Jump to content

తేనీరు

వికీపీడియా నుండి
గిన్నెలో ఆకుపచ్చ తేయాకు.
తేనీరు

తేనీరు (ఆంగ్లం Tea) ఒక పానీయం. తేయాకును నీటిలో మరిగించి వచ్చిన ద్రావకాన్ని తేనీరు (టీ) అంటారు. మానవ దేహానికి ఉత్తేజాన్ని కల్గించే ఆహార పదార్ధాలలో టీ ప్రథమ స్థానంలో ఉంటుంది. దీనిలో పంచదార, పాలు కలుపుకొని త్రాగుతారు. ప్రతి సంవత్సరం డిసెంబరు 15న అంతర్జాతీయ టీ దినోత్సవం నిర్వహించబడుతుంది.[1]

ఉపయోగాలు

[మార్చు]

నిద్ర లేచింది మొదలు నిద్ర పోయే వరకు మనిషి జీవితంలో టీ పాత్ర అమోఘమైంది. నిస్సత్తువగా ఉన్నా, ఉల్లాసంగా ఉన్నా టీ త్రాగడానికి అత్యంత ఉత్సాహాన్ని చూపడం జీవితంలో ఓ అంతర్భాగమైపోయింది. సగటు భారతీయుల్లో దాదాపు సగం మందికిపైగా టీ సేవిస్తున్నారు. మూడు దశాబ్దాల క్రితం మానసిక విశ్రాంతి కోసం కాఫీ సేవించడం అలవాటుగా ఉండేది. ఇళ్ళలో కూడా కాఫీ మాత్రమే వాడుకలో ఉండేది. ఫిల్టర్ కాఫీ బాగా వాడుకలో ఉన్న రోజుల్లో ఇన్‌స్టంట్ కాఫీలు రావడం, వాటితోపాటు పలు రకాల టీ పౌడర్లు మార్కెట్‌లోకి విడుదల కావడం, టీకి జనసామాన్యంలో అధిక వినియోగం ఏర్పడడం, పైగా అది సామాన్య మానవుడికి అందుబాటు ధరలలో లభించడం టీకి మరింత ప్రాధాన్యత పెరగడానికి దోహదపడింది.

ఉత్పత్తి

[మార్చు]

దాదాపు ప్రతి దేశంలోనూ టీ వినియోగంలో ఉన్నా భారతదేశం ఉత్పాదించే టీ వైవిధ్యానికీ, విశిష్టతకూ ప్రసిద్ధి పొందింది. పశ్చిమ బెంగాల్ లోని డార్జిలింగ్ టీ మిక్కిలి నాణ్యమైనది. ఇది సువాసనభరితమైనది. ముఖ్యంగా ఇక్కడి మంచుతో కూడిన హిమాలయ పర్వత వాతావరణ పరిస్థితుల వల్ల, ఈ ప్రదేశంలో భూసార రచనా విధానం వల్ల ఇక్కడ ఉత్పత్తి కాబడే టీకి ప్రత్యేక రుచి, సువాసన సిద్ధిస్తుంది. భారతదేశంలో తేయాకు సాగు ప్రాతిపదికగా అనేక మందికి జీవనోపాధి కలుగుతోంది. ఈ రంగంలో సుమారు 20 లక్షల మంది ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ శ్రామికులు ఉన్నారు. వీరిలో 50 శాతం స్త్రీలు.

చరిత్ర

[మార్చు]
నల్ల తేనీరు.

4వ శతాబ్దంలో ఒక చైనా వైద్యుడు ఆకులను త్రుంచి, ఎండబెట్టి, ఒక ప్రత్యేక ఉష్ణోగ్రతకు వేడి చేసి, వేడి నీటిలో నానబెట్టగా వచ్చిన చేదు డికాక్షను వైద్య పరీక్షకు త్రాగాడు. ఈ టీ డికాక్షన్ను త్రాగినందువల్ల ఇతడు ఉత్తేజాన్ని పొందాడు. టీ సేవన ద్వారా మొట్టమొదటగా ఉత్సాహాన్నీ, ఆనందాన్నీ పొందిన వ్యక్తి ఇతనే.[2] 15వ శతాబ్దంలో నాగరిక ప్రపంచంలో టీ త్రాగడం ప్రారంభమయ్యింది. 17వ శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వినిమయ పద్ధతిలో బట్టలు, వెండికి, అనధికారికంగా నల్లమందుకు బదులుగా టీని చైనా నుండి దిగుమతి చేసుకునేది. చాలాకాలం తర్వాత 1823 లో బ్రిటన్‌కు చెందిన బ్రూస్ సోదరులు అస్సాంలో దేశీయంగా తేయాకును కనిపెట్టినప్పుడు భారతదేశంలో టీ ఉత్పాదన ప్రారంభమయ్యింది. విస్తారంగా టీ వృద్ధి చెందే ప్రాంతాలను వీరు కనుగొన్నారు. ఇవి సింగ్‌ఫో జాతులు తోటల పెంపకంలో మిగిలినవై ఉండవచ్చు. ఈ కొండ ప్రదేశాలలో జనులు టీ ఆకులతో చేసిన నాటు సారాను త్రాగుతూ ఉండేవారు. మొట్టమొదట 1838 లో దిబ్రుఘర్ నుంచి 8 పెట్టెలు ఎగుమతి చేయబడ్డాయి. ఈ బ్లాక్ టీ సౌచోంగ్, పీకో అని రెండు గ్రేడులుగా చాలా ప్రసిద్ధి పొందింది. చైనాతో 1833 లో ఈస్ట్ ఇండియా కంపెనీ గుత్తాధిపత్య వ్యాపార సంబంధాలు చెడిపోయినప్పుడు, ఇంగ్లాండు భారతదేశంలో టీ ఉత్పాదనకు తీవ్ర మైన ప్రయత్నాలు ప్రారంభించింది. 1860 నాటికి భారతదేశంలో టీ ప్లాంటేషన్ తోటలు బాగా అభివృద్ధి చెందినప్పుడు ఇక్కడే టీ ఉత్పాదన సుమారు పది లక్షల కేజీలు ఉండేది.

చైనా నుండి బ్లాక్, గ్రీన్ టీ రకాల విత్తనాలను లార్డ్ మెకార్డెనీ తెప్పించి, భారతదేశంలో 1793 లో కలకత్తా బొటానికల్ గార్డెన్స్‌లో ప్రవేశపెట్టాడు. ఇవి పశ్చిమ బెంగాల్, కచార్, నీలగిరి ప్రదేశాలలో నాటబడ్డాయి. నేడు భారతదేశంలో సగానికి సగం టీ మొక్కలు ఆ తోటల పెంపకానికి చెందినవే. ఆ తరువాత అనతికాలంలో 1860 కి చైనా టీ ఇక్కడి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వృద్ధిపొందింది. నేడు అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ ప్రాంతాలు భారతదేశంలో టీని అధికంగా ఉత్పాదించే రాష్ట్రాలుగా ప్రసిద్ధిపొందాయి. ఇవి మొత్తం సుమారు 98 శాతం టీని ఉత్పాదిస్తున్నాయి. భారతదేశపు టీ ఉత్పాదక ప్రదేశాలలో త్రిపుర, కర్ణాటక, మణిపూర్, సిక్కిం,, అరుణాచలప్రదేశ్ ముఖ్య పాత్రను వహిస్తున్నాయి. నీలగిరి కొండలలో భారతదేశపు ఉత్తమ రకం టీ ఉత్పాదించబడుతుంది. సతతహరితపు మొక్క అయిన టీకి వర్షపాతం అధికంగా ఉండాలి. అప్పుడే అది పుష్కలంగా, సమృద్ధిగా పెరుగుతుంది. దిగుబడి అధికంగా ఉంటుంది. సముద్ర మట్టానికి ఎత్తుగా ఉండే ప్రదేశాలలో పెరిగే టీ ఉత్తమమైనది. కానీ మైదానాలలో పెరిగే టీ వల్ల అధిక ఫలసాయం వస్తుంది.

చైనా, జపాన్‌లలో టీ త్రాగడం విస్తారమైన తంతుతో కూడిన ఒక గొప్ప ఉత్సవం (Tea Ceremony) గా పరిణమించింది. అక్కడ టీ డికాక్షను కాచి పంచదార, పాలు కలపకుండా త్రాగుతారు. ఒక్కొక్కప్పుడు నిమ్మరసం, పంచదార కలిపి త్రాగుతారు. అమెరికాలో సామాన్యంగా టీలో ఐస్ వేసి, పంచదారతో త్రాగుతారు. భారతదేశం, బ్రిటన్‌లలో పాలు, పంచదార కలిపి త్రాగుతారు. టిబెటియన్‌లు గ్రీన్ టీని ఉప్పు, యాక్ వెన్నతో కొయ్య కప్పులలో త్రాగుతారు. ఆఫ్రికాలో డికాక్షనును చిలికి నురగగా తయారు చేసి త్రాగుతారు. పశ్చిమ ఆసియాలో టీని యాలకులతో కలిపిన డికాక్షన్‌తో త్రాగితే, భారతదేశంలో గుజరాతీలు మసాలా టీ త్రాగుతారు. బ్లాక్ లేక గ్రీన్ టీని ఏలకులు, కొట్టిన బాదంపప్పు కలిపి కహ్వా అని కాశ్మీరీలు త్రాగుతారు. ఇది చాల పుష్టికరమైన, రుచికరమైన పానీయం.

రసాయనిక విశ్లేషణ

[మార్చు]

టీ సహజమైన పానీయం. దీనిలో రసాయనిక పదార్ధాలుగానీ, కృత్రిమ సువాసనల ద్రవ్యాలుగానీ, ఇతర రంగులుగానీ చేరి ఉండవు. ఇది ఆరోగ్యదాయకమైన, శక్తిదాయకమైన పానీయం. దీనిలో విటమిన్లు ముఖ్యంగా బీ గ్రూప్ విటమిన్లు, రిబోఫ్లేవిన్, నియాసిన్ ఉంటాయి. దీన్లో అతి తక్కువగా లభించే కెఫీన్ మానవ శరీరానికి ఆరోగ్యకరమైనది. అపాయకారి కాదు. వయసుతో నిమిత్తం లేకుండా టీని సేవించడం ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది. ఒకప్పుడు అతిథులకు మర్యాదపూర్వకంగా ఇచ్చే టీ ఈనాడు త్రాగే నీరులాగా అతి సాధారణ పానీయం అయింది. ఎక్కడబడితే అక్కడ టీ దుకాణాలు వెలవడం ప్రజలు ఈ పానీయానికి ఎంతగా అలవాటుపడ్డారో తెలుపుతుంది.

తేనీరు రకాలు

[మార్చు]

ఆరోగ్యకరంగా ప్రయోజనాలు

[మార్చు]

తేనీరువల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకున్నాక అలాంటి వారి ఆలోచన మారిపోవచ్చు. అవేంటంటే...రోజూ టీ తాగేవాళ్లలో ఎముకలు బలంగా ఉంటాయి.బ్లాక్‌ టీ తాగేవారిని ఫ్లూ జ్వరాలు లాంటివి అంత త్వరగా దరిచేరవు.రోజూ మూడు నాలుగు కప్పుల టీ తాగేవారిలో గుండె పోటు ప్రమాదం 21 శాతం తగ్గుతుంది.టీలో ఉండే ఫ్లోరైడ్‌ దంతాలు దృఢపడేందుకు సాయపడుతుంది.తేనీరులోని ఫ్లేవనాయిడ్స్‌ గుండెను ఆరోగ్యవంతంగా పనిచేయిస్తాయి.గ్రీన్‌, బ్లాక్‌ టీలలో ఉండే ఎల్‌-థయానైన్‌ ఒత్తిడిని తగ్గించి మెదడును ప్రశాంతంగాఉంచుతుంది.టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్‌ రాకుండా కాపాడతాయి.అనేక రకాల అలెర్జీలకు టీ విరుగుడు. టీ డీహైడ్రేషన్ సమస్యనూ దూరం చేస్తుంది.

ఇంకా ఇతర ప్రయోజనాలు

  • కాన్సర్ రాకుండా కాపాడును - polyphenals ఉన్నందున, స్త్రీలలో రొమ్ము కాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది, సెర్వికల్ కాన్సర్ ప్రమాదము వెనకబడుతుంది, అంతే కాదు ఊపిరితిత్తుల కాన్సర్ కూడా దూరమవుతుంది . జీర్ణ నాళం లోని పాలు భాగాలకు వచ్చే కాసర్లకు ఇది విరుగుడుగా పనిచేస్తుంది . కాన్సర్ కారకాలను నిర్వీర్యం చేస్తుంది,
  • fluoride ఉన్నందున పళ్ళను గట్టిపరుచును
  • dehydration రాకుండా కాపాడును - నీరు తాగేందుకు దోహదం చేయును,
  • కెఫీన్ - కొద్ది పాలు ఉన్నా శరీరము, మనసు ఉల్లాసంగా ఉండేందుకు ఉపయోగపడును, ఇది గ్లుకోస్ ను లివర్ ద్వారా విడుదలచేయడం వలన శక్తిని ఇచ్చును .రక్తం గడ్డ కట్టకుండా కాపాడుతుంది .
  • చెడ్డ కొలెస్టిరాల్ పరిమితి తగ్గిస్తుంది, రక్తపోటు (BP) రానీయదు, ట్యూమర్లు కలిగించే ఎంజైములను తటస్త పరుస్తుంది, జీవకణాలను నాశనం కానీయదు - పాడయిన జీవకణాలను మరమ్మత్తు చేస్తుంది,

అనారోగ్యమూ,నష్టాలు

[మార్చు]

ఆహారముతో పాటు టీని తీసుకుంటే ఆహారము లోని పోషకపదార్థములు శరీరము గ్రహించడంలో ఇబ్బంది కలుగుతుంది. ముఖ్యంగా ' ఐరన్ ' టానిన్ తో కలిసి పనికిరాకుండా పోతుంది. టీ ఎక్కువగా తాగితే కడుపులో అసిడిటీ పెరిగి అల్సర్ రావడానికి అవకాశముంటుంది. టీ మెదడుని ఉత్తేజ పరిచి నందున శరీరం హుషారుగా అనిపించినా, కొంత సేపటికి దాని ప్రభావము తగ్గి మెదడు డిప్రెషన్ కి లోనవుతుంది. విద్యార్థులు టీ తాగి హుషారుగా నిద్ర రాకుండా చదివినా .. ఆ ఏకాగ్రత ఎక్కువ సేపు నిలువదు. టీ ఎక్కువ సార్లు త్రాగే వారికి ఆకలి మందగించి, భోజనము సరిగ్గా తీసుకోకపోవడం వలన ఆరోగ్యము క్షీణించును.

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "International Tea Day". Confederation of Indian Small Tea Growers Association. Archived from the original on December 22, 2015. Retrieved 15 December 2019. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  2. http://www.telugudanam.co.in/vijnaanam/meeku_telusaa/Tea.htm

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=తేనీరు&oldid=4351899" నుండి వెలికితీశారు