Jump to content

పూతరేకులు

వికీపీడియా నుండి
(పూతరేకు నుండి దారిమార్పు చెందింది)
తీయనైన పూతరేకులు

పూతరేకులు ఆంధ్రప్రాంతానికి చెందిన అత్యంత ప్రసిద్ధ మిఠాయిలు. కొన్ని ప్రాంతాలలో వీటిని పొరచుట్టలు అని కూడా పిలుస్తారు. పూతరేకులు చేయడం ఒక కళగా భావిస్తారు. ఈ కళ కేవలం తూర్పు గోదావరి జిల్లా లోని కొన్ని ప్రాంతాలకే పరిమితం. జిల్లాలోని ఆత్రేయపురం మండలం గురించి మరేవిధంగా తెలియక పోయినా పూతరేకుల పరంగా ఈ మండలం బహుప్రసిద్ధం. ఈ మండల పరిధిలోని గ్రామాలు పూతరేకుల తయారీతో కళకళ లాడుతుంటాయి. పూతరేకులు మరికొన్ని చోట్ల తయారు చేయబడుతున్నా వీరు మాత్రమే ఈ కళలో నిష్ణాతులు. వీరి చేతిలోనే వాటి అసలు రుచి. ఇక్కడ పూతరేకులను కుటీర వృతి గా చేస్తూ జీవనం సాగిస్తారు.

పుట్టు పూర్వోత్తరాలు

[మార్చు]

పూతరేకుల పుట్టుక బహు విచిత్రం. ఒక వృద్దురాలు వంటచేసే సమయంలో ఆమెకు కలిగిన ఊహకు రూపం పూతరేకు. తదనంతరం దానిని మరింత అభివృద్ధి పరచి ఎన్నో విధములైన పూతరేకులను సృష్టించారు.

తయారీ విధానం

[మార్చు]
పూతరేకుల తయారీ

పూతరేకుల తయారీకి కాల్చిన పెద్ద మట్టి కుండను వాడుతారు. కుండ నున్నగా గుండ్రంగానూ ఉండేలా చూసుకొంటారు. దాని మూతి వైపుగా కట్టెలు పెట్టేంత వెడల్పుగా కుండకు రంధ్రం చేస్తారు. ఇడ్లీకి వాడే విధంగా మినప, వరిపిండి మిశ్రమాన్ని పల్చగా జాలుగా వచ్చేలా చేసుకొని ఒకరోజు పాటు నిల్వ ఉంచుతారు. మరుసటి రోజు కుండకు ఉన్న రంధ్రం ద్వారా కట్టెలు పెట్టి, మంట పెట్టి కుండను వేడెక్కిస్తాఅరు. జాలుగా తయారుచేసుకుని సిద్ధంగా ఉంచుకున్న పిండిలో పల్చని గుడ్డను ముంచి, దానిని విప్పి వెడల్పుగా కుండపై ఒకవైపు నుండి మరొక వైపుగా లాగుతారు. వేడెక్కిన కుండపై పిండి పల్చని పొరలా ఒక పేపర్ మందంతో ఊడి వస్తుంది దానిని రేకుగా పిలుస్తారు.

ఈ రేకులో తీపిపదార్థాలను వేసి పొరలుపొరలుగా మడిచిపెట్టి పూతరేకులను తయారుచేస్తారు. ఈ తీపి పదార్థాలు రకరకాలుగా ఉంటాయి. నెయ్యి, బెల్లం వేసి వేసి తయారుచెయ్యడం సంప్రదాయికంగా వస్తున్న పద్ధతి. అలాగే పంచదార పొడి వేసి కూడా తయారుచేస్తారు. జీడిపప్పు, బాదం పప్పు వేసి తయారుచెయ్యడం ఒక పద్ధతి. మధుమేహవ్యాధి ఉన్నవారికోసం సుగర్‌ఫ్రీ పూతరేకులను కూడా తయారుచేస్తున్నారు.[1] కర్ణాటక రాష్ట్రములోని మంగళూరు జిల్లాలో జైనుల సంప్రదాయ మిఠాయి అయిన కట్టమండీగె (ಕಟ್ಟಮಂಡಿಗೆ) తయారీ కూడా ఈవిధంగానే ఉంటుంది[2].

సినిమాల్లో పూతరేకులు

[మార్చు]
  • బెండు అప్పారావు ఆరెంపీ సినిమాలో పూతరేకుల తయారీని క్లుప్తంగా చూపించారు.
  • ఛత్రపతి సినిమాలో మన్నేల తింటివిరా కృష్ణా అనే పాటలో ఆత్రేయపురం పూతరేకుల ప్రస్తావన వస్తుంది.

బయటిలింకులు

[మార్చు]

"పూతరేకులు వీడియో, లోకల్ కిచెన్ (తెలుగు వన్) Local Kitchen - East Godavari dist. Atreyapuram Special Putarekulu - YouTube". youtube.com. 2015. Retrieved 15 June 2015.

  1. పూతరేకుల తయారీ[permanent dead link]
  2. ఆత్రేయపురం పూతరేకులు

మూలాలు

[మార్చు]
  1. "ఆత్రేయపురం పూతరేకులు అంటే ఒక స్వీట్ కాదు, ప్రపంచపటంలో నిలిచిన ఒక బ్రాండ్". Archived from the original on 2016-10-24. Retrieved 2016-10-24.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. https://m.facebook.com/story.php?story_fbid=3202053663157295&id=100000580775269

3. https://www.atreyapurampootharekulu.com/