ఉత్తరప్రదేశ్ శాసనసభకు 2002లో ఎన్నికలు జరిగాయి. 2002 మార్చి 3 నుండి మే 2 వరకు 56 రోజుల పాటు సాగిన రాష్ట్రపతి పాలన తర్వాత భాజపా, బహుజన సమాజ్ పార్టీకి మద్దతునివ్వడంతో మాయావతి 2002 మే 3 న మూడవసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టింది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కల్‌రాజ్ మిశ్రా రాజీనామా చేయడంతో, అతని స్థానంలో వినయ్ కటియార్ నియమితుడయ్యాడు. కూటమికి మద్దతుగా కటియార్, "హాథీ నహీ గణేష్ హై, బ్రహ్మ విష్ణు మహేశ్ హై" వంటి నినాదాలు చేశాడు. కానీ కూటమిలో సమస్యలు పెరుగుతూ పోయాయి. చివరికి మాయావతి 2003 ఆగస్టులో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసింది.
2003 ఆగస్టు 29 న, ములాయం సింగ్ యాదవ్ BSP అసమ్మతివాదుల మద్దతుతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 2007 వరకు ప్రభుత్వాన్ని నడిపాడు. 2004 లోక్‌సభ ఎన్నికలలో యాదవ్ తమకు సహాయం చేస్తాడని బిజెపి నాయకులు వాజ్‌పేయిని ఒప్పించారని వార్తలు వచ్చాయి - అయితే ములాయం సహాయం చేయలేదు. కేంద్రంలో ఎన్‌డిఎ అధికారం కోల్పోయింది. 2003 లో తాము ములాయంకు సహాయం చేయకుండా ఉండి ఉంటే, ఆయన రాజకీయాల్లో ప్రభావం కోల్పోయి పక్కకుపోయి ఉండేవాడని కొందరు బిజెపి నాయకులు విశ్వసిస్తారు [1]