Jump to content

తిరుమల బ్రహ్మోత్సవాలు

వికీపీడియా నుండి
(తిరుమల ఆర్జిత బ్రహ్మోత్సవం నుండి దారిమార్పు చెందింది)
తిరుమల బ్రహ్మోత్సవాలు

తిరుమలేశుని ఆలయంలో నిత్యకళ్యాణం-పచ్చతోరణమే బ్రహ్మోత్సవాలకు ఎంతో విశిష్టత ఉంది. స్వామివారికి తొలిసారిగా ఈ బ్రహ్మోత్సవాన్ని సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే జరిపించినట్లు భవిష్యోత్తర పురాణం పేర్కొంటోంది. బ్రహ్మదేవుడు స్వయంగా ఆరంభించిన ఉత్సవాలు కావటంతో, ఇవి 'బ్రహ్మోత్సవాలు' అయ్యాయని అంటారు. మరో వ్యాఖ్యానం ప్రకారమైతే- నవాహ్నిక దీక్షతో, నవబ్రహ్మలు తొమ్మిది రోజులు జరిపించే ఉత్సవాలు కాబట్టి ఇవి 'బ్రహ్మోత్సవాలు'. అసలీ ఉత్సవాలకూ బ్రహ్మదేవుడికీ సంబంధంలేదనీ తిరుమలలో జరిగే మిగిలిన ఉత్సవాలతో పోలిస్తే, ఇవి చాలా పెద్దయెత్తున జరిగేవి కాబట్టి వీటిని 'బ్రహ్మోత్సవాలు' అంటారనీ ఇంకొందరి భావన. ఈ ఉత్సవాలన్నీ పరబ్రహ్మస్వరూపుడైన శ్రీవారికి చేసే గొప్ప ఉత్సవాలు కాబట్టి వీటిని 'బ్రహ్మోత్సవాలు' అంటున్నారని మరికొందరి భావన.

బ్రహ్మోత్సవాలలో రకాలు

[మార్చు]

శ్రీవారి బ్రహ్మోత్సవాలు మొత్తం 9 రోజులు కన్నులపండువగా జరుగుతాయి. 'నానాదిక్కులెల్ల నరులెల్ల వానలలోనే వత్తురు కదిలి' అంటూ అన్నమాచార్యుడు వర్ణించిన తీరులో- అన్ని ప్రాంతాల భక్తులు ఈ ఉత్సవాలను దర్శించి తరించేందుకు తండోపతండాలుగా వస్తారు. స్వామివారికి జరిగే బ్రహ్మోత్సవాలను కనులారా తిలకించి, భక్తిపారవశ్యంతో పునీతులవుతారు.

నిత్య బ్రహ్మోత్సవం

[మార్చు]

ప్రతి సంవత్సరం నిర్ధారిత మాసంలో నిర్ధారిత నక్షత్ర ప్రధానంగా జరిగేవి నిత్య బ్రహ్మోత్సవాలు. ఇవి మూడురోజులుగానీ అయిదు, ఏడు, తొమ్మిది, పదకొండు, పదమూడు రోజులుగానీ జరుగుతాయి.

శాంతి బ్రహ్మోత్సవం

[మార్చు]

కరవు, కాటకాలు, భయాలు, ప్రమాదాలు, వ్యాధులు, గ్రహపీడల నివారణ కోసం ప్రత్యేకంగా జరిపించేవి 'శాంతి బ్రహ్మోత్సవాలు'. ఇలాంటి శాంతి బ్రహ్మోత్సవాలను గత చరిత్రకాలంలో చాలామంది ప్రభువులు, దేశ, ప్రాంత, జనహితార్థం అయిదు రోజులపాటు నిర్వహించిన దాఖలాలు అనేకంగా ఉన్నాయి.

శ్రద్ధా బ్రహ్మోత్సవాలు

[మార్చు]

ఎవరైనా భక్తుడు, తగినంత ధనాన్ని దేవస్థానంలో, దైవసన్నిధిలో సమర్పించి, భక్తిశ్రద్ధలతో జరిపించుకొనేది 'శ్రద్ధా బ్రహ్మోత్సవం'. శ్రీవారి ఆలయంలో ఇలాంటి శ్రద్ధా బ్రహ్మోత్సవాలను 'ఆర్జిత బ్రహ్మోత్సవాలు'గా పేర్కొంటున్నారు.

ఒకరోజు బ్రహ్మోత్సవం

[మార్చు]

రథసప్తమి రోజు స్వామిని సప్తవాహనాలలో ఊరేగిస్తారు. అందువల్ల దీనిని ఒకరోజు బ్రహ్మోత్సవమని చెబుతారు. సూర్యప్రభ వాహనంతో ప్రారంభించి, చిన్నశేష వాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనంలో స్వామిని ఊరేగిస్తారు. చక్రస్నానానంతరం కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలలో ఊరేగిస్తారు. సప్తాశ్వాల, సప్తమి నాటి, సప్తవారాల సంకేతంగా సూర్యుడు పుట్టినప్పుడు ఈ ఉత్సవం జరుగుతుంది.

అంకురార్పణ

[మార్చు]

స్వామివారి బ్రహ్మోత్సవాలు 'అంకురార్పణ'తో ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాల ఆరంభదినానికి ముందురోజుగానీ మూడు రోజులు, అయిదు రోజులు, ఏడు రోజులు, తొమ్మిదిరోజుల ముందుగానీ అంకురార్పణ జరుగుతుంది. ఇలా నిర్ధారితమైన రోజున, బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించేందుకై స్వామివారి సేనాధిపతి విష్వక్సేనుడు, ఆలయంలో నైరుతిథిశలో ఉన్న వసంత మండపానికి విచ్చేస్తారు. ఆ తర్వాత, నిర్ణీత పునీత ప్రదేశంలో, భూదేవి ఆకారాన్ని లిఖించి, ఆ ఆకారమునందు లలాట, బాహు, స్తన ప్రదేశాలనుంచి మట్టిని తీసి, స్వామివారి ఆలయంలోకి వస్తారు. దీన్నే 'మత్సంగ్రహణం' అంటారు. యాగశాలలో, ఈ మట్టితో నింపిన తొమ్మిది పాళికలలో- శాలి, వ్రహి, యవ, ముద్గ, మాష, ప్రియంగు మొదలగు నవధాన్యాలను పోసి, పూజలు చేస్తారు. ఈ కార్యక్రమానికంతా సోముడు (చంద్రుడు) అధిపతి. శుక్లపక్ష చంద్రునిలా పాళికలలోని నవధాన్యాలు సైతం దినదినాభివృద్ధి చెందాలని ప్రార్థిస్తారు. అందుకే ఈ వేడుకలన్నీ శుక్లపక్షంలో జరుగుతాయి. పాళికలలో వేయగా మిగిలిన మట్టితో యజ్ఞకుండాలను నిర్మిస్తారు. తర్వాత పూర్ణకుంభ ప్రతిష్ఠ జరుగుతుంది. పాళికలలో వేసిన నవధాన్యాలకు నిత్యం నీరుపోసి, అవి పచ్చగా మొలకెత్తేలా జాగ్రత్తపడతారు. అంకురాలను ఆరోపింపజేసే కార్యక్రమం కాబట్టి ఇదే 'అంకురార్పణ' అయింది.

మొదటి రోజు

[మార్చు]
వేంకటేశ్వరుడికి ముందుగా ఊరేగింపుకు వచ్చే బ్రహ్మరధం

ధ్వజారోహణం

[మార్చు]

బ్రహ్మోత్సవాలు ఆరంభమయ్యే తొలిరోజున జరిగే ఉత్సవం 'ధ్వజారోహణం'. ఆరోజు ఉదయం స్వామివారికి సుప్రభాత, తోమాలసేవలు జరిగాక శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామికి ఏకాంతంగా తిరుమంజన ప్రక్రియ చేసి, నైవేద్యం సమర్పిస్తారు. ఆలయసన్నిధిలోని ధ్వజస్తంభంమీద పతాకావిష్కరణ చేస్తారు. స్వామివారి వాహనం గరుడుడు కాబట్టి, ఒక కొత్త వస్త్రంమీద గరుడుడి బొమ్మ చిత్రీకరించి సిద్ధంగా ఉంచుతారు. దీన్ని 'గరుడధ్వజపటం' అంటారు. దీన్ని ధ్వజస్తంభంమీద కట్టేందుకు నూలుతో చేసిన కొడితాడును సిద్ధం చేస్తారు. గరుడధ్వజపటాన్ని ఊరేగించి, ధ్వజస్తంభం వద్దకు తెచ్చి, ఉత్సవ మూర్తులైన భోగ శ్రీనివాసుడు, శ్రీదేవి, భూదేవిల సమక్షంలో- గోధూళి లగ్నమైన మీన లగ్నంలో కొడితాడుకు కట్టి పైకి చేరుస్తారు. ధ్వజస్తంభం మీద ఎగిరే గరుడ పతాకమే- సకల దేవతలకు స్వామివారి బ్రహ్మోత్సవాల ఆహ్వానపత్రం. అష్టదిక్పాలకులు, భూత, ప్రేత, యక్ష, రాక్షస, గంధర్వగణాలకూ ఇదే ఆహ్వానం. ఈ ఆహ్వానం అంది విచ్చేసిన దేవ, రాక్షసగణాలకు, వారివారి నిర్ణీత స్థలాలను కేటాయించి, పద్ధతి ప్రకారం, వారి నియమాల ప్రకారం నైవేద్యం రూపంలో బలిని సమర్పిస్తారు. దీంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఆరంభమైనట్లే.

వేంకటేశ్వర స్వామీ వార్లకు మొదటి రోజు కట్టేపంచెలను తెలంగాణా రాష్ట్రములోని " జోగులాంబ గద్వాల్ " జిల్లాకు చెందిన చేనేత కార్మికులు నెల రోజుల పాటు నియమనిష్టలతో నేసిన పంచెల్ని వేంకటేశ్వర స్వామీ వార్లకు కట్టించే సాంప్రదాయాన్ని గద్వాల రాజులు 350 ఏళ్ల క్రితం కొనసాగిస్తే, వారి వారసులు నేటీకి గద్వాల చేనేత కార్మికులతో పంచెలు నేయించి తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానమునకు సమర్పిసున్నారు . ఈ పంచెల్ని కట్టిన తర్వాత అర్చకులు స్వామి చెవిలో మూడు సార్లు " గద్వాల ఏరువాడ జోడు పంచెలు వచ్చాయి " అని చెపుతారు , ఆ తరువాత స్వామికి గద్వాల సంస్థానము వారితో హారతి ఇప్పించడము ఒక సాంప్రదాయముగా వస్తున్నది . నడిగడ్డగా పిలిచే గద్వాల ప్రాంతము కృష్ణా , తుంగభద్ర నదుల మధ్యలో ఉండటము వలన ఏరువాడగా , రెండు పంచెలు కాబట్టి జోడు అనే పదము వచ్చినదని చేనేత కార్మికులు చెప్పుతారు . వీటిని నేయడానికి నాణ్యమైన పట్టును , మిగితా భాగము నూలును వాడతారు . దీనికి అనుగుణముగా పంచేల అంచులకు ఎక్కువ భాగం ఎరుపు, ఆ పైన ఆకుపచ్చ , బంగారు వర్ణముల పట్టు వాడతారు . ఈ పంచెలు ఒక్కొకటి పది మీటర్ల పొడవు, రెండున్నర మీటర్ల వెడల్పుతో నేస్తారు.[1]

రెండో రోజు

[మార్చు]

శేషవాహనం

[మార్చు]

ధ్వజారోహణం తర్వాత, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామిని పుష్పమాలాలంకృతుల్ని చేసి, వాహన మంటపంలో ఉన్న పెద్ద శేష వాహనంపై ఊరేగిస్తారు. అనంతరం ఉత్సవమూర్తులను రంగనాయక మంటపంలో విశ్రమింపజేస్తారు. స్వామి శేషతల్పశాయి. ఆయన కొలువున్న కొండ- శేషాద్రి. అందుకే ఏడు తలలున్న పెద్ద శేషవాహనంపై స్వామివారి ఊరేగింపు బ్రహ్మోత్సవాలలో అతి ప్రధానమైనదిగా పరిగణిస్తారు. వెుదట్లో ఈ పెద్ద శేషవాహనాన్ని తొమ్మిదోరోజు ఉదయంపూటనే ఊరేగింపునకు వినియోగించేవారు. కానీ ఇప్పుడు అది మొదటిరోజుకే వచ్చి చేరింది.

గతంలో స్వామివారి ఊరేగింపునకై రెండు, మూడు, నాలుగు, ఏడోరోజులలో ఎలాంటి వాహనాలనూ వినియోగించేవారు కాదు. కానీ ఇప్పుడారోజుల్లోనూ వాహనసేవ జరుగుతోంది. అందులో భాగంగా రెండోరోజు ఉదయం, ఉత్సవమూర్తిని ఐదు తలలుండే చిన్న శేషవాహనం మీద ఊరేగిస్తారు. పెద్ద శేషవాహనాన్ని ఆదిశేషుడికి ప్రతీకగా భావిస్తే, చిన్న శేషవాహనాన్ని 'వాసుకి'కి ప్రతీకగా పరిగణించటం కద్దు. రోజూ సాయంత్రం వేళలో స్వామివారిని హంస వాహనంమీద వూరేగిస్తారు. ఈ హంసవాహనం మీద స్వామి, విద్యాలక్ష్మీగా వూరేగటం విశేషం.

మూడో రోజు

[మార్చు]
శ్రీవారి సింహ వాహనం

సింహవాహనం

[మార్చు]

మూడోరోజు ఉదయం శ్రీవారికి సింహ వాహనసేవ జరుగుతుంది. ఆ సమయంలో స్వామివారు వజ్రఖచిత కిరీటంతో, సకల ఆభరణాలతో అలంకృతమయి ఉంటారు. జంతుజాలానికి రాజైన సింహాన్ని మృగత్వానికి ప్రతీకగా భావిస్తారు. ప్రతిమనిషి తనలోని మృగత్వాన్ని సంపూర్ణంగా అణచి ఉంచాలనీ తలపైన ఆదిదేవుడిని ధరించాలనీ చెప్పే ప్రతీకగా ఈ సింహవాహనంపై స్వామివారు ఊరేగుతారని భక్తులు భావిస్తారు. ఆరోజు రాత్రి స్వామివారు తన ఉభయ దేవేరులతో కలిసి, అచ్చమైన భోగశ్రీనివాసునిగా ముత్యాలపందిరి వాహనంపై తిరువీధులలో ఊరేగుతారు.

నాలుగవ రోజు

[మార్చు]
శ్రీవారి శేష వాహనం

కల్పవృక్ష వాహనం

[మార్చు]

నాలుగోరోజు ఉదయం, స్వామివారు తన కల్పవృక్ష వాహనంలో భక్తులకు దర్శనం ఇస్తారు. కామితార్థ ప్రదాయినిగా కల్పవృక్షానికి మన పురాణ, ఇతిహాసాలలో ఓ విశిష్ట స్థానం ఉంది. ఆ కల్పవృక్షాన్ని సైతం తన వాహనం చేసుకోగలిగిన శ్రీవారు భక్తుల కొంగు బంగారమన్నది వేరుగా చెప్పేదేముంది! ఆరోజు సాయంత్రం, సర్వభూపాల వాహనంమీద స్వామివారి వూరేగింపు, భక్తులకు కనులవిందుగా సాగుతుంది.

ఐదవ రోజు

[మార్చు]

మోహినీ అవతారం

[మార్చు]

బ్రహ్మోత్సవాలలో నడిమిదైన అయిదోరోజున, స్వామివారు మోహిని అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తారు. ఈ అవతార వూరేగింపు విధానానికి ఓ ప్రత్యేకత ఉంది. మిగిలిన అన్ని వాహనసేవలూ స్వామివారి ఆలయంలోని వాహన మండపంలో ఆరంభమైతే, మోహినీ అవతార వూరేగింపు శ్రీవారి ఆలయంనుంచే పల్లకీపై ఆరంభమవుతుంది. మోహినీ అవతారంలో ఉన్న స్వామి వజ్రాలు, రత్నాలు పొదిగిన హారాన్ని ధరించి, తన కుడిచేతితో చిలుకను పట్టుకొని ఉంటారు. ఈ హారాన్నీ, చిలుకనూ స్వామివారి భక్తురాలైన శ్రీవిల్లి పుత్తూరు ఆండాళ్‌ (గోదాదేవి) నుంచి తెచ్చినట్లుగా చెప్తారు.

గరుడ వాహనం

[మార్చు]
శ్రీవారి గరుడ వాహనం

స్వామివారి ప్రధాన వాహనం గరుడుడు. అందుకే గరుడుడిని 'పెరియ తిరువాడి' (ప్రధాన భక్తుడు, ప్రథమ భక్తుడు) అంటారు. అయిదోరోజు రాత్రి జరిగే ఈ సేవకు ఒక ప్రత్యేకత ఉంది. ఏడాదిలో అన్నిరోజులూ ధ్రువబేరానికి అలంకరించే మకరకంఠి, లక్ష్మీహారం, సహస్రనామ మాలలను గరుడవాహన సేవ రోజున మాత్రం ఉత్సవమూర్తి మలయప్పస్వామికి అలంకరింపజేస్తారు. అలాగే ఈరోజునే, శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న బేడీ ఆంజనేయస్వామి ఆలయం నుంచి రాష్ట్ర ప్రజల తరఫున ముఖ్యమంత్రి సమర్పించే నూతన వస్త్రాలను స్వామివారు స్వీకరిస్తారు. గరుడ వాహనసేవలో స్వామి సరసన దేవేరులు ఉండరు.

ఆరోజు ఉదయం, హనుమద్వాహనసేవ జరుగుతుంది. హనుమంతుడు, శ్రీరాముని నమ్మినబంటు. త్రేతాయుగంలో తనకు అపార సేవలందించిన ఆ భక్తుడిని తాను మర్చిపోలేదంటూ, ఆ బంటుకు మళ్ళీ తన సేవాభాగ్యం కలిగించే దివ్య దృశ్యం ఇది. తాను సైతం ఆ మహావిష్ణువు స్వరూపమేనని భక్తులకు స్వామి తెలియజేసే మధుర సన్నివేశమది.

ఆరవ రోజు

[మార్చు]
శ్రీవారి గజవాహన సేవ

గజవాహనం

[మార్చు]

ఆరో రోజు రాత్రివేళలో- స్వామివారు గజ వాహనం మీద తిరువీధులలో మెరిసి భక్తులను మురిపిస్తారు. పోతనామాత్యుని విరచితమైన శ్రీమద్భాగవతంలోని గజేంద్రమోక్ష ఘట్టాన్ని తలపింపజేస్తూ సాగే వూరేగింపు ఇది. ఆపదలో ఉన్న భక్తులను ఆదుకోవటానికి తానెప్పుడూ సిద్ధమేననీ అలనాడు 'సిరికింజెప్పక, శంఖుచక్ర యుగమున్‌ చేదోయి సంధింపక' వచ్చినా, నేడు భక్తజనుల మొరల్ని వినేందుకు సర్వాలంకారభూషితుడనై వస్తున్నాననీ విశదపరిచే ఘట్టం- గజవాహనసేవ.

ఏడవ రోజు

[మార్చు]
శ్రీవారి రథోత్సవం

సూర్యప్రభ వాహనం

[మార్చు]

ఏడోరోజు ఉదయం- మలయప్పస్వామి సూర్యప్రభ వాహనంలో ఊరేగుతారు. స్వామి రథసారథి అనూరుడు ఆరోజు ఆదిత్యుని రూపంలో సారథ్యం వహిస్తాడు. అదేరోజు సాయంత్రం చంద్రప్రభ వాహనంమీద స్వామి రావటంతో, దివారాత్రాలకు తానే అధినేతనని ప్రకటించినట్లు భక్తులు భావిస్తారు. చంద్రప్రభ వాహనంమీద వచ్చే స్వామి, చంద్రప్రభలకు ప్రతీకలైన తెలుపు వస్త్రాలు, తెల్లని పుష్పాలు, మాలలు ధరించటం విశేషం.

ఎనిమిదవ రోజు

[మార్చు]

రథోత్సవం

[మార్చు]
శ్రీవారి చక్రసాన్నం

ఎనిమిదోరోజు జరిగే రథోత్సవానికి హాజరయ్యేంత భక్తజనం మరేరోజునా కానరారు. భక్తులు ప్రత్యక్షంగా పాలుపంచుకోగలిగే స్వామివారి వాహన సేవ అదే మరి. ఇక రథం విషయానికొస్తే... దానికి సారథి దారుకుడు. సైబ్యం, సుగ్రీవం, మేఘపుష్పం, వాలహకం రథానికి పూన్చిన గుర్రాలు. సకల దేవతామూర్తులతో సర్వాంగ సుందరంగా అలంకరించిన ఆ రథాన్ని అధిరోహించిన మలయప్పస్వామి తిరువీధుల్లో ఊరేగి భక్తులను పరవశింపజేస్తారు.'రథస్థ కేశవం దృష్టా పునర్జన్మ నవిద్యతే' అనేది శృతివాక్యం.

తొమ్మిదవ రోజు

[మార్చు]
శ్రీవారి చక్రస్నాన దర్శనానికి పుష్కరిణిలో హాజరైన భక్తులు

చక్రస్నానం

[మార్చు]

బ్రహ్మోత్సవాలలో చివరిరోజైన తొమ్మిదోనాడు, స్వామివారికి చక్రత్తాళ్వార్‌ రూపంలో చక్రస్నానం చేయిస్తారు. ముందుగా వరాహస్వామి ఆలయ ఆవరణలో శ్రీదేవి, భూదేవితో సహా అభిషేకసేవలు జరిపిస్తారు. ఆ తర్వాత సుదర్శన చక్రానికి స్వామి పుష్కరిణిలో పుణ్యస్నానం చేయిస్తారు. ఇదే 'చక్రస్నాన ఉత్సవం'. చక్రస్నానం జరిగే సమయంలో స్వామి పుష్కరిణిలో స్నానాలు చేస్తే పాపాలు నశిస్తాయని భక్తుల విశ్వాసం.

ధ్వజావరోహణ

[మార్చు]

చక్రస్నానాలు అయిన తర్వాత ఆరోజు సాయంత్రం శ్రీవారి ఆలయ ధ్వజ స్తంభం మీద ఆరోహణ చేసిన గరుడ పతాకాన్ని అవరోహణం (దించడం) చేస్తారు. ఈ అవరోహణంతో బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన సకల దేవతలకూ వీడ్కోలు పలికినట్లే. బ్రహ్మోత్సవాలు సైతం మంగళపూర్వకంగా పరిసమాప్తి చెందినట్లు లెక్క. మళ్ళీ బ్రహ్మోత్సవాలు సరిగ్గా సంవత్సరం తర్వాతే! లక్షలాది భక్తులు ఆ వేడుకల్లో ఆనందంగా పాల్గొనగలిగేది ఏడాది గడిచాకే!! [2]

మూలాలు

[మార్చు]
  1. "Tirupati dresses up for Brahmotsavam - Times Of India". web.archive.org. 2012-10-14. Archived from the original on 2012-10-14. Retrieved 2022-11-29.
  2. Praveen, V N. "Tirumala Brahmotsavam 2022 Dates". Prayanamam. Prayanamam. Retrieved 6 September 2022.

బయటి లింకులు

[మార్చు]