Jump to content

ఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులు

వికీపీడియా నుండి
ఆంధ్రప్రదేశ్‌ జిల్లాల రేఖా పటం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 25 నదులు ఉన్నాయి. గోదావరి, కృష్ణ, పెన్న, నాగావళి, వంశధార ముఖ్య నదులు.


ఆంధ్రప్రదేశ్‌లో ప్రవహించే నదులు, ఉపనదులు

[మార్చు]

గోదావరి

[మార్చు]
గోదావరి నది పరీవాహక ప్రాంతం

గోదావరి నది, తొలుత మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో త్రయంబకేశ్వరంలో పుట్టింది.[1] భారతదేశంలో రెండవ పొడవైన నది గోదావరి. దీని మూలం ఇది మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్ లో పుట్టింది.[2] ఇది 1,465 కి.మీ. (910 మైళ్ళు) తూర్పుకు ప్రవహిస్తుంది.దీని ప్రవాహం అది ప్రవహించే ప్రయాణ మార్గంలో మహారాష్ట్రలో (48.6%), తెలంగాణలో (18.8%), ఆంధ్రప్రదేశ్‌లో (4.5%), ఛత్తీస్‌గడ్లో (10.9%), ఒడిశాలో (5.7%) కి. మీ. దూరం ప్రయాణించి, చివరిలో విస్తారమైన ఉపనదుల ద్వారా బంగాళాఖాతం కలుస్తుంది.[3] ఈ నది 312. 812 చదరపు కి.మీ. (120.777 చదరపు మైళ్ళు) విస్తీర్ణం కలిగి ఉంది. ఇది భారత ఉపఖండంలోని అతిపెద్ద నదీ పరీవాహక ప్రాంతాలలో ఒకటిగా ఉంది, గంగా, సింధు నదులు మాత్రమే పెద్ద పారుదల విస్తీర్ణం కలిగి ఉన్నాయి.[4] పొడవు,పరీవాహక ప్రాంత పరంగా గోదావరి ద్వీపకల్పం భారతదేశంలో అతిపెద్దది, దీనిని దక్షిణా గంగా అని కూడా అంటారు.[5][6]

నదిలో పుష్కరాల సమయంలో భక్తులు స్నానాలు

ఈ నది అనేక సహస్రాబ్దాలుగా హిందూ మత గ్రంథాలలో ప్రస్తావించబడతుంది.అంతేగాదు గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని కలిగిఉంది, పోషిస్తుంది.గత కొన్ని దశాబ్దాలుగా నది మీద అనేక బ్యారేజీలు,ఆనకట్టల ద్వారా నీటిపారుదలను నియంత్రించబడుతుంది. దీని విస్తృత నది డెల్టాలో చదరపు కి.మీ.కు 729 మంది వ్యక్తులు ఉన్నారు. ఇది భారతీయ సగటు జనాభా సాంద్రతకు దాదాపు రెండింతలు ఉంటుంది.అధిక వర్షపాతం వలన నదికి వరదలు సంభవించే ప్రమాదం ఉంది.ఇది ప్రపంచ సముద్ర మట్టం పెరిగేకొద్దీ దిగువ భాగాలలో తీవ్రతరం అవుతుంది[7][8] గోదావరి నదికి ప్రతి 12 ఏళ్లకు ఒకసారి 12 రోజులు పుష్కరాలు జరుగుతాయి.ఈ పుష్కరాలలో రెండు తెలుగు రాష్ట్రాలనండి,పొరుగు రాష్ట్రాల నుండి భక్తులు లక్షల సంఖ్యలో పాల్గొంటారు.

కృష్ణా

[మార్చు]
కృష్ణానది జన్మించిన ప్రదేశం (మహాబలేశ్వర్)

కృష్ణా నదిని, కృష్ణవేణి అని కూడా అంటారు. ఇది మహారాష్ట్రలోని మహాబలేశ్వర్‌కు సమీపంలోని పడమటికనుమలలో మహాదేవ్ పర్వతశ్రేణిలో సముద్ర మట్టానికి సుమారు 1,300 మీటర్ల (4,300 అడుగులు) ఎత్తులో ఉద్భవించింది. ఇది భారతదేశంలో పొడవైన నదులలో ఒకటి. కృష్ణ నది పొడవు 1,400 కి. మీ. (870 మైళ్ళు) మహారాష్ట్రలో 282 కి. మీ. (175 మైళ్ళు) ప్రవహిస్తుంది.నది మూలం మహారాష్ట్రలోని సతారా జిల్లా, వాయి తాలూకాకు ఉత్తరాన, జోర్ గ్రామానికి సమీపంలో ఉన్న మహాబలేశ్వర్ వద్ద ఉంది. తూర్పు తీరంలో ఆంధ్రప్రదేశ్‌లోని హంసలదీవి (కోడూరు సమీపంలో) వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.ఇది తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే ముందు కర్ణాటక రాష్ట్రం గుండా ప్రవహిస్తుంది.ఈ నది డెల్టా భారతదేశంలో అత్యంత సారవంతమైన ప్రాంతాలలో ఒకటి.ఆంధ్రప్రదేశ్‌లోని అతిపెద్ద నగరం విజయవాడ కృష్ణానదీ తీరానఉంది. శ్రీశైలం డాం, నాగార్జునసాగర్ డాం ఈ నదిపై నిర్మించబడినవి.గంగా, గోదావరి, బ్రహ్మపుత్ర నదుల తరువాత భారతదేశంలో నీటి ప్రవాహం,నదీ పరీవాహక ప్రాంతాల పరంగా కృష్ణ నది నాల్గవ అతిపెద్ద నది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు నీటిపారుదల ప్రధాన వనరులలో ఇది ఒకటి[9]

తుంగభద్ర

[మార్చు]
కర్నూలు వద్ద తుంగభద్ర నది

తుంగభద్ర నది, కర్ణాటక రాష్ట్రం పశ్చిమ కనుములలో తుంగ,భద్ర అనే రెండు నదులుగా ఆవిర్భవించినవి.రెండు కలసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య సరిహద్దులో ప్రవహించే ముందు, చివరికి కర్నూలు జిల్లాలోని సంగమేశ్వరం గ్రామానికి సమీపంలో ఉన్న కృష్ణా నదిలో కలుస్తుంది.రెండు నదులు కలసినందున దీనికి తుంగభద్ర అని పేరు వచ్చింది తుంగభద్రా నది మీద కర్ణాటక రాష్ట్రంలో హోస్పేట వద్ద ఆనకట్ట నిర్మించబడింది.రామాయణ ఇతిహాసంలో, తుంగాభద్ర నదిని పంప అనే పేరుతో వ్యవహరించబడింది.ఈ నదీ తీరాన మంత్రాలయం అనే పుణ్యక్షేత్రం ఉంది.

పెన్నా

[మార్చు]
గండికోటవద్ద పెన్నా నది.

పెన్నా నదిని పెన్నార్, పెన్నేర్, పెన్నేరు, ఉత్తర పినాకిని అని కూడా అంటుంటారు. పెన్నానది కర్ణాటక రాష్ట్రం, మైసూరు జిల్లాలోని నంది కొండలలో పుట్టి, తూర్పు దిశగా ప్రవహించి, అనంతపురం జిల్లాలోని హిందూపూర్ వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర్రంలో ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి అనంతపురం, వైఎస్ఆర్, నెల్లూరు జిల్లాల్లో 597 కి.మీ. ప్రవహిచి నెల్లూరుకు ఈశాన్యంగా 20 కి.మీ. దూరంలో ఊటుకూరు దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది.

దీని ప్రవాహ విస్తీర్ణం (బేసిన్) కర్ణాటకలో 6,937 చ. కి.మీ., ఆంధ్రప్రదేశ్‌లో 48,276 చ. కి. మీ. మొత్తం కలిపి 55,213 చ. కి. మీ. ఉంది.[10]

కిన్నెరసాని

[మార్చు]

కిన్నెరసాని నది, తెలంగాణలోని వరంగల్, భద్రాద్రి జిల్లాల గుందా ప్రవహించి, భద్రాచలానికి కాస్త దిగువన, పశ్చిమ గోదావరి జిల్లాలో బూర్గంపాడు, వేలేరు గ్రామాల మధ్యన గోదావరిలో కలుస్తుంది.[11] ఇది గోదావరికి ముఖ్యమైన ఉపనది.తెలంగాణ రాష్ట్రం,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,పాల్వంచ వద్ద ఈ నదిపై కిన్నెరసాని ఆనకట్ట అని పిలువబడే ఆనకట్టను ఈ నదిపై నిర్మించారు.ఆనకట్ట యొక్క వెనుక జలాలు చుట్టుపక్కల కొండలతో చుట్టుముట్టబడి కిన్నెరసాని వన్యప్రాణులను అభయారణ్యం పరిసరాల్లో రక్షించబడతాయి.ఈ నది తెలంగాణలోని గోదావరి కుడి ఒడ్డున ప్రవహిస్తుంది.ప్రధాన గోదావరి నదితో సంగమం కావడానికి ముందు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య సాధారణ సరిహద్దును ఏర్పరుస్తుంది.

కుందేరు

[మార్చు]

కుందేరు నది కర్నూలు జిల్లాలోని ఎర్రమల కొండలలో ఉద్బవించింది.అక్కడ నుండి దక్షిణ దిశలో ప్రవహించి వైఎస్ఆర్ జిల్లాలోని కమలాపురం వద్ద పెన్నా నదిలో కలుస్తుంది. నంద్యాల పట్టణం కుందేరు నది తీరాన ఉంది. కుందేరు నదిని కుందూ, కుముద్వతి అని కూడా వ్యవహరిస్తారు.

గుండ్లకమ్మ

[మార్చు]

గుండ్లకమ్మ నది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు- మధ్య భాగం గుండా ప్రవహించే కాలానుగుణ జలమార్గం.తూర్పు కనుమల శాఖకు చెందిన నల్లమల అడవులలోని కొండలలో కర్నూలు జిల్లా, నంద్యాల, ఆత్మకూరు మండలాల సరిహద్దులో గుండ్ల బ్రహ్మేశ్వరం వద్ద 800 మీటర్ల (2900 అడుగులు) ఎత్తులో పుడుతుంది. దీని ప్రధాన రిజర్వాయర్ సముద్రమట్టానికి 425 మీటర్ల ఎత్తులో ప్రకాశం జిల్లాలోని అర్ధవీడు గ్రామానికి 6 కి.మీ. దూరంలో ఉంది.దట్టమైన అటవీ కొండల నుండి అనేక వంపుల తిరుగుతూ ప్రయాణించేటప్పుడు అనేక పర్వత ప్రవాహాలు దీనిలో కలుస్తాయి. ఇది ఉత్తర ఈశాన్య దిశగా ప్రవహిస్తుంది. కుంభం పట్టణం సమీపంలో ఉన్న మైదానంలోకి ప్రవేశించి.అదే పేరుగల పట్టణం గుండా ప్రవహిస్తుంది. నల్లమల కొండల నుండి ఉద్భవించిన అన్ని నదులలో గుండ్లకమ్మ అతిపెద్దది.

గోస్తినీ

[మార్చు]
భీమునిపట్నం వద్ద గొస్తినీ నది బంగాళాఖాతంలో కలయక దృశ్యం
సరిపల్లి వద్ద చంపావతి నది

గోస్తినీ నది, తూర్పు కనుమలలోని అనంతగిరి కొండలలో జన్మించింది.నది మూలానికి సమీపంలో ఉన్న బొర్రా గుహల గుండా ఈ నది ప్రవహిస్తుంది. భీమునిపట్నం సమీపంలో తీరం ద్వారా బంగాళాఖాతం సముద్రంలో కలవటానికి ముందు 120 కి. మీ. దూరం ప్రవహిస్తుంది.నదీ పరీవాహక ప్రాంతం రెండు తీర జిల్లాలైన విజయనగరం, విశాఖపట్నం జిల్లాల గుండా సాగుతుంది.విశాఖపట్నం జిల్లా మొత్తం వైశాల్యంలో 3% గోస్తినీ నది పరీవాహక విస్తీర్ణం పరిధిలో ఉంది.[12] ఈ నది వర్షాధారం ఆధారపడి ప్రవహిస్తుంది.సగటున 110 సెం.మీ. వర్షపాతం అందుతుంది.ఎక్కువ భాగం నైరుతి రుతుపవనాలపై ఆధారపడి ఉంది.

చంపావతి

[మార్చు]

చంపావతి నది, విజయనగరం జిల్లా, మెంటాడ మండలంలోని ఆండ్ర గ్రామానికి సమీపంలో సముద్ర మట్టానికి 1,200 మీటర్ల ఎత్తులో ఉద్భవించింది.[13] ఈ నది తూర్పువైపుకు ప్రవహిస్తుంది.కొనాడ గ్రామానికి సమీపంలో ఉన్న బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నది విజయనగరం జిల్లాలోని గజపతినగరం, నెల్లిమర్ల, సరిపల్లి, డెంకాడ, పాలెం నాతవలాస గ్రామాల గుండా ప్రవహిస్తుంది. ఈ నదిలో నాలుగు ప్రధాన ఉపనదులు ఎడువంపుల గెడ్డ, చిట్టా గెడ్డ, పోతుల గెడ్డ, గాడి గెడ్డ కలుస్తాయి.దీని పారుదల విస్తీర్ణం 1,410 చ. కి.మీ.ఉంది. 1965 నుండి 1968 మధ్యకాలంలో చంపావతి నది మీద డెంకాడ అనకట్ట నిర్మించబడింది. 5,153 ఎకరాల (20.85 చ. కి. మీ.) అయకట్టుకు సాగునీరు కల్పించడానికి విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని సరిపల్లి గ్రామానికి సమీపంలో ఈ ప్రాజెక్ట్ ఉంది. 6,690 హెక్టార్లకు నీటిపారుదల నీటిని సరఫరా చేయడానికి తారకరామ తీర్థ సాగరం బ్యారేజీని కూడా ఈ నదిపై నిర్మించారు.

చిత్రావతి

[మార్చు]
మహేంద్రతనయ నది
చిత్రావతి నది మీద పార్నపల్లి వద్ద బ్యాలెన్సింగ్ రిజర్వాయరు

చిత్రావతి నది, కర్ణాటక రాష్ట్రంలోని చిక్కబల్లాపూర్‌లో పుట్టి, అదే జిల్లా గుండా ప్రవహించి పెన్నా నదిలో కలిసే ముందు అనంతపురం, వైఎస్ఆర్ జిల్లాలగుండా ప్రవహించి గండికోట వద్ద పెన్నా నదిలో కలుస్తుంది. అందువలన దక్షిణ భారతదేశంలో ఇది అంతర్రాష్ట్ర నదిగా, పెన్నా నదికి ఉపనదిగా పేర్కొంటారు. చిత్రావతి నది ప్రవాహ విస్తీర్ణ పరిమాణం (బేసిన్) 5,900 చ.కి.మీ. ఉంది. యాత్రాస్థలం పుట్టపర్తి దీని ఒడ్డునే ఉంది.[14]

మహేంద్రతనయ

[మార్చు]

మహేంద్రతనయ నది, ఒడిషా రాష్ట్రం, గజపతి జిల్లాలోని తుపారసింగి గ్రామం వద్ద మహేంద్రగిరి కొండల్లో పుట్టి గజపతి, రాయగడ జిల్లాల గుండా ప్రవహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో అడుగుపెడుతుంది. మహేంద్రతనయ నది శ్రీకాకుళం జిల్లాలో మధ్య తరహా నది.మహేంద్రతనయ నది వంశధార నదికి ప్రధాన ఉపనది,ఇది మహేంద్రగిరి కొండల నుండి ఉద్భవించింది.అందువలననే ఈ నదిని మహేంద్రతనయ అనే పేరు సార్థకంమైంది. నది పొడవు 90 కి.మీ. (56 మైళ్ళు) ఉంది.[15] ఈ నది శ్రీకాకుళం జిల్లా,సోంపేట మండలం, బారువ గ్రామం సమీపంలోని బంగాళాఖాతంలో విలీనం అవుతుంది.[16]

చెయ్యేరు

[మార్చు]
చెయ్యేరు నది

చెయ్యేరు నది, చిత్తూరు జిల్లాలో ఉద్భవించిన బాహుద, పంచ నదుల సంగమం ద్వారా చెయ్యేరు నది ఏర్పడింది. చెయ్యేరు నది పెన్నా నదికి ఉపనది. చెయ్యేరు నది కడప, చిత్తూరు జిల్లాల గుండా ప్రవహిస్తుంది. ఈ నది మీద బాదనగడ్డ వద్ద అన్నమయ్య ప్రాజెక్టు నిర్మించబడింది. వైఎస్ఆర్ జిల్లాలోని సిద్ధవటం మండలంలోని గుండ్లమడ వద్ద కుడి ఒడ్డు ఉపనదిగా పెన్నానదిలో చేరే ముందు 87 కి.మీ. దూరం ప్రవహించింది. చెయ్యేరు ఏర్పడటానికి బాహుద, పంచ నదుల రెండు ప్రవాహాలు రాయవరం వద్ద కలుస్తాయి. దీని మొత్తం చదరపు వైశాల్యం 7,325 కి. మీ. ఉంది.[17] గుంజనా నది చెయ్యేరు ఉపనది. గుంజనా లోయ వెంట అనేక పాతరాతియుగంనాటి స్థావరాలు కనుగొనబడ్డాయి. నది పరీవాహక ప్రాంతంలో అనేక ఇరుకు ప్రాంతాలు ఉన్నాయి. నది పెద్ద ప్రవాహంగా మారి బాలరాజుపల్లి మీదుగా నాపరాతి ప్రదేశంలో ప్రయాణిస్తుంది. నదీ ప్రవాహంలో ఎక్కువగా నాపరాయి ముక్కలు వున్నాయి.[18] ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అత్తిరాల ఈ నదీతీరాన్నే వెలసింది.

తాండవ నది

[మార్చు]
తుని పట్టణం వద్ద తాండవ నది

తాండవనది, తూర్పు కనుమలలో పుట్టింది.ఇది విశాఖపట్నం జిల్లా,పాయకరావుపేట మండలం,  తునికి సమీపంలో పెంటకోట గ్రామం దగ్గర సముద్రంలో కలుస్తుంది.ఇది తుని పట్టణానికి 10 కి.మీ.దూరంలో ఉంది.ఈ నది తూర్పు గోదావరి, విశాఖ జిల్లాలకి సరిహద్దుగా ఏర్పడింది. ఈ నదికి కుడి ఒడ్డున తుని, ఎడమ ఒడ్డున పాయకరావుపేట ఉన్నాయి. తాండవ నదికి తరచుగా వరదలు వచ్చి తునిని ముంచేసేవి.అందువలన నీటిని నియంత్రించటానికి తునికి ఎగువన 1965 -1975 మధ్యకాలంలో ఈ నదిపై శ్రీ రాజా సాగి సూర్యనారాయణ రాజు తాండవ రిజర్వాయర్ ప్రాజెక్టును అనే పేరులో ఆనకట్ట నిర్మించి ఈ వరదలని అదుపులోకి తీసుకొచ్చేరు.ఈ ప్రాజెక్టు క్రింద విశాఖపట్నం జిల్లాలోని నాథవరం, నర్శీపట్నం, కోటి ఉరట్ల గ్రామాలకు చెందిన 32689 ఎకరాలు, తూ.గో. జిల్లాలోని కోటనందూరు, తుని. రౌతులపూడి గ్రామాలకు చెందిన 18776 ఎకరాల ఆయకట్టు భూమికి సాగునీటి సౌకర్యం కలిగింది.[19]

తుల్యభాగ

[మార్చు]

తుల్యభాగ, నదిలో స్నానం చేస్తే, గంగా నదిలో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, ఆ పుణ్యానికి సమానమైన పుణ్యం తుల్యభాగలో స్నానం చేసినా లభిస్తుందంటారు.అందువలనే దీనికి పేరుబడిందని చెపుతారు.గోదావరి నది సముద్రంలో కలిసే ముందు ధవళేశ్వరం దగ్గర గోదావరి నది ఏడు పాయలుగా చీలుతుంది. అవి గౌతమి, వశిష్ఠ, వైనతేయ, ఆత్రేయ, భరద్వాజ, తుల్యభాగ, కశ్యప. ఇందులో గౌతమి, వశిష్ఠ, వైనతేయలు మాత్రమే ప్రవహించే నదులు. మిగిలినవి అంతర్వాహినీ నదులు.[20] అ ఏడు పాయలు సప్తర్షుల పేర్ల మీద పిలువబడుతున్నాయి.అందులో తుల్యభాగ ఒకపాయ.ధవళేశ్వరం వద్ద ఆనకట్ట కట్టి, నది నీటిని వ్యవసాయపు కాలువల్లోకి మళ్ళించగా, స్వతస్సిద్ధమయిన ఈ పాయలలో ప్రవాహం తగ్గిపోయింది.

శ్రీకాకుళం వద్ద నాగావళి

సేద్యం అయిన తరువాత వృధాగా మిగిలిన దరిదాపు మురికిగా తయారయిన నీరు ఈ పాయలలో ప్రవహిస్తూ ఉండటం వల్ల ప్రస్తుతం ఈ తుల్యభాగ నది స్నానానికి కూడా అనుకూలంగా లేదు.

నాగావళి

[మార్చు]
శాలిహుండం వద్ద వంశధార

నాగావళి నది, దక్షిణ ఒడిషా రాష్ట్రంలోని రుషికుల్య, ఉత్తర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గోదావరినది పరీవాహక ప్రాంతం మధ్య ప్రవహించే ప్రధాన నదులలో నాగావళి నది ఒకటి.దీనిని లాంగ్యుల అని కూడా పిలుస్తారు.[21] ఈ నది ఒడిషా రాష్ట్రంలోని కలహండి జిల్లా, తువాముల్ రాంపూర్ ప్రాంతంలోని లఖ్‌బహాల్ గ్రామానికి సమీపంలో ఉన్న ఒక కొండ నుండి ఉద్భవించింది.ఇది అక్కడనుండి రాయగడ జిల్లాకు చెందిన కలహండి, కల్యాన్సింగ్‌పూర్, నక్రుండి, కెర్పాయ్ ప్రాంతాలను తాకి, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం దాటిన తరువాత కల్లేపల్లి గ్రామ సమీపంలో బంగాళాఖాతం విలీనం అయ్యింది.ఇది దాని స్వంత పరీవాహక ప్రాంతం కలిగిన స్వతంత్ర నది.నది మొత్తం పొడవు సుమారు 256 కి.మీ. (159 మైళ్ళు) ఉంటుంది. వీటిలో 161 కి.మీ. (100 మైళ్ళు) ఒడిషాలో ప్రయాణించగా, మిగిలిన ప్రయాణం ఆంధ్రప్రదేశ్‌లో సాగింది. పరీవాహక ప్రాంతం 9,510 చ. కి.మీ. (3,670 చ. మైళ్ళు) కలిగి ఉంది. నది బేసిన్ ఎత్తైన ప్రాంతాలు ప్రధానంగా గిరిజన జనాభా కలిగిన కొండ ప్రాంతాలు.ఇది ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకాకుళం,విజయనగరం జిల్లాలలో ప్రవహిస్తుంది.

వంశధార

[మార్చు]
పాపఘ్ని నదీ తీర ప్రాంతంలో చిక్‌బళ్లాపూర్ వద్ద పాపఘ్ని మఠంలోని శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి .

వంశధార నది, ఒడిషా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రుషికుల్య, గోదావరి మధ్య తూర్పు దిశలో ప్రవహించే నది వంశధార.దీనిని బాన్షాధర నది అని కూడా అంటారు,ఈ నది ఒడిషా రాష్ట్రంలోని కలహండి జిల్లాలోని తువాముల్ రాంపూర్, ఒడిషాలోని రాయగడ జిల్లాలోని కల్యాణసింగాపూర్ సరిహద్దులో ఉద్భవించి, 254 కి.మీ. దూరం ప్రయాణించి, కళింగపట్నం వద్ద సముద్రంలో కలుస్తుంది. నదీ పరీవాహక ప్రాంతం మొత్తం 10,830 చ. కి.మీ.శ్రీకాకుళం జిల్లాలోని ముఖలింగం, కళింగపట్నం పర్యాటక ఆకర్షణలు ఈ నది ఒడ్డున ఉన్నాయి.మహేంద్రతనయ నది ఒడిషాలోని గజపతి జిల్లాలో ఉద్భవించిన వంశధార ప్రధాన ఉపనది నది.నీటిపారుదల ఉపయోగం కోసం నది నీటిని మళ్లించడానికి శ్రీకాకుళం జిల్లాలోని రేగులపాడు బ్యారేజీ నిర్మాణంలో ఉంది.[22]

పాపఘ్ని

[మార్చు]

పాపఘ్ని నది కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ జిల్లాలోని నందికొండలలో ఉద్భవించింది. ఇది దక్షిణ భారతదేశంలో శాశ్వత, అంతరరాష్ట్ర నది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. ఇది పెన్నా నదికి కుడి వైపు నుంచి కలిసే ఉపనది. పాపఘ్ని అనేది పాప (పాపం), ఘ్ని (నాశనం చేసేది లేక చంపేది) అనే పదాల సమ్మేళనం. పురాణాల ప్రకారం ఒకప్పుడు ఈ ప్రాంతంలో నివసించే చెంచుల అమాయక గిరిజన నాయకుడిని చంపిన ఒక రాజు, తన పాపానికి శిక్షగా కుష్టు వ్యాధితో బాధపడ్డాడు. అతను పాపఘ్ని లోయలో తపస్సు చేసి, నదిలో మునిగిన తరువాత మాత్రమే అతనికి ఈ వ్యాధి తగ్గింది.[23] తద్వారా దీనికి పాపఘ్ని అనే పేరు వచ్చిందని అంటారు. ఈ నదీ ప్రాంతం ఏటా 60 నుండి 80 సెంటీమీటర్ల వర్షపాతం పొందుతుంది. ఇది గ్రానైట్ నిక్షేపాలు, ఎర్ర నేలల ద్వారా ప్రయాణిస్తుంది. ఇది నేలకోతకు తరచుగా గురవుతుంది. ఇది కర్ణాటకలోని కోలార్ జిల్లాలోను, ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, అనంతపురం, వైఎస్ఆర్ జిల్లాలగుండా ప్రవహిస్తుంది. నది పరీవాహకప్రాంతం 8,250 చ. కి.మీ. విస్తీర్ణంలో ఉంది. ఈ నది ముప్పై మండలాల గుండా పారుతుంది. ఇది కమలాపురం సమీపంలో పెన్నార్‌లో కలుస్తుంది.[24] పాపఘ్ని నదీ తీర ప్రాంతంలో చిక్‌బళ్లాపూర్ వద్ద అత్యంత పురాతనమైన పాపఘ్ని మఠం ఉంది.

పెన్ గంగా

[మార్చు]
పెన్ గంగా నది

పెన్ గంగా నది, మొత్తం పొడవు 676 కి.మీ. (420 మైళ్ళు).పెన్ గంగా నది మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలోని అజంతా శ్రేణులలో ఉద్భవించింది.అక్కడనుండి ఇది బుల్ధనా జిల్లా, వాషిమ్ జిల్లాల గుండా ప్రవహిస్తుంది.ఇది వాషిమ్ జిల్లా రిసోడ్ తాలూకాలోని షెల్గావ్ రాజ్గురే గ్రామానికి సమీపంలో ఉపనదిగా కాస్ నదిని కలుపుకుంటుంది.వాషిమ్, హింగోలి జిల్లాల సరిహద్దు గుండా ప్రవహిస్తుంది.ఇది యావత్మల్ జిల్లా, చంద్రపూర్ జిల్లా, నాందేడ్ జిల్లా మధ్య సరిహద్దుగా గుర్తిపు పొందింది.ఇది మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు వెంట ప్రవహిస్తుంది. ఇది నాందేడ్‌లోని మహూర్ సమీపంలో పస్ నదితో సంగమం చేస్తుంది.చంద్రపూర్ జిల్లాలోని చంద్రపూర్ తాలూకా, వాధ అనే చిన్న గ్రామానికి సమీపంలో పెన్ గంగా వార్ధ నదిలో కలుస్తుంది.వార్ధా నది ప్రాణహిత నదిలోకి కలసి ఇది చివరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రికి తూర్పున బంగాళాఖాతంలో కలసి ముగుస్తుంది.[25]

బుడమేరు

[మార్చు]
కృష్ణా జిల్లా,కంచికచర్ల వద్ద మున్నేరు నదిపై బ్రిడ్జి

బుడమేరు, ఇది కృష్ణా జిల్లాలోని మైలవరం చుట్టుపక్కల ఉన్న కొండలలో ఉద్భవించి కొల్లెేరు సరస్సులోకి కలుస్తుంది. బుడమేరు వలన విజయవాడ పరిసరప్రాంతాలకు వరదలు ఎక్కువుగా ఉంటుంటాయి.అందువలన బుడమేరును విజయవాడ విపత్తు అని కూడా పిలుస్తారు.దీని వరదలను నియంత్రించడానికి వెలగలేరు గ్రామంలో ఆనకట్ట నిర్మించారు.ప్రకాశం బ్యారేజీవద్ద బుడమేరు కృష్ణా నదిలో చేరడానికి వెలగలేరు నుండి బుడమేరు డైవర్షన్ ఛానల్ (బిడిసి) అనే డైవర్షన్ ఛానల్ నిర్మించబడింది.మరొక నదీ పరీవాహక ప్రాంతం నుండి ప్రధాన కృష్ణా నదికి నీటి మళ్లింపు చేయబడింది.

మున్నేరు

[మార్చు]
దస్త్రం:Giddalur- Nyandal Railway track .JPG
గిద్దలూరు పట్టణ శివార్లలో సగిలేరు నదిపై రైలువంతెన

మున్నేరు నది, కృష్ణా నదికి ఎడమవైపు ఉన్న ఉపనది.[26] ఇది తెలంగాణలోని వరంగల్ జిల్లాలో ఉద్భవించింది. అక్కడనుండి ఖమ్మం జిల్లాగండా ప్రవహించి, కృష్ణా జిల్లాల్లో ప్రవహిస్తుంది.ఈ నదిని ఖమ్మంలో తపస్సు కర్మ చేసినట్లు చెబుతున్న రిషి మౌద్గళ్య తన ఆధ్యాత్మిక శక్తితో సృష్టించినట్లు కథనం ఒకటి ఉంది.అందువలనే గుర్తుగా ఆ పేరు పెట్టబడిందని అంటారు.ఇది డోర్నకల్లు ఏరు గుండా ప్రవహించి, కమంచికల్ మీదుగా ఖమ్మం నగరంలోని దానవాయిగూడెం శివారు ప్రాంతానికి వస్తుంది. ఇక్కడ నీటి సేకరణకు ఒక చిన్న ఆనకట్ట ఉంది. మున్నేరు ఖమ్మం నగరానికి నీటి వనరుగా పనిచేస్తుంది.ఇది చివరగా పెనుగంచిప్రోలు, కీసర గ్రామాల గుండా ప్రవహించి, పులిచింతల ఆనకట్ట దిగువన నందిగామ సమీపంలోని ఏటూరు గ్రామవద్ద కృష్ణ నదిలో విలీనంమవుతుంది. 6,650 హెక్టార్ల భూమికి సాగు నీటిని సరఫరా చేయడానికి 1898 వ సం.లో జగ్గయ్యపేట సమీపంలో మున్నేరు బ్యారేజీని నిర్మించారు.[27]

సగిలేరు

[మార్చు]

సగిలేరు నది, పెన్నార్ నదికి ఉపనది. సగిలేరు నది వెలిగొండ, నల్లమల కొండల మధ్య ఉంది. ఇది ఉత్తర-దక్షిణ దిశలగుండా ప్రవహిస్తుంది.[28][29] నది పరీవాహక ప్రాంతంలో ఎరుపు, నలుపు, బంకమన్ను నేలలు ఉన్నాయి. తడి, పొడి నీటిపారుదల పంటలు ఈ ప్రాంతంలో సాగుబడి చేస్తారు[మూలాలు తెలుపవలెను]. ఎక్కువగా సజ్జలు, రాగి, జొన్న, వేరుశనగ, కూరగాయలు పండిస్తారు. ఈ నదిపై నీటిపారుదల ప్రాజెక్టులు కడప జిల్లాలోని బి. కోడూరు, కలసపాడు మండలాల్లో ఉన్నాయి. వీటితో పాటు నదిపై అనేక లిఫ్ట్ ఇరిగేషన్, చిన్న నీటిపారుదల ప్రాజెక్టులు ఉన్నాయి.

సువర్ణముఖి

[మార్చు]
శ్రీకాళహస్తి వద్ద స్వర్ణముఖి నదిపై బ్రిడ్జి

సువర్ణముఖి (స్వర్ణ ముఖి) నది, చిత్తూరు జిల్లాకు చెందిన నది.చంద్రగిరి మధ్య తొండవాడ సమీప కొండప్రాంతం ఈ నది జన్మస్థానం. పాకాల సమీపంలో ఉన్న పాలకొండలో ఆదినాపల్లి వద్ద చిన్నవాగులా పుట్టింది. ధూర్జటి తన రచనల్లో దీన్ని 'మొగలేరు' అని ప్రస్తావించాడు.స్వర్ణముఖి నదీ పరీవాహక ప్రాంతంలో పవిత్ర హిందూ పుణ్యక్షేత్రాలైన తిరుమల, శ్రీకాళహస్తీశ్వరాలయం, తొండవాడ వద్ద ఉన్న అగస్తేశ్వరాలయం, గుడిమల్లం దగ్గరున్న పరశురామేశ్వరాలయం, గాజులమండ్యం దగ్గరున్న మూలస్థానేశ్వరాలయం ఉన్నాయి. ఇది జీవనది కాదు. సాధారణంగా అక్టోబరు నుంచి డిసెంబరు దాకా ప్రవహిస్తుంది.ఈ నది భీమా, కల్యాణి నదులలో సంగమించి, తొండవాడలో త్రివేణి సంగమంగా మారి, ఉత్తరవాహినిగా ప్రవహించి తూర్పున బంగాళాఖాతంలో విలీనం అవుతుంది.ఈ నదిని గురించి ఒక పురాణగాథ ఉంది.పూర్వం అగస్త్య మహర్షి బ్రహ్మను గురించి తపస్సుచేసి ఈ నదిని దేవలోకం నుంచి క్రిందికి తెప్పించినట్లు స్థలపురాణం ద్వారా తెలుస్తుంది. శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని నిర్మించేటపుడు ఆలయ నిర్మాణంలో సహకరించిన కూలీలు రోజూ సాయంత్రం నదిలో స్నానం చేసి, ఇసుక వారి చేతుల్లోకి తీసుకుంటే నది వారు చేసిన కష్టానికి తగిన ప్రతిఫలంగా దాని విలువచేసేంత బంగారంగా మారేది. అందుకే ఈ నదికి సువర్ణముఖి, స్వర్ణముఖి అనే పేర్లు వచ్చాయి.25 మిలియన్ క్యూబిక్ మీటర్ల లైవ్ స్టోరేజ్‌తో కల్యాణి ఆనకట్టను 1977 లో దీనికి ఉపనదిగా ఉన్న కల్యాణి నది మీద నిర్మించబడింది.[30]

సువర్ణముఖి

[మార్చు]
శబరి నది ఓపెన్ స్ట్రీట్ మ్యాప్

సువర్ణముఖి నది, ఒడిషా రాష్ట్రంలోని తూర్పు కనుమలలో ఉద్బవించింది.ఈ నది విజయనగరం జిల్లా, వంగర మండలం కొండశేఖరపల్లి వద్ద జిల్లాలోకి ప్రవేశిస్తుది. జిల్లాలో మొత్తం 17 కి.మీ. మేర ప్రవహించి వంగర మండలంలోని సంగం గ్రామం వద్ద నాగావళి నదిలో కలుస్తోంది. సువర్ణముఖి నదిపై మడ్డువలస ప్రాజెక్టు నిర్మాణం చేయబడింది.దీనికి రెండు కాలువలు ఉన్నాయి. వీటి ద్వారా 24,700 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందుతోంది.కుడి కాల్వ రాజాం, వంగర, రేగిడి, సంతకవిటి, జి.సిగడాం మండలాల పరిధిలో మొత్తం 50 కిలోమీటర్ల పొడవున ఉంది.ఎడమ కాల్వ వంగర మండలం పరిధిలో 5 కి.మీ. మేర విస్తరించి ఉంది.[31]

శబరి నది

[మార్చు]
కూనవరం వద్ద శబరి నది

శబరి నది, గోదావరి నదికి ఉపనది. ఇది తూర్పు గోదావరి జిల్లా లోని కూనవరం వద్ద గోదావరి నదిలో కలుస్తుంది.[1] ఇది ఒడిశా రాష్ట్రంలోని తూర్పు కనుమలలో పడమరకు వాలుగాఉన్న సింకరం కొండ శ్రేణుల నుండి 1370 సముద్రపు మీటర్ల ఎత్తు నండి ప్రవహిస్తుంది. దీనిని ఒడిషాలో కోలాబ్ నది అని కూడా పిలుస్తారు.శబరి నదీ పరీవాహక ప్రాంతానికి దాదాపు 1250 మి.మీ. వార్షిక సగటు వర్షపాతం లభిస్తుంది. ఇది ఛత్తీస్‌గడ్, ఒడిషా రాష్ట్రాల మధ్య ఉమ్మడి సరిహద్దును ఏర్పరుస్తుంది. గోదావరి నదిలో విలీనం కావడానికి ముందు ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తుంది

బహుదా

[మార్చు]

బహుదా నది, ఒడిషా రాష్ట్రం, గజపతి జిల్లాలోని తూర్పు కనుమలలోని సింఘరాజ్ కొండల నుండి బాహుదా నది లూబా గ్రామానికి సమీపంలో ఉద్భవించింది. ఇది 55 కి.మీ. వరకు ఈశాన్యదిశలో ప్రవహిస్తుంది.తరువాత అది ఆగ్నేయ దిశకు మారి ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించే ముందు ఒడిశాలో 17 కి.మీ. దూరం ప్రయాణిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో 18 కి.మీ. దూరం ప్రవహిస్తుంది. తిరిగి ఈశాన్య దిశకు మారి ఇది ఒడిశాలో 6 కి.మీ. దూరం ప్రవహించి సునాపురపేట గ్రామానికి సమీపంలో బంగాళా ఖాతంలో కలిసింది. దీని మొత్తం పొడవు 96 కిలోమీటర్లు, ఒడిషాలో 78 కి.మీ. ప్రవహించగా,18 కి.మీ. ఆంధ్రప్రదేశ్లో ప్రవహిస్తుంది.[32] ఇది 1118 చ. కి.మీ.నదీ పరీవాహక ప్రాంతం కలిగి ఉంది.ఒడిశాలో 890 చ. కి.మీ. ప్రవహించగా ఆంధ్రప్రదేశ్లో 228 చ.కి.మీ.ప్రవహిస్తుంది.

వేదావతి

[మార్చు]
నదిపై విశ్వేశ్వరయ్య డాం (పురాతనం)

వేదావతి నది,పశ్చిమ కనుమలలో బాబాబుదనాగిరి పర్వతాలలో ఉద్బవించి, కర్ణాటక,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది.వేదవతిని కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో, ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలలో హగారి అని కూడా పిలుస్తారు. బాబాబుదానగిరి పర్వత శ్రేణులలోని సహ్యాద్రి కొండ శ్రేణి తూర్పు భాగంలో వేదం, అవతి అనే రెండు నదులు కలసి తూర్పుగా ప్రవహించి పూరా సమీపంలో కలయకతో వేదవతి నది ఏర్పడంది.అక్కడి నుండి చిక్కమగళూరు జిల్లా కదూర్ తాలూకా గుండా నది ప్రవహిస్తుంది. అప్పుడు వేదవతి వరుసగా చిత్రదుర్గ జిల్లాకు చెందిన హోసదుర్గ తాలూకా, హిరియూర్ తాలూకా, చల్లకరే తాలూకాలలో ప్రవేశిస్తుంది.వేదావతి ఒడ్డున, హోసదుర్గ తాలూకాలోని కెల్లోడు వద్ద శ్రీ ఆంజనేయస్వామికి అంకితమైన ప్రసిద్ధ ఆలయం ఉంది.కర్నూలు జిల్లా హాలహర్వి మండలం గూళ్యం గ్రామం, కర్ణాటక సరిహద్దు గ్రామమైన బసరకోడు గ్రామాల సరిహద్దు గ్రామాల ప్రజలకి జీవనోపాదితోపాటు రవాణా సౌకర్యాలు మెరుగుపడటానికి వేదవతి నదిఫై హై లెవెల్ వంతెన నిర్మాణం పని చేపట్టవలసిందిగా అప్పటి కర్నూలు ఎం.పి.రేణుక, కేంద్రరోడ్ రవాణా, నౌకాయాన మంత్రి నితిన్ గడ్కారికి  వినతిపత్రం ఇచ్చారు.[33]  

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-119614[permanent dead link]
  2. ""Godavari river basin map"" (PDF). Archived from the original (PDF) on 2013-10-12. Retrieved 2020-04-05.
  3. "Integrated Hydrological DataBook (Non-Classified River Basins)" (PDF). Central Water Commission. p. 9. Archived from the original (PDF) on 2016-03-04. Retrieved 2020-04-05.
  4. "Basins -". Archived from the original on 23 September 2015. Retrieved 2020-04-05.
  5. https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-127826# Archived 2021-10-28 at the Wayback Machine!
  6. "Dakshina Ganga (Ganga of South India) – River Godavari". Important India. 2014-01-20. Archived from the original on 18 January 2016. Retrieved 2020-04-05.
  7. "Deltas at Risk" (PDF). International Geosphere-Biosphere Programme. Retrieved 2020-04-05.
  8. South Asia Network on Dams Rivers and People (2014). "Shrinking and Sinking Deltas: Major role of Dams in delta subsidence and effective sea level rise" (PDF). Archived from the original (PDF) on 2020-09-29. Retrieved 2020-04-05.
  9. "Map of Krishna River basin" (PDF). Archived from the original (PDF) on 6 August 2017. Retrieved 2020-04-04.
  10. Garg, Santosh Kumar (1999). International and interstate river water disputes. Laxmi Publications. pp. 7–8. ISBN 978-81-7008-068-8. Retrieved 2020-04-04.
  11. "Archived copy". Archived from the original on 23 October 2015. Retrieved 2020-04-06.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  12. "Water Resources Information System". web.archive.org. 2010-08-20. Archived from the original on 2010-08-20. Retrieved 2020-04-05.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  13. http://www.indiamapped.com/rivers-in-india/champavathi-river/ Archived 2021-04-21 at the Wayback Machine India Mapped
  14. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-04-02. Retrieved 2020-04-04.
  15. "details River: Length of river". 2017. Retrieved 20 February 2016.
  16. "IRRIGATION PROFILE OF SRIKAKULAM DISTRICT". 2017. Archived from the original on 2021-06-16. Retrieved 2020-04-06.
  17. https://books.google.co.in/books?id=WF3VAAAAMAAJ&dq=cheyyeru+river&q=cheyyeru+&redir_esc=y#search_anchor
  18. https://books.google.co.in/books?id=GlTWAAAAIAAJ&dq=cheyyeru+river&q=cheyyeru+&redir_esc=y#search_anchor
  19. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2021-06-27. Retrieved 2020-04-06.
  20. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-04-06. Retrieved 2020-04-06.
  21. "Nagavali.CWC" (PDF). Archived (PDF) from the original on 21 July 2011. Retrieved 2020-04-06.
  22. Four years after laying stone river projects fail to take off - The Hindu 19 August 2012
  23. http://vayusutha.in/vs4/temple47.html
  24. Jain, Sharad Kumar (2007). Hydrology and Water Resources of India. Dordrecht, The Netherlands: Springer. p. 728. ISBN 9781402051807.
  25. http://www.telangana360.com/2016/11/penganga-river.html
  26. http://lsi.gov.in:8081/jspui/bitstream/123456789/3000/1/37990_2001_KHA.pdf
  27. "Muniyeru Anicut A00145". Archived from the original on 11 November 2014. Retrieved 30 June 2014.
  28. Bulletin of the National Geophysical Research Institute, Volume 9. National Geophysical Research Institute. 1971. p. 117.
  29. Census of India, 1961 census: Monograph series, Issue 8. India (Republic). Office of the Registrar General. p. 49.
  30. "Kalyani Dam D03636". Archived from the original on 4 March 2016. Retrieved 19 July 2015.
  31. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-12-02. Retrieved 2020-04-08.
  32. http://www.dowrodisha.gov.in/WaterResources/RiverSystemNBasinPlanning.pdf
  33. "హగరి (వేదవతి నది) ఫై హై లెవెల్ వంతెన నిర్మాణం విషయం ఫై కేంద్ర మంత్రి నితిన్ గడ్కారికి వినతి పత్రం సమర్పిస్తున్న కర్నూలు M.P బుట్టా రేణుక – Janam Mata" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-04-08.[permanent dead link]

వెలుపలి లంకెలు

[మార్చు]