మందాడి ప్రభాకర రెడ్డి
డాక్టర్. ప్రభాకర రెడ్డి | |
---|---|
జననం | మందాడి ప్రభాకర రెడ్డి 1935 అక్టోబరు 8 |
మరణం | 1997 నవంబరు 26 | (వయసు 62)
విద్య | వైద్యవిద్య |
వృత్తి | నటుడు, రచయిత, వైద్యుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1960-1988 |
పిల్లలు | గంగ, శైలజ, లక్ష్మి, విశాలాక్షి[1] |
తల్లిదండ్రులు |
|
ఎం. ప్రభాకర రెడ్డి గా ప్రసిద్ధులైన డాక్టర్ మందాడి ప్రభాకర రెడ్డి (అక్టోబర్ 8, 1935 - నవంబర్ 26, 1997) తెలుగు సినిమా నటుడు, కథా రచయిత. స్వతహాగా వైద్యుడు అయినా నటన పై గల అనురక్తితో చాలా తెలుగు చిత్రాలలో నటించాడు. కొన్ని హిందీ, తమిళ చిత్రాలలో కూడా నటించాడు. ఎక్కువగా ప్రతినాయక పాత్రలలో నటించాడు. 37 ఏళ్ల కెరీర్‌లో 500కు పైగా సినిమాల్లో నట్టించిన నటుడు, దర్శకుడు, నిర్మాత కూడా. కార్తీక దీపం వంటి అనేక సినిమాలకు కథలను అందించాడు.[2]
ఎన్టీఆర్, ఏఎన్నార్ సహా చిరంజీవి వరకు కూడా చాలా మంది సినిమాల్లో విలన్‌గానే కాకుండా అనేక పాత్రల్లో నటించాడు ప్రభాకర రెడ్డి. ఈయన కేవలం నటుడు మాత్రమే కాదు అంతకంటే అద్భుతమైన వైద్యుడు కూడా. ఓ వైపు వైద్యవృత్తితో పాటు నటనలోనూ సత్తా చూపించారు ఈయన. తెలుగు సినీ పరిశ్రమ ఒకప్పుడు మద్రాస్‌లోనే ఉండేది. 90ల మొదట్లో దాన్ని హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. దానికోసం ఎన్టీఆర్, ఏఎన్నార్ సహా చాలా మంది ఎంతో కృషి చేసారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో స్టూడియోలు నిర్మించడం.. సినిమా హాల్స్ కట్టడం లాంటివి చేసారు. అలాంటి సమయంలో ప్రభాకర రెడ్డి మాత్రం పేద సినీ కళాకారుల కోసం తన 10 ఎకరాల పొలం ఇచ్చేసారు. అది కూడా ఉచితంగా.. అలా కట్టుకున్న కాలనీనే ఇప్పుడు చెప్పుకుంటున్న చిత్రపురి కాలనీ. అందుకే దానికి ప్రభాకర రెడ్డి చిత్రపురి కాలనీ అంటారు. ఇక్కడ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నాడు ఆయన 10 ఎకరాలను దానం చేసాడు. అందుకనే హైదరాబాదు లోని మణికొండలో ఈయన స్మారకార్ధం డా. ప్రభాకరరెడ్డి చలనచిత్ర కార్మిక చిత్రపురికి ఈయన పేరుపెట్టారు.
జీవిత సంగ్రహం
[మార్చు]ప్రభాకరరెడ్డి, సూర్యాపేట జిల్లా, తుంగతుర్తిలో లక్ష్మారెడ్డి, కౌసల్య దంపతులకు 1935, అక్టోబర్ 8 న జన్మించాడు. తుంగతుర్తిలో ప్రాథమిక విద్యాభ్యాసం తర్వాత హైదరాబాదులోని సిటీ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివాడు. 1955 నుండి1960 వరకు ఉస్మానియా వైద్య కళాశాలలో వైద్యవిద్యను అభ్యసించాడు. 1960లో గుత్తా రామినీడు దర్శకత్వం వహించిన చివరకు మిగిలేది సినిమాతో చిత్రరంగ ప్రవేశం చేశాడు. ఆ సినిమాలో ఒక మానసిక వైద్యుని పాత్ర పోషించాడు. ఈయన సినీ ప్రస్థానంలో మొత్తం 472 సినిమాల్లో నటించాడు. మంచి విజయాలను సాధించిన పండంటి కాపురం, పచ్చని సంసారం, ధర్మాత్ముడు, గృహప్రవేశం, గాంధీ పుట్టిన దేశం, కార్తీకదీపం, నాకు స్వతంత్రం వచ్చింది వంటి సినిమాలతో పాటు మొత్తం 21 తెలుగు సినిమాలకు కథలను అందించాడు.
1996లో కామ్రేడ్ అనే సినిమాకు కథను అందించి దర్శకత్వం వహించాడు. ఆ సినిమాలో కె.జి.సత్యమూర్తి, మాస్టర్జీ పాటలున్నాయి.
ప్రభాకరరెడ్డి 1997, నవంబరు 26[3] తేదీన తన 62వ యేట హైదరాబాదులో మరణించాడు.
పురస్కారాలు
[మార్చు]- 1981 - నంది ఉత్తమ నటుడు - పల్లె పిలిచింది చిత్రం లోని నటనకు
- 1980 - నంది ఉత్తమ నటుడు - యువతరం కదిలింది చిత్రం లోని నటనకు
- 1990లో చిన్నకోడలు సినిమాలో ఉత్తమసహాయ నటుడిగా నంది పురస్కారం అందుకున్నాడు
- ఉత్తమ కథారచయితగా గృహప్రవేశం, గాంధీ పుట్టిన దేశం సినిమాలకు నంది పురస్కారాలను అందుకున్నాడు.
నటించిన చిత్రాలు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Sakshi (25 July 2021). "'నాన్న మూడుసార్లు 'మా' అధ్యక్షుడిగా చేశాడు, వాళ్లకి పెన్షన్ ఇచ్చేవారు'". Archived from the original on 26 November 2022. Retrieved 26 November 2022.
- ↑ Chauhan, Ramesh (31 December 2016). "డాక్టర్ యాక్టర్... తెలంగాణ తేజం". Mana Telangana. Archived from the original on 26 November 2022. Retrieved 26 November 2022.
- ↑ "బహుముఖ ప్రతిభావంతుడు - హెచ్.రమేష్ బాబు - నవతెలంగాణ - సోపతి - 29-11-2015". Archived from the original on 2016-09-13. Retrieved 2020-06-18.