ద్రాక్షారామం
ద్రాక్షారామం | |
---|---|
అక్షాంశ రేఖాంశాలు: 16°47′34.08″N 82°3′48.60″E / 16.7928000°N 82.0635000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కోనసీమ |
మండలం | రామచంద్రాపురం |
విస్తీర్ణం | 4.74 కి.మీ2 (1.83 చ. మై) |
జనాభా (2011) | 9,299 |
• జనసాంద్రత | 2,000/కి.మీ2 (5,100/చ. మై.) |
అదనపు జనాభాగణాంకాలు | |
• పురుషులు | 4,627 |
• స్త్రీలు | 4,672 |
• లింగ నిష్పత్తి | 1,010 |
• నివాసాలు | 2,659 |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
పిన్‌కోడ్ | 533262 |
2011 జనగణన కోడ్ | 587646 |
ద్రాక్షారామం, కోనసీమ జిల్లా, రామచంద్రపురం మండలానికి చెందిన గ్రామం. ఇక్కడ గల పంచారామాల్లో ఒకటైన శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయం కారణంగా ఇది ప్రముఖ పుణ్య క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.
పేరు వ్యుత్పత్తి
[మార్చు]పూర్వం దక్ష ప్రజాపతి నిరీశ్వర యజ్ఞం చేసిన ప్రదేశమే నేడు ద్రాక్షారామంగా పిలువబడుతుంది. ఒకప్పుడు ఇది "దక్ష ఆరామం"గా పిలువబడి కాలక్రమేణా అది ద్రాక్షారామంగా మారింది.తన భర్తకి ఆహ్వానం లేకపోయినప్పటికీ పుట్టింటిపై ప్రేమతో ఆ యజ్ఞానికి వచ్చి అవమాన పడిన పరమశివుని సతి సతీదేవి ఆత్మాహుతి చేసుకున్న ప్రదేశం ఇదే. తన భార్యను అవమాన పరిచినందుకు గాను వీరభద్రుడిని సృష్టించిన శివుడు దక్షుడి తల నరికించాడు. సతీదేవి వియోగ వివశత్వం నుంచి శివుడిని బయటపడేయడం కోసం శ్రీ మహా విష్ణువు ఆమె శరీరాన్ని 18 ఖండాలుగా చేశాడు. ఆమె శరీర అవయవాలు పడిన ప్రదేశాలు అష్టాదశ శక్తిపీఠాలుగా అవతరించాయి.[2]
చరిత్ర
[మార్చు]ఈ ఊరిలో గల భీమేశ్వరస్వామి ఆలయాన్ని సాశ. 7, 8 శతాబ్ధాల మధ్య తూర్పు చాళుక్యుల వంశానికి చెందిన చాళుక్య భీముడు నిర్మించినట్టుగా శాసనాల ద్వారా తెలుస్తొంది.
చాటువు
[మార్చు]శ్రీనాథమహా కవి చాటువులకు ప్రసిద్ధి. అతడు ద్రాక్షారామానికి సంబంధించి చెప్పిన చాటువుగా దిగువపద్యం ప్రచారంలో ఉంది.
అక్షయ్యంబగు సాంపరాయని తెలుంగాధీశ కస్తూరికా
భిక్షాదానము సేయరా సుకవిరాట్ బృందారక శ్రేణికిన్
దక్షారామభీమవర గంధర్వాప్సరోభామినీ
వక్షోజద్వయ కుంభికుంభములపై వాసించుతద్వాసనల్
భీమేశ్వరాలయం
[మార్చు]స్థలపురాణం
[మార్చు]పూర్వం తారకాసురుడు అను రాక్షసుడు శివుని గురించి ఘోరమైన తపస్సు చేయగా, శివుడు సాక్షాత్కరించాడు. ఆ రాక్షసుడు శివుని ఆత్మలింగాన్ని వరంగా కోరగా శివుడు ఆత్మలింగాన్ని ప్రసాదించాడు. క్రూర స్వభావం కలిగిన ఆ తారకాసురుడు ఆ లింగ శక్తి వలన దేవతలను, ఋషులను, సత్పురుషులను నానా ఇబ్బందులు పెట్టుచుండగా ఆ బాధలు భరించలేక వీరంతా విష్ణుమూర్తిని ప్రార్థించగా, అపుడు విష్ణువు ఆ లింగం తొలగితేగాని ఆ రాక్షసుని శక్తి నశించదనీ, ఈశ్వరుడి అంశతో జన్మించిన వానితో తప్ప మరెవ్వరి వలనా తనకు మరణం లేకుండా వరం పొంది ఉన్నాడని చెప్పగా, మన్మధ ప్రేరేపణచేత పార్వతీ కళ్యాణం, అనంతరం 'కుమార సంభవం' జరుగగా ఆ కుమారస్వామి రుద్ర గణములకు నాయకత్వం వహించి తారకాసురుడితో యుద్ధం చేయగా, కుమార స్వామి విసిరిన బాణం ఆ ఆత్మలింగానికి తగిలి అయిదు ముక్కలై భూమిమీద అయిదు చోట్ల పడెను. అవే పంచారామ క్షేత్రాలుగా అవతరించెను, వాటిలో ఒకటి ద్రాక్షారామం.
చరిత్ర
[మార్చు]ఈ ఆలయాన్ని సాశ. 7, 8 శతాబ్ధాల మధ్య తూర్పు చాళుక్యుల వంశానికి చెందిన చాళుక్య భీముడు నిర్మించినట్టుగా శాసనాల ద్వారా తెలుస్తొంది. ఇక్కడి మూలవిరాట్ శ్రీ భీమేశ్వర స్వామి స్వయంభుగా వెలసిన 14 అడుగుల శివలింగం, శుద్ధ స్ఫటికాకార లింగం. దేవేరి శ్రీ మాణిక్యంబా అమ్మవారు యావత్భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన అష్టాదశ శక్తి పీఠాలలో 12 వ శక్తిపీఠంగా వెలసింది.తెలుగుకు ఆ పేరు త్రిలింగ అన్న పదం నుంచి ఏర్పడిందని కొందరి భావన. ఆ త్రిలింగమనే పదం ఏర్పడేందుకు కారణమైన క్షేత్ర త్రయంలో ద్రాక్షారామం ఒకటి. మిగిలిన రెండు క్షేత్రాలలో ఒకటి కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరం కాగా, మరొకటి శ్రీశైలం.[3] త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా, అష్తాదశ శక్తిపీఠాలలో ద్వాదశ పీఠంగా, దక్షిణ కాశీగా, వ్యాస కాశీగా ద్రాక్షారామానికి ప్రశస్తి ఉంది. శిల్ప కళాభిరామమై, శాసనాల భాండాగారమై ద్రాక్షారామ భీమేశ్వరస్వామి ఆలయం ఒప్పారుతోంది.
భౌగోళికం
[మార్చు]ఇది కాకినాడకి 32 కి.మీ దూరములోను, రాజమహేంద్రవరంకి 60కి.మీ దూరములోను ఉంది. ఇది మండల కేంద్రమైన రామచంద్రపురం నుండి 6 కి. మీ. దూరంలో ఉంది.
జనాభా గణాంకాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2659 ఇళ్లతో, 9299 జనాభాతో 474 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 4627, ఆడవారి సంఖ్య 4672. [4]
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 9,234.[5] ఇందులో పురుషుల సంఖ్య 4,618, మహిళల సంఖ్య 4,616, గ్రామంలో నివాస గృహాలు 2,206 ఉన్నాయి.
రవాణా సౌకర్యాలు
[మార్చు]రాజమండ్రి నుండి నామవరం, కేశవరం, ద్వారపూడి, తాపేశ్వరం, రామచంద్రాపురం మీదుగా యానాం పోయే రహదారిపై ద్రాక్షారామం వుంది.
విద్యా సౌకర్యాలు
[మార్చు]గ్రామంలో మూడు ప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు ఏడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు ఆరు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు ఆరు ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల, 2 ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఒక ప్రైవేటు ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఉన్నాయి. ఒక ప్రైవేటు వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఉంది. ఒక ప్రభుత్వ అనియత విద్యా కేంద్రం ఉంది.సమీప ఇంజనీరింగ్ కళాశాల రామచంద్రపురంలో ఉంది. సమీప మేనేజిమెంటు కళాశాల రామచంద్రపురంలోను, వైద్య కళాశాల, పాలీటెక్నిక్‌లు కాకినాడలోనూ ఉన్నాయి.సమీప దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల కాకినాడలో ఉంది.
ప్రముఖులు
[మార్చు]- మల్లాది వెంకట సత్యనారాయణ రావు
- దువ్వూరి సుబ్బమ్మ
- ఈమని శంకరశాస్త్రి
- గిరజాల వెంకట సత్య సుబ్రహ్మణ్యం వ్యాఖ్యాత
భూమి వినియోగం
[మార్చు]ద్రాక్షారామంలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
- వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 128 హెక్టార్లు
- నికరంగా విత్తిన భూమి: 345 హెక్టార్లు
- వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 345 హెక్టార్లు
- కాలువలు: 345 హెక్టార్లు
ఉత్పత్తి
[మార్చు]వరి, చీరలు
చిత్రమాలిక
[మార్చు]-
ద్రాక్షారామం ఆలయప్రాకారం
-
ఆలయగోపురం
-
ద్రాక్షారామం ఆలయప్రాంగణంలో ఉన్న కుండం
-
ద్రాక్షారామ ఆలయద్వారం
-
భీమేశ్వర మందిర ఉత్తర భాగం లోపలివైపు
-
భీమేశ్వరస్వామి గర్భాలయ ద్వారం స్వామి పాదభాగం (తెల్లటిది)
-
భీమేశ్వరాలయ నందీశ్వరుడు, తూర్పుముఖధ్వారం.
మూలాలు
[మార్చు]- ↑ 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
- ↑ "ద్రాక్షారామం ..నిటలాక్షుని వైభవం". EENADU. Retrieved 2023-02-04.
- ↑ వెంకట లక్ష్మణరావు, కొమర్రాజు (1910). "త్రిలింగము నుండి తెలుగు పుట్టెనా? లేక తెలుగు నుండి త్రిలింగము పుట్టెనా?". ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక: 81. Archived from the original on 28 September 2017.
- ↑ "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-07-19. Retrieved 2013-12-07.