వై.యస్. రాజశేఖరరెడ్డి

వికీపీడియా నుండి
(వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
యెడుగూరి సందింటి రాజశేఖర రెడ్డి
వై.యస్. రాజశేఖరరెడ్డి


పదవీ కాలము
2004-2009
ముందు చంద్రబాబు నాయుడు
తరువాత కొణిజేటి రోశయ్య
నియోజకవర్గము పులివెందుల

వ్యక్తిగత వివరాలు

జననం (1949-07-08) 1949 జూలై 8 (వయస్సు: 70  సంవత్సరాలు)
పులివెందుల, ఆంధ్ర ప్రదేశ్
మరణం 2009 సెప్టెంబర్ 2
వెలుగోడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెసు
జీవిత భాగస్వామి విజయలక్ష్మి
సంతానము వై.యస్. జగన్మోహన్ రెడ్డి (కుమారుడు) షర్మిలా (కుమార్తె)
మతం క్రైస్తవ, సి.ఎస్.ఐ (చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా)
సెప్టెంబర్ 3, 2009నాటికి

యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి (జూలై 8, 1949 - సెప్టెంబర్ 2, 2009) ఆంధ్ర ప్రదేశ్ 16వ ముఖ్యమంత్రి, కాంగ్రేసు పార్టీ నాయకుడు.

1978లో తొలిసారిగా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంనుంచి శాసనసభలో అడుగుపెట్టిన రాజశేఖరరెడ్డి మొత్తం 6 సార్లు పులివెందుల నుంచి ఎన్నికకాగా, 4 సార్లు కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటులో అడుగుపెట్టాడు. ఆయన పోటీచేసిన ప్రతి ఎన్నికలలోనూ విజయం సాధించారు . జనతాపార్టీ ప్రభంజనాన్ని తట్టుకొని విజయం సాధించిన తొలి ఎన్నికల (1978) వెంటనే మంత్రిపదవి పొందాడు. ఆ తరువాత వెనువెంటనే ముగ్గురు ముఖ్యమంత్రులు మారిననూ ఆ మూడు మంత్రిమండళ్లలో స్థానం సంపాదించాడు. ఆ తరువాత చాలా కాలం పాటు ఎటువంటి ప్రభుత్వ పదవీ దక్కలేదు. 1989-94 మధ్య ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నించినా అవకాశం రాలేదు. 1999లో మళ్ళీ శాసనసభకు ఎన్నికై ప్రతిపక్షనేతగా ఉంటూ తదుపరి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు వ్యూహం రచించాడు. 2003లో మండువేసవిలో 1460 కిలోమీటర్లు [1] సాగిన పాదయాత్ర మరియు ఉచిత విద్యుత్ ప్రచారం అతని విజయానికి బాటలు పరచింది. 2004 ఎన్నికలలో పులివెందుల నియోజకవర్గం నుంచి 40వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించడమే కాకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు పొందడంతో ముఖ్యమంత్రి పీఠం వై.ఎస్.రాజశేఖరరెడ్డికే దక్కింది. ఆయన సెప్టెంబర్ 2, 2009న చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి హాజరవడానికి వెళ్తూ నల్లమల అడవులలో హెలికాప్టర్ ప్రమాదానికి గురై దుర్మరణం పాలయ్యాడు. వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అవినీతిపై ఆయన మంత్రివర్గ సభ్యులే కాకుండా కేంద్రమంత్రులు, ప్రస్తుత మంత్రులు, ప్రధాన ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మైసూరారెడ్డి లెక్కలువేయగా[2] అప్పటి మంత్రి పి.శంకర్రావు వ్యాఖ్యలను కోర్టు సుమోటాగా స్వీకరించి విచారణ చేపట్టింది. వైఎస్సార్ కాలంలో అవినీతి జరిగిందని సీబీఐ ప్రాథమిక విచారణలో వెల్లడించింది. "క్విడ్ ప్రో కో " రూపంలో జగన్ కు చెందిన కంపెనీలలో పెట్టుబడులు వచ్చినట్లు సీబీఐ చార్జిషీటులో పేర్కొంది.

బాల్యం, విద్యాభ్యాసం

వై.యస్.రాజశేఖర్ రెడ్డి 1949 జూలై 8 న వైఎస్ఆర్ జిల్లా, జమ్మలమడుగులోని సి.ఎస్.ఐ. కాంప్‌బెల్ మిషన్ ఆసుపత్రిలో జన్మించాడు.[3] ఆయన తల్లిదండ్రులు జయమ్మ, రాజారెడ్డి. ఆయన తండ్రి బళ్ళారిలో కాంట్రాక్టరుగా పనిచేస్తుండటం వల్ల ఆయన పాఠశాల చదువంతా బళ్ళారిలోని సెయింట్ జాన్స్ పాఠశాలలో సాగింది. ఆ తర్వాత విజయవాడ లయోలా కళాశాలలో చేరాడు. 1972లో గుల్బర్గా విశ్వవిద్యాలయం నుంచి వైద్యవిద్యలో పట్టా పుచ్చుకున్నాడు. గుల్బర్గాలోని మహాదేవప్ప రాంపూరే వైద్య కళాశాలలో వైద్యవృత్తిని అభ్యసిస్తుండగానే కళాశాల విద్యార్థిసంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరించాడు. శ్రీ వెంకటేశ్వర వైద్యకళాశాల (యెస్.వి.ఆర్.ఆర్), తిరుపతి నుంచి హౌస్‌సర్జన్ పట్టా పొందాడు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల వైపు ఆకర్షితుడైన రాజశేఖరరెడ్డి యెస్.వి.ఆర్.ఆర్ కళాశాలలో పనిచేస్తుండగానే అక్కడ హౌస్‌సర్జన్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.

తరువాత కొద్దిరోజులపాటు జమ్మలమడుగులోని సి.ఎస్.ఐ. కాంప్‌బెల్ ఆసుపత్రిలో వైద్య అధికారిగా పనిచేశాడు. ఆ తరువాత 1973లో పులివెందులలో తండ్రి వై.ఎస్.రాజారెడ్డి పేరుతో కట్టించిన 70 పడకల ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేశాడు. ఆ ఆసుపత్రి ఇప్పటికీ పనిచేస్తూనే ఉంది. వాళ్ళ కుటుంబం పులివెందులలో ఒక పాలిటెక్నిక్ కళాశాల మరియు డిగ్రీ కళాశాలను కూడా నెలకొల్పారు. తరువాత వాటిని లయోలా సంస్థలకు అప్పగించారు. పులివెందుల దగ్గరిలో ఉన్న సింహాద్రిపురంలో ఉన్న కళాశాలను మాత్రం ఇప్పటికీ వీరి కుటుంబమే నిర్వహిస్తోంది.

రాజకీయ జీవితం

కళాశాల దశ నుంచే రాజకీయాలపై ఆసక్తి చూపిన రాజశేఖరరెడ్డి 1980-83 కాలంలో రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిపదవిని నిర్వహించాడు. కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎన్నికయ్యాడు. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 6 సార్లు విజయం సాధించాడు. రాష్ట్ర శాసనసభ ప్రతిపక్షనేతగానూ, రెండు సార్లు రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రేస్ కమిటీ అధ్యక్షుడిగానూ పనిచేశాడు. 1980 నుంచి 1983 దాకా గ్రామీణాభివృద్ధి, వైద్యశాఖ, విద్యాశాఖ మొదలైన కీలకమైన మంత్రి పదవులను నిర్వహించాడు. తెలుగు దేశం నేత నారా చంద్రబాబు నాయుడు మొదటగా కాంగ్రెస్ లో ఉన్నపుడు ఇరువురూ మంచి మిత్రులు. 1985 నుంచి 1998 వరకు పార్టీలో వై.ఎస్. నిత్య అసమ్మతివాదిగా పేరుపడ్డారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులందరితో ఆయన పోరాటం చేయాల్సి వచ్చింది. 1989-94 మధ్య కాలంలో ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నించినా సాధ్యపడలేదు. మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి వంటి నేతలతో ఆయన రాజకీయ యుద్ధమే చేశారు. వారికి వ్యతిరేకంగా క్యాంపులు నడిపాడు. మర్రి చెన్నారెడ్డిని, నేదురుమిల్లి జనార్ధన్‌రెడ్డిని పదవినుండి తొలగించడానికి ప్రధాన కారణమైన హైదరాబాదు నగరంలో జరిగిన అల్లర్లలో రాజశేఖర్ రెడ్డి వర్గపు పాత్ర ఉందన్న ఆరోపణలు వచ్చాయి. అదే తాను ముఖ్యమంత్రి అయ్యేనాటికి అలాంటి శిబిరాలు లేని పరిస్థితిని సృష్టించుకోగలిగాడు. రాజకీయాల్లో ముక్కుసూటితనానికి, నిర్మొహమాట ధోరణికి రాజశేఖరరెడ్డి ప్రసిద్ధుడు.[4]

పిసిసి అధ్యక్షుడిగా

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా వై.ఎస్.రాజశేఖరరెడ్డి రెండు సార్లు పనిచేశాడు. తొలిసారి 1983 నుంచి 1985 వరకు మరియు రెండో పర్యాయం 1998 నుంచి 2000 వరకు ఆ పదవిలో ఉన్నాడు. 1999 నుంచి 2004 వరకు 11 వ శాసనసభలో ప్రతిపక్షనేతగానూ వ్యవహరించాడు.

పాదయాత్ర

2003 వేసవికాలంలో ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో పాదయాత్ర చేపట్టి 1,467 కిలోమీటర్లు పర్యటించాడు. పాదయాత్ర వలన వ్యక్తిగతంగా వైఎస్.కు మంచి జనాదరణ లభించడమే కాకుండా ఆ తదుపరి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దోహదపడింది.

ముఖ్యమంత్రిగా

2004 మేలో జరిగిన 12వ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికస్థానాలు సాధించడంతో అదివరకే పార్టీలో పేరుసంపాదించిన వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాడు. పాదయాత్ర వలన జనాదరణ పొందడమే కాకుండా ఎన్నికల ప్రచారంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, పెండింగులో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తిచేయటం, జలయజ్ఞంలకు ప్రాధాన్యం ఇవ్వడంతో ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన పిదప తొలి సంతకం ఉచిత విద్యుత్తు ఫైలు పైనే చేశాడు. 2009 ఏప్రిల్లో జరిగిన 13వ శాసనసభ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలలో విజయం సాధించడానికి కృషిచేసి వరుసగా రెండో పర్యాయం ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాడు.

వివాదాలు, విమర్శలు

1600 ఎకరాల భూమిని డిసెంబరు 2006లో ప్రభుత్వానికి అప్పగించటం విపక్షాల విమర్శకి గురయ్యింది. చట్టాన్ని అతిక్రమించి భూమిని కలిగివున్నందుకు విపక్షాలు రాజశేఖరరెడ్డి రాజీనామా చేయాలని కోరాయి.[5].ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు ఎన్నో అక్రమ ఆస్తులు సంపాదించారని విపక్షాలు మరియు పత్రికలు ఆయనపై ఆరోపణలు చేసాయి. అక్రమ ఆస్తుల సంపాదన కేసులో 2011లో ఆయనపై మరియు ఆయన సకుమారుడు జగన్ పై సి.బి.ఐ వారు అభియోగ పత్రం జారీ చేసారు.

2009 ఎన్నికలు

2009 ఏప్రిల్‌లో జరిగిన శాసనసభ మరియు లోక్‌సభ ఎన్నికలలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ముందుండి నడిపించడమే కాకుండా శాసనసభలో 156 స్థానాలతో పూర్తి మెజారిటీని సంపాదించిపెట్టాడు.[6] అదేసమయంలో లోక్‌సభ ఎన్నికలలో 33 స్థానాలలో విజయం సాధించడానికి కృషిచేసి దేశంలోనే కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్లుఫ్ఫ్ర్ సంపాదించిపెట్టిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను కాంగ్రెస్ అధిష్టానం ముందు సగర్వంగా నిలబెట్టారు.

కుటుంబం

వై.యస్. రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయలక్ష్మి. వారికి ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం కడప లోక్‌సభ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.ఆయన చాలా వ్యాపారాలతో పాటు సాక్షి దినపత్రిక, సాక్షి టీవీ చానల్ కూడా నిర్వహిస్తున్నాడు. కూతురు షర్మిళ. తండ్రి రాజారెడ్డి ముఠాకక్షల కారణంగా బాంబుదాడిలో మరణించడం జరిగింది. గుల్బార్గాలో వైద్యవిద్య చదువుతున్నప్పటి నుంచీ ఆయనకు అత్యంత ఆప్తమిత్రుడు కె.వి.పి. రామచంద్రరావు. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాక ఆయన్ను సలహాదారుగా నియమించుకున్నాడు.

క్రైస్తవం

వై.యస్. రాజశేఖరరెడ్డి చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా (సి.ఎస్.ఐ) అనే చర్చికి చెందిన ప్రొటెస్టెంటు క్రైస్తవుడు. ఈయన తాత బ్రిటీషు మిషనరీల ప్రభావంతో క్రైస్తవమతం పుచ్చుకున్నాడని[7][8], తండ్రి రాజారెడ్డి మిలటరీలో పనిచేస్తూ బర్మాలో ఉండగా, అక్కడ క్రైస్తవం పుచ్చుకున్నాడని రెండు వేర్వేరు కథనాలు ఉన్నాయి. ఈయన కుటుంబం పులివెందలలోని సి.ఎస్.ఐ చర్చికి హాజరౌతుంది. రాజశేఖరరెడ్డి తొలిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2004లోనూ, మరలా 2009లోనూ కుటుంబసమేతంగా బెత్లహాముయాత్రకు వెళ్ళివచ్చాడు.[9] క్రైస్తవులైనా పారంపరికంగా వచ్చిన హిందూ సంప్రదాయాలని వీడలేదు. రాజశేఖరరెడ్డి తిరుమలను అనేకమార్లు సందర్శించి వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకొని పూజలు చేశాడు.[10][11][12] అయితే రాష్ట్రంలో క్రైస్తవ ప్రభావం పెంచడానికి, మతమార్పిళ్ళను ప్రోత్సహించడానికి తోడ్పడ్డాడని కొంతమంది ఈయన్ను విమర్శించారు.[13] ఈయన అల్లుడు అనిల్ కుమార్ మత ప్రచారకుడు. బ్రాహ్మణుడైన అనిల్ కుమార్ రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మీలాను పెళ్ళి చేసుకున్న తర్వాత క్రైస్తవం స్వీకరించి మతప్రచారకుడయ్యాడు. ఈయన ప్రాభవం రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతే పెరగడంతో ఎన్నో విమర్శలకు ఊతమిచ్చినట్టైంది.

హెలికాప్టర్ ప్రమాదంలో మృతి

సెప్టెంబర్ 2, 2009చిత్తూరు జిల్లా పర్యటనకు బయలుదేరగా ఉదయం గం.9.35 నిమిషాలకు హెలికాప్టరు‌తో సంబంధాలు తెగిపోయాయి.[14] ముఖ్యమంత్రి ఆచూకీ కోసం గాలించగా 25 గంటల తరువాత ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ఆనవాళ్ళు లభించాయి. వై.ఎస్.తో సహా మొత్తం ఐదుగురు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు.[15] తమ అభిమాన నాయకుని మరణాన్ని జీర్ణించుకోలేక రాష్ట్ర మంతా దాదాపు 67 మంది మరణించారు. వీరిలో చాలా మంది గుండె ఆగి మరణించగా కొద్ది మంది ఆత్మహత్య చేసుకున్నారు.[16] ప్రమాదస్థలమైన రుద్రకొండ కర్నూలు-ప్రకాశం జిల్లా సరిహద్దులో ఆత్మకూరు - వెలుగోడుకు సమీపంలోని నల్లమల అడవుల్లో ఉంది. హెలికాప్టర్‌ కూలిన ప్రాంతం కర్నూలు జిల్లా ఆత్మకూరునుంచి 8 కిలోమీటర్ల దూరంలోని నల్లకాలువ గ్రామం మీదుగా 16 కిలోమీటర్ల దూరంలోని రుద్రకోడూరు గ్రామానికి దట్టమైన అటవీ మార్గంలో ప్రమాద స్థలి మరో 16 కిలోమీటర్లు దూరం ఉంది.[17]

ప్రమాదంపై విచారణ సంఘము

నల్లమల అడవులలో సంభవించిన హెలికాప్టర్ దుర్ఘటనపై కేంద్ర ప్రభుత్వం విచారణ సంఘాన్ని నియమించింది. పవన్‌హన్స్ హెలికాప్టర్ లిమిటెడ్ యజమాని ఆర్.కె.త్యాగి ఈ విచారణ కమిటీకి నేతృత్వం వహించాడు.

కాలరేఖ

పదవులు
 • 1975: యవజన కాంగ్రెస్ కార్యదర్శిగా నియామకం.
 • 1980: తొలిసారిగా రాష్ట్ర మంత్రివర్గంలో గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రిగా నియామకం.
 • 1982: రాష్ట్ర మంత్రివర్గంలో ఎక్సైజ్ శాఖా మంత్రి పదవి లభించింది.
 • 1982: రాష్ట్ర మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా నియామకం.
 • 1983: పిసిసి అధ్యక్షుడిగా నియమించబడ్డాడు (1985 వరకు).
 • 1998: రెండోసారి పిసిసి అధ్యక్షుడిగా నియామకం (2000 వరకు).
 • 1999: శాసనసభ ప్రతిపక్షనేతగా ఎన్నికయ్యారు.
 • 2004: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు.
 • 2009: రెండోపర్యాయం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు.
విజయాలు
 • 1978: పులివెందుల నుంచి తొలిసారి శాసనసభ్యుడిగా గెలుపొందినాడు.
 • 1983: పులివెందుల నుంచి రెండోసారి శాసనసభ్యుడిగా విజయం.
 • 1985: పులివెందుల నుంచి వరుసగా మూడవసారి శాసనసభ్యుడిగా హాట్రిక్ విజయం.
 • 1989: కడప నియోజకవర్గం నుంచి తొలిసారి లొకసభ సభ్యుడిగా విజయం.
 • 1991: కడప నియోజకవర్గం నుంచి రెండోసారి గెలుపు.
 • 1996:కడప నుంచి వరుసగా మూడవసారి గెలుపొంది హాట్రిక్ సాధించాడు.
 • 1998: కడప నుంచి వరుసగా నాలుగవసారి ఎన్నికలలో విజయం సాధించాడు.
 • 1999: పులివెందుల నుంచి నాలుగవసారి శాసనసభ్యుడిగా గెలుపు.
 • 2004: పులివెందుల నుంచి ఐదవసారి శాసనసభ్యుడిగా విజయసాధించాడు.
 • 2009: పులివెందుల నుంచి రెండోసారి హాట్రిక్ విజయం, శాసనసభ్యుడిగా గెలుపొందడం ఆరవసారి.


ఇంతకు ముందు ఉన్నవారు:
నారా చంద్రబాబునాయుడు
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి
14/05/2004—02/09/2009
తరువాత వచ్చినవారు:
కొణిజేటి రోశయ్య


ఇంతకు ముందు ఉన్నవారు:
జి.వెంకటస్వామి
ఆంధ్ర ప్రదేశ్ పిసిసి అధ్యక్షులు
1983-85
తరువాత వచ్చినవారు:
జలగం వెంగళరావు


ఇంతకు ముందు ఉన్నవారు:
డి.మల్లికార్జున్
ఆంధ్ర ప్రదేశ్ పిసిసి అధ్యక్షులు
1998-2000
తరువాత వచ్చినవారు:
ఎం.సత్యనారాయణ

బయటి లింకులు

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

వంశవృక్షం


మూలాలు

 1. http://www.kadapa.info/ysr.html
 2. ఈనాడు 26-05-2012
 3. http://www.aponline.gov.in/quick%20links/cm/cmprofile.html
 4. Encyclopaedia of India, Pakistan and Bangladesh By Om Gupta పేజీ.2638
 5. "I've 1,000 acres more, says CM". Times of India. India. 19 December 2006. Retrieved 26 May 2009.
 6. ఈనాడు దినపత్రిక, తేది 17-05-2009
 7. http://news.rediff.com/special/2009/sep/07/dr-ysr-was-a-very-devoted-christian.htm
 8. http://specials.rediff.com/election/2004/may/12sld3.htm
 9. http://election.rediff.com/report/2009/may/25/loksabapoll-ysr-to-visit-bethlehem.htm
 10. http://www.hindu.com/2005/05/06/stories/2005050612790300.htm
 11. http://www.hindu.com/2009/02/04/stories/2009020450910200.htm
 12. http://www.hindu.com/2009/09/05/stories/2009090559220400.htm
 13. http://www.haindavakeralam.com/HkPage.aspx?PAGEID=9124&SKIN=B
 14. ఈనాడు దినపత్రిక, తేది 03-09-2009
 15. ఈనాడు దినపత్రిక తేది 04-09-2009
 16. http://in.news.yahoo.com/43/20090904/812/tnl-67-die-after-ysr-s-death-bereaved-so.html
 17. http://www.suryaa.com/showStateNews.asp?ContentId=13914