేసారు.

ఇంకా... పూర్తివ్యాసం పాతవి

20వ వారం
కపిల్ దేవ్ రాంలాల్ నిఖంజ్, భారతదేశపు ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు. 1959, జనవరి 6న ఛండీగఢ్ లో జన్మించిన కపిల్ దేవ్ భారత క్రికెట్ జట్టుకు ఎనలేని సేవలందించి దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యున్నత ఆల్‌రౌండర్‌లలో ఒకడిగా పేరుసంపాదించాడు. 2002లో విజ్డెన్ పత్రికచే 20 వ శతాబ్దపు మేటి భారతీయ క్రికెటర్‌గా గుర్తింపు పొందినాడు. ప్రపంచకప్ (1983) లో భారత్‌ను విశ్వవిజేతగా తీర్చిదిద్దాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించే నాటికి అత్యధిక టెస్ట్ వికెట్లు సాధించిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. 1999 అక్టోబర్ నుంచి 2000 ఆగష్టు వరకు 10 మాసాల పాటు భారత జట్టుకు కోచ్‌గా వ్యవహరించాడు.

కుడిచేతి పేస్ బౌలర్ అయిన కపిల్ దేవ్ తన క్రీడాజీవితంలో అత్యధిక భాగం తనే భారత జట్టు ప్రధాన బౌలర్‌గా చలామణి అయ్యాడు. 1980లలో ఇన్‌స్వింగ్ యార్కర్ బౌలింగ్ వేసి చివరిదశ బ్యాట్స్‌మెన్‌లను హడలెత్తించాడు. బ్యాట్స్‌మెన్ గానూ పలు పర్యాయాలు జట్టుకు విజయాలు అందించాడు. జట్టు ఆపత్కాల దశలో ఉన్నప్పుడు బ్యాటింగ్‌లో విరుచుకుపడి ప్రత్యర్థులను సవాలు చేసేవాడు. దీనికి ముఖ్య ఉదాహరణ 1983 ప్రపంచ కప్ పోటీలలో జింబాబ్వేపై జరిగిన వన్డే పోటీగా చెప్పవచ్చు. దేశవాళి పోటీలలో హర్యానా క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే ఇతడి ముద్దుపేరు హర్యానా హరికేన్.

1978, అక్టోబర్ 16న కపిల్ దేవ్ పాకిస్తాన్ పై ఫైసలాబాదులో తన తొలి టెస్ట్ మ్యాచ్ ఆడినాడు. తొలి టెస్టులో తన గణాంకాలు మ్యాచ్‌ను అంతగా ప్రభావితం చేయలేకపొయాయి. సాదిక్ మహమ్మద్ ను ఔట్ చేసి తొలి టెస్ట్ వికెట్ సాధించింది ఈ మ్యాచ్‌లోనే.కరాచిలోని నేషనల్ స్టేడియంలో జరిగిన మూడవ టెస్టులో 33 బంతుల్లోనే 2 సిక్సర్లతో అర్థసెంచరీని చేసి భారత్ తరఫున అతివేగంగా అర్థసెంచరీ పూర్తిచేసిన రికార్డు సృష్టించాడు. ఆ తరువాత భారత్ పర్యటించిన వెస్టీండీస్ జట్టుపై ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో 124 బంతుల్లో 126 పరుగులు సాధించి తన తొలి టెస్ట్ శతకాన్ని నమోదుచేశాడు.


ఇంకా... పూర్తివ్యాసం పాతవి

21వ వారం

ఆర్యభట్టు భారతదేశ గణిత, ఖగోళ శాస్త్రవేత్తలలో అగ్రగణ్యుడు. ఇతను క్రీ.శ. 476-550 ప్రాంతంలో నివసించినట్లు అంచనా. ఆర్యభట్టు కుసుమపురము (ఈనాటి పాట్నా) లో నివసించాడు. ఇతను ఆర్యభట్టీయం, ఆర్య సిధ్ధాంతం, గోళాధ్యాయం మరియు సంస్కృత గణిత సంఖ్యా శాస్త్రాన్ని రచించాడు. ఇవే కాక ఆర్యభట్టు పై విలువను సుమారుగా కనుకున్నట్లు చెప్తారు. గణితం లో మనం నేర్చుకున్న సైన్ మరియు కొసైన్ లను ఇతను "జ్యా" మరియు "కొ జ్యా" గా నిర్వచించాడు. భారతదేశపు తొలి కృత్రిమ ఉపగ్రహానికి ఇతని పేరు (ఆర్యభట్ట) పెట్టారు.

ప్రపంచ వ్యాప్తంగా ఆధునిక శాస్త్రజ్ఞులంతా ఆర్యభట్టు ఖగోళ శాస్త్రానికి, గణిత శాస్త్రానికి చేసిన సేవలు ఎనలేనివని గుర్తించారు. గ్రీకులు ఆయన్ను 'ఆర్డువేరియస్' అనీ, అరబ్బులు 'అర్జావస్' అని వ్యవహరించే వారు. ఒకానొక కాలంలో ఆయన సిద్ధాంతాల గురించి భారతీయ పండితులు విరివిగా చర్చించుకొనే వారు. సుమారు వేయి సంవత్సరాల క్రితం భారత్ ను సందర్శించిన అల్-బెరూనీ అనే అరబ్బు పండితుడు ఆయన రచనల్లో ఆర్యభట్టు గురించి ప్రస్తావించాడు. ఆ రచనల్లో ఒక చోట "కుసుమపురానికి చెందిన ఆర్యభట్టు తన పుస్తకంలో మేరు పర్వతం హిమాలయాల్లో సుమారు యోజనం ఎత్తున ఉందని ప్రతిపాదించాడు" అని రాశాడు. దీన్ని బట్టి ఆర్యభట్ట అతను సూత్రీకరించిన కొన్ని సమీకరణాల సాయంతో పర్వతాల ఎత్తును కొలిచాడని అర్థమవుతుంది.


కొద్ది మంది ఆయన్ను విక్రమాదిత్యుని ఆస్థానంలో పనిచేసిన ప్రముఖ ఖగోళ శాస్త్రజ్ఞుడు, గణిత శాస్త్రవేత్త అయిన వరాహమిహురుడికి సమకాలికుడి లా భావిస్తున్నారు. అతని పుస్తకం ఆర్యభట్టీయం కూడా 23 ఏళ్ళ వయసులో రాసి ఉన్నట్లుగా భావిస్తున్నారు.అయినా గానీ ఆ పుస్తకంలో లోతైన ఆలోచనలు, అభిప్రాయాలున్నాయి. ఇందులో చాలా విసేషాలతో పాటు ఒకదానికొకటి ఎదురుగానూ, ఒకే దిశలోనూ సంచరించే గ్రహాలు కలుసుకోవడానికి అవసరమయ్యే సమయాన్ని లెక్కగట్టడానికి కొన్ని సూత్రాలు కూడా ప్రతిపాదించాడు. సంఖ్యాశాస్త్రంలో కూడా చెప్పుకోదగ్గ కృషిచేశాడు.


ఇంకా... పూర్తివ్యాసం పాతవి

22వ వారం

ఇసుక అనేది చిన్నగా ముక్కలు చేయబడిన రాళ్లు మరియు ఖనిజ లవణాలతో సహజంగా తయారయ్యే పూసకట్టిన పదార్ధం. ఇసుక మిశ్రమం స్థానిక రాళ్లు మరియు పరిస్థితులు ఆధారంగా వేర్వేరు ఉంటుంది, కాని భూఖండ ప్రాంతాలు మరియు ఉష్ణమండలేతర సాగర తీరాల్లోని ఇసుకలో సర్వసాధారణంగా సిలికా (సిలికాన్ డయాక్సైడ్ లేదా SiO2) ఉంటుంది, ఇది ఎక్కువగా పలుగురాయి రూపంలో ఉంటుంది.

భూవిజ్ఞాన శాస్త్రజ్ఞులు ఉపయోగించే పదం, ఇసుక రేణువుల వ్యాసం 0.0625 మిమీ (లేదా 1⁄16 మిమీ లేదా 62.5 మైక్రోమీటర్లు) నుండి 2 మిల్లీమీటర్లు వరకు ఉంటుంది. ఈ పరిమాణంలో ఉండే ఒక్కొక్క కణాన్ని ఇసుక రేణువు అని పిలుస్తారు. ఇసుక కంటే ఎక్కువ పరిమాణం గల పదార్ధం కంకర, ఇది 2 మిమీ నుండి 64 మిమీ వరకు పరిమాణం కలిగి ఉంటాయి. భూగర్భ శాస్త్రంలో తదుపరి చిన్న పరిమాణ తరగతి ఒండ్రు: ఇవి 0.0625 మిమీ నుండి తక్కువగా 0.004 మిమీ వరకు వ్యాసాన్ని కలిగి ఉంటాయి. ఇసుక మరియు కంకర మధ్య పరిమాణ నిర్దేశం ఒక శతాబ్దం కంటే ఎక్కువకాలం స్థిరంగా మిగిలిపోయింది, కాని ప్రారంభ 20వ శతాబ్దంలో అమలులో ఉన్న ఆల్బెర్ట్ అటెర్బెర్గ్ ప్రమాణం ప్రకారం కనిష్టంగా 0.02 మిమీ కణ పరిమాణం గల వాటిని ఇసుకగా పరిగణిస్తారు.

ISO 14688 స్థాయిల పల్చగా, మధ్యస్థ మరియు ముతక ఇసుక వ్యాసం 0.063 మిమీ నుండి 0.2 మిమీ మరియు 0.063 మిమీ మరియు 2.0 మిమీ మధ్య ఉంటుంది. సంయుక్త రాష్ట్రాల్లో, ఇసుకను పరిమాణం ఆధారంగా ఐదు ఉప విభాగాలు వలె విభజిస్తారు: చాలా సన్నని మట్టి (1⁄16 - మిమీ వ్యాసం), సన్నని మట్టి ( మిమీ - ¼ మిమీ), మధ్యస్థంగా ఉండే ఇసుక (¼ మిమీ - ½ మిమీ), ముతక ఇసుక (½ మిమీ - 1 మిమీ) మరియు ఎక్కువ ముతకగా ఉండే ఇసుక (1 మిమీ - 2 మిమీ). ఈ పరిమాణాలు కృంబియన్ ఫి స్కేల్ ఆధారంగా నిర్ణయించబడ్డాయి, ఇక్కడ Φలో పరిమాణం = మిమీలో పరిమాణంలోని -log బేస్ 2. ఈ ప్రమాణంలో, ఇసుక యొక్క Φ విలువ పూర్ణ సంఖ్యలో ఉప విభాగాల మధ్య విభాగాలతో -1 నుండి +4 మధ్య మారుతూ ఉంటుంది.

ఇంకా... పూర్తివ్యాసం పాతవి

23వ వారం

సి.నా.రె. గా ప్రసిద్ధి చెందిన సింగిరెడ్డి నారాయణరెడ్డి, తెలుగు కవి, సాహితీవేత్త. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన ఎనలేని సేవలకు గాను ఆయనకు 1988లో విశ్వంభర కావ్యానికి గాను ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం లభించింది. సినారె రాజ్యసభ సభ్యునిగా కూడా నియమితుడయ్యాడు. తెలుగు చలన చిత్ర రంగములో ఆయన రాసిన పాటలు ఎంతో ప్రసిద్ధి చెందాయి

సి.నారాయణరెడ్డి 1931, జూలై 29న కరీంనగర్ జిల్లాలోని మారుమూల గ్రామము హనుమాజీపేటలో జన్మించాడు. ఉర్దూ మాధ్యమంలో సిరిసిల్ల లో మాధ్యమిక విద్య, కరీంనగర్ లో ఉన్నత పాఠశాల విద్య అభ్యసించాడు. తెలుగు ఒక ఐచ్ఛికాంశాంగానే ఉండేది. హైదరాబాదులోని చాదర్‌ఘాట్ కళాశాలలో ఇంటర్మీడియట్, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.ఏ కూడా ఉర్దూ మాధ్యమంలోనే చదివాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయము నుండి తెలుగు సాహిత్యములో పోస్టుగ్రాడ్యుయేట్ డిగ్రీ, డాక్టరేటు డిగ్రీ పొందాడు. విద్యార్థిగా శ్రీకృష్ణదేవరాయ ఆంధ్రభాషా నిలయంలో శ్రద్ధగా అనేక గ్రంథాలు చదివాడు. విశ్వనాధ సత్యనారాయణ తరువాత జ్ఞానపీఠ పురస్కారం పొందిన తెలుగు సాహీతీకారుడు ఆయనే.విశ్వంభర కావ్యానికి ఆయనకి ఈ అవార్డు లభించింది.

ఆయన ప్రముఖంగా కవి అయినప్పటికీ అయన కలం నుంచి పద్య కావ్యాలు, గేయ కావ్యాలు, వచన కవితలు, గద్య కృతులు, చలనచిత్ర గీతాలు, యాత్రా కథనాలు, సంగీత నృత్య రూపకాలు, ముక్తక కావ్యాలు, బుర్ర కథలు, గజళ్ళు, వ్యాసాలు, విమర్శన గ్రంథాలు, అనువాదాలు మొదలైనవి వెలువడ్డాయి. కళాశాల విద్యార్థిగా శోభ పత్రికకు సంపాదకత్వం వహించారు. రోచిస్, సింహేంద్ర పేరుతో కవితలు రచించేవాడు. సినారె కవిత తొలిసారి జనశక్తి పత్రిక లో అచ్చయింది. విద్యార్థి దశలోనే ప్రహ్లాద చరిత్ర, సీతాపహరణం వంటి పద్య నాటికలు, భలే శిష్యులు తదితర సాంఘిక నాటకాలు రచించాడు. 1953 లో నవ్వని పువ్వు సంగీత నృత్య నాటిక ప్రచురితమైంది. అది సి.నా.రె తొలి ప్రచురణ. వెంటనే జలపాతం, విశ్వగీతి, అజంతా సుందరి వెలువడ్డాయి.


ఇంకా... పూర్తివ్యాసం పాతవి

24వ వారం

నేచర్ అనేది ఒక ప్రసిద్ధ బ్రిటీష్ వైజ్ఞానిక పత్రిక , ఇది నవంబరు 4, 1869న మొదటిసారి ప్రచురించబడింది. ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన బహుళ శాస్త్రీయ విభాగాల పత్రికగా ఇది పరిగణించబడుతుంది. ఇప్పుడు ఎక్కువ శాస్త్రీయ పత్రికలు ఏదో ఒక విభాగానికి లేదా రంగానికి ప్రత్యేకించబడుతున్నాయి, అయితే విస్తృతమైన శాస్త్రీయ రంగాలకు సంబంధించిన మౌలిక పరిశోధక రచనలను ఇప్పటికీ ప్రచురిస్తున్న అతికొద్ది పత్రికల్లో నేచర్ ఒకటి. శాస్త్రీయ పరిశోధనలో అనేక రంగాలు ఉన్నాయి, వీటిలో ముఖ్యమైన కొత్త పురోగమనాలు మరియు అసలు పరిశోధనలను వ్యాసాలుగా లేదా పరిశోధక పత్రాలుగా నేచర్‌ లో ప్రచురిస్తారు.


శాస్త్రవేత్తలు ఈ పత్రికకు ప్రాథమిక పాఠకులుగా ఉన్నారు, అయితే సారాంశాలు మరియు సహ వ్యాసాలు అత్యంత ముఖ్యమైన పత్రాలను సాధారణ ప్రజానీకానికి మరియు ఇతర రంగాల్లోని శాస్త్రవేత్తలకు అర్థమయ్యేలా చేస్తాయి. ప్రతి సంచికలో ప్రధానంగా సంపాదకీయాలు, సమకాలీన అంశాలు, శాస్త్రీయ పరిశోధనల ఫలితాలు, వ్యాపారం, శాస్త్రీయ విలువలు మరియు పరిశోధన మైలురాళ్లు, శాస్త్రవేత్తలకు సాధారణ ఆసక్తి కలిగించే అంశాలపై వార్తలు మరియు ప్రత్యేక వ్యాసాలు, వార్తలు ఉంటాయి. పుస్తకాలు మరియు కళలకు సంబంధించిన విభాగాలు కూడా దీనిలో ఉంటాయి.

నేచర్‌ లో ఒక వ్యాసం ప్రచురణ కావడాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తారు. దీనిలో ప్రచురించబడే వ్యాసాలను చాలా గొప్పగా చూపిస్తారు. వీని ఫలితంగా పదోన్నతలు, నిధుల మంజూరు మరియు ప్రధాన స్రవంతి ప్రసార మాధ్యమాలు దృష్టి కేంద్రీకరించేందుకు దారితీసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ సానుకూల స్పందన ప్రభావాలు కారణంగా, ఉన్నత-స్థాయి పత్రికలైన నేచర్ మరియు దాని సమీప ప్రత్యర్థి సైన్స్‌ లలో తమ పరిశోధనల వివరాలు ప్రచురించబడేలా చూసేందుకు శాస్త్రవేత్తల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుంది.

అనేక ఇతర ప్రొఫెషనల్ సైంటిఫిక్ జర్నళ్లు మాదిరిగా, వ్యాసాలు మొదట సంపాదకుడి చేత ప్రాథమిక పరిశీలన చేయబడతాయి, తరువాత ప్రచురణకు ముందు సహపాఠి సమీక్ష (Peer review) జరుగుతుంది. ఈ దశలో ఇతర శాస్త్రవేత్తలు, సంపాదకుడు చేత ఎంపిక చేయబడిన, సంబంధిత విభాగంలో నిపుణత ఉన్న వారు, సమీక్షించబడుతున్న పరిశోధనతో సంబంధంలేనివారు ఆ వ్యాసాలను చదివి విమర్శలను తెలియజేస్తారు.


ఇంకా... పూర్తివ్యాసం పాతవి

25వ వారం


అంగారకుడు - దీనికి 'ఎర్ర గ్రహం' అని కూడా పేరు. నవగ్రహాలలో ఒక గ్రహం పేరు. ప్రస్తుతం ఎనిమిది గ్రహాలున్నవని అంతర్జాతీయ ఖగోళ సమాఖ్య ప్రకటించింది. అంగారకుడు, భూమి వ్యాసార్ధం లో సగం, గరిమ పదోవంతు మాత్రమే కలిగివున్నాడు. భూమిపై గల భూభాగం కంటే కొద్దిగా తక్కువ ఉపరితలాన్ని కలిగి వున్నాడు. అంగారక గ్రహ ఉపరితలం 'ఎర్ర-నారింజ' రంగులో అగుపించడానికి కారణం దానిపై 'ఐరన్ (III) ఆక్సైడ్, లేదా హెమటైట్ లేదా త్రుప్పు వుండడమే.అంగారకుడిపై గల 'మాగ్నెటోస్ఫియర్' నాలుగు బిలియన్ల సంవత్సరాల క్రితమే అంతమైనది, అందులకే, సౌరగాలి (సోలార్ విండ్), అంగారకుడి అయనో ఆవణం పై నేరుగా ప్రభావం చూపుతుంది. ఈ ప్రభావం కారణంగా, అంగారకుడిపై గల వాతావరణం, అంగారకుడి వెనుక భాగాన అంతమైనది. అంగారకుడికి, రెండు ఉపగ్రహాలు గలవు. అవి ఫోబోస్ మరియు డెయిమోస్. వీటిని ఆస్టెరాయిడ్లు అంటే సబబు. వీటికి నిర్దిష్టమైన ఆకారం లేదు. ఈ గ్రహానికి దగ్గరలో, ఉపగ్రహాలకు కావలసిన కొన్ని లక్షణాలు పుచ్చుకొని పరిభ్రమిస్తున్నాయి.

డజన్ల కొద్దీ అంతరిక్ష నౌకలు, ఆర్బిటార్లు, ల్యాండర్లు, మరియు రోవర్లు, అంగారకుడిపై ప్రయోగింపబడ్డాయి. 1964 లో నాసా వారు మొదటి సారిగా అంగారకుడిపై విజయవంతంగా మార్టినర్ 4 ను ప్రయోగించారు. అంగారకుకుడి ఉపరితలంపై మొదటిసారిగా విజయవంతంగా సోవియట్ యూనియన్ వారు 1971 లో తమ మార్స్ 2 మరియుఅ మార్స్ 3 యాత్రలను ప్రయోగించారు. కానీ ఈ రెండు ప్రయోగాలలో, ఉపరితలంపై చేరిన మరుక్షణమే సంబంధాలు తెగిపోయాయి. తరువాత 1975 లో నాసా వారు వైకింగ్ కార్యక్రమం ప్రారంభించి, వీటిలో గల రెండు ఆర్బిటర్లను సంధించారు. ప్రతిదీ ఒక ల్యాండర్ కలిగివున్నది. ఈ కార్యక్రమం మొదటిసారిగా అంగారకుడి రంగుచిత్రాలు భూమిపై పంపగలిగినది.


ఇంకా... పూర్తివ్యాసం పాతవి

26వ వారం

ద్వారకా తిరుమల, పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక గ్రామము, మండలము మరియు ఏలూరు నుండి 42 కి.మీ.లు దూరములో ఉన్న పుణ్య క్షేత్రము. ఏలూరునుండి ద్వారకాతిరుమలకు మూడు బస్సు రూట్లు - వయా భీమడోలు, వయా తడికలపూడి, వయా దెందులూరు - ఉన్నాయి. భీమడోలునుండి ఇక్కడికి 15 కి.మీ.

ఇక్కడ శేషాద్రి కొండపై శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువు దీరియున్నారు. ఇది ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో చాలా ప్రసిద్ది చెందిన దేవాలయము. స్వయంభువుగా ప్రత్యక్షమైన వేంకటేశ్వర స్వామిని చీమల పుట్ట నుండి వెలికి తీసిన ద్వారక అనే ముని పేరు మీదుగా ఈ ప్రదేశమునకు ద్వారక తిరుమల అని పేరు వచ్చినది. సుదర్శన క్షేత్రమైన ద్వారక తిరుమల చిన్నతిరుపతిగా ప్రసిద్ది చెందినది. ద్వారకుడు ఉత్తరాభిముఖుడై తపస్సు చేశాడట. కనుక ఆ మునికి ప్రత్యక్షమైన స్వామి దక్షిణాభిముఖుడై యున్నాడు. మూలవిరాట్టు దక్షిణముఖంగా ఉడడం కూడా అరుదు.


"పెద్దతిరుపతి" (తిరుమల తిరుపతి)లో తీర్చుకోవడానికి మ్రొక్కిన మ్రొక్కును "చిన్నతిరుపతి"లో తీర్చుకున్నా అదే ఫలం లభిస్తుంది. కాని చిన్నతిరుపతిలో తీర్చుకోవడానికి మ్రొక్కిన మ్రొక్కును చిన్నతిరుపతిలోనే తీర్చుకోవాలని స్థానికంగా భక్తుల నమ్మకం. ఒకే విమాన శిఖరము క్రింద రెండు విగ్రహములు ఉండటము ఇక్కడి విశేషము. ఒక విగ్రహము సంపూర్ణమైనది. రెండవది స్వామియొక్క పై భాగము మాత్రమే కనుపించు అర్ధ విగ్రహము. ప్రస్తుతము ఉన్న గుడిని మైలవరం జమీందారులు కట్టించారు. విమానము, మంటపము, గోపురము, ప్రాకారాలను ధర్మా అప్పారావు (1762-1827) కాలంలో కట్టించారు. బంగారు ఆభరణాలు, వెండి వాహనాలు రాణీ చిన్నమ్మరావు (1877-1902) సమర్పించారు


ఇంకా... పూర్తివ్యాసం పాతవి

27వ వారం
100px}

కొత్తగా ప్రాజెక్ట్ లను నిర్మించడంతో పాటు ఇది వరకూ నిర్మించిన ప్రాజెక్ట్ లను పునర్నిర్మించి కాలానుగుణంగా ఆధునీకరించ వలసిన ఆవశ్యకతను గుర్తించి, రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్ సహాయంతో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఆధునీకరణను ఆంధ్రప్రదేశ్ జలవనరుల అభివృధ్ది పథకం పేరుతో చేపట్టింది.


ఇంకా... పూర్తివ్యాసం పాతవి

28వ వారం

కిరణ్ బేడీ (Kiran Bedi) భారతదేశపు మొట్టమొదటి ఐ.పి.ఎస్.అధికారిణి. 1972 బ్యాచ్‌కు చెందిన కిరణ్ బేడీ పోలీసు శాఖలో అనేక పదవులు చేపట్టి, అనేక సంస్కరణలు చేపట్టి, మెగ్సేసే అవార్డుతో సహా పలు అవార్డులను పొందినది. బ్యూరో ఆప్ పోలీస్ రీసెర్చి అండ్ డెవెలప్‌మెంట్ డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తూ డిసెంబర్ 2007లో స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకొంది.

సాధించిన అవార్డులు[మార్చు]

  • 1979 : రాష్ట్రపతి గ్యాలెంటరీ అవార్డు
  • 1980 : విమెన్ ఆప్ ది ఇయర్ అవార్డ్
  • 1991 : మత్తుపదార్థాల నివారణ మరియు నిర్మూలన వారి ఆసియా స్థాయి అవార్డు
  • 1994 : మెగ్సేసే అవార్డు (ప్రభుత్వ రంగంలో )
  • 1995 : మహిళా శిరోమణి అవార్డు
  • 1995 : లయన్ ఆప్ ది ఇయర్ అవార్డు
  • 1999 ; ప్రైడ్ ఆప్ ఇండియా అవార్డు
  • 2005 : మదర్ థెరీసా జాతీయ స్మారక అవార్డు (సాంఘిక న్యాయం)

ఇంకా... పూర్తివ్యాసం పాతవి

29వ వారం
ప్రశాంతి నిలయము 14°9.91′N 77°48.70′E సత్య సాయి బాబా యొక్క ముఖ్య ఆశ్రమం పేరు. ఇది సముద్రమట్టము నుండి 800 మీటర్ల (2624 అడుగులు) ఎత్తులో ఉంది. "ప్రశాంతి నిలయము యొక్క పట్టణవాటిక శ్రీ సత్య సాయి బాబా జన్మించిన పుట్టపర్తి అనే గ్రామములో ఉంది. ఈ ప్రదేశము దక్షిణ భారతదేశములోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అనంతపురము జిల్లాలో ఒక భాగము.

ప్రశాంతి నిలయం అంటే "మహోన్నత శాంతి యొక్క ధామము" జీవించి ఉన్నప్పుడు సత్య సాయి ఈ ఆశ్రమములో ప్రతిరోజూ వేలకొలది తన భక్తులకు దర్శనము ఇచ్చేవాడు. ఆ సమయంలో సత్య సాయి బాబా "సాధారణంగా జూన్ మొదలు నుండి మార్చ్ మధ్య వరకు ప్రశాంతి నిలయములో ఉండేవాడు. ఆయన గతించాక ఇక్కడి సాయి కుల్వంత్ హాల్ లో సమాధి చేయబడ్డాడు.

ఇంకా... పూర్తివ్యాసం పాతవి

30వ వారం

సింహాచలము విశాఖపట్టణము నకు 11 కి.మీ. దూరంలో తూర్పు కనుమలలో పర్వతంపైన ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రము. ఈ క్షేత్రమున విశాఖ పరిసర ప్రాంతాల్లో ప్రజలు సింహాద్రి అప్పన్న గా పిలిచే వరాహ లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్నాడు. ఈ దేవాలయము సముద్రమట్టానికి 244 మీ ఎత్తున సింహగిరి పర్వతంపై ఉన్నది.

ఇది దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి. తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం (52 కోట్ల రూపాయలు) కలిగిన దేవాలయము. సంవత్సరానికి 12 గంటలు మాత్రమే ఈ దేవుని నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది; మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది. నిజరూప దర్శన సమయాన్ని చందన యాత్ర లేదా చందనోత్సవం అని అంటారు. ఇది ప్రతీ సంవత్సరం వైశాఖ మాసం శుద్ద తదియ నాడు (మే నెలలో) వస్తుంది.

సింహాచలం అంటే సింహం యొక్క పర్వతము అని అర్థం. ఇక్కడ మహావిష్ణువు దశావతారాలలో నాల్గవదైన లక్ష్మీ నరసింహ అవతారమూర్తి గా వెలశాడు. ఇతిహాసం ప్రకారం రాక్షస రాజు హిరణ్యకశిపుడు విష్ణువుకు బద్ధవైరి. తన కుమారుడైన ప్రహ్లాదుడిని పుట్టుకతోనే విష్ణు భక్తుడు. అనేక విధాల ప్రయత్నించి కూడా కుమారుని విష్ణు విముఖుణ్ణి చెయ్యలేకపోతాడు. చివరికి చంపించేందుకు కూడా ప్రయత్నిస్తాడు. కానీ ప్రతిసారీ ప్రహ్లాదుని విష్ణుమూర్తి రక్షిస్తాడు. విసిగిన హిరణ్యకశిపుడు 'విష్ణువు సర్వవ్యాప్తమని చెబుతున్నావు కదా, ఏడీ ఈ స్థంభంలో ఉన్నాడా? చూపించు'మని స్థంభాన్ని పగలగొట్టగా విష్ణువు నరసింహస్వామిగా స్తంభాన్ని చీల్చుకొనివచ్చి, హిరణ్యకశిపుని సంహరించి, ప్రహ్లాదుడిని రక్షించాడు.

స్థలపురాణం ప్రకారం ప్రహ్లాదుడు ఇక్కడ మొట్టమొదటగా నరసింహ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. ఆ తరువాతి కాలంలో చంద్రవంశానికి చెందిన పురూరవుడు అనే రాజు విమానం మీద వెళ్ళుతుండగా ఈ స్థలానికి ఉన్న అత్యంత ప్రశస్తమైన శక్తి ప్రభావం వల్ల పురూరవుడి విమానం క్రిందకు ఆకర్షించబడింది. అతడికి భూమిలో కప్పబడి ఉన్న నరసింహస్వామి కనిపించాడు. విగ్రహాన్ని సంవత్సరకాలం పాటు చందనంతో కప్పి ఉంచి వైశాఖ శుద్ధ తదియ రోజు మాత్రమే చందనం లేకుండా నిజరూప దర్శనం కలిగే టట్లు చేయమని ఆకాశవాణి పురూరవుడికి చెబుతుంది. ఆకాశవాణి పలికిన పలుకుల మేరకు పురూరవుడు నరసింహ స్వామికి దేవాలయాన్ని నిర్మించాడు. ఆ సాంప్రదాయం ఇప్పటికీ పాటించడుతోంది. స్వామిలోని వేడిని చల్లార్చడానికి ప్రతీరోజు చందనం తో పూత పూస్తుంటారు. నరుడు మరియు సింహము రూపాలు కలిసిన ఈ నరసింహుని అవతార నిజరూపం త్రిభంగ ముద్ర లో (ఆసనంలో) సింహము తల కలిగిన మనిషి శరీరంతో ఉంటుంది. మిగిలిన సమయంలో చందనం కప్పబడి లింగాకృతిలో స్వామివారి నిత్యరూపం ఉంటుంది.

ఇంకా... పూర్తివ్యాసం పాతవి

31వ వారం
1969లో మారియో పుజో రచించిన ది గాడ్‌ఫాదర్ అనే నవల ఆధారంగా ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పాలా దర్శకత్వంలో 1972 లో నిర్మింపబడిన ది గాడ్‌ఫాదర్ చలనచిత్రం ప్రపంచ సినీ చరిత్రలో అత్యుత్తమమయిన సినిమాగా పరిగణింపబడుతున్నది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు మరియు ఉత్తమ స్క్రీన్‌ప్లే విభాగాలలో ఆస్కార్ అవార్డులు అందుకోవడమే కాక మరెన్నో ప్రశంసలు అందుకొని ఎన్నో జాబితాల్లో అగ్రభాగాన నిలిచింది.

ఇంకా... పూర్తివ్యాసం పాతవి

32వ వారం
బోనాలు మహాకాళిని పూజించే హిందువుల పండుగ. ఈ పండుగ ప్రధానంగా హైదరాబాదు, సికింద్రాబాదు మరియు తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో జరుపుకోబడుతుంది. సాధారణంగా జూలై లేక ఆగష్టులో వచ్చు ఆషాఢ మాసంలో ఈ పండుగ జరుపుకుంటారు. పండుగ మొదటి మరియు చివరి రోజులలో ఎల్లమ్మ దేవికి ప్రత్యేక పూజలు చేస్తారు.

భోజనం అని అర్థం కలిగిన బోనం దేవికి సమర్పించే నైవేద్యం. మహిళలు వండిన అన్నంతో పాటు పాలు, బెల్లం, కొన్నిసార్లు ఉల్లిపాయలతో కూడిన బోనాన్ని మట్టి లేక రాగి కుండలలో తమ తల పై పెట్టుకుని, డప్పుగాళ్ళు, ఆటగాళ్ళు తోడ్కొని రాగా దేవి గుడికి వెళ్తారు. మహిళలు తీసుకెళ్ళే ఈ బోనాల కుండలను చిన్న వేప రెమ్మలతో, పసుపు, కుంకుమ లేక కడి (తెల్ల ముగ్గు)తో అలంకరించి, దానిపై ఒక దీపం ఉంచడం కద్దు. మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ మున్నగు పేర్లు కల ఈ దేవి గుళ్ళను దేదీప్యమానంగా అలంకరిస్తారు. ఇంకా... పూర్తివ్యాసం పాతవి

33వ వారం

కె.బాలచందర్ గా ప్రసిద్ధిచెందిన కైలాసం బాలచందర్ ప్రముఖ దక్షిణ భారతదేశ సినిమా దర్శకుడు, రచయిత మరియు నిర్మాత. వీరు 1930 సంవత్సరంలో తంజావూరు దగ్గర నన్నిలం గ్రామంలో జన్మించాడు. తొలుత అకౌంటెంట్‌ జనరల్‌ కార్యాలయంలో పనిచేసేవాడు. అక్కడ ఉద్యోగం చేస్తూనే పలు నాటకాలు రాశాడు. ఎంజీఆర్‌ కథానాయకుడిగా నటించిన దైవతాయ్‌ చిత్రానికి సంభాషణల రచయితగా చలనచిత్ర రంగంలో ప్రస్థానం ప్రారంభించాడు. 45 ఏళ్లలో తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో 100కు పైగా చిత్రాలను రూపొందించాడు. రజనీకాంత్, కమల్ హాసన్, ప్రకాష్ రాజ్ వంటి నటుల్ని చిత్రపరిశ్రమకు పరిచయం చేశాడు.

భారత చలనచిత్ర రంగం అభివృద్ధికి ఆయన చేసిన కృషికి గాను 2010 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ప్రకటించింది. అవార్డు కింద స్వర్ణకమలం, రూ.10లక్షల నగదు, శాలువాతో సత్కరించారు.

తమిళనాడు, తంజావూరు జిల్లాలోని నన్నిలం గ్రామం ఆయన స్వస్థలం. వస్త్రాలపై వేసే రంగురంగుల పెయింటింగులకు ఈ గ్రామం ప్రసిద్ధి. వారిది సామాన్య మధ్యతరగతి కుటుంబం. నాన్న దండపాణి కైలాసం. అమ్మ సరస్వతి. అన్నామలై విశ్వవిద్యాలయం నుంచి బీయస్సీ పూర్తి చేశాడు. తరువాత అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలో ఉద్యోగిగా ఆయన జీవితం ప్రారంభమైంది. ఉద్యోగం చేస్తూనే ఖాళీ సమయాల్లో సరదాగా నాటకాలు రాస్తుండేవాడు. అలా రాసిన ఒక నాటకం ఎం.జి. రామచంద్రన్ దృష్టిలో పడటంతో ఆయన్నుంచి ఆహ్వానం వచ్చింది. ఎంజీఆర్ నటించిన దైవతాయి అనే చిత్రానికి సంభాషణలు, స్క్రీన్‌ప్లే అందించాడు.

ఇంకా... పూర్తివ్యాసం పాతవి

34వ వారం

చేమూరు, చిత్తూరు జిల్లా, తొట్టంబేడు మండలానికి చెందిన గ్రామము. ఇది శ్రీకాళహస్తికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నది. శ్రీకాళహస్తి నుండి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారి బస్సులలో గ్రామానికి చేరుకోవచ్చును. గ్రామంలో ఉన్నది ఒకే ప్రధామైన వీధి. ఇక్కడ గ్రామదేవత పేరు చేమూరమ్మ. తూర్పుగా ఉన్న ఒక వేపచెట్టు దగ్గర గ్రామస్తులు ప్రతి ఏటా పొంగళ్ళు పెడతారు. గ్రామానికి దక్షిణంగా ఉన్న దొడ్లయ్య దేవాలయం దగ్గర్లో ఉన్న ఊరు నెమ్మదిగా ప్రస్తుతం ఉన్న చోటుకి మారింది.

చేమూరు గ్రామంలో సుమారు వంద ఇళ్ళు వరకు ఉంటాయి. కొద్ది మంది చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ 99 శాతం మందికి వ్యవసాయమే జీవనాధారం. సేద్యపు నీటికి ఎక్కువగా వర్షం, గొట్టపు బావులే ఆధారం. గ్రామానికి తూర్పుగా స్వర్ణముఖి నది ప్రవహిస్తుంది. దీని మీద చాలా పొలాలు ఆధారపడి ఉన్నాయి. వరి మరియు వేరుశనగ ఇక్కడ ప్రధామైన పంటలు. నీరు విస్తారంగా అందుబాటులో ఉన్న సమయంలో వరి, కొంచెం కొరతగా ఉన్నపుడు వేరుశనగ పండిస్తారు. ఇంకా రాగులు, సజ్జలు, మిరప, మినుములు, మొదలైన వాటిని తక్కువ స్థాయిలో పండిస్తారు. స్వర్ణముఖి నదికి ఉపనదియైన ఒక చిన్న ఏరు మీద ఆధారపడి చాలా పొలాల్లో సాగుబడి చేస్తారు. ఈ ఏటి నుండి రైతులు విద్యుత్ మోటార్ల సాయంతో నీటిని పొలాలకు మళ్ళిస్తారు. సోమ శిల నుంచి చెన్నపట్టణానికి నీరందించే తెలుగు గంగ కాలువ నుంచి ఒక ఉప కాలువ ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. ఇది పూర్తయితే గ్రామస్తులకు సాగు నీటి కొరత చాలా వరకు తగ్గుతుంది. గ్రామంలో చాలా కుటుంబాలకు గొర్రెల మందలున్నాయి. ఇంకా ఆవులు, బర్రెలు మేపడం ద్వారా పాలు పోసి కూడా ఆదాయాన్ని ఆర్జిస్తారు.

ఇంకా... పూర్తివ్యాసం పాతవి

35వ వారం

న్యూయార్క్ నగరం, అమెరికా సంయుక్త రాష్ట్రాలు లోని అత్యధిక జనాభా మరియు జనసాంద్రత కలిగిన నగరాలలో ఒకటి. దీని మెట్రోపాలిటన్ ప్రాంతం, ప్రపంచంలోని అతిపెద్దనగరప్రాంతాలలో ఒకటిగా పరిగణింపబడుతుంది. 1970వ సంవత్సరం వరకూ ప్రపంచంలోనే అతిపెద్ద నగరంగా పరిగణింపబడుతూ వచ్చింది. జార్జి వాషింగ్టన్ కాలంలో అమెరికా ప్రధమ రాజధానిగా వర్థిల్లినది. ఓ శతాబ్దం వరకూ, ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య మరియు ఆర్థికకేంద్రంగా వెలుగొందింది. న్యూయార్క్ నగరం, భూగోళ నగరంగానూ, ఆల్ఫా వరల్డ్ సిటీ గానూ పరిగణింపబడుచున్నది. దీనికి కారణాలు, మీడియా, రాజకీయాలూ, విద్య, వినోద కార్యక్రమాలు, కళలు మరియు ఫ్యాషన్. ఈ నగరం విదేశీ వ్యవహారాలకూ కేంద్రంగానూ, ఐక్యరాజ్యసమితి ప్రధాన కేంద్రంగానూ యున్నది.


న్యూయార్క్ నగరం అమెరికాకు ఈశాన్యంలోనూ న్యూయార్క్ రాష్ట్రానికి ఆగ్నేయంగానూ ఉంది.షుమారు వాషింగ్టన్ మరియు బోస్టన్ మద్యభాగంలో ఉంది. ఇది హడ్సన్ నది ముఖద్వారంలో ఉండటం వలన ఏర్పడిన సహజ ఓడ రేవు . న్యూయార్క్‌లో ఎక్కువ భాగం మాన్‌హట్టన్‌,స్టేటన్ ద్వీపం మరియు లాంగ్ ఐలాండ్ అనే మూడు దీవులలో నిర్మించబడింది. నగర భూభాగం కృత్రిమంగా మానవప్రయత్నంతో కొంచం కొంచం విస్తరిస్తూ ఉంది. మాన్‌హట్టన్ లోతట్టు ప్రాంతంలో అభివృద్ధి చేసిన బ్యాటరీ పార్క్ సిటీ ఈ విస్తరణను స్పష్టంగా గుర్తించవచ్చు. ప్రత్యేకంగా మాన్‌హట్టన్ ప్రాంతంలో ఈ విస్తరణ వలన సహజ సిద్ధత కనుమరుగైంది. న్యూయార్క్ నగర విస్తీర్ణం 304.8 చదరపు మైళ్ళు.

న్యూయార్క్ నగర మొత్తం ప్రదేశం 468.9 చదరపు మైళ్ళు.159.88 చదరపు మైళ్ళు జలభాగం మిగిలిన 321 మైళ్ళు భూభాగం.నగరంలో ఎత్తైన ప్రాంతం స్టేటన్ దీవిలోని టాట్ హిల్ . ఇది సముద్ర మట్టానికి 409.8 అడుగులు ఎగువన వుంది. దీని దిగువభాగం దట్టమైన వనప్రదేశం. స్టేటన్ దీవి గ్రీన్‌బెల్ట్‌లో ఇది ఒక భాగం.

ఇంకా... పూర్తివ్యాసం పాతవి

36వ వారం

పర్వతాల సుదీర్ఘ నడక, జారిపోవడం (స్కీయింగ్) మరియు అధిరోహణల క్రీడ, వ్యాసంగం లేదా వృత్తి, పర్వతారోహణ లేదా పర్వతాలను ఎక్కడం గా పిలువబడుతుంది. అప్పటివరకు అధిరోహింపబడని అత్యున్నత స్థానాలను చేరడానికి చేసే ప్రయత్నాలుగా పర్వతారోహణ ప్రారంభిచబడినప్పటికీ, ఇది పర్వతం యొక్క అనేక అంశాలను వివరించే ప్రత్యేక శాఖలుగా విడిపోయింది: ఎంచుకున్న మార్గం రాయి, హిమం లేదా మంచుపై ఉన్నపుడు అది రాతి కళ, మంచు కళ లేదా స్కీయింగ్‌గా ఉంటుంది. అన్నిటికీ అనుభవం, క్రీడా సామర్ధ్యం మరియు సురక్షితంగా ఉండటానికి సాంకేతిక విజ్ఞానం అవసరం. UIAA లేదా యూనియన్ ఇంటర్ నేషనేల్ డెస్ అసోసియేషన్స్ డి'అల్పినిస్మే పర్వతారోహణ మరియు అధిరోహణలలో ప్రపంచ స్థాయి సంస్థ, ఇది ప్రవేశ మార్గం, వైద్యం, పర్వత రక్షణ, భద్రత, యువత మరియు మంచు అధిరోహణాల సమస్యలను వివరిస్తుంది.

దట్టమైన హిమం ఉన్న పరిస్థితులలో పర్వతారోహకులు కాలినడకన వెళ్ళవలసి ఉంటుంది. మంచు లేదా హిమంపై సమర్ధవంతంగా ప్రయాణించడానికి తరచు క్రాంపోన్స్(ప్రత్యేక పాదరక్షలు) అవసరమవుతాయి. క్రాంపోన్స్, 8-14 లోహపు పట్టీలను కలిగి పర్వతారోహకుల పాదరక్షలకు జతచేయబడతాయి. అవి దృఢమైన హిమం (నెవె) మరియు మంచులపై అదనపు ఘర్షణ కలిగించి తీవ్రమైన వాలు కలిగిన అధిరోహణ మరియు అవరోహణలకు అనువుగా ఉంటాయి. వీటిలోని రకాలలో మంచుతో కప్పబడిన హిమానీనదాలపై నడకకు ఉద్దేశించబడిన తేలికపాటి అల్యూమినియం నమూనాల నుండి, నిలువైన మరియు వ్రేలాడే మంచు మరియు రాతి పలకలకు ఉద్దేశించిన ఉక్కు నమూనాల వరకు ఉంటాయి. స్నోషూస్ లోతైన హిమంలో నడవడానికి ఉపయోగించబడతాయి. స్నోషూస్ ఉపయోగించబడే అన్ని ప్రదేశాలలో మరియు ఇంకా లోతైన మరియు మరింత ఎత్తైన ప్రదేశాలలో స్కిస్ ఉపయోగించవచ్చు, అయితే కఠిన భూభాగంపై నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి ఎక్కువ అభ్యాసం అవసరమౌతుంది. ఇంకా... పూర్తివ్యాసం పాతవి

37వ వారం

ఊరబెట్టడం (Pickling; పిక్లింగ్) అనేది ద్రావణంలో ఊరవేయడం లేదా నిల్వచేయడం గా కూడా సుపరిచితమైన ఒక ప్రక్రియ. లాక్టిక్ ఆమ్లం ఉత్పత్తి కోసం బ్రైన్ ద్రావణం (నీటికి ఉప్పును కలపడం ద్వారా తయారైన ద్రావణం)లో వాయురహిత కిణ్వప్రక్రియ ద్వారా ఆహారంను నిల్వచేయడం లేదా నానబెట్టడం మరియు దాన్ని వెనిగర్ (ఎసిటిక్ ఆమ్లం) లాంటి ఆమ్ల ద్రావణంలో నిల్వచేయడం లాంటి పద్ధతులు ఈ ప్రక్రియలో భాగమై ఉంటాయి. ఈ రకమైన ప్రక్రియల ఫలితంగా కొత్తరూపం సంతరించుకున్న ఆహారాన్ని ఊరగాయ గా పిలుస్తారు. ఈ రకమైన విధానం ఆహారానికి ఉప్పగా ఉండే లేదా పుల్లని రుచిని కలగజేస్తుంది. దక్షిణాసియాలో, ఊరబెట్టే మాధ్యమంగా వెనిగర్‌తో పాటుగా వంటనూనెలను ఉపయోగిస్తారు.

pH స్థాయి 4.6 కంటే తక్కువగా ఉండడం కూడా ఈ విధానంలోని మరో స్పష్టమైన లక్షణంగా ఉంటుంది, చాలావరకు బ్యాక్టీరియాలను చంపేందుకు ఈ స్థాయి చక్కగా సరిపోతుంది. ఊరబెట్టడం అనే ఈ విధానం ద్వారా చెడిపోయే స్వభావం ఉన్న ఆహార పదార్థాలని నెలల కొద్దీ నిల్వ చేయవచ్చు. క్రిమినాశక సామర్థ్యం కలిగిన మూలికలు మరియు ఆవాలు, వెల్లుల్లి, పట్ట లేదా లవంగం లాంటి మసాలా దినుసులను కూడా తరచూ ఊరగాయలకు చేరుస్తుంటారు. ఒకవేళ సదరు ఆహారం తగినంత తేమను కలిగి ఉన్నట్టైతే, పొడి ఉప్పను కలపడం ద్వారా సాధారణంగా ఊరబెట్టే బ్రైన్ ద్రావణాన్ని ఉత్పత్తి చేయవచ్చు. కూరగాయలను వెనిగర్‌లో నానబెట్టడం ద్వారా ఇతర ఊరగాయలు తయారుచేయబడుతాయి. నిల్వచేయడం ప్రక్రియలో మాదిరిగా కాకుండా, ఊరబెట్టడం (ఇది కిణ్వప్రక్రియను కూడా కలిగి ఉంటుంది) అనే ప్రక్రియలో ఆహారాన్ని సీలు చేయడానికి ముందు సంపూర్ణంగా క్రిమిరహితం చేయాల్సిన అవసరం లేదు. ద్రావణం యొక్క ఆమ్లత్వం లేదా ఉప్పు స్వభావం, కిణ్వప్రక్రియ యొక్క ఉష్ణోగ్రత, మరియు వెలువడే ప్రాణవాయువు లాంటివి ఎలాంటి సూక్ష్మజీవులు ఆధిక్యత ప్రదర్శిస్తున్నాయనే విషయాన్ని నిర్థారించడంతో పాటు అంత్య ఉత్పత్తి యొక్క పరిమళాన్ని కూడా నిర్ణయిస్తాయి

ఇంకా... పూర్తివ్యాసం పాతవి

38వ వారం

1955, జూలై 27న సిడ్నీలో జన్మించిన అలాన్ బోర్డర్ ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. తన క్రీడాజీవితంలో 156 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 11,174 పరుగులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. (టెస్ట్ సంఖ్యలో స్టీవ్ వా, పరుగులలో బ్రియాన్ లారాలు తని రికార్డును తరువాత అధికమించారు). 27 టెస్ట్ సెంచరీలు, 6524 వన్డే పరుగులు సాధించి అందులోనూ అధికుడు అనిపించుకున్నాడు. 1977లో అంతర్జాతీయ క్రికెట్‌లో రంగప్రవేశం చేసి 1993 వరకు సుమారు 16 సంవత్సరాలు దేశం తరఫున ప్రాతినిధ్యం వహించినాడు.

16 సంవత్సరాల ప్రాయంలో సిడ్నీ గ్రేడ్ క్రికెట్‌లో ఎడమచేతి స్పిన్నర్‌గా ప్రవేశించాడు. బ్యాటింగ్‌లో 9 వ స్థానంలో వచ్చేవాడు. 1972-73లో సంయుక్త పాఠశాలల జట్టులోకి ఎంపైకైనాడు. 1975-76లో బోర్డర్ 600 పైగా పరుగులు సాధించడమే కాకుండా వరుసగా రెండు శతకాలు కూడా చేసి NSW టీంలోకి ఆహ్వానించబడ్డాడు. 1977 జనవరిలో బోర్డర్ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో క్వీన్స్‌లాండ్ పై ఆడి 36 పరుగులు చేసి, 3 వికెట్లు తీసి జట్టు విజయానికి దోహదపడ్డాడు.

1977లో ప్రపంచ సీరీస్ క్రికెట్ ఒప్పందం వలన పలు క్రికెటర్లు ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌కు మరియు టెస్ట్ మ్యాచ్‌కు అందుబాటులో లేకపోవడంతో బోర్డర్ 1978-79 సీరీస్‌లో రంగప్రవేశం చేసి పెర్త్ లో పశ్చిమ ఆస్ట్రేలియాపై ఆడుతూ 135 పరుగులు, విక్టోరియాపై 114 పరుగులు సాధించాడు. ఆ తరువాత ఇంగ్లాడుపై 1979 డిసెంబర్ లో తొలిసారిగా టెస్ట్ మ్యాచ్ ఆడినాడు. గణాంకాలు సరిగా లేకపోవడంతో జట్టునుంచి తొలిగించబడ్డాడు. తరువాత పాకిస్తాన్ తో జరిగిన సీరీస్‌కు మళ్ళీ పిలుపు అందింది. మెల్బోర్న్ లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో తొలి సెంచరీని పూర్తిచేశాడు. దాంతో ఆస్ట్రేలియా స్కోరు 3 వికెట్లకు 305 పరుగులకు చేరింది. 382 పరుగులు చేస్తే గెలిచే మ్యాచ్‌లో చివరి 7 వికెట్లు 5 పరుగుల తేడాతో పడిపోవడంతో ఆస్ట్రేలియా 71 పరుగుల తేడాతో ఓడిపోయింది.

ఇంకా... పూర్తివ్యాసం పాతవి

39వ వారం
right|125px

హిందూ సంప్రదాయంలో వినాయకుడు సకల దేవతాగణములకు అధిపతి (గణనాయకుడు, గణపతి, గణేశుడు). అన్ని అడ్డంకులు తొలగించు వాడు (విఘ్నేశ్వరుడు), అన్నికార్యములకూ, పూజలకూ ప్రధమముగా పూజింపవలసినవాడు. విజయానికీ, చదువులకూ, జ్ఞానానికీ దిక్కైన దేవుడు. హిందూ సంప్రదాయములో శైవములోను, వైష్ణవములోను, అన్ని ప్రాంతములలో, అన్ని ఆచారములలో వినాయకుని ప్రార్ధన, పూజ సామాన్యము. తెలుగువారి పండుగలలో వినాయకచవితి ముఖ్యమైన పండుగ. పంచాయతనపూజా విధానంలో వినాయకుని పూజ కూడా ఒకటి.

వినాయకుడు శివపార్వతుల పెద్దకొడుకు (కుమారస్వామి వారి రెండవ కొడుకు). వినాయకుని ఆకారం హిందూమతంలో విశిష్టమైనది. ఏనుగు ముఖము, పెద్ద బొజ్జ, పెద్ద చెవులు, ఒకే దంతము, ఎలుక వాహనము, పొట్టకు పాము కట్టు , నాలుగు చేతులు - ఒక చేత పాశము, మరొకచేత అంకుశం, ఒక చేత ఘంటము లేదా లడ్డూ, మరొక అభయహస్తము - ఇది నమ్మినవారికి సర్వ మంగళ ప్రదము. హిందూ సంప్రదాయముతో పరిచయము లేనివారికి ఆశ్చర్యకరము.

వినాయకునికి అనేక నామములు, పేర్లు ఉన్నాయి. కాని అంతటా అత్యంత ప్రస్ఫుటంగా గుర్తింపబడే లక్షణాలు - ఏనుగు ముఖం, ఎలుక వాహనం అడ్డంకులు తొలగించే గుణం, విద్యా, బుద్ధి ప్రదాత. ధార్మిక, లౌకిక కార్యక్రమాల (వ్రతము, యజ్ఞము, పరీక్షలు వ్రాయడం, ఇల్లు కట్టడం వంటివి) ఆరంభంలో వినాయకుడిని స్తుతించే లేదా పూజించే ఆనవాయితీ సర్వసాధారణం.


వైదిక కాలంనుండి, అంతకుముందు ఉన్న కొన్ని విశ్వాసాలు వినాయకుని సూచిస్తున్నప్పటికీ క్రీ.శ. 4వ, 5వ శతాబ్దాలలో, ప్రత్యేకించి గుప్తుల కాలంలో వినాయకునికి ఇప్పుడు మనం పూజించే రూపం, లక్షణాలు, సంప్రదాయాలు ధార్మిక సమాజంలో రూపుదిద్దుకున్నట్లుగా అనిపిస్తుంది. తరువాత వినాయకుని పూజ చాలా వేగంగా ప్రాచుర్యం పొందింది. 9వ శతాబ్దంలో స్మార్తుల పంచాయతనంలో ఒక విభాగం అయ్యింది. వినాయకుడు అందరికంటే అత్యున్నతమైన భగవంతుడు (దేవదేవుడు) అని విశ్వసించే గాణపత్య సమాజం ఈ కాలంలో ఏర్పడింది. వినాయకుని గురించి తెలిపే ముఖ్యమైన ధార్మిక గ్రంధాలు - గణేశ పురాణము, ముద్గల పురాణము, మరియు గణపతి అథర్వశీర్షము.


ఇంకా... పూర్తివ్యాసం పాతవి

40వ వారం

పచ్చబొట్లు (Tattoos) చర్మం మీద వేయించుకొనే ఒకరకమైన చిహ్నాలు. దీనిలో వివిధ వర్ణపదార్ధాలను సన్నని సూదుల ద్వారా గుచ్చి వేస్తారు. మనుషులలో ఇవి వారివారి అభిరుచులను బట్టి వేయించుకొనే గుర్తులు. జంతువులలో వీనిని ఎక్కువగా గుర్తించడానికి వీలుగా పెంచుకోనేవారు వేయిస్తారు.

పచ్చబొట్లు పొడిపించుకోవడం అత్యంత పురాతనమైన కళ . ఒక వ్యక్తి శరీరంలోని చర్మాన్ని సూదితో గుచ్చి రంగులను, వర్ణాలను దానిపై వేయటమనే ఈ కళ కొన్ని తెగలకు సంప్రదాయంగా వస్తున్నది. మానవ శరీరాన్ని ఒక నారగుడ్డగా ఉపయోగించుకోవటమే పచ్చబొట్టు పొడిపించుకోవడం అనవచ్చు. ఈ ప్రక్రియకు స్ఫూర్తి ప్రాచీన కాలపు పచ్చబొట్లే. గతంలో ఈ రంగు నల్లగా (నూనెను కాల్చినపుడు వచ్చే మసి) ఉండేది. దీన్ని అవిసె నూనెలో కానీ లేదా పసుపు ముద్దలో కానీ మూలికలతో సహా కలిపి వేసేవారు. ప్రస్తుతం ఈ రంగుల ప్రత్యామ్నాయాలకు బదులు మాసిపోని సిరా వచ్చింది. ఇవి రుద్దినా పోదు. రంధ్రాలలో రంగులను చొప్పించేందుకు ఉపయోగించిన బాధాకరమైన ముల్లుకు బదులుగా విద్యుత్ శక్తిసంపన్నమైన సూది వచ్చింది. 4000 ఏళ్ళనాటి ఈజిప్టియన్ మమ్మీలకు నైట్ దేవత చిహ్నాలైన పచ్చబొట్లు ఉన్నాయి. ప్రాచీన గ్రీకులలో పచ్చబొట్టు కులీనులకు మాత్రమే ప్రత్యేకించబడింది. వార్తాహరుల నున్నటి బోడిగుండ్లపైన పచ్చబొట్లు చెక్కి సంకేత సందేశాలు గ్రీకులు పంపేవారు. ప్రాచీన రోమన్లు బానిసలకు, నేరస్థులకు పచ్చబొట్లు గుర్తులుగా చేసేవారు.

ప్రేమికులు తమ శరీరాలపై వాళ్ళ వాళ్ళ పేర్లు పొడిపించుకునేవారు. జనసమ్మర్ధం కల సంతలలో, సభలలో, గుంపులలో తమ బిడ్డలు తప్పిపోయినట్లైతే సులభంగా గుర్తు పట్టేందుకు వీలుగా జాగ్రత్త కల తల్లిదండ్రులు తమ బిడ్డల చేతులపై పేర్లు పచ్చబొట్టుగా పొడిపించేవారు. స్త్రీలు ఈ పచ్చబొట్ల కళను ఉపయొగైంచుకుని తమ సౌందర్యాభివృద్ధి కోసం గడ్డాలపైన, బుగ్గలపైన సుకుమారమైన చుక్కలు పెట్టించుకునేవారు. భారతదేశంలోని కొండ జాతి ప్రజలలో పచ్చబొట్లు అత్యంత ఆదరణ పాత్రమయ్యాయి. గిరిజన స్త్రీలు తమ శరీరంలోని ముంజేతులు, హస్తాలు, చెవులు, భుజాలు, పాదాలు, బుగ్గలు, గడ్డాలు, నుదురు మొదలైన భాగాలలో పచ్చబొట్లు పొడిపించుకుంటారు. ఈ రూపాలు సాధారణంగా గీతలు, వంపులు, వలయాలు మరియు చుక్కలుగా ఉంటాయి.

ఇంకా... పూర్తివ్యాసం పాతవి

41వ వారం

ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీశ్రీ. శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ గా ప్రసిద్ధుడయ్యాడు. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా, సినిమా పాటల రచయితగా ఆయన ప్రసిద్ధుడు. శ్రీశ్రీ హేతువాది మరియు నాస్తికుడు. మహాకవిగా శ్రీశ్రీ విస్తృతామోదం పొందాడు. ఆయన సృజించిన కవితా! ఓ కవితా! అనే కవిత గురించి శ్రీశ్రీ .జీవిత కథకుడు, ప్రసిద్ధ రచయిత, భాషావేత్త, బూదరాజు రాధాకృష్ణ ఇలా రాసాడు: "కనీసం వేయి సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగు సాహిత్యంలో కవితను ఇలా నిర్వచించి, ఇంత కవితాత్మకంగా వర్ణించి, ఇంత అద్భుత సృష్టి చేసిన మరో కవి లేనే లేడు. ఇదే అతణ్ణి సాహితీ శిఖరాగ్రాన నిలిపింది". మహాప్రస్థానం ఆయన రచించిన కావ్యాల్లో ప్రసిద్ధమైనది.

శ్రీరంగం శ్రీనివాస రావు - 1910 జనవరి 2 న పూడిపెద్ది వెంకటరమణయ్య, అప్పలకొండ దంపతులకు జన్మించాడు. శ్రీరంగం సూర్యనారాయణకు దత్తుడగుట వలన ఈయన ఇంటిపేరు శ్రీరంగంగా మారింది. ప్రాధమిక విద్యాభ్యాసం విశాఖపట్నం లో చేసాడు. 1925 లో SSLC పాసయ్యాడు. అదే సంవత్సరం వెంకట రమణమ్మతో పెళ్ళి జరిగింది. 1931 లో మద్రాసు విశ్వ విద్యాలయం లో బియ్యే (జంతుశాస్త్రము) పూర్తి చేసాడు. 1935 లో విశాఖ లోని మిసెస్‌ ఎ వి ఎస్‌ కాలేజీ లో డిమాన్స్ట్రేటరు గా చేరాడు. 1938 లో మద్రాసు ఆంధ్ర ప్రభలో సబ్‌ ఎడిటరు గా చేరాడు. ఆ తరువాత ఆకాశవాణి, ఢిల్లీ లోను, మిలిటరీ లోను, నిజాము నవాబు వద్ద, ఆంధ్ర వాణి పత్రికలోను వివిధ ఉద్యోగాలు చేసాడు. 1933 నుండి 1940 వరకు ఆయన రాసిన మహాప్రస్థానం, జగన్నాథుని రథచక్రాలు, గర్జించు రష్యా వంటి గొప్ప కవితలను సంకలనం చేసి మహప్రస్థానం అనే పుస్తకంగా ప్రచురించాడు. తెలుగు సాహిత్యపు దశనూ, దిశనూ మార్చిన పుస్తకం అది. 1947 లో మద్రాసు కు తిరిగి వచ్చి అక్కడే స్థిరపడ్డాడు. తన రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ మరిన్ని గొప్ప రచనలు చేసారు. ఎన్నో సినిమాలకు పాటలు, మాటలు రాసాడు. పిల్లలు లేని కారణం చేత 1949 లో ఒక బాలికను దత్తత తీసుకున్నాడు. 1956 లో సరోజను రెండవ వివాహం చేసుకున్నాడు. రెండవ భార్య ద్వారా ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు కలిగారు.

ఇంకా... పూర్తివ్యాసం పాతవి

42వ వారం
అష్టాదశ పురాణాలలో బ్రహ్మ పురాణం ఒకటి. బ్రహ్మ పురాణములో 246 అధ్యాయాలు ఉన్నాయి. బ్రహ్మ పురాణములో విశేషముగా పుణ్య క్షేత్రాల గురించి చెప్పబడింది. భూమి, ద్వీప, పర్వత, నదీ, సముద్ర పుణ్య తీర్ధముల గురించి చెప్పబడింది. గౌతమీ మహత్యము లో అనేక నదుల గురించి చెప్పబడింది. పురుషోత్తమ క్షేత్రమైన పూరీ జగన్నాధ క్షేత్రము గురించి చెప్పబడింది.
పురాణం వైష్ణవం త్వేతత్ సర్వకిల్బిష నాశకం
విశిష్టం సర్వ శాస్త్రేభ్యః పురుషార్ధోపసాదకం

బ్రహ్మ పురాణము విష్ణుదేవునితో సమానమైనది. బ్రహ్మ పురాణం సర్వపాపాలను తొలగించి సర్వపురుషార్ధములకు పొందడానికి సర్వ శాస్త్రాలకంటే విశేషము కలది. - అని శాస్త్రోక్తి. ఇది వేదవ్యాసుడు తన శిష్యుడైన జైమినికి చెప్పాడు.

మొదటి అధ్యాయములొ బ్రహ్మ సృష్టి చేయ సంకల్పించుట. ఆ తరువాత ఉదకమును సృజించుట. ఆ ఊదకములో సృష్టి చేయడానికి వీర్యమును వదలుట. అవి బంగారు అండములుగా తెలుట. అందు ఒక అండమునందు హిరణ్య గర్భుడుగా తానే జనించుట. బ్రహ్మ మానస పుత్రులను సంకల్ప కారణముగా పుట్టించుట. రుద్రుని పుట్టించుట. సనత్కుమారుడు జన్మించి స్కందుడగుట. పక్షులను, సాధ్యులను పుట్టించుట. ఉరుములు, మెరుపులు, ఇంద్రధనస్సు, మేఘములను సృష్టించుట, భువి, దివి, ఆకాశమును సృష్టించుట వర్ణించబడ్డాయి. బ్రహ్మ స్త్రీ పురుషులుగా మారి ప్రజలను వృద్ధి చేయుట. పురుషుడు జగములందు విష్ణువుగా వ్యాపించుట. విష్ణువు విరట్పురుషుని పుట్టించుట. విరాట్పురుషుడు మనువును సృజించుట. మన్వంతరము కొనసాగుట వర్ణించబడినది. స్వాయాంభువు శతరూపుల వివాహము వారి వంశభివృద్ధి క్రమంలో ధృవ జననము, పృధువు జననము, దక్షప్రజాపతి జననము అతడి వివాహము వారి వివాహములు వర్ణించబడ్డాయి.

తృతీయాధ్యాయములొ దక్షుడు సంకల్ప మాత్రముగా దేవ దానవ యక్షులను పుట్టించడము. అస్నికను వివాహమాడడము, పుత్రులను కనడము, నారదుని మాటలు విని వారు గృహస్థజివితానికి విముఖులై వెళ్లి తిరిగి రాక పొవడము, దక్షుడు తిరిగి వైరిణి అందు వెయి మంది పుత్రులను పొందడము, వారు అన్నలను వెదుకుతూ వెళ్లి తిరిగి రాక పోవడము, తత్ఫలితముగా దక్షుడు కుపితుడై నారదుడిని శపించడము, శాపవశాన నారదుడు బ్రహ్మకు జన్మించడము, దక్షుడు తిరిగి అరవై మంది పుత్రికలను కనడము, వారిని ధర్మునుకి, కశ్యపునికి, చంద్రుడికి ఇచ్చి వివాహము వేయడము వర్ణించబదినది. దేవాసుర ఉత్పత్తి వర్ణించబడినది.

నాలుగవ అధ్యాయములో బ్రహ్మ సృష్టి అంతటికీ అధిపతులను నిర్ణయించుట, రాజులకు కుబేరుడిని, ఆదిత్యులకు విష్ణువును, జలాలకు వరుణిడిని, వసువులకు అగ్నిని, ప్రజాపతులకు దక్షుడిని, మరుత్తులకు వాసవుని, దైత్యులకు ప్రహ్లాదుడిని, పితరులకు యముడిని, యక్ష, భూత పిశాచములకు శివుడిని, పర్వతములకు హిమవంతుడిని, నదులకు సాగరుడిని, గంఘర్వులకు చిత్రరధుడిని, నాగులకు వాసుకుని, సర్పములకు తక్షకుడిని, ఏనుగులకు ఐరావతాన్ని, గుర్రములకు ఉచ్ఛైశ్వాన్ని, పక్షులకు గరుడిని, మృగములకు సింహాన్ని, గోవులకు గోవృషమును, వృక్షములకు జువ్విని అధిపతులను చేయడము. దిక్కులకు అధిపతులను నిర్ణయించడము. పృధు చక్రవర్తి సహాయముతో భూని గోవుగా చేసి అందరూ క్షీరమును పితకడము వర్ణించబడినది.

ఇంకా... పూర్తివ్యాసం పాతవి

43వ వారం

ఆంధ్రప్రదేశ్ సచివాలయం లో పనిచేసే వారు వృత్తిరీత్యా ప్రభుత్వోద్యోగులు. లలిత కళారాధన వారి ప్రవృత్తి. కవులు, రచయితలు, రచయిత్రులు, నటీనటులు, చిత్రకారులు, గాయకులు, వాద్యకారులు ఇలా సచివాలయ ఉద్యోగులలో వివిధ లలితకళలలో కేవలం ప్రవేశమే కాదు ప్రావీణ్యమున్న వారు ఎందరో ఉన్నారు. ఈ సచివాలయ ఔత్సాహిక కళాకారుల సాంస్కృతిక వేదిక ఆంధ్రప్రదేశ్ సచివాలయ సాంస్కృతిక సంఘం.

స్ధాపించిన తొలి సంవత్సరాలలో సంఘం అలెగ్జాండర్ నాటక ప్రదర్శన చేపట్టిందట. ఆ ప్రదర్శనను దామోదరం సంజీవయ్య అనే కళాశాల విద్యార్ధి చూసారు. కాలగతిలో వారు రాష్ట్రముఖ్యమంత్రి అయ్యాైరు. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక సంఘ రంగస్థలానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన వారు, అలెగ్జాండర్ వీర్రాజు గారేరని అడిగేరట. దశాబ్దాల క్రితం చూసిన నాటకం వారి మీద ఎంత ముద్ర వేసిందో, వారి స్మృతి లో ఎంత గా నిలిచిందో తెలియ చేయడానికి ఈ సంఘటన తార్కాణం. హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రంలో ప్రసారాలు ప్రారంభమైన తొలి రోజుల్లో నాటకాలు హెచ్చుగా ఉండేవి. ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులు ఆ నాటకాలలో చాలా ఉత్సహాం గా పాల్గొనే వారు. అంతే కాదు సినిమా లలో కూడా వారు పాత్రలు ధరించేవారు.శేషగిరిరావు, శ్రీకాంత శర్మ, వి. అర్జునరావు, రామ్మూర్తి, అర్జునరావు, కక్కెర్ల కొమరయ్య చాలా సినిమాలలో కనిపించారు. ముత్యాలముగ్గు చిత్రంతో గుర్నాధం (కంట్రాక్టర్ తో మాట్లాడిన పంచదార వ్యాపారి), పెళ్లీడు పిల్లలు చిత్రంలో సూర్యకాంతం భర్త పాత్రలు పోషించినది శేషగిరిరావు. పెళ్లీడు పిల్లలు చిత్రంలో జె.బి. రావు (జె.వి.సోమయాజులు పోషించిన పాత్ర) కు పి.ఎ. పాత్ర ను శ్రీకాంత శర్మ పోషించారు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం రూపొందించిన ఆనందోబ్రహ్మ సీరియల్ లో వి. అర్జునరావు, రామ్మూర్తి కనిపిస్తారు.

సచివాలయ ఉద్యోగులలో అంతర్లీనంగా లలిత కళలలో వారికి ఉన్న ప్రావీణ్యతని వెలికితీసి, వారి నైపుణ్యాన్ని పెంపొందించే ఉద్దేశంతో 1943 సంవత్సరంలో, అప్పటి మదరాసు ఉమ్మడి రాష్ట్రంలో కళల పట్ల ఆసక్తి కలిగిన వారిచే స్థాపించ బడింది. సంఘం తొలి అద్యక్షుడు శ్రీ సంగం బాబు. ఆయన కు సర్వశ్రీ జనార్ధనరావు, భక్తవత్సలం, బి.రామారావు, ఆళ్ల పిచ్చయ్య, సింహాద్రి రాఘవులు మున్నగు వారు తోడుగా నిలిచేరట. సర్వశ్రీ శ్రీనివాసరావు, కె.జి.వీర్రాజు, వి.కె.రామారావు, జగన్మోహన రావు, కె.వెంకట్రామయ్య, లక్ష్మణరావు, మంగు అప్పారావు, చెల్లారావు, సుబ్బారావు, డి.నరసింహారావు ప్రభృతులు సంఘాన్ని ముందుకు నడిపించారు. సర్వశ్రీ జోళ్యపాళెం సిధ్ధప్ప నాయుడు, ఇ.ఎల్.నరసింహారావు, డి.వి.ఎస్. శాస్త్ర్రి, వి.రాధాకృష్ణమూర్తి, ఆర్.వి.ఎస్. రామస్వామి ప్రముఖులు. సిధ్దప నాయుడు ప్రముఖ రంగస్ధల దర్శకుడు ఎ.ఆర్.కృష్ణ ప్రయోగాత్మకంగా, ప్రతిష్టాత్మకంగా ప్రదర్సించిన మాలపిల్ల నాటకంలో రామదాసు పాత్ర పోషించారు. అంతేకాక ఆయన ధర్మదాత, దాసి మొదలగు చిత్రాలలో నటించారు. ఆర్.వి.ఎస్.రామస్వామి ఫ్రముఖ రచయిత ఈయన రచించిన గాలివాన, వలయం నాటకాలు సుప్రసిధ్దాలు. గాలివాన నాటకం పలు పరిషత్తులలో ప్రదర్శించ బడి ఉత్తమ ప్రదర్శన బహుమతులు గెలుచుకొంది. ఈ నాటకంలో ప్రముఖ సినీనటుడు కీ.శే. నూతన్ ప్రసాద్ నటించాడు.


ఇంకా... పూర్తివ్యాసం పాతవి

44వ వారం

హిమాలయాలలో ఉన్న నేపాల్ రాజ్యము, 2006 నేపాల్ ప్రజాస్వామ్య ఉద్యమానికి పూర్వం ప్రపంచంలోని ఏకైక హిందూ రాజ్యము. ఇది దక్షిణ ఆసియాలో చైనా, టిబెట్, భారతదేశాల సరిహద్దులతో ఉన్నది. ఇది ఒక భూపరివేష్టిత దేశం.

నేపాల్‌కి వెయ్యి సంవత్సరాల పెద్ద చరిత్ర ఉంది. కిరాంత్ లేదా కిరాతి అనేది 7వ లేక 8వ శతాబ్దములలో తూర్పు నుండి వలస వచ్చిన మరియు చరిత్రకారులకు తెలిసిన మొదటి తెగ. గౌతమ బుద్ధుడు క్రీస్తు పూర్వము 563లో నేపాల్‌లోనే జన్మించాడు. క్రీస్తు పూర్వం 1వ శతాబ్దంలో అశోకుడు కూడా ఉత్తర భారతదేశంతో బాటు ఇప్పటి నేపాల్‌లోని దక్షిణ ప్రాంతాలను(హిమాలయ పర్వత ప్రాంతాలు అశోకుని సామ్రాజ్యంలో లేవు) పరిపాలించాడు. క్రీస్తు శకం 200కల్లా బౌద్ధ సామ్రాజ్యాన్ని హిందువులు అంతమొందించి లిక్కావి వంశ పరిపాలనను ప్రారంభించారు.

900వ సంవత్సరంలో లిక్కావి వంశాన్ని పారద్రోలి ఠాకూర్లు, వారిని పారద్రోలి మల్లులు పరిపాలనకు వచ్చారు. 1768లో ప్రిథ్వి నారాయణ్ షా అనే గూర్ఖా రాజు ఖాట్మండును ఆక్రమించుకున్నాడు. 1814లో నేపాల్ ఇంగ్లీషు వారితో యుద్ధం చేసింది(ది ఆంగ్లో నేపాలీస్ వార్). 1816లో సుగౌలి సంధితో ఈ యుద్ధం ముగిసింది. ఇంగ్లీషు వారికి సిక్కింను, దక్షిణ భాగాలను ఇచ్చివేయడంతో ఇంగ్లీషు వారు వెనుదిరిగారు. కానీ 1857లో భారత దేశంలోని సిపాయిల తిరుగుబాటును అణచివేయడంలో ఇంగ్లీషు వారికి సహాయపడినందుకుగాను ఇంగ్లీషువారు దక్షిణ ప్రాంతాలను తిరిగి ఇచ్చివేశారు.

షా వంశాన్ని 1846లో జంగ్ బహద్దూర్ రాణా అంతమొందించి దేశ పరిపాలనను తన చేతిలోకి తీసుకున్నాడు. దీనికోసం అతడు దాదాపు కొన్ని వందల మంది రాకుమారులను, తెగల నాయకులను అంతమొందించాడు (దాన్నే కోట్ ఊచకోత అంటారు). 1948వ సంవత్సరము వరకూ రాణాలు వారసత్వ ప్రధాన మంత్రులుగా నేపాల్‌ను పరిపాలించారు. ఎప్పుడైతే భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందో త్రిభువన్ అనే క్రొత్త రాజు నేపాల్ పాలనకు రావడానికి భారతదేశం సహాయపడింది. నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఏర్పడడానికి కూడా సహాయపడింది. రాజు త్రిభువన్ కుమారుడైన రాజు మహేంద్ర ప్రజాస్వామ్య ప్రయోగాన్ని, పార్లమెంటును రద్దు చేసి పార్టీలు లేని పంచాయితీ పద్ధతి ద్వారా నేపాల్ని పరిపాలించాడు. అతని కుమారుడు బీరేంద్ర సింహాసనాన్ని అధిరోహించాడు. అతను కూడా 1989 వరకూ పంచాయితీ పద్ధతినే అనుసరించాడు. కాని ప్రజా ఆందోళన తర్వాత బలవంతంగా రాజ్యాంగ మార్పులను ఆమోదించాడు. 1991 మే నెలలో దాదాపు యాభై సంవత్సరాల తరువాత నేపాల్‌లో ఎన్నికలు జరిగాయి. నేపాలి కాంగ్రెస్ పార్టీ, కమ్మూనిస్ట్ పార్టీలకు ఎక్కువ వోట్లు దక్కాయి. ఏ పార్టీ కూడా రెండు సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం పరిపాలించలేక పోయాయి. అందుకు కారణంగా ప్రజోపయోగ కార్యక్రమాలలో మార్పు లేకపోవటం, అవినీతి రోగంలాగా మారటాన్ని చూపిస్తారు.

ఫిబ్రవరి 1996లో మావోయిస్టు పార్టీ ప్రజాస్వామ్యాన్ని మార్చి సామ్యవాదాన్ని స్థాపించడం కోసం విప్లవాత్మక ధోరణిని ఎంచుకొని ప్రజా యుద్ధాన్ని ప్రారంభించింది. అదే ఆ తర్వాత అంతర్యుద్ధంగా మారి 10 వేల మంది మరణానికి దారితీసింది.


ఇంకా... పూర్తివ్యాసం పాతవి

45వ వారం

బోత్సువానా దీనిని అధికారికంగా రిపబ్లిక్ ఆఫ్ బోత్సువానా అంటారు. దక్షిణఫ్రికా స్థానికులు మాట్లడే భాషలలో ఒకటైన త్‌స్వానా భాషలో దీనిని లెఫత్‌షి లా బోత్సువానా అంటారు. ఇది దక్షిణాఫ్రికా దేశాలలో ఒకటి. ఇక్కడి పౌరుల చేత బాత్సువానా అని పిలువబడినది. వాత్సవంగా ఇది బ్రిటిష్ ప్రొటెక్రేట్ అఫ్ బెచ్యుయానాలాండ్గా గుర్తించబడినది. 1966 సెప్టెంబర్ 30న ఈ దేశానికి కామన్‌వెల్త్ దేశాల నుండి స్వతంత్రం లభించిన తరువాత ఈ దేశానికి బోత్సువానా అనే నామాంతరం చేసుకున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఇక్కడ స్వతంత్రమైన చక్కని స్వేచ్ఛా పూరితమైన ఎన్నికలు నిర్వహించారు. బోత్సువానా సమతల ప్రదేశం ఉన్న దేశం. 70% దేశ సరిహద్దులను కలహరి ఎడారి చుట్టి ఉంటుంది. బోత్సువానా దక్షిణ సరిహద్దు మరియు ఆగ్నేయ సరిహద్దులలో దక్షిణాఫ్రికా ఉంది. పడమటి మరియు ఉత్తర సరిహద్దులలో నమీబియా ఉంటుంది. ఉత్తర సరిహద్దులలో జింబాబ్వే ఉంటుంది. బోత్సువానా తూర్పు భాగములో స్వల్పముగా కొన్ని వందల మీటర్ల సరిహద్దులలో జాంబియా ఉంటుంది. బోత్సువానా మధ్యంతర పరిమాణము కలిగిన భూపరివేష్టిత(లాండ్ లాక్) దేశము. బోత్సువానా జనసంఖ్య 2,000,000. స్వతంత్రం రాక పూర్వము బోత్సువానా ఆఫ్రికా దేశాలలో అతి బీద దేశం. బోత్సువానా జిడిపి అప్పుడు 0.75 అమెరికా డాలర్లు మాత్రమే ఉండేది. స్వతంత్రం వచ్చిన తరువాత బోత్సువానా స్వశక్తితో శీఘ్రంగా అభివృద్ధి సాధించిన కారణంగా త్వరితగతిన అభివృద్ధి చెందిన ప్రపంచ దేశాలలో ఒకటిగా అంతర్జాతీయ గుర్తింపు పొందింది. 2010 అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంచనా ప్రకారము బోత్సువానా సరాసరి తలసరి అదాయము 14,000 అమెరికా డాలర్లు. బోత్సువానా సంపూర్ణ స్వతంత్ర విధానాలను అనుసరిస్తున్నది.

19వ శతాబ్ధంలో బోత్సువానా లో నివసిస్తున్న త్‌స్వానా స్థానిక నివాసులు మరియు ఈశాన్యభూభాగం నుండి వలస వచ్చిన ఎన్‌డిబెలె కొండజాతి ప్రజల మద్య చెలరేగిన పగ ఉచ్ఛ స్థాయికి చేరుకుంది. అలాగే ట్రాన్స్‌వాల్ నుండి వచ్చిన ఒప్పందదార్ల మద్య వివాదాలు తలెత్తాయి. ఒప్పందదారులు నాల్గవ ఖామా , బతోయెన్ మరియు వారి సహాయకుడైన సెబెలె ద్వారా అనుమతి పొంది వచ్చిన వారు. బ్రిటిష్ ప్రభుత్వం 1885 మార్చి 31 నుండి బెచ్యుయానాలాండ్ తన రక్షణలోకి తీసుకున్నది. బోత్స్‌వానా ఉత్తర భూభాగము బ్రిటిష్ ప్రభుత్వ ప్రత్యక్ష నిర్వహణలో బెచ్యుయానాలాండ్ ప్రొటెక్రేట్ పేరుతో ఉండేది. బొత్సువానా దక్షిణ భూభాగము కేప్ కాలనీలో ఒక భాగంగా ఉండేది. ఇప్పుడది దక్షిణాఫ్రికా వాయవ్య సరిహద్దుగా ఉంది. సెత్సువానా మాట్లాడే అత్యధికులు ఇప్పుడు దక్షిణాఫ్రికాలో నివసిస్తునారు. 1910లో యూనియన్ ఆఫ్ సౌత్‌ ఆఫ్రికా రూపు దిద్దుకున్నప్పుడు బెచ్యుయానాలాండ్ ప్రొటెక్రేట్, బాసుతోలాండ్, స్వాజీలాండ్ కలవక పోయినా అందుకు కావలసిన ప్రయత్నాలు మాత్రం జరిగాయి.

ఇంకా... పూర్తివ్యాసం పాతవి

46వ వారం

లాస్ వెగాస్ నగరం అమెరికాలోని నెవాడా రాష్ట్రంలోని అత్యధిక జనసాంద్రత కలిగిన నగరం. క్లార్క్ కౌంటీ ఆరంభంలో ఉన్న ఈ నగరంలోని అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన వసతిగృహాలు ప్రంపంచ ప్రసిద్ధి కలిగి ఉన్నాయి. ఈ నగరం జూదగృహాలకు, అనేక ఇతర విలాసాలకు పేరొందిన ఆకర్షణీయ నగరం. వినోదాలకు, షాపింగ్ మరియు విలాసాలకు ఈ నగరం మిక్కిలి ప్రసిద్ధి. ఈ నరగరం వినోదాలకు అంతర్జాతీయ కేంద్రం. వసతిగృహాలు కలిగిన బృహత్తర జూదగృహాలు తదనుగుణ ఇతర వినోదాలు ఈ నగర ఆకర్షణీయ అంశాలు. ఇక్కడ ఉన్న అనేక రూపాలలో విలాస కార్యకలాపాలకు అనువైన వ్యాపారాల కారణంగా ఇది పాపాల నగరంగా పేరు పొందింది. ఇక్కడ ఆకర్షణీయమైన విద్యుదలంకరణ అనేక ఇతర ఆకర్షణలు జూదమాడే వారే కాక దేశవిదేశాల నుండి అనేకమంది దీనిని సందర్శిస్తుంటారు. ఇక్కడి ఆకర్షణలు చిత్ర రంగాన్ని మరియు దూరదర్శన రంగాన్ని కూడా తనవైపు తిప్పుకున్నాయి. లాస్ వెగాస్ స్ట్రిప్ వెలుపలి ప్రాంతంలో అంతటా అద్భుత విద్యుత్‌ దీపాలకరణలతో నిండి ఉంటుంది. నగరమంతా కూడా సాదారణంకంటే దీపాలంకరణ అధికమే. ఈ కారణంగా నగరం ప్రపంచంలో ప్రకాశవంతమైన నగరంగా పేరుపొందింది. అంతరిక్షంలో నుండి చూసినా ఈ నగరం ప్రకాశవంతంగా కనబడుతుందని ప్రతీతి.


లాస్ వెగాస్ నగరం 1905లో స్థాపించబడింది. 1911లో ఇది అధికార పూర్వంగా గుర్తింప బడింది. తరువాతి కాలంలో క్రమంగా అభివృద్ధి చెంది శతాబ్ధం చివరికంతా 20వ శతాబ్ధపు అత్యంత జనసాంద్రత కలిగిన అమెరికా నగరాలలో ఒకటిగా పేరుపొందింది. 19వ శతాబ్ధానికి చికాగో నగరానికి ఇలాటి గుర్తింపు వచ్చింది. 2000లో అమెరికాలోని అధిక జనసాంద్రత కలిగిన నగరాలలో ఈ నగరం 28వ స్థానంగా నమోదైంది. ఈ నగర జనసంఖ్య దాదాపు 5,58,880. నగరం పరిసర ప్రాంత ప్రజలను కలుపు కుంటే జనసంఖ్య 20,00,000 కంటే అధికం.


లాస్ వెగాస్ స్ట్రిప్ మరియు పరిసర ప్రాంతాలలో ఉన్న విలాస వంతమైన వసతి గృహాలు కలిగిన 4.5 మైళ్ళ ప్రాంతం మాత్రమే లాస్ వెగాస్ అని పిలువ బడుతుంది. పారడైస్ మరియు విన్‌చెస్టర్ నగరాల పరిమితిలో కలపబడని వెలుపలి ప్రాంతంలో లాస్ వెగాస్‌కు చెందిన 4.5 మైళ్ళ ప్రాంతం ఉంటుంది.

ఇంకా... పూర్తివ్యాసం పాతవి

47వ వారం
ఆళ్వారులు శ్రీవైష్ణవ సంప్రాదాయంలోనూ, తమిళ సాహిత్యంలోనూ విశిష్టమైన స్థానం కలిగిన విష్ణు భక్తులు. తమ పాశురాలతో విష్ణువును కీర్తించి దక్షిణాదిన భక్తి సంప్రదాయాన్ని పరిమళింపజేశారు. వీరు పాడిన (రచించిన) పాశురాలు అన్నీ (నాలుగు వేలు) కలిపి దివ్య ప్రబంధం లేదా నాలాయిరం లేదా ద్రవిడ వేదం అనబడుతాయి. భక్తి, పారవశ్యము, శరణాగతి - ఇవి ఈ ఆళువారుల జీవితంలోనూ, రచనలలోనూ, వారిని గురించిన గాధలలోనూ ప్రముఖంగా కానవచ్చే అంశాలు. మొత్తం పన్నెండుమంది ఆళ్వారులలో పొయ్‌గయాళ్వార్ (సరోయోగి), పూదత్తాళ్వార్ (భూతయోగి) మరియు పేయాళ్వార్ (మహాయోగి) - ఈముగ్గురూ ప్రధములు. కనుక వారిని ముదలాళ్వారులు అంటారు. ఆళ్వారుల జీవిత కాలాల గురించి స్పష్టమైన చారిత్రక ఆధారాలు అందడంలేదు. ముదళాల్వారులు ద్వాపర యుగాంతంలో ఉద్భవించారని సంప్రదాయ గాధలు. కాని శాస్త్రీయ పరిశోధకులు వీరి కాలం క్రీ.శ. 7వ శతాబ్దం - 9వ శతాబ్దం మధ్యకాలమని అభిప్రాయపడుతున్నారు. ఆళ్వారుల జీవిత విశేషాలగురించి కూడా అనేక గాధలు ప్రచారంలో ఉన్నాయి.

ఆళ్వారులలో మొదటివాడు పొయ్‌గాళ్వార్. సరసునందు అవతరించినందువలన 'పొయ్‌కై ఆళ్వార్' అని పిలువబడెను. కాసార యోగి, సరోయోగి అనునవి ఇతని నామాంతరములు. శ్రీ మహా విష్ణువు శంఖమైన పాంచజన్యమునకు ఇతడు అంశావతారమని భక్తుల విశ్వాసము.

ఆల్వారులలో రెండవవాడు పూదత్తాళ్వార్. తన పాశురాలలో యదార్ధమును చెప్పినందువలనా, సర్వేశ్వరునికి ఆత్మగా ఉన్నందువలన ఇతనికి 'పూదత్తాళ్వార్' అన్నపేరు వచ్చింది. భూతాహ్వయుడనీ, మల్లపురాధీశుడనీ ఇతని నామాంతరములు. శ్రీ మహా విష్ణువు గదాయుధమైన కౌమోదకికి ఇతడు అంశావతారమని భక్తుల విశ్వాసము.

ఆళ్వారులలో మూడవవాడు పేయాళ్వార్. భగవధ్యానములో మైమరచి పిచ్చివానివలే సంచరించినందున ఇతనికి 'పేయ్' (పిచ్చి) ఆళ్వార్ అనే పేరు వచ్చింది. మహదాహ్వయుడనీ, మైలాపురాధీశుడనీ ఇతని నామాంతరములు. శ్రీ మహా విష్ణువు ఖడ్గమైన నందకమునకు ఇతడు అంశావతారమని భక్తుల విశ్వాసము.

ఇంకా... పూర్తివ్యాసం పాతవి

48వ వారం

మైసూరు : ( కన్నడ భాష ಮೈಸೂರು ) కర్ణాటక రాష్ట్రంలో రెండవ అతిపెద్ద నగరం. మైసూరు జిల్లా ప్రధాన కార్యాలయాలు ఇక్కడే ఉంటాయి. మైసూరు డివిజన్ కర్ణాటక రాజధానియైన బెంగళూరుకు నైరుతి దిశగా 46 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మైసూరు అనే పదం మహిషూరు అనే పదం నుంచి ఉద్భవించింది. మహిషుడు అంటే హిందూ పురాణాల్లో పేర్కొన్న ఒక రాక్షసుడు. దీని వైశాల్యం సుమారు 42 చ.కి.మీ. ఉంటుంది. చాముండి హిల్స్ పర్వత పాదాలను ఆనుకుని ఉంది. మైసూరు దసరా ఉత్సవాలకు పేరుగాంచినది. ఈ ఉత్సవాలకు యాత్రికులు విశేష సంఖ్యలో హాజరవుతారు. ఈ పేరు నుంచే మైసూరు పెయింటింగ్, మైసూర్ పాక్ అనే మిఠాయి, మైసూర్ సిల్క్ అనే వస్త్రాలు ప్రాచుర్యం పొందాయి.

1947 వరకూ ఈ నగరం ఒడయార్లు పరిపాలిస్తున్న మైసూరు రాజ్యానికి రాజధానిగా ఉండేది. 18 శతాబ్దం లో కొద్దికాలం మాత్రం హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ లు పరిపాలించారు. ఒడయార్లు సంస్కృతి కళలంటే ప్రాణమిచ్చే వారు. ఈ విధంగా నగరాన్ని సంస్కృతికి నిలువుటద్దంగా తయారు చేశారు. హిందూ పురాణాల ప్రకారం ఒకానొకప్పుడు మహిషూరు అని పిలువబడే ఈ ప్రాంతం మహిషాసురుడు అనే రాక్షసుని పరిపాలనలో ఉండేది. ఈ రాక్షసుణ్ణి దగ్గరే ఉన్న కొండపై కొలువున్న చాముండీ దేవి సంహరించిందని ప్రతీతి. తర్వాత కాలక్రమంలో మహిషూరు, మహిసూరుగా మారి చివరకు మైసూరు అనే స్థిరపడింది.

ప్రస్తుతం మైసూరు నగరం ఉన్న ప్రాంతాన్ని 15వ శతాబ్దం వరకు "పురగేరె" అనేవారు. 1524లో "మహిషూరు"కోటను 3వ చామరాజ వొడయార్ (1513–1553) నిర్మించాడు. తరువాత ఇక్కడి పాలన అతని కొడుకు 4వ చామరాజ వొడయార్ (1572–1576) క్రిందికి వచ్చింది. 16వ శతాబ్దంనుండి నగరాన్ని "మహిషూరు" అనసాగారు. తరువాత ఇది మైసూరుగా పరిణమించింది. విజయనగర సామ్రాజ్యం కాలంలో వొడయార్‌ల మైసూరు రాజ్యం వారికి సామంతరాజ్యంగా ఉండేది. అప్పటిలో మహిషూరు వొడయార్ల రాజధాని. దగ్గరలోని శ్రీరంగపట్నం విజయనగర సామ్రాజ్య ప్రతినిధి కార్యాలయకేంద్రంగా ఉండేది. 1565లో విజయనగర సామ్రాజ్యం పతనమయ్యింది. 1610లో రాజా వొడయార్ శ్రీరంగపట్నంలోని సామ్రాజ్య ప్రతినిధిని ఓడించి తన రాజధానిని శ్రీరంగపట్నానికి మార్చాడు. క్రమంగా మైసూర్ వొడయార్లు స్వతంత్ర పాలకులయ్యారు. 1637లో నరసింహరాజ వొడయార్ పాలనాకాలంలో మైసూర్ పూర్తి స్వతంత్ర రాజ్యమయ్యింది.

ఇంకా... పూర్తివ్యాసం పాతవి

49వ వారం

1973, డిసెంబర్ 2న పూర్వపు యుగస్లోవియా దేశంలో జన్మించిన మోనికా సెలెస్ (Monica Seles) ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి. 1994లో అమెరికా పౌరసత్వం పొందినది. మోనికా సెలెస్ తన క్రీడాజీవితంలో మొత్తం 9 గ్రాండ్‌స్లాం టెన్నిస్ టైటిళ్ళను సాధించింది. 1990లో 16 ఏళ్ల వయస్సులో ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్‌ను గెలిచి ఈ ఘనత సాధించిన పిన్నవయస్కురాలిగా రికార్డు సృష్టించింది. 1991 మరియు 1992లలో ఈమె అగ్రశ్రేణి క్రీడాకారిణిగా చెలామణి అయింది. 1991 మార్చిలో ప్రపంచ నెంబర్ వన్ హోదా కూడా పొందినది. ఆ స్థానంలో 178 వారాలపాటు కొనసాగింది. కాని 1993లో హాంబర్గ్ లో ఒక ఆగంతకుడు వీపుపై కత్తితో దాడిచేయడంతో ఆ తరువాత రెండేళ్ళు టెన్నిస్‌కు దూరం ఉండాల్సివచ్చింది. రెండేళ్ళ పునరాగమనం అనంతరం కూడా సెలెస్ చెప్పుకోదగ్గ విజయాలను నమోదుచేసింది. 1996లో ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ సింగిల్స్‌లో విజయం సాధించింది. 2008 ఫిబ్రవరి 14న మోనికా సెలెస్ టెన్నిస్ నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించింది.

మోనికా సెలెస్ ఆరేళ్ళ ప్రాయంలోనే టెన్నిస్ నేర్వడం ప్రారంభించింది. అప్పుడు తండ్రే ఆమె శిక్షకుడు. తొమ్మిదేళ్ళ ప్రాయంలోనే ఆమె తన మొదటి టోర్నమెంటులో విజయం సాధించింది. 1985లో 11 సంవత్సరాల ప్రాయంలో ఫ్లోరిడా లోని మియామిలో జరిగిన ఆరెంజ్ బౌల్ టోర్నమెంటులో విజయం పొందినది. 1986లో మోనికా సెలెస్ కుటుంబం యుగస్లోవియా నుంచి అమెరికాకు వెళ్ళడం జరిగింది. ఆమె అక్కడే టెన్నిస్ శిక్షణ పొందడం ప్రారభించింది.

మోనికా సెలెస్ తన మొట్టమొదటి ప్రొఫెషనల్ టెన్నిస్‌ను 1988లో 14 యేళ్ల వయస్సులో ఆడింది. ఆ మరుసటి యేడాది పూర్తికాలపు ప్రొఫెషనల్ పర్యటనలో చేరి అదే ఏడాది ఫైనల్లో క్రిస్ ఎవర్ట్ ను పరాజయం చేసి తొలి విజయాన్ని కూడా నమోదుచేయగలిగింది. 1989 జూన్ ఫ్రెంచ్ ఒపెన్‌ ఆడి తన మొదటి గ్రాండ్‌స్లాం టొర్నమెంటులోనే సెమీఫైనల్స్ వరకు దూసుకెళ్ళింది. సెమీస్‌లో అప్పటి ప్రపంచ నెంబర్ వన్ స్టెఫీ గ్రాఫ్ చేతిలో 6-3, 3-6, 6-3 తేడాతో ఓడిపోయింది. పర్యటనకు వెళ్ళిన తొలి ఏడాదే ప్రపంచ ర్యాంకింగ్‌లో 6 వ స్థానం పొందగలిగింది.

ఇంకా... పూర్తివ్యాసం పాతవి

50వ వారం

విజయవాడ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మూడవ అతిపెద్ద నగరము. కృష్ణా జిల్లాలో, కృష్ణా నది ఒడ్డునే ఉన్న ఈ నగరం ఆంధ్ర కోస్తా ప్రాంతంలో ప్రసిద్ధ వ్యాపారకేంద్రం. మద్రాసు-హౌరా మరియు మద్రాసు-ఢిల్లీ రైలు మార్గములలో విజయవాడ వస్తుంది. దక్షిణ మధ్య రైల్వేలో విజయవాడ అతి పెద్ద కూడలి. భారత దేశం లోని అతిపెద్ద రైల్వే జంక్షన్లలో ఇది ఒకటి. విజయవాడను బెజవాడ అని కూడా పిలుస్తారు.

విజయవాడ, పడమరన ఇంద్రకీలాద్రి పర్వతములతో, ఉత్తరాన బుడమేరు నదితో కృష్ణా నది ఒడ్డున ఉంటుంది. రాజధాని హైదరాబాదుకు 275 కి.మీ. దూరములో కృష్ణా జిల్లాలో 61.8 చదరపు కి.మీ. విస్తీర్ణములో ఉంది. 2001 జనాభా లెక్కల ప్రకారం విజయవాడ జనాభా 851,282. అంతేకాదు విజయవాడ కృష్ణా జిల్లాకు వర్తక/వాణిజ్య రాజధాని.

భౌగోళికంగా విజయవాడ నగరం కృష్ణానది తీరాన, చిన్న చిన్న కొండల నడుమ విస్తరించి ఉంది. ఈ కొండలు తూర్పు కనుమలలో భాగాలు. కృష్ణానదిపై కట్టిన ప్రకాశం బ్యారేజి నుండి ఏలూరు కాలువ, బందరు కాలువ, రైవిస్ కాలువ నగరం మధ్యనుండి వెళతాయి. నగరానికి మరో దిశలో బుడమేరు ఉంది. ప్రకాశం బ్యారేజి వల్ల ఏర్పడిన సరస్సు దక్షిణాన బకింగ్‌హాం కాలువ మొదలవుతుంది. నగరంలోను, చుట్టు ప్రక్కల నేల అధికంగా సారవంతమైన మెతకనేల. నగరంలో వేసవి తీవ్రంగా ఉంటుంది. వేసవిలో ఉష్ణోగ్రతలు 22° - 49.7°సెం. మధ్య ఉంటాయి. చలికాలం ఉష్ణోగ్రత 15°- 30°మధ్య ఉంటుంది. ఈ ప్రాంతంలో వర్షపాతం అధికంగా నైఋతి, ఈశాన్య ఋతుపవనాలవల్ల కలుగుతుంది. ఆంధ్ర ప్రదేశ్‌లో విజయవాడ మూడవ పెద్ద నగరం. 2001 జనగణన ప్రకారం నగర జనాభా 8,51,282 (పరిసర ప్రాంతాలతో కలిపితే 1,039,518). 2006 లెక్కల ప్రకారం ఈ సంఖ్యలు 1,025,436 మరియు 1,411,152.నగరంలో 136 గుర్తింపు పొందిన మురికివాడలున్నాయి. ఈ మురికివాడల్లో మొత్తం 2.21 లక్షల మంది జనాభా ఉన్నారు

ఇంకా... పూర్తివ్యాసం పాతవి

51వ వారం

భారత దేశపు పరుగుల రాణి గా పేరుగాంచిన పి.టి.ఉష 1964 మే 20 న జన్మించింది. ఈమె పూర్తి పేరు పిలవుల్లకాండి థెక్కెపరాంబిల్ ఉష. 1979 నుంచి భారతదేశం తరఫున అథ్లెటిక్స్ లో పాల్గొని దేశానికి పలు విజయాలను అందించింది. ఈమె ముద్దు పేరు పయోలి ఎక్స్‌ప్రెస్ (Payyoli Express). 1986 సియోల్ ఆసియా క్రీడలలో 4 బంగారు పతకాలు. ఒక రజిత పతకం సాధించింది. 1982 ఢిల్లీ ఆసియా క్రీడలలో కూడా 2 రజిత, 1990 ఆసియాడ్ లో 3 రజిత, 1994 ఆసియాడ్ లో ఒక రజిత పతకాలు సాధించింది. 1984 లాస్‌ ఏంజిల్స్ ఒలింపిక్స్ లో 400 మీటర్ల హార్డిల్స్ పరుగు పందెంలో సెకనులో వందోవంతులో కాంస్య పతకం లభించే అవకాశం కోల్పోయిననూ ఒలింపిక్స్ అథ్లెటిక్స్ లో ఫైనల్స్ చేరిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది. ఆమె దేశానికి సాధించిపెట్టిన ఖ్యాతికి గుర్తుగా భారత ప్రభుత్వం 1985 లో పద్మశ్రీ మరియు అర్జున అవార్డు లలో సత్కరించింది.


కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ జిల్లా పయోలీ లో జన్మించిన పి.టి.ఉష 1976 లో కేరళ రాష్ట్ర ప్రభుత్వం స్థాపించిన క్రీడా పాఠశలలో కోజికోడ్ జిల్లా తరఫున ప్రాతినిద్యం వహించి అందులో చేరింది. ఆ సమయంలో ఆమెకు మాసమునకు కేరళ ప్రభుత్వం చెల్లించిన డబ్బు రూ.250/-. 1979 లో ఉష జాతీయ స్థాయి పాఠశాల క్రీడలలో పాల్గొంది. అప్పుడే ఆమె లోని నైపుణ్యాన్ని కోచ్ ఓ. నంబియార్ పసిగట్టాడు. అప్పటి నుంచి ఆమెకు చాలా కాలం వరకు అతడే కోచ్ గా శిక్షణ ఇచ్చాడు. ఆ సమయంలో దేశంలో మహిళా అథ్లెట్ల సంఖ్య చాలా తక్కువ. అథ్లెటిక్ సూట్ ధరించి ట్రాక్ పై పరుగెత్తడం అరుదుగా జరిగేది. 1980 రష్యా ఒలింపిక్స్ లో పాల్గొన్ననూ ఆమెకు అది అంతగా కలిసిరాలేదు. 1982 లో ఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడలలో 100 మీ. మరియు 200 మీటర్ల పరుగులో రజత పతకం పొందింది. 1985 లో కువైట్ లో జరిగిన ఆసియన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీలలో ఉష బంగారు పతకమే పొందడమే కాకుండా కొత్త ఆసియా రికార్డును సృష్టించింది. 1983 నుంచి 1989 మధ్యకాలంలో ఉష ఆసియన్ ట్రాక్ అండ్ ఫీల్డ్స్ పోటీలలో 13 స్వర్ణ పతకాలను సాధించింది. 1986 లో దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో జరిగిన 10 వ ఆసియా క్రీడలలో పి.టి.ఉష 4 బంగారు పతకాలను సాధించడమే కాకుండా అన్నిట్లోనూ ఆసియా రికార్డులు సాధించడం విశేషం. అదే ఆసియాడ్ లో మరో రజత పతకం కూడా సాధించింది. 1985 లో జకార్తా లో జరిగిన 6 వ ట్రాక్ అండ్ ఫీల్డ్ చాంపియన్ షిప్ పోటీలలో ఈమె 5 బంగారు పతకాలను సాధించి తనకు తిరుగులేదని నిరూపించుకుంది. అంతర్జాతీయ క్రీడాజీవితంలో మొత్తం మీద ఈమె 101 స్వర్ణ పతకాలను సాధించింది.


ఇంకా... పూర్తివ్యాసం పాతవి

52వ వారం

హిందూ మతం లోని దేవతా మూర్తులలో సరస్వతి చదువుల తల్లిగా ఆరాధింపబడుతుంది. ఈ దేవి త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మ దేవేరి. వేదాలు, పురాణాలలో విపులంగా సరస్వతీ నది కూడా ప్రస్తావించబడింది. కొన్ని పురాణ గాధలు సరస్వతీ దేవి, సరస్వతీ నది చరిత్రలను అనుసంధానిస్తాయి. శ్రీ సరస్వతీ ద్వాదశ నామస్తోత్రంలో చెప్పబడిన పేర్లు - భారతి, సరస్వతి, శారద, హంస వాహిని, జగతీ ఖ్యాత, వాగీశ్వరి, కౌమారి, బ్రహ్మ చారిణి, బుద్ధి ధాత్రి, వరదాయిని, క్షుద్ర ఘంట, భువనేశ్వరి. ఇదే స్తోత్రం ఆరంభంలో సరస్వతి, వీణాపుస్తక ధారిణి, హంస వాహన, విద్యా దానకరి అన్న సంబోధనలు, చివరిలో బ్రాహ్మీ, పరమేశ్వరి, బ్రహ్మ రూపి అన్న సంబోధనలు ఉన్నాయి. బౌద్ధమతంలో కొన్ని చోట్ల మంజుశ్రీ, మహా సరస్వతి, వజ్ర సరస్వతి, ఆర్య వజ్ర సరస్వతి, వజ్ర వీణా సరస్వతి, వజ్ర సారద వంటి పేర్లతో సరస్వతి ఆరాధన జరిగింది. జైనులు శృతదేవతగా, షోడశ విద్యా దేవతలకు అధికారిణిగా సరస్వతిని ఆరాధించారు. శ్వేతాంబరులు హంసవాహిని అని ఈ దేవిని స్తుతించారు.

ఋగ్వేదంలోనూ, దేవీ భాగవతంలోనూ, బ్రహ్మ వైవర్త పురాణంలోనూ, పద్మ పురాణంలోనూ సరస్వతి గురించి వివిధ గాధలున్నాయి. సరస్వతి ఆద్యంత రహిత శక్తి స్వరూపిణి అని వివిధ స్తోత్రాలలో స్తుతిస్తారు. వాక్, బుద్ధి, వివేకం, విద్య, కళలు, విజ్ఞానం - వీటన్నింటికీ అధిదేవతగా సరస్వతిని పూజిస్తారు. ఈ అమ్మవారు అధికంగా హంసవాహినిగా, వీణాపాణిగా, పుస్తకం మాలా ధారిణిగా చిత్రింపబడుతుంది. సరస్వతి వర్ణనలలో తెలుపు రంగుకు చెందిన వస్తువుల ప్రాముఖ్యం అధికం. "శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా హార తుషార ఫేన రజతాచల కాశఫణీశ కుంద మందార సుధా పయోధి సిత తామర సారస వాహినీ శుభాకారత నొప్పు"నది గా బమ్మెర పోతన తన సరస్వతీ స్తుతిలో తెల్ల వస్తువుల పెద్ద జాబితానే ఉట్టంకించాడు. సరస్వతి ధరించే వీణ పేరు"కచ్ఛపి"

ఆదిలాబాదు జిల్లాలోని బాసర పుణ్యక్షేత్రం సరస్వతి అమ్మవారి క్షేత్రము. బాసరలో జ్ఙాన సరస్వతి అమ్మవారు మహాలక్ష్మి, మహాకాళి సమేతులై కొలువు తీరి ఉన్నారు. కాష్మీర్ లోని శారదా మందిరం అత్యంత పురాతనమైనదిగా చెప్పబడుతున్నది. కాష్మీర్ చరిత్రకారుడైన కల్హణుడు తన రాజ తరంగిణిలో ఈ మందిరం గురించి విపులంగా వ్రాశాడు. "నమస్తే శారదా దేవి కాష్మీర మండల వాసిని" అన్న ప్రార్ధన దేశమంతటా వాడబడేది. తమిళనాడులో 'కూతనూర్' వద్ద మరొక సరస్వతీ మందిరం ఉంది. రాజస్థాన్ లోని పిలానిలో బిర్లా కుటుంబీకులు నిర్మించిన శారదా మందిరం ఉంది.

ఇంకా....పూర్తివ్యాసం పాతవి


ఇవి కూడా చూడండి[మార్చు]