బొబ్బట్టు
స్వరూపం
బొబ్బట్లు తెలుగువారు పండగలలో చేసుకునే ఒక తీపి పిండివంట. పూజలలో కూడా అంటే వరలక్ష్మీ వ్రతం మెదలయిన పూజలలో కూడా చేసి అమ్మవారికి నైవేద్యంగా కూడా సమర్పిస్తారు. ఇవి చాలా రుచిగా ఉంటాయి.
కావలసిన పదార్ధాలు
[మార్చు]- మైదా పిండి
- శనగపప్పు
- పంచదార
- ఏలకులు తగినన్ని
తయారుచేయు విధానం
[మార్చు]- మైదాపిండిని కొద్దిగా నూనె, ఉప్పు వేసి, నీళ్ళు పోసి చపాతీ పిండిలాగ కలుపుకొని, మూతపెట్టి పక్కన పెట్టుకోవాలి.
- శనగపప్పును ఎక్కువగా కాకుండా తగినంత మాత్రమే అంటే సరిగ్గా ఉడకడానికి సరిపోయినంత నీరుపోసి కుక్కరులో ఉడికించాలి. దానిలో పంచదార వేసి గ్రైండు చేయాలి. దీనిలో ఏలకుపొడి కూడా వేస్తారు. ఈ ముద్దను చిన్న చిన్న ఉండలు చేసి పెట్టుకోవాలి.
- ఇప్పుడు కలిపి పెట్టుకున్న మైదాపిండి నుండి చిన్న ఉండను తీసుకొని. చేతికి నూని రాసుకొని, మైదాపిండి ఉండను అరచేతిలో ఉంచుకొని కొద్దిగా చేతితోనే రొట్టిలా సాగదీసి, అందులో శనగపప్పు-పంచదార ముద్దను పెట్టి పూర్తిగా మూసివేయాలి. ఎక్కడా లోపల ఉన్న ముద్ద కనబడకుండా జాగ్రత్తగా మూయాలి.
- ఇప్పుడు అరటి ఆకుమీదకానీ, లేకపోతే పాలకవరుమీదకానీ, ఏదైనా దళసరి కవరుమీదైనా సరే, నూని రాసి, ఈ తయారుచేసుకున్న ఉండను చేతితోనే గుండ్రంగా వచ్చేలా రొట్టెలాగ కొంచెం లావుగానే వత్తుకోవాలి. లోపలపెట్టిన తీపి పదార్థం బయటకు రాకుండా వత్తుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి అది వేడెక్కాక, కొద్దిగానూని రాసి, ఆకుమీద తయారుచేసుకున్న రొట్టెను, అలాగే ఆకుతోనే తీసి పెనంమీద రొట్టె పడేటట్లు, పైవైపుకు ఆకు వచ్చేటట్లు వేసి, మెల్లగా ఆకును తీసివేయాలి.
- రొట్టెకు చుట్టూ నూనికాని, నెయ్యిగానీ వేస్తూ, చపాతీలాగానే తిరగవేస్తూ, సన్నపు మంటమీద రెండు ప్రక్కలా ఎర్రగా కాల్చాలి.
- ఈ బొబ్బట్లను నెయ్యిరాసుకుని, వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది.
ఈ బొబ్బట్టునే కర్నూలు వైపు వారు, తక్కువ నూని వేసి, తీపి రొట్టెలలాగ చేస్తారు. ఈ కాలంలో ఆరోగ్యం గురించి ఎక్కువ ఆలోచిస్తూ, నెయ్యి నూనెలు వాడకం తగ్గిస్తున్నారు కనుక ఈ విధంగా చేయడం కూడా బాగుంటుంది. ఈ విధంగా చేసేటప్పుడు, వత్తడానికి పిండినే ఉపయేగిస్తారు. మామూలుగా చపాతీ వత్తినట్లే వత్తుతారు. ఇవి చాలా పెద్దవిగానూ వీలైనంత పల్చగానూ (సన్నగా) ఉంటాయి. నూని, నెయ్యి ఎక్కువగా ఉండవు కనుక, వీనిని పాలల్లో కూడా వేసుకుని తింటారు. వీనిని తెలుగువారే కాక ఈ విధంగా మహారాష్ట వారు కూడా చేస్తారు.
Look up బొబ్బట్టు in Wiktionary, the free dictionary.