Jump to content

మజ్జిగ

వికీపీడియా నుండి
(చల్ల నుండి దారిమార్పు చెందింది)
మజ్జిగ

పెరుగులో నీరు కలిపి చిలికితే వచ్చే పలుచని పానీయం చల్ల లేదా మజ్జిగ (Butter milk). దీనిని వెన్నతోను, వెన్న తొలగించిన తర్వాత చాలా రకాలుగా ఉపయోగించుతారు.

మజ్జిగ

[మార్చు]

పెరుగుకు నాలుగురెట్లు నీళ్లు కలిపి చిలికి వెన్న తొలగిస్తే మజ్జిగ తయారవుతుంది. మజ్జిగలో కొవ్వును తొలగిస్తారు కనుక పెద్ద వయసువారికి మంచి చేస్తుంది. పెరుగుకి బరువునీ, కఫాన్నీ పెంచే గుణాలు ఉంటాయి.

ఔషధ ఉపయోగాలు

[మార్చు]
మజ్జిగ

మజ్జిగ మూడు దోషాలనూ తగ్గిస్తుంది. మజ్జిగను సైంధవ లవణంతో కలిపి తీసుకుంటే వాతాన్ని తగ్గిస్తుంది. మజ్జిగను పటిక బెల్లంతో కలిపి తీసుకుంటే పైత్యం తగ్గుతుంది. మజ్జిగకు శొంఠి, పిప్పళ్లు, మిరియాల చూర్ణం కలిపి తీసుకుంటే కఫం తగ్గుతుంది. ఆవు మజ్జిగ మూడు దోషాలను తగ్గిస్తుంది. పథ్యంగా, ఆకలిని పెంచేదిగా, రుచికారకంగా, బుద్ధివర్థకంగా పనిచేస్తుంది. గేదె మజ్జిగ కఫాన్ని పెంచుతుంది. అలాగే వాపును పెంచుతుంది. కాబట్టి పరిమితంగా వాడాలి. మేక మజ్జిగ తేలికగా ఉంటుంది. మూడు దోషాల మీద పనిచేస్తుంది. మజ్జిగను వాడకూడని సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు జలోదరం (ఎసైటిస్), యకృద్‌వృద్ధి (హెపటోమెగాలి), ఉబ్బసం, దగ్గు, బ్రాంకైటిస్, నిమోనియా వంటి వ్యాధుల్లో మజ్జిగను వాడటం మంచిది కాదు.

  • మజ్జిగలో ఇంగువనూ, జీలకర్రనూ, సైంధవ లవణాన్నీ కలిపి తీసుకుంటే పొట్ట ఉబ్బరింపు తగ్గుతుంది.
  • పైల్స్ వ్యాధిలో మజ్జిగ బాగా పనిచేస్తుంది. మజ్జిగ పోసిన చోట గడ్డి మొలవదు. అలాగే మజ్జిగను ఎక్కువగా వాడేవారిలో పైల్స్ కూడా తయారుకావు.
  • దురదతో కూడిన అర్శమొలలకు వెన్నతో కూడిన మజ్జిగ తీసుకోవాలి. మజ్జిగలో కొంచెం నిమ్మరసం కలిపి తీసుకుంటే మల విసర్జన తరువాత మల ద్వారంలో వచ్చే మంట తగ్గుతుంది.
  • రక్తస్రావంతో కూడిన అర్శమొలకు వెన్న తొలగించిన మజ్జిగ తీసుకోవాలి. లేదా మజ్జిగలో ఉప్పు, వాముపొడి కలిపి తీసుకోవాలి. అలాగే మరో మంచి చికిత్స ఉంది. చిత్రమూలం వేరు బెరడును ముద్దగా దంచాలి. ఈ పేస్టును కుండలోపల పూసి, దానిలో మజ్జిగ చేసుకొని తాగాలి.
  • పిప్పళ్లను వర్ధమాన యోగం రూపంలో మజ్జిగతో వాడాలి. అంటే పిప్పళ్లను పది రోజుల వరకూ రోజుకొకటి చొప్పున పెంచి తిరిగి తగ్గించుకుంటూ రావాలి.
  • మూత్రంలో మంటకు మజ్జిగలో శుద్ధిచేసిన గంధకాన్ని కలిపి తీసుకోవాలి.
  • చర్మంపైన మంటలకు మజ్జిగలో వాష్ క్లాత్‌ని ముంచి ఒళ్లు తుడుచుకోవాలి.
  • సొరియాసిస్, ఎగ్జిమాకు చిక్కని మజ్జిగలో ఒక నూలు గుడ్డను తడిపి కొన్ని గంటలపాటు చర్మవ్యాధి ఉన్నచోట పరిచి ఉంచితే ఉపశమనం లభిస్తుంది.
  • వేరుశనగ, నెయ్యి వంటి ఆహారాలతో ఎలర్జీలకు మజ్జిగకు కాస్తంత పసుపుచేర్చి తీసుకోవాలి.
  • ఒంటికణత నొప్పికి అన్నంలో మజ్జిగ పోసుకొని కొంచెం బెల్లం కలిపి తినాలి. దీనిని సూర్యోదయానికి ముందే తీసుకోవాలి.
  • విరేచనాలు: మజ్జిగలో వేయించిన జీలకర్ర పొడిని కలిపి తీసుకోవాలి. లేదా మజ్జిగలో తేనె కలిపి తీసుకోవాలి.
  • మల ద్వారం చుట్టూ దురదకు మజ్జిగలో నిమ్మరసం కలిపి తీసుకోవాలి. దీనివల్ల మలంలోని ఆమ్లత్వం తగ్గి దురద తగ్గుతుంది.
  • నులిపురుగులకు మజ్జిగలో వాయువిడంగాల చూర్ణం కలిపి తీసుకోవాలి.
  • మాంసాహారం అరుగుదలకు మజ్జిగలో మాంసపు ముక్కలను నానేసి ఉడికించాలి. మజ్జిగలో ఊరటంవల్ల మాంసంలోని తంతువులు మార్ధవంగా తయారవుతాయి.
  • పొడి చర్మం: మజ్జిగలో కొంచెం నిమ్మరసం కలిపి రాసుకొని సున్నిపిండితో స్నానం చేస్తే చర్మం నునుపుగా తయారవుతుంది.

[1]

ఉపయోగాలు

[మార్చు]
  • మజ్జిక ఉప్మా: నీరుకు బదులు మజ్జిక వేసి తయారుచేసిన ఉప్మా.
  • మజ్జికను వేసవికాలంలో దాహాన్ని తీర్చే చక్కని పానీయంగా ఉపయోగిస్తారు. దీనిలో కొంచెం కరివేపాకు, అల్లం, పచ్చి మిరపకాయలు వేసి కొంతసేపుంచితే ఇంకా రుచిగా ఉంటుంది. కొంతమంది చలివేంద్రంలో నీటితో సహా మజ్జిగను కూడా ఎండలో తిరుగుతున్నవారికి పంచుతారు.
  • మజ్జిగను వేడి అన్నంలో వేసుకొని భోజనంలో చివరగా తింటారు.
  • మజ్జిగలో పోపువేసి చారు లేదా రసము తయారుచేస్తారు.
  • మ‌జ్జిగ‌ను తాగ‌డం వ‌ల్ల ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. జీర్ణ స‌మ‌స్య‌లు పోతాయి. ముఖ్యంగా గ్యాస్‌, అసిడిటీ త‌గ్గుతాయి. అలాగే చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది.

సామెతలు

[మార్చు]
  • చల్లకొచ్చి ముంత దాచినట్లు
  • మంది ఎక్కువైతే మజ్జిగ పల్చనౌతుంది

మూలాలు

[మార్చు]
  1. ఆయుర్వేదము / డా. చిరుమామిళ్ల మురళీమనోహర్

బయటి లింకులు

[మార్చు]

ఇవికూడా చూడండి

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=మజ్జిగ&oldid=3992899" నుండి వెలికితీశారు