పీరియడ్ 5 మూలకం
ఆవర్తన పట్టిక లో పీరియడ్ 5 |
పీరియడ్ 5 మూలకం, మూలకాల ఆవర్తన పట్టికలోని 5వ అడ్డువరుస (పీరియడ్) లోని రసాయన మూలకాలలో ఒకటి. మూలకాల పరమాణు సంఖ్య పెరిగేకొద్దీ వాటి రసాయన ప్రవర్తనలో పునరావృతమయ్యే (ఆవర్తన) ధోరణులను వివరించడానికి ఆవర్తన పట్టికను అడ్డు వరుసలలో రూపొందించారు: రసాయన ప్రవర్తన పునరావృతం కావడం ప్రారంభించినప్పుడు కొత్త వరుస ప్రారంభమవుతుంది, అంటే ఒకే విధమైన ప్రవర్తన కలిగిన మూలకాలు ఒకే నిలువు వరుసలో వస్తాయి.
ఐదవ పీరియడ్‌లో 18 మూలకాలుంటాయి. రుబిడియంతో ప్రారంభమై జినాన్‌తో ముగుస్తుంది. నియమం ప్రకారం, పీరియడ్ 5 మూలకాలు ముందుగా వాటి 5s షెల్, తర్వాత వాటి 4d, 5p షెల్‌లు ఆ క్రమంలో నిండుతాయి; అయితే, రోడియం వంటి మినహాయింపులు ఉన్నాయి.
మూలకాలు, వాటి లక్షణాలు
[మార్చు]మూలకం బ్లాక్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషను 37 Rb రుబీడియం s-బ్లాక్ [Kr] 5s1 38 Sr స్ట్రాన్షియం s-బ్లాక్ [Kr] 5s2 39 Y యిట్రియం d-బ్లాక్ [Kr] 4d1 5s2 40 Zr జిర్కోనియం d-బ్లాక్ [Kr] 4d2 5s2 41 Nb నియోబియం d-బ్లాక్ [Kr] 4d4 5s1 (*) 42 Mo మోలిబ్డినం d-బ్లాక్ [Kr] 4d5 5s1 (*) 43 Tc టెక్నీషియం d-బ్లాక్ [Kr] 4d5 5s2 44 Ru రుథేనియం d-బ్లాక్ [Kr] 4d7 5s1 (*) 45 Rh రోడియం d-బ్లాక్ [Kr] 4d8 5s1 (*) 46 Pd పెల్లేడియం d-బ్లాక్ [Kr] 4d10 (*) 47 Ag వెండి d-బ్లాక్ [Kr] 4d10 5s1 (*) 48 Cd కాడ్మియం d-బ్లాక్ [Kr] 4d10 5s2 49 In ఇండియం p-బ్లాక్ [Kr] 4d10 5s2 5p1 50 Sn తగరం p-బ్లాక్ [Kr] 4d10 5s2 5p2 51 Sb యాంటిమొనీ p-బ్లాక్ [Kr] 4d10 5s2 5p3 52 Te టెల్లూరియం p-బ్లాక్ [Kr] 4d10 5s2 5p4 53 I అయోడిన్ p-బ్లాక్ [Kr] 4d10 5s2 5p5 54 Xe జెనాన్ p-బ్లాక్ [Kr] 4d10 5s2 5p6
(*) మడెలుంగ్ నియమానికి మినహాయింపు
s-బ్లాక్ అంశాలు
[మార్చు]రూబిడియం
[మార్చు]రూబిడియం పీరియడ్ 5 లోని మొదటి మూలకం. ఇది ఆవర్తన పట్టికలో అత్యంత రియాక్టివ్ సమూహమైన క్షార లోహల్లో ఒకటి. ఇతర క్షార లోహాలు, ఇతర పీరియడ్ 5 మూలకాలతో లక్షణాల్లో సారూప్యతలను కలిగి ఉంటుంది. రూబిడియం కూడా క్షార లోహాలలో పరమాణు సంఖ్య పెరిగే కొద్దీ రియాక్టివిటీని పెంచే ధోరణిని అనుసరిస్తుంది, ఎందుకంటే ఇది పొటాషియం కంటే ఎక్కువ రియాక్టివ్‌గా ఉంటుంది, కానీ సీసియం కంటే తక్కువగా ఉంటుంది. అదనంగా, పొటాషియం, రుబిడియం రెండూ మండించినప్పుడు దాదాపు ఒకే రంగును ఇస్తాయి. కాబట్టి పరిశోధకులు ఈ రెండు 1వ గ్రూపు మూలకాల మధ్య తేడాను గుర్తించడానికి వేర్వేరు పద్ధతులను ఉపయోగించాలి. [1] ఇతర క్షార లోహాల మాదిరిగానే, రూబిడియం కూడా గాలిలో ఆక్సీకరణకు గురై, తక్షణమే రుబిడియం ఆక్సైడ్‌గా రూపాంతరం చెందుతుంది, దీని రసాయన సూత్రం Rb2O. [2]
స్ట్రోంటియం
[మార్చు]స్ట్రోంటియం 5వ పీరియడ్ లోని రెండవ మూలకం. సాపేక్షంగా రియాక్టివ్ సమూహమైన క్షార మృత్తిక లోహాల్లో ఒకటి. అయితే క్షార లోహాలంత రియాక్టివ్ కాదు. స్ట్రోంటియం ఒక మృదువైన లోహం. నీటితో చాలా రియాక్టివ్‌గా ఉంటుంది. ఇది నీటితో కలిసినపుడు, అది ఆక్సిజన్, హైడ్రోజన్ రెండింటి అణువులతో కలిసి స్ట్రోంటియం హైడ్రాక్సైడ్, స్వచ్ఛమైన హైడ్రోజన్ వాయువును ఏర్పరుస్తుంది. ఈ హైడ్రోజన్ త్వరగా గాలిలో వ్యాపిస్తుంది. అదనంగా, రూబిడియం లాగా స్ట్రోంటియం కూడా గాలిలో ఆక్సీకరణం చెందుతుంది, పసుపు రంగులోకి మారుతుంది. మండించినప్పుడు, అది బలమైన ఎర్రటి మంటతో కాలిపోతుంది.
d-బ్లాక్ మూలకాలు
[మార్చు]యట్రియం
[మార్చు]యిట్రియం (Y) పరమాణు సంఖ్య 39 కలిగిన రసాయన మూలకం. ఇది వెండి-లాంటి తెల్లటి, పరివర్తన లోహం. రసాయనికంగా లాంతనైడ్‌ల మాదిరిగానే ఉంటుంది. ఇది తరచుగా " అరుదైన భూ మూలకం "గా వర్గీకరించబడింది. [3] ప్రాకృతికంగా యిట్రియం దాదాపు ఎల్లప్పుడూ లాంతనైడ్‌లతో కలిసి లభిస్తుంది, స్వేచ్ఛా మూలకంగా లభించదు. దాని ఏకైక స్థిరమైన ఐసోటోప్, 89Y, సహజంగా సంభవించే ఏకైక ఐసోటోప్.
జిర్కోనియం
[మార్చు]జిర్కోనియం (Zr) పరమాణు సంఖ్య 40 కలిగిన రసాయన మూలకం. జిర్కోనియం పేరు జిర్కాన్ అనే ఖనిజం నుండి వచ్చింది. దీని పరమాణు ద్రవ్యరాశి 91.224. ఇది టైటానియంను పోలి ఉండే మెరిసే, బూడిద-తెలుపు రంగులో ఉండే, బలమైన పరివర్తన లోహం. జిర్కోనియం ప్రధానంగా ఉష్ణనిరోధకంగా ఉపయోగిస్తారు. చిన్న మొత్తాలలో తుప్పుకు బలమైన నిరోధకత కోసం మిశ్రమ ఏజెంట్‌గా కూడా ఉపయోగిస్తారు. జిర్కోనియం ప్రధానంగా జిర్కోనియం ఖనిజంలో లభిస్తుంది. ఇది వాడుకలో ఉన్న జిర్కోనియం యొక్క అతి ముఖ్యమైన రూపం.
నియోబియం
[మార్చు]నియోబియం, లేదా కొలంబియం (Nb) పరమాణు సంఖ్య 41 కలిగిన రసాయన మూలకం. ఇది మృదువైన, బూడిద రంగులో ఉండే, సాగే పరివర్తన లోహం. ఇది నియోబియం, కొలంబైట్‌లకు ప్రధాన వాణిజ్య వనరైన పైరోక్లోర్ ఖనిజంలో తరచుగా లభిస్తుంది. ఈ పేరు గ్రీకు పురాణాల లోని నియోబ్ నుండి వచ్చింది.
మోలిబ్డినం
[మార్చు]మోలిబ్డినం పరమాణు సంఖ్య 42 కలిగిన గ్రూప్ 6 రసాయన మూలకం. ఇది వెండి-లాంటి తెలుపు త్రంగులో ఉండే లోహం. అత్యధిక ద్రవీభవన స్థానం కలిగిన మూలకాల్లో ఇది ఆరవది. ఇది తక్షణమే గట్టి, స్థిరమైన కార్బైడ్‌లను ఏర్పరుస్తుంది. ఈ కారణంగా దీన్ని తరచుగా అధిక-బలం కలిగిన ఉక్కు మిశ్రమాలలో ఉపయోగిస్తారు. మాలిబ్డినం భూమిపై ఒక స్వేచ్ఛా లోహం గా లభించదు. ఖనిజాలలో వివిధ ఆక్సీకరణ స్థితులలో ఏర్పడుతుంది. పారిశ్రామికంగా, మాలిబ్డినం సమ్మేళనాలను అధిక పీడనం, అధిక-ఉష్ణోగ్రత ఉండే అనువర్తనాలలో వర్ణద్రవ్యం గాను, ఉత్ప్రేరకాలుగానూ ఉపయోగిస్తారు.
టెక్నీషియం
[మార్చు]టెక్నీషియం (Tc) పరమాణు సంఖ్య 43 కలిగిన రసాయన మూలకం. ఇది స్థిరమైన ఐసోటోపులు లేని మూలకాల్లో అత్యల్ప పరమాణు సంఖ్య కలిగిన మూలకం. దాని ప్రతి రూపానికీ రేడియోధార్మికత ఉంటుంది. టెక్నీషియం కృత్రిమంగా ఉత్పత్తి అవుతుంది. ప్రకృతిలో చాలా స్వల్ప మొత్తాల్లో మాత్రమే లభిస్తుంది. సహజంగా సంభవించే టెక్నీషియం యురేనియం ధాతువులో ఆకస్మిక విచ్ఛిత్తి ఉత్పత్తిగాను, మాలిబ్డినం ఖనిజాలలో న్యూట్రాన్ క్యాప్చర్ ద్వారానూ సంభవిస్తుంది. ఈ బూడిద రంగు, స్ఫటికాకార పరివర్తన లోహం యొక్క రసాయన లక్షణాలు రీనియం, మాంగనీస్ ల లక్షణాలకు మధ్యస్థంగా ఉంటాయి.
రుథేనియం
[మార్చు]రుథేనియం (Ru) పరమాణు సంఖ్య 44 కలిగిన రసాయన మూలకం. ఇది ఆవర్తన పట్టికలోని ప్లాటినం సమూహానికి చెందిన అరుదైన ట్రాన్సిషన్ లోహం. ప్లాటినం సమూహంలోని ఇతర లోహాల వలె, రుథేనియం చాలా రసాయనాలకు జడమైనది. రష్యన్ శాస్త్రవేత్త కార్ల్ ఎర్నెస్ట్ క్లాజ్ 1844లో ఈ మూలకాన్ని కనుగొన్నాడు. రస్ కు లాటిన్ పదమైన రుథెనియా పేరు దీనికి పెట్టాడు. రుథేనియం సాధారణంగా ప్లాటినం ఖనిజాలలో ఒక చిన్న భాగంగా లభిస్తుంది. దాని వార్షిక ఉత్పత్తి ప్రపంచవ్యాప్తంగా 12 టన్నులు మాత్రమే. రుథేనియంను అరుగుదల-నిరోధక విద్యుత్ కాంటాక్టులలోను, మందపాటి-ఫిల్మ్ రెసిస్టర్‌ల ఉత్పత్తికిఈ ఉపయోగిస్తారు. రుథేనియంను కొన్ని ప్లాటినం మిశ్రమాలలో కొద్ది మొత్తంలో ఉపయోగిస్తారు.
రోడియం
[మార్చు]రోడియం అరుదైన, వెండి-వంటి తెలుపు రంగులో, గట్టి, రసాయనికంగా జడత్వం ఉన్న, పరివర్తన లోహం. ఇది ప్లాటినం సమూహంలో ఒకటి. దీని రసాయన చిహ్నం Rh,పరమాణు సంఖ్య 45. దీనికి 103Rhతో అనే ఒకే ఐసోటోప్ ఉంది. సహజంగా సంభవించే రోడియం స్వేచ్ఛా లోహంగాను, సారూప్య లోహాలతో మిశ్రమం గానూ లభిస్తుంది. రసాయన సమ్మేళనంగా మాత్రం లభించదు. ఇది అరుదైన విలువైన లోహాలలో ఒకటి, అత్యంత ఖరీదైనది (బంగారం దాన్ని అధిగమించింది).
పెల్లేడియం
[మార్చు]పెల్లేడియం (Pd) పరమాణు సంఖ్య 46 కలిగిన రసాయన మూలకం. 1803లో విలియం హైడ్ వోలాస్టన్‌చే కనుగొన్న అరుదైన, మెరిసే వెండి-లాంటి తెలుపు రంగు లోహం. పల్లాస్ అనే గ్రహశకలం పేరిట దీనికి ఆ పేరు పెట్టాడు. పెల్లేడియం, ప్లాటినం, రోడియం, రుథేనియం, ఇరిడియం, ఓస్మియం ప్లాటినం గ్రూపు లోని లోహాలు. ఇవి ఒకే విధమైన రసాయన లక్షణాలను కలిగి ఉంటాయి. అయితే పెల్లేడియం అత్యల్ప ద్రవీభవన స్థానం కలిగి ఉంటుంది. వాటిలో అతి తక్కువ సాంద్రత కలిగినది కూడా.
వెండి
[మార్చు]వెండి (Ag) లోహ రసాయన మూలకం. దీని పరమాణు సంఖ్య 47. మృదువైన, తెల్లటి, మెరిసే పరివర్తన లోహం. వెండికి మూలకాలన్నిటి లోకీ అత్యధిక విద్యుత్ వాహకత, లోహాలన్నిటి లోకీ అత్యధిక ఉష్ణ వాహకత ఉంది. ఈ లోహం సహజంగా దాని స్వచ్ఛమైన, స్వేచ్ఛా రూపంలోను, బంగారం, తదితర లోహాలతో మిశ్రమంగానూ, అర్జెంటైట్, క్లోరార్గైరైట్ వంటి ఖనిజాలలోనూ లభిస్తుంది. రాగి, బంగారం, సీసం, జింక్ శుద్ధి లో ఉప ఉత్పత్తిగా వెండి ఉత్పత్తి అవుతుంది .
కాడ్మియం
[మార్చు]లకాడ్మియం (Cd) పరమాణు సంఖ్య 48తో కూడిన రసాయన మూలకం. ఈ మృదువైన, నీలం-తెలుపు రంగు లోహం రసాయనికంగా గ్రూప్ 12 లోని జింక్, పాదరసంలోని రెండు ఇతర స్థిరమైన లోహాలతో సమానంగా ఉంటుంది. జింక్ లాగానే దీనికి కూడా చాలా సమ్మేళనాలలో ఆక్సీకరణ స్థితి +2 ఉంటుంది. పాదరసం వలె ఇది పరివర్తన లోహాలతో పోలిస్తే తక్కువ ద్రవీభవన స్థానాన్ని చూపుతుంది. కాడ్మియం, దాని సమ్మేళనాలను అన్ని సందర్భాల్లోను పరివర్తన లోహాలుగా పరిగణించరు. భూమి పైపెంకులో కాడ్మియం సగటు సాంద్రత మిలియన్‌కు 0.1 - 0.5 భాగాల (ppm) మధ్య ఉంటుంది. ఇది 1817లో జింక్ కార్బోనేట్‌లో కల్మషం రూపంలో దీన్ని జర్మనీలో స్ట్రోమెయర్, హెర్మాన్ లు ఏకకాలంలో కనుగొన్నారు.
p-బ్లాక్ అంశాలు
[మార్చు]ఇండియం
[మార్చు]ఇండియం (In) పరమాణు సంఖ్య 49తో కూడిన రసాయన మూలకం. ఈ అరుదైన, చాలా మృదువైన, సున్నితమైన, ఇతర లోహం. రసాయనికంగా గాలియం, థాలియంలతో సమానంగా ఉంటుంది. ఈ రెండింటికీ మధ్యస్థంగా ఉండే లక్షణాలను చూపుతుంది. ఇండియంను 1863లో కనుగొన్నారు. దాని స్పెక్ట్రమ్‌లోని ఇండిగో బ్లూ లైన్ మీదుగా దీనికి ఆ పేరు పెట్టారు. జింక్ ఖనిజాలలో దాని ఉనికిని మొదటగా కనుగొన్నారు. అప్పటికి అది తెలియని మూలకం. తరువాతి సంవత్సరంలో లోహాన్ని మొదటిసారిగా వేరుచేసారు. ఇండియంకు ప్రాథమిక మూలం జింక్ ఖనిజాలే. ఇక్కడ చాలా అరుదుగా మూలకం స్వస్వరూపంలో విత్తులువిత్తులుగా కనిపిస్తుంది గానీ వీటికి వాణిజ్య ప్రాముఖ్యతను లేదు.
తగరం
[మార్చు]టిన్ (Sn) గుర్తుతో కూడిన రసాయన మూలకం. దీని పరమాణు సంఖ్య 50. ఇది ఆవర్తన పట్టికలోని గ్రూపు 14 లోని ప్రధాన-లోహం . టిన్‌కు ఈ గ్రూపు లోని జెర్మేనియం, సీసం రెండింటితో రసాయన సారూప్యత ఉంది. దీనికి రెండు ఆక్సీకరణ స్థితులు ఉన్నాయి. అవి +2, కొంచెం ఎక్కువ స్థిరంగా ఉండే +4. టిన్ అత్యంత సమృద్ధిగా లభించే మూలకాల్లో 49వది. 10 స్థిరమైన ఐసోటోపులతో, ఆవర్తన పట్టికలో అత్యధిక సంఖ్యలో స్థిరమైన ఐసోటోపులను కలిగి ఉన్న మూలకం. టిన్ ప్రధానంగా క్యాసిటరైట్ ఖనిజంలో లభిస్తుంది. ఇక్కడ ఇది టిన్ డయాక్సైడ్, SnO 2 రూపంలో ఉంటుంది.
యాంటీమోనీ
[మార్చు]యాంటిమోనీ (Sb) పరమాణు సంఖ్య 51 కలిగిన విష రసాయన మూలకం. మెరిసే గ్రే మెటాలాయిడ్. ఇది ప్రకృతిలో ప్రధానంగా సల్ఫైడ్ మినరల్ స్టిబ్నైట్ (Sb2S3) రూపంలో లభిస్తుంది. యాంటిమోనీ సమ్మేళనాలు పురాతన కాలం నుండి ప్రసిద్ది చెందాయి. సౌందర్య సాధనాల కోసం ఉపయోగించేవారు. మెటాలిక్ యాంటిమోనీ కూడా ఉండేది గానీ దాన్ని సీసంగా భావించేవారు.
టెల్లూరియం
[మార్చు]టెల్లూరియం పరమాణు సంఖ్య 52 కలిగిన రసాయన మూలకం. పెళుసుగా ఉండే, స్వల్పంగా విషపూరితమైన, అరుదైన, వెండి-తెలుపు రంగులో ఉండి మెటాలాయిడ్ టిన్‌ను పోలి ఉంటుంది. టెల్లూరియం రసాయనికంగా సెలీనియం, సల్ఫర్‌కు సంబంధించినది. ఇది అప్పుడప్పుడు స్వస్వరూపంలోను, మౌలిక స్ఫటికాలుగానూ లభిస్తుంది. టెల్లూరియం భూమిపై కంటే విశ్వంలో ఎక్కువగా ఉంటుంది. భూమి పైపెంకులో ప్లాటినం లాగా బాగా అరుదుగా ఉంటుంది. దాని అధిక పరమాణు సంఖ్య ఇందుకు పాక్షిక కారణం.
అయోడిన్
[మార్చు]అయోడిన్ (I) పరమాణు సంఖ్య 53 కలిగిన రసాయన మూలకం. గ్రీకు భాషలో దీనికి అర్థం ఊదా రంగు. మూలక అయోడిన్ ఆవిరికి ఈ రంగు ఉన్నందున ఆ పేరు పెట్టారు. [4]
అయోడిన్ దాని సమ్మేళనాలు ప్రధానంగా పోషణలో, పారిశ్రామికంగా ఎసిటిక్ ఆమ్లం. కొన్ని పాలిమర్‌ల ఉత్పత్తిలో ఉపయోగిస్తారు. అయోడిన్ సాపేక్షంగా అధిక పరమాణు సంఖ్య, తక్కువ విషపూరితం, సేంద్రీయ సమ్మేళనాలకు సులభంగా అటాచ్మెంట్ ఉండటం వల్ల ఆధునిక వైద్యంలో అనేక ఎక్స్-రే కాంట్రాస్ట్ మెటీరియల్స్‌లో దీన్ని వాడుతున్నారు. అయోడిన్‌లో ఒకే ఒక స్థిరమైన ఐసోటోప్ ఉంది. అనేక అయోడిన్ రేడియో ఐసోటోప్‌లు వైద్య అనువర్తనాల్లో కూడా ఉపయోగిస్తారు.
జెనాన్
[మార్చు]జెనాన్ (Xe) పరమాణు సంఖ్య 54 కలిగిన రసాయన మూలకం. రంగులేని, బరువైన, వాసన లేని నోబుల్ గ్యాస్. జినాన్ భూమి వాతావరణంలో చెదురుమదురుగా లభిస్తుంది. జెనాన్ సాధారణంగా రసాయనిక చర్యకు లోను కానప్పటికీ, జెనాన్ హెక్సాఫ్లోరోప్లాటినేట్ ఏర్పడటం వంటి కొన్ని రసాయన చర్యలకు లోనవుతుంది. ఈ సమ్మేళనం, సంశ్లేషణ చేయబడిన మొదటి నోబుల్ గ్యాస్ సమ్మేళనం. [5] [6]
మూలాలు
[మార్చు]- ↑ "Flame Tests". Webmineral.com. Retrieved 2012-08-13.
- ↑ "Reactions of the Group 1 elements with oxygen and chlorine". Chemguide.co.uk. Retrieved 2012-08-13.
- ↑ IUPAC contributors (2005). N G Connelly (ed.). Nomenclature of Inorganic Chemistry: IUPAC Recommendations 2005 (PDF). RSC Publishing. p. 51. ISBN 0-85404-438-8. Retrieved 2007-12-17.
- ↑ Online Etymology Dictionary, s.v. iodine. Retrieved 2012-02-07.
- ↑ Husted, Robert; Boorman, Mollie (December 15, 2003). "Xenon". Los Alamos National Laboratory, Chemical Division. Retrieved 2007-09-26.
- ↑ Freemantel, Michael (August 25, 2003). "Chemistry at its Most Beautiful" (PDF). Chemical & Engineering News. Archived from the original (PDF) on January 6, 2016. Retrieved 2007-09-13.