Jump to content

రాళ్ళపల్లి (నటుడు)

వికీపీడియా నుండి
(రాళ్ళపల్లి నరసింహారావు నుండి దారిమార్పు చెందింది)
రాళ్ళపల్లి

రాళ్ళపల్లి నరసింహారావు
జన్మ నామంరాళ్ళపల్లి నరసింహారావు
జననం (1945-08-15)1945 ఆగస్టు 15
మరణం మే 17, 2019
హైదరాబాదు, తెలంగాణ
భార్య/భర్త స్వరాజ్యలక్ష్మి
పిల్లలు విజయ మాధురి, రష్మిత
ప్రముఖ పాత్రలు ఏప్రిల్ 1 విడుదల
నువ్వు నేను

రాళ్ళపల్లిగా ప్రసిద్ధి చెందిన రాళ్ళపల్లి వెంకట నరసింహారావు (ఆగస్టు 15, 1945 - మే 17, 2019) తెలుగు సినిమా, రంగస్థల నటులు. నటనను వృత్తిగా, ప్రవృత్తిగా కాకుండా నటనే ప్రాణంగా ప్రేమించేవాళ్లలో అరుదైన నటుడే రాళ్లపల్లి. చిన్నతనం నుంచే నాటకాలు వేస్తూ వస్తున్న రాళ్లపల్లి దాదాపు ఎనిమిది వేలకు పైగా నాటక ప్రదర్శనల్లో నటించాడు. వీటిలో చాలా భాగం తను స్వయంగా రాసి దర్శకత్వం చేసినవే కావడం విశేషం. ఇక తనికెళ్ళ భరణి లాంటి రచయితలకు మార్గదర్శి కూడా రాళ్లపల్లే అంటే ఆశ్చర్యం కలగక మానదు.

జ్యోతిష్కుడు, హిజ్రా, యానాది, పోలీస్‌, నావికుడు... ఇలా ఏ పాత్రనైనా సరే అవలీలగా పోషించగలిగిన సహజ నటుడు రాళ్లపల్లి నరసింహారావు. నటనలో ఆయనకంటూ ఒక సొంత శైలి ఉంది. మూడు దశాబ్దాలలో ఆరొందల చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించారు రాళ్లపల్లి.

రాళ్ళపల్లి

నేపథ్యం

[మార్చు]

రాళ్ళపల్లి తూర్పు గోదావరి జిల్లా, రాచపల్లి లో 1945, ఆగస్టు 15 న జన్మించాడు.[1] బీకామ్‌ చదివిన రాళ్ళపల్లికి టెన్త్‌ అండ్‌ ఇంటర్మీడియట్‌ సర్టిఫికెట్స్‌తో రైల్వేలో క్లాస్‌ ఫోర్‌ జాబ్‌ (ప్యూన్ ఉద్యోగం) వచ్చింది. 1970, జనవరి 4న ఢిల్లీలోని ‘సాంగ్‌ అండ్‌ డ్రామా డివిజన్‌’ అనే ప్రభుత్వ సంస్థలోకి మారాడు.[2]

నాటకరంగం

[మార్చు]

ఈయనకి బాగా పేరు తెచ్చిన నాటకం కన్యాశుల్కం. చదువుకునే రోజుల్లో కళాశాలలో జరిగిన పోటీల కోసం మారని సంసారం అనే నాటిక రాశాడు. రచన, నటన రెండింటికీ అవార్డులు వచ్చాయి. సినీనటి భానుమతి రామకృష్ణ చేతుల మీదుగా ఆ అవార్డులు అందుకున్నాడు[3] నాటకమంటే ప్రాణమున్న రాళ్ళపల్లి, అనుకున్న టైమ్‌కే రిహార్సల్‌ మొదలుపెట్టేవాడు. ఆయన నాటకాలు సినిమా లెవల్లో ఉండేవి. ఖర్చంతా ఆయన భరించేవాడు. ఒకానొక దశలో నాటకంకోసం కోసం అప్పులుకూడా చేశాడు. అప్పుల నేపథ్యంలో ‘ముగింపు లేని కథ’ అనే నాటకం రాసి, దాదాపు వందసార్లకుపైగా ఆ నాటకాన్ని ప్రదర్శించి, వేసిన ప్రతిసారీ ‘ఉత్తమ నాటకం’ అనిపించుకునేలా తీర్చిదిద్దాడు.[2]


సినిమా రంగం

[మార్చు]

కొమ్మూరి వేణుగోపాలరావు రాసిన హారతి అనే నవల ఆధారంగా సినిమా తీస్తున్నట్లు పత్రికలో ప్రకటన వచ్చింది. అది చూసిన రాళ్ళపల్లి భార్య సినిమాలపై ఆయనకున్న ఆసక్తిని గమనించి దరఖాస్తు చేయమంది. చూడ్డానికి అందగాడిని కాకపోయినా నాకు నాటకాల్లో అనుభవం ఉంది. పనికొస్తే చూడండి అంటూ దరఖాస్తు పెట్టాడు. వెంటనే రమ్మని టెలిగ్రాం వచ్చింది. ఇంటర్వ్యూకు వెళ్లినప్పుడు - ఆ సినిమాకు మాటల రచయిత రాచకొండ విశ్వనాథశాస్త్రి, పాటల రచయిత సినారె అక్కడికి వచ్చారు. ఏదో ఒక సీన్‌ కెమెరా ముందు నటించి చూపించమన్నారు వాళ్లు. ఇదివరకు ఇతడు రాసిన నాటకంలోని ఒక సన్నివేశాన్ని వారి ముందు ప్రదర్శించాడు. అలా ఇతడికి ఊరుమ్మడి బతుకులు చిత్రం లో అవకాశం వచ్చింది. జాతీయస్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపికైంది.[3]

అలా నాటకాల్లో నటిస్తూనే 1973లో ‘స్త్రీ’ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. ‘ఊరుమ్మడి బతుకులు’ సినిమాతో కెరీర్ కు బ్రేక్ తో పాటు నంది పురస్కారం కూడా ఆయన సొంతమైంది. ఆ తర్వాత చిల్లరదేవుళ్లు, చలిచీమలు సినిమాలు రాళ్లపల్లికి తిరుగులేని గుర్తింపును తెచ్చాయి.

వీరు ఇప్పటి వరకు దాదాపుగా 850 చిత్రాలలో నటించారు. ఊరుమ్మడి బ్రతుకులు చిత్రం నటనతో గుర్తింపు పొందారు. హాస్య నటుడిగా గుర్తింపు పొందిన చిత్రం నాగమల్లి (దేవదాస్ కనకాల దర్శకుడు). జంధ్యాల దర్శకత్వం వహించిన ఎక్కువ భాగం చిత్రాలలో నటించారు. సీతాకోకచిలుక చిత్రంలో శరత్ బాబు వద్ద పాలేరు గా అమోఘంగా నటించి కారెక్టర్ నటునిగా కూడా గుర్తింపుపొందారు. వంశీ చిత్రాలలో తప్పనిసరి నటులలో ఒకరు. (అన్వేషణ, లేడీస్ టైలర్, ఏప్రిల్ ఒకటి విడుదల, జోకర్ వగైరా). 2015లో వచ్చిన ‘భలే భలే మగాడివోయ్‌’ సినిమాలో చివరిసారిగా నటించాడు.[4]

సహజంగా వీరి ఇళ్లలో మగవాళ్లకు వంట బాగా చేయడం వచ్చు. మంచి కళాకారుడు మంచి వంటవాడు అయ్యుండాలన్నది ఇతడి అభిప్రాయం. కమల్‌హాసన్‌, కె.విశ్వనాథ్‌, బాలకృష్ణ, కోదండరామిరెడ్డి వంటి వాళ్లందరూ వీరి చేతి వంట తిన్నవాళ్లే! వంశీ అయితే షూటింగ్‌లోకి వెళ్లి మేకప్‌ వేసుకున్న తరువాత కూడా స్వామీ నీకు ఈ రోజు మధ్యాహ్నం వరకు షూటింగ్‌ లేదు. ఏం చేస్తావో ఏమో తెలీదు. వంట చేసుకురా అని అడిగేవారు. మరోసారి - వైజాగ్‌ వద్ద ‘శుభసంకల్పం’ షూటింగ్‌ జరుగుతోంది. కె.విశ్వనాథ్గారు కారులో నుంచి దిగుతూనే రాళ్ళపల్లి నమస్కారం సార్‌ అన్నాడు. అప్పుడాయన ఏమయ్యా, నీ గురించి గొల్లపూడి మారుతీరావు ఘనంగా చెప్పాడు అన్నారాయన. నేను నాన్‌ కంట్రవర్సియల్‌ కదా, నా గురించి ఏం చెప్పారబ్బా అని రాళ్ళపల్లి ఆశ్చర్యపోయాడు. లోపలి నుంచి ఒక సంచి తీసుకొచ్చిన గొల్లపూడి మారుతీరావు నువ్వు వంట చాలా బాగా చేస్తావు కదా. ఆ మాటే విశ్వనాథ్‌గారు నీతో చెబుతున్నారు. ఈ రోజు నీకు షూటింగ్‌ లేదు. వంట చేసి పెడితే తింటాం అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చారు. రాళ్ళపల్లి అప్పటికప్పుడు గుత్తివంకాయ కూర, ములక్కాడల సాంబారు చేశాడు. కమల్‌హాసన్‌ సంతృప్తిగా భోంచేశారు. అక్కడే ఉన్న విశ్వనాథ్‌గారి దగ్గరికి వెళ్లిన ఆయన సార్‌, నాకు గంట విశ్రాంతి కావాలి. దయచేసి షూటింగ్‌కు పిలవొద్దు. ఈ భోజనం అంత డిఫరెంట్‌గా ఉంది అన్నారు. కమల్‌ సాయంత్రం రాళ్ళపల్లి వద్దకు వచ్చి సార్‌, భగవంతుడి దయ వల్ల మీకు సినిమా అవకాశాలు చాలా రావాలని కోరుకుంటున్నాను. అయితే ఎప్పుడైనా మీరు సినిమాల నుంచి బయటికి వస్తే.. దయచేసి మద్రాసుకొచ్చి.. నాకు వంట చేసి పెడితే చాలు అన్నాడు. దాంతో నాకు మరో వంట అవకాశం కూడా దొరికిందన్న మాట అనుకుని రాళ్ళపల్లి నవ్వుకున్నాడు.

హాస్యనటుడిగా

[మార్చు]

దర్శకులు జంధ్యాల, వంశీల పరిచయం రాళ్లపల్లిలోని హాస్య నటుడిని చూపించాయి. ఈ ఇద్దరు దర్శకత్వం వహించిన దాదాపు అన్ని సినిమాల్లో రాళ్లపల్లి కోసం ఓ పాత్ర ప్రాణం పోసుకోవాల్సిందే. ముఖ్యంగా వంశీ ప్రతి సినిమాలోనూ ఈయన కోసం ప్రత్యేకమైన పాత్రలు ఉండాల్సిందే. సితార, కనకమహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్, అన్వేషణ, ఏప్రిల్ 1 విడుదల, జోకర్, ఆలాపన లాంటి వంశీ డైరెక్ట్ చేసిన ఎన్నో సినిమాల్లో రాళ్లపల్లికి విశిష్టమైన స్థానం ఉంది.[5]

విలక్షణ నటుడిగా

[మార్చు]

పరిశ్రమలోని అందరు పెద్ద నటులతోనూ నటించాడు రాళ్లపల్లి. మణిరత్నం ‘బొంబాయి’ సినిమాలో హిజ్రాగా నటించి ఔరా అనిపించాడు. మరోవైపు డబ్బింగ్ ఆర్టిస్ట్ గానూ ఆకట్టుకున్నాడు. నిజానికి సినిమా పరిశ్రమలోని నాటి తరం ఆర్టిస్టులంతా నాటక రంగం నుంచి వచ్చిన వారే. నటులుగా వారికి నటన దేవుడిచ్చిన వరమైతే, నటనంటే దైవం కంటే ఎక్కువగా భావించారు. కాబట్టే దాన్నో పవిత్రమైన వృత్తిగా ఫీలయ్యారు. 1958లోనే హైదరాబాద్ కు మకాం మార్చారు. మరోవైపు తనకు ఇంత గుర్తింపు తెచ్చిన నాటకరంగం పై తెలుగు విశ్వవిద్యాలయం లోని రంగస్థల కళలశాకలో ఎం.ఫిల్ కూడా చేశారు.

జ్ఞాపకాలు

[మార్చు]

ఇతని పెద్దమ్మాయి చనిపోవడం జీవితంలో ఒక చేదు జ్ఞాపకం. మెడిసిన్‌ చదవడానికి రష్యా వెళుతూ జ్వరంతో చనిపోయింది.[2] ఏ ఫ్లయిట్‌లో ఆమెను ఆ దేశానికి పంపించాలనుకున్నాడో. అదే ఫ్లయిట్‌లో తిరిగి ఆమె మృతదేహం రావడం. ఆ దుర్ఘటన చూసి తట్టుకోలేకపోయాడు. ‘బాధ అనేది నీ లోపల దాచుకో. ఆనందాన్ని పదిమందికి పంచు’ అనేది ఇతడి తత్వం. అందుకే ఇతడి వ్యక్తిగత బాధలను ఎవరికీ చెప్పుకోవడం ఇష్టం ఉండదు. ‘స్త్రీ’ అనే చిత్రానికి ఇతడు తీసుకున్న రెమ్యునరేషన్‌ రూ. 300. 'ఊరుమ్మడి బతుకులు ' చిత్రానికి తీసుకున్నది రూ. 800. అప్పట్లో, అంటే 1970లోనే ఇతడికి రెండువేల రూపాయల జీతం వచ్చేది. ఆ రోజుల్లో అది పెద్ద జీతం. దాన్ని వదులుకుని సినిమాల్లోకి వచ్చాను. ఉద్యోగంలోనే ఉంటే రిటైర్‌ అయ్యాక కొంత డబ్బు వచ్చేది. పాతికవేలు పెన్షన్‌ వచ్చేది. కాని రాళ్లపల్లిని ఇంతమంది గుర్తు పెట్టుకునేవారు కాదు. సినిమాల్లోకి రాబట్టే నాకింత గుర్తింపు వచ్చింది. నేటి సినిమా ఫక్తు వ్యాపారం. కళాత్మకదృష్టి లేదు. ఇతర దేశాలకు వెళ్లినప్పుడు తెలుగు వాళ్ల ఇళ్లలో ‘మాయాబజార్‌’, ‘మిస్సమ్మ’, ‘దేవదాసు’, ‘నర్తనశాల’, ‘లవకుశ’ లేదంటే ఎంటర్‌టైన్‌మెంట్‌ వాల్యూస్‌ ఎక్కువగా ఉన్న జంధ్యాల, ముళ్లపూడి వంటి వాళ్ల సినిమాలే కనిపిస్తాయి. ఇప్పుడు రిలీజవుతున్న సినిమాలను భద్రపరుచుకునే వాళ్లే లేరు. థియేటర్‌లో సినిమా చూసి ఇంటికొచ్చిన తరువాత మననం చేసుకునే చిత్రాలు ఉండటం లేదు. అని అంటాడాయన. బుల్లితెరలో ‘జననీ జన్మభూమి’ అనే టెలిఫిల్మ్‌కు నంది అవార్డు వచ్చింది. చిలకమర్తి లక్ష్మీనరసింహంగారి రచన ‘గణపతి’ సీరియల్‌లో ఒక పాత్రకు ఉత్తమ సహాయనటుడుగా నంది వచ్చింది. నాటకం, సినిమా, టీవీరంగం మూడు నాకు సమానమే. ఎక్కడైనా నటన నటనే! అని చెప్పే రాళ్ళపల్లికి ఎందుకో తనకు బుల్లితెర వారు ప్రాధాన్యం ఇవ్వడం లేదు అనే అభిప్రాయం ఉంది.

ఇతడు ‘చలిచీమలు’లో ఒక పాట పాడాడు. ఆ రోజుల్లో ఎల్‌పీ రికార్డుగాను వచ్చింది. కోడిబాయలచ్చమ్మది పాటలాగే ఉంటుందా పాట. అది ‘‘భూమిబాయె బుట్రబాయె, నోటికాడ కూడుబాయె, అమ్మకుండ ఎడ్లుబాయె, బతుకే చిమ్మచీకటాయె..’’. ఈ పాటను ఇతడు పాడటమే కాదు, ఆ పాత్రలో నటించాడు కూడా.

రాళ్లపల్లి రంగస్థల పురస్కారం

[మార్చు]

ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజైన ఆగస్టు 15న కళాకారుల్లో ఒకరకి సన్మానం చేసి 50వేల రూపాయలు ఇచ్చేవాడు.[2]

  1. శ్రీమతి ఇందిరాదేవి - 2016

నటించిన చిత్రాలు

[మార్చు]

మరణం

[మార్చు]

గత కొంతకాలంగా శ్వాసకోశ ఇబ్బందితో బాధపడుతున్న రాళ్ళపల్లి హైద‌రాబాద్‌లోని మ్యాక్స్ క్యూర్ చికిత్సపొందుతూ 2019, మే 17న మరణించాడు.[7][8][9]

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. నెట్ టీవి 4 యూ. "Rallapalli". www.nettv4u.com.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  2. 2.0 2.1 2.2 2.3 సాక్షి, ఫ్యామిలీ (19 May 2019). "రత్నాలపల్లి". Archived from the original on 2019-05-18. Retrieved 19 May 2019.
  3. 3.0 3.1 "నా పాత్రల్లో రాళ్లపల్లి కనిపించడు". ఆంధ్రజ్యోతి. 2015-10-26. Archived from the original on 2015-10-26. Retrieved 2015-10-26.
  4. సాక్షి, సినిమా (18 May 2019). "రత్నంలాంటి నటుడు". Archived from the original on 2019-05-17. Retrieved 19 May 2019.
  5. ఆంధ్రభూమి (18 May 2019). "నవరస రాళ్లపల్లి". Archived from the original on 19 May 2019. Retrieved 19 May 2019.
  6. Bharat Movies, Movie Pages. "Aadadhi. Aadadhi Movie Cast & Crew". www.bharatmovies.com. Retrieved 11 August 2020.[permanent dead link]
  7. The Hindu, Hyderabad (17 May 2019). "Rallapalli dead". M. Rahul. Archived from the original on 19 May 2019. Retrieved 19 May 2019.
  8. సాక్షి, సినిమా (17 May 2019). "సీనియర్‌ నటుడు రాళ్లపల్లి కన్నుమూత". Archived from the original on 2019-05-17. Retrieved 19 May 2019.
  9. ఆంధ్రప్రభ, సినిమా (16 May 2019). "రాళ్ల పల్లి ఇక లేరు-శ్వాసకోశ వ్యాధితో చికిత్స పొందుతూ మృతి". Archived from the original on 19 May 2019. Retrieved 19 May 2019.

బయటి లింకులు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.