Jump to content

శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం (భద్రాచలం)

అక్షాంశ రేఖాంశాలు: 17°24′N 80°31′E / 17.40°N 80.52°E / 17.40; 80.52
వికీపీడియా నుండి
శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం (భద్రాచలం)
శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం
శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం (భద్రాచలం) is located in Telangana
శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం (భద్రాచలం)
శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం (భద్రాచలం)
తెలంగాణ లో దేవాలయ ఉనికి
భౌగోళికాంశాలు :17°24′N 80°31′E / 17.40°N 80.52°E / 17.40; 80.52
పేరు
ప్రధాన పేరు :శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం
ప్రదేశం
దేశం:భారత దేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:ఖమ్మం జిల్లా
ప్రదేశం:భద్రాచలం
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:శ్రీరాముడు
ప్రధాన దేవత:సీత
ముఖ్య_ఉత్సవాలు:శ్రీరామనవమి
ఇతిహాసం
నిర్మాణ తేదీ:క్రీ. శ.1674
సృష్టికర్త:రామదాసు

శ్రీ సీతారాముల స్వామి వారి దేవస్థానం, తెలంగాణలోని ఖమ్మం జిల్లా, భద్రాచలంలో ఉంది. ఇది తెలంగాణ రాష్ట్రంలోని రామాలాయాలలోకెల్లా అతి పెద్దది. హిందువులు ఆరాధ్య దైవంగా భావించే శ్రీరాముని ఆలయం ఇది. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున ఈ దేవాలయ ప్రాంగణంలో శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది.

దేవాలయ నిర్మాణ విశేషాలు

[మార్చు]

17 వ శతాబ్దం నాటి సంకీర్తనాచార్యులు శ్రీరామదాసుగా పేరు పొందిన కంచర్ల గోపన్న జీవితంతో ఈ ఆలయ నిర్మాణం ముడిపడి ఉంది. 17 వ శతాబ్దం రెండవ భాగంలో కంచర్ల గోపన్న భద్రాచలం తహశీల్దార్ గా ఉన్నపుడు ప్రభుత్వానికి తెలియకుండా ఈ ఆలయ నిర్మాణం కోసం ప్రభుత్వ ఖజానాకు సంబంధించిన ధనాన్ని ఉపయోగించారని గోల్కొండ లోని ఒక చెరసాలలో ఇతనిని బంధించారు. కంచర్ల గోపన్న భక్తికి మెచ్చిన శ్రీరాముడు చెరసాల నుండి విడిపించేందుకు గోల్కొండ సంస్థానాదీశుడైన సుల్తాన్ (తానీషా) కు దివ్య రూపంలో కనిపించి, గోపన్నను విడుదల చేయమని ఆలయ నిర్మాణానికి వెచ్చించిన సొమ్మును చెల్లించాడని చారిత్రక కథనం. బందీఖానా నుండి విడుదలైన గోపన్న శ్రీరాముని కీర్తిస్తూ తెలుగులో అనేక సంకీర్తనలను రచించాడు. అప్పటి నుండి గోపన్నను రామదాసు అని పిలుస్తుండేవారు. భద్రాచలం, విజయనగరం ప్రాంతాలకు రామాయణంతో దగ్గర సంబంధమున్నట్లు రామాయణ గ్రంథాల ద్వారా తెలుస్తుంది. భద్రాచలం నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్ణశాలలో రాముడు, సీత, లక్ష్మణుడు కొంతకాలం నివాసం ఉన్నట్లు తెలియజేయబడింది. గోదావరి నది ఒడ్డున ఉన్న భద్రగిరి అనే చిన్నకొండ వద్ద శ్రీరాముడు శ్రీలంకలో ఉన్న సీతను రక్షించడానికి బయలుదేరినప్పుడు మార్గమధ్యంలో ఉన్న ఈ నదిని దాటాడు. మేరుపర్వతం, మేనకల కుమారుడే భద్రుడు (భద్రగిరి). ఈ భద్రుని కోరిక మేరకు భద్రగిరిపై వెలసిన శ్రీరాముడు భద్రాద్రిరాముడు అయ్యాడు.ఈ భద్రగిరిపై వెలసిన శ్రీరాముని ఆలయమే శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం. ముస్లిం మతంలో పుట్టిన కబీర్ దాస్ కు ఈ ఆలయంతో దగ్గర సంబంధముంది. కబీర్ దాస్ ఒకసారి ఆలయంలోకి ప్రవేశిస్తున్నపుడు అతన్ని నిరాకరించడంతో ఆలయంలోని దివ్య చిత్రాలు అదృశ్యమైయ్యాయని మళ్ళీ అతనిని ఆలయంలోకి ప్రవేశించేందుకు అనుమతి ఇవ్వడంతో దివ్య చిత్రాలు పునర్దర్శనం అయ్యాయని చెబుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన ఈ దేవాలయం ప్రపంచ నలుమూలల నుండి వేలాది భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. పవిత్రమైన గోదావరి నది ఈ కొండను చుట్టుకొని దక్షిణ దిశ వైపుగా ప్రవహిస్తూ ప్రకృతి అందాలను ఒలకపోస్తూ ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా భాసిల్లేలా భద్రాచలంకి మరింత తోడ్పాటునందించింది. మేరుపర్వతం, మేనక లకు లభించిన వరం వల్ల పుట్టిన బాలుడే భద్ర పర్వతం. ఈ భద్రుడి (చిన్నకొండ) వలనే ఈ చిన్నకొండను భద్రగిరి అని ఇక్కడ ఏర్పడిన ఊరికి భద్రాచలం అని పేరు వచ్చింది.

మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 7 వ నిజాం ఈ ఆలయానికి సంవత్సరానికి రూ.82,000 విరాళంగా ఇచ్చాడు.[1]

దేవాలయ ప్రత్యేకతలు

[మార్చు]
  • శ్రీరాముని దేవాలయాలలో ఉండే శ్రీరాముని విగ్రహం రెండు చేతులతో మానవుని రూపం పోలి ఉంటుంది. కాని భద్రాచలం దేవాలయంలో ఉండే శ్రీరాముని విగ్రహం నాలుగు చేతులతో శ్రీరామునిలా * కుడి చేతిలో బాణంను, ఎడమ చేతిలో విల్లును ధరించి అలాగే విష్ణువు మాదిరిగా కుడిచేతిలో శంఖును ఎడమచేతిలో చక్రంను ధరించి ఉంటుంది.
  • భద్రుని కోరికమేరకు వైకుంఠం నుండి విచ్చేసిన విష్ణుమూర్తి నాలుగు భుజములతో దర్షనమివ్వటంవల్ల వైకుంఠరామునిగా పిలువబడుతున్నాడు.
  • ఇతర దేవాలయములలో సీతాదేవి రాముని ప్రక్కన నిల్చుని ఉంటుంది. కాని ఈ దేవాలయములో స్వామి ఎడమ తొడపై ఆసీనవతియై ఉంటుంది. మిగిలిన దేవాలయాలలో ఇరువురకూ రెండు పీఠాలు ఉంటాయి. ఇక్కడ ఒకే పీఠం ఉంటుంది.
  • అన్ని దేవాలయాలలో లక్ష్మణుడు రామునికి కుడివైపున ఉంటాడు, కాని ఇక్కడ మాత్రం ఎడమపైపున ఉంటాడు.

నిత్యపూజలు, ఉత్సవాలు

[మార్చు]

కళ్యాణం

[మార్చు]

ఇక్కడ జరిగే ఉత్సవాలలో ముఖ్యమైనది శ్రీరామనవమి రోజున జరిగే కళ్యాణం. ఇది దేశ వ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి చెందిన ఉత్సవం. ఈ కళ్యాణానికి అనేక లక్షల భక్తులు హాజరవుతుంటారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు బట్టలు ఈ దేవాలయమునకు ప్రతి సంవత్సరం పంపడం జరుగుతుంది.

వైకుంఠఏకాదశి పర్వదినం

[మార్చు]

వైకుంఠం నుండి విష్ణుమూర్తి నేరుగా వచ్చి భద్రునికి దర్శనమివ్వటంవల్ల వైకుంఠఏకాదశి పర్వదినం ఉత్తర ద్వారదర్శనం ఈ క్షేత్రంలో చాలా ప్రసిద్ధిచెందింది.

నిత్యపూజలు

[మార్చు]

తమిళనాడులోని శ్రీరంగం నుండి రామదాసుచే తీసుకురాబదడిన ఆరు వంశాలకు చెందిన శ్రీవైష్ణవ ఆచార్యుల కుటుంబాలు ఇప్పటికి భద్రాచలంలో నిత్యపూజలు నిర్వహిస్తున్నారు. రామానుజులవారిచే శ్రీరంగంలో నిర్ణయించబడిన విదంగానే ఇక్కడి ఆలయంలో కూడా పూజలు నిర్వహిస్తున్నారు.

పర్ణశాల

[మార్చు]

ఇది భద్రాచలంనుండి 35 కి.మీ. దూరంలో ఉంది. సీతారామలక్ష్మణులు తమ వనవాస వనవాసంసమయంలో ఇక్కడ నివసించారని భావిస్తారు. వారి వనవాస సమయంలోని కొన్ని అందమైన దృశ్యాలు ఇక్కడ చిత్ర, శిల్ప రూపాలలో ప్రదర్శింపబడుతున్నాయి. ఉదాహరణకు సీతను ఎత్తుకుపోవడానికి మాయలేడి రూపంలో వచ్చిన మారీచుని బొమ్మ, పర్ణశాలకు సమీప ంలో ఉన్న సీతమ్మ వాగువద్ద సీత ఆరవేసిన చీర గుర్తులనీ, ఆమె పసుపు కుంకుమలు సేకరించిన రంగురాళ్ళనీ కొన్ని చిహ్నాలను చూపిస్తారు. నదికి ఆవలివైపుని రావణుని రథపు జాడలని కొన్ని గుర్తులను చూపిస్తారు.రావణుడు సీతను అపహరించిన ప్రదేశం ఇది.సీత వియోగాన్ని పొందిన రామచమంద్రుడు శోక మూర్తిగా కనిపిస్తాడు. భద్రాచలంలో ఉన్న రామచమంద్ర మూర్తి ముఖంలో ఉండే తేజస్సు పర్ణశాల రామునిలో కనిపించదు.శ్రీరామ నవమి రోజున ఇక్కడ కూడా కల్యాణోత్సవం జరుగుతుంది.

జటాయుపాక (ఎటపాక)

[మార్చు]

ఇది భద్రాచలానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. సీతాపహరణం సమయంలో జటాయువు రావణుని ఎదుర్కొని, సీతను రక్షించే యత్నంలో తన ప్రాణాలను ఇచ్చిన స్థలంగా దీనిని చెబుతారు. జటాయువుయొక్క ఒక రెక్క ఇక్కడికి 55 కి.మీ. దూరంలో ఉన్న వి.ఆర్.పురం మండలంలోని, రేఖపల్లి గ్రామంలో పడిందట.

దుమ్ముగూడెం

[మార్చు]

ఇక్కడ జరిగిన భీకరయుద్ధంలో రాముడు 14,000 రాక్షసులను హతమార్చాడట. ఆ రాక్షసుల బూడిదపై ఈ గ్రామం ఉంది. గనుక దీనిపేరు దుమ్ముగూడెం. ఇక్కడి రాముడిని ఆత్మారాముడంటారు.

గుండాల

[మార్చు]

ఇవి భద్రాచలానికి 5 కి.మీ. దూరంలో ఉన్న వేడినీటి బుగ్గలు. ఇక్కడ నదిఒడ్డున ఎక్కడ తవ్వినా వేడినీరు ఊరుతుంది. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు చలికాలంలో ఇక్కడ స్నానం చేస్తారట.

శ్రీరామగిరి

[మార్చు]

ఇది గోదావరి దిగువన 55 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ కొండపైన యోగరాముని మందిరం ఉంది.

పాపికొండలు

[మార్చు]

పాపికొండలు, తూర్పు కనుమలలోని దట్టమైన అడవులతో కూడిన ఒక కొండల శ్రేణి. ఇవి ఖమ్మం జిల్లా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల నడుమ ఆనుకొని ఉన్నాయి. సుందరమైన గోదావరి నది, కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణము. భద్రాచలం నుంచి పడవలో ఇక్కడికి వెళ్ళే సౌకర్యం ఉంది. పాపికొండల ప్రాంతంలో సాధారణంగా చెట్లు ఆకులు రాల్చవు. ప్రశాంతమైన, సుందరమైన, రమణీయమైన, ఆహ్లాదకరమైన ప్రదేశము. ఎండాకాలంలో కూడా పాపికొండల ప్రాంతం చల్లగానే ఉంటుంది. పాపికొండల అడవుల్లో వివిధ రకాల జంతువులు, పక్షులు, విష కీటకాలు ఉంటాయి. అలాగే వేలాది రకాల ఔషధ వృక్షాలు, మొక్కలు ఉంటాయి. భధ్రాచలం వద్ద మునివాటం అను ప్రదేశం దగ్గరలో జలపాతం ఉంది. ఇక్కడే ఒక శివలింగం సర్పం నీడలో అద్భుతంగా ఉంటుంది. పాపికొండల వద్ద గోదావరి చాలా తక్కువ వెడల్పులో రెండు కొండల మధ్య ప్రవహిస్తూ ఆ వాతావరణానికి మరింత రమణీయతను తెచ్చి పెడుతుంది.

దేవాలయ పునర్నిర్మాణం

[మార్చు]

1960 నాటికి గుడి బాగా శిథిలమైంది. ఆకాలంలో కల్లూరి చంద్రమౌళి గారు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా నియమితులైయ్యారు. వెంటనే గుడి పునఃనిర్మాణానికి నడుం కట్టారు. ఆయన అధ్యక్షులుగా రామాలయ జీర్ణోద్ధరణ సంఘం ఏర్పాటయింది. రాష్ట్రం నలుమూలల తిరిగి లక్షలాది రూపాయల విరాళాలు పోగుచేశారు. నాడు భద్రాచలం మారుమూల అటవీప్రాతం. యాత్రీకులకక్కడ ఏ సౌకర్యాలు లేవు. తమిళనాడులోని రామనాథపురం జిల్లాకు చెందిన శిల్పాచార్యులు గణపతి స్థపతిని ఆహ్వానించారు. ముందుగా కల్యాణమండపం నిర్మించ తలపెట్టారు. సరైన రాయిని తమిళనాడులోని దిండివనంలో గుర్తించారు. కొత్తగూడెం వరకు రైళ్ళలో తెచ్చి అక్కడినుండి గోదావరి వరకు లారీలలో తరలించారు. పెద్ద పెద్ద రాతి శిలలను ఇసుకలో నెట్టుకు వచ్చి లాంచీలలో కెక్కించి అతికష్టంతో భద్రాచలం చేర్పించారు. చంద్రమౌళి నగర్లో 500 శిల్పులు 3 లక్షల ఖర్చుతో సకల కళాశోభితమైన కళ్యాణమండపం నిర్మించారు. రామాలయానికి దక్షిణాన ఉన్న రంగనాయకుల గుట్టపై రామదాసు ధ్యానమందిరం నిర్మించారు. శిల్పశోభాయమానమైన గోపురాలు నిర్మించారు. దీనిలో ఆరు అడుగుల పచ్చరాయి రామదాసు విగ్రహం ప్రతిష్ఠించారు. రామదాసు కీర్తనలు, భక్తి తరతరాలవారికి తెలియచేసే అపురూప నిర్మాణమిది. ప్రధాన ఆలయాన్ని పూర్తిగా నల్లరాతితో సౌందర్య శిల్పాలతో నిర్మించారు. ఈ రాతిని సమీపములోని తాటియాకుల గూడెంలో సేకరించారు. మహామండపాన్ని అష్టలక్ష్ములు, దశావతారాలు, ఆళ్వారుల శిల్పాలతో అలంకరించారు. 32 టన్నుల ఏకశిలతో ఆలయ విమానం ఏర్పాటుచేశారు. ఈ విమానం మూడు అంతస్తులు కలిగి అన్ని దేవతామూర్తుల శిల్పాలతో శోభాయమానమైంది.

బడ్జెట్ వివరాలు

[మార్చు]

దేవాలయ అభివృద్ధికి 2018 తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో 100 కోట్ల రూపాయలు కేటాయించారు.[2][3]

అభివృద్ధి

[మార్చు]

ఆలయాన్ని రూ.100 కోట్లకు మించి ఖర్చుచేసి చరిత్రలో సుప్రసిద్ధ స్థానంగా భద్రాద్రికి ఖ్యాతి అందేలా పటిష్టమైన నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. దాదాపు 30 ఎకరాల విస్తీర్ణంలో దేవాలయాన్ని అభివృద్ధి చేయనున్నారు.[4]

గ్యాలరీ

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. https://archive.siasat.com/news/nizam-hyderabad-mir-osman-ali-khan-was-perfect-secular-ruler-812716/
  2. "తెలంగాణ బడ్జెట్ 2018: ఈటల ప్రసంగం". Samayam Telugu. 2018-03-15. Archived from the original on 2022-10-12. Retrieved 2022-10-12.
  3. Mar 15, TIMESOFINDIA COM / Updated:; 2018; Ist, 13:23 (2018-03-15). "Telangana Budget 2018: Highlights of Telangana budget 2018-19 | Hyderabad News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 2018-04-17. Retrieved 2022-10-12. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  4. నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక) (2 June 2019). "మన తెలంగాణ ఘన తెలంగాణ". Archived from the original on 2 June 2019. Retrieved 15 June 2019.

బయటి లింకులు

[మార్చు]