శ్రీను వైట్ల
శ్రీను వైట్ల Srinu Vaitla | |
---|---|
జననం | సెప్టెంబరు 24, 1972 కందులపాలెం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్, India |
వృత్తి | దర్శకుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1999-ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | రూప వైట్ల |
పిల్లలు | 3 కుమార్తెలు |
శ్రీను వైట్ల తెలుగు సినిమా దర్శకుడు. ఇతని మొదటి సినిమా నీ కోసం. కానీ 2001 సంవత్సరంలో విడుదలైన ఆనందం చిత్రం ద్వారా మంచి పేరు సంపాదించాడు.
నేపధ్యము
[మార్చు]ఆయన స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా కందులపాలెం (రామచంద్రాపురం) దగ్గర ఉన్న కందులపాలెం అనే పల్లెటూరు. నాన్న వ్యవసాయం చేసేవాళ్ళు, నాన్న వాళ్ళు ఐదుగురు అన్నదమ్ములు..వాళ్ళు, అత్తయ్యలూ, అందరూ కలిసి చాలా పెద్ద కుటుంబము. అందరి మధ్యలో ఇతడి బాల్యం సరదాగా గడిచిపోయింది. ఎప్పుడు ఎలా మొదలైందో తెలీదు కానీ చిన్నప్పటినుంచీ సినిమాలంటే విపరీతమైన పిచ్చి ఎప్పటికైనా సినిమాల్లోకి వెళ్ళిపోయి ఏదో చెయ్యాలనే అలోచన చిన్నప్పటినుంచే ఉండేది. ఏమి చెయ్యాలో తెలీదు, అది ఎలా సాధ్యపడుతుందో కూడా ఆలోచించలేని వయసు. పైగా వీరిది చిన్న పల్లెటూరు, సినిమా రంగమంతా ఉండేది మద్రాసులో.అస్సలు ఎక్కడా పొసగని దూరాలు. ఐనా ఇతడి అలోచనలన్నీ సినిమాలచుటూనే తిరుగుతుండేవి.ఇంటర్మీడియట్కి వచ్చే సరికి, 1984లో, కాకినాడ వెళ్ళి చదువుకుంటానని ప్రపోజల్ పెట్టాడు. పక్కనే రామచంద్రాపురంలో కాలేజీ ఉన్నా, కాకినాడ ఎందుకు వెత్తానన్నాడంటే అక్కడైతే ఇతడిని ఎవరూ చూడరూ, విడిగా రూమ్ లో వుంటూ ఇష్టమొచ్చినన్ని సినిమాలు చూడొచ్చు అనీ. ఆ విధంగా 1984-86 మధ్యలో కాకినాడలో ఇంటర్మీడియట్ చదువుతూ ఎడాపెడా సినిమాలు చూసూ కాలక్షేపం చేసే వాడు. ఫ్రెండ్స్ అందరూ హీరోల్ని అభిమానిస్తుంటే ఇతడు మాత్రం మణిరత్నం గారిని అభిమానిస్తుండేవాడు. డైరెక్టర్ కావాలన్న ఆలోచన అప్పట్లోనే ఉండేదోమో అంతగా గుర్తులేదు. చదువు విషయానికొస్తే, మరీ తప్పితే తిడతారు కాబట్టి పాసవడ్డానికి కావల్సినంత చదివి ఎలాగైతేనేం ఇంటర్మీడియట్ పూర్తిచేశాడు. కథలు వ్రాయడం, నాటకాలు వేయడం..ఇలాంటివేమీ లేవు. ఉన్న టైమంతా సినిమాలు చూడ్డమే! తరువాత బి.ఎస్సీ చదవాడినికి మళ్ళీ కాకినాడకే వచ్చాడు. ఐతే ఇంక అప్పటికే సినిమా జ్ఞానమంతా ఒంటబట్టేసింది కాబట్టి మద్రాసు వెళ్ళిపోవాలని నిర్ణయానికివచ్చేశాడు - బి.ఎస్సీలో చేరిన నాలుగైదు నెలలకే ఫీజులు కట్టడానికని ఇంట్లో ఇచ్చిన డబ్బులు జేబులో పెట్టుకుని బొకారో ఎక్స్‌ప్రెస్ ఎక్కేశాడు మద్రాసుకి..! మద్రాసు ఎలా ఉంటుందో తెలీదు. ఎక్కడికి వెచ్ఫాలో తెలీదు.ప్రయాణం మొదలైంది. ట్రైన్లో ఒక కుర్రాడు పరిచయమయ్యాడు. అతనిది మద్రాసు దగ్గరలోనే ఏదో ఒక ఊరు. అతని స్నేహితుడు జాస్తి చౌదరి అనే అతను మద్రాసులో ఉంటాడని చెప్పి ఎడ్రసు ఇచ్చి, ఎప్పుడేనా వీలైతే కలుసుకోమని చెప్పాడు. ఇతడి బుర్ర వేగంగా పనిచేసింది, ముక్కూ మొహం తెలీని మద్రాసులో దిగగానే ఏం చెయ్యాలో అప్పుడే నిర్ణయించుకున్నాడు. మద్రాసు సెంట్రల్ స్టేషన్లో దిగగానే తెలిసిందేమిటంటే అక్కడ సిటీ బస్సులన్నీ సమ్మె ఆ రోజు. చేతిలో జాస్తి చౌదరి అనే అపరిచిత స్నేహితుడి చిరునామా ఉంది. పాండీ బజార్. ఎంతదూరం ఉంటుందో తెలీదు. నడవడం మొదలెట్టాడు. అలా దాదాపు 15 కి.మీ. దూరం నడిచి వెళ్ళి జాస్తి చౌదరి రూమ్ తలుపు తట్టాను. రైల్లో కలిసిన కుర్రాడు నాకు బాగా ఫ్రెండ్ అనీ, అతనే ఇక్కడికి వెళ్ళమన్నాడనీ నమ్మకం కుదిరేలా చెప్పాడు. అతను సరేనని నేను తనతో మూడు రోజులు ఉండడానికి ఒప్పుకున్నాడు. అదిచాలు. మిగతా విషయాలు మూడు రోజుల తర్వాత ఆలోచిద్దాంలే అని అక్కడ తాత్కాలికంగా సెటిలయ్యాడు. ఆ మూడు రోజుల్లోనే బయటికి భోజనానికి వెళ్ళినప్పుడు కృష్ణవంశీ పరిచయమయ్యాడు. నాకు వసతి కావాలని అడిగితే తన గదిలో ఉండమని అన్నాడు. అలా కృష్ణవంశీ రూమ్మేట్గా సెటిలయ్యాడు. చేతిలో డబ్బులున్నాయి కాబట్టి తిండికేమీ ఇబ్బంది లేకుండా గడిచిపోయింది. అలా మద్రాసు వచ్చిన పదిహేను రోజులకి ఇంటికి ఉత్తరం రాశాడు. ఇలా మద్రాసులో ఉన్నాను, నాకోసమేమీ బెంగపడకండి, నేను క్షేమంగానే ఉంటున్నాను. నేనే మళ్ళీ ఉత్తరం రాస్తాను అని. అప్పటికే ఇంట్లో వాళ్ళు ఇతడి కోసం తీవ్రంగా వెదుకుతున్నారంట. నా అడ్రసు తెలిస్తే వచ్చి ఇతడిని లాక్కెళ్ళి పోవడం ఖాయం.అందుకే అడ్రసు లేకుండా అప్పుడప్పుడూ ఉత్తరాలు వ్రాస్తుండే వాడు. ( ఓ ఆరునెలల తరువాత ఇంటికి వెళ్ళి అందరినీ ఒప్పించి మద్రాసు చేరుకోవడం..అదంతా మరో కథా). అలా కృష్ణవంశీ రూమ్లో చేరిన రెండునెలలకే తను హైదరాబాదు వెళ్ళిపోయాడు. ఇంక రూమ్లో ఒక్కడినే మిగిలిపోయాడు. ఎలాగైనా సినిమా రంగంలో చిన్న అవకాశం రావాలి అని తిరుగుతుండేవాడు.[1]
మొదటి సినిమా
[మార్చు]అలా ఉండగా తూర్పుగోదావరి జిల్లాకే చెందిన ఒక డిస్టిబ్యూటర్ ద్వారా గోగినేని సుబ్బారావు అనే ప్రొడ్యూసర్ పరిచమయ్యాడు (చిన్ని కృష్ణుడు, పడమటి సంధ్యారాగం అనే సినిమాల నిర్మాణంలో ఆయనకి భాగస్వామ్యం ఉంది). ఇతడి ఆసక్తి తెలుసుకుని చలసాని రామారావు అనే డైరెక్టర్కి ఇతడిని పరిచయం చేశారు. అప్పుడాయన బాలకృష్ణతో ప్రాణానికి ప్రాణం అనే సినిమా తీస్తున్నారు. ఆ విధంగా చలసాని రామారావు వద్ద ఆ సినిమాకి అపెంటిస్గా చేరాడు. అలా 1989 మార్చిలో సినిమా రంగంలో ఇతడిని అడుపెట్టనిచ్చిన మొదటి సినిమా 'ప్రాణానికి ప్రాణం'. సినిమా పూర్తయినంత వేగంగానూ అట్టర్ ఫ్లాప్ ఐంది. ఇదేంట్రా బాబూ పనిచేసిన మొదటి సినిమానే ఇలా బాల్చీ తనేసిందని అనుకుంటుండగా శివ విడుదలై రాంగోపాల్ వర్మ పేరు ఆంధ్ర దేశమంతా మార్మోగిపోవడం మొదలైంది. ఆయన దగ్గర అసిస్టెంట్ గా చేరదామని ఇతడూ హైదరాబాదు చేరుకున్నాడు. ఐతే అప్పటికే ఆయనదగ్గర అసిస్టెంటుగా చేరడానికి వచ్చిన వాళ్ళ క్యూ కొండవీటి చాంతాడంత ఉంది. అక్కడ వీలు కాకపోవడంతో ఏంచెయ్యాలా అని వెదుకుంతుండగా ప్రాణానికి ప్రాణం రోజుల్లో పరిచయమైన డైరెక్టర్ సాగర్ ఎదురయ్యారు. ఆయన్ని ఒప్పించి అసిస్టెంట్ గా చేరాడు. ఆ సినిమా పేరు 'నక్షత్రపోరాటం'. ఇతడిని అసిస్టెంట్ని చేసిన మొదటి సినిమా అది. ఆ విధంగా సాగర్ వద్దనే అమ్మదొంగా సినిమా వరకూ పనిచేశాడు. అమ్మ దొంగ తరువాత ఇంక సొంతంగా డైరెక్షన్ చెయ్యగలననేనమ్మకం కలిగి, అసిస్టెంట్ గా మానేసి, కథలు తయారు చేసుకోవడం మొదలుపెట్టాడు. తొందరలోనే సాంబిరెడ్డి అనే ఆయన ఇతడికి మొదటి సినిమా అవకాశం ఇచ్చారు. సినిమా పేరు అపరిచితుడు, రాజశేఖర్ హీరో. మొదటి షెడ్యూలు అవగానే హీరోకీ నిర్మాతకీ వచ్చిన అభిప్రాయ భేదాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. మళ్ళీ కథ మొదలైంది. ఏం చెయ్యాలీ..నిరాశ పడి లాభంలేదు. ప్రయత్నాలు కొనసాగించాల్సిందే ననుకుని మళ్ళీ కథలమీద కూర్చోవడం మొదలెట్టాడు. అప్పుడు తయారైందే నీ కోసం కథ. ఇతడితో బాటు పనిచేసిన కెమేరామేన్ నా గురించి కొత్తగా సినిమా తీద్దామనుకుంటున్న బాల్రెడ్డి మిత్రబృందానికి చెప్పడంతో వాళ్ళే ఇతడి దగ్గరికి సినిమా తీద్దామని రావడం, నీకోసం మొదలు పెట్టడం జరిగింది. రవితేజ, మహేశ్వరి కాంబినేషన్ సినిమా మొదలైతే ఐంది కానీ ఆది నుంచీ అన్నీ కష్టాలే. నిర్మాతలు తలా ఒక రెండు, మూడు లక్షలు వేసుకుని ప్రోజెక్టు మొదలెట్టారు, కానీ మధ్యలో బడ్జెట్ ఐపోవడం.. మళ్ళా ఇతడే ఎలానో మరికొంత పెట్టుబడి పెట్టడం.అలా అష్ట కష్టాలూ పడి సినిమాని పూర్తిచేశాడు. 38 లక్షల్లో 28 వర్కింగ్ డేస్లో తీసిన సినిమా పూర్తి కావడానికి మొత్తం సంవత్సరంన్నర పట్టింది. ఆ సినిమా ప్రివ్యూ చూసిన నాగార్డున గారు ఇతడికి దర్శకుడిగా అవకాశం ఇస్తానన్నారు. అలానే ఆ సినిమా చూసిన రామోజీ రావు మొత్తం ఆంధ్రాకి దాన్ని కొనుగోలుచేసి విడుదల చేశారు. 1999 డిసెంబరు 3న రిలీజైంది. సినిమా బ్రహ్మాండమైన హిట్ కాకపోయినా కోటిరూపాయలు వసూలు చేసి కమ్మర్షియల్గా సక్సెస్ అవడమే కాకుండా డైరెక్టర్గా ఇతడికి మంచి పేరు తీసుకొచ్చింది. అదే సంవత్సరం 7 నంది అవార్డుల్ని కూడా గెలుచుకుంది. ఉత్తమ కొత్త దర్శకుడిగా ఇతడికి, ఉత్తమ స్కీన్ప్లే కీ, ద్వితీయ ఉత్తమ చిత్రంగా సినిమాకీ కూడా నంది పురస్కారాలు వచ్చాయి. ఆ విధంగా ఇతడి దర్శకత్వంలో విడులైన మొదటి సినిమా 'నీకోసం'. ఆ సినిమా విజయంతో ఇతడి మీద నమ్మకంతో రామోజీ రావు ఇతడికి ఆనందం సినిమాకి అవకాశం ఇచ్చారు. అదెంత కమ్మర్షియల్ సక్సెస్ ఐందో అందరికీ తెలుసు. ఇలా చెప్పాలంటే ఇతడిని దర్శకుడిగా అగ్రస్తాయిన నిలిపిన మొదటి సినిమా ఆనందం. ఇనాళ ఇతడి అనుభవంలో తెలిసిందేమిటంటే. కేవలం సినిమాల మీద ఆసక్తి మాతం ఉంటే సరిపోదు. బాగా కష్టపడే మనస్తత్వం ఉండాలి ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులనైనా తట్టుకునే ఓర్పు ఉండాలి ఎదురు దెబ్బలు తగిలినప్పుడు బెదిరిపోకుండా నిలిస్తేనే ఎప్పటికైనా విజయం లభిస్తుంది.కష్టపడే వాళ్ళకి అద్భుతమైన అవకాశాల్డిస్తుందీ చిత్రసీమ.! ఇదొక వండర్ ఫుల్ ఫీల్డ్ [1]
గృహ హింస కేసు
[మార్చు]ఇతడిది ప్రేమ వివాహము. ముగ్గురు కుమార్తెలు. కాగా 2015 అక్టోబరులో ఇతడిపై గృహహింస కేసు నమోదు అయింది. తన భర్త వేధిస్తున్నారంటూ శ్రీనువైట్ల భార్య సంతోష రూప 2015 అక్టోబరు 3వవారంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు 498/A, 323A సెక్షన్ల కేసు నమోదు చేశారు. శ్రీనువైట్ల మానసికంగా చిత్రహింసలకు గురి చేయటంతో పాటు, భౌతిక దాడికి పాల్పిడినట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.అయితే వారిద్దరి మధ్య పెద్దలు రాజీ కుదిర్చినట్లు సమాచారం. దీంతో సంతోష రూప తన ఫిర్యాదును ఉపసంహరించుకున్నట్లు తెలిసింది.[2][3]
దర్శకత్వం వహించిన సినిమాలు
[మార్చు]తెలుగు
[మార్చు]పురస్కారాలు
[మార్చు]- నంది పురస్కారం - 2012 నంది పురస్కారాలు: ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత (దూకుడు)[4][5][6][7]
- 1999 - నంది ఉత్తమ చిత్రాలు (నీ కోసం)
- నంది ఉత్తమ నూతన దర్శకులు (నీ కోసం)
- నంది ఉత్తమ స్క్రీన్ప్లే రచయితలు (నీ కోసం, ఢీ, దూకుడు)
- Filmfare Award for Best Director - Telugu (దూకుడు)
- CinemAA Awards - Best Director (దూకుడు)
- సైమా ఉత్తమ దర్శకుడు (దూకుడు)
- The Hyderabad Times Film Awards - Best Director (దూకుడు)
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 వైట్ల, శ్రీను. "మొదటి సినిమా-శ్రీను వైట్ల" (PDF). కౌముది.నెట్. కౌముది.నెట్. Retrieved సెప్టెంబరు 1, 2015.
- ↑ http://www.sakshi.com/news/hyderabad/case-filed-against-director-srinuvaitla-286466?pfrom=home-top-story
- ↑ http://telugu.greatandhra.com/movies/movie-gossip/srinu-vytla-pai-gruha-himsa-kesu-66562.html">
- ↑ "Nandi Awards: Here's the complete list of winners for 2012 and 2013". hindustantimes.com/ (in ఇంగ్లీష్). 2017-03-01. Retrieved 29 June 2020.
- ↑ మన తెలంగాణ, ప్రత్యేక వార్తలు (1 March 2017). "బెస్ట్ హీరో అవార్డ్ ను సొంతం చేసుకున్న బాహుబలి ప్రభాస్..!!". Archived from the original on 26 June 2020. Retrieved 29 June 2020.
- ↑ సాక్షి, ఎడ్యుకేషన్ (2 March 2017). "నంది అవార్డులు 2012, 2013". www.sakshieducation.com. Archived from the original on 26 June 2020. Retrieved 29 June 2020.
- ↑ నవ తెలంగాణ, నవచిత్రం (2 March 2017). "2012, 2013 నంది అవార్డుల ప్రకటన". NavaTelangana. Archived from the original on 26 June 2020. Retrieved 29 June 2020.