తెలుగు

వికీపీడియా నుండి
(Telugu language నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
తెలుగు
తెలుగు
స్థానిక భాషభారతదేశం
ప్రాంతంఆంధ్రప్రదేశ్, తెలంగాణ
స్వజాతీయతతెలుగు ప్రజలు
స్థానికంగా మాట్లాడేవారు
82 మిలియన్లు (2011)[1][2]
రెండవ భాష: 11 మిలియన్లు[1]
ద్రావిడ
  • దక్షిణ-మధ్య
    • తెలుగు
తొలిరూపు
పాత తెలుగు
ప్రాంతీయ రూపాలు
తెలుగు అక్షరమాల
తెలుగు బ్రెయిలీ
Signed Telugu
అధికారిక హోదా
అధికార భాష
 India
గుర్తింపు పొందిన అల్పసంఖ్యాకుల భాష
భాషా సంకేతాలు
ISO 639-1te
ISO 639-2tel
ISO 639-3tel – inclusive code
Individual code:
wbq – వడ్డర్ (వాడారి)
tel
Glottologtelu1262  తెలుగు
oldt1249  పాత తెలుగు
Linguasphere49-DBA-aa
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ల్లో స్థానిక ప్రజా భాష తెలుగు
This article contains IPA phonetic symbols. Without proper rendering support, you may see question marks, boxes, or other symbols instead of Unicode characters. For an introductory guide on IPA symbols, see Help:IPA.
తెలుగు తల్లి శిలామూర్తి - ఒక చేత పూర్ణ కుంభం, మరొకచేత వరి కంకి - నిండుదనానికీ, పంటలకూ ఆలవాలం. "తెలుగు" పదాన్ని భాషకూ, జాతికీ సంకేతంగా వాడుతారనడానికి ఈ రూపకల్పన ఒక ఆధారం

తెలుగు అనేది ద్రావిడనుడి కుటుంబానికి చెందిన నుడి. తెలుగువారు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ఎక్కువ ఉండగా తెలుగును మున్నధికారిక నుడిగా వాడుతారు. భారతదేశంలో ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాల్లో మాట్లాడే మున్నధికారిక నుడులలో హిందీ, బెంగాలీలతో పాటు తెలుగు ఒకటి.[5][6] పుదుచ్చేరిలోని యానం జిల్లాలో తెలుగు అధికారిక నుడి. ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, అండమాన్ నికోబార్ దీవులలో గుర్తింపబడిన చిన్నవీటి నుడి. భారత ప్రభుత్వం భారతదేశ ప్రాచీన భాషలుగా గుర్తించిన ఆరునుడులలో తెలుగు ఒకటి.[7][8]

ఇంచుమించుగా తెలుగులో 10,000 శాసనాలు పైనే ఉన్నాయి.

భారతదేశం ఎటువంటిటి ఊడఁడ లేకుండా రెండువేల పైనాటినుండే తెలుగు మాట్లాడ్తున్నట్టుగా తెలియజేయబడింది, 2011 జనాభా లెక్కబట్టి దాదాపు 8.2 కోట్ల మందికి పైగ ఇప్పుడు మాట్లాడేవారున్నారు.[9] భారతదేశంలో అమ్మనుడిగా తెలుగు నాలుగో నెలకువలో ఉండగా, ప్రపంచప్రాకింతగా ఎథ్నోలాగ్ జాబితాలో 15వ నెలకువలో ఉంది.[10][11] ఇది ద్రావిడనుడి కుటుంబంలో ఎక్కువమంది మాట్లాడే నుడి. భారతదేశంలో ఇరవైరెండు షెడ్యూల్ భాషలలో ఇది ఒకటి.[12] ఇది అమెరికాలో వేగంగా పెంపొందుతున్న నుడి.[13] తెలుగు నుడిలో సుమారు 10,000 పాత శాసనాలు ఉన్నాయి.[14] కన్నడిగుడైన శ్రీకృష్ణదేవరాయలు తెలుగు నుడిని 'దేశ భాషలందు తెలుగు లెస్స' అని పొగిడినారు. కన్నడ, తెలుగు వర్ణమాల చాలా వరకు పోలికగలిగి వుంటాయి.

పేరు, పుట్టుక:

[మార్చు]

తెలుగు మాట్లాడేవారిని తెలుగువారు అని అంటారు.[15] తెలుగు పాత రూపాలు తెనుంగు,తెనుగు,తెలుంగు.[16] తెలుగు ద్రావిడనుడి గాక తెన్ (దక్షిణం) అనే మాట నుండి తెనుగు, దీని నుండి తెలుగు వచ్చేనని, ప్రస్తుతశాస్త్రవేత్తలు నిర్ణయించారు, 13వ శతాబ్దంలో అథర్వణ ఆచార్య తెలుగు వ్యాకరణాన్ని త్రిలింగ శబ్దానుశాసన (లేదా త్రిలింగ వ్యాకరణం) అని పిలిచారు.[17] 17వ శతాబ్దానికి చెందిన అప్పకవి త్రిలింగ నుండి తెలుగు ఉద్భవించిందని స్పష్టంగా రాశాడు. అప్పకవి పూర్వీకులకు అటువంటి వ్యుత్పత్తి గురించి తెలియదు కాబట్టి ఇది "విచిత్రమైన భావన" అని పండితుడు చార్లెస్ పి. బ్రౌన్ వ్యాఖ్యానించాడు.[18]

జార్జ్ అబ్రహం గ్రియర్‌సన్, ఇతర భాషావేత్తలు ఈ వ్యుత్పత్తిపై సందేహం వ్యక్తం చేశారు. తెలుగు పాత పదం. త్రిలింగ దానికి సంస్కృతీకరణ[19] అయితే, ట్రిగ్లిఫమ్, త్రిలింగం, మోడోగలింగం పురాతన గ్రీకు మూలాల్లో ధృవీకరించబడినందున, ఈ వ్యుత్పత్తి చాలా పురాతనమైనది అయి ఉండాలి, వీటిలో చివరిది " త్రిలింగ " యొక్క తెలుగు అనువాదంగా అర్థం చేసుకోవచ్చు.[20] మరొక కథనం ప్రకారం తెనుగు అనేది ప్రోటో-ద్రావిడ పదం *తెన్ ("దక్షిణం")[21] నుండి "దక్షిణం/దక్షిణ దిశలో నివసించిన ప్రజలు" నుండి కలిగినది. తెలుగు అనే పేరు "న" నుండి "ల" మార్పు వలన వచ్చింది.[22][23]

చరిత్ర

[మార్చు]
ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా విడుదలైన తపాలా బిళ్ళ - ఇందులో వ్రాసినవి - "దేశ భాషలందు తెలుగు లెస్స", "ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు", " పంచదార కన్న పనస తొనల కన్న కమ్మని తేనె కన్న తెలుగు మిన్న"

భాషా శాస్త్రకారులు తెలుగును ద్రావిడ భాషా కుటుంబానికి చెందినదిగా గుర్తించారు.[24] అనగా తెలుగు – హిందీ, సంస్కృతం, లాటిను, గ్రీకు మొదలైన భాషలు గల ఇండో-యురోపియన్ నుడుల గుంపుకు చెందకుండా, తమిళము, కన్నడం, మలయాళం, తోడ, తుళు, బ్రహూయి, గోండి మొదలైన భాషలతో పాటుగా ద్రావిడ నుడుల గుంపుకు చెందినదిగా భాషా శాస్త్రజ్ఞుల వాదన. తెలుగు 'దక్షిణ మధ్య ద్రావిడ భాష' నుండి పుట్టింది. ఈ కుటుంబంలో తెలుగుతో పాటు గోండి, కుయి, కోయ, కొలామి కూడా ఉన్నాయి.[25] సా.శ. 940 ప్రాంతంలో పంపన కాలంలోనే తెలుగు నుడి ఒక నిండైన సాహిత్యం కలిగిన నుడిగా వ్రాతల రూపంలో మనకు కనిపించిందని పరిశోధనల్లో తేలింది.[26] సామాన్యశకం 1100–1400 మధ్య పాత తెలుగు- కన్నడ లిపి నుండి ఆధునిక కన్నడ మరియూ తెలుగు లిపులు పుట్టినాయని, అందుకే తెలుగు లిపి, తెలుగు పదాలు కన్నడ లిపిని పోలియుంటాయి అనే సిద్ధాంతం ఉంది.[27]

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ నుడులతో పాటుగా మొత్తం 26 నుడులు నేడు వాడుకలో ఉన్న ద్రావిడ నుడులు. సంస్కృతం భారతదేశంలో అడుగుపెట్టక ముందు ద్రావిడ నుడులు భారతదేశమంతా విస్తరించి ఉండేవని ఎందరో భాషా చరిత్రకారుల నమ్మకం. నాటి సింధు లోయ నాగరికత నివాసులు ద్రవిడ జాతికి చెందినవారైనందున[28] వారి భాష కూడా ద్రావిడనుడే, లేదా ద్రావిడ నుడులకు చెందినది అయివుంటుందని వారి నమ్మకం.

శిలాశాసన, సాహిత్య ఆధారాలు

[మార్చు]

ఎన్నో ఇతర ద్రావిడ నడులవలె కాక తెలుగునుడి మూలాన్వేషణకు సంతృప్తికరమైన, నిర్ణయాత్మకమైన ఆధారాలు లేవు. అయినా కూడా, క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో శాతవాహన రాజులు వ్రాత అయిన "గాథాసప్తశతి" అన్న మహారాష్ట్రీ ప్రాకృత పద్య సంకలనంలో తెలుగు పదాలు మొట్టమొదట కనిపించాయి.

ఆదిమ ద్రావిడ భాషల చరిత్ర సామాన్య శక పూర్వం కొన్ని శతాబ్దాల వెనక నుండి ఉందని మనం తెలుసుకోవచ్చు, కానీ తెలుగు చరిత్రను మనం సామాన్య శకం 6వ శతాబ్దం నుండి ఉన్న ఆధారాలను బట్టి నిర్ణయించవచ్చు. తెలుగులోని స్పష్టమైన మొట్టమొదటి ప్రాచీన శిలాశాసనం 7వ శతాబ్దమునకు చెందింది. శాసనాలలో మనకు లభించిన తొలి తెలుగు పదం "నాగబు". సామాన్య శకం 11 వ శతాబ్దం నుండి గ్రంథస్థము చేయబడిందిగా గమనించవచ్చు.

ఆంధ్రుల గురించి చెప్పిన పూర్వపు గ్రంథ ప్రస్తావనలలో ఒకటి ఇక్కడ ఉదహరింపబడింది.:[29]

పియమహిళా సంగామే సుందరగత్తేయ భోయణీ రొద్దే
అటుపుటురటుం భణంతే ఆంధ్రేకుమారో సలోయేతి

ఇది ఉద్యోతనుడు ప్రాకృత భాషలో రచించిన కువలయమాల కథలోనిది. ఈ ప్రాకృతానికి పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి తెలుగు అనువాదం:

"అందగత్తెలన్నా, అధవా యుద్ధరంగమన్ననూ సమానంగా ప్రేమించే వాళ్ళున్నూ,అందమైన శరీరాలు గల వాళ్ళున్నూ. తిండిలో దిట్టలున్నూ, అయిన ఆంధ్రులు అటూ, పుటూ (పెట్టు కాబోలు), రటూ (రట్టు ఏమో) అనుకొంటూ వస్తుండగా చూచాడు".

భాష పర్యాయ పదాల వాడుక

[మార్చు]

ఆంధ్రులు మాట్లాడే భాషకు ఆంధ్రం, తెలుగు, తెనుగు అనే పేర్లున్నాయి. వీటి మూలాలూ, వాని మధ్య సంబంధాలు గురించి చరిత్రకారులలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.[30] సా.శ.పూ. 700 ప్రాంతంలో వచ్చిన ఐతరేయ బ్రాహ్మణము (ఋగ్వేదములో భాగము) లో మొదటిసారిగా "ఆంధ్ర" అనే పదం జాతి పరంగా వాడబడింది. కనుక ఇదే మనకు తెలిసినంతలో ప్రాచీన ప్రస్తావన. ఆ తరువాత బౌద్ధ శాసనాలలోనూ, అశోకుని శాసనాలలోనూ ఆంధ్రుల ప్రస్తావన ఉంది. సా.శ..పూ. 4వ శతాబ్దిలో మెగస్తనీసు అనే గ్రీకు రాయబారి ఆంధ్రులు గొప్ప సైనికబలం ఉన్నవారని వర్ణించాడు. ఆంధ్ర, తెలుగు అనేవి రెండు వేర్వేరు జాతులని అవి క్రమంగా మిళితమైనవనీ కొందరి అభిప్రాయం.[31] అయితే ఈ అభిప్రాయానికి జన్యు శాస్త్ర పరంగా కానీ భాషాశాస్త్ర పరంగా కానీ గట్టి ఆధారాలు దొరకలేదు. వైదిక వాఙ్మయం ప్రకారం ఆంధ్రులు సాహసోపేతమైన సంచారజాతి. భాషాశాస్త్ర పరంగా తెలుగు గోదావరి, కృష్ణా నదుల మధ్య నివసిస్తున్న స్థిరనివాసుల భాష. తెలుగు భాష మాట్లాడే ప్రాంతాన్ని ఆంధ్ర రాజులు ముందుగా పరిపాలించడం వల్ల ఆంధ్ర, తెలుగు అన్న పదాలు సమానార్థకాలుగా మారిపోయాయని కొంతమంది ఊహాగానం. 10వ శతాబ్దపు పారశీక చరిత్రకారుడు అల్ బిరుని తెలుగు భాషను 'ఆంధ్రీ' యని వర్ణించెను.[32]

సా.శ. 1000 కు ముందు శాసనాలలోగాని, వాఙ్మయంలోగాని తెలుగు అనే శబ్దం మనకు కానరాదు. 11వ శతాబ్దము ఆరంభము నుండి "తెలుంగు భూపాలురు", "తెల్గరమారి", "తెలింగకులకాల", 'తెలుంగ నాడొళగణ మాధవికెఱియ' వంటి పదాలు శాసనాల్లో వాడబడ్డాయి. 11వ శతాబ్దములో నన్నయ భట్టారకుని కాలంనాటికి తెలుగు రూపాంతరంగా "తెనుగు" అనే పదం వచ్చింది. 13వ శతాబ్దంలో మహమ్మదీయ చారిత్రకులు ఈ దేశాన్ని "త్రిలింగ్" అని వ్యవహరించారు. 15వ శతాబ్దం పూర్వభాగంలో విన్నకోట పెద్దన్న తన కావ్యాలంకారచూడామణిలో ఇలా చెప్పాడు.

ధర శ్రీ పర్వత కాళే
శ్వర దాక్షారామ సంజ్ఙ వఱలు త్రిలింగా
కరమగుట నంధ్రదేశం
బరుదారఁ ద్రిలింగదేశ మనఁజనుఁ గృతులన్
తత్త్రిలింగ పదము తద్భవంబగుటచేఁ
దెలుఁగు దేశ మనఁగఁ దేటపడియె
వెనకఁ దెనుఁగు దేశమును నండ్రు కొందరు

శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామం – అనే మూడు శివలింగక్షేత్రాల మధ్య భాగము త్రిలింగదేశమనీ, "త్రిలింగ" పదము "తెలుగు"గా పరిణామం పొందిందని ఒక సమర్థన. ఇది గంభీరత కొరకు సంస్కృతీకరింపబడిన పదమేనని, తెలుగు అనేదే ప్రాచీన రూపమని చరిత్రకారుల అభిప్రాయము. చాలామంది భాషావేత్తలు, చరిత్రకారులు ఈ వాదనలు పరిశీలించి దీనిలో నిజం లేదని అభిప్రాయపడ్డారు. అందుకు నన్నయ మహాభారతంలో త్రిలింగ శబ్దం ప్రయోగం కాకపోవడం కూడా కారణమన్నారు.[33] 12వ శతాబ్దిలో పాల్కురికి సోమనాథుడు "నవలక్ష తెలుంగు" – అనగా తొమ్మిది లక్షల గ్రామ విస్తీర్ణము గలిగిన తెలుగు దేశము – అని వర్ణించాడు. మొత్తానికి ఇలా తెలుగు, తెనుగు, ఆంధ్ర – అనే పదాలు భాషకు, జాతికి పర్యాయపదాలుగా రూపుదిద్దుకొన్నాయి.

తెలుగు భాషా విస్తృతి

[మార్చు]

తెలుగు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరిలోని యానాంలో అధికార భాష. పశ్చిమ బెంగాల్, అండమాన్ నికోబార్ దీవులు లలో అదనపు అధికార భాషగా గుర్తించబడింది. ఇంకా తమిళనాడులో తెలుగు మాట్లాడబడుతుంది. తమిళనాడులో నివసిస్తున్న ప్రజల్లో దాదాపు 42 శాతం తెలుగువారే. తమిళనాడులోని హోసూరు, కోయంబత్తూరులలో, ఒడిశాలోని రాయగడ, జయపురం, నవరంగపురం, బరంపురం పర్లాకేముండిలలో తెలుగు భాష ఎక్కువ. విజయనగర సామ్రాజ్య కాలములో తెలుగు వారు వేల మంది తమిళ ప్రాంతములకు వెళ్ళి స్థిరపడ్డారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంగా ఉన్నప్పుడు అనేక మంది తెలుగువారు కోస్తా, రాయలసీమ ప్రాంతాల నుండి వలస వెళ్లి తమిళనాడులో స్థిరపడ్డారు. కాని వారి రోజువారీ అవసరాలకు అనుగుణంగా ఆ రాష్ట్ర ప్రాంతీయ భాష అయిన అరవములోనే మాట్లాడుతుంటారు. అలాగే కర్నాటకలో కూడా చాలామంది తెలుగు మాట్లాడగలరు. ఇంకా, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర లోని కొన్ని సరిహద్దు ప్రాంతాలలోని ప్రజలు అధికంగా తెలుగే మాట్లాడుతారు. దక్షిణాదిలో ప్రముఖ నగరాలైన చెన్నై, బెంగళూరులలో కూడా తెలుగు తెలిసినవారు అత్యధిక సంఖ్యలో ఉన్నారు.[34]

భాష స్వరూపం

శబ్దము

[మార్చు]

తెలుగు అజంత భాష. అనగా దాదాపు ప్రతి పదం ఒక అచ్చుతో అంతం అవుతుంది. దీన్ని గమనించే 15వ శతాబ్దంలో ఇటాలియన్ యాత్రికుడు నికొలో డి కాంటి తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ (ప్రాచ్య ఇటాలియన్) గా అభివర్ణించాడు. అచ్చుల శబ్దాలను చూడండి.

అం అః
/a/ /ɑː/ /ɪ/ /iː/ /u/ /uː/ /ru/ /ruː/ /lu/ /luː/ /e/ /eː/ /ai/ /o/ /oː/ /au/ /am/ /aha/

తెలుగు భాషను సాధారణంగా ఒకపదంతో మరొకపదం కలిసిపోయే భాషగా గుర్తిస్తారు. ఇందులో ఒక నామవాచకానికి దాని ఉపయోగాన్ని బట్టి ప్రత్యేకమైన అక్షరాలు చేర్చబడతాయి. వ్యాకరణపరంగా, తెలుగులో కర్త, కర్మ, క్రియ, ఒక పద్ధతి ప్రకారం, ఒకదాని తర్వాత మరొకటి వాక్యంలో వాడబడతాయి.

మాండలికాలు

[మార్చు]

తెలుగుకు నాలుగు ప్రధానమైన మాండలిక భాషలున్నాయి.

  1. సాగరాంధ్ర లేదా కోస్తా మాండలిక భాష: కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ఉభయ గోదావరి జిల్లాలలోని భాషను కోస్తా మాండలికం లేదా సాగరాంధ్ర మాండలికం అని అంటారు.
  2. రాయలసీమ భాష:కడప, కర్నూలు,చిత్తూరు,అనంతపురం ప్రాంతపు భాషను రాయలసీమ మాండలికం అని అంటారు.
  3. తెలంగాణ భాష: తెలంగాణ ప్రాంతంలో మాట్లాడే భాషను తెలంగాణ మాండలికం అని అంటారు.
  4. కళింగాంధ్ర భాష: విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల భాషను కళింగాంధ్ర మాండలికం లేదా ఉత్తరాంధ్ర మాండలికం అని అంటారు.

లిపి

[మార్చు]
ప్రధాన వ్యాసం: తెలుగు లిపి

తెలుగు లిపి ఇతర భారతీయ భాషా లిపులలాగే ప్రాచీన బ్రాహ్మీ లిపి నుండి ఉద్భవించింది. అశోకుని కాలంలో మౌర్య సామ్రాజ్యానికి సామంతులుగా ఉన్న శాతవాహనులు బ్రాహ్మీ లిపిని దక్షిణ భారతదేశానికి తీసుకొని వచ్చారు. అందుచేత అన్ని దక్షిణ భారత భాషలు మూల ద్రావిడ భాష నుండి ఉద్భవించినా వాటి లిపులు మాత్రము బ్రాహ్మీ నుండి పుట్టాయి. అశోకుడి కాలానికి చెందిన బ్రాహ్మి లిపి రూపాంతరమైన భట్టిప్రోలు లిపి నుండియు, ప్రాచీన కన్నడ భాష 'హలెగన్నడ 'లిపినుండియూ తెలుగు లిపి ఉద్భవించింది.[25]

తెలుగు లిపిని బౌద్ధులు, వర్తకులు ఆగ్నేయ ఆసియా ప్రాంతాలకు అందచేసారు. అక్కడ ఈ లిపి, మాన్, బర్మీస్, థాయ్, ఖ్మేర్, కామ్, జావనీస్, బాలినీస్ భాషల లిపుల ఉద్భవానికి కారకమయ్యింది. తెలుగు లిపితో వాటికి స్పష్టంగా పోలికలు కనిపిస్తాయి. తెలుగు అక్షరమాల చూడడానికి దాని సమీప దాయాదియైన కన్నడ అక్షరమాల వలెనే కనిపిస్తుంది.

తెలుగు లిపి చాలవరకు ఉచ్ఛరించగల ఏకాక్షరాలతో ఉండి, ఎడమనుండి కుడికి, సరళమైన, సంక్లిష్టమైన అక్షరాల సరళితో కూడి ఉంటుంది. ఈ విధమైన ఉచ్ఛరించగల ఏకాక్షరాలు అనేకంగా ఉండడానికి ఆస్కారం ఉన్నందువల్ల, అక్షరాలు "అచ్చులు" (వొవెల్స్ లేదా స్వర్), "హల్లులు" (కాన్సొనెంట్స్ లేదా వ్యంజన్) అన్న ప్రధానమైన ప్రమాణాలను కలిగి ఉన్నాయి. హల్లుల రూపు వాటి వాడుకను బట్టి, సందర్భానుసారం మార్పు చెందుతూ ఉంటుంది. అచ్చుల ధ్వని వాటిలో లేనప్పుడు హల్లులు పరిశుద్ధమైనవిగా పరిగణించబడతాయి. అయితే, హల్లులను వ్రాయడానికి, చదవడానికి, అచ్చు "అ"ను చేర్చడం సాంప్రదాయకం. హల్లులు వేర్వేరు అచ్చులతో చేరినప్పుడు, అచ్చు అంశం వర్ణ పరిచ్ఛేదముతో "మాత్రలు" అన్న సంకేతాలను ఉపయోగించడంతో గుర్తింపబడుతుంది. ఈ "మాత్రల" ఆకారాలు తమ తమ హల్లుల ఆకారాలకు ఎంతో విరుద్ధంగా ఉంటాయి. తెలుగులో ఒక వాక్యం "పూర్ణవిరామం"తో కానీ, "దీర్ఘవిరామం"తో కానీ ముగించబడుతుంది. అంకెలను గుర్తించడానికి తెలుగులో ప్రత్యేకంగా సంకేతాలున్నా, ఇండో అరబిక్ అంకెలే విస్తృతంగానూ, సర్వసాధారణంగానూ ఉపయోగింపబడుతున్నాయి. ఈ విధంగా, తెలుగులో, 16 అచ్చులు, 3 విశేష అచ్చులు, 41 హల్లులు చేరి మొత్తం 60 సంకేతాలు ఉన్నాయి.

తెలుగు అంకెలు

[మార్చు]
పేరు తెలుగుసంఖ్య ఇండో అరబిక్ అంకెలు
సున్నా 0 0
ఒకటి 1
రెండు 2
మూడు 3
నాలుగు 4
ఐదు 5
ఆరు 6
ఏడు 7
ఎనిమిది 8
తొమ్మిది 9

తెలుగు అంకెలు, సంఖ్యలు తెలుగు కేలెండరులో ప్రధానంగా వాడుతారు. ఇతరత్రా ఇండో అరబిక్ రూపాలనే వాడుతారు

కంప్యూటరులో తెలుగు

[మార్చు]

తెలుగు భాష అక్షరాలకు యూనికోడ్ బ్లాకు 0C00-0C7F (3072–3199) కేటాయించబడింది. ఆగష్టు 15, 1992న తొలి తెలుగు న్యూస్ గ్రూప్ (soc.internet.culture.telugu) ఆవిర్భవించింది.[35] 1985లో డిటిపి కొరకు ఆపిల్ కంప్యూటర్ విడుదలయ్యింది. తొలుత ఆంగ్ల భాషకే మాత్రమే పరిమితమైనా తరువాత భారతీయ భాషలకు విస్తరించాయి. చెన్నైకి చెందిన ఉమా కళ్యాణరామన్ అనే మహిళ తెలుగు ఖతి(ఫాంటు)ని రూపొందించింది. ఆ తరువాత కృష్ణ, గోదావరి అనే ఖతులు వాడకంలోకి వచ్చాయి. 1998 లో సిడాక్ భారతీయభాషల తోడ్పాటుకు పర్సనల్ కంప్యూటర్ కు జిస్ట్ కార్డు విడుదలచేయటం ఆ తరువాత సిడాక్ లీప్,లీప్ ఆఫీస్, ఐలీప్, వివిధ భాషల ఖతులు విడుదలచేసింది. 2001 లో పోతన(ఫాంటు) స్వేచ్ఛానకలుహక్కులత తిరుమలకృష్ణ దేశికాచారి విడుదలచేశాడు.ఆ తరువాత అన్ని కంప్యూటర్ వ్యవస్థలకు,తెలుగు తోడ్పాటు అందుబాటులోకి వచ్చింది.[36] 2011 ప్రాంతంలో తొలి స్మార్ట్ ఫోన్లలో తెలుగు వాడకం వీలైంది.

తెలుగు సాహిత్యం

[మార్చు]

తెలుగు సాహిత్యాన్ని ఆరు యుగాలుగా వర్గీకరించ వచ్చును.

సా.శ. 1020 వరకు – నన్నయకు ముందు కాలం

[మార్చు]

11 వ శతాబ్దం ప్రాంతంలో నన్నయ రచించిన మహాభారతం తెలుగులోని మొట్టమొదటి సాహిత్య కావ్యమని సర్వత్రా చెబుతారు. ఒక్కసారిగా ఇంత బృహత్తరమైన, పరిపక్వత గల కావ్యం రూపుదిద్దుకోవడం ఊహించరానిది. కనుక అంతకు ముందు చెప్పుకోదగిన సాహిత్యం ఉండి ఉండాలి. కాని అది బహుశా గ్రంథస్తం కాలేదు లేదా మనకు లభించడం లేదు. అంతకు ముందు సాహిత్యం ఎక్కువగా జానపద సాహిత్యం రూపంలో ఉండి ఉండే అవకాశం ఉన్నది. కాని మనకు లభించే ఆధారాలు దాదాపు శూన్యం. క్రీ. శ. 575లో రేనాటి చోడుల శాసనం మొట్టమొదటి పూర్తి తెలుగు శాసనం. ఇది కడప జిల్లా కమలాపురం తాలూకా ఎఱ్ఱగుడిపాడులో లభించినది. అంతకు ముందు కాలానికి చెందిన అమరావతి శాసనంలో "నాగబు" అనే పదం కన్పిస్తుంది.

1020–1400 – పురాణ యుగం

[మార్చు]

దీనిని నన్నయ్య యుగము అనవచ్చును. నన్నయ్య ఆది కవి. ఇతడు మహా భారతాన్ని తెలుగులో వ్రాయనారంభించి, అందులో మొదటి రెండు పర్వాలు పూర్తి చేసి, తరువాతి పర్వాన్ని (అరణ్య పర్వం) సగం వ్రాసి కీర్తి శేషుడు అయ్యాడు. నన్నయకు నారాయణ భట్టు సహాయంగా నిలిచాడు. నారాయణ భట్టు వాఙ్మయ దురంధరుడు. అష్టభాషాకవి శేఖరుడు. సహాధ్యాయులైన నారాయణ, నన్నయ భట్టులు భారత యుద్ధానికి సంసిద్ధులైన కృష్ణార్జునులవలె భారతాంధ్రీకరణకు పూనుకొని ఒక విజ్ఞాన సర్వస్వంగా దానిని రూపొందించే ప్రయత్నం ప్రారంభించారు; తెలుగు కావ్యభాషాస్వరూపానికి పూర్ణత్వం సాధించి, పండితులు పామరులు మెచ్చుకొనదగిన శైలిని రూపొందించి, తరువాతి కవులకు మార్గదర్శకులయ్యారు. ఆంధ్ర భాషా చరిత్రలో నన్నయ, నారాయణులు యుగపురుషులు. వీరు తెలుగు భాషకు ఒక మార్గాన్ని నిర్దేశించారు. వీరి తరువాత కవులందరూ ఒకసారి కాకపోతే ఒకసారైనా నన్నయ్య అడుగుజాడలను అనుసరించినవారే.

నన్నయ తరువాతి కాలంలో ముఖ్యమైన సామాజిక, మత సంస్కరణలు చోటుచేసుకొన్నాయి. వీరశైవము, భక్తిమార్గము ప్రబలమై ఎన్నో కావ్యాలకు కారణమైనది. తిక్కన (13వ శతాబ్ది), ఎర్రన (14వ శతాబ్దం) లు భారతాంధ్రీకరణను కొనసాగించారు. నన్నయ చూపిన మార్గంలో ఎందరో కవులు పద్యకావ్యాలను మనకు అందించారు. ఇవి అధికంగా పురాణాలు ఆధారంగా వ్రాయబడ్డాయి.

1400–1510 – మధ్య యుగం (శ్రీనాథుని యుగం)

[మార్చు]

ఈ కాలంలో సంస్కృతకావ్యాల, నాటకాల అనువాదం కొనసాగింది. కథాపరమైన కావ్యాలు కూడా వెలువడ్డాయి. "ప్రబంధము" అనే కావ్య ప్రక్రియ ఈ కాలంలోనే రూపు దిద్దుకున్నది. ఈ కాలంలో శ్రీనాథుడు, పోతన, జక్కన, గౌరన, తాళ్ళపాక తిమ్మక్క, గోన బుద్దారెడ్డి పేరెన్నికగన్న కవులు. ఛందస్సు మరింత పరిణతి చెందింది. శ్రీనాథుని శృంగార నైషధము, పోతన భాగవతం, జక్కన విక్రమార్క చరిత్ర, తిమ్మక్క సుభద్రా కళ్యాణం, గోన బుద్ధారెడ్డి తొలి తెలుగు రంగనాథ రామాయణము మొదలైనవి ఈ యుగంలో కొన్ని ముఖ్యమైన కావ్యాలు.

1510–1600 – ప్రబంధ యుగం

[మార్చు]

విజయనగర చారిత్రక శకానికి చెందిన చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు ఆదరణలో 16వ శతాబ్దం ప్రాంతంలో తెలుగు సాహిత్యపు స్వర్ణయుగం వికసించింది. స్వతహాగా కవియైన మహారాజు తన ఆముక్తమాల్యదతో "ప్రబంధం" అన్న కవిత్వ రూపాన్ని ప్రవేశపెట్టాడు. ఆ కాలంలో అతి ప్రముఖ కవులైన అష్టదిగ్గజాలతో ఆయన ఆస్థానం శోభిల్లింది.

1600–1820 – దాక్షిణాత్య యుగం

[మార్చు]

కర్ణాటక సంగీతపు ప్రముఖులెంతో మంది వారి సాహిత్యాన్ని తెలుగులోనే రచించారు. త్యాగరాజు, అన్నమాచార్య, క్షేత్రయ్య రామదాసుగా పేరొందిన కంచెర్ల గోపన్న కొందరు ముఖ్యులు. మైసూర్ వాసుదేవాచార్ వంటి ఆధునిక రచయితలు కూడా వారి రచనలకు మాధ్యమంగా తెలుగునే ఎంచుకొన్నారు.

1820 తరువాత – ఆధునిక యుగం

[మార్చు]

1796 లో మొదటి తెలుగు అచ్చు పుస్తకం విడుదలైనా, తెలుగు సాహిత్యపు పునరుద్ధరణ 19వ శతాబ్దపు మొదట్లోనే సాధ్యమయింది. 19వ శతాబ్దపు మధ్యప్రాంతంలో, షెల్లీ, కీట్స్, వర్డుస్ వర్త్ వంటి కవుల కవిత్వంచే అమితంగా ప్రభావం చెందిన యువ కవులు "భావకవిత్వం" అన్న సరికొత్త ప్రణయ కవిత్వానికి జన్మనిచ్చారు.

గ్రాంథిక, వ్యావహారిక భాషా వాదాలు

నన్నయకు పూర్వము నుండి గ్రాంథిక భాష, వ్యావహారిక భాష స్వతంత్రముగా పరిణామము చెందుతూ వచ్చాయి. కానీ 20వ శతాబ్దము తొలినాళ్లలో వీటి మధ్య ఉన్న వ్యత్యాసాలు తీవ్ర వాదోపవాదాలకు దారితీసాయి.[37] గ్రాంథికము ప్రమాణ భాష అని, స్థిరమైన భాష అని, దాన్ని మార్చగూడదని గ్రాంథిక భాషా వర్గము, ప్రజల భాషనే గ్రంథ రచనలో ఉపయోగించాలని వ్యావహారిక భాషా వర్గము వాదించడముతో తెలుగు పండితలోకము రెండుగా చీలినది.

మొట్టమొదటి నవలగా పరిగణించబడుతున్న కందుకూరి వీరేశలింగం రచన రాజశేఖరచరిత్రముతో తెలుగు సాహిత్యపు పునరుద్ధరణ సంపూర్ణమయ్యింది. గ్రాంథిక భాష వాడకాన్ని తీవ్రంగా నిరసిస్తూ గిడుగు రామ్మూర్తి ప్రకటించిన ఆంధ్ర పండిత భిషక్కుల భాషాభేషజం ప్రభావంతో గురజాడ అప్పారావు (ముత్యాల సరాలు), కట్టమంచి రామలింగారెడ్డి (ముసలమ్మ మరణం), రాయప్రోలు సుబ్బారావు (తృణకంకణం) మొదలైన తెలుగుసాహిత్యపు నవయుగ వైతాళికులు వ్యావహారిక భాషను వాడడం వ్యావహారిక భాషా వాదానికి దారితీసింది. ఆ తరువాత రచనలు, పత్రికలు, రేడియో, దూరదర్శిని, చలన చిత్రాలు మొదలైనవన్నీ కూడా వాడుక భాషనే వాడుతున్నాయి.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 తెలుగు at en:Ethnologue (22nd ed., 2019)
  2. "Statement 1: Abstract of speakers' strength of languages and mother tongues - 2011". www.censusindia.gov.in. Office of the Registrar General & Census Commissioner, India. Retrieved 2018-07-07.
  3. "West Bengal shows 'Mamata' to Telugus". The Hans India (in ఇంగ్లీష్). 2020-12-24. Retrieved 2020-12-31.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. "Constitution of the Republic of South Africa, 1996 - Chapter 1: Founding Provisions". www.gov.za. Retrieved 6 December 2014.
  5. "Schools, Colleges called for a shutdown in Telugu states". Archived from the original on 2017-10-11. Retrieved 2021-06-10.
  6. "Making Telugu compulsory: Mother tongues, the last stronghold against Hindi imposition".
  7. "Declaration of Telugu and Kannada as classical languages". Press Information Bureau. Ministry of Tourism and Culture, Government of India. Archived from the original on 16 December 2008. Retrieved 31 October 2008.
  8. "Telugu gets classical status". The Times of India. 1 October 2008. Archived from the original on 2008-11-04. Retrieved 1 November 2008.
  9. "Abstract of speakers' strength of languages and mother tongues – 2000". Census of India, 2001. Archived from the original on 29 October 2013.
  10. "Infographic: A World of Languages". Retrieved 2 June 2018.
  11. "Summary by language size". Ethnologue.
  12. "PART A Languages specified in the Eighth Schedule (Scheduled Languages)". Archived from the original on 2013-10-29.
  13. "How to Become an English to Telugu translator?". Archived from the original on 2019-10-29.
  14. Morrison, T (1997). "Inscriptions as Artifacts: Precolonial South India and the Analysis of Texts" (PDF). Journal of Archaeological Method and Theory. 4 (3/4). Springer: 218. doi:10.1007/BF02428062. ISSN 1072-5369. Archived from the original (PDF) on 19 February 2017.
  15. Rao & Shulman 2002, Chapter 2.
  16. Parpola, Asko (2015), The Roots of Hinduism: The Early Aryans and the Indus Civilization, Oxford University Press, p. 167, ISBN 978-0190226923
  17. Chenchiah, P.; Rao, Raja M. Bhujanga (1988). A History of Telugu Literature. Asian Educational Services. p. 55. ISBN 978-81-206-0313-4.
  18. Brown, Charles P. (1839), "Essay on the Language and Literature of Telugus", Madras Journal of Literature and Science, vol. X, Vepery mission Press., p. 53
  19. Sekaram, Kandavalli Balendu (1973), The Andhras through the ages, Sri Saraswati Book Depot, p. 4, The easier and more ancient "Telugu" appears to have been converted here into the impressive Sanskrit word Trilinga, and making use of its enormous prestige as the classical language, the theory was put forth that the word Trilinga is the mother and not the child.
  20. Caldwell, Robert (1856), A Comparative Grammar of the Dravidian or South-Indian Family of Languages (PDF), London: Harrison, p. 64
  21. Telugu Basha Charitra. Osmania University. 1979.
  22. The Dravidian Languages – Bhadriraju Krishnamurti.
  23. Rao & Shulman 2002, Introduction.
  24. "తెలుగు-తేనెకన్నాతీయనిది, మైక్రోసాఫ్ట్ భాషాఇండియాలో వ్యాసం". Archived from the original on 2010-10-29. Retrieved 2010-10-12.
  25. 25.0 25.1 Bhadriraju, Krishnamurti (2003). The Dravidian Languages. Cambridge: Cambridge University Press. ISBN 0-521-77111-0.
  26. telugu, NT News; మామిడి, హరికృష్ణ (2022-10-23). "మట్టి పరిమళాల సహజ భాష". Namasthe Telangana. Archived from the original on 2022-10-23. Retrieved 2022-10-23.
  27. "Evolution of Telugu Character Graphs". మెమోరియల్ యూనివర్సిటీ. Archived from the original on 2009-09-23. Retrieved 2013-07-22.
  28. Vasant Shinde (2019-09-05). "An Ancient Harappan Genome Lacks Ancestry from Steppe Pastoralists or Iranian Farmers". doi:10.1016/j.cell.2019.08.048.
  29. జి.వి.సుబ్రహ్మణ్యం కూర్చిన "తెలుగుతల్లి" కవితా సంకలనంలో ఇవ్వబడినది'
  30. తెలుగు సంస్కృతి - మల్లంపల్లి సోమశేఖర శర్మ వ్యాసము
  31. బి.యస్.యల్, హనుమంతరావు (2012). ఆంధ్రుల చరిత్ర. విశాలాంధ్ర. pp. 19–21.
  32. Ancient India: English translation of Kitab-ul Hind by Al-Biruni, National Book Trust, New Delhi.
  33. వెంకట లక్ష్మణరావు, కొమర్రాజు (1910). "త్రిలింగము నుండి తెలుగు పుట్టెనా? లేక తెలుగు నుండి త్రిలింగము పుట్టెనా?". ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక: 81. Retrieved 6 March 2015.
  34. చిలుకూరి నారాయణరావు (1937). ఆంధ్ర భాషా చరిత్రము 1-వ భాగము. వాల్తేరు: ఆంధ్ర విశ్వకళా పరిషత్తు.
  35. రాతమార్చిన అంతర్జాలం- సురేష్ కొలిచాల Archived 2013-09-03 at the Wayback Machine తెలుగు వెలుగు ఆగష్టు 2013 పే 32
  36. వి.వి, వేంకటరమణ (2019-11-11). "తెలుగు కంప్యూటర్ టెక్నాలజీ తీరు తెన్నూ" (PDF). Archived (PDF) from the original on 2022-01-24. Retrieved 2022-01-24.
  37. బూదరాజు, రాధాకృష్ణ. "ప్రకరణం 9:ఆధునిక యుగం: గ్రాంథిక, వ్యావహారిక వాదాలు" (PDF). In భద్రిరాజు కృష్ణమూర్తి (ed.). తెలుగు భాషా చరిత్ర. Archived from the original (PDF) on 2007-09-27. Retrieved 2007-08-28.

ఉపయుక్త గ్రంథసూచి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]
Wikisource
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు:
"https://te.wikipedia.org/w/index.php?title=తెలుగు&oldid=4334234" నుండి వెలికితీశారు