Jump to content

భారతదేశ పంచవర్ష ప్రణాళికలు

వికీపీడియా నుండి
(పంచవర్ష ప్రణాళికలు నుండి దారిమార్పు చెందింది)

1947లో స్వాతంత్ర్యం పొందిన భారతదేశానికి ప్రధాన మంత్రిగా పగ్గాలు చేపట్టిన జవహర్ లాల్ నెహ్రూ సోవియట్ యూనియన్ (పూర్వపు రష్యా) ప్రభావానికి లోనై భవిష్యత్తు అభివృద్ధికి మనదేశంలో కూడా ప్రణాళికలు ఉండాలని తలచి ప్రణాళికా సంఘంను ఏర్పర్చి 1951-52 నుండి పంచవర్ష ప్రణాళికలు ప్రారంభించాడు. ఈ విధంగా మనదేశంలో పంచవర్ష ప్రణాళికలకు జవహర్ లాల్ నెహ్రూను పితామహుడిగా పేర్కొనవచ్చు. పార్లమెంటులో ప్రణాళికల గురించి మాట్లాడుతూ నెహ్రూ ప్రభుత్వ రంగాన్ని పెంచుతూ, ఉత్పత్తి రంగాలను ప్రభుత్వపరం చేస్తూ వీటి ఫలితాలను ప్రజలకు అందేలా చేయాల్సి ఉంది. ప్రజాస్వామ్య స్థాపనకు దోహదం చేస్తూ ఆర్థిక, పారిశ్రామిక రంగాలలో ప్రగతిని సాధించడమే ఆర్థికప్రణాళికల ముఖ్యోద్దేశ్యం అని పేర్కొన్నాడు. దేశ వనరులు, అవసరాలను రూపొందించేందుకు 1950లో ప్రణాళిక సంఘం ఏర్పడింది. ఇంతవరకు మనదేశంలో 11 పంచ వర్ష ప్రణాళికలు పూర్తి కాగా ప్రస్తుతం 12 వ పంచ వర్ష ప్రణాళిక అమలులో ఉంది. ప్రణాళిక సంఘానికి ప్రధాన మంత్రి ఎక్స్-అఫీషియో చైర్మెన్ గా వ్యవహరిస్తాడు, కాగా కేబినేట్ ర్యాంకు కల డిప్యూటీ చైర్మెన్ ఆ తర్వాతి స్థానంలో కొనసాగుతాడు. ప్రస్తుతం ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మెన్ గా మాంటెక్ సింగ్ అహ్లువాలియా కొనసాగుతున్నారు.

ప్రణాళిక వ్యవస్థ పూర్వరంగం

[మార్చు]

మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1934లో రచించిన ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా భారతదేశంలో ప్రణాళిక వ్యవస్థకు దారిచూపింది. కాబట్టి అతనిని దేశ ప్రణాళిక వ్యవస్థకు పితామహుడిగా అభివర్ణించవచ్చు. ఈ గ్రంథంలో విశ్వేశ్వరయ్య దేశంలో తాండవిస్తున్న పేదరికం, నిరుద్యోగం వంటి అనేక ఆర్థిక సమస్యలకు కారణం ప్రణాళికబద్దమైన పద్ధతి లేకపోవడమే కారణమని పేర్కొన్నాడు. 1938లో దేశంలో జాతీయ ప్రణాళిక కమిటీని స్థాపించారు. 1944లో బాంబే ప్రణాళిక రూపకల్పన జర్గింది. జాతీయ నాయకులైన దాదాభాయి నౌరోజీ, ఎం.జి.రణడే, శ్రీమన్నారాయణ, ఎం.ఎన్.రాయ్ తదితరులు తమ రచనల ద్వారా, ఇతరేతర కృషి ద్వారాభారత ప్రణాళికా విధానం మూల భావాలను సమగ్రంగా రూపొందించారు. అయిననూ దీని ఒక నిర్దుష్ట రూపం ఇచ్చినది మాత్రం జవహర్ లాల్ నెహ్రూ అని చెప్పవచ్చు. 1950లో ఆర్థిక సంఘం స్థాపించబడింది. 1952 డిసెంబర్ లో మొదటి పంచవర్ష ప్రణాళిక ముసాయిదాను పార్లమెంటు ఆమోదించింది.

క్ర.సం. ప్రణాళిక ప్రణాళిక వ్యయం (కోట్ల రూ.లో) వ్యవధి
1 మొదటి పంచవర్ష ప్రణాళిక 2,068 1951-1956
2 రెండో పంచవర్ష ప్రణాళిక 1956-1961
3 మూడవ పంచవర్ష ప్రణాళిక 8,577 1961-1966
4 నాల్గవ పంచవర్ష ప్రణాళిక 1969-1974
5 ఐదవ పంచవర్ష ప్రణాళిక 53,411 1974-1979
6 ఆరవ పంచవర్ష ప్రణాళిక 1,09,291 1980-1985
7 ఏడవ పంచవర్ష ప్రణాళిక 2,18,729 1985-1989
8 ఎనిమిదవ పంచవర్ష ప్రణాళిక 7,98,000 1992-1997
9 తొమ్మిదవ పంచవర్ష ప్రణాళిక 21,90,000 1997-2002
10 పదవ పంచవర్ష ప్రణాళిక 2002-2007
11 పదకొండవ పంచవర్ష ప్రణాళిక 36,44,000 2007-2012
12 పన్నెండవ పంచవర్ష ప్రణాళిక 2012-2017

మొదటి ప్రణాళిక రూపకర్త: మోక్షగుండం విశ్వేశ్వరయ్య

మొదటి పంచవర్ష ప్రణాళిక

[మార్చు]

1951-52 నుంచి 1955-56 వరకు మొదటి పంచవర్ష ప్రణాళిక అమలులో ఉంది. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ డిసెంబర్ 8, 1951పార్లమెంటులో మొదటి పంచవర్ష ప్రణాళికను ప్రవేశపెట్టినాడు. ఈ ప్రణాళిక మొత్తం కేటాయింపులు 2068 కోట్ల రూపాయలు. ఇందులో నీటిపారుదల, ఇంధనానికి 27.2%, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి 17.4%, రవాణా, ప్రసార సాధనాలకు 24%, పారిశ్రామిక రంగానికి 8.4%, సాంఘిక సేవలకు 16.64%, కేటాయింపులు చేశారు. రెండవ ప్రపంచ యుద్ధం, దేశ విభజన వల్ల దెబ్బతిన్న ఆర్థిక రంగాన్ని వృద్ధిచేయడంతో పాటు అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి కోసం పథకాలను చేపట్టాలనే లక్ష్యాల కోసం ఈ ప్రణాళికను రూపొందించారు. 1951లో ఆహార ధాన్యాలను అధికంగా దిగుమతి చేసుకోవడంతో వ్యవసాయరంగాన్ని స్వావలంబన చేయాలనే ఉద్దేశంతో ఈ రంగానికి పెద్ద పీఠ వేసి అధిక శాతం నిధులు కేటాయించారు. చివరి రెండు సంవత్సరాలు మంచి వర్షపాతం కురియడం, తద్వారా పంట ఉత్పత్తి పెరగడంతో ఈ ప్రణాళికలో వ్యవసాయ రంగం విజయవంతమైందని చెప్పవచ్చు. ఈ ప్రణాళిక కాలంలో స్థూల దేశీయోత్పత్తిలో 2.1% వృద్ధి సాధించాలనే లక్ష్యం ఉండగా అంతకు మించి 3.6 లక్ష్యం సాధించబడింది. ఈ కాలంలో నికర దేశీయోత్పత్తి 15% వృద్ధి చెందింది. దీని రుతుపవనాలు కూడా అనుకూలించడం ఒక కారణం. కాని జనాభా పెరుగుదల రేటు అధికంగా ఉండుటచే తలసరి ఆదాయం మాత్రం తక్కువ స్థాయిలో పెరిగింది. భాక్రానంగల్ ప్రాజెక్టు, హిరాకుడ్ ప్రాజెక్టు, మెట్టూరు డ్యాం వంటి పలు భారీ నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మించాలనే ఉద్దేశ్యానికి ప్రేరణ ఈ ప్రణాళిక కాలంలోనే కల్గింది. 1956లో ఈ ప్రణాళిక చివరి నాటికి దేశంలో 5 ఐఐటి లి స్థాపించబడ్డాయి. ఉన్నత విద్యకు నిధులు అందజేసి బలోపేతం చేయడానికి యూనివర్శిటీ గ్రాంట్స్ కమీషన్ కూడా ఈ ప్రణాళిక కాలంలోనే ఏర్పాటు చేయబడింది. దేశంలో 5 ఉక్కు పరిశ్రమలు స్థాపించడానికి కూడా కాంట్రాక్టుల పైన ఈ ప్రణాళిక కాలంలోనే సంతకాలు తీసుకున్నప్పటికీ, ఉక్కు కర్మాగారాలు మాత్రం రెండో ప్రణాళిక మధ్యకాలంలో ప్రారంభమయ్యాయి.

రెండో పంచవర్ష ప్రణాళిక

[మార్చు]

ఈ పంచవర్ష ప్రణాళిక 1956-57 నుంచి 1960-61 వరకు కొనసాగింది. 1954లో భారత జాతీయ కాంగ్రెస్ సదస్సులో సామ్యవాద సమాజాన్ని నిర్మించాలని ప్రకటన చేసినందున రెండో ప్రణాళికలో పారిశ్రామిక రంగంపై అందులోనూ ప్రభుత్వ రంగ సంస్థలపై అధిక దృష్టి కేంద్రీకరించారు. అందకు తగినట్లుగా మహలనోబిస్ నమునాను ఈ ప్రణాళిక నమునాగా స్వీకరించారు. పరిశ్రమల ద్వారా దేశీయోత్పత్తి పెంచడానికి ప్రోత్సాహం కల్పించారు. నీటిపారుదల ప్రాజెక్టులు, భిలాయ్, బొకారో, జంషెడ్పూర్ లాంటి చోట్ల భారీ ఉక్కు కర్మాగారాలను ఈ ప్రణాళిక కాలంలోనే ప్రారంభించారు. బొగ్గు ఉత్పత్తి కూడా పెంచబడింది.ఉత్తర భారతదేశంలో నూతన రైలు మార్గాలు కూడా ప్రారంభించబడ్డాయి. హోమీ-జే-భాభా చైర్మెన్ గా 1957లో అణు ఇంధన సంస్థ (Atomic Energy Commission) కూడా ఏర్పాటు చేయబడింది. పరిశోధనా సంస్థగా టాటా ఇన్‌స్టిట్యూట్ ఆప్ ఫండమెంటల్ రీసెర్చి (Tata Institute of Fundamental Research) కూడా ఈ ప్రణాళికలోనే స్థాపించబడింది.

మూడవ పంచవర్ష ప్రణాళిక

[మార్చు]

ఈ పంచవర్ష ప్రణాళిక 1961-62 నుంచి 1965-66 వరకు కొనసాగింది. స్వయం సమృద్ధి లక్ష్యంతో ముఖ్యంగా వ్యవసాయ రంగం లో, మౌలిక పరిశ్రమల రంగంలో ఉత్పత్తులు పెంచాలని ఈ ప్రణాళిక లక్ష్యంగా నిర్ణయించి దీనిని ప్రారంభించారు. మూడవ ప్రణాళిక వ్యయం 8577 కోట్ల రూపాయలు. రెండో ప్రణాళికలో భారీ పరిశ్రమలను ప్రాధాన్యత ఇవ్వడం వల్ల వ్యవసాయ రంగంలో ధరలు పెర్గినందువల్ల ఈ ప్రణాళికలో వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేయబడింది. భారతదేశ వ్యవసాయ రంగంలోనే విప్లవాత్మకమైన హరిత విప్లవం (Green Revolution) ఈ కాలం లోనే ప్రారంభించబడింది. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం ఈ ప్రణాళికా కాలం లోనూ కొనసాగింది. పలు చోట్ల సిమెంటు, ఎరువుల కర్మాగారాలు స్థాపించబడ్డాయి. సస్యవిప్లవం ప్రభావం వల్ల పంజాబ్లో గోధుమల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక పాఠశాలలు విరివిగా స్థాపించబడి విద్యావకాశాలను మెరుగుపర్చబడింది. క్రింది స్థాయి వరకు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి పంచాయతీ ఎన్నికలను నిర్వహించారు. పలు రాష్ట్రాలలో విద్యుత్తు బోర్డులను స్థాపించి గృహ, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు విద్యుత్ సరఫరా మెరుగు పర్చబడింది. ఇన్ని సౌకర్యాలు కల్పించబడినప్పటికీ మూడవ పంచవర్ష ప్రణాళిక చివరికి విఫలమైంది. దీనికి ప్రధాన కారణం చైనా యుద్ధం, రుతుపవనాల తిరోగమనం. ఈ రెండింటి కారణాళ వల్ల ఆహార ధాన్యాల ధరలు పెరిగి, విదేశీ మారక నిల్వలు తగ్గి, అప్పుల భారం పెరిగింది.

ప్రణాళిక సెలవు

[మార్చు]

చైనాతో యుద్ధం మూలంగా, వ్యవసాయ రంగంలో అనుకున్న ఫలితాలను [సాధించ లేకపోవుట 1] వల్ల వెంటనే నాల్గవ ప్రణాళిక ప్రారంభించడం అసాధ్యమని భావించిన ప్రభుత్వం 1966-69 వరకు ప్రణాళిక సెలవుగా ప్రకటించింది. 1966-69 కాలానికి 3 వార్షిక ప్రణాళికలను రూపొందించింది. ఈ కాలంలో రుతుపవనాలు కరుణించి మంచి వర్షపాతాన్ని కురిపించడంతో వ్యవసాయ ఉత్పత్తులు పెర్గి, ధరలు తగ్గి మళ్ళీ భారత ఆర్థిక వ్యవస్థ [పురోగాభివ్రుద్ధి చెందింది. 1].

నాల్గవ పంచ వర్ష ప్రణాళిక

[మార్చు]

ఈ ప్రణాళిక 1969-70 నుంచి 1973-74 వరకు కొనసాగింది. సుస్థిరమైన అభివృద్ధి సాధించడం ఈ ప్రణాళిక లక్ష్యంగా నిర్ణయించారు. వ్యవసాయ రంగంలో రైతులకు తగినంత రుణాలను అందించడానికి దేశంలోని ప్రముఖ పెద్ద బ్యాంకులను ఇందిరా గాంధీ ప్రభుత్వం జాతీయం చేసింది. పాకిస్తాన్ తో యుద్ధం, బంగ్లాదేశ్ శరణార్థుల సమస్య ఈ ప్రణాళికపై భారం మోసింది. పారిశ్రామిక అభివృద్ధి కోసం కేటాయించబడిన నిధులను యుద్ధం కోసం ఖర్చు చేయవలసి వచ్చింది. బుద్ధుడు నవ్వాడు అనే సంకేతంతో రాజస్థాన్ ఎడారిలోని పోఖ్రాన్లో అణుపరీక్షలు చేయడంతో అమెరికా ఆగ్రహానికి గురై ఆ దేశ సహాయంలో కూడా కోతపడింది. ఇన్ని ప్రతికూల పరిస్థితుల వల్ల ఈ ప్రణాళిక విఫలమైంది. అయిననూ ఈ ప్రణాళికలో అనేక గ్రామీణాభివృద్ధి పథకాలను చేపట్టడంతో పేదరిక నిర్మూలనకు, ఉపాధి అవకాశాలకు దోహదపడింది. పారిశ్రామిక రంగంలో 9% వృద్ధిరేటు సాధించాలనే లక్ష్యం కలగానే మిగిలిపోయింది.

ఐదవ పంచ వర్ష ప్రణాళిక

[మార్చు]

ఈ ప్రణాళిక 1974-75 నుంచి 1978-79 కాలంలో చేపట్టబడింది. గ్రామీణాభివృద్ధి, స్వయం సమృద్ధి ధ్యేయంగా ప్రారంభించబడిన ఈ ప్రణాళిక మురార్జీ దేశాయ్ నాయకత్వం లోని జనతా ప్రభుత్వం ఒక సంవత్సరం ముందుగానే నిల్పివేసింది. ద్రవ్యోల్బణంను తగ్గించడానికి ఈ ప్రణాళిక మంచి కృషి చేసింది. ఐదవ పంచవర్ష ప్రణాళిక యొక్క మొత్తం పెట్టుబడి 53411 కోట్ల రూపాయలు. ఈ ప్రణాళిక కాలంలోనే దేశ రాజకీయాలలో విపరీత పరిణామాలు సంభవించాయి. ఇందిరా గాంధీ ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని విధించడం ఈ కాలంలోనే జర్గింది. ఈ పరిణామాలు దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం కల్గించాయి. ఎమర్జెన్సీ తర్వాత వచ్చిన మురార్జీ ప్రభుత్వం ఈ ప్రణాళికను రద్దు చేసి నిరంతర ప్రణాళికలను (Rolling Plans) ప్రారంభించింది.

రోలింగ్ ప్లాన్స్

[మార్చు]

కేంద్రంలో ప్రభుత్వం మారడంతో ఇందిర ప్రభుత్వం ప్రారంభించిన ప్రణాళికను అర్థాంతరంగా ముగించి జనతా పార్టీ లక్ష్యాలతో మురార్జీ ప్రభుత్వం నిరంతర ప్రణాళికలను ప్రవేశపెట్టింది. ప్రముఖ ఆర్థిక వేత్త డి.టి.లక్డావాలాను ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మెన్ గా నియమించారు. ఈ ప్రణాళికనే ఆరవ ప్రణాళికగా భావించారు. కాని కేంద్రంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో దీన్ని కూడా రద్దుచేసి 1980 నుంచి ఆరవ పంచవర్ష ప్రణాళికను ప్రారంభించారు.

ఆరవ పంచ వర్ష ప్రణాళిక

[మార్చు]

ఉపాధ్యక్షుడు డి.పి. లకడవాల ఈ ప్రణాళిక 1980 నుంచి 1985 వరకు అమలులో ఉంది. పేదరిక నిర్మూలన ఈ ప్రణాళిక ధ్యేయం. ఈ ప్రణాళిక మొత్తం పెట్టుబడి 109290 కోట్ల రూపాయలు. అభివృద్ధి రేటు సంవత్సరానికి 5.2%గా నిర్ణయించారు. ఈ ప్రణాళిక కాలంలో పలు ఉపాధి నిర్మూలన కార్యక్రమాలను చేపట్టడం జర్గింది. ఐ.ఆర్.డి.పి. ట్రైసెమ్, యన్.ఆర్.ఇ.పి అందులో ముఖ్యమైనవి. ఈ ప్రణాళిక కాలంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరగడంతో పాటు అనుకున్న వృద్ధిరేటు కూడా 0.5 % అధికంగా సాధించడం జరిగింది. ఈ ప్రణాళికలో ఇంధన రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. వ్యవసాయరంగానికి, పరిశ్రమలకు అవస్థాపనా సౌకర్యాలను అభివృద్ధి పరుచుట, గ్రామీణ రంగాలలో ఉపాధి సౌకర్యాలు కల్పించుట వ్యూహంగా నిర్ణయించారు. ఆర్థిక, సాంకేతిక రంగాలలో స్వావలంబన, పేదరికం, నిరుద్యోగం నిర్మూలన మొదలగునవి ఈ ప్రణాళిక లక్ష్యాలు.

ఏడవ పంచ వర్ష ప్రణాళిక

[మార్చు]

ఈ ప్రణాళిక 1985లో ప్రారంభమై 1990 వరకు కొనసాగింది. రాజీవ్ గాంధీ హయంలో తయారైన ఈ ప్రణాళికలో ఆహారోత్పత్తి, ఉపాధి అవకాశాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. 20 వ శతాబ్దంలోకి పయనం అనే నినాదంతో దేశ భవష్యత్తు అవసారాల్ను దృష్టిలో ఉంచుకొని తయారుచేయబడిన ప్రణాళిక ఇది.శాస్త్ర, సాంకేతిక రంగాలలో గణనీయమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి ప్రణాళికలో అధిక ప్రాధాన్యత ఇచ్చారు. పేదరిక నిర్మూలన, నిరక్ష్యరాస్యత నిర్మూలన, మౌలిక సదుపాయాలు కల్పించడం దీని ఉప లక్ష్యాలు. ఏడవ ప్రణాళిక మొత్తం పెట్టుబడి 218730 కోట్ల రూపాయలు. తలసరి ఆధాయ వృద్ధిరేటు 3.6% ప్రణాళిక కాలంలోనే JYR జవహర్ రోజ్‌గార్ యోజనను ప్రారంభించారు. ఈ యోజన వివిధ రకాల పేర్లు మార్చుకొని ఇప్పటివరకు కూడా అమలులో ఉంది. ఈ ప్రణాళికలో నిర్ణయించిన లక్ష్యాలు సాధించినందువల్ల ఏడవ పంచవర్ష ప్రణాళిక విజయవంతమైందని చెప్పవచ్చు.

ఎనిమిదవ పంచ వర్ష ప్రణాళిక

[మార్చు]

ఏడవ ప్రణాళిక అంతం తర్వాత దేశంలో రాజకీయ అస్థిరత వల్ల ఎనిమిదవ ప్రణాళిక ప్రారంభించడానికి రెండు సంవత్సరాల ఆలస్యం అయింది. చివరికి 1992 ఏప్రిల్ 1 న ఈ ప్రణాళిక పట్టాలకెక్కింది. ఈ ప్రణాళిక పెట్టుబడి 7,98,000 కోట్ల రూపాయలు, ఇందులో పబ్లిక్ రంగం వాటా 4,34,100 (మొత్తం ప్రణాళిక పెట్టుబడిలో 45%). 1997 మార్చి 31 వరకు అమలులో ఉన్న ఈ ప్రణాళిక లక్ష్యాలు వ్యవసాయ రంగంలో స్వయం సమృద్ధి, ఏటా 5.6% అభివృద్ధి రేటు సాధించడం, ఎగుమతులు స్థూల జాతీయోత్పత్తిలో 13.6% పెరగడం, దిగ్య్మతుల రేటు 8.4%కి పరిమితం చేయడం, పొదుపు 21.6% దాకా ఉంచడం, జనాభా పెరుగుదల రేటు తగ్గించడం నిరక్ష్యరాస్యత నిర్మూలన మొదలైనవి.

తొమ్మిదవ పంచ వర్ష ప్రణాళిక

[మార్చు]

తొమ్మిదవ పంచవర్ష ప్రణాళిక 1997 ఏప్రిల్ 1 నుంచి 2002 మార్చి 31 వరకు అమలులో ఉంది. ఈ ప్రణాళిక మొత్తం పెట్టుబడి 2190000 కోట్ల రూపాయలు. ఈ ప్రణాళిక లక్ష్యాలు పేదరిక నిర్మూలన, వ్యవసాయ రంగ అభివృద్ధి, ద్రవ్యోల్బణ నిర్మూలన, ప్రాథమిక ఆరోగ్య వసతులు మెరుగు పర్చడం, స్థానిక సంస్థల అభివృద్ధి, జనాభా నియంత్రణ, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చడం మొదలగునవి.

పదవ పంచ వర్ష ప్రణాళిక

[మార్చు]

ఈ ప్రణాళిక ఏప్రిల్ 1, 2002 నుంచి మార్చి 31, 2007 వరకు కొనసాగింది. 10 వ ప్రణాళికలో ఆర్థికవృద్ధి రేటు లక్ష్యం 7.6% పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రణాళికలో వ్యవసాయ రంగం 2.13 వృద్ధిరేటు నమోదైంది. పారిశ్రామికరంగంలో 8.74%, సేవల రంగంలో 9.28% వృద్ధిరేటు నమోదైంది.

పదకొండవ పంచ వర్ష ప్రణాళిక

[మార్చు]

పదకొండవ పంచవర్ష ప్రణాళిక ముసాయిదాను జాతీయ ప్రణాళిక సంఘం నవంబర్ 2007లో ఆమోదించింది. 2007 నుంచి 2012 కాలంలో అమలయ్యే ఈ ప్రణాళికలో ఆర్థిక వృద్ధి రేటును 9%కు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించారు. ప్రాధాన్య రంగాల కార్యక్రమాల్లో పెటుబడులను గణనీయంగా పెంచడం ద్వారా మరింత సమగ్రంగా అభివృద్ధి సాధించాలని ప్రణాళికలో నిర్దేశించారు. నేపథ్యం: "వేగంగా, మరింత సఘంటిత అభివృద్ధి"

పన్నెండవ పంచవర్ష ప్రణాళిక

[మార్చు]

పన్నెండవ పంచవర్ష 2012 నుంచి 2017 వరకు ప్రణాళిక ముసాయుదాను జాతీయ ప్రణాళిక సంఘం

ప్ర్రణాళికా ముసాయిదా ముఖ్యాంశాలు  : 11 వ పంచవర్ష ప్రణాళిక మొత్తం పెట్టుబడి 36,44,000 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. ప్రణాళిక అమలు కోసం కేంద్రం కేటాయించాల్సిన స్థూల బడ్జెటరీ మద్దతు 14,21,711 కోట్ల రూపాయలు. ఇది గత ప్రణాళిక కంటే 6,00,000 కోట్లు అధికం. ప్రధానంగా ఈ ప్రణాళికలో సామాజిక, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధిపై దృష్టి పెట్టారు. ప్రాధాన్య రంగాలకు స్థూల బడ్జెట్ లో 74.67%కు పెంచారు. గత ప్రణాళికలో ఇది 55.2% మాత్రమే. విద్యారంగానికి ఈ ప్రణాళికలో మంచి కేటాయింపులు చేశారు. స్థూల బడ్జెట్ లో దీని వాటా 19.36%. దీని ప్రకారం ఈ ప్రణాళిక కాలంలో విద్యకై 2,75,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంది. వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు 4%గా నిర్ణయించారు.పారిశ్రామిక, సేవల రంగం వృద్ధి రేటును 9-11%గా నిర్ణయించారు.

ప్రణాళికల విజయాలు

[మార్చు]

1947 లో కొత్తగా స్వాతంత్ర్యం పొందిన మనదేశం ప్రతి అవసరాలకు ఇతర దేశాలపై ఆధారపడే అవసరం లేకుండా ప్రణాళిక బద్దంగా రూపొందిన లక్ష్యాల ఆధారంగా అభివృద్ధిని సాధించడం పంచవర్ష ప్రణాళికల విజయమేనని చెప్పవచ్చు. ప్రారంభంలో ఎన్ని ఆటంకాలు ఎదురైననూ అభివృద్ధిపథం వైపు పయనించడానికి ప్రణాళికలు కృషిచేశాయి. మొదటి పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయ రంగంలో మంచి ఉత్పత్తి సాధించగల్గాము. రెండో ప్రణాళికలో భారీ పరిశ్రమలకు మంచి ఊతం లభించింది. మూడో ప్రణాళిక విఫలమవడానికి చైనా యుద్ధం (1962), నెహ్రూ మరణం (1964), పాకిస్తాన్తో యుద్ధం (1965) కారణాలు. ఆ తర్వాత కూడా రుతుపవనాలు, దేశ రాజకీయ కారణాలు మొదలగునవి ప్రణాళికల అభివృద్ధిని తాత్కాలికంగా ఆపినా దేశ అభివృద్ధిని మాత్రం అడ్డగించలేవు. ఈనాడు దేశం శాస్త్ర, సాంకేతిక రంగాలలో అగ్రరాజ్యాలతో పోటీ పడుతున్నదానికి, సమాచార, శాస్త్ర, సంకేతిక, అంతరిక్ష రంగాలలో అంతెత్తున ఎగిరినదానికి ప్రణాళికబద్ద లక్ష్యాలే కారణం. పారిశ్రామికంగా కూడా బాగా అభివృద్ధి సాధించాం. ఒకప్పుడు ఆహారధాన్యాలకై ఇతరదేశాలపై ఆధారపడిన భారతదేశం ఈనాడు ఎగుమతి దశకు చేరడానికి, పారిశ్రామిక, రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించడానికి ప్రణాళికలు దోహదం చేశాయి.

ప్రణాళికల వైఫల్యాలు

[మార్చు]

పంచవర్ష ప్రణాళికల వల్ల ఎన్నో విజయాలు సాధించిననూ అవి నాణేనికి ఒక వైపు మాత్రమే. మరో వైపు చూస్తే ఎన్నో అపజయాలు, వైఫల్యాలు కొట్టొచ్చినట్లు కనబడతాయి. 6 దశాబ్దాల ప్రణాళికా భారతి ఏమి సాధించిందో గ్రామీణ రంగాన్ని ఒక్కసారి చూస్తే అర్థమౌతుంది. గత 60 సంవత్సరాలుగా కోట్ల రూపాయలు దారిద్యం, నిరుద్యోగం, జనాభా నిర్మూలన, ఉద్యోగ అవకాశాలపై ఖర్చు చేస్తున్ననూ అవి మరింతగా పెరగడం ఆశ్చర్యం కల్గుతుంది. ఇప్పటికీ పేదవారికి వారి జీవితాలలో మార్పేమీ లేదని పలు ఆర్థిక విశ్లేషణలు తెల్పుతున్నాయి. అంకెల్లో ప్రగతి బాగున్ననూ వాటి ఫలాలు మాత్రం కొందరే అనుభవిస్తున్నారు. అంతేకాకుండా ప్రణాళికలకు ఒక స్థిరమైన గమ్యంలేదని, రాజకీయ పార్టీలు తమ వాగ్దానాల కోసం, పార్టీ సిద్ధాంతాల కోసం ప్రణాళిక లక్ష్యాలను మార్చివేస్తున్నారనే అపవాదు ఉంది. మొదటి, రెండో ప్రణాళికలో పొమ్దుపర్చిన లక్ష్యాలనే 11 వ ప్రణాళికలో కూడా ఉండటం కచ్చితంగా ప్రణాళికా వైఫల్యమేనని చెప్పవచ్చు. ప్రణాళికా వ్యయంలో కూడా అధిక భాగం పనికిరాని పథకాల మీద, సబ్సిడీల మీద వెచ్చిస్తున్నారు. దాంతో రుణభారం మరింతగా పెరిగి భవిష్యత్తు భారం అవుతుంది. నాల్గవ ప్రణాళిక అనంతరం చెప్పుకోదగ్గ భారీ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం జరుగలేదు. వ్యవసాయరంగంలో తాత్కాలిక ఫలితాల సాధనకే ప్రాధాన్యం ఇచ్చారు. దేశంలో అధిక ప్రాంతాలు నేటికీ వ్యవసాయం పైనే ఆధారపడవల్సిన పరిస్థితి పోలేదు. దేశంలో సమతూలక అభివృద్ధి ఏర్పడలేదు.

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]
  1. saa


ఉల్లేఖన లోపం: "పురోగాభివ్రుద్ధి చెందింది." అనే గ్రూపులో <ref> ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="పురోగాభివ్రుద్ధి చెందింది."/> ట్యాగు కనబడలేదు